కడిమిచెట్టు

సహృదయ ప్రమాణం [శాకుంతలం] – రెండవ భాగం

ఆగస్ట్ 2014

భద్రమైన తన  ఆకుపసుపు  లోకం నుండి ఆతురయై నడచి నడచి పూర్తి అపరిచిత ప్రపంచం లోకి వస్తున్నది శకుంతల. శాంతమైన మునివాటిక నుంచి  విపణి వీధుల ,సౌధాల,  శకటాల  కోలాహలం  లోకి….. స్వచ్ఛం నుంచిసమ్మిశ్రితం  లోకి, నిసర్గసిద్ధం నుంచి నాగరికత లోకి.

దుష్యంతుడి మనసంతా  శాపం తో శూన్యమైంది. స్వతహా  సత్పురుషుడు కనుక- అంతశ్చేతన  మాత్రం సత్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. అక్కడెక్కడో  అడుగున ,  గతం-  తెలిసీ తెలియని గీతిగా….. స్మృతీ విస్మృతీ పెనుగులాడే ఈ అయిదో అంకాన్ని [నాలుగో అంకం గొప్పదనే బహుధా ప్రశంస ] శాకుంతలం లో  ఉత్తమమైనదిగా అనుకునే రసహృదయులు ఉన్నారు.

” లోతునకు దిగి విచారించినచో శాకుంతలమునకు కిరీటాయమానమైనది పంచమాంకము. ఇందలి రచనను దాటి సృష్టిలో నే కవియును చేయలేదు. సాధ్యము కాదు. ….దుస్యంతుని స్వరూపము పంచమాంకమునందే పండియున్నది. …శాపముచేత దెబ్బతిన్న సగము, నిద్రపోని యంతఃకరణము, రెండును జంట ప్రవాహములవలె పంచమాంకమునందే ప్రవహించుచున్నవి ” [విశ్వనాథ ]

నేపథ్యంలో విషాదమధురమైన పాట వినబడుతూ ఉండగా విదూషకుడు మాఢవ్యుడితో కలిసి దుష్యంతుడు ప్రవేశిస్తాడు.  ” అభినవ మధులోలుపసత్వం తథా పరిచుంబిత చూతమంజరీం కమల వసతిమాత్ర నివృతో మధుకర విస్మృతోస్తథేన కథం ”   తనను మరచిపోయిన తుమ్మెదను ఆక్షేపిస్తూ మామిడి పూల గుత్తి అంటుంది- తామరపూవులో వసతి మాత్రం గా ఉన్నావని. [  శకుంతలను మరచి  దుష్యంతుడు హస్తినాపురం లో ఉండటం ఒక విడిది లో నివసించటమే ,సహజమూ  శాశ్వతమూ  కాదు అని  ]  ఆ గానం చేస్తున్న స్త్రీ హంసపదిక – దుష్యంతుడి భార్యలలో ఒకరు. బహుపత్నీకుడైన అతనికి ఇటువంటి దెప్పిపొడుపులు కొత్తవేమీ అయి ఉండవు.  అయితే ఆ సమయం లో ఏదో , ఎందుకో తెలియని దిగులు అతన్ని ఆవరిస్తుంది. ” అహో, రాగపరివాహి నీ  గీతిః ” అనుకుంటాడు.ఆమెకు సర్దిచెప్పమని మాఢవ్యుడిని పంపుతాడు, అయిష్టంగానే అతను నిష్క్రమిస్తాడు. రాబోయే ఘట్టం లో మాఢవ్యుడు పక్కన ఉండి ఉంటే మరొకలాగా ఉండేదా అనిపిస్తుంది.

అప్పటి రాజు స్వగతం కాళిదాసును మహాకవి చేసిన శ్లోకాలలో ముఖ్యమైనది. ” రమ్యాణి వీక్ష్య మధురాం శ్చ నిశమ్యశబ్దాన్ పర్యుత్సుకో  భవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని ”   ” చేతసా స్మరతి ” – మనసుకు గుర్తుంది, `మనిషికి కాదు. ‘ అబోధ పూర్వం ‘- ఇదివరకు తెలిసిఉన్నది కాదు.

 

భావం అన్న మాటకు విస్తృతమైన అర్థం ఉంది. సంస్కార విశేషం అనవచ్చును, కర్మల ఫలితం ఆత్మను అంటి పెట్టుకొని ఉండటం –‘  వాసన ‘ అనీ అంటారు. ఇక్కడ శకుంతలా ప్రణయపు పరిమళం రాజుకి తోస్తూ ఉంది, స్పష్టం కావటం లేదు…ఆ అయోమయాన్ని ఆయన పూర్వజన్మకృతానికి తీసుకువెళుతున్నాడా అనీ అనిపిస్తుంది .

[ '' ఏ ప్రేమాస్పదులకూ నేను దూరంగా లేకపోయినా ఎందుకు కలవరపడుతున్నాను ?  సంతోషం లో మునిగి తేలుతూ ఉన్నవారు కూడా అందమైన వాటిని చూసి, తీయనైన శబ్దాలను విని కలత పడటం ఎందుకు? ఖచ్చితంగా ఇదివరకు తెలియనివి...ఇవి ఎప్పటివి...ఇంత చేరువ గా తోస్తున్నవి ?   ఏ పూర్వజన్మల స్నేహాల జ్ఞాపకాలు  ? '' ]

అది సభ చాలించి విశ్రాంతి తీసుకొనే సమయం.  [శకుంతలతో వచ్చిన ] తపస్వులైన వారిని తప్పనిసరిగా వెంటనే దర్శించాలి. నివేదించేందుకు వచ్చిన కంచుకి అనుకుంటాడు  ‘’ భూభారం వహించటం లో ఆదిశేషుడికి లాగే ఆరవ వంతు పన్నుగా  తీసుకునేవాడికీ  [షష్టాంశ వృత్తి- రాజు ] విశ్రాంతి ఉండదు. ప్రజలందరినీ ప్రజ [ సంతానం ] వలె కాచి పాలించి అలసిన రాజు విశ్రమిస్తున్నారు… తన గణాన్ని పగలెల్లా ఎండలో నడిపించిన గజరాజు నీడలో సేదదీరుతున్నట్లుగా. అయినా తప్పదు, చెప్పవలసిందే   ‘’

” అత్యున్నతమైన అధికారాన్ని సంపాదించేంతవరకే దానిపైని వాంఛ.  లభించినదాన్ని రక్షించుకోవటం ఎంత చికాకు పెడుతుంది !  నిరంతరం  గొడుగు పట్టుకోవలసిన చేతికి ఆ నీడ వలన శ్రమ తీరుతుందా ? ”

ఆస్థాన  పురోహితుడు సోమరాతుడు పక్కన ఉండగా  మునిజనాన్ని కలుసుకునేందుకు ధర్మపీఠాన్ని ఎక్కుతాడు రాజు. అది మామూలు కొలువుకూటం కాదు, అంతకన్న పవిత్రమైనది. అక్కడ అగ్నిహోత్రం, ఆ ప్రక్కనే హోమధేనువు.

రాజు తాపసులను ‘ కుశలమా ‘ అని అడుగుతారు. కుశం అంటే దర్భ. వాటిని కోసి సేకరించే స్థితిలో ఉండటం బ్రాహ్మణుడికి ఆశించదగినది.

వారు రాజును ” తమరు అనామయులు [ దైహిక, మానసిక వ్యాధి లేని వారు ] గా ఉన్నారు కదా ” అంటారు. ఇది క్షత్రియుడిని పలకరించే పద్ధతి అట[శాకుంతలానికి సాధికారమైన పరిష్కరణా వ్యాఖ్యానమూ చేసిన M.R.Kale గారు   ఇంకా ఇలా చెబుతారు  - వైశ్యులను ' క్షేమమా '' అని అడిగేవారట, వారి సొమ్ము భద్రమా అనే అర్థం లో. వ్యవసాయ వృత్తి లో వారైన శూద్రులను ' ఆరోగ్యంగా [ శ్రమకు ఓర్చే శరీరస్థితిలో ] ఉన్నారా   అనటం అప్పటి  పద్ధతి. ]

 

ఆ వచ్చిన తాపసులలో శార్ణరవుడు,   శారద్వతుడు అని ఇద్దరు.  శార్ణరవుడికి  తన ఉనికికి విరుద్ధమైన వాటి పట్ల ఓర్పు తక్కువ. ” ఈ రాజు ధర్మపరుడిలాగే అనిపిస్తున్నాడు .  ప్రజలు ‘ తక్కువస్థాయిలో ‘  వారైనా చెడ్డదారిలో ఉన్నట్లు లేరు. అయినా ఏకాంతం అలవాటైన నాకు ఈ సమ్మర్దాన్ని భరించటం కష్టంగా ఉంది ” అని మిత్రుడితో అంటాడు అతను.

శారద్వతుడు , ” నిజమే. నాకూ అలాగే ఉందిలే.ఒంటినిండా  నూనె పట్టించుకున్నవాడిని  చూస్తే శుభ్రంగా స్నానం చేసినవాడికి ఎలా ఉంటుందో , శుచియైనవాడికి అశుచి ని చూస్తే ఎలా ఉంటుందో, మేలుకున్నవాడికి నిద్రపోయేవాడిని చూస్తే ఎలా ఉంటుందో, స్వేచ్ఛగా ఉన్నవాడికి బంధితుడిని చూస్తే ఎలా ఉంటుందో- ఈ సుఖలాలసులైన జనాన్ని చూస్తే నాకూ అలాగే అనిపిస్తోంది ” అని జవాబిస్తాడు.

నగరానికీ ఆశ్రమానికీ అంత దూరం.

శకుంతలకు దుశ్శకునాలు తోస్తాయి. వృద్ధ తాపసి గౌతమి  ఊరడిస్తుంది.

మేలిముసుగు లోని శకుంతలను చూసి ” పండుటాకుల నడుమ ఈ పచ్చని చిగురు , ఈ పూజ్యురాలు

కనబడీ కనబడని లావణ్యం తో దర్శనీయురాలిగా ఉంది…. ఆమె ఎవరో ఏమిటో ..ఈ కుతూహలం నాకు తగదు.

”  అనుకుంటాడు రాజు.  ఆ అవకుంఠనం [ మేలిముసుగు ] రాజు మనసు ని మూసిన మరపుతెర కు చిహ్నం. ఆమె  అవతల, రాజు ఇవతల.

” ఇవి కణ్వమహర్షి మాటలు ” అని చెప్పవలసినది రాజుకు చెబుతారు తాపసులు.

” ఏమిటీ నేనీమెను పెళ్ళాడానా ? ” అన్న రాజు నిరాకరణ  విని శకుంతల వణికిపోతుంది.

దురుసువాడైన శార్ణరవుడు ” ఇది చేసిన పనికి అసహ్య మా  ? బాధ్యతను విస్మరించటమా ? చేయవలసినదాన్ని గుర్తించకపోవటమా ? ” అని విరుచుకు పడ తాడు .

” అమ్మా ! కాస్త నీ అవకుంఠనం తొలగించు. ప్రభువు గుర్తు పడతాడేమో ” అని గౌతమి అన్న మీదట  రాజుకు పూర్తిగా కనబడుతుంది శకుంతల.

ఇదముపనత మేవం రూపమక్లిష్ట కాంతి

ప్రథమ పరిగృహీతం స్యాన్న వేత్య వ్యవస్యన్

భ్రమర ఇవ విభాతే కుందమంతస్తుషారం

నచ ఖలు పరిభోక్తుం నైన శక్నోమి హాతుం

”ఈ నిష్కళంక సౌందర్యాన్ని నేను ఇదివరకు స్వీకరించి ఉన్నానా , లేనా ? అవును అనలేకుండా ఉన్నాను, కాదనుకోలేకపోతున్నాను  -  మంచు మూసిన  మల్లెపూవుని తుమ్మెద ఆస్వాదించాలా, వదలిపెట్టాలా ? ” ఆ  రూపం అక్లిష్టకాంతి అనుకుంటాడు.  [-కాంతి అంటే కోరబడుతున్నది అని. ] అదివరకే భార్య అయిన స్త్రీ సౌందర్యం భర్తకు క్లిష్టం కాదు. సమీపించదగినదిగానే అనిపిస్తుంది. అదే ఆశ్చర్యం దుష్యంతుడికి …

” అంతర్వర్తియై యీ విశేషార్థము భాసించుటకే ‘అక్లిష్ట ‘ శబ్దముపయోగింపబడినది. లేనిచో కాంతి యన్న శబ్దమునకు అక్లిష్టమన్న విశేషమెవడు వేయును ? ”  [విశ్వనాథ]

‘విభాతే ‘-ప్రాతఃకాలం అది. పొద్దెక్కలేదు. అందుకని మల్లెపూవులో మంచు బిందువులు నిలిచి ఉన్నాయి. కొంత సేపటికి అవి మాయమై మల్లెపూవు అనుభవ యోగ్యం అవుతుంది. ఇది ఒక ధ్వని.

”  తప్తం తోషయతీతి తుషారః ” తపించిన వాడిని సంతోష పెట్టేది తుషారం. కుందమంతస్తుషారం అన్న మాటతో శకుంతల గర్భవతి అని సూచించబడుతూ ఉంది. ఆ పుట్టే బిడ్డ పుత్రులు లేక తపించే రాజుకు భవిష్యత్తు లో ఉపశమనం ఇవ్వబోతున్నాడు. ఇది మరొక ధ్వని.

‘మొదటిసారి ఆశ్రమం లో  శకుంతలను చూసినప్పుడు ” ఈమె నేను పెళ్ళాడదగినది కాకపోతే నా హృదయం ఆమెపైన లగ్నమవదు ” అని ధీమాగా అనుకున్న రాజుకు ,ఇప్పుడు ఆ వివేచన -శాపవశాత్తూ, తొలగిపోయింది. ఆమె తనకు ఆత్మీయ అనిపిస్తూనే  ఉన్నా ,

” ఈమెకు కలగబోయే శిశువు నా సొంతం కాడు, నేను క్షేత్రి అయిన భర్త గా  [మరొకరి బిడ్డ కు తండ్రిగా]  ఈమెను స్వీకరించమని అంటున్నారా ? ”  అని ఊరుకుంటాడు.

” అలాగే. స్వీకరించకు. కణ్వమునికి ఈశాస్తి కావలసిందే ! దొంగిలించిన సొత్తును దొంగ చేతికే ఇచ్చినట్లు తన కుమార్తెను నీకు ఇవ్వబోతున్నాడు కదా ” అని ఆవేశపడిన శార్ణరవుడు  -” శకుంతలా, విన్నావుగా. ఏమంటావు ?  ”

”  అటువంటి ప్రేమ ఇలా పరిణమించినప్పుడు ఇంకేమని అనగలను ! అయినా నన్ను నేను శోధించుకుందుకు అడుగుతాను ” అనుకున్న శకుంతల ”ఆర్య పుత్రా [భర్తను ఇలా సంబోధిస్తారు ] అనబోయి  అర్థోక్తిలో ఆగి ” ఓ పౌరవా ! లోకం తెలియని  నన్ను, ఆశ్రమంలో చేసిన వాగ్దానాన్ని మరచి ఇలా మోసగించటం తగునా ? ” అని ప్రశ్నిస్తుంది.

” ప్రవహిస్తూ రెండు గట్లనూ తెంచి తాను కలుషిత అయి ఒడ్డున ఉన్న వృక్షాన్నీ పెకలించివేసే నది వంటి దానవు నీవు- నీ కుటుంబగౌరవాన్ని పాడుచేసినది చాలక నన్నూ భ్రష్టుడిని చేయ పూనుకున్నావు   ” అని కర్కశపు మాటలాడాడు రాజు.

శకుంతల కి ఉక్రోషం వచ్చి  ” గుర్తు చూపిస్తే నమ్ముతావా, నేను మరొకరి భార్యను కానని ? ”

చూసుకుంటే , ఏదీ, లేదు- అంగుళీయకం.

” అయ్యయ్యో !  శచీతీర్థం లో పడిపోయినట్లుందమ్మా ” -గౌతమి.

[ఏ మాటనూ ఏ పేరునూ వృధాగా వాడినవారు కాదు కాళిదాసు. శచీదేవి మహా పతివ్రత, అంతకుమించి భర్త తో దేవేంద్ర సిం హాసనం పైన వెలిగే వైభవం ఆవిడది. శకుంతల భవిష్యత్తు రక్షితం.]

ప్రత్యక్షమైన ఆధారం లేని శకుంతల రాజుకు గుర్తు చేసే అమాయకపు ప్రయత్నం లో -

” ఆ రోజు , మల్లెపొదరింటిలో- నీవొక తామరాకు దొప్ప ను నీటితో నింపి తెచ్చావు. సరిగ్గా అప్పుడే నా పెంపుడు జింక దీర్ఘపంగ దాహంతో  అక్కడికి వచ్చింది. నీవు ముద్దుగా  అందించినా అది మూతి పెట్టనేలేదు. అదే  నేను అందుకొని తాగిస్తే మొత్తం తాగేసింది.  అప్పుడు  అన్నావు కాదూ,  మేమిద్దరమూ అరణ్యకులమేనని ”

‘’ ఈ తీయని మాటలకేమిలే ! నేర్వనివిద్యగా స్త్రీల చాకచక్యం అమానుషులైనవారిలోనూ కనబడుతుంది. నేర్చినవారి సంగతి వేరే చెప్పాలా ! పరభృతలు తమ ద్విజసంతతిని ఇతరుల మీద వదిలిపెడతారు  కాదా ? ” అంటాడు రాజు. అమానుషి అంటే పక్షి కావచ్చు, దేవకాంతా కావచ్చు.  సామాన్యార్థం లో పరభృత అన్న మాటకు కోకిల అని అర్థం. తన గుడ్లను కాకి గూటిలో వదులుతుందని కదా. పరభృత అన్న మాటతో ఇంద్రుని అధీనం లో ఉండే మేనక వంటి అప్సర కూడా స్ఫురిస్తుంది. ద్విజసంతతి అంటే కోకిల విషయం లో పక్షి సంతానం అని, మేనక విషయం లో ద్విజుడైన విశ్వామిత్రుని సంతానం అని. అది తానే. తనను పుడుతూనే తల్లి వదలి వెళ్ళిపోతే కణ్వమహర్షి పెంచాడు .

శకుంతలకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. శకుంతలనే ఎఱగనన్న రాజుకి ఆ జన్మ కథ ఎలా గుర్తుంటుంది ? ఆయన యథాలాపంగానే అన్నాడు . శకుంతల కోపం హద్దు దాటింది.  ఆమె  ముగ్ధ అయినంత మాత్రాన స్వాభిమానం లేనిది కాదు.

” అనార్యుడా [మర్యాద లేనివాడా ] !  నీవనుకొనేదే నిజమా, అందరి విషయాలలో   నీకెలా తోస్తే అలా తీర్పు చెబుతావా ? [రాజు ధర్మపీఠం మీద ఉన్నాడు ] అందరూ నీవంటి ధూర్తులే ఉంటారా ?  పూడుకుపోయిన బావివంటి వాడివి నువ్వు ! ”

రాజుకి కొంత ఆశ్చర్యం. ” ఈమె రోషం ఇంత సహజంగా ఉందేమిటి ? నాదే పొరబాటా ? ”

” క్రోధం తో ముడివడిన ఆమె కనుబొమలను చూస్తే మన్మథుని విల్లు విరుగుతోందా [కనుబొమలను విల్లుతో పోల్చటం ప్రసిద్ధమే ]  అనిపిస్తూ ఉంది ”  స్మర అనే శబ్దాన్ని మన్మథుడికి వాడతారు కాళిదాసు . ఆ మాటకు మరొక అర్థం స్మృతి అని ఉండటం వలన ఇక్కడ మన్మథుని విల్లు, జ్ఞాపకాల విల్లు- రెండూ వర్తిస్తున్నాయి .

ఈ  అసమాపక క్రియ కి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ విల్లు విరుగుతోందా అని మాత్రమే అనిపించింది. విరగలేదు. జ్ఞాపకాల అల్లిక మొదలంటా  తునగలేదు, ఒకరి పట్ల మరొకరి  శృంగార భావం ఆఖరికి  తొలగలేదు.

అభిజ్ఞాన శాకుంతలం శృంగారరస ప్రధానం, ముగింపులో శాంతరసం లోకి పర్యవసిస్తుంది.  నాయికా నాయకులకు ఒకరి పట్ల ఒకరికి ఉండే రతీభావం  శృంగారరసానికి స్థాయీభావం.  [ ఇక్కడ అనురక్తి అని మాత్రమే అర్థం ] .  విభావ, అనుభావ, సంచారీ భావాల   పైన ఆధారపడి, వాటిని మించి సహృదయుల మనసులో చెదిరిపోకుండా స్థిరం గా నిలిచేది స్థాయీ భావం. దాన్ని నిలబెట్టేందుకు పంచమాంకం లో కాళిదాసు గొప్ప ప్రయత్నం చేశారు , ఆ ఉద్వేగాల హెచ్చుతగ్గులలో దుష్యంతుడు ధూర్తుడు గానో శకుంతల విరక్తురాలు గానో కనబడనీయకుండా చేయటంలో పూర్తిగా సఫలులైనారు. ఎంత తీవ్రమైన కోపం వచ్చినా దాన్ని  భర్త పట్ల చూపించే పద్ధతి వేరు. శకుంతల కోపం అలాగే ఉంది, ఆమె ఆయనను భర్త కాదనో వదిలిపెడదామనో అనుకోలేదు. దుష్యంతుడు తెలియకచేసినదీ ధర్మమని తాను అనుకున్నదీ  కనుక   ఆ నిరాకరణకు  [ప్రేక్షకులలో, పాఠకులలో ] దోషం పట్టదు. ఈ సన్నివేశం లో రసభంగం కాకపోవటాన్ని కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం ప్రకారం కూడా సమర్థించవచ్చు .

[విభావం అంటే ప్రేక్షకుల హృదయం లో వాసనా రూపంగా ఉన్న భావాలను ఆస్వాదయోగ్యం గా చేయటం. తగిన పాత్రల సృష్టి విభావం. వారి చర్యల ద్వారా ఆ వాసనను చూస్తూ ఉన్నవారు అనుభవించేలా చేయటం  అనుభావం. కావ్యం అంతటా ఆ భావం ప్రసరించేలా చేసేవి  సంచారీభావాలు. ఇవి అనుకూలంగానూ ప్రతికూలంగానూ కూడా ఉండవచ్చు- ఉత్తమమైన రచనలో స్థాయీభావానికి భంగం ఉండదు.]

శకుంతల దుఃఖిస్తుంది ” ఇతని వంశమర్యాదను విశ్వసించిన నేను పాంసులను[ధూళి అంటినదానిని] అయినాను కదా ”  అని.

ఒళ్ళు మండిపోయి, శార్ణరవుడు అంటాడు. ”ఎఱగని వారితో నీ ఇష్టప్రకారం చనువుగా ఉంటే ఇలా కాక ఎలా ఉంటుంది ?’’  ’ పురోభాగా ‘ అని నిందిస్తాడు శకుంతలను.అంటే మొదటి భాగాన్ని తీసేసుకునేది-స్వార్థపరురాలు . నీ సంగతే నువ్వు చూసుకున్నావు కాని తండ్రి గురించి ఆలోచించి ఉండలేదని.

రాజా ! మీరు రాజనీతి రూపం లో మోసాన్ని అభ్యసిస్తారు. మాకు ఆ మాట కి అర్థమే తెలియదు. మీరు మమ్మల్ని అనేందుకు చాలరు ! ”

రాజు వ్యంగ్యంగా ” ఓ సత్యవాదీ ! మీరు చెప్పినది నిజమేననుకుందాం. ఈవిడని మోసం చేస్తే నాకేమి వస్తుంది ? ”

” వినాశనం ” అని గర్జిస్తాడు మునికుమారుడు.

శారద్వతుడు వారించి మన పని అయిపోయింది, వెళ్ళిపోదామంటాడు. శకుంతలను అక్కడే పడిఉండమంటాడు., ఈ కితవుడి[వంచకుడి ] దగ్గర నన్ను వదలివెళతారా అని శోకం శకుంతలకు.

‘’ ఏదో ఒకనాటికి ఆ మనసు కరుగుతుందేమో… ‘ క్షితి పతి ‘  [వ్యంగ్యం] కదా , భూమిఅంతటికీ  భర్త- నిన్నూ భరించవలసిందే  ‘’

రాజు ఆదుర్దా పడతాడు. ఆయన భయం తన మనసు చెదురుతుందని. అప్పటికే కొంత చెదిరి ఉంది, అది ఆయనకు ఇష్టం కాదు. ‘’ ఎందుకు ఆమెకు లేనిపోని ఆశలు కల్పిస్తారు ? చంద్రుడు కలువలనీ సూర్యుడు తామరలనీ మాత్రమే మేల్కొలుపుతారు. వాంఛల పట్ల అదుపు ఉన్నవారు పరస్త్రీని ఎందుకు స్పృశిస్తారు ? ‘’

‘’ కొత్త రుచుల నిమిత్తమై గతం మరచి ఉన్న తమకు తప్పుదారి గురించి  అంత వెరపెందుకు  మహారాజా ?  ‘’

రాజుకు మళ్ళీ సందేహం వస్తుంది. మళ్ళీ కాదు, ఆ దృశ్యం ఆసాంతం ఆయన సందేహియే. ” నేనే మోహితుడనైనానా ..ఈమె అబద్ధం చెబుతోందా.. నా భార్యను నేను తిరస్కరిస్తున్నానా.. లేదా పరస్త్రీలగ్నత తో పాపిని అవుతున్నానా ” ఆ విచికిత్స అప్పటికి తెగదు, తెగే వీలు లేదు.

ధర్మం తెలిసినవాడూ, బిడ్డలగన్న తండ్రీ రాజ పురోహితుడు ఆమెను ప్రసవించేదాకా సం రక్షిస్తాననీ ఆ పుట్టిన బిడ్డ సాముద్రిక లక్షణాలను బట్టి [బహుశా రూపురేఖల బట్టి కూడానేమో ] మహారాజు సంతతి అవునో కాదో తేల్చుకోవచ్చుననీ అంటాడు. రాజు సరేనంటాడు.

శకుంతలకి తీవ్రమైన అవమానం స్ఫురిస్తుంది. ఇలా రాజు మొండిగా తిరస్కరించిన సందర్భం లో భారత శకుంతల ” నా పని ముగిసింది. నీ కొడుకును నీకు అప్పగించాను ” అని వెళ్ళిపోబోతుంది. అప్పుడు ఆకాశ వాణి వినిపిస్తుంది. కాళిదాసు శకుంతల అంతర్వత్ని.ఇక్కడ కొడుకు ఇంకా కలగలేదు. అప్పటివరకూ పురోహితుడి సం రక్షణలో ఉండి ఎదురు చూడటాన్ని ఆమె అభిజాత్యం ఒప్పుకోదు .   ” అమ్మా ! భూదేవీ ! నాకు దారి ఇవ్వు ” అని ఆక్రోశిస్తుంది.. ఈ ” భగవతి వసుధే దేహిమే వివరం ” అన్నది ఉత్తరకాండలో సీతాదేవి అన్న మాట వంటిది.

 

భూమి  విచ్చుకోలేదు.. . కాని ,   తల పైకెత్తి చేతులు సాచి విలపించినప్పుడు ఆకాశం స్పందించింది.  అప్సరతీర్థం దగ్గర మెఱిసిన మెఱుపు ఒకటి ఆమెను ఆవరించి  మాయం చేస్తుంది. ఇక్కడా తల్లిప్రాణమే కదిలింది, స్వర్లోకం నుంచి.

ఆ అంకం ముగిసింది.

ఆరవ అంకం లో అంగుళీయకం ప్రత్యక్షం. మత్స్యకారుడొకరు అమ్మజూపబోతే రాజభటులు బందిస్తారు. నేను దొంగిలించలేదంటాడు అతను. నీ గొప్పతనానికి మెచ్చి రాజు నీకు బహుమతి చేశారా అని వేళాకోళం చేస్తారు భటులు. ” ఏమి ? జన్మతో సంక్రమించిన ఏ వృత్తి అయిన గౌరవమైనదే. బ్రాహ్మణులు సైతం యజ్ఞాలలో పశుహింస చేయరా ఏమిటి ? ” అని ధైర్యంగా బదులిస్తాడు అతను. ఆ ఉంగరం పచ్చి మాంసం వాసన వేస్తోంది కనుక చేప కడుపులో దొరికే ఉంటుందనుకుంటాడు భటుల అధికారి. కాళిదాసు లోకజ్ఞత !

తీసుకుపోయి రాజుకు చూపుతారు. అప్పటి రాజు కు స్మృతి తిరిగి రావటాన్నీ ఆయన ఉద్వేగాన్నీ వర్ణించకుండా విడిచిపెడతారు కాళిదాసు. వ్యంజనా శబ్దశక్తి [ పదాలకు అనుకూలమైన అర్థం పొసగిన తర్వాత , ఆ అర్థపు శోభను అతిశయింపజేసే మరొక అర్థం స్ఫురించేలా చేయగలగటం ] లో పారంగతుడయి ఉండీ శాకుంతలం లో మౌనం వహించిన సందర్భాలలో ఇది ఒకటి.   శకుంతలా దుష్యంతుల సమాగమ వర్ణననూ పరిహరించారు ఆయన .  రాజు కి ఏదో జ్ఞాపకం వచ్చినట్లుందనీ ప్రియమైన ఎవరినో తలచుకున్నారనీ మాత్రం బయట చెప్పుకుంటారు. ఉంగరం విలువకు సమమైన ధనాన్ని మత్స్యకారుడికి బహూకరిస్తారు… ” ఉరికొయ్య నుంచి దించి ఏనుగు నెక్కించారు నిన్ను ” అంటూ.

తన చేసిన మహాపరాధం వలన రాజు తీవ్రమైన ఆత్మశోధనకి గురి అవుతాడు. ధర్మాన్నీ న్యాయాన్నీ ఆయన వీక్షించే, సమీక్షించే తీరు మారుతుంది. ధనవంతుడైన ఒక వర్తకుడు నిస్సంతు గా మరణిం చిన సందర్భం లో – భార్యలకు భృతి మాత్రం ఇచ్చి అతని ఆస్తిని రాజ్యపు కోశాగారానికి జమ చేసే పద్ధతి ఉన్నప్పుడు -రాజు ఆ పని చేసేయకుండా ఆ చనిపోయిన వర్తకుడి భార్యలలో ఎవరైనా గర్భవతిగా ఉన్నారా అని ఆచూకీ తీయమని పురమాయిస్తాడు.  అటువంటి భార్య ఒకరు ఉన్నారని విన్న వెంటనే ఆస్తి ఆ పుట్టబోయే శిశువుకు సంక్రమిస్తుందని ఉత్తరువు ఇస్తాడు.  గర్భవతి యైన భార్యను తాను పరిత్యజించాడు. ఆమె గతి ఏమయిందో, ఆ తన సంతతి ఎలా జీవిస్తోందో అన్న పుట్టెడు దిగులు నిద్రలో కూడా ఆయనను వీడదు.ఆప్తులను కోల్పోయిన వారందరికీ ఉపశమనం స్వయంగా ఇస్తానని ప్రకటిస్తాడు.

అయితే అంత ఓపికేదీ…శరీరమూ మనస్సూ కూడా వాటి బరువునే  అవి మోయలేనప్పుడు !

తర్వాతి రంగం లో సానుమతి[ మిశ్రకేశి అని ఆమెకు మరొక పేరు] అనే అప్సర స్త్రీ, మేనకకు స్నేహితురాలూ శకుంతలకు ఆప్తురాలూ అయినది, రాజు పరిస్థితిని గమనించేందుకు [ శకుంతలకు సమాచారం ఇచ్చేందుకు ] అదృశ్యంగా దిగి వస్తుంది.

పరభృతిక [కోకిల అని అర్థం ] , మధుకారిక [తుమ్మెద అని ] అనే ఇద్దరు పరిచారికలు , రాజోద్యానం లో, వసంత ఋతువు రాకకి ఆనందిస్తూ ఉత్సవానికి ఏర్పాట్లు చేయబోతూ ఉంటారు. రక్షకభటాధికారి వచ్చి మందలిస్తాడు.

” రాజు శోకమగ్నుడై ఉన్నాడు. ఏ ఉత్సవానికీ ఇది సమయం కాదు.

ఆయన ఆనతిని వృక్షాలూ పక్షులూ కూడా మన్నిస్తున్నాయి, చూడరేమి ?

మామిడి పూత పట్టీ పుప్పొడి నింపుకోవటం లేదు. మొగ్గ మొగ్గగానే ఉండిపోయింది. గండుకోయిల గొంతులో గానం పెగలటం లేదు. పంచబాణుడయిన  మన్మథుడే తన శరాలను సగం లో ఆపేశాడు. ”  [అరవిందమూ, అశోకమూ, నవమల్లికా, నీలోత్పలమూ, చూతమూ -అయిదు బాణాలు మన్మథుడికి. వీటిలో చూతమంజరి [ సుగంధం వెదజల్లే ఒక జాతి మామిడి  పూలగుత్తి ] ని మాత్రమే కాళిదాసు పదే పదే పేర్కొంటారు. ఆయనకు ఆ సువాసన ఇష్టమేమో]

‘’ తెలియక శకుంతలను తిరస్కరించిన దుఃఖం నుంచి రాజు తేరుకోనేలేదు.

అందమైన అన్నిటినీ రాజు ఇప్పుడు ద్వేషిస్తున్నాడు. పగలైతే మంత్రుల నివేదికలకి తల ఊపుతున్నాడు, రాత్రి మొత్తమూ నిద్రలేక మసలుతూనే ఉంటున్నాడు. తన రాణులకు యుక్తమైన మర్యాదయితే ఇస్తున్నాడుకానీ ఒకరి పేరుతో మరొకరిని పిలిచి లజ్జితుడయిపోతున్నాడు ”

అంతలో రాజు ప్రవేశం. ” వేదన పడుతూ కూడా ఎంత సుందరుడై ఉన్నాడు ఈయన ! కోతకు గురి అయిన వజ్రం కాంతిని కోల్పోనట్లుగా ! ”   రాజభక్తిని మించిన ప్రేమను దేన్నో అధికారి మనసులో పెంచగలిగిన వ్యక్తిత్వం అయిఉండాలి రాజుది.

అవును, ఆయన తరగబడుతూ ఉన్న వజ్రం. సానుమతి కూడా అనుకుంటుంది ” తిరస్కరించబడి కూడా శకుంతల ఇతని కోసం అంత వేదన పడుతోందంటే ఆశ్చర్యం లేదు ”

రాజు మాటలు ”  శపించబడిన హృదయం ఆమె ఎంత లేపినా నిద్ర లేవలేదు, ఇప్పుడు మేలుకుంటే ఏమి లాభం-ఆమె లేదు …కలలో కనిపిస్తుందా అంటే నిద్రన్నది చేరరాదు.  బొమ్మను చూద్దామా అంటే కంటినీటి తెరలు  అడ్డు ”

విదూషకుడు మొత్తుకుంటాడు తనలో తాను ” ఈ శకుంతలా వ్యాధి మళ్ళీ తీవ్రమైందే  ” అని.

ఏ జబ్బుకైనా వేళ బట్టి, వ్యాధి లక్షణం బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి, ఈ వ్యధా వ్యాధికి కూడా. ఏ వ్యాధికైనా ముందు ఆహారం మానాలి . ‘ లంఘనం దివ్యౌషధం ‘ . అలా రాజు ఆనందాలన్నిటినీ విసర్జించాడు.  చికిత్సా పథ్యమూ  ఆ తర్వాత.

” చిన్న సందు దొరికితే చాలు, కష్టాలు ముంచుకొస్తాయంటారు.నామనసు ఇప్పుడే మరపు నుంచి తేరుకుంటోంది.ఈ మన్మథుడి బాణం, చూతమంజరి-నన్ను అదను చూసి   గురి చూస్తోంది ” అని అదొక ధోరణిగా ఉన్మత్తుడి వలె  మాట్లాడతాడు రాజు.

”ఏదీ, ఎక్కడ ఆ బాణం ? ఈ కర్ర పెట్టి కొడతాను ఉండు ” అని రాజును చిన్న పిల్లవాడిని లాగా  రక్షించబోతాడు మాఢవ్యుడు.

తెప్పరిల్లిన రాజుకి నవ్వు వస్తుంది. ‘ ఆ… నీ బ్రాహ్మణత్వపు మహిమ నాకు తెలుసులే ”

దుష్యంతుడు స్వయంగా చిత్రించిన శకుంతల చిత్రపటం , ఇంకా అసంపూర్తిగా ఉన్నది, అక్కడికి తీసుకురాబడుతుంది.

రాజు అడుగుతాడు ” అవునయ్యా. అరణ్యం లో శకుంతల ను నేను ప్రేమించిన విషయం నీతో చెప్పాను కదా ? నువ్వైనా ఎందుకు నాకు గుర్తు చేయలేదు ? నువ్వూ నాలాగే మరచిపోయావా ?”

” అదంతా వట్టిదేనన్నావు కదా నువ్వు ? మృత్పిండబుద్ధి ని [మట్టిబుర్రవాడిని ] నిజమేననుకున్నాను. విధి బలీయం …’’

[వాచాలుడైన మాఢవ్యుడు శకుంతల సంగతి చెప్పి  అంతఃపురం లో గగ్గోలు సృష్టిస్తాడేమోనని రాజు అలా అబద్ధం చెప్పిఉన్నమాట నిజమే]

రాజు కి తల తిరిగిపోతుంది, అమితమైన అసహాయతతో   ” సఖో, త్రాయస్వమాం ” [స్నేహితుడా, రక్షించు ] అంటాడు.

” అంత బలహీనుడవు కాకు మిత్రమా, పెనుగాలికి అయితే మాత్రం పర్వతాలు చలిస్తాయా ? ”

” వెళ్ళిపోయే తాపసుల వెంట తనూ కదలబోయింది. అతనెవరో తమతో రావటానికి వీల్లేదన్నాడు. కన్నులలో నీరు నిండి కాంతి తరిగిన చూపుతో, నన్ను తిరిగి చూసింది…. క్రూరాత్ముడిని, నన్ను.  ఆ జ్ఞాపకం విషం పూసిన బాణం లాగా గుచ్చుకుంటోంది ‘’

సానుమతి ఆలోచిస్తూ -”’  పూర్వాపర విరోధపూర్వ ఏష విరహమార్గః ” – విరహులైనవారికి పూర్వాపరాలు తెలియవని ఒక అర్థం, ఇక్కడ నిజంగానే – తాని విని ఉన్న  ఇదివరకటి దుష్యంతుడికీ  విరహి అయిన ఇప్పటి దుష్యంతుడికీ పోలిక ఉండకపోవటం  అంతర్ధ్వని.

” ఆమెనెవరో ఎత్తుకొని వెళ్ళారట కదా ?”-మాఢవ్యుడు .

”  ఆ పవిత్రు రాలిని ఇతరులె వరు తాకగలరు ! ఆమె తల్లి, అప్సర, మేనక యే నీ సఖిని  తీసుకువెళ్ళి ఉండాలి ”  [స్నేహితుడితో తన భార్యను గురించి చెప్పేటప్పుడు ' నీ సఖి ' అంటాడు రాజు. మనం వ్యవహారం లో ' మీ చెల్లెలు ' అన్నట్లుగా.  వ్యాస భారతం లోనూ కృష్ణుడికి ద్రౌపది ఇటువంటి ' సఖి ' యే కాబోలు. దానికి కొందరు చేసిన వ్యాఖ్యానాలు వేరు ]

”అలా అయితే ఆమె ను తప్పక నువ్వు కలుసుకుంటావు. తల్లిదండ్రులు ఆడపిల్లను భర్త దగ్గరికి పంపాలనే కదా అనుకుంటారు ”

రాజు శాంతించనే లేదు.

” స్వప్నమా ? భ్రాంతియా ? మతిభ్రమణమా ? తరిగిపోయిన పుణ్యఫలమా ? మరి తిరిగి రానిదా ? పొడిపొడిగా రాలిపోయిన ఆశలా ? ”

అంగుళీయకాన్ని చూసి ” నా వలె నీదీ దురదృష్టమే. గులాబీవర్ణపు గోటితో రమ్యమైన ఆమె వ్రేలిపైన మీద  నీవున్న కాలం  స్వల్పమే , నీ భాగ్యమూ అంతవరకే.  ‘’

అదృశ్యంగా చూస్తూ ఉన్న అప్సర-సానుమతి , అనుకుంటుంది ” ఇంతటి, ఇటువంటి ప్రేమకు ఒక జ్ఞాపిక కావలసి వచ్చిందా ..అది లేకపోతే ఇంత అయిందా… ”

అయింది. అది ఎవరి అపరాధమూ కాదు, అభిశాపం …. అకారణమా ?

ఆ చిత్రపటం లో అనసూయా ప్రియంవద లతో కలిసి ఉన్న శకుంతల.’’  ఆ వెడల్పైన సోగకళ్ళు, తీవెచివరల లాగ అలా అందంగా ఒంపుతిరిగిన కనుబొమ్మలు. వెన్నెల కిరణాల వలే వెలిగే   లేనగవు  పెదవులు. ఆ ముఖం చిత్తరువులోనుంచి  కూడా ముచ్చటిస్తున్నట్లే  ఉంది ‘’-” రాజు

మొదటిసారి శకుంతలను చూసినప్పుడు ” చిత్రే పరికల్ప నివేశయ సత్త్వయోగా ” [సృష్టిలో అతి సుందరమైన వాటన్నిటినీ కలిపి బొమ్మ గీసి ప్ర్రణ ప్రతిష్ట చేసినట్లుంది ] అని వర్ణించుకున్న దుష్యంతుడు మనసా తాను భావించిన దానికి – ఇప్పుడు, ఆమె లేనప్పుడు- చిత్రం గా ఆకృతి ఇస్తున్నాడు. ఆయన ప్రతిభావంతుడైన చిత్రకారుడని మాఢవ్యుడి మాటలలో తెలుస్తుంది

” ఎంత సహజం గా చిత్రించారు మహారాజు  ! ఆ పరిసరాల ఎత్తుపల్లాలలో నా కళ్ళు తట్టుకుని పడిపోయేలా ఉన్నాయి ”

” సరిగా రాలేదనుకుంటూ ఎన్నిసార్లు దిద్దానో…ఎంత చేసీ  బొమ్మ  కదా…ఆమె సోయగాన్ని కాస్త  సూచిస్తూ ఉంది, అంతే. ” రాజు

అంతవరకూ ఆమెను చూడని విదూషకుడు గుర్తిస్తాడు. ఎలా ? ఆమె ఉన్న చోట రాజువి, స్వేదం తో తడిసిన వేలి ముద్రలు [పదే పదే తాకటం వలన] .ఆమె చెంప మీది రంగు చెదిరింది, అక్కడ రాలిపడిన అతని కన్నీటి చుక్కతో.

‘’  ఇక్కడ..ఈ అశోకవృక్షం ప్రక్కన. ఆ మెత్తని చివురాకులు నీట తడిసి మెరుస్తున్నాయి. ముడివీడి శిరోజభారం పూవులతో జారుతోంది. ముఖం చెమరించింది, లతల వంటి ఆ  చేతులు అశ క్తమై వాలినాయి. అలిసిపోయినట్లుంది పాపం, తనే కదా శకుంతల ? ఆ ఇద్దరూ  నెచ్చెలులు. ‘’

ఇంకా చిత్రించవలసి ఉన్నవి అని రాజు తలచుకుంటాడు గతాన్నంతా.  ” మాలినీ నది. ఒడ్డున ఇసుక తిన్నెల మీద విశ్రమించే హంసల జంట. అటూ ఇటూ గౌరీదేవిని కన్న హిమవంతుని పవిత్ర పర్వత శిఖరాలు . అదిగో, ఆ చెట్టు కొమ్మలకు ఆరేసిన నారచీరలు. కృష్ణవర్ణపు జింక కొమ్ముకి రాసుకుంటూ ఉన్న లేడి …

అక్కడ శకుంతల. ఆమె చెవిలో సుకుమారశిరీష కుసుమమాన్నీ, మెడలో శరత్ జ్యోత్స్నా కాంతుల వంటి తామరతూడుల హా రాన్నీ…గీయటం మరచేపోయాను ‘’

ఎర్ర తామర రేకు వంటి అర చేతితో ముఖాన్ని కప్పుకుంటూ ఉంది ఎందుకు?  ” మాఢవ్యుడు అడుగుతాడు.

” భయపడిందిగా తను, గండు తుమ్మెద ముసిరితే … ఎవరక్కడ- ఈ ధూర్తపు భ్రమరాన్ని తరిమికొట్టండి ” వర్తమానానికీ గతపుస్మృతికీ హద్దు చెరిగిపోతోంది రాజుకి. మళ్ళీ ఉన్మాదం.” ఏయ్, తుమ్మెదా. నిన్ను తామరపూవులో పెట్టి తాళం వేస్తాను సుమా ”

‘ అంత కఠినశిక్షకి అది ఎందుకు భయపడదు ” అంటూనే మాఢవ్యుడు ” ఇతనికి పిచ్చి ఎత్తింది. ఇతనితో బాటు నాకూనూ. ” అనుకొని..”అయ్యో, మిత్రమా, అది వొట్టి చిత్రమయ్యా ” అని అరుస్తాడు.

దుష్యంతుడు విలపిస్తాడు ‘’  దర్శనసుఖమనుభవతః సాక్షాదివ తన్మయేన హృదయేన

స్మృతికారిణా త్వయా మే పునరపి చిత్రీకృత కాంతా ‘’

[ అయ్యో. ఆమె ఉందనే సౌఖ్యం లో మైమరచి ఉన్నాను  కాదా. .. గుర్తు చేసి తిరిగి బొమ్మగా  మార్చేశావే ]

 

[సశేషం ]

 సంప్రదిస్తున్న గ్రంథాలు- ‘అభిజ్ఞానశాకుంతలం’ [M.R.Kale ] ‘,The Loom of  time ‘  [చంద్రా రాజన్] ,’  శాకుంతలము యొక్క అభిజ్ఞానత’  [ విశ్వనాథ సత్యనారాయణ ]‘