కడిమిచెట్టు

మూడవ భాగం- సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ

సెప్టెంబర్ 2014

‘ నాటకాంతహి సాహిత్యం ‘ – ఈ మాట ఈ విధంగా కూడా  అవును – సాహిత్యపు పరమప్రయోజనం ఏదో దాన్ని సాధారణ స్థాయి వ్యక్తులకి కూడా  నేరుగా  చేరవేయటం నాటకం యొక్క శక్తి.  ఆ ప్రయోజనం స్థూలంగా  ఇలాగ-  కదలిక, లోపలికి తీసుకోవటం, విచ్చుకుని విశాలమవటం. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు సాహిత్యం లో  చివరి రచన అని చెబుతారు.  అంతకు ముందు ఆయన మహాకావ్యాలు రాశారు, కొన్ని మంచి  నాటకాలనూ తీర్చారు. ఇది కావ్యమైన నాటకం. తన రచనలన్నింటి వెనకా ఉండిన  ఉపజ్ఞ, ప్రజ్ఞ అంతా ఒక్కటై వెలిగిన శాంతదీధితి  శాకుంతలం

కాళిదాసు కు పరమభక్తులైన పాతతరం సాహితీవేత్త జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు తన విస్తృతమైన భావనా ప్రపంచం లో అన్వేషించి కాళిదాసు కు తన నాయికలలో ఎవరు ఎక్కువ ఇష్టమైనవారూ అని తేల్చుకుంటారు.[ అదొక చాపల్యం వంటిదే కాని  కాళిదాసు పట్ల ఎక్కువైన పిచ్చికి నిదర్శనం ]  ఆయననే ముఖాముఖి అడిగినట్లు ఆ వ్యాసం ఉంటుంది.  తన నోటితో కాళిదాసు చెప్పినట్లు రాయరు కానీ  ఆమె శకుంతలే అని చివరికి. కవి చెప్పిన ఏయే మాటలు ఆ నిర్ధారణను ఇస్తాయో ఆయన వరకు ఆయన చెప్పుకొస్తారు. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, కాళిదాసు రఘువంశంలో సృజించిన అమ్మవారు సీతాదేవి లోనూ   [బహుశా అమ్మవారు కనుకే] లేని  ఆ కొంచెపు కొంచెం ఏదో శకుంతలలో ఉంది. అది కాళిదాసుతో సహా మనుషులమైన మనకు దగ్గర.

కాళిదాసు నాటకపు ఒక పొరలో ఇలా చెప్పదలచుకున్నారేమోనని నా బుద్ధికి తోస్తుంది. ఏది ఒకరి ఉనికికి అత్యవసరమో తెలుసుకుని తీరాలి. ఆ అమూల్యమైన దానికి సాక్ష్యమూ నిరూపణా అక్కర్లేదు  .  దాన్ని కాపాడుకోవటం లో ఏ మాత్రం ఏమరపాటు ఉన్నా ,  పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తెచ్చుకుందుకు ఎన్నెన్ని కన్నీళ్ళో ఖర్చు అవుతాయి. కేవలం తపించటం ఒక్కటే  చాలకపోవచ్చు.   కొన్ని సార్లు వేరే వ్యక్తిగతమైన ఔన్నత్యాలూ ఘనతలూ కూడా అవసరమవుతాయి. తిరిగి పొందినప్పుడు అందులో తొలినాటి పసరుదనపు సౌకుమార్యం ఉండదు, మిగిలేవి పండిన సువర్ణ ఛాయలే – ఎప్పటికీ నిలవగలిగేవీ  అవే.

తాను చేసిన అపరాధాన్నంతా అశ్రుధారలతో   కడిగివేసుకుంటున్నాడు దుష్యంతుడు. ” నన్ను నేను తనలో నిక్షేపించుకొని ఉండీ నా ధర్మపత్నిని, నా వంశధారకు ఆలంబనను- వదిలిపెట్టాను…బంగారం  పండబోతుంటే  పంటచేనును వదిలేసినట్లు.  పూజ్యులైన నా పూర్వులకు నా తర్వాత పుణ్యోదకాలు ఇంకెవరు వదులుతారు ? ”

తీరని దుర్భర వేదన, దహించే పశ్చాత్తాపం దుష్యంతుడిని కృంగదీస్తున్నాయి. ఉన్మాదం కొన్నిసార్లు, అపస్మారం కొన్ని సార్లు. జీవితం లో,  ప్రపంచం లో పట్టిలాగగల ఏ విషయమూ ఆయనకి లేదు. అదే స్థితి కొనసాగి ఉంటే ఏమయినా కావచ్చు.

ప్రియమైన వారు దూరమైనప్పుడు అనుభవించే విరహం లో పది దశ లను చెబుతారు .వాటిలో తీవ్రమైన ఒకటి ఉన్మాదం.  చివరిది మృత్యువు.   అజ మహారాజు తన భార్య ఇందుమతి మరణాన్ని భరించలేక, ఆయన కొడుకు దశరథుడు పుత్రవియోగాన్ని ఎదుర్కోలేక- ఆ చివరివరకూ  వెళ్ళిపోయారు. ఇప్పుడు, ఇక్కడ దుష్యంతుడిని ఆ ఉన్మత్త స్థితి నుంచి తప్పించి తీరాలి. ఆయన స్వస్థుడై , పత్ని తో దక్షుడై పాలించి , యజ్ఞాలూ యాగాలూ చేయవలసి ఉంది. హవిస్సుల కోసం దేవతలు రావలసి ఉంది, యజ్ఞఫలాలతో,  రాజ్యం  తిరిగి  సుభిక్షం కావలసి ఉంది , రాగల కాలం లో  దేశానికొక కొత్త పేరు చేరవలసి ఉంది  .   అందుకు దేవతలు వేసిన పథకం మొదలవుతుంది.

మేఘపరిచ్ఛంద  భవనం పై భాగం లో ఉన్న మాఢవ్యుడిని ఇంద్రసారథి మాతలి అదృశ్యంగా హింసించటం మొదలుపెడతాడు.[ ఆ భవనం పేరుని-  దాని ఉపరిభాగం ఆకాశం నుంచి కిందికి  అందుతుందన్నట్లు పెట్టారు కాళిదాసు. శాకుంతలం పూర్తి stylized  రచన అని గుర్తు చేసుకోవాలి.]  మాఢవ్యుడు   రక్షించమని కేకలు పెడుతూ ఉంటే దుఃఖాన్ని పక్కనపెట్టి పరుగుపెడతాడు రాజు. మాతలి నిజరూపం తో కనబడి ఇంద్రుని సందేశాన్ని  అందజేస్తాడు. ” కాలనేమి అన్న రాక్షసుడి సంతతి-దుర్జయులనే రక్కసిగుంపు చెలరేగుతున్నారు. వారించేందుకు ఇంద్రుడికి శక్యం కావటం లేదు. నీవలన కాగలదు అది. రాత్రి చీకటిని చెదరగొట్టటం సూర్యుడి వల్ల అవుతుందా, అందుకు చంద్రుడు కదాకావాలి ”

రాజు ” మరి ఎందుకు ఈ అమాయకుడైన బ్రాహ్మణుడిని హింసించావు ?”

” ఆయుష్మంతుడా ! నీ మనస్సు అతివికలంగా ఉంది.  ఆ నీ అశక్తతను తొలగించాలంటే నీకు కోపం తెప్పించాలి . హోమద్రవ్యం పోస్తే అగ్ని భగ్గుమంటుంది, శిరసు మీద కొడితే సర్పం బుస కొడుతుంది…అందుకు. ”

రాజ్యభారాన్ని పిశునుడనే మంత్రికి అప్పగించి స్వర్గానికి ప్రయాణమవుతాడు రాజు.

చివరిదైన ఏడవ అంకం ప్రారంభం లో స్వర్గలోకం లో ఇంద్రుడు కోరిన సాయాన్ని చేసి తిరిగి మాతలి రథం మీదే వెనక్కి వస్తున్నాడు .

” ఇంద్రుడికి నేను చేసిన మేలుకంటే ఆయన నా పైన చూపిన గౌరవం ఎక్కువ ఘనంగా ఉంది మాతలీ ! తన సిం హాసనం మీద నన్నొక కుమారుడి లాగా  పక్కనే కూర్చోబెట్టుకున్నాడు కదా. హరిచందనం అంటిన మందారమాల  ఆయన గళసీమలో.    పక్కనే ఆయన పుత్రుడు జయంతుడు ఉండనే ఉన్నాడు , ఆ మాలవంక కాంక్షతో  చూస్తూనే ఉన్నాడు . అయినా ఇంద్రుడు కొడుకుని చూసి ఒకసారి నవ్వి ఆ మాల నా మెడలోనే  వేశాడు కదా, ఎంత భాగ్యం నాది ! ” అన్నాడు రాజు.  తనమీద తనకే ఆదరం లేని మనస్స్థితిలో ,  అధికుడైన ఇంద్రుడి ఆప్యాయత దుష్యంతుడిని నిలబెడుతూ ఉంది.

మాతలి జవాబు ఇచ్చాడు ” స్వర్గాన్ని ఆవరించిన ముళ్ళకంపలు నువ్వు తొలగించావు మహారాజా ! ఇదివరకు నరసిం హస్వామి గోళ్ళు చేసినపనిని ఇప్పుడు నీ బాణాలు చేసిపెట్టాయి  ” సాక్షాత్తు విష్ణుమూర్తితో దుష్యంతుడిని పోల్చాడు.

ఆ అతిశయోక్తికి రాజు మురిసిపోలేదు. ” యజమాని చూపించే నమ్మకం బట్టీ , మర్యాదను అనుసరించీ సేవకుల కార్యనిర్వహణ ఉంటుంది. సహస్రమయూఖుడైన సూర్యుడు తన ముందు అరుణుడిని [ సారథిగా ] కూర్చోబెట్టుకున్నాడు కనుకే అరుణుడు చీకటిని పారద్రోలగలుగుతున్నాడు  ” [ ఈ  పోలిక కేవలం రాజు వినయం. అరుణుడు [అనూరుడు ] కాళ్ళు లేనివాడు , వేరే విధంగా పూర్తి అశక్తుడు. ]

మాతలి – ” నీ విజయగాథలను పాడుకునే పాటలుగా -కల్పవృక్షపు పత్రాల పైన అప్సరలు ఉపయోగించే లాక్షారసం తో లిఖిస్తున్నారు, నీ కీర్తి శాశ్వతం ! ”

రాజు – ” వచ్చేప్పుడు గమనించలేదు నేను, ఏ ఆకాశమార్గం లో ప్రయాణిస్తున్నాము మనం ? ”

[  ఈ మార్గాలు ఏడు. మొదటిది మేఘమార్గం.  ఇది భూమినుంచి సూర్యుడి దాకా వ్యాపించి ఉంటుంది. ఇక్కడి వాయువును '  ఆవాహ ' అంటారు. మేఘాలూ  ఉల్కలూ ఉరుములూ మెరుపులూ - వీటిని ఆవరించి ఉంటుంది. రెండవది సూర్యమార్గం. ఇక్కడి వాయువు ' ప్రవాహ ' . ఇది సూర్యభ్రమణానికి కారణం. మూడవది చంద్రమార్గం. ఇక్కడి వాయువు ' సంవాహ ' .  నాలుగవది నక్షత్రమార్గం . ' ఉద్వాహ ' అన్న వాయువు వాటిని చలింపజేస్తుంది. అయిదవది గ్రహాల మార్గం. అవి చరించేది ' వివాహ ' అనే వాయువుతో. ఆరవది సప్తర్షి మండల మార్గం. ఇక్కడి వాయువు ' పరివాహ ' . ఆకాశగంగ ఉనికి ఇక్కడే. ఏడవది ధ్రువనక్షత్రమార్గం. ' పరవాహ ' అన్న వాయువు అన్ని గ్రహాల, నక్షత్రాల గతులని సమతుల్యస్థితిలో నిలుపుతుంది . ]

మాతలి -  ” ఆరవదైన పరివాహ మార్గం లో ఉన్నాము రాజా ! ఈ చోట చీకటి ఉండదు , పాపాలు నశిస్తాయి .

ఎందుకంటే వామనుడి రెండవ అడుగు ఆనినది ఇక్కడే. ఆ పాదోదకం సురగంగగా  ప్రవహించి పావనమైన ప్రదేశం  ”

రాజు- ” అందుకే కాబోలు , నా ఇంద్రియాలన్నీ శాంతంగా ఉన్నాయి. మనసుకి హాయిగా ఉంది . అదిగో, మేఘమార్గం లో ప్రవేశించాము చూడు. జలం  నిండిన మేఘాలలోంచి రథచక్రాలు కదులుతూ ఉంటే నీటితుంపరలు చిందిపోతున్నాయి. వాటికోసం చాతకపక్షులు ఎగిరి వస్తున్నాయి . మెరిసే మెరుపులలో అశ్వాలు తళతళమంటున్నాయి  ‘’

కాళిదాసుకి ఉండిన  ఖగోళ శాస్త్ర జ్ఞానం ఇక్కడ చక్కగా  ప్రతిఫలిస్తుంది , దానికి తోడు మబ్బుల్లో రథం పరుగెత్తినప్పటి రమ్యమైన  ఊహ.

మాతలి – ” త్వరలో మీ లోకానికి చేరుకుంటాము ”

ఇక్కడ కాళిదాసు రాజు తో పలికించినమాటలు చదివి విస్తుపోతాము. ఆధునికయుగం లో విమానం కిందికి దిగుతూ ఉంటే ఏయే దృశ్యాలు ఏయే క్రమంలో కనిపిస్తాయో ఆ సమాచారం అంతా చెప్పిస్తారు.

” వేగంగా క్రిందికి దిగుతున్నాము, ఇది అద్భుతంగా ఉంది. పర్వతశిఖరాలు కనిపిస్తున్నాయి, అంతలోనే వాటికింద నేల  స్పష్టం అవుతోంది. వృక్షాల ఆకులన్నీ కలిపి అల్లుకుని  ముందుగా , ఆ తర్వాత కిందని కాండాలు- కనబడుతున్నాయి. నదుల సన్నదనం మాయమై అవి విశాలమవుతున్నాయి. ఎవరో భూమిని పైకి నెట్టినట్లు , బంతిలా కొట్టినట్లు- అది నా దగ్గరికి వచ్చేస్తోంది ”

విని , మాతలి  ముచ్చటపడి ” సాధు దృష్టం ” అంటాడు . [ బాగా గమనించారు అని ]

రాజు – ” ఈ పర్వతం పేరేమిటి ? సంధ్యామేఘాల  కుడ్యం లా తూర్పుపడమర సముద్రాలలో చొచ్చుకుపోతోంది. అటూ ఇటూ బంగారపు నీరు చిందిపోతోంది ”

” మహారాజా ! కింపురుషులకు ఆలవాలమైన హేమకూట పర్వతం అది.  . మరీచి ప్రజాపతి  పుత్రుడు, సురాసురులకు తండ్రి అయిన  మారీచ [ కశ్యప ] ప్రజాపతి అక్కడే తపస్సులో మునిగి ఉన్నారు. ”- మాతలి

” తప్పక వారి దర్శనం చేసుకోవాలి ” అని దుష్యంతుడు అనగానే మాతలి రథాన్ని నిలుపుతాడు… దేవరథం కనుక, ఆగినది కింపురుషలోకంలో కనుక – చక్రాలు  ‘ నేల ’ పైన ఆనలేదు-  ధ్వని ఏదీ రాలేదు, ధూళి అసలు రేగలేదు .

” అదిగో, సగం దేహాన్ని వల్మీకం కప్పివేయగా స్థాణువైన వృక్షం వలె చలించక  తపస్సు చేస్తున్న కశ్యప ప్రజాపతి.ఇక్కడ ఆయన భార్య అదితీదేవి పెంచుతున్న మందారవనం. ”

ఇవాళ గొప్ప నాటకీయత అని మనం దేన్ని [ప్రశంసగా ]  అంటామో దాని ఉజ్వలమైన ప్రారంభాన్ని ఈ ఏడవ అంకం లో – కశ్యపాశ్రమం లోని సంఘటనలలో చూడవచ్చు.

అప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్న రాజు ఆ ప్రదేశాన్ని ‘ స్వర్గాధిక తరం  నివృతి స్థానం ‘ అంటాడు. [ స్వర్గం కన్న ప్రశాంతమైనదని ] అమృతహృదం [సరస్సు ]  లో తనను ముంచినట్లుందనీ అనుకుంటాడు. అవును, ఆయన హృదయం అక్కడ అమృతమయం కాబోతూ ఉంది కదా.

” కోరినదెల్లా ఇవ్వగల కల్పవృక్షాల తోటలే ఉన్నాయి అక్కడ, కాని వాయువే ప్రాణాధారంగా జీవనం నడుస్తోంది. స్వర్ణకమలాల పుప్పొడితో పరిమళించే జలాలను-[శృంగారార్థమై కాకుండా ]  దైవాభిషేకం కోసం వాడుతున్నారు. మణిమయమైన శిలావితర్దికల పైన ధాన్యాన్ని సాధన చేస్తున్నారు. మహా సౌందర్యరాశులు-అప్సరలు, చరించే చోట [తపస్వులు ] నిగ్రహం తో వర్తిస్తున్నారు. వేటికోసం సాధారణంగా  తపస్సు చేస్తారో అవి అన్నీ సమృద్ధిగా ఉన్న ఇక్కడ అంతకుమించినదానిని వెతుకుతున్నారు ” – ఇది దుష్యంతుడి నోట పలికించిన  హేమకూటవర్ణన.  సౌఖ్యానికీ వైభవానికీ పరాకాష్ట అయినవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవని , వాటన్నిటినుంచీ కూడా ముక్తినే కోరాలనీ కాళిదాసు అన్యాపదేశంగా అంటున్నారు.

కశ్యపుడు  అదితి కోసం, ఇతర ఋషిపత్నుల కోసం ధర్మబోధ చేయబోయే వేళ అయిందని తెలిసి ఒక అశోకవృక్షం కింద వేచి ఉంటాడు దుష్యంతుడు. ఆ చెట్టు పేరును కూడా కావాలనే చెప్పినట్లు అనిపిస్తుంది- ‘ అశోకం ‘ .

కొన్ని సం వత్సరాల క్రితం కణ్వాశ్రమం లో అడుగుపెడుతున్నప్పుడు కల్గిన శుభసూచక శకునం- రాజు కుడిభుజం అదరటం మళ్ళీ అప్పుడు జరుగుతుంది. ” నా మనోరథం ఇంకెక్కడ నెరవేరుతుంది ? అదృష్ట దేవతను ఒకసారి తిరస్కరిస్తే తిరిగి చేరవస్తుందా ” అనే ఆయన అనుకుంటాడు.

తల్లిదగ్గర పాలు తాగే సిం హపు పిల్లని ఆడుకోవటానికని జుట్టు పట్టి లాక్కువచ్చే బాలుడు ఉంటాడా ? అక్కడ కనబడతాడు.దాన్ని ” నోరు తెరువు, పళ్ళు లెక్కబెడతాను ” అనే అతన్ని చూసి  రాజు , ‘ ఏమి సాహసం ! ఎంత బలం ! ” అనుకుంటాడు. ఆ వెనకే వచ్చిన మునికన్య ” సర్వదమనుడని నీ పేరు సరిగానే పెట్టారు ఋషులు ” అంటుంది.

రాజు ” నాకు సంతానం లేనందువలనా ఏమిటి, ఈ బిడ్డ నాకు సొంతవాడనిపిస్తోంది ? ” అనుకుంటాడు.

రెండో మునికన్య ” తల్లి సిం హం కరుస్తుంది, జాగ్రత్త ”  అని బెదిరించినా బాలుడికి లెక్కే ఉండదు.

” నీకింకో బొమ్మ ఇస్తాను ” అని ఆమె అంటే

” ఏదీ, ఇవ్వు ” అని అతను చేయి చాస్తాడు.

విచ్చుతున్న తామర మొగ్గ లాగా ఉన్న  ఆ చాచిన  అరచేతిలో చక్రవర్తి రేఖలు గమనించి రాజు ఆశ్చర్యపడతాడు. పిల్లవాడి మీద బలంగా మనసు లాగుతూ ఉంటుంది.

ఇక్కడ , పసిబిడ్డలు కలిగించే ఆహ్లాదాన్ని దుష్యంతుడి నోట పలికించిన శ్లోకం యొక్క  భావం ప్రసిద్ధం.

”  కారణం లేని బుల్లి నవ్వులలో మొగ్గలవంటి దంతాలు కనిపిస్తుండగా, వచ్చీరాని మాటల సొగసు [అవ్యక్త వర్ణరమణీయ వచః ]   చిందిపోతూ   ఒళ్ళో కూర్చున్న పుత్రులు  అంటించిన దుమ్ముతో   మాసిపోయినవారు – ఆ తండ్రులు కదా ధన్యులు ! ”

వేరే ఆటబొమ్మను తెచ్చేందుకు ఒక మునికన్య వెళుతుంది, మరొకామె పిల్లవాడి పట్టునుంచి సిం హపు కూనను విడిపించేందుకు సాయం చేయమని రాజును అడుగుతుంది. ఆయన నవ్వుతూ అతన్ని  ” మునికుమారులకు తగని ఇటువంటి పనులు ఎందుకు నీకు, నాయనా ? ” అని అడుగుతాడు. ” అతను మునికుమారుడు కానిదే !  ” అని ఆమె బదులిస్తుంది.

రాజు ” కాదనే అనుకున్నాను. ” అంటూ బిడ్డను తాకగానే అపరిమితమైన ఆనందానికి లోనవుతాడు. ” నా సొంతవారిని స్పృశించినట్లు ఉందేమిటి ? ఈ బిడ్డనుగన్న తండ్రిది  ఎంత అదృష్టం ! ” అని తలమునకలవుతుంటే మునికన్య

” ఇదేమి ఆశ్చర్యమండీ..ఇతను అచ్చు మీలాగే ఉన్నాడు, కొత్తవారిదగ్గరికే వెళ్ళడు, మీదగ్గరికి వచ్చేశాడు ”  అంటుంది .

రాజు – ” ఇతను మునికుమారుడు కాకపోతే మరి ఎవరు ?”

” ఇతను పురువంశానికి చెందినవాడు ”

” గొప్పవంశం వారైనా మానవులే కదా. ఈ చోటికి ఎలా రాగలరు ?”

” నిజమే. ఇతని తల్లికి ఒక అప్సరతో ఉన్న బాంధవ్యం కారణంగా ఆమె ఇక్కడ కశ్యపప్రజాపతి రక్షణ లో ఉంది ”

ఆశ రేగిన రాజు -” అలాగా ! ఆమె భర్త పేరేమిటి ? ”

” ధర్మబద్ధంగా పెళ్ళాడిన భార్యను వదిలేసిన భర్త సంగతి ఎవరికి కావాలి ! ” అని మునికన్య ఇచ్చిన జవాబుతో

” కథ నా ఇంటికే చేరుతున్నట్లుంది . ఇతని తల్లి పేరు అడగనా ? వేరే వారి భార్య అయిఉంటే ఆమె గురించి మాట్లాడటం భావ్యం కాదేమో ” అని తర్జన భర్జన పడుతున్నప్పుడే

” సర్వదమనా ! ఇదిగో, శకుంతలా వన్య [ అందమైన పక్షి ] , చూడు ” అని ఒక నెమలి బొమ్మని తెచ్చి ఇస్తారు .

” అమ్మ ! అమ్మ ఏదీ  …”  దిక్కులు  చూస్తాడు పిల్లవాడు.

ఆరాటం హెచ్చయిన రాజు తన భాగ్యాన్ని తాను నమ్మలేక ” ఆ పేరు ఎంతమందికి ఉండదు ! ” అని సర్ది చెప్పుకుంటాడు.

సిం హపు పిల్ల తో ఆడుతున్నప్పుడు పిలావాడి మణికట్టు మీదినుంచి  జారిపడిన రక్షరేకు ‘ అపరాజిత ‘ ను రాజు తీసి, మునికన్యలు వద్దనేలోపే మళ్ళీ కట్టేస్తాడు. పిల్లవాడి తల్లిదండ్రులు తప్ప మరి ఎవరు తాకినా అది పాముగా మారి కరుస్తుందని వాళ్ళు చెబుతారు.

ఇంకా నమ్మలేని రాజు- ” అలా ఇదివరలో జరిగిందా ? ” అని ప్రశ్నిస్తే

” బోలెడు సార్లు ” అని సమాధానం వస్తుంది.

పట్టలేని సంతోషంతో బిడ్డను కావలించుకుంటాడు రాజు.

” వదులు, వదులు- అమ్మ దగ్గరికి వెళతా ” అని అతను మారాం చేస్తాడు.

” నువ్వు నా బిడ్డవి కూడా ” అని రాజు మురిసిపోతాడు.

” మా నాన్న దుష్యంతుడు- నువ్వు కాదు ”

” అదే కదా తమాషా ” అని నవ్వుతుండగానే తల్లి  వచ్చింది.

దూరం నుంచి చూసింది రాజుని- ” అవునా, నిజమేనా ? సానుమతి చెప్పినది ఋజువేనా ? ”

ఆయనా చూశాడు. తనేనా ?

 

” వసనే పరిధూసరే వసనా నియమక్షామముఖీ ఘృతైకవేణిః

అతినిష్కరుణస్య శుద్ధశీలా మమ దీర్ఘ విరహవ్రతంబిభార్తి ”

 

[ దుమ్ముకొట్టిన దుస్తులు, శుష్కించిన ముఖం, ఒంటిజడగా కట్టిన జుట్టు - ఈ పవిత్రురాలు నా క్రూరత్వం వలన, ఈ దీర్ఘ విరహం వలన- ఎలా అయిపోయింది ! ]

శకుంతల కూడా  కృశించి ఉన్న రాజును చూడగానే గుర్తించలేక [ తానూ తన భాగధేయాన్ని నమ్మలేక ] ఆయన ఎవరో అనుకుంటుంది.

ఆయన అంటాడు – ” ఇప్పుడు నేను అడుగుతున్నాను, నన్ను గుర్తించవా అని ”

” ఆయనే,… ఇంతకాలానికి..”

” నా స్వామికి జయం కలుగుగాక ” అనే మాటల నడుమ గొంతు దుఃఖంతో పూడిపోతుంది.

” నువ్వు కనబడినాక ఇక జయం కాక ఏమిటి ?

నా తిరస్కారాన్ని  మన్నించు, మరచిపోయే ప్రయత్నం చేయి. నా మనసుకి  ఆనాడు  ఏమయిందో, ఏ చీకటి కమ్మిందో, ఏ భ్రాంతి ఆవరించిందో…పూమాలని సర్పంలా విసిరివేసుకున్నాను ” అని శకుంతల పాదాల పైన పడతాడు  దుష్యంతుడు.

” లేవండి స్వామీ ! నా ఏ పూర్వజన్మకృత పాపఫలమో అది- ఇంత దయామయులైన మీ హృదయం అప్పుడు కఠినమైపోయింది – అయితే, జ్ఞాపకం వచ్చానా ఇప్పుడు ? ” అని ఇంకా విడని నిష్టురత్వంతో ఆమె ప్రశ్నిస్తుంది.

” నీ కన్నీటిని స్మృతి తప్పిన  ఆ నాడు నిర్లక్ష్యం చేశాను , ఇప్పుడు అదే కన్నీటిని నీ రెప్పలనుంచి తుడిచి వేసి, అప్పుడు- చెబుతాను ”

” స్వామీ, ఈ అంగుళీయకం ? ”

” అవును. దీన్ని తిరిగి పొందుతూనే జ్ఞప్తి వచ్చింది అంతా ”

” ఇది నా స్వామిని ఒప్పించే ప్రయత్నం లో నాకు ద్రోహం చేసింది కదా ”

” కలయికకి గుర్తు గా మళ్ళీ ధరించరాదా, పూవు తిరిగి తీగని చేరినట్లు ? ”

” వద్దు వద్దు. నాకు దీని మీద నమ్మకం పోయింది. మీరే ఉంచుకోండి ”

భార్యాభర్తలు ఇద్దరూ పిల్లవాడితో కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళతారు.

ఆయన ” నీ కుమారుడు ఇంద్రుడికి యుద్ధం లో జయాన్ని కూర్చినది ఇతనే, దుష్యంతుడు. ఇతని ధనుస్సు ముందు ఇంద్రుడి వజ్రాయుధం కేవలం అలంకారప్రాయం ” అని అదితికి రాజును పరిచయం చేస్తాడు.

ఎంత ప్రజాపతీ మోక్షగామీ అయినా కశ్యపుడి మాటలు, ముఖ్యంగా అదితితో దుష్యంతుడి గురించి అన్నవి – తమ కుమారుడైన ఇంద్రుడికి దుష్యంతుడు స్నేహితుడూ సహాయకారీ అన్న నేపథ్యం లో అన్నవిలాగా ఉంటాయి. చివరలో ” మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండండి ” అని మన పిల్లవాడి స్నేహితుడితో మనం అన్నట్లే. ఇది లోకవృత్తాన్ని అనుసరించిన నడక. ఆ ఇంద్రుడు లోకాల క్షేమాన్ని కోరేవాడూ అతని విరోధులు నిర్మూలించదగినవారూ కనుక ఉచితంగానే ఉంటుంది.

ముగ్గురూ ఆ వృద్ధ దంపతులకి నమస్కరిస్తారు.

” అమ్మా, శకుంతలా !నీ భర్త ఇంద్రుడికి సమానమైనవాడు. నీ ఈ కొడుకు జయంతుడే. శచీదేవి వలె చిరకాలం వర్ధిల్లుదువు గాక ! ”

అని కశ్యపుడు అంటాడు -” మీరు ముగ్గురూ- శకుంతల,  సర్వదమనుడు, దుష్యంత మహారజు- వరుసగా , విశ్వాసం, ఆశ [ భవిస్యత్తు ], ఆచరణ [పరాక్రమం ] -వీటికి చిహ్నాలు. మూడూ ఉన్న చోట దేనికి లోటు ? ”

దుష్యంతుడు- ” ముందు పూవు పూసి ఆ తర్వాత పండు అవుతుంది. ముందు మబ్బు పట్టి తర్వాత వర్షం కురుస్తుంది…ఇది కార్యకారణ సంబంధం.  మీ ఆశీస్సుకు ముందే నాకు వెల లేని సంపద లభించింది కదా, ఇంకేమి కావాలి మహర్షీ !

ఈమె మీ వంశీయుడైన కణ్వమహర్షి తో పెంచబడినది.  అంతకు ముందు గాంధర్వవివాహం చేసుకొని ఉండి కూడా నా ఎదటికి వచ్చినప్పుడు విస్మృతి తో నిరాకరించాను. ఈ అంగుళీయకాన్ని చూస్తూనే జ్ఞాపకం వచ్చింది.

ఇది ఎలా ఉందంటే- ఏనుగు కళ్ళముందు నుంచి వెళుతూ ఉంటే గుర్తు పట్టకుండా ఆ తర్వాత దాని అడుగుజాడలు చూసి నిశ్చయించుకున్నట్లుగా. ”

కశ్యపుడు ” చింతించకు రాజా ! అది అలా జరగవలసి ఉంది. ” అని దుర్వాసుడి శాపాన్ని వివరిస్తాడు.

రాజుకి గొప్ప ఉపశమనం కలుగుతుంది  ” అయితే నా తప్పు లేదన్నమాట ! ”

దుష్యంతుడి చేత ఈ ఒక్క మాటా అనిపించటం కోసం పరమ సహృదయుడైన కాళిదాసు ఇంత నాటకం రాశారు.

శకుంతల తనలో ” నా భర్త నిష్కారణంగా నిష్కరుణుడై పోలేదా… ఎంత అదృష్టం ! [ ఆమె ఆనందం అనవలసిన చోట అదృష్టం అంటూ ఉంది. పూర్తిగా విధి చేతిబొమ్మ అయి అదంతా పడిన తర్వాత ఇంకేమనిపిస్తుంది ! ] నాకు శాపమేమీ గుర్తే లేదే…జరిగిందేమో, నేను దుష్యంతుడిని వీడిన వేదన లో గమనించుకోలేదేమో. అంగుళీయకం జాగ్రత్త అని అందుకే నా సఖులు చెప్పారు కదా ఆశ్రమం వదలి వస్తుంటే ”

కశ్యపుడు ” అంతా సవ్యంగా జరిగింది కదా..నీ భర్త మీద కోపం పెట్టుకోకు. దుమ్ము కప్పిన అద్దం లో బొమ్మ కనబడదు, నీ భర్త శాపం ఆవరించి నిన్ను మరచాడు. అద్దం శుభ్రమైన తర్వాత చక్కగా ఉపకరిస్తుంది, ఇప్పుడు ఇక నీ భర్త మీద నీదే అధికారం ” అని బుజ్జగిస్తాడు.

” మీ ఈ కుమారుడు సప్తద్వీప అయిన వసుంధరను మొత్తం గెలుస్తాడు. అతన్ని ఎదిరించగలవారు ఉండరు. అన్నిటినీ అణచివేయగలవాడు కనుక సర్వదమనుడు, రాబోయే కాలం లో అందరినీ రక్షించగలవాడు కనుక భరతుడు అవుతాడు. ”

అదితి ” కణ్వమహర్షి కి ఈ సంగతి చెప్పిపంపవద్దా, పాపం.మేనక అయితే ఇక్కడే ఉంది. ఆయనకీ తన కుమార్తె క్షేమ, విజయ వార్తలు తెలియాలి కదా ” అని స్త్రీ సహజమయిన ఆర్ద్రతతో అడుగుతుంది.

” దివ్యదృష్టి తో ఆయనకు తెలిసే ఉంటుంది. అయినా కబురు పెడతాను ” కశ్యపుడు చెప్పిన తర్వాత దుష్యంతుడు ” ఆయన అందుకే నా పైన [శకుంతలను తిరస్కరించిన వార్త విని ] ఎక్కువ ఆగ్రహించలేదన్నమాట ” అనుకుంటాడు.


కశ్యపుడు దీవిస్తాడు ” మీరంతా మీ నగరానికి వెళ్ళండి. ఇంద్రుడు నీ ప్రజలకోసం పుష్కలంగా వానలు కురిపిస్తాడు. రాజా, నువ్వు యజ్ఞాలతో అతన్ని సంతోషపెట్టు. మీరు ఉభయులూ యుగాల తరబడి  రెండు లోకాల శ్రేయస్సుకూ కారకులు అగుదురుగాక ! ”

దుష్యంతుడు నాటకపు చివరి మాటలుగా కశ్యపుడిని ప్రార్థిస్తూ ఇలా అంటాడు ” రాజులు ఎప్పుడూ ప్రజల క్షేమం కోసం శ్రమించాలి….జ్ఞానం కలిగిన వారి [కవుల ]  వాక్కులకు  గౌరవం లభించాలి…నీలలోహితుడవైన పరమేశ్వరా, నాకు పునర్జన్మ లేకుండాలి ” – ఈ భరతవాక్యం కాళిదాసహృదయమేనని ఊహించవచ్చు.

ఖచ్చితంగా ఆయన జన్మరాహిత్యాన్ని పొందేఉంటారు .

 

[ సమాప్తం ]