ప్రత్యేకం

రాలిన తెలియనితనం : ‘Nutting’ by William Wordsworth

ఫిబ్రవరి 2015

ప్రకృతిని అద్భుతంగా వర్ణించటం ఎందరో కవులు చేశారు, కాని- దానితో ఒక అత్యవసరమైన లయను పొసగించుకోవటాన్ని, అప్పుడు రాగల శాంతిని [ఏదో మరొక లోకం లోకి ముక్తి కోసం కాక ] వాస్తవజీవి తంలోకి తెచ్చుకోవటాన్ని- వర్డ్స్ వర్త్ మాత్రమే చెప్పారు.

పద్యం ఒక గంధర్వగాథ [fairy tale ] లాగా మొదలవుతుంది, అయితే ఇక్కడి నాయకుడు సాధించే సంపద భౌతికమైనది కాదు. ఉత్తమపురుష లో సాగే కథనం ఒక కుర్రవాడి పరంగా ఉంటుంది, కాని అతని ప్రయాణం, అన్వేషణ చదువరిది కూడా.

‘’ అదొక దివ్యమైన రోజని అనిపిస్తుంటుంది ఇప్పుడు. ఎవరో పురమాయించారు నన్ను…ఎవరివో బట్టలు వేసుకు కుటీరపు ముంగిలి వదిలి అడవిలోకి వెళుతున్నాను, బుజం మీద పెద్ద జోలె, చేతిలో కొంకికర్ర ఎవరో వాడి వదిలిన బట్టలు అవి , పాతగా ఉన్నాయి , మరీ మోటుగా … రంగురంగులుగా , నాకు నే నే వింతగా అనిపించాను … ముళ్ళ చెట్ల డొంకల్లోంచీ అందమైన కోనలోపలికి. ఎవరూ ఎప్పుడూ అక్కడ అడుగుపెట్టినట్లే లేదు, నిటారుగా నిలిచి ఉన్నాయి విరగకాసిన హేజెల్ పొదలు…నిర్మలంగా, ధైర్యంగా…స్వచ్ఛంగా గుండెకి అడ్డుపడుతూ ఆపుతూ.

ఎదురుచూసి విసిగిపోయి ఆశ అంతరించినపుడు ఆహ్లాదం ఎదురైన స్థితి – నాది. బహుశా ఆ చెట్ల క్రింద, వయొలెట్ పూల ఋతువులన్నీ ఏ చూపూ సోకకుండా గడిచిపో తూ ఉంటాయేమో…. కిన్నెరవాగుల సవ్వడి వినబడుతున్నట్లే ఉంది, పొర్లిపోయే నురగలు మిలమిలమ న్నట్లే ఉంది…. ఆ నీడలలో పచ్చగా నాచు కప్పిన శిలలు గొర్రె పిల్లల్లా గా , నా చుట్టూరా. వాటికి చెక్కిలి ఆనిం చాను… ప్రాణం తేలికగా ఉంది, తీయని ఉల్లాసం హాయిగా కమ్మింది. .. భద్రంగా ఉంది అంతా. ‘’

ఆ జోలెను huge wallet అంటారు కవి. దానికి ప్రయాణపు సామగ్రి వేసుకునేదన్న అర్థం ఉన్నా, ఆ మాటను ప్రముఖంగా వాడేది డబ్బుసంచి కి మాత్రమే. ఆశను చెప్పిన కవి అది ఎటువంటి ఆశో కూడా ధ్వనింపజేస్తారు. ‘’ నాకు నే నే వింతగా అనిపించాను ‘’ – తాను నిజంగా అది కాదేమో …ఎవరో వాడి వదిలిన దుస్తులు వేసుకుని వెళతాడు, అవి మోటైనవి. ఇంత మోటుగా ఉండాలా అనీ అనుకుంటాడు అతను …అంతకుముందరి వారి ఆలోచనలను, అక్కర్లేని మోటుదనాన్ని, మోసుకు తిరగటాన్ని కవి సూచిస్తున్నారు

తర్వాత అంటారు – ఏమీ లేని గాలి మీదా, రాయీ రప్పలమీదా కరుణను వృధా చేస్తాడు మనిషి, ఏమీ ఇవ్వనివాటి నుంచి సుఖపరవశుడవుతాడని. ఇది కవి హృదయపు నిష్టూరం … వెల లేనిదాని విలువను తరచి తేల్చటం గురించి.

‘’లేచాను… నిర్దయగా కొమ్మ కొమ్మనూ, చెట్టునంతా నేలకు వంచా ను, విరిచా ను, దోచాను .చల్లని చక్కని పచ్చని నికుంజం కళ తప్పింది, వికృతమైంది… ఇప్పుడు తలచుకుంటే అంతా అయోమయంగా ఉందేమిటో … రాజాధిరాజులకు లేని నిధులను కొల్లగొట్టినంతటి పొగరుతో ఆ విధ్వంసాన్నొక విలాసంగా చూస్తున్నప్పుడు … కలుక్కుమంది లోపల. వృక్షాల నిశ్శబ్దం వెనకన ఆకాశం చొరబడుతూంది.

నెచ్చెలీ ఆ పైన, ఒకింత మెత్తన అ యింది హృదయం, నా స్పర్శ కొంత కోమలమైంది- నమ్రత తో నడిచాను అప్పుడు, అక్కడ వనదేవత లేదూ ? ‘’

వర్డ్స్ వర్త్ Lyrical Ballads లోది ఈ పద్యం. మొదట Prelude అనేదానిలో ఒక భాగమని అంటారు. Lucy పద్యాలతోబాటు గా, జర్మనీ లో రచించారు. దీనికి ముందరివి, దీర్ఘమైనవి-రెండు పాఠాంతరాలు ఉన్నాయి, అవి ఇంకొంత హింసాత్మకంగా అనిపిస్తాయి. తమ బాల్యం లో- ఉత్తర ఇంగ్లండ్ లో Esthwaite సరస్సు తీరం నుంచి Graythwaite వైపుకి విస్తరించి ఉండిన సాంద్రారణ్యాలలోని అనుభవం, జ్ఞాపకం , ఆయనే అన్నట్లు వాటిని వడకట్టిన ధార-ఇది. నైతికమైనదాని, ఆదర్శప్రాయమైనదాని ప్రక్కన మానసికమైనదీ మానుషమైనదీ ఇక్కడ ఉంది. కర్కశమైన సత్యాన్ని బిడ్డకి కథ చెబుతూన్నంత సుకుమారంగా ఆవిష్కరించినందుకు ఈ పద్యం ప్రత్యేకమైనది. నిజానికి పద్యాన్ని ప్రతీకాత్మకంగా చదువుకోనే అక్కర్లేదు..ఇక్కడ రెండు మూడు స్థాయిలు ఉన్నట్లైతే అవి అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. వర్డ్స్ వర్త్ సులభమైన శైలి, అపురూపమైన ఇమేజరీ అందుకు దోహదం చేస్తాయి, ఆయనకు సొంతమైన సరళ తాత్వికతతోబాటుగా.

నిసర్గమధుర మైన సౌందర్యాన్ని ఆస్వాదించే శక్తి కుర్రవాడికి లేకపోలేదు, కాని అతను అక్కడే ఆగిఉండిపోలేడు. అన్నిటినీ తాకి తెలుసుకునే బాల్య చాపల్యం లోంచి విరగగొట్టే క్రూరత్వం లోకి పడతాడు [ '' దారి తలయెత్తునింత సౌందర్య లవము వదలిపోలేరు చంపెడువరకు వీరు '' ] బహుశా, సౌందర్యం శాశ్వతం కాదు కనుక దాన్ని కొల్లగొట్టి దాచుకోవాలని ప్రయత్నిస్తాడు, ఆ క్రమం లో తానెంత అధముడై ప్రవర్తించాడో తెలుసుకుంటాడు. ఆశకు అందని ఆనందం లోంచి జారి ఆశాపాతకుడు అయే ప్రమాదాన్ని- నివారించగలగటం ఈ పద్యానికి ధ్యేయం.

1798-99 ప్రాం తాలలో , అప్పటి పారిశ్రామికీకరణ వలని బాధతో- మాట్లాడలేని ప్రకృతి తరపున కవి పలుకుతున్నారు. ఇక్కడి నాయకుడూ ప్రతినాయకుడూ కథ చెప్పే కుర్రవాడే. కోల్పోయిన అమాయకత్వం అతనిది కూడా, ప్రకృతిది మాత్రమే కాదు.[ ( అందమైన పరిసరాలలో ) సాయంత్రం చెరిచేలాగా ఉందని చండీదాస్ గారు అన్నట్లున్నారు]. చివరన చెప్పే చెట్ల నిశ్శబ్దమూ తొంగిచూసే ఆకాశమూ అతని అపరాధ భావనకు నేపథ్యంగా కనిపిస్తాయి. ఆఖర్న తన స్పర్శనూ మనసునూ అడవి పట్ల మృదువుగా చేసుకోగలగటాన్ని అతను సాధిస్తాడు, వాస్తవానికి అది అతనికి ఇవ్వబడిన అవకాశం- క్షమను కోరేందుకు. అది పద్యపు రెండు పాదాలకు మటుకే పరిమితం, ఎందుకంటే అది కేవలం అవకాశమే. ఆ తర్వాతి కథ కవి చెప్పరు… పద్యం మౌనం లోకి ముగుస్తుంది.

రొమాంటిక్ కవులందరిలోనూ ప్రకృతిని జీవం ఉన్నదానిగా చూసే పద్ధతి ఉంది. పాశ్చాత్యభావాలకు ఇది బొత్తిగా అపరిచితమైన ధోరణి. కుర్రవాడు ప్రవేశించే సుందరదృశ్యాన్ని virgin scene అంటారు కవి. ఆ దారం పట్టుకుని ఇదొక లైంగిక అత్యాచారాన్ని సూచించే పద్యంగా విశ్లేషించటం కవి కాలం లోనే కాదు, ఇప్పుడూ జరుగుతూ ఉంది. అయితే కవి ’dear maiden ‘ అని చేసే సంబోధన ఆ వాదనను పూర్వపక్షం చేస్తుంది. జరిగిన అటువంటి అఘాయిత్యాన్ని మరొక స్త్రీతో పంచుకొనేంత సున్నితత్వం ఉన్న కవి, అసలు అటువంటిదాని గురించి పద్యం అల్లుతారా ? ఆ స్త్రీ కవి సోదరి Dorothy Wordsworth అని అంటారు. వారిద్దరూ చాలా ఆత్మీయంగా ఉండేవారు, చాలా కాలం ఒకే చోట నివసించారు.

పద్యం లోని అడవిని బైబిల్ లోని Garden of Eden గానూ, మంచిచెడుల విచక్షణ రావటం నిషిద్ధఫలాన్ని తిన్న ఫలితంగానూ అన్వయించారు. కాదేమో, the poem sounds too pagan for it.

Edmund Spencer పద్యం ఫెయిరీ క్వీన్ లోSir Guyon – ఇటువంటి ఒక పొద [ Acrasia’s Bower of Bliss ] ను ధ్వంసం చేసి ఆమె మాంత్రికజాలం నుంచి ప్రపంచాన్ని రక్షిస్తాడు. ఈ ఉదంతాన్ని – ప్రకృతి అందాన్నీ ఆకర్షణనూ చెడ్డవిగా , రూపు మార్చే వాటిగా – దర్శించటాన్ని- వర్డ్స్ వర్త్ ఈ పద్యం తో ఖండించి ఉండవచ్చునని విమర్శకులు అంటారు. ఇక్కడ దుష్టత్వం మనిషిది, రూపు మారినది ప్రకృతి.

మిల్టన్ Paradise Lost లో Satan చేసే దుర్బోధ కుర్రవాడి మనసులోంచే వస్తుంది, ఏ మాత్రమూ వాచ్యం కాకుండా . ఇది తిరగరాయటం వంటిది… మిల్టన్ కావ్యం లో ప్రకృతిని మరులుగొలిపేదానిగా చూపించినదానికి బహుశా ఇది విరుగుడు. అధవా మిల్టన్ ని వర్డ్స్ వర్త్ ఎక్కు వగానే గౌరవించారని చెబుతారు. పద్యం లో వచ్చే ‘ murmuring sound ‘ అనే పదబంధం యథాతథంగా , కొండగుహ లోంచి దూకే వాగు ధ్వనిని వర్ణిస్తూParadise Lost లో ఉందట.

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాప కావ్యానికి ఈ పద్యం తో పోలిక కనిపిస్తుంది. అప్పటి తెలుగు కవుల పైన ఆంగ్ల రొమాంటిక్ కవుల ప్రభావం ఎక్కువే. వారి ఉపజ్ఞ వలనా ప్రతిభ వలనా అది ఒక ముద్రగా నిలిచిపో లేదు పాపయ్యశాస్త్రి గారి కావ్యం తెలుగువారి ‘ Nutting ‘ – ఇంకొంత విపులమైనది, సూటి అయినది, పేశలమైనది , సమానమైనది.

చలం గారి మ్యూజింగ్స్ లో ఆయన ఒక సరస్సులో పడవ మీద వెళుతూ హంసలను వేటాడటాన్ని రాస్తారు.. ఆ హింసావృత్తి, అందులోంచి తృప్తి రావటం- తమలో తమకి కనిపించినప్పటి ఆందోళనను.
‘’ The world is too much with us ‘’ అంటారు వర్డ్స్ వర్త్. అవును, నిరంతరం మారే ప్రలోభాలతో ప్రపంచం మనతో ఉంది, అయి నా- ఇక్కడే ఆయన కవిత్వం కూడా ఉంది.

Nutting
BY WILLIAM WORDSWORTH

—It seems a day
(I speak of one from many singled out)
One of those heavenly days that cannot die;
When, in the eagerness of boyish hope,
I left our cottage-threshold, sallying forth
With a huge wallet o’er my shoulders slung,
A nutting-crook in hand; and turned my steps
Tow’rd some far-distant wood, a Figure quaint,
Tricked out in proud disguise of cast-off weeds
Which for that service had been husbanded,
By exhortation of my frugal Dame—
Motley accoutrement, of power to smile
At thorns, and brakes, and brambles,—and, in truth,
More ragged than need was! O’er pathless rocks,
Through beds of matted fern, and tangled thickets,
Forcing my way, I came to one dear nook
Unvisited, where not a broken bough
Drooped with its withered leaves, ungracious sign
Of devastation; but the hazels rose
Tall and erect, with tempting clusters hung,
A virgin scene!—A little while I stood,
Breathing with such suppression of the heart
As joy delights in; and, with wise restraint
Voluptuous, fearless of a rival, eyed
The banquet;—or beneath the trees I sate
Among the flowers, and with the flowers I played;
A temper known to those, who, after long
And weary expectation, have been blest
With sudden happiness beyond all hope.
Perhaps it was a bower beneath whose leaves
The violets of five seasons re-appear
And fade, unseen by any human eye;
Where fairy water-breaks do murmur on
For ever; and I saw the sparkling foam,
And—with my cheek on one of those green stones
That, fleeced with moss, under the shady trees,
Lay round me, scattered like a flock of sheep—
I heard the murmur, and the murmuring sound,
In that sweet mood when pleasure loves to pay
Tribute to ease; and, of its joy secure,
The heart luxuriates with indifferent things,
Wasting its kindliness on stocks and stones,
And on the vacant air. Then up I rose,
And dragged to earth both branch and bough, with crash
And merciless ravage: and the shady nook
Of hazels, and the green and mossy bower,
Deformed and sullied, patiently gave up
Their quiet being: and, unless I now
Confound my present feelings with the past;
Ere from the mutilated bower I turned
Exulting, rich beyond the wealth of kings,
I felt a sense of pain when I beheld
The silent trees, and saw the intruding sky.—
Then, dearest Maiden, move along these shades
In gentleness of heart; with gentle hand
Touch—for there is a spirit in the woods.

**** (*) ****