కొత్త పుస్తకం కబుర్లు

ప్రయాణానికే జీవితం

జనవరి 2015

ప్రయాణం ఒక సంగీతం, ఆరోహణలు, అవరోహణలు, అపస్వరాలు అన్నిటినీ దాటి చివరికి ఒక పాటని గుర్తుంచుకోవడం లాంటిది. ప్రయాణం ఒక సాహసం. సౌకర్యాన్ని వదులుకుని కొత్త అవసరాల్లోకి, సమస్యల్లోకి కోరి మరీ ప్రవేశించడం. వాటిలోంచి బయటపడి విజయగర్వంతో అనుభవాల్ని గెలుచుకు రావడం.

అటువంటి సంగీతాత్మకమైన, సాహసోపేతమైన ఒక ప్రయాణాన్ని గురించిన అనుభవాలు అజిత్ హరిసింఘాని పుస్తకం “ప్రయాణానికే జీవితం” లో ఉంటాయి. దీన్ని తెలుగులో అనువదించింది కొల్లూరి సోమశంకర్. ఈ పుస్తక రచయిత మోటర్ సైకిల్ పై పూనె నుండి జమ్మూ వరకూ ఒక సూదూర ప్రయాణాన్ని సఫలం చేసుకున్నారు.

దారులు, వాతావరణాలు, ఆహారం గురించిన సమాచారాన్నిచ్చే మాములు యాత్రావిశేషాల కేటలాగ్ కాదిది. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లూ లేకుండా కొత్త ప్రదేశాల్లో రాత్రులు గడపటం, రైతుల్నీ, సాధువుల్నీ, సైనుకుల్నీ, ఇతర ప్రాంతాల సామాన్య ప్రజల్నీ కలుస్తూ, పలకరిస్తూ ఆ కాసేపటికీ వారిలో మనిషిగా కలిసిపోతూ సాగిన ఆత్మీయమైన ప్రయాణం ఇది. అసాధారణమైన వాతావరణాలకి అనుకూలంగా మెలగడం, ఊహించని ప్రమాదాలకి సిద్ధంగా ఉండటం, తన గుర్తింపు అనుమానించబడిన సందర్భంలో స్నేహంతో నెగ్గుకురావడం వంటివి ఈ యాత్రలో కీలకమైన విషయాలు. చదువరికి ఆహ్లాదంగా, ఆసక్తికరంగా సాగిపోయే శైలి, దానికి అణుగుణమైన అనువాదం.

***

పుస్తకంలోని ‘కన్నీళ్ళ లోయ’ చాప్టర్ లోంచి:

“తలుపు పక్కన, నేను నిలుచున్న చోటికి ఎడమవైపు ఎత్తుగా ఉన్న ఓ అలమారలో టి.వి, డివిడి ప్లేయర్ అమర్చి ఉన్నాయి. ఏదో సినిమా పెట్టినట్లున్నారు… “రాత్ అకేలీ హై” అంటూ తనూజ, దేవానంద్‍ను కవ్విస్తోంది. కానీ ఎవరూ దానిని చూడడం లేదు. అంతకుముందు వాళ్ళు దాన్ని ఎన్నోసార్లు చూసుంటారు. ఎవరో నా చేతిలో ఓ పెద్ద స్టీలు గ్లాసుడు లస్సీ పెట్టారు. నేను మరాఠీలో మాట్లాడుతుంటే వినాలని ఆ యువకుల కోరిక. గడ్డం గీసుకోకుండా నల్ల టీ-షర్ట్ జీన్స్ పాంటుతో ఉన్న కుర్రాడు – అదే నన్ను రోడ్డు మీద ఆపిన కుర్రాడు – తన పేరు శివనాథ్ అని, పూనెకి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకుర్డి తన ఊరని చెప్పాడు. నేను పూనే చేరాక వాళ్ళింటికి ఫోన్ చేసి తానిక్కడ బావున్నట్లుగా వాళ్ళ అమ్మకీ, సోదరికి చెప్పమని అడిగాడు. అదో సాహసవంతమైన సందేశం అని నాకు తెలుసు, ఎందుకంటే నిజానికి వీరెవ్వరూ ఇక్కడ ‘బాగోలేరు’. ఇక్కడి ఒత్తిడి వీళ్ళపై ప్రతీక్షణం ప్రభావితం చూపుతోంది. బయటకి ధైర్యం నటిస్తూ, ఆ ఒత్తిడిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారీ యువకులు. సొంత ఊర్లని, బంధుజనాన్ని వదిలి ఎక్కడో దూరంగా ప్రమాదకరపరిస్థితుల్లో… ఇలా నా చుట్టూ మూగి ఉన్న వీళ్ళు – అత్యంత ప్రమాదకర ప్రపంచంలో వదిలివేయబడ్డ పిల్లల్లాగా – ఉన్నారు. నాందేడ్‌కు చెందిన దిలావర్ అనే సిక్కు యువకుడు…. స్వచ్ఛమైన మరాఠీ మాట్లాడుతూ మమ్మల్నందరినీ ఓ ఫొటో తీసాడు. మేమందరం ఆ ఫొటోలో నిషేధించబడ్డవారిలా కనబడుతున్నాం.

బయల్దేరుదామని లేచినప్పుడు, ఏదో తెలియని అపరాధ భావంతో నా గుండె బరువెక్కింది. వాళ్ళని వాళ్ళ ఖర్మకి వదిలేసి వస్తున్నట్లు అనిపించింది. ఈ ప్రతికూల పరిస్థితులలో, ఈ ఏడాది వీళ్ళలో ఎంతమంది సైనికులు మిగులుతారు? ఓ వారం తర్వాత మా ఇంట్లో సుఖంగా పడక్కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ, వీళ్ళ జీవితాలను బలితీసుకున్న ఆకస్మిక దాడి లేదా పేలుడు గురించి చదువుతానా? శివనాథ్‌కి పెళ్ళై, కుటుంబం ఏర్పడుతుందా? లేకపోతే అతని అమ్మ, సోదరి అతనిక లేడనే దుర్వార్త వింటారా?

విషమమైన ఈ ఆలోచనలు నాలో ఏ మాత్రం ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయి. మొహానికి బలవంతంగా చిరునవ్వు పులుముకుని వాళ్ళకు వీడ్కోలు పలికాను. రోడ్డెక్కి, నా ముఖం హెల్మెట్ కింద మరుగున ఉన్న ఆ క్షణంలో నా గుండె బరువుని దించుకున్నాను. అవును నేను ఏడుస్తున్నాను. గట్టు తెగిన ఆనకట్టలా ధారాపాతంగా కంటి నిండా నీళ్ళు! నాలో ఏదో వెలితి. ఓ సైనికుడు దేశం కోసం చేసే త్యాగాన్ని మొట్టమొదటిసారిగా… అర్థం చేసుకున్నాను. జాతీయత పేరుతోనూ మతం పేరుతోనూ మానవ దురవస్థని ఎప్పుడూ రగులుతూండేలా చూసే వ్యక్తుల కోసం తన జీవితాన్ని ఫణంగా పెడుతున్నాడు మాములు సైనికుడు. ”

***

వివరాలు:
పుస్తకం: ప్రయాణానికే జీవితం (పూనె నుంచి జమ్మూకి మోటర్ సైకిల్ యాత్ర)
రచన: అజిత్ హరిసింఘాని
అనువాదం: కొల్లూరి సోమశంకర్
ప్రతులకు: కినెగె మరియు ఇతర పుస్తకాల షాపులు
http://kinige.com/book/Prayananike+Jeevitam

**** (*) ****