అనువాద కథ

ముత్యాల హారం

మార్చి 2015

“నేను మీ పక్కసీట్లో కూచోవడం యెంత అదృష్టం!” అన్నది లారా ఒకసారి ఓ విందు భోజనంలో.
“ఆ అదృష్టం నాది” అన్నాను మర్యాదగా.

“అదృష్టం యెవరిదో తర్వాత తెలుస్తుంది. మీతో మాట్లాడే అవకాశాన్ని ప్రత్యేకంగా కోరుకున్నాను. మీకు చెప్పటానికి నా దగ్గర ఒక కథ వుంది” అని లారా అనగానే నా గుండె గుబగుబలాడింది. “దానికన్న మీ గురించో లేక నా గురించో మాట్లాడుకోవడం మంచిదనుకుంటాను” అన్నాను.

“అబ్బా, కాని నేనీ కథను మీకు చెప్పి తీరాలి. మీరు కథ రాయడానికి యిది పనికొస్తుందని నా ఉద్దేశం”

“తప్పక చెప్పాల్సిన కథైతే దాన్ని నువ్వు చెప్పాల్సిందే, తప్పదు. కాని మెనూకార్డులో యేముందో చూద్దాం ముందు”
“నేను కథ చెప్పటం మీకిష్టం లేదా? నిజానికి నా కోరికను విని మీరు సంతోషిస్తారనుకున్నాను” అన్నది లారా, కొంచెం నొచ్చుకుంటున్నట్టుగా.

“నాకు నిజంగా సంతోషంగా వుంది. బహుశా నువ్వొక నాటికను రాసి, దాన్లోని కథను నాకు చెప్పాలనుకుంటున్నావేమో”
“ఉహుఁ, అదేం కాదు. ఇది నా స్నేహితురాలింట్లో జరిగింది. కాబట్టి పూర్తిగా యథార్థమైంది”

“అదేమంత మంచి సిఫార్సు కాదు. యథార్థ సంఘటనలున్న కథ కల్పిత కథంత బాగా యెప్పుడూ ఉండదు”

“అంటే?”

“ప్రత్యేకంగా ఏమీ చెప్పలేను. కాని నేనన్నది సరైనదే అనుకుంటున్నాను”

“నన్ను కథ చెప్పనిస్తే బాగుంటుందేమో”

“సరే. నేను పూర్తి సావధానంగా ఉన్నాను. సూపు తాగితే బరువు పెరుగుతుంది కనుక, దాన్ని తాగటం లేదు నేను”
ఆమె కొంచెం పాలిపోయిన, నిరాశ నిండిన చూపునొకదాన్ని నావైపు సారించి, తర్వాత చిన్నగా నిట్టూరుస్తూ మెనూకార్డును చూసింది.

“ఓ, మీరన్నది నిజమే. మీరు తాగకపోతే నేను కూడా తాగకూడదనుకుంటున్నాను. నా ఆకారం యిలా ఉండగా ఆహారం విషయంలో స్వాతంత్ర్యం తీసుకోలేను”

“అది పోనీ. క్రీమ్ అంతగా లేని రుచికరమైన సూపు ఏదైనా వుందా?”

“ఎందుకు లేదూ. బోర్ష్ వుంది కదా. నాకు నచ్చే సూపు అదొక్కటే”

“సరే కానియ్యి. నువ్వు కథను మొదలు పెట్టు. చేపల కూర వచ్చేదాకా మనం అసలుతిండి గురించి ఆలోచించే అవసరం లేదు”

“మంచిది. ఇది జరిగినప్పుడు నేనక్కడే వున్నాను. లివింగ్ స్టన్ దంపతులతో కలిసి భోంచేస్తున్నాను. వాళ్లు మీకు తెలుసా?”
“ఉహుఁ, తెలియదనుకుంటాను”

“వాళ్లను అడిగితే తెలుస్తుంది మీకు, నేను చెప్తున్నదంతా నిజమేనని. ఒకసారి వాళ్లు తమ యింట్లో విందును ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పనులను చూసుకునేందుకు ఒకామెను నియమించుకున్నారట. కాని తాను రాలేనని ఆఖరు నిమిషంలో చెప్పిందట ఆమె. చూశారా, కొందరు మనుషులెంత నిర్లక్ష్యంగా వుంటారో. ఇక తప్పని పరిస్థితిలో లివింగ్ స్టన్ దంపతులు తమ యింటి వ్యవహారాలను చూసుకునే మిస్ రాబిన్సన్ కు ఆ పనిని అప్పజెప్పారు. ఆమె చాలా మంచి అమ్మాయి. చాలా అందమైనది కూడా. వయసు ఇరవై సంవత్సరాలో ఇరవయ్యొక్క సంవత్సరాలో ఉండవచ్చు. నేనైతే అటువంటి అందమైన, యవ్వనురాలైన స్త్రీని పనిలో పెట్టుకోను. పెట్టుకుంటే ఏమైనా జరగవచ్చు. చెప్పలేం కదా”

“కాని, మంచి జరగాలనే ఆశిస్తారు యెవరైనా”

నా అభిప్రాయంతో లారా ఏకీభవించినట్టు లేదు. ఇలా అన్నదామె: “అటువంటి స్త్రీ తన ధ్యాసను ఇంటి పనుల మీద పెట్టేబదులు యువకులమీద పెట్టే అవకాశముంది. మన యింటి వాతావరణానికి అలవాటు పడుతున్న దశలో పని మానేసి పెళ్లి చేసుకుంటాననవచ్చు. కాని మిస్ రాబిన్సన్ గురించి చాలా మంది మంచి సిఫార్సులు చేశారు. ఆమె మంచి మనిషే కాక, గౌరవానికి అర్హురాలు కూడా. చర్చిలోని ఒక ఫాదరుకు మిస్ రాబిన్సన్ ఒక కూతురని యెవరైనా చెబితే నమ్మవచ్చు. ఆ విందుకు వచ్చినవాళ్లలో కౌంట్ బోర్సెల్లి అనే మరొకతను వున్నాడు. ఆయన ఒక రంగంలో నిపుణుడు. కాని, ఆయన మీకు తెలియదనుకుంటా. రత్నాలు, వజ్రాలు మొదలైనవాటి గురించి ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అతని పక్కన మేరీ లింగేట్ అనే ఆమె కూర్చుని వుంది. తన సొంత ముత్యాల హారాన్ని బాగా యిష్టపడే ఆమె, మాటల సందర్భంలో ఆ దండ గురించి అతని అభిప్రాయాన్ని అడిగింది. అది చాలా బాగుందన్నాడతడు. ఆమెకు కొంచెం అహం దెబ్బ తిన్నట్టై ‘“దీని ధర ఎనిమిది వేల పౌండ్లు”’ అన్నది.

‘“అవును అది అంత విలువైనదే”’ అన్నాడతడు”

“మిస్ రాబిన్సన్ అతనికెదురుగా కూర్చుని వుంది. ఆ సాయంత్రం పూట ఆమె అందంగా కనపడుతోంది. ఆమె మిసెస్ సోఫీ లివింగ్ స్టన్ యిచ్చిన పాత డ్రెస్సును తొడుక్కున్నదని గుర్తించాను. కాని మిస్ రాబిన్సన్, మిసెస్ సోఫీ లివింగ్ స్టన్ యింట్లో పని చేస్తున్నదని తెలియకపోతే ఆ డ్రెస్సు కొత్తది కాదనే విషయం తెలియదు మీకు”

“మిస్ రాబిన్సన్ ను చూసిన బోరెల్లి ‘“అదిగో, ఆమెమెడలో వున్న ముత్యాల హారం చాలా బాగుంది”’ అన్నాడు”

‘“కాని ఆమె మిసెస్ లివింగ్స్టన్ యింట్లో పని చేసే మనిషి”’ అన్నది మేరీ లింగేట్”

‘“కావచ్చు. కాని, ఆ ముత్యాల దండ చాలా విలువైనది. దాని ధర యాభై వేల పౌండ్లు వుంటుంది”’

‘“నాన్సెన్స్”’

‘“నేను చెప్పింది అక్షరాలా నిజం”’

“మేరీ లింగేట్ కొంచెం వంగి, ఆమెమెడ లోని దండను చూస్తూ ‘“వింటున్నావా మిస్ రాబిన్సన్? నీ మెడలోని దండ యాభై వేల పౌండ్ల ఖరీదు చేస్తుందంటున్నాడు బోర్సెల్లి”’ అన్నది”

“అదే క్షణంలో సంభాషణలో చిన్న అంతరాయం ఏర్పడింది. మేమందరం మిస్ రాబిన్సన్ వైపు చూశాము. ఆమె కొంచెం తడబడి నవ్వింది. తర్వాత ‘“నిజానికి నేను చాలా బేరమాడి, దీన్ని కేవలం పదిహేను షిల్లింగులకే కొన్నాను”’ అన్నది”

‘“ఆఁ కొన్నావులే పదిహేను షిల్లుంగులకు”’ అన్నాడు బోర్సెల్లి కొంచెం వెటకారంగా”

“మేమందరం నవ్వాము. నిజమైన ఖరీదైన హారాలను కొని, అవి నకిలీవని తమ భర్తలచేత నమ్మించటానికి ప్రయత్నించే స్త్రీల గురించి మాకందరికీ తెలుసు కనుక, మిస్ రాబిన్సన్ చెప్తున్నది కూడా పూర్తిగా అబద్ధమని ఊహించాము”

“మీ ఊహ బాగుంది” అన్నాను, ఈ కోణంలోంచి ఏదైనా కథను రాయవచ్చా అని ఆలోచిస్తూ.

“కాని, ఆ హారం విలువ ఒకవేళ యాభై వేల పౌండ్లు వుంటే, మిస్ రాబిన్సన్ కు అటువంటి చిన్న ఉద్యోగం చేసే ఖర్మ యెందుకు పడుతుంది? కాబట్టి, బోర్సెల్లి పొరపాటు పడ్డాడని భావించాము. అంతలోనే ఒక అరుదైన సంఘటన జరిగింది. యాదృచ్ఛికత తన బలమైన ఉనికిని చాటుకుంది” అన్నది లారా.

ఒక కాల్చబడిన సాలమన్ చేపను నా ఎడమ వైపునుండి తీసుకొచ్చి టేబులుమీద పెట్టాడు బట్లర్. “మిసెస్ లివింగ్ స్టన్ దివ్యమైన విందునిస్తున్నారు మనకు” అన్నాను.

“సాలమన్ చేపను తింటే లావెక్కుతారా? అని అడిగింది లారా, పెద్ద ముక్కను తీసుకుంటూ. “చాలా లావెక్కుతారు” అన్నాను.
“నాన్సెన్స్” అన్నదామె.

“కథను కంటిన్యూ చెయ్యి. యాదృచ్ఛికత తన బలమైన ఉనికిని చాటుకుంది అన్నావు కదా. దాంతర్వాత యేం జరిగింది?”

“అప్పుడు మా బట్లర్ వెంటనే మిస్ రాబిన్సన్ మీదికి వంగి, ఆమె చెవిలో ఏదో చెప్పాడు. ఆమె ముఖం కొంచెం పాలిపోయింది. అందరు స్త్రీలలాగా ముఖానికి రూజ్ అనే ఎర్రని పొడిని పులుముకోకపోవటం వల్ల, మిస్ రాబిన్సన్ ముఖం పాలిపోవటం సులభంగా తెలిసిపోయింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడటం స్పష్టంగా తెలిసింది. కొంచెం ముందుకు వంగింది రాబిన్సన్”

‘“మేడమ్ లివింగస్టన్, నాతో మాట్లాడటం కోసం మన హాల్లో ఇద్దరు మనుషులు వేచివున్నారట”’ అన్నది రాబిన్సన్”

‘“అయితే వెళ్లి మాట్లాడు”’ అన్నది మిసెస్ సోఫీ లివింగ్ స్టన్”

“మిస్ రాబిన్సన్ లేచి వెళ్లింది. అందరి మనసులలో ఒకే ఊహ కదలాడింది. కాని, అందరికన్న ముందుగా నేనే ‘“వాళ్లు ఆమెను అరెస్టు చేయటానికి రాలేదు కదా. అదే జరిగితే మీ పరిస్థితి ఘోరం సోఫీ”’ అన్నాను”

‘“బోర్సెల్లీ, ఆ ముత్యాల హారం అచ్చమైనదేనా?”’ అని అడిగింది సోఫీ”

‘“అవును అందులో అనుమానమే లేదు”’

‘“ఒకవేళ అది దొంగిలించిన హారమైతే ఇప్పుడు దాన్ని ధరించేది కాదు”’

“సోపీ లివింగ్ స్టన్ ముఖం విపరీతంగా పాలిపోయింది. తన నగలపెట్టెలో నగలన్నీ భద్రంగా ఉన్నాయా అనే అనుమానం వచ్చిందామెకు. నేనేమో కేవలం ఒక చిన్న వజ్రాల హారాన్ని ధరించాను. ఈ సంఘటన జరగటంతో దాన్ని చేత్తో తడిమి చూసుకున్నాను”

‘“పిచ్చిగా మాట్లాడకు. అంత విలువైన ముత్యాల హారాన్ని మిస్ రాబిన్సన్ యెట్లా దొంగిలించగలుగుతుంది?”’ అన్నది మిసెస్ లివింగ్ స్టన్”

‘“ఆమె దొంగవస్తువుల్ని కొనే ఆమె కావచ్చు”’ అన్నాను నేను”

‘“కాని ఆమె గురించి ఎంతో మంచి సిఫారసు చేశారెందరో ’’’

‘“అట్లానే చేస్తారు చాలా మంది”’ అన్నాను”

లారా చెప్పేదాన్ని మధ్యలోనే ఆపేస్తూ “ఆ సంఘటనను నువ్వు పాజిటివ్ గా తీసుకోనట్టుంది”
అన్నాను.

“నిజానికి మిస్ రాబిన్సన్ గురించి నాకేం తెలియదు. ఆమె మంచిది కావచ్చు కూడా. కాని, ఆమె వొక పేరుమోసిన దొంగ అయి, అంతర్జాతీయ దొంగల ముఠాలోని సభ్యురాలైతే త్రిల్లింగ్ గా వుంటుంది కదా” అన్నది లారా.

“అంటే సినిమాలోల్లాగా అన్నమాట. అట్లాంటి ఉత్కంఠ నిండిన విషయాలు కేవలం సినిమాల్లోనే జరుగుతాయి” అన్నాను.
కథను కొనసాగిస్తూ లారా ఇలా చెప్పింది: “మేమందరం ఊపిరి బిగబట్టి వేచివున్నాం. హాల్లోంచి తగాదా తాలూకు చప్పుడు వస్తుందేమోనని అనుకున్నాం. కాని యెట్లాంటి చప్పుడూ వినపడలేదు. తర్వాత తలుపు తెరుచుకుంది. మిస్ రాబిన్సన్ హాల్లోంచి డైనింగ్ రూములోకి వచ్చింది. ఆమె మెడలో ఆ హారం లేకపోవడం గమనించాను. ఆమె ముఖం పాలిపోయి వుంది. ఉద్రేకం, తత్తరపాటు చోటు చేసుకున్నాయి. టేబులు దగ్గరికి వచ్చి నవ్వుతూ కుర్చీలో కూర్చుని, దాన్ని పడేసింది”
“దేన్ని పడేసింది?” అని అడిగాను.

“ఒక ముత్యాల హారాన్ని, టేబులు మీద”

‘“ఇదీ నా ముత్యాల హారం”’ అన్నది రాబిన్సన్”

బోర్సెల్లి ముందుకు వంగి, ‘“కాని ఇది నకిలీ హారం”’ అన్నాడు.

‘“నేను చెప్పాను కదా ఆ ముత్యాలు నకిలీవని”’ అని నవ్వింది రాబిన్సన్”

‘“కొన్ని క్షణాల క్రితం మీ మెడలో వుండిన హారం కాదది”’ అన్నాడు”

“ఆమె తల వూపి మార్మికంగా నవ్వింది. మాకందరికి ఏమీ అర్థం కాలేదు. సోఫీ లివింగ్ స్టన్ కు యిదంతా నచ్చలేదు. అసలు విషయం చెప్పమని మిస్ రాబిన్సన్ ను అడిగింది. జారట్స్ అనే దుకాణంనుండి ఇద్దరు మనుషులు హాల్లోకి వచ్చారనీ, ఆ హారాన్ని తాను ఆ దుకాణంలోనే కొన్నదనీ, కాని దాని కొండి సరిగా లేకపోవడంతో దుకాణం వాళ్లు సరిగ్గా చూసుకోక వేరే హారాన్ని యిచ్చారనీ, ఇప్పుడు దాన్ని తీసుకుని తాను కొన్న చవకైన హారాన్నే యిచ్చారనీ చెప్పిందామె. అటువంటి బుద్ధితక్కువ పనిని ఎవరైనా ఎట్లా చేస్తారనే అనుమానం వచ్చింది మాకు. మొత్తానికి తేలిందేమిటంటే, అంతకుముందు మిస్ రాబిన్సన్ ధరించిన హారం విలువ యాభై వేల పౌండ్లు అనీ, దాన్ని తీసుకుని మళ్లీ నకిలీ హారాన్ని ఇప్పుడు దుకాణంవాళ్లు ఇచ్చారనీ. అసౌకర్యాన్ని కలిగించినందుకు దుకాణంవాళ్లు తనకు మూడు వందల పౌండ్ల చెక్కును ఇచ్చారని చెప్పి మిస్ రాబిన్సన్ ఆ చెక్కును చూపించింది. ఆమె సంతోషంగా వుంది” అన్నది లారా.

“ఆమె అదృష్టం బాగుండిపోయింది. కదా” అన్నాను.

“అని అనుకుంటున్నారు మీరు. కాని అదే ఆమె నాశనానికి కారణమైంది”

“ఓహో, అదెలాగా?”

“మిస్ రాబిన్సన్ కొన్నాళ్లపాటు సెలవుమీద పోవాలనుకుంది. డ్యూవిల్ పట్టణానికి వెళ్లి, ఆ మూడు వందల పౌండ్లతో అక్కడ ఒక నెల రోజులపాటు గడిపి రావాలనుకుంటున్నానని మిసెస్ సోఫీ లివింగ్ స్టన్ తో చెప్పింది. కాని, డబ్బును అట్లా వృథా చేయవద్దనీ, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసి మంచి వడ్డీని పొందాలనీ సూచించింది సోఫీ. మిస్ రాబిన్సన్ ఆ మాటలను లెక్క చేయలేదు. తనకు అంత మంచి అవకాశం మళ్లీ రాదు కనుక, కొంతకాలం యువరాణిలాగా హాయిగా ఆనందిస్తానన్నది. సోఫీ ఏమీ చేయలేక ఊరుకుండిపోయింది. తాను కట్టుకోకుండా మిగిల్చిన ఎన్నో దుస్తుల్ని ఆమె రాబిన్సన్ కు అమ్మింది. ఫ్రీగా యిచ్చానని చెప్పింది కాని, నేనది నమ్మను. వాటిని తక్కువ ధరకు అమ్మిందనే అనుకుంటాను. రాబిన్సన్ తర్వాత డ్యూవిల్ నగరానికి వెళ్లిపోయింది. ఆపైన యేం జరిగిందనుకుంటున్నారు ?”

“నేనూహించలేను. బహుశా అక్కడ బాగా ఆనందంగా గడిపిందేమో”

“మరో వారం రోజుల్లో తిరిగి రావాల్సి వుందనగా మిస్ రాబిన్సన్ తాను తన మనసు మార్చుకున్నదనీ, వేరే వృత్తిలోకి ప్రవేశిస్తుండటం వల్ల తిరిగి రాలేకపోతున్నందుకు క్షమించాలనీ, మిసెస్ సోఫీ లివింగ్ స్టన్ కు ఒక వుత్తరం రాసింది. సోఫీ బాగా కోపానికి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, డ్యూవిల్ నగరంలో మిస్ రాబిన్సన్ అర్జెంటినా దేశపు ఒక అత్యంత ధనవంతుణ్ని పెళ్లాడి, పారిస్ కు తరలిపోయిందట. ఆమెను నేను ఫ్లారెన్స్ నగరంలో చూసినప్పుడు తన శరీరమంతా భారీ నగలతో నిండివుంది. నేను చెడామడా తిట్టాననుకోండి. తనకొక పెద్ద బంగళా, రోల్స్ రాయిస్ కారూ ఉన్నయని చెప్పింది. తర్వాత ఆ అర్జెంటినా దేశస్థుణ్ని వదిలి, గ్రీకు ధనికుణ్ని పెళ్లాడిందట. ప్రస్తుతం యెవరితో వుంటుందో తెలియదు. ఏతావాతా తేలిందేమిటంటే, ఇప్పుడామె పారిస్ లోని ధనవంతురాళ్లైన వగలాడిలలో ఒకతి”

“ఆమె జీవితం నాశనమైందని నువ్వు అన్నప్పుడు, ఆ పదాన్ని సాంకేతిక అర్థంలో వాడి ఉంటావు నువ్వు” అన్నాను.
“మీరంటున్నదేమిటో నాకర్థం కాలేదు. కాని, ఆమె చెప్పిందంతా ఒక పెద్ద కాకమ్మ కథ అనిపించటం లేదా మీకు?” అన్నది లారా.

“దురదృష్టవశాత్తు నేనిదివరకే ముత్యాల హారం గురించి ఒక కథను రాసివున్నాను. మళ్లీ అదే ఇతివృత్తంతో రాయలేను కదా”
“నిజానికి దీని ఆధారంగా నేనే ఒక కథ రాయాలనుకుంటున్నాను. కాని ముగింపును మార్చాల్సి వుంటుంది” అన్నది లారా.

“ఓ, ఎలా ముగిస్తావు కథను?”

“యుద్ధంలో ఒక కాలు పోయి, ముఖమంతా దెబ్బ తిని, దుర్భర దారిద్ర్యంలో వున్న ఒక బ్యాంకుక్లర్కుతో ఆమెను జత చేస్తాను. అతడు నెలనెలా డబ్బును ఆదా చేస్తూ, ఊరవతల ఒక యిల్లు కొనుక్కున్నాక పెళ్లి చేసుకుందామంటాడు. ఆఖరు ఇన్ స్టాల్ మెంటు కట్టింతర్వాత ఆమె తన దగ్గరున్న మూడు వందల పౌండ్లను అతనికి చూపిస్తుంది. అతడు నమ్మలేక సంతోషంతో ఏడుస్తాడు. తలను ఆమె భుజం మీద పెట్టి చిన్న పిల్లాడిలా యేడుస్తాడు. వాళ్లిద్దరు పెళ్లి చేసుకుని ఆ చిన్న యింట్లో నివసిస్తారు. అతని ముసలి తల్లిని వాళ్లతోనే వుంచుకుంటారు. అతడు రోజూ బ్యాంకుకు పోయి ఉద్యోగం చేస్తుంటాడు. పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకుని, ఆమె ఒక వుద్యోగంలో చేరుతుంది. మధ్యమధ్య అతని గాయం తిరగబెడితే అతనికి సేవలు చేస్తూ వుంటుంది. అదంతా చాలా హృదయవిదారకంగా, మధురంగా వుంటుంది కదా” అన్నది లారా.
“నాకైతే ఈ ముగింపు చప్పగా వుంది” అన్నాను.

“కావచ్చు. కాని, నైతికంగా ఉంటుంది” అన్నది ఆమె.

*

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్
తెలుగు అనువాదం: ఎలనాగ

**** (*) ****