కథ

డీటూర్స్

జనవరి 2015

“పనేరా బ్రెడ్‌కెళ్లి ఓ కప్పు కాఫీ తాగుదామా?” కారు వాషింగ్టన్ డల్లస్ ఎయిర్‌పోర్ట్‌నించీ బయటకు వెడుతున్నప్పుడు అడిగాడు మెహతా. సాయంత్రం అయిదుగంటల ప్రాంతం. అదే ఏడుగంటల తరువాత అయితే ఏదయినా బార్‌కెళ్లి బీర్ తాగుదామనేవాడేమో! సరేనన్నాను.

కారు హైవే ఎక్కిన తరువాత, “వేరార్యూ కమింగ్ ఫ్రం?” అడిగాడు. ” శాన్‌ఫ్రాన్సిస్కో నించీ,” చెప్పాను.

“నైస్ ప్లేస్. డూ యూ గో దేర్ ఆఫెన్?”

“నెలకోసారి – దాదాపుగా!”

“అయితే, హమీర్‌ని తరచుగా కలుస్తూంటారన్నమాట!”

“ట్రై చేస్తుంటాను.”

“ఈసారి కలిశారా?”

“ఏదీ, లాస్ట్ వీకెండేగా వచ్చెళ్లాడు? అందుకని వాడూ పెద్దగా పట్టించుకోలేదు, మొన్నెళ్లి ఇవాళ వస్తున్నాను గనుక వున్న ఒక్క రోజులో నాక్కూడా కుదర్లేదు.”

కాసేపు మా మధ్య మౌనం పెంచిన దూరాన్ని తగ్గిద్దామని, “ఈ రోడ్డుమీద ఎన్ని ట్రాఫిక్ లైట్లుండేవో! ఇప్పుడు అన్ని ఇంటర్సెక్షన్ల దగ్గిరా ఫ్లై ఓవర్లు రావడంవల్ల తొందరగా ఎయిర్‌పోర్టునించీ ఇల్లు చేరగల్గుతున్నాను,” అన్నాను.

“ఎన్ని ఫ్లై ఓవర్లుంటే మాత్రం ఏం లాభం? మనమెళ్లేపక్క ఇప్పుడయితే ట్రాఫిక్ అంత లేదుగానీ పొద్దున్నపూటయితే నత్తనడకే – అదుగో, ఇప్పుడు ఆవైపు వున్నట్లుగా!” అవతలపక్క ఆగివున్న ట్రాఫిక్‌ని చూపిస్తూ అన్నాడు. “పదేళ్ల క్రితం ఈ రోడ్డుతో పరిచయంలేదు. ఇప్పుడు ఏ ట్రాఫిక్ లేన్లో ఎక్కడ ఎలాంటి గుంట వుంటుందో తెలుసు!” ఆ గొంతులో అది గర్వంకాదు. రేడియో వార్తలు చదివేవాళ్ల గొంతులో స్టేట్‌మెంట్ ఆఫ్ ఫాక్ట్ చెబుతున్నప్పుడుండే తటస్థత – అది బాంబు పేలుడువల్ల యాభైమంది పోయారన్నా లేక వరల్డ్‌కప్ క్రికెట్లో ఇండియా గెలిచిందన్నా ఒకేలా వుంటుంది.

ఆ గొంతుని బాగా అనుకరించేవాడు నా హైస్కూల్ క్లాస్‌మేట్ విక్రం. “పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి గుడిముందు దోసెలు వేసుకుంటూనయినా తేలిగ్గా బతకవచ్చని ఈ మధ్యనే అమెరికా వెళ్లివచ్చిన సుబ్బారావుగారు తెలియజేశారు,” అన్నాడు వాడు నేను పైచదువులకని అమెరికాకి వచ్చేముందర.

“నేను అమెరికా రావడమే గ్రీన్‌కార్డ్‌తో వచ్చాను. అయినా, చిన్నచిన్న వుద్యోగాలతోనే మొదలుపెట్టింది – గాస్‌స్టేషన్లో క్లర్కుగా, బార్ల దగ్గర కార్లు పార్క్‌చేసే valetగా, వాటి మధ్యలో బాచెలర్స్ డిగ్రీ,” గతాన్ని గుర్తుచేసుకుంటూ అన్నాడు మెహతా.

అది కనీసం నలభయ్యేళ్ల గతమయ్యుండాలి. నాకు మాత్రం లాస్ట్ వీకెండ్ గతం గుర్తొచ్చింది. అదే, మెహతావాళ్లింట్లో – మెహతా, అల్కా, ప్రియాంక, హమీర్, శ్రీవిద్య, నేను  - చేతులు కలుపుదామని నిశ్చయించుకున్న ఇద్దరు మిగిలిన నలుగురినీ చేతులు కలుపుకొండని సున్నితంగా నిర్దేశించినప్పటిది.

***

“తెలుగువాళ్లమ్మాయి కోడలుగా రావాలనుకున్నాను,” అన్నది శ్రీవిద్య, మెహతావాళ్లింట్లో డిన్నర్‌చేసి ఇంటికొచ్చిన తరువాత, నిద్రపోయేముందర, గొంతులో నిరాశని గూడుకట్టించి.

“ఆ అమ్మాయి తెలుగులో మాట్లాడాలనికూడా ఆశపడ్డావేమిటి?” ఉడికించాలని అనకపోయినా తను అలాగే అనుకుంది. నా ఛాతీమీద ఆనించిన తలని చివ్వున పైకెత్తి, “అనుకుంటే తప్పేంటిట?” అనడిగింది.

“తప్పనికాదు. వీడే తెలుగులో మాట్లాడనప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుందని ఆశపడడంలో అర్థంలేదనిపించింది. అంతే!”

కాసేపు ఇద్దరం మౌనంగా వున్న తరువాత, “ప్రియాంక – పేరు బావుందికదా!” అన్నాను.

“పేరు బావుందిగానీ, వీడికి దొరక్క దొరక్క ఒక నర్సే దొరికిందా? తెలుగువాళ్లే కానక్ఖర్లేదనుకుంటే ఇండియన్లలోనే ఎంతమంది డాక్టర్లు దొరకరు? కోడలు ఒక నర్సమ్మ అని ఏ మొహం పెట్టుకుని చెప్పుకోవాలి?”

నా ఛాతీమీద తడి తగిలింది. సామ, దాన, భేద, దండోపాయాలతో పిల్లల మెడలు వంచగలిగే దేశంగానీ కాలంగానీ కాదిది. “నాకుమాత్రం, డబ్బులు కొంతయినా సేవ్‌చేశాడు. ఏ తెల్లమ్మాయినో చేసుకొస్తే రెండురకాల పెళ్లిళ్లకి ఖర్చుపెట్టాల్సొచ్చేది!”

“ఆ పరిస్థితి రాకూడదని ఎప్పటినించో మొక్కుకుంటున్నాను. ఈసారి ఇండియా వెళ్లినప్పుడు తిరపతి వెళ్లి ఆ మొక్కు తీర్చుకోవాలి!”

“ఇంతకీ, మెహతావాళ్లెలా అనిపించారు నీకు?”

“బాగానే మాట్లాడారు. కానీ, అల్కా మేకప్పూ, ఆ మగవాళ్లలాగా క్రాఫూ – నాకు నచ్చలేదు.”

“నీకు నచ్చేలా పొడుగు జడా, చేతులకి గాజులూ, మొహాన డాలరుబిళ్లంత బొట్టూ, వళ్లంత వయ్యారికోక, కాళ్లకు పారాణి – ఈ హంగులతో రియాల్టర్లని ఊహించుకోవడం కష్టంగావుంది. నాకే అలావుంటే, పాపం, మిగతావాళ్ల మాటేంటి? ఇంక ఆవిడ డబ్బులు చేసుకున్నట్టే! బిజినెస్ కార్డ్‌మీద ఫోటో చూశావా? సూట్ వేసుకుని వున్నది.”

“ఆయన రిటయిరయ్యాట్ట గదా! మరి పెళ్లి చెయ్యాలంటే ఆవిడ సంపాదించే డబ్బులమీద ఆధారపడాలి గామోసు.”

ఆ అమాయకతకి నవ్వబోయి ఆపేశాను. “రిటయిరయింది ప్రభుత్వ ఉద్యోగంనించీ కదా! పెన్షన్ వస్తుంది. ఇంక ఆవిడ సంపాదన కేకుమీద ఐసింగ్ లాంటిది.  ఆ ఇల్లుచూస్తే తెలియలా, ఆస్తిపాస్తు లెంతుంటాయో?”

“ఇద్దరు కొడుకులూ డాక్టర్లయినప్పుడు ఈ పిల్లని మెడిసిన్ చదివించకపోవడమే ఆశ్చర్యం!”

“వాళ్లనయితే, జమైకాకి పంపి చదివించారు. అమ్మాయి కాబట్టి దేశం బయటికి పంపద్దనుకున్నారేమో!”

“కొడుకుల చదువులకి అంత ఖర్చు పెట్టినవాళ్లు కూతురికి మాత్రం ఏం చెయ్యకుండా తప్పించుకున్నారు.”

“వాళ్లని లోన్లు తీసుకుని చదివించి వుంటారు. అయినా నర్సింగ్ కోర్సుకూడా అంత చవకేమీ కాదు.”

“ఆ ఇద్దరి పెళ్లిళ్ల ఫోటోలు చూపించారుగా! పెళ్లి ఘనంగా చెయ్యాలని చెబ్దాం!”

“బారాత్‌కి ఏనుగు సవారీ కావాలని చెబుదామా?”

“తప్పకుండా.  లేకపోతే, ‘డూ యూ వర్క్?’ అనడిగి, ‘నో’ అని చెప్పిన తరువాత, ‘పనిచేసి రిటరయ్యావా? అసలెప్పుడూ పనిచెయ్యలేదా?’ అంటూ కూపీలాగడా లెందుకుటా?”

“మొదటిసారి కలిసినప్పుడు అంతకంటే ఏం మాట్లాడగలరు, ఎవరయినా? మీకు పిల్లలెంతమంది? ఏంచేస్తున్నారు? మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు? అమెరికాకి వచ్చినప్పట్నించీ ఇక్కడే వున్నారా? ఇవేగా అడిగేది? మనం పాతికేళ్లనించీ ఎవరిని మొదటిసారి కలిసినా జరిగిందదే.”

“మీరెన్నయినా చెప్పండి. డాక్టర్ని అల్లుడిగా కొట్టేస్తోంది. వియ్యపురాలి కివ్వాల్సిన గౌరవం ఆవిడ మాటల్లో నాక్కనిపించలేదు. అయినా ఆవిణ్ణని ప్రయోజనమేముంది? ‘మీ పాలక్ పన్నీర్ బావుంది ఆంటీ’ అంటూ లొట్టలేసుకు తిన్న వీణ్ణనాలి. అందులో ఉప్పు తక్కువ కాదూ?” సరయిన జవాబేదో నాకు తెలియదేంటి? అవునన్నాను.

“అంతటితో ఆగాడా? ‘ప్రియా కూడా బాగా చేస్తుందాంటీ!’ అన్నాడు. నేనిన్నాళ్లూ చేసిపెట్టిన పాలక్ పన్నీర్ రుచీ గంగలో కలిసిపోయింది. అక్కడ ఒక్ఖసారయినా దాన్ని గుర్తుచేసుకున్నాడా?”

” నీ వంట వంటబట్టే వాడికి రుచులేవో తెలిశాయనుకుంటే బ్రహ్మాండంగా గుర్తుచేసుకున్నట్లే! కోడలికి వంట వచ్చంటే వాడి తిండిగూర్చిన నీ కన్సర్న్ తొలగిపోయిందని సంతోషపడు.”

“ఆ పడతాను. ఎందుకు పడనూ? ఇంకా పెళ్లే కాలేదు, అప్పుడే కొంగున ముడేసుకుంది.”

“అవునూ, చీరెకు కొంగుంటుంది. దుప్పట్టాకి కూడా కొంగున్నట్టేనా?”

“అన్నీ చిరాకు పుట్టించే ప్రశ్నలే. ఇంక నిద్రపోండి. నిద్రపొయ్యేటప్పుడు కూడా ప్రశాంతంగా వుండనివ్వరు,” అని అవతలివైపు తిరిగిపడుకుంది. నాకు వెంటనే నిద్రపట్టేసింది గానీ, తను మాత్రం పక్కమీద అటూ ఇటూ కదుల్తూ సరిగ్గా నిద్రపోవట్లేదని రాత్రంతా గుర్తుచేస్తూనేవుంది. నిద్రపోయే ముందేగాక అలా మెలకువ వచ్చినప్పుడల్లా, విక్రం మెహతా గూర్చే ఆలోచించాను.  ఆ పేరెందుకో పరిచితమే ననిపించింది కానీ, మొహం అంతగా పరిచయమున్నట్టు లేనందువల్ల ఎక్కడ చూశానో ఎంత కొట్టుకున్నా గుర్తు రాలేదు.

***

‘పనేరా బ్రెడ్’లో రెండు కేకుముక్కలూ, కాఫీలూ పట్టుకుని ఒక టేబుల్ దగ్గరకు చేరాం నేనూ, మెహతా. ఎక్కువ జనంలేరు.

“ఈ టైంలో ఇక్కడ అంతగా జనం వుండరు. అదే స్టార్‌బక్స్‌లో అయితే – చిన్న షాపులూ, వైఫైలు ఉపయోగిస్తూ దాదాపు ప్రతీ టేబుల్నీ ఆక్యుపై చేస్తూ జనాలూను. అందుకే కొంచెం దూరమయినా ఇక్కడికి – ” అన్నాడు మెహతా.

“అన్నట్టు మర్చిపోయాను. శ్రీకి ఫోన్‌చేసి చెప్పాలి. ఇంటికి రావడం కొంచెం ఆలస్యమవుతోందని. ఫ్లైట్ దిగ్గానే టెక్స్ట్ మెసేజ్ పంపాను. ఇంకా రాలేదేమిటా అని అనుకుంటుంది,” అని మెహతాకి చెప్పి ఇంటికి ఫోన్ చేశాను.

“మెహతా గారు – అదే విక్రం మెహతా గారు, నేను కలిసి కాఫీ తాగడానికొచ్చాం. కొద్దిగా ఆలస్యమవుతుంది ఇంటికి చేరడానికి.”

“ఆయన మీకు ఫ్లయిట్‌లో కలిశారా?”

“అహఁ. ఎయిర్‌పోర్ట్ దగ్గర.”

“దగ్గరేమిటి? ఆ చుట్టుపక్కల మూడు మైళ్ల దూరంలో ఇళ్లే లేవు. హైవే పక్కన నడుస్తూ కనిపించారేంటి?”

“నీ వ్యంగ్యాన్ని కాసేపు కట్టిపెట్టు. ఎయిర్‌పోర్టు ముందు కనిపించారు. సరేనా?”

“ఎవర్నయినా డ్రాప్ చెయ్యడానికి వచ్చారా? లేక, మీరొస్తున్నారని కాబోయే కోడలు పికప్ చేసుకోవడానికి ఆయన్ని పంపించిందా?”

“మరీ వింతగా మాట్లాడకు. మనముండేది ఎయిర్‌పోర్టుకి పదిమైళ్ల దూరంలో. వాళ్లుండేది అరవై మైళ్ల దూరంలో. అంతదూరంనించీ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారంటావా?”

“ఇప్పుడొచ్చారుగదా!”

“నాతో మాట్లాడ్డానికి మీకెప్పుడు ఓపికుంటుంది గనుక! మీ యిష్టమొచ్చినప్పుడు రండి.” అని ఫోన్ పెట్టేసింది.”నీతో వాదించడానికి నాకు ఓపికలేదు గానీ, ఇంటికి వచ్చిన తరువాత చెప్తాన్లే.”

“ఇక్కడ యాభైమైళ్ల దూరంలో వుంటూ పెరిగిన ఇద్దరు పిల్లలు రెండువేల మైళ్ల దూరానికి వెళ్లిన తరువాతగానీ కలుసుకోకపోవడం వింతగాదూ? అదిగూడా ఒకే హాస్పిటల్లో పనిచేస్తూ!” అని కేకు ముక్కని నోట్లో పెట్టుకున్నాను.

“ఐ యాం రియల్లీ లక్కీ. మా ఫ్యామిలీలో ముగ్గురు డాక్టర్లు!” అన్నాడు మెహతా. “ఆరుగురుంటా రనుకున్నాను – కోడళ్లనీ, అల్లుణ్ణీ కలిపి. ఒకడు సోషియాలజీ మేజర్నీ, ఇంకొకడు ఆర్ట్ మేజర్నీ చేసుకున్నారు. హైస్కూల్లో జూనియర్ యియర్లో వున్నప్పుడు ప్రియా గ్రేడ్లని పాడుచేసుకోకుండా వుంటే – ” అని ఆగాడు. “హైస్కూల్లో మొదటి రెండేళ్లూ ఏ గ్రేడ్లు తెచ్చుకోవడంవల్ల జూనియర్ యియర్లోకూడా అలాగే చదువుతోందని అనుకున్నాం.  స్కూల్ యియర్ అయిన తరువాత కానీ కళ్లు తెరవలేదు.  గ్రేడ్లని పాడు చేసుకుందని దానిమీద అరిచాం. ఎందుకు పాడుచేసుకుందో తెలుసుకునేసరికి టూ లేట్. దట్స్ నాట్ రైట్. ఈ దేశంలో ఇట్స్ నాట్ టూ లేట్ ఫర్ ఎనీథింగ్. యాభయ్యేళ్లకి డాక్టరయినవాళ్లు కూడా వున్నారు.” అని కాఫీ ఓ సిప్ తీసుకున్నాడు.

“యూ సెడ్ యు కేం హియర్ థర్టీ యియర్స్ బాక్. డిడ్ యూ ఇన్వెస్ట్ ఇన్ రియలెస్టేట్? ఐ యాం నాట్ ట్రైయింగ్ టు ఇంటరాగేట్ యు. జస్ట్ యాజ్ యాన్ ఇంట్రడక్షన్ టు వాట్ అయాం గోయింగ్ టు సే,” అన్నాడు మెహతా.

“ఇల్లు కొన్నప్పుడూ, కొన్న తరువాతా కూడా అడ్వంచరే అయింది,” అన్నాను మరీ తిన్నగా జవాబు చెప్పకుండా. కొనేముందర పెన్నీ, పెన్నీ కూడబెట్టాల్సొచ్చింది డౌన్ పేమెంట్‌కోసం. కొన్న పదేళ్ల తరువాత రెండేళ్లపాటు కష్టపడాల్సొచ్చింది మోర్ట్‌గేజ్ పేమెంట్లని  కట్టడానికి. ఆ రెండవదే, గాయం మానిన తరువాత మిగిల్చే గుర్తులాంటిది.  నెప్పి మరుగునపడిపోతుంది గానీ, మచ్చ కనిపిస్తూనే వుంటుంది.  అంత వివరణ నివ్వడం ఇప్పుడు అవసర మనిపించలేదు.

“అబ్బాయి లిద్దరినీ మెడిసిన్ చదివించడానికి నేను సేవ్ చేసిన డబ్బులు ఏమాత్రం సరిపోలేదు – మీకు తెలియందేముంది? ఆ కాలంలో ఇద్దరికీ కలిపి నాలుగు లక్షలయింది. దానికి లోన్లు తీసుకున్నాం. అయితే, వాళ్లకి చదువు చెప్పించడం నా బాధ్యత అనుకుని ఆ అప్పుల్ని నేను తీరుస్తా నన్నాను. 2002లో ఇళ్ల ధరలు పెరగడంచూసి, అల్కా రియలెస్టేట్లో ఇన్వెస్ట్ చెయ్యమంది. ఉన్న యింటిమీద అప్పుతీసుకుని ఒక టౌన్‌హౌస్ కొని అద్దెకిచ్చాం. ఒక ఏడాది తిరిగేసరికి దాని ధర లక్ష పెరిగింది. అప్పటికి మా ఆవిడ రియాల్టర్ లైసెన్స్ సంపాదించింది. ఆవిడ సంపాదన కూడా తోడవుతోందిగదా అని ఈసారి సింగిల్ ఫ్యామిలీ హౌస్ కొన్నాం. అనుకున్నట్లుగానే సంవత్సరం కూడా తిరక్కుండానే ఈ యింటిమీద లక్ష డాలర్లు లాభం – కాగితంమీద.

“మాక్కూడా కొత్త యిల్లు కొనాలని దురదపుట్టి 2005లో ఇప్పుడున్న ఇల్లు కట్టించుకున్నాం. అది కట్టడం పూర్తయి 2006లో ఆ యింట్లో చేరేసరికి మా పోర్ట్‌ఫోలియోలో ఆరు యిళ్లు. కాగితంమీద అయిదు లక్షల డాలర్ల లాభం. గవర్నమెంట్లో ముఫ్ఫయ్యేళ్ల సర్వీసుంది గనుక యాభయ్యయిదేళ్లకే ఆ సంవత్సరంలోనే రిటరయ్యాను. పెన్షన్ ఎలాగా వస్తుంది. అల్కాకి కమీషన్లు బాగానే వున్నాయి గనుక కాలిమీద కాలేసుకుని కూర్చోవాలని ప్లాన్.”

పదేళ్ల క్రితం సంగతి. నాకూ బాగానే గుర్తుంది. అది ఇళ్లు వాటంతట అవే అమ్ముడు పోతున్న కాలం. కొన్ని ఇళ్లయితే, మార్కెట్లోకి వచ్చేముందరే అమ్ముడు పోయాయి – అడిగిన ధరకంటే ఎక్కువ ఇచ్చే కొనుగోలుదార్లు పోటీ పడి దాదాపు వేలం పాట పాడడంతో. ఒక ఇల్లు అమ్మిపెడితే వచ్చే కమీషన్ 3 శాతం. హాఫ్ ఎ మిలియన్ డాలర్ల ఇల్లు అమ్మితే చులాగ్గా పదిహేనువేల కమిషన్. రియాల్టర్ చెయ్యి పట్టుకుంటేనే గానీ ఇల్లు కొనడం జరగదని అనుకుని చాలామంది బయ్యర్లు ఒక మూడు శాతం కమీషన్ని బయ్యర్ రియాల్టర్‌కి ముట్టచెప్పారు. ఈ కమీషన్ల వ్యవహారం ఎప్పుడూ వున్నా గానీ, ఇళ్ల ధరలు రాకెట్లలా ఆకాశంలోకి దూసుకుపోతున్న సమయంలో, ఇంతకన్నా ధరలు పెరిగిపోతయ్యని భయపడి పోటీలు పడి కొనుక్కునేవాళ్లవల్ల అమ్మకాలు విపరీతంగా వుండడంవల్ల అధికంగా లాభపడ్డవాళ్లల్లో రియాల్టర్లనీ, లోన్లని ఇప్పించి కమీషన్లని పొందేవాళ్లనీ ముఖ్యులుగా చెప్పుకోవాలి.

“2006లో కొత్త యింట్లోకి మూవ్ అయిన తరువాత రియలెస్టేట్ మార్కెట్ పడిపోవడం మొదలుపెడితే, వున్నవాటిల్లో కొన్నింటినయినా  అమ్ముండాల్సింది.  రాబోయేది హర్రికేన్ అని తెలియక ఆలస్యం చేశాం. బిల్డరే మిలియన్ డాలర్లకి కొత్త ఇళ్లని అమ్ముతున్నచోట ధరలెందుకు పడతయ్ అన్న ధీమా! అయితే, అట్లాంటిచోటే, మోర్ట్‌గేజ్ కట్టలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయిగదా, లోన్ అమవుంట్ తగ్గించండి అని అడిగినవాళ్ల దగ్గర,  ’మొత్తం లోన్ అమౌంట్ కట్టాల్సిందే!’ నని మొదట బెట్టుచేసిన బ్యాంకులు ఒక ఏడాదయ్యేసరికి ఫోర్‌క్లోజర్లు జరపడమూ, లోన్ తీసుకున్నవాళ్లు ఇంటి తాళాలని బ్యాంకులకిస్తే వాళ్లు ఇళ్లని సగంధరకే అమ్మి నష్టాలని లెడ్జర్లల్లో రాసుకోవడమూ జరుగుతున్న సమయంలో, మాక్కూడా ఆ దారిన వెళ్లడం తప్పలేదు. ఇళ్లకి అద్దెలు వస్తున్నయ్‌గానీ, అవ్వి లోను కట్టడానికి సరిపోక, ఒక్కో ఇంటికీ చేతిలోంచే నెలకి వెయ్యినించీ రెండువేలదాకా పడుతున్నయ్. మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదు. సంవత్సరానికి దాదాపు యాభైవేలడాలర్లని ఆ యిళ్లకోసం పెట్టి, మూడు, నాలుగు సంవత్సరాల తరువాత అంత తక్కువధరకే అమ్మాల్సొస్తే రెంటికి చెడ్డ రేవడవుతుందని – నష్టాలకే ఆ యిళ్లని వదిలించుకున్నాం. సేవింగ్సన్నీ తుడిచిపెట్టుకునిపోయెయ్. అల్కాకొచ్చే బిజినెస్ డ్రాస్టిక్‌గా పడిపోయింది. నాకు వేరే ఉద్యోగాలేవీ దొరకలేదు. 2006 – 2007 ప్రాంతం – ఒక ఏడాది చాలా గడ్డు కాలం. ఉన్న యింటికి మోర్ట్‌గేజ్ కట్టాలిగదా! అదిగో, అప్పటినించీ – ఇదుగో, ఇదీ!”

అమెరికాకి వచ్చిన కొన్నేళ్లకి పెళ్లిచేసుకోవడానికి ఇండియా వెళ్లినప్పుడు, “ఒరేయ్, వీడు అక్కడ ఉద్యోగం ఏమయినా చేస్తున్నాడంటావా, లేక దోసెలు పోసుకుని బతుకుతున్నాడంటావా?” అని విక్రం నన్ను ఆటపట్టించడం గుర్తొచ్చింది.

“ఆ సమయంలోనే పెద్దవాడి పెళ్లి. అప్పుడే ప్రియ హైస్కూల్లో జూనియర్.  ఆ ఏడాది గ్రేడ్లు చాలా ముఖ్యం – కాలేజీలకి అప్లై చెయ్యడానికి. చెప్పాగా, ఆ గ్రేడ్లని ఎంత నాశనం చేసుకుందో ఆ ఏడాది చివరిదాకా తెలియలేదని! ‘ఎందుకే, నువ్వుకూడా మమ్మల్ని చంపుకు తింటున్నావ్?’ అని దానిమీద అరిచానుకూడా. అప్పుడు నాకు జవాబు చెప్పలేదుగానీ, ఈమధ్యనే, అల్కా దాని జర్నల్ చదివింది. అందులో, ‘అన్నయ్యల చదువులకే లోన్లు తీర్చాలి. ఇప్పుడు ఈ ఇళ్లమీద నష్టాలు. గ్రేడ్లు బాగా వస్తే నాన్నకి నన్ను మెడిసిన్ చదివించే శక్తి ఎక్కడ వుంటుంది?’ అని వున్నదట అందులో!” అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.

ఈకాలంలో మెడికల్ ప్రోగ్రాంకి – డైరెక్ట్ అయితే, సంవత్సరానికి దాదాపు ఎనభైవేల చొప్పున ఆరేళ్లపాటు. కాదు, నాలుగు + నాలుగయితే, మొదటి నాలుగేళ్లూ ఇరవైనించీ ముఫ్ఫై వేలదాకా, చివరి నాలుగూ అరవైనించీ ఎనభైవేలదాకా – ఖరీదయిన వ్యవహారమే.

“విచారకరమయిన విషయమేమిటంటే, అటు కొడుకుల చదువులకై చేసిన అప్పులు తీర్చలేకపోయాను, ఇటు కూతురి భవిష్యత్తుమీద దెబ్బ కొట్టాను. బట్, అయాం ప్రౌడ్ ఆఫ్ మై డాటర్!” అన్నాడు మెహతా. “మెడికల్ ఫీల్డ్లో వుండడంకోసమే నర్స్ కోర్సులు చేసింది. అలాగని ఆ కోర్సేదో పెన్నీ ఖర్చు లేకుండా అయ్యిందని అనుకునేరు! దానికీ లోను తీసికోవాల్సొచ్చింది. చిన్నతనం. ఐ నో, ఐ నో అంటూ అలా చేసుకుంది. నాతో ఒక్కమా

ట అనుంటే అలా అయ్యేదికాదు.”

అలా హృదయం విప్పి చెప్పిన తరువాత నా రియాక్షన్ ఎలా వుంటుందని అనుకొన్నాడో తెలియదు. “వెధవ! ప్రేమ పెళ్లని అఘోరించబట్టి సరిపోయిందిగానీ, లేకపోతేనా, …” అని నేను మనసులో తిట్టుకోవడాన్ని మాత్రం తేలిగ్గానే ఊహించవచ్చు. నా మొహంలో రంగులు మారడం అది ఊహ మాత్రమే కాదనేటందుకు నిరూపణ నివ్వవచ్చు. ఆ ఊహకి, “వాళ్లు నిన్ను మోసపుచ్చార్రా, ఇప్పుడేం మించిపోయిందనీ, బంగారంలాంటి డాక్టర్ల సంబంధాలెన్ని లేవు? నువ్వు ఊ అను, చాలు!” అని శ్రీ వాడికి నచ్చజెప్పబోవటాన్ని జతపరచవచ్చు”నువ్వతనికి అన్నీ చెప్పావా?” అని డెఫినిట్గా కూతుర్ని అడిగేవుంటాడు. “చెప్పాను. ఇది హమీర్కి ప్రాబ్లమేం కాదు,” అని ప్రియా చెప్పేవుంటుంది. కానీ, ఈ పెద్దవాళ్లని చూస్తేనే – వాళ్లకికూడా సమస్యలేం కాకుండేటట్లుగా – కూతురికి ఆమె కావాలనుకొన్న వ్యక్తి దొరికినప్పుడు ఈ పది సంవత్సరాల కాలాన్ని వెనక్కి తిప్పి తప్పులు సరిచేసుకొనే అవకాశం రావాలని ఏ తండ్రి కోరుకోడు?

నా జీవితంలో కష్టపడ్డ ఆ రెండేళ్లూ కళ్లముందు మెదిలాయి. “అయాం ప్రౌడ్ ఆఫ్ మై డాటర్-ఇన్-లా – అదే, వుడ్ బి,” అన్నాను టేబుల్మీద అతని చేతిని నా గుప్పెటలో మూస్తూ. “థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్, ఇంటికెళ్లి మా ఆవిడతో దీన్ని షేర్ చేసుకున్న తరువాత ఫోన్ చేస్తాను,” అని అంటాననీ, చెయ్యగలిగిందేమీ లేదు గనుక, పెళ్లయేదాకానూ, ఆ తరువాతా కూడా బిగదీసుకుని ఉంటాననీ అనుకునుంటాడుగానీ ఇంత పాజిటివ్ రియాక్షన్ని ఊహించివుండడు. “అండ్, ఐ విల్ టెల్యూ దట్ యూ ఆర్ లక్కీ టు హావ్ హమీర్ టూ!”

దాంతో మెహతా గుండెలమీద భారం తొలగినట్లయింది. “హమీర్ అన్న పేరు విని, అతడుకూడా నార్త్ఇండియన్ అనుకున్నాను,” అన్నాడు కొంచెం నవ్వడానికి ప్రయత్నిస్తూ.

“అది నాకిష్టమయిన రాగం పేరు.  ఇన్ 2000, వెన్ యూ థాట్ యూ వర్ కోస్టింగ్ టు ఎ గ్రేట్ లైఫ్ – సో వజ్ ఐ. ఒక సివిల్ ఇంజనీరింగ్ ఫర్మ్ లో మంచి పొజిషన్లో వున్నవాణ్ణి. యు రిమెంబర్ ద టైం ఆఫ్టర్ వై2కె! దేర్ వజ్ ఎ రిసెషన్. మా కంపెనీ నాకు ఉద్యోగం లేదంది. వేరే ఉద్యోగమేదీ దొరక్క ఏడాదిపాటు ఇంట్లో కూర్చున్నాను, ఉన్న సేవింగ్స్‌ని పొదుపుగా తింటూ. ఆ సమయంలో నన్ను సాఫ్ట్‌వేర్‌లో ట్రైన్ చేసుకున్నాను. ఇంకో ఏడాదిపాటు చిన్నచిన్న ఉద్యోగాలు చేశాను. అదికూడా అప్పుడప్పుడూ మాత్రమే. ఫుల్‌టైం ఉద్యోగం రావడానికి ఇంకో ఏడాది పట్టింది. ఆ రెండేళ్లల్లోనూ హమీర్ హైస్కూల్లో వున్నాడు. మ్యూజిక్ కాంప్స్, అవుటాఫ్ టవున్ ట్రిప్స్ – వేటికీ వెళ్లనన్నాడు. ప్రతీదానికీ నాలుగయిదొందలు అవుతుంది మరి! నేనే పోరి పంపించాను. మరీ శక్తిలేకపోతే అప్పుడే చెబుతాన్లే అని. వాడు కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా ఏవో ఉద్యోగాలు చేస్తూనే వచ్చాడు.  పొదుపుగానే ఖర్చుపెట్టాడు. హి హాజ్ నాట్ ఫర్గాటెన్ దోజ్ టు యియర్స్.  ప్రియాంక, హమీర్ ఒకళ్లనొకళ్లు కలుసుకున్నందుకు సంతోషించాలి. ఇష్టపడ్డందుకు గర్వించాలి!” అన్నాను.

***

ఇంటిదగ్గర కారు దిగిన తరువాత నా కేరీ-ఆన్‌ని నా కందిస్తూ, “ఇంతకుముందు ఇక్కడికి వచ్చేవుంటాను. గుర్తులేదు. క్రితంవారంనించీ ఈ విషయాన్ని మీకెలా చెప్పాలా అని నేనూ, అల్కా తర్జనభర్జనలు పడుతూనేవున్నాం. పోనీ, మానేస్తా నన్నాను. ‘పెళ్లెలా చేస్తాం?’ అన్నది అల్క. దేవుడే ఇలా అవకాశమిచ్చాడు,” అన్నాడు మెహతా.

“వచ్చే శనివారం సాయంత్రం మీకు వీలయితే మా యింటికి ఆహ్వానిద్దామనుకున్నాం. కాల్ చేసి కన్‌ఫర్మ్ చేస్తాను,” అన్నాను అతనికి షేక్‌హాండిస్తూ.ఇంట్లోకెళ్లిన తరువాత, “మెహతా దింపారా మిమ్మల్ని?” అడిగింది శ్రీవిద్య. అవునన్నాను. “మరి లోపలికి తీసుకు రాలేదేం?”"పదేళ్ల క్రితం అనుకుంటాను. ఒకసారి నీకు చెప్పాను గుర్తుందా? టాక్సీ డ్రైవర్ ఎయిర్‌పోర్టునించీ మనింటికి దారి తెలియదన్నాడు, ఎందుకంటే అతను ఆ వారంనించే టాక్సీ నడపడం మొదలుపెట్టానన్నాడు? అదికూడా, రిటయిరవుతున్న టైంలో రియలెస్టేట్లో వాళ్లావిడ తెచ్చిన నష్టాలవల్ల, అని చెప్పాడన్నాను?”"ఏమో, చెప్పారేమో.”

“ఆ తరువాత కొన్ని నెల్లకి, టాక్సీ ఎక్కగానే, ‘ఎక్కడికీ, హెర్న్‌డన్‌కేనా?’ అని నన్ను చూడగానే అడిగాడని చెప్పాను? అదేంటి, అంత కరెక్టుగా ఎలా కనుక్కున్నావని నేననిడిగితే, అక్కడ ఎక్కే ఇండియన్లంతా వెళ్లేది హెర్న్‌డన్‌కే అన్నాడన్నాను? పైగా, గంటకి పైగా బాడుగకోసం లైన్లో నిల్చుంటే – అదే, నీకు తెలుసుకదా, వాషింగ్టన్ డల్లస్ ఎయిర్‌పోర్టుకి ఏ టాక్సీలోనయినా వెళ్లచ్చుగానీ, అక్కణ్ణించీ వచ్చేటప్పుడు మాత్రం వాషింగ్టన్ ఫ్లయర్ వాళ్ల టాక్సీలో మాత్రమే ఎక్కాలని? – చివరికి, ఇంత తక్కువ దూరానికి – అని ఆ డ్రైవర్ విసుక్కున్నాడని చెప్పాను?”

“అబ్బబ్బ! ఎప్పుడో చెప్పినదాని గూర్చి ఇప్పుడు గుర్తుందా, గుర్తుందా, అని ఎందుకు బాబూ చంపుతారు?”

“మూడోసారి ఆ టాక్సీ డ్రైవరే విసుగ్గా, ‘టాక్సీ లైన్లో నిలబడ్డానికే 3 డాలర్లు కట్టాలి కంపెనీకి! ఆ డిపార్చర్ లెవెల్‌కి వెళ్లి అక్కడికొచ్చే వేరే టాక్సీ ఎక్కరాదా?’ అని కూడా అన్నాడన్నాను, గుర్తు రాలేదా?”

శ్రీవిద్య మొహంలో ఓర్పు నశించిన చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. నాకయితే, టాక్సీలో ఎక్కగానే, డ్రైవర్ సీట్ వెనక ప్లాస్టిక్ పౌచ్లో తగిలించివున్న ఐడెంటిఫికేషన్ – ఫోటో, దానికింద అతని పేరు – చూడగానే విక్రం మెహతా పేరు క్రితం వారానికి ముందరే నాకెలా పరిచయమయిందో గుర్తొచ్చింది. ఆ పేరు అంతగా నాకు గుర్తుండడానికి కారణం, గత పదిహేనేళ్లల్లో ఇంకే టాక్సీ డ్రైవరూ ఎయిర్పోర్టునించీ మా యింటికి రావడానికి, ‘ఇంత తక్కువ దూరానికా?’ అని విసుక్కోకపోవడం.

“ఆయనెవరో తెలుసా?”

**** (*) *****