కడిమిచెట్టు

మంచు కొండలో మొలిచిన చల్లని బంగారు తీవె

మార్చి 2015

“అమ్మా, మీ పెళ్ళి లో నాన్న అలిగాడా?” అడిగాడు కొడుకు, కొంత వయసూ వ్యక్తతా వచ్చినవాడు… ఆ నాన్నకి కోపదారి అన్న పేరు ఉండిపోయిఉంది కనుక.

” పెళ్ళి లో అయితే పెద్దలేదు గానీ, ఆ ముందర ఆయన అల్లరి అంతా ఇంతానా తండ్రీ ” ఉత్తి పుణ్యానికి తన మేనల్లుడి మీద మండి పడిన తీరు గుర్తుకొచ్చి నొచ్చుకుంది ఆ ఇల్లాలు.

” అయితే నిన్ను ఇష్టం లేకుండా కట్టుకున్నాడంటావా ? ” చనువుగల కొడుకు అడిగేసి వెంటనే నాలుక కరుచుకున్నాడు.

అమ్మ ఏమీ అనుకున్నట్లు లేదు, ” ఏమోరా ” అని ఊరుకుంది …నిష్టూరపు బిగువు లోంచి తరుముకొచ్చే మురిపెం తో.

నాన్నా సగం నవ్వాడు, నెలవంక నాగరం మెరిసినట్లు.

” చెప్పమ్మా , అసలేమైందో ” ధైర్యం వచ్చిన అబ్బాయి రెట్టించాడు- ఆ నోటా ఆ నోటా పురాణం గా విని ఉన్నా , అచ్చమైన కథ ఏదో కావాలని, ఆత్రం తో.

” అయినా నా తప్పూ ఉందిలే, ఎవరి మీదనో కోపం తో ఒళ్ళు మండించుకుని ఈయనకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను….పాపం , పిచ్చి మా రాజు, దేశాలు పట్టాడు అలాగ. మా అన్న చక్రం అడ్డు వేశాడు గాని, ఏమయిపోవలసినవాడో అసలు …” పాతవన్నీ తవ్వుకుని కంటతడి పెట్టుకుంది.

తిరిగి ఎక్కడ వదిలిపోతుందోనని సగం శరీరం ఇచ్చుకున్న స్వామి , ఎడమ కంటి నీటి ని కొనగోట తుడిచి అప్పటికి పెదవి విప్పాడు – ” అదంతా ఎందుకు గిరిజా, ఇప్పటి సంగతులు చెప్పు ”

తల్లీకొడుకుల నడుమన మర్మం ఏనాడూ లేదు…అమ్మ చెబుతోంది- ఒకే ఒక్క క్షణం లో వాగర్థాల సంగమం ఆసాంతం సుషుమ్న వెంట ప్రవహించింది.

సుషుప్తి తేరింది, కాని అంతా జ్ఞాపకముంది. వినాయకుని వలె ఆదిలో ఆయన అమ్మ కొడుకు, మహాకాళేశ్వర దాస్యం ఆ తర్వాతి సంగతి. ఉజ్జయని లో బ్రాహ్మీ ముహూర్తం. ఆలయం లో ఉదయపు సేవకు గంట మ్రోగుతోంది. వెళ్ళి వచ్చారు కాళిదాసు, ఆ పూట రాజు కొలువు కు కాలు సాగలేదు. మహాసౌందర్యసృష్టికోసం నియమించబడిన ఆ పొడుగాటి దృఢమైన అంగుళులు, లోకోత్తర ప్రణయాన్ని ఆవిష్కరించబోతున్నాయి.

ధర్మపత్ని విద్యోత్తమ వీణా నాదం చెవులపడుతోంది, రాగం శుద్ధ ధన్యాసి ఏమో. . .అమ్మ పుట్టినింటి ప్రశంస తో కావ్య రచన ఆరంభమైంది.

* * *

పదిహేడు సర్గల మహాకావ్యం కుమారసంభవం. వాటిలో ఎనిమిది మటుకే కాళిదాసు రచన అని మహా వ్యాఖ్యాత మల్లినాథసూరి తో సహా చాలా మంది పండితుల విశ్వాసం. కుమారుడి జననం ఎనిమిది సర్గలూ ముగిసేసరికి ఒక సూచనగానే ఉంటుంది, ఆ బిడ్డ పరాక్రమమూ విజయమూ తర్వాతి సర్గల కథ. ఒక విధంగా చూస్తే, పార్వతీ పరమేశ్వరులు గాఢాశ్లేషం తోనే కావ్యం అంతమవటం ఉచితమని అనిపిస్తుంది- వారి దీర్ఘ ప్రణయానికి దేవతల ఆటంకమూ శివతేజం శరవణ సరస్సు రెల్లు పొదలలో శిశువై ఉద్భవించటమూ మరొక కథ గా వినటమే న్యాయం.

రఘువంశం లో మానవోత్తములైన మహీపతుల గురించీ, మేఘసందేశం లో అర్థదివ్యులైన యక్షుల విరహాతిశయం గురించీ చెప్పిన కవి, ఇక్కడ పూర్తిగా దేవకథ రచించారు. కానీ మనుషుల విధులను వారికి ఆపాదించి ఒప్పించారు… సగం గా ఉండిపోవటం శాశ్వతం కాదని, అతడూ ఆమే ఒక్కటి అవటం తప్పనిసరి అని – బిడ్డను కనటం అతి పవిత్రమైన అవసరమని. ” ప్రజాయై గృహమేధినాం ” [ రఘువంశం ] ..ఈ శ్లోకపు చివరి మాటలు ఆదిదంపతులకు కూడా, ఆ ‘ ప్రజ ‘ (సంతానం ) ప్రజకోసం కూడా. వేరే పేర్లు ఉన్నా, ఒట్టిగా ‘ కుమారస్వామి ‘ అని ప్రస్తావించటం లోనే దాంపత్యప్రశస్తి అంతా ఉందేమో.

వారి వారి మాతృభాషలు ఏవైనాగానీ, వందల సంవత్సరాలనుంచీ ఆసేతుశీతాచలమూ రసజ్ఞులైనవారంతా నెత్తి మీద పెట్టుకున్న మహాకవి గురించి నావంటి అత్యల్పులు కొత్తగా ఏమైనా చెప్పాలనుకోవటం అజ్ఞానం. పదలాలిత్యానికి నిధి అనిపించుకున్న కాంచీపురపు మధురకవి దండి మాటలను స్మరించుకోవచ్చు . ” ఆయన రచన ఏచోటా వదులు గా ఉండదు, ఎక్కడా పటుత్వం తగ్గదు. అక్కరలేని మాటను ఒక్కదాన్ని కూడా వాడరు. ఆ వాక్కు లో కృత్రిమత్వం వెతికినా కనిపించదు. విలువ లేని ఆడంబరాన్నీ, తాత్కాలికపు ఆభరణాలనూ ఆ రచన ధరించదు. కావాలని మెరిపించే మాటల గారడీ లేదు. ఆయన శక్తి ఆ పదాల సంగీతధ్వనిలో, స్ఫుటంగా చేరవచ్చే రమ్యమైన భావాలలో. ప్రత్యేకించి ప్రయత్నించకుండానే …అద్భుతమైన పరిశీలన లోంచి, ప్రకృతిని అపారంగా ప్రేమించటం లోంచి – ఆ స్వభావోక్తులు , ఆ ఉపమలు ‘’

మొదటి సర్గకు ‘ ఉమోత్పత్తి [పార్వతి ఆవిర్భావం ] ‘ అని పేరు. ఇందులో అరవై శ్లోకాలు. నమస్కృతి తోనో, ఆశీర్వచనం తోనో, కథాంశపు ప్రస్తావన తోనో – కావ్యం ఆరంభమవాలని నియమం. ఈ కావ్యం హిమవంతుడి ప్రశంస తో మొదలవుతుంది. [ దీన్ని ఎలాగ అన్వయించాలనే విషయం లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ] ‘ అమ్మల[ఆ+ మల అని విడదీయవచ్చు ] గన్న యమ్మ ‘ అనబడే తల్లిని కన్న మంచుమల దేవర ఘనత అది.

* * *

దేవతా దిశ అయిన ఉత్తరాన ఆ నగాధిరాజు హిమాలయుడు నిలిచి ఉన్నాడు, తూర్పు పడమర సముద్రాలలోకి వ్యాపించి , పృథ్వికి కొలబద్దలాగా. ఆయన ‘ దేవతాత్ముడు ‘ – దివ్యమైన ఆత్మ గలవాడు, దైవిక ఘటనలు సంభవించిన ఆ ప్రదేశం రూపమైనవాడు….అన్నిటికీ మించి పరదేవతను ఆత్మజ గా పొందగలిగినవాడు.

అదివరలో విష్ణుస్వరూపుడైన పృథు చక్రవర్తి , గోరూపిణి అయిన భూమిని పితికినట్లుగా, మేరువు ఈ హిమాలయుడిని వత్సం గా చేసి పృథ్విని పితికినప్పుడు- భాస్వంతమైన రత్నాలూ , మహౌషధులూ లభించి ఉన్నాయి. హిమాలయుడు ‘ అనంత రత్న ప్రభావుడు ‘- వాటిలో వజ్రవైఢూర్యాది మణి రత్నాలూ, దేవదారు వంటి వంటి వృక్షరత్నాలూ, మృతసంజీవని వంటి ఓషధీరత్నాలూ, గంగ వంటి నదీరత్నాలూ, సోమలత వంటి యజ్ఞద్రవ్య రత్నాలూ ఉన్నాయి- పార్వతీ కన్యా రత్నం అక్కడ ఉద్భవించబోతూ ఉంది. ఇన్ని గుణాల నడుమన ఆ మంచుకప్పినతనం ఒక్కటీ లోపాన్ని తీసుకురాలేదు…వెలిగే కిరణాల జాలులో చంద్రుడిఆ ఒక్క మచ్చా మరుగున పడిపోదా !

ఆ శిఖరాలలో సూర్యాస్తామయాన్ని పోలి ప్రకాశించే ధాతునిక్షేపాలు…వాటి కాంతులు అక్కడి మేఘాల పైన ప్రతిఫలించి- అప్సరలకు అకాలసంధ్యాభ్రాంతిని కలిగిస్తాయి. వాళ్ళు విభ్రమంతో ఒక చోట పెట్టుకోవలసిన నగలను మరొకచోట పెట్టుకోబోతారు…ప్రియులను కలుసుకునే సమయం వచ్చేసిందని అనుకుని. ఆ పర్వత శిఖరాలకు వడ్డాణాలు గా అమరిన మేఘాల ఛాయలలో సిద్ధులు ఎండ నుంచి సేదదీరుతారు, ఆ మేఘాలే కురవబోతూ ఉంటే శిఖరాల మీదికి , ఎండ లో చలి కాచుకునేందుకు, – ఎక్కి వెళ్ళుతారు… మేఘాల కన్న అంత ఎత్తున ఆ పర్వతశ్రేణులు ఉన్నాయని అర్థం. ..ఇంకా, శీత ఆతపాలు రెంటినుంచీ ఆశ్రితులకు ఉపశమనాన్ని ఇవ్వగలవి హిమాలయాలు అని కూడా.

వయసు మీరిన ఏనుగుల చర్మం పైన లేత ఎరుపు రంగులో మచ్చలు వ్యాపిస్తాయి, అదే రంగులోని భూర్జవృక్షాల బెరడు మీద విద్యాధర భామినులు మరికాస్త ఎర్రని ధాతువులను సిరాగావాడి ప్రేమలేఖలు రాసుకుంటారట. [ విక్రమోర్వశీయం లో ఊర్వశి ఇలాగే రాస్తుంది. ]ఆ పర్వత గుహలలోంచి వెలువడే సమీరాలు వెదురుపొదల రంధ్రాలలో నిండి ఉచ్ఛస్థాయిలో గానం చేస్తున్నాయి [ ఉద్గాస్యతాం అన్నారు కవి. ఈ ఉచ్ఛస్థాయి ని చెప్పటం అమానుషుల కంఠం లో గాని పలకని గాంధార గ్రామాన్ని సూచిస్తుంది , ఇంకా , యజ్ఞసమయంలో సామవేద మంత్రాలను ఉచ్ఛస్వరం లో గానం చేసేవారిని ఉద్గాత అని పిలుస్తారు ] …చూడబోతే కిన్నరుల సంగీతానికి వేణునాదం తో వాద్యసహకారం అందించేందుకు హిమాలయుడు సిద్ధమైనట్లుంది.

మదించిన ఏనుగులు తమ కపోలాలను సరల వృక్షాలకేసి రాపిడి పెట్టినప్పుడు స్రవించే ద్రవం తో పర్వతమంతా పరిమళభరితమవుతూ ఉంది. రాత్రివేళలలో , ఇళ్ళంత భద్రంగా ఉండే కొండ గుహలలో- తమంతట తామే వెలిగే ఓషధులు , అరణ్యవాసుల ఏకాంతానికి నూనె లేని దీపాలై తోడవుతున్నాయి. సూర్యుడికి భయపడే చీకటికి తన గుహలలో ఆశ్రయమిస్తున్నాడు హిమాలయుడు. ఉదాత్తులు, తమను శరణు జొచ్చినవారిని, వారెటువంటివారైనా- తమవారివలె కాపాడుతారు కదా .

కదిలే తెల్లని వెన్నెల కిరణాల లాగా చమరీమృగాలు తమ తోకలను ఊపుతున్నాయి, గిరి రాజు అన్న పేరును నిలిపేందుకు చామరాలై వీస్తున్నాయి. భాగీరథీ శీకరాలతో [నీటి తుంపరలతో ]తడిసిన గాలి తెరలు దేవదారు వృక్షాలమీదినుంచి వీస్తుంటే నెమళ్ళు అది వర్షమనుకుని పింఛాలు విప్పుతున్నాయి…వేటాడుతూ అలిసిపోయిన కిరాతులకు హాయినిస్తున్నాయి.

ఆ శిఖరాలమీది సరస్సులలో విచ్చుకునే పద్మాల పైనా, పూజార్థమై సప్తర్షులు సేకరించిన పద్మాల పైనా, సూర్యకిరణాలు కిందినుంచి పైకి ప్రసరిస్తున్నాయి.[ ఇది కేవలం అధిభౌతికమైన వర్ణన. హిమాలయుడు అంత ఉన్నతుడని చెప్పేందుకు...పార్వతి జన్మించబోయే ప్రదేశం ఖచ్చితంగా సూర్యబింబానికి పైనే ఉంటుందని. తపస్సుకు పరమశివుడే దిగిపోయాడు , సూర్యుడు ఎంతవాడు.. ] అక్కడి యజ్ఞద్రవ్యాల సమృద్ధినీ భూమిని పోషించగల[ హిమాలయుడి ] సామర్థ్యాన్నీ గమనించిన బ్రహ్మ దేవుడు యజ్ఞ హవిస్సులలో హిమాలయుడికి భాగాన్ని ఏర్పాటు చేశాడు. తన అర్హత వలన పొందగలిగిన దేవతాత్వంగా దీనిని అర్థం చేసుకోవచ్చు .

మేరువుకు సఖుడైన ఆ స్థితిమంతుడు హిమాలయుడు- పితృదేవతల మానస పుత్రికను, మేన అన్న కన్యను , మహనీయులతో కొనియాడబడినదానిని, గృహస్థాశ్రమ నిర్వహణ కోసం- శాస్త్రోక్తంగా వివాహమాడాడు. [ మేన కు తోబుట్టువైన ధారిణిని మేరువు పెళ్ళాడాడు ] ఆ దంపతులు తమ యౌవనానికీ సౌందర్యానికీ తగిన రీతిలో ఆనందంగా ఉన్నారు. వారికి తల్లి పేరిట మైనాకుడనే పుత్రుడు జన్మించి, నాగకన్యను పరిణమయమాడాడు. ఆదిలో తమకు ఉండిన రెక్కలతో ఇచ్ఛావిహారం చేస్తూ మనుషులను ఇబ్బంది పెట్టిన పర్వతాల రెక్కలను ఇంద్రుడు వజ్రాయుధం తో ఖండించినప్పుడు, మైనాకుడికి ఏ నొప్పీ కలగలేదు, ఏ గాటూ పడలేదు…అంత శక్తిమంతుడు [ సనాతనధర్మం లో సోదరుడు ఉన్న కన్య వివాహ యోగ్యురాలు, బహుశా అందుకు ఈ అన్నగారి విషయం ] .సముద్రం అడుగున నివసించేవాడు, హనుమంతుడు లంక వైపుకు లంఘిస్తున్నప్పుడు ఆతిథ్యం ఇవ్వబోయినవాడు- ఈ మైనాకుడే.

” అథవమేన పితుః ప్రయుక్తా దక్షస్య కన్యా భవపూర్వపత్నీ
సతీ సతీ యోగ విసృష్టదేహా తం జన్మనే శైలవధూం ప్రపేదే ”

తండ్రి చేత అవమానితయై యోగంతో దేహాన్ని విసర్జించిన దాక్షాయణి- సతీదేవి, పతివ్రత, భవుని పూర్వభార్య-తన ద్వారా జన్మించగల స్థితిని- అప్పుడు- శైలవధువైన మేన చేరుకున్నది.ఆవిడ పుణ్యం అప్పటికి పండిందన్నమాట.

” సా భూధరాణమధిపేన తస్యాం సమాధిమత్యాముదపాది భవ్యా
సమ్యక్ప్రయోగ పరిక్షతాయాం నీతావివోత్సాహ గుణేన సంపత్ ”

నియమనిష్ఠాగరిష్ఠ యైన మేన యందు, సత్సంతానాన్ని పొందేందుకు ప్రతిజ్ఞ చేసిఉన్నాడు హిమాలయుడు. సక్రమంగా సంపూర్ణంగా చేసిన ప్రయత్నం సంపదను ప్రసాదించినట్లుగా ఆయన భవ్యను పుత్రికగా పొందగలిగినవాడైనాడు.

మొదటి శ్లోకం లో శివుడిని భవుడనీ ఇక్కడ అమ్మవారిని భవ్య అనీ అంటున్నారు కవి- ఆ పదాలకు శుభం కలిగించేవారని అర్థం. వారి దాంపత్యం లోకాలకు శుభం కూర్చబోతూ ఉంది.మొదటి శ్లోకం లో తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని ప్రస్తావించటం యాదృచ్ఛికం కాదు- ఈ హిమాలయుడు అటువంటివాడు కాదు, అమ్మవారికి తగిన తండ్రి అని.

[ ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహ శక్తి అని చెప్పబడిన మువ్విధాల శక్తులలో ఉత్సాహ గుణాన్ని ప్రత్యేకించి పేర్కొన్నారు. ఉత్సాహశక్తిని విక్రమబలమనీ అంటారట. హిమాలయుడి సత్కామననూ సత్ప్రయత్నాన్నీ నొక్కి చెప్పదలచారు కవి. ]

ఆ చిట్టి పాప పుట్టిన దినాన – దిక్కులు ప్రసన్నంగా ఉన్నాయి, దుమ్మూ ధూళీ రేపని చల్లటి గాలి వీచింది, శంఖనాదాలు వినబడి ఆ తర్వాత పూలవర్షం కురిసింది. కదిలే వాటికీ కదలని వాటికీ [ జంగమస్థావర శరీరాలకు ] ప్రాణానికి సుఖమైంది. ఇక్కడ నాలుగు జ్ఞానేంద్రియాలకు ఆహ్లాదాన్ని చెబుతున్నారు- నిర్మలమైన దిజ్మండలం నేత్రపర్వం, శీతలవాయువులు త్వగింద్రియానికి సౌఖ్యం. శంఖనాదం శ్రవణానందం, పుష్పవృష్టి ఘ్రాణతర్పణం.

ఆ శిశువు శిరస్సు చుట్టూ ప్రభామండలం స్పష్టంగా కనిపించింది. సావిత్రి అయిన [ జన్మను ఇచ్చిన ] మేన ఆ బిడ్డతో కలిసి వెలిగిపోయింది…క్రొక్కారు మబ్బులు ఉరిమినప్పుడు బయటపడే రత్నశలాకలతో విదూర పర్వత భూములు వెలిగినట్లుగా. [ వై[ ?దూ] ఢూర్యాలు విదూర పర్వతాలలో అలా ఉత్పన్నమవుతాయని అంటారట]
నెలపొడుపు [ చంద్రమాసీవ లేఖ ] వలె ఉదయించిన ఆమె ఒక్కొక్కకళా ఇముడ్చుకొనే వెన్నెల లాగా రోజు రోజుకూ కాంతి మంతమవుతూ వికసించింది. ఆ తండ్రి కూతురిగా దగ్గరివారు పార్వతీ అని పిలిచేవారు. ఆమె ఎదిగి తపస్సు చేయబూనినప్పుడు తల్లి ” అమ్మా, వద్దు [ఉ , మా] అని వారించినప్పటినుంచీ ఉమ ఆమె కు అసలు పేరయింది…తన మరొక సగం కోసం తపించినప్పటినుంచీ తాను పూర్తిగా తానయింది. తక్కిన కొడుకులూ కూతుళ్ళూ ఉన్నా, ఆ తండ్రికి ఆమెను ఎంత సేపు చూసినా తనివి తీరేది కాదు…. ఎన్నిపూవుల మధువు ఉన్నా మావిపూత లోని మకరందం వైపుకే తుమ్మెద మరలినట్లుగా. [ బిడ్డలను చూడటం వేరు, బిడ్డగా దిగివచ్చిన దేవిని చూసుకోవటం వేరు...బహుశా ఇటువంటి పక్షపాతమే దశరథుడికి శ్రీరామచంద్రుడి పట్ల ఉండినది- అది సహజానురాగాన్ని మోక్షాభిముఖత్వం తో హెచ్చవేస్తే వచ్చిన ఫలితం. ]

మహత్వపూర్ణమైన ప్రభాశిఖ వలన ఒక దీపం లాగా, త్రిపథగామిని అయిన గంగాప్రవాహం వలన స్వర్గపు రహదారిలాగా , సంస్కృతమైన వాక్కు వలన ఒక పండితునిలాగా – పార్వతి వలన తండ్రి పవిత్రుడైనాడు, విభూషితుడైనాడు. అమ్మవారు వాగర్థాలలో వాక్కు , విభూతి అన్నమాట ధ్వనించటమూ ఉద్దేశపూర్వకమే కాబోలు.

ఆమె బాల్యక్రీడలలో బంతి ఆటఆడేది, ఇసుక గూళ్ళు కట్టేది, వాటిపైన కొడుకులతో కూతుళ్ళతో [ కృత్రిమపుత్రకులు- ఆటబొమ్మలు ] ఆడి వినోదించేది . దేవీలీలావిలాసాన్ని చెప్పే ఈ మాటలు శివపురాణం లో ఇంచుమించు ఇలాగే ఉంటాయి…అయితే ఇక్కడిలాగా కాక అక్కడ ఆమె తాను త్రిమూర్త్యాత్మకమైనదానినని ఆటలో భాగం గా చెలులతో అంటుంది . కాళిదాసు గ్రహించిన ఆధారాలలో శివపురాణం ముఖ్యమైనది.

శరత్కాలం వస్తూనే మానససరోవరం నుంచి గంగానది వైపుకు ఎగిరే హంసల బారు వలె ఆమె పూర్వజన్మలో నేర్చిన విద్యలు ఉపదేశించబడుతూనే ఆమెను వచ్చి చేరాయి…రాత్రి అవుతూనే మహోషధులు వాటి స్వయందీప్తితో ప్రకాశించినట్లుగా. బాల్యం గడిచిన ఆ వయస్సులో … అలంకరించే అవసరం లేని పలుచనైన దేహంతో, చూసేవారి కనులకి మధువు తాగనప్పటి మత్తత అయింది, అయిదు పుష్పబాణాలు గల మన్మథుడికి పుష్పం కాని అస్త్రం అయింది. [ అనాసవాఖ్యం కరణం మదస్య, కామాస్యపుష్పవ్యతిరిక్తమస్త్రం ... మన్మథుడి బాణాలకు అందని వాడు ఆమెను నిలవరించలేదు, అమ్మవారి వేయి పేర్లలో మధుమతి ఒకటి. ]

[ చిత్రకారుడి] తూలికతో ఉన్మీలితమవుతూ ఉన్న చిత్తరువులాగా, సూర్యకిరణాలకు క్రమక్రమంగా విచ్చుకునే అరవిందంలాగా..యౌవనం తెస్తూ ఉన్న సౌష్ఠవం తో సమవిభక్తమైన ఆమె శరీరం శోభించింది. [ కాళిదాసుకు చిత్రకళ మీద గౌరవం- శకుంతలను ' చిత్రే నివేశయ పరికల్పిత సర్వయోగా అనిపిస్తారు ] ఆమె పాదాలను నేలపైన మోపినప్పుడు ఆ కాలివేళ్ళ కాంతి చుట్టూ చిందిపోయింది, ఆ ఎర్రని చరణాలు కదిలితే భూమిమీద విరబూసిన అరవిందాలు మెదిలిపోయాయి.
ఆమె అందెల సవ్వడిని అనుకరించి కూసే విద్యను నేర్చేందుకు ప్రతిగా హంసలు తమ నడకల బెడగును ఆమెకు అర్పించాయా ? ఆ ఘనజఘనానికి ప్రస్తుతి ఒకటే- అనంతరకాలం లో అనితరవనితా సాధ్యమైన శివుని అంకపీ ఠాన్ని ఆమె అధిష్టించింది . ఆ యజ్ఞ రూప సన్నని నడుము యజ్ఞ వేదిక [వేదీ విలగ్న మధ్య ] . మన్మథుడి అస్త్రాలు సున్నితమైన పూవులు, అంతకన్న మృదువై నవి అవునా ఆ బాహువులు.. అతనిని గెలిచిన శివునికి కంఠపాశం [ మెడకు తాడు ] కాగలిగాయి?

ఆ కంఠసీమ కు ముత్యాలసరాలు అందం తెచ్చాయా, వాటికే ఆ వక్షం అందాన్ని ఇచ్చిందా…భూషణాభూష్య భావం అక్కడ సాధారణమైపోయింది. చంద్రబింబం లో ఉంటే పద్మాలగుగుణాలనూ, పద్మాలలో నివసిస్తే చంద్రుడి గుణాలనూ ఆస్వాదించటం వీలు కాక చంచల అయిన సౌందర్యలక్ష్మి ఆమె ముఖం లో ప్రవేశించాక మరి అటూ ఇటూ కదలనక్కరలేక పోయింది…ఆ సొగసూ సోయగమూ రెండూ అక్కడే ఉన్నాయని. . ఎర్రని చివురాకుల నడుమ తెల్లని పూవు పూసినట్లు, గుప్పెడు పగడాల మధ్యన ఒక ముత్యం మిలమిలమన్నట్లు- సాటిలేని ఆ పాటలాధరాల పైన చిరునగవు విరుస్తుంది.ఆమె గొంతు పలికినప్పుడు వడకట్టిన అమృతం కురుస్తుంది, ఆమీదట కోయిల పాట చెవులబడినా అది శృతితప్పిన తంత్రి మ్రోగినట్లే ఉంటుంది. సూర్య చంద్రులు ధగధగమనే చెవి కమ్మలై [ తాటంకాలై ] ఆమెను సేవించారు .[తాటంక యుగళీభూత తపనోడువ మండలా అని ఈ వర్ణన లలితాసహస్రం లో యథాతథంగా ఉంది ] గాలి తెరలలో ఊగే నీలోత్పలాలు ఆ చూపులు…లేడి కనులను ఆమె తెచ్చుకుందో, ఆమె కనులనే లేడి అరువు తెచ్చుకుందో –ఏమో ! సృష్టికర్త నల్లని అంజనం లో ముంచిన కుంచెతో దిద్దినట్లున్నాయి వంగిఉన్న కనుబొమ్మలు, ఇక మన్మథుడు తన పూలవింటి ని స్మరించి గర్వపడనే లేడు ! చమరీమృగాలకు ఏ మాత్రం లజ్జ ఉన్నా ఆ పృథుశిరోజరాశిముందు తలలు వంచవలసిందే !

ఇన్ని మాటలు అక్కర లేదు, [ అందాన్ని] వివరించగల పోలికలను[ సర్వోపమద్రవ్యసముచ్చయం ] అన్నిటినీ ఒకే చోట పొందికగా అమర్చుకుని చూసే కోరిక బ్రహ్మకు కలిగిన ఫలితం ఆమె, ఆ మహా లావణ్య శేవధి.

కామచారియైన నారదముని హిమాలయుడి సమక్షానికి వచ్చినప్పుడు- పక్కనే ఉన్న ఈమెను చూసి- శివుడి పత్ని[హరస్యశరీరార్థహర- హరుని అర్థశరీరాన్ని హరించగలది అని ] కాగలదని ప్రేమగా జోస్యం చెప్పాడు. అందుకని మరి వేరే వరుడిని వెతికే పనిని తండ్రి పెట్టుకోలేదు, ఆమెకు యుక్తమైన వయసు వచ్చినా. మంత్రపూతమైన హవిస్సును అగ్నికి అర్పించాలి, అన్యమైన తేజస్సుకు కాదు. కానీ శివుడు తన సుతకొరకై యాచించలేదు, ఆ దేవదేవుడిని అడిగే చొరవ ఈ తండ్రికి లేదు – నారదముని నోటిమాట వృధా అయేందుకూ లేదు…మధ్యేమార్గం పూని మౌని అయినాడు పర్వతరాజు.

ఆ సుదతి దాక్షాయణి గా యోగదగ్ధ అయినప్పటినుంచీ , ఆయన, ఆ పశూనాంపతి- విముక్తసంగుడూ అపరిగ్రహుడూ [వివాహబంధం వీడినవాడూ దాన్ని తిరిగి కోరనివాడూ ] అయిఉండిపోయాడు. చర్మధారియై తపస్సుకోసం ఒక హిమపర్వతశృంగానికే వచ్చాడు- గంగాప్రవాహం తడిపే దేవదారు వనానికి…అక్కడంతా వ్యాపించిన కస్తూరి సౌరభం , తీయని ఉపశమనం ఇస్తూ కిన్నరుల సంగీతం. ప్రమథగణాలు – సురపున్నాగ హారాలు మెడలలో వేసుకొని, భూర్జవృక్షాల బెరళ్ళను వస్త్రాలుగా ధరించి, ఆ కొండల లోని మురా ద్రవ్యాన్ని శరీరాలకు అలదుకొని- అక్కడే , పశుపతి పిలిస్తే పలికేందుకని- విడిది చేశారు. అప్పుడు ఆ అరణ్యాలలో సిం హాలగర్జనకు దర్పంగా ఎదురు పలికాయి నందీశ్వరుడి రంకెలు..తక్కిన జంతువులు అన్నీ భయభక్తులతో చూస్తున్నాయి.

అందరి తపస్సులకూ ఫలమయిన ఆ శివుడి మనస్సులో ఏముందో , ఆ తపమది దేనికోసం అనో ఏమో- ఎనిమిది రూపాలుగల ఆయన ఆ పర్వతశిఖరం పైన, తన వేరొక రూపాన్ని తానే అగ్నిహోత్రియై ఉపాసిస్తున్నాడు.

అనంతరం అమ్మ చేయబోయే తపస్సు ఆయన కోసమని తెలుసు, ఆయన చేసే తపసూ ఆవిడకేనేమో.

ఆ అనర్ఘ్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చేందుకు హిమాలయుడు కుమార్తెను , ప్రయతను[ పరిశుద్ధురాలిని ] , సఖీసమేతంగా నియమించాడు. అర్ఘ్యం అన్న మాట అన్ని పూజాద్రవ్యాలనూ సూచించినా, ప్రధానంగా నీటి ని అర్పించటాన్నే సూచిస్తుంది- ఆ రగిలే బైరాగికి కావలసినదెపుడూ నీరే. స్త్రీసామీప్యం సమాధి నిష్ఠను భగ్నం చేయగలది అయినా, శివుడు ఆమె ను పరిచారికగా అంగీకరించాడు- వికారం కలిగించగలవి చెంతనే ఉన్నా వికృతి పొందనివారే ధీరులు ! ! !

సుందరమైన కేశాలు గల ఆ పార్వతి దక్షతతో ఆయనకు పరిచర్య సాగించింది- అర్పించవలసిన పుష్పాలను కోసి పెడుతూ, యజ్ఞవేదిని సిద్ధం చేస్తూ, దర్భలను సేకరించి ఇస్తూ, నీటికడవలు మోసి తెస్తూ…అలిసిపోయేది, ఆయన జటలలోంచి తొంగిచూసే నెలవంక వెన్నెలలకు సేదదీరేది.

[ References-
1. Mahakavi kalidasa virachita kumarasambhavam [ The Advent of Kumara ] by Desiraju Hanumanta Rao
2. Kumarasambhava [ cantos1-5 ] with commentary by S. D. Gaiendragadkar
3. Kumarasambhava of Kalidasa by M.R.Kale ]

**** (*) ****