అనువాద కథ

అల్లా కోరిక

నవంబర్ 2014

అప్పటిదాకా వెలుగుల్ని వెదజల్లిన చంద్రుడు మబ్బుల చాటుకు పోవడంతో ఆ రాత్రి చీకటిమయంగా మారింది. డోగో ఆకాశం వైపు చూశాడు. కదిలే నల్లని మబ్బులు చంద్రుణ్ని దాచేశాయి. అతడు గొంతును సరి చేసుకుంటూ “ఈ రాత్రికి వర్షం వచ్చేట్టుంది” అన్నాడు తన మిత్రునితో. అతని స్నేహితుడైన సులే త్వరగా జవాబివ్వలేదు. అతడు దృఢమైన శరీరంతో పొడుగ్గా ఉంటాడు. అతని ముఖమూ అతని స్నేహితుని ముఖమూ అజ్ఞానం తాలూకు మూఢత్వపు ముసుగుల్లా వున్నాయి. డోగో లాగా సులే కూడా దొంగతనం చేస్తూ బతుకుతున్నాడు. కొన్ని క్షణాల క్రితం నుండి సులే అలవాటు లేని కుంటి నడక నడుస్తున్నాడు. కొంతసేపైన తర్వాత తన వేలును ఎడమ భుజానికి వేలాడదీసుకున్న కత్తి వైపు చూపిస్తూ, “డ్యూటీ మీద వున్నప్పుడు అట్లాంటి మాటలు అనటం తప్పు” అన్నాడు తనదైన రీతిలో. అతని ఎడమ భుజం మీద యెప్పుడూ లోపల కత్తి వున్న ఒర వొకటి వేలాడుతుంటుంది. అతని స్నేహితుని భుజం మీద కూడా క్రౌర్యానికి చిహ్నమైన అట్లాంటి ఆయుధం ఒకటి వుంటుంది. గొంతులో అసహనం, చిరాకు ధ్వనిస్తుంటే “అలా అనటం తప్పు అని అంత కచ్చితంగా యెట్లా చెప్పగలవు నువ్వు?” అన్నాడు డోగో. డోగో అంటే ఊరి జనాల భాషలో పొడుగు అని అర్థం. కాని విచిత్రంగా ఈ మనిషి బోండా లాగా చాలా లావుగా, పొట్టిగా వుంటాడే తప్ప ఎంతమాత్రం పొడుగ్గా వుండడు. పైన ఆకాశంలో పరుగులు తీస్తున్న మబ్బుల్ని చేత్తో చూపిస్తూ “అటు చూడు. నా జీవితంలో యెన్నో వర్షపు మేఘాల్ని చూశాన్నేను. పైన వున్నవి వర్షించబోయే మేఘాలే” అన్నాడు డోగో.

కొంతసేపటి దాకా వాళ్లు నిశ్శబ్దంగా నడిచారు. ఎర్రగా, మసకగా వెలుగుతున్న నగర వీధిదీపాలు వాళ్ల వెనకాల వంకరటింకర వరుసల్లో ప్రకాశిస్తున్నాయి. అది మధ్యరాత్రి దాటిన సమయం కావటంతో దాదాపు అందరూ ఇళ్లల్లోనే వున్నారు. సుమారు ఒక అర మైలు ముందర వాళ్ల గమ్యస్థానమైన ఒక చిన్న ఊరు వుంది. ఆ వూర్లోని వంకరటింకర వీధుల్లో ఒక్క చిన్న ఎలెక్ట్రిక్ బల్బు కూడా వెలగటం లేదు. ఈ విచారకరమైన వాస్తవం వాళ్ల పనికి సరిగ్గా సరిపోయింది. “నువ్వు అల్లావు కావు కనుక అంత కచ్చితంగా చెప్పలేవు” అన్నాడు సులే.

సులే ఒక కరడుగట్టిన నేరస్థుడు. నేరాలే తన బ్రతుకుతెరువు అని ఒక న్యాయవిచారణలో జడ్జితో చెప్పాడతడు. అందుకు కొంతకాలం పాటు జైలుశిక్షననుభవించాడు. “నీ వంటి నేరస్థులనుండి సమాజానికి రక్షణ కావాలి. నువ్వూ నీ లాంటివాళ్లూ ప్రజల జీవితాలకు, ఆస్తులకు ప్రమాదాన్ని తెస్తారు. కనుక చట్టం ప్రకారం నీకు సరైన శిక్ష పడేలా కోర్టు ఎప్పుడూ జాగ్రత్త పడుతుంది” అన్నాడు జడ్జి. అప్పుడు బోనులో నిటారుగా, నిస్సిగ్గుగా, నిరాసక్తంగా నిల్చున్నాడు సులే. ఎన్నో సార్లు అట్లాంటి మాటల్ని విన్నాడతడు. తర్వాత జడ్జి సులే కళ్లలోకి తీక్ష్ణంగా, తదేకంగా చూశాడు. సులే కూడా తొణుకూబెణుకూ లేకుండా జడ్జి కళ్లల్లోకి అట్లాంటి చూపునే విసిరాడు. అతడు ఎందరో జడ్జిల కళ్లలోకి అలా చూశాడు కనుక అట్లాంటి చూపులు అతణ్ని సులభంగా భయపెట్టలేవు. అంతేకాక ఒక్క అల్లాకు తప్ప సులే ఎవరికీ భయపడడు. జడ్జి తన చుబుకాన్ని ముందుకు తెస్తూ “నేరపు బాట అన్ని వేళలా శిక్షకూ, అవస్థకూ, నిరాశకూ దారి తీస్తుందని ఎప్పుడూ నిదానంగా ఆలోచించవా నువ్వు?  నీ శరీరాన్ని చూస్తే ఏ యితర పని చేసుకోవటానికైనా తగినట్టుగా వుంది. నిజాయితీతో సంపాదించే పని చేయటానికి ఎందుకు ప్రయత్నించవు నువ్వు?” అన్నాడు. సులే తన వెడల్పైన బుజాల్ని ఎగరేస్తూ “నాకు తెలిసిన విధానంలోనే బ్రతుకుతెరువును సాగిస్తాన్నేను. నేను ఎంచుకున్న పని ద్వారానే” అన్నాడు. వెనక్కి ఒరిగి కూర్చున్న జడ్జి  ఆశ్చర్యపడ్డాడు. తర్వాత మరింతగా ప్రయత్నించాలనుకుని, “దొంగతనం మొదలైన నేరాలలో వున్న అపరాధాన్ని గుర్తించలేవా?” అని అడిగాడు. “నా బ్రతుకుతెరువు విధానం నాకు పూర్తి సంతృప్తికరంగా వుంది” అన్నాడు సులే. “సంతృప్తికరంగా వుందా?” అంటూ ఆశ్చర్యాన్ని కనబరచాడు జడ్జి. కోర్టుగదిలో ఒక గుసగుసల కెరటం పాకింది. తన కర్రసుత్తితో టేబులు మీద కొట్టి, ఆ కలకలం ఆగేలా చేశాడు జడ్జి. తర్వాత “చట్టాన్ని అతిక్రమించటం నీకు సంతృప్తికరంగా వుందా?” అన్నాడు. “నాకు వేరే గత్యంతరం లేదు. చట్టం ఒక పెద్ద తలనొప్పి . అది యెప్పుడూ మన పనికి అడ్డు పడుతుంది” అని సమాధానం వచ్చింది.  జడ్జి ఉగ్రరూపం దాలుస్తూ, “పదేపదే అరెస్టు కావడం, జైలుకు పోవటం…. జైలుపక్షిగా వుండటం నీకు సంతృప్తినిస్తుందా?” అన్నాడు. “ప్రతి వృత్తిలో ప్రమాదాలుంటాయి” అని వేదాంత ధోరణిలో జవాబిచ్చాడు సులే. జడ్జి చేతిరుమాలుతో తన ముఖాన్ని తుడుచుకుని, “బాబూ, నువ్వు చట్టాన్ని అతిక్రమించలేవు. అందుకోసం ప్రయత్నిస్తావేమో కాని భగ్నమౌతావు” అన్నాడు. సులే ఏమీ జవాబివ్వకుండా తల వూపాడు. “పెద్ద స్తంభాన్ని ఊపాలని ప్రయత్నించేవాడు తనే ఊగుతాడు తప్ప విజయం సాధించలేడు అనే సామెత ఒకటి వుంది” అంటూ కోపంగా చూశాడు జడ్జి. జడ్జి వైపు దృష్టిని సారించి, “పెద్ద స్తంభం… అంటే చట్టమా? హహ్హ” అన్నాడు సులే. జడ్జి అతనికి మూణ్నెల్ల శిక్ష విధించాడు. “అల్లా కోరిక…” అని సులే బుజాలెగరేశాడు.

మబ్బులు కమ్మిన ఆకాశం మీద ఒక్క క్షణం పాటు విద్యుల్లత జిగేల్మని మెరిసింది. సులే పైకి చూసి “తప్పక వర్షం వచ్చేట్టుంది. కాని వర్షం పడబోతుందని అనకూడదు మనం. మనమంతా కేవలం మానవులం మాత్రమే కనుక, అల్లా తలిస్తే వర్షం పడుతుంది అని మాత్రమే అనాలి” అన్నాడు.  తనకోసం తాను నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం మతానికి చాలా ప్రాధాన్యమిస్తాడు సులే. భవిష్యత్తు గురించి కాని, లేక దేన్ని గురించి కాని ముందుగానే ఊహించి చెప్పటాన్నీ, మొండిగా వుండటాన్నీ నిషేధించింది అతని మతం. అల్లా పట్ల అతనికి నిజమైన భయం వుంది. ప్రతి మనిషీ తన బ్రతుకుతెరువు విధానాన్ని తనే నిర్ణయించుకోవాలనేది అల్లా ఉద్దేశమని సులే గట్టిగా నమ్ముతాడు. అల్లా కొంతమందికి అవసరమైన దానికంటె ఎక్కువ డబ్బు యిస్తాడనీ, చాలా తక్కువ డబ్బున్నవాళ్లు అందులోంచి కొంత తీసుకోవటం కోసమే అలా చేస్తాడనీ బలంగా విశ్వసిస్తాడు సులే. కొన్ని కడుపులు అతిగా నిండిపోయి, మరికొన్ని కడుపులు పూర్తి ఖాళీగా వుండటం అల్లా ఉద్దేశం అసలే కాదు అని సులే అభిప్రాయం.

డోగో హుంకారం లాంటి శబ్దం చేశాడు. అతడు దేశంలోని అన్ని ముఖ్యనగరాల్లో జైలుశిక్షననుభవించాడు. జైలు అన్నది అతనికి సొంతిల్లు వంటి మరో యిల్లైంది. నేరాల్లో తన సహచరుడైన సులే లాగానే డోగో కూడా యెవరికీ భయపడడు. కాని సులే రీతికి విరుద్ధంగా, అతడు యే మతాన్నీ నమ్మడు. ఆత్మరక్షణే అతని మతం. “నువ్వూ నీ మతమూ. అబ్బో , నీ మతం యెంత లాభం చేసింది నీకు!” అన్నాడు వెటకారంగా. సులే జవాబివ్వలేదు. తన మతానికి విరుద్ధంగా వచ్చిన వ్యాఖ్య పట్ల సులేకు మనసులో మంటగా వుందనీ, కాని సులే సంయమనాన్ని కోల్పోతే  మొట్టమొదటగా ఎదుటివాడి తల మీద ఒక్క దెబ్బ వేస్తాడనీ, అదే మొదటి సూచన అనీ డోగోకు తెలుసు. తమ యిద్దరి మధ్య వున్న పరస్పర భాగస్వామ్యానికి ప్రేమ, స్నేహం మొదలైన గొప్ప భావాలతో సంబంధం వున్నట్టు ఆత్మవంచన చేసుకోలేదు ఆ యిద్దరు దొంగలు. ఇద్దరూ జైలుశిక్ష లేని సమయాల్లో కలిసి కార్యకలాపాలు చేయటం వాళ్లకు సౌకర్యంగా వుంటుంది కనుక అలానే చేస్తారు వాళ్లు. ఇద్దరికీ లాభదాయకంగా వున్న భాగస్వామ్యంలో వింతైన నీతినియమాలకు తావు లేదు. విషయాన్ని మార్చుతూ “అది సరే గాని, ఇవ్వాళ దాన్ని కలిశావా?” అని అడిగాడు డోగో. విషయాన్ని మార్చటం సులేకు కోపం వచ్చినందుకు భయపడి కాదు కాని, తన మెదడు గడ్డిచిలుకలా గంతులు వేసింనందుకు. “ఊఁ ఊఁ” అని, తర్వాత యేమీ మాట్లాడలేకపోయాడు సులే. “అంతా ఓకే యేనా?” అన్నాడు డోగో. “లంజా కొడకా” అన్నాడు సులే కోపాన్ని ప్రదర్శించకుండా. “నేనా?” అన్నాడు డోగో సన్నని స్వరంతో. “మనం ఆ లంజ గురించి మాట్లాడుకుంటున్నాం కదా” అని జవాబిచ్చాడు సులే.

ఒక చిన్న నది దగ్గర ఆగారు వాళ్లు. సులే తన చేతులనూ, కాళ్లనూ, నున్నగా గీకిన గుండునూ నీళ్లతో కడుక్కున్నాడు. డోగో వొడ్డు మీద కూర్చుని, ఒక రాయి మీద తన కత్తికి పదును పెట్టుకుంటున్నాడు. “మనమెక్కడికి పోతున్నామో తెలుసా? ఆ ముందరున్న గ్రామానికి” అన్నాడు సులే నోరును పుక్కిలిస్తూ. “ఆ వూళ్లో నీకో ప్రియురాలుందని తెలియదు నాకు” అన్నాడు డోగో. “నేను ఏ ప్రియురాలి దగ్గరికీ వెళ్లటం లేదు. అల్లా దయతలిస్తే కొన్ని చిన్నచిన్న సొమ్ముల్ని వశం చేసుకోవాలని నా ప్రయత్నం” అని జవాబిచ్చాడు సులే.

“అంటే దొంగతనం చేయాలనా?” అని సూచనగా అన్నాడు డోగో.

“ఔను. నువ్వు కూడా దొంగవే. పైగా ఒక లంజాకొడుకువి కూడా” అన్నాడు సులే.

డోగో నిశ్శబ్దంగా కత్తి అంచు పదునును చెయ్యి మీద పరీక్షిస్తూ తల వూపి, “అర్ధరాత్రి వేళ నదిలో కడుక్కోవటం నీ మతాచారమా?” అని అడిగాడు. నదివొడ్డును ఎక్కేదాకా ఆగి, “నది కనిపిస్తే నిన్ను నువ్వు కడుక్కో. ఎందుకంటే నది మళ్లీ యెప్పుడు ఎదురౌతుందనేది పూర్తిగా అల్లా చేతుల్లోనే వుంది” అన్నాడు సులే.  అతడు కొంచెం కుంటుతూ నడిచాడు. డోగో అతని వెనక నడిచాడు.

“ఆమెను లంజ అని యెందుకన్నావు?” అని అడిగాడు డోగో.

“ఎందుకంటే ఆమె అదే కనుక”

“ఏ విధంగా?”

“ఆ కోటునూ నల్లబ్యాగునూ కేవలం పదిహేను షిల్లింగులకే అమ్మానని చెప్పింది. నాకంటే ముందు నువ్వు దాన్ని కలిసి అట్లా చెప్పమని అన్నట్టున్నావు” స్నేహితుని వైపు పక్కకు చూస్తూ అన్నాడు సులే.

“వారం రోజులుగా నేను దాన్ని కలవనే లేదు” అని తన అభ్యంతరాన్ని తెలిపి, “ఆ కోటు బాగానే పాతదైపోయింది. పదిహేను షిల్లింగులు ఫరవా లేదనిపిస్తుంది నాకు. నిజానికి అది దాన్ని చాలా మంచి ధరకే అమ్మింది” అన్నాడు డోగో.

డోగో మాటల్ని నమ్మలేదు సులే. అందుకే “వచ్చిన లాభాన్ని దాంతో పంచుకుని వుంటే నేనూ అట్లానే అనేవాణ్నేమో” అన్నాడు.

డోగో ఏం మాట్లాడలేదు. సులే ఆ మాటల్ని ఉద్దేశపూర్వకంగానే అన్నాడు. ఎందుకంటే అతనికి డోగో పట్ల యెప్పుడూ అనుమానమే. వాళ్లిద్దరికి ఒకరిపట్ల మరొకరికి వున్న అనుమానం కొన్నిసార్లు నిష్కారణమైనదైతే మరి కొన్నిసార్లు సహేతుకమైనది.

డోగో బుజాలెగరేసి, “నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావటం లేదు” అన్నాడు.

“అవును నీకసలే అర్థం కాదని తెలుసు నాకు” అన్నాడు సులే ముభావంగా.

“నాకు కావలసిందల్లా నా వాటా” అన్నాడు డోగో.

“అంటే నీ రెండో వాటానా తండ్రి లేని నా కొడకా? నీకూ ఆ బోకె నోరు దయ్యానికీ ఇద్దరికీ వాటాలు వస్తాయిలే దగాకోరు నా కొడకా” అన్నాడు సులే. కొంచెం ఆగి, “ఆ లంజ నా తొడలో కత్తితో పొడిచింది” అన్నాడు. డోగో కిసుక్కున నవ్వి, “నువ్వెందుకు కుంటుతున్నావా అని అనుకుంటున్నాన్నేను. తొడలో కత్తి దించిందా? అది విచిత్రమైన ఆడది కదా?” అన్నాడు. సులే కొరకొరా చూసి, “అందులో విచిత్రం యేముంది?” అన్నాడు.

“కోటును అమ్మగా వచ్చిన డబ్బును యిమ్మన్నందుకే తొడలో కత్తి దించటం”

“నేను డబ్బు అడిగానా? అడగలేదు. కావాలంటే దాన్నే అడిగి తెలుసుకో. అట్లాంటి రకం ముండల్ని ఏదడిగినా లాభం లేదు”

“అవునా?  నువ్వడిగావనుకున్నాను. నీది కాని ఆ కోటును అమ్మిపెట్టమన్నావు. అది ఎప్పట్నుంచో దొంగవస్తువుల్ని అమ్ముతోంది. ఆ డబ్బు నీకు రావాలని దానికి తెలిసివుండాలి” అన్నాడు డోగో.

“కోటుకూ బ్యాగుకూ కలిపి కేవలం పదిహేను షిల్లింగులే వస్తే మూర్ఖుడు మాత్రమే సంతోషిస్తాడు”

“మరి నువ్వు మూర్ఖునివి కావా? హాహ్హా..” అని నవ్వి, “ఏంచేశావు మరి?” అని అడిగాడు డోగో.

“వీపు విమానం మోత మోగించాను” గరకుతనం నిండిన గొంతుతో అన్నాడు సులే.

“నువ్వు చేసింది సరైనదే. కాని యిక్కడ వచ్చిన చిక్కేమిటంటే, నువ్వు దానికి ఇచ్చిందానికన్న, దాని దగ్గర్నుంచి ఎక్కువే తీసుకున్నట్టున్నావు” అని మళ్లీ నవ్వాడు డోగో.

“సలిపే నా గాయం నీకు జోకై పోయింది” అన్నాడు సులే చిరాకుగా.

“జోక్ చేస్తున్నది యెవరు? నేనూ కొన్ని సార్లు కత్తిపోట్ల పాలయ్యాను. కత్తి పట్టుకుని పోయి మనమే కత్తిపోట్లు తినడం అప్పుడప్పుడు జరిగేదే. అట్లాంటి విషయాల్ని మన వృత్తి సంబంధమైన ప్రమాదాలుగా గుర్తించాలి”

“అవును తప్పక అలానే అనుకోవాలి. కానీ దాంతో గాయం మానదు” గయ్యిమని లేచాడు సులే.

“అది నిజమే. కాని ఆసుపత్రికి పోతే గాయం మానుతుంది” అన్నాడు డోగో.

“ఆ సంగతి నాకు తెలుసు. కాని ట్రీట్ మెంట్ యిచ్చే ముందు వాళ్లు ఎన్నో ప్రశ్నలడుగుతారు”

వాళ్లు వూళ్లోకి ప్రవేశిస్తున్నారు. ఆ వెడల్పైన మార్గం చిన్నచిన్న తోవలుగా చీలి, ముందర వున్న యిళ్ల చుట్టూ అల్లుకుంది. సులే కొంచెం సేపు ఆగి , ఒక చిన్న తోవలో నడిచాడు. చుట్టూ చూస్తూ అడుగుల శబ్దం వినపడకుండా మెల్లగా నడిచారు వాళ్లు. దగ్గరదగ్గరగా వున్న ఆ మట్టియిళ్లలో ఒక్కదాంట్లో కూడా వెల్తురు లేదు. బహుశా తుఫాను వస్తుందని భయపడి ప్రతి చిన్న రంధ్రాన్నీ మూసేసుకుని వుంటారు ఇళ్ల లోపలి వాళ్లు. తూర్పు వైపు నుండి ఒక చిన్న ఉరుము శబ్దం వినపడింది. మేకలు, గొర్రెలు వున్న ఒక మంద వాళ్ల రాకకు ఉలిక్కిపడి తలలెత్తటం తప్ప , దారులన్నీ వాళ్లిద్దరికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా వున్నాయి. మధ్యమధ్య దొంగతనానికి వీలున్న ఇంటి దగ్గర సులే ఆగటం, ఇద్దరూ పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలించటం, సులే తన స్నేహితుని కళ్లలోకి ప్రశ్నార్థకంగా చూడటం, వద్దన్నట్టుగా డోగో తల వూపటం – ఇట్లా ముందుకు సాగుతున్నారు వాళ్లిద్దరు.

దాదాపు ఒక పావుగంట సేపు అలా నడిచింతర్వాత, కళ్లు మిరుమిట్లు గొలిపే ఒక మహా ప్రకాశవంతమైన మెరుపు మెరిసింది. దాంతో వాళ్లు గట్టి నిర్ణయానికి వచ్చారు. “మనం పని తొందరగా ముగించుకోవాలి. తుఫాను వేగంగా వచ్చేస్తోంది” అని గుసగుసగా అన్నాడు డోగో. సులే ఏమీ మాట్లాడలేదు. వాళ్లకు కొన్ని గజాల ముందర ఒక శిథిలమైన యిల్లు వుంది. అక్కడికి నడిచారు వాళ్లు. పాడుబడ్డట్టున్న ఆ యింటి రూపాన్ని చూసి వాళ్లు నిరాశ పడలేదు. బయటికి కనిపించే ఏ యింటి రూపమైనా ఆ యింటిలోపల ఏముందో చెప్పదని వాళ్లకు అనుభవం ద్వారా తెలిసిపోయింది.  ఎందుకంటే దరిద్రం తాండవిస్తున్నట్టుగా కనిపించే కొన్ని మురికి కొంపల్లో విలువైన సొమ్ములు దొరికాయి వాళ్లకు. డోగో అంగీకారంగా తలవూపాడు. “నువ్వు బయట నిలబడి అప్రమత్తంగా వుండు” అని సులే ఒక మూసివున్న కిటికీని తలతో చూపిస్తూ “దాని దగ్గర నిలబడు” అన్నాడు.

డోగో తన స్థానానికి వెళ్లి నిల్చున్నాడు. మొరటుగా వున్న చెక్క తలుపు మీద చెయ్యి వేసి సులే బిజీ అయిపోయాడు. ఎంతో అనుభవమున్న డోగోకు కూడా ఏ చప్పుడూ వినపడలేదు. సులే ఎప్పుడు యింటి లోపలికి పోయాడో కూడా తెలియలేదతనికి. నిజానికి వాళ్ల పని నిమిషాల్లోనే అయిపోవాలి. కాని కిటికీ దగ్గర వున్న డోగోకు చాలా సమయం గడిచినట్టనిపించింది. కిటికీ తలుపు మెల్లగా తెరుచుకోవటం గమనించిన డోగో బిగుసుకుపోయి గోడకు ఆనుకున్నాడు. కాని కండరాలు తేలిన సులే చెయ్యి ఒక పెద్ద సొరకాయ బుర్రతో బయటికి వచ్చింది. దాన్ని అందుకున్న డోగో ఆ బరువుకు ఆశ్చర్యపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆ ప్రాంతంలోని వాళ్లు బ్యాంకుల్లోకంటె సొరకాయ బుర్రల్లోనే ఎక్కువగా ధనముంటుందని నమ్ముతారు. “నది దగ్గరికి” అని తెరిచివున్న కిటికీ గుండా గుసగుసగా అన్నాడు సులే. డోగో అర్థం చేసుకున్నాడు. సొరకాయ బుర్రను తల మీద పెట్టుకుని, నది వైపు త్వరత్వరగా నడిచాడు డోగో. సులే ఆ యింట్లోంచి బయటపడి నది దగ్గర డోగోను కలుసుకుందామనుకున్నాడు.

డోగో ఆ సొరకాయ బుర్రను జాగ్రత్తగా నది దగ్గర పెట్టి, దాని మూత తీశాడు. అందులో సొమ్ములు ఏమైనా వుంటే వాటిని సులేతో సమానంగా పంచుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఆ సొరకాయ బుర్రను కిటికీలోంచి యివ్వకముందే కొంత సొమ్మును సులే కొట్టేయలేదని గ్యారెంటీ యేమిటి – అనుకుని, అతడు తన కుడిచేయిని లోపల పెట్టగానే మణికట్టు మీద యేదో గుచ్చుకున్నట్టైంది. అతడు వెంటనే చేతిని బయటకు తీసి దిగ్భ్రాంతి చెందాడు. మణికట్టును దగ్గరగా పరిశీలించి, మెల్లగా ఒకదాని వెంట ఒకటిగా తిట్ల పరంపరను మొదలెట్టాడు. తనకు తెలిసిన రెండు భాషల్లో స్వర్గం మీదా, నరకం మీదా, విశాల విశ్వంలోని అన్నింటిమీదా శాపనార్థాలు పెట్టాడు. నేల మీద కూర్చుని ముంజేతిని గట్టిగా పట్టుకుని, మెల్లగా తిడుతూనే వున్నాడు. సులే వచ్చి ఆగటం గమనించాడు. బుర్ర మీద మళ్లీ మూతను పెట్టాడు డోగో. సులే దగ్గరికి రాగానే “ఏమైనా యిబ్బంది కలిగిందా?” అని అడిగాడు. “ఏ యిబ్బందీ లేదు” అన్నాడు సులే. ఇద్దరూ కలిసి సొరకాయ బుర్ర మీదికి వంగారు. సులే గమనించకుండా తన కుడి ముంజేయిని ఎడమ చేత్తో పట్టుకున్నాడు డోగో.

“దాన్ని తెరిచావా?” అడిగాడు సులే.

“ఎవరు, నేనా? తెరవలేదు” అన్నాడు డోగో. సులే అతణ్ని నమ్మలేదు.

“అంత బరువుందంటే లోపల ఏం వుండవచ్చు?” అన్నాడు డోగో కుతూహలంగా.

“ఏమో, చూద్దాం” అన్నాడు సులే.

అతడు మూత తెరిచి లోపల చేయి పెట్టాడు. వెంటనే మణికట్టు దగ్గర ఏదో గుచ్చుకున్నట్టైంది. మెరుపువేగంతో చేయిని బయటికి తీశాడు సులే. ఇద్దరూ నిలబడ్డారు. డోగో తన ఎడమ చేత్తో కుడి ముంజేయిని పట్టుకుని వుండటం మొదటిసారిగా చాశాడు సులే. చాలా సేపటిదాకా వాళ్లిద్దరూ మౌనంగా వుండి ఒకరినొకరు గుడ్లప్పగించి చూసుకున్నారు.

“నువ్వెప్పుడూ కోరుకున్నట్టుగా ప్రతిదాన్నీ మనం చెరి సగం పంచుకోవాలి” అన్నాడు డోగో యధాలాపంగా. దాదాపు వినపడనంత తగ్గుస్వరంతో మాట్లాడసాగాడు సులే. తనకు తెలిసిన అన్ని బూతుపదాలనూ విసిరాడు డోగో మీదికి. తనవంతుగా డోగో బాగా ఓర్చుకున్నాడు. ఇక తిట్టవలసిన తిట్లేమీ మిగలకపోవటంతో వాళ్లు ఆగిపోయారు.

“నేను వెళ్తున్నాను” అన్నాడు డోగో.

“ఆగు” అన్నాడు సులే. నొప్పి లేని చేతితో తన జేబులో వెతికి ఒక అగ్గిపెట్టెను బయటికి తీశాడు. ఎంతో కష్టపడుతూ ఒక అగ్గిపుల్లను వెలిగించి, మంటను బుర్ర మూతి మీద వుంచి, లోపలికి తొంగి చూశాడు. అగ్గిపుల్లను పారేసి, “లోపల వున్నది మనకు అవసరం లేదు” అన్నాడు సులే.

“ఎందుకవసరం లేదు?” అడిగాడు డోగో.

“ఎందుకంటే లోపల వొక రెచ్చిపోయిన నాగుపాముంది” అన్నాడు. అతని మణికట్టు భాగం బరువెక్కి , ఆ బాధ వేగంగా పైకి పాకటం మొదలైంది. నొప్పి భరించలేనంతగా వుండటంతో అతడు కింద కూర్చున్నాడు.

“నేనెందుకు ఇంటికి పోవద్దో అర్థం కావటం లేదు నాకు” అన్నాడు డోగో.

“నాగుపాము కుట్టినవాడు ఆ పాము ముందరే చనిపోవాలి అనే సామెతను విన్లేదా నువ్వు? దాని విషం అంత బలంగా వుంటుంది. నీ వంటి పందిముండాకొడుకులకు అది సరైనదే. నువ్వు యిల్లును చేరలేవు. ఇక్కడే చావు. అదే మేలు నీకు” అన్నాడు సులే. డోగో అందుకు ఒప్పుకోలోదు. కాని ఆ విపరీతమైన నొప్పి అతణ్ని కింద కూచునేలా చేసింది.

చాలా నిమిషాల పాటు వాళ్లు మౌనంగా వున్నారు. ఆకాశంలో మెరుపులు నాట్యం చేస్తున్నాయి. చివరకు డోగో అన్నాడిలా: “నువ్వు ఆఖరుసారిగా ఒక పాములు పట్టేవాడి సొరకాయ బుర్రను దొంగతనం చేయటం చిత్రంగా లేదూ”

“అందులో ఒక నాగుపాము వుండటం మరింత చిత్రం” అన్నాడు సులే. అతడు వగరుస్తూ బాధతో మూల్గుతున్నాడు.

“ఈ రాత్రి గడిచే లోపు ఇంకా విచిత్రమైన విషయాలు జరుగుతాయి” అన్నాడు డోగో. తర్వాత “అబ్బా” అని బాధతో మెలి తిరిగాడు.

“ఉదాహరణకు రెండు హాని లేని మరణాలు సంభవిచ్చవచ్చు” అని సూచించాడు సులే. డోగో “ఆ పామును చంపుదామా?” అని ఒక పెద్ద రాయిని తీయటం కోసం లేచి నిలబడాలని ప్రయత్నించాడు. కానీ అది అతనివల్ల కాలేదు. వెల్లకిలా పడుకుని “అబ్బా. చంపకపోయినా ఒరిగే నష్టమేమీ లేదు” అన్నాడు.

చిటపట చినుకుల్తో వర్షం వచ్చింది. “కాని వర్షంలో ఎందుకు చావాలి?” అన్నాడు కోపంగా.

“చచ్చిపోయి నేరుగా నరకానికి వెళ్తే తడితడిగా వుంటామని” అన్నాడు సులే. దవడలు బిగుసుకుపోతుంటే అతడు నొప్పి లేని చేయి సహాయంతో నేల మీద పాకటానికి ప్రయత్నించాడు. కళ్లు మూసుకుని, బుర్రలోపలికి చేయిని పోనిచ్చి కత్తితో చాలా సార్లు కసకసా పొడిచాడు. పాము మెలికలు తిరిగింది. సులే వగరుస్తూనే వున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అతడు నేల మీద పడివున్నప్పుడు అతని ముక్కురంధ్రాల ద్వారా ఈల వంటి శబ్దం వెలువడింది. అతని చేయి పాముకాట్లతో నిండిపోయింది. కాని ఆ పాము చనిపోయింది. “ఆఖరు సారిగా నాట్యమాడింది ఆ పాము” అన్నాడు సులే. డోగో ఏమీ మాట్లాడలేదు.

చాలా క్షణాలు నిశ్శబ్దంలో గడిచాయి. పాము విషం వాళ్లిద్దరి మీదా బలమైన ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా సులే ఎక్కువ విషప్రభావానికి గురయ్యాడు. అతడు బాధతో మూల్గాడు.  మరికొన్ని క్షణాల ప్రశ్నే యిక.

తన ఇంద్రియాలు నిస్తేజమౌతుంటే “నువ్విలా చావబోవటం దయనీయం. మొత్తం మీద నీకు మంచి శాస్తే జరిగింది నీచుడా” అన్నాడు డోగో. “నీ మూలంగా నేను కన్నీళ్లలో తడిసిపోతున్నాను” మాట్లాడలేనంత అలసటతో సాగదీస్తూ అన్నాడు సులే. “ఇక నా పని ముగిసినట్టుగానే వుంది. కాని ఎప్పుడో ఒకసారి ఇట్లా జరగాల్సి వున్నదని మనకు ముందే తెలియాలిరా కుళ్లు లంజా కొడకా” అని దీర్ఘంగా నిట్టూర్చాడు. వణికే చేతుల్తో  తొడ మీది గాయాన్ని తడుముకుంటూ “ఇక రేప్పొద్దున నేను ఆసుత్రికి పోయే అవసరమే లేదు” అన్నాడు గొణిగినట్టుగా. ఆశ వదులుకున్నట్టుగా “అయ్యో. అల్లా అభీష్టం నెరవేరబోతోంది” అన్నాడు. దడదడ శబ్దం చేస్తూ భారీ వర్షం కురిసింది.

 -   *   -

 

ఆంగ్ల మూలం:డేవిడ్ ఒవొయేలే (నైజీరియా)
అనువాదం: ఎలనాగ

(ఈ కథ ‘ఉత్తమ ఆఫ్రికన్ కథలు’ అనే అనువాద పుస్తకంలోనిది. విశాలాంధ్ర పుస్తక ప్రచురణ సంస్థ వారు అచ్చు వేసిన యీ పుస్తకం 01-11-2014 నాడు అబిడ్స్ , హైదరాబాద్ లోని విశాలాంధ్ర బుక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ లో ఆవిష్కరింపబడబోతున్నది. అందరికీ యిదే ఆహ్వానం!)

***