Henry Rider Haggard [1856-1925] కాల్పనిక గాథలకు, సాహస గాథలకు ప్రసిద్ధి. ఇవాళ్టికీ అతి విస్తృతంగా చదవబడే విక్టోరియన్ రచయితలలో ఆయన ఒకరు. పాఠకులను సమ్మోహితులను చేసి దీర్ఘకాలపు ప్రభావాన్ని కలిగించగల ప్రతిభ ఆయనది [ Graham Greene ] . తన కాలానికి ఆయన నవలలు బెస్ట్ సెల్లర్స్ గా ఉండేవని , ఉత్కంఠతో వాటికోసం ఎదురు చూసేవారమనీ P.G.Wodehouse చెబుతారు. ఇప్పుడు అవి క్లాసిక్స్ గా నిలిచి ఉన్నాయి. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ బావుంటాయి కనుక Classic starts, Puffin classics వంటి పిల్లల సీరీస్ ల లోనూ అవి ప్రముఖంగా ఉంటుంటాయి, ముఖ్యం గా King Solomon’s Mines.
‘ She ‘ 1886,87 లలో సీరియల్ గా వచ్చింది. విపరీతమైన ప్రజాదరణ ని నిర్విఘ్నం గా పొందుతూ వస్తున్న She, Rudyard Kipling, JRR Tolkein, Margaret Atwood వంటి వారికి ప్రేరణ . కనీసం పది సార్లు సినిమాగా వచ్చింది. రేసిస్ట్ నవల , సామ్రాజ్యవాదపు నవల అనే బలమైన, స్థూలమైన విమర్శలు ఉన్నాయి, ఫెమినిస్ట్ దృక్పథం లోనూ చాలా ముఖ్యమైన నవల. తన కాలపు రాజకీయ సామాజిక పరిస్థితుల నేపథ్యం లో , పరిమితులలో , రచయిత చేసిన ఈ సృష్టిని గౌరవించవలసి ఉంది, కనీసం అర్థం చేసుకోవలసి ఉంది. ఇంత ప్రసిద్ధం కాని వేరే నవలలలో తూర్పు, ఆఫ్రికన్ దేశాల సంప్రదాయాల పట్ల ఆసక్తిని, శ్రద్ధ ను రచయిత స్పష్టంగా ప్రకటించి ఉండటం గమనించవలసి ఉంది.
భారతీయులకి మటుకే ప్రత్యేకంగా అర్థమయే స్త్రీ శక్తిని , అంతటిది అయి ఉండీ ప్రేమ కోసం తపించిపోవటాన్ని She ఆవిష్కరిస్తుంది.
అన్నిటినీ పక్కన పెట్టినా ఈ నవల గొప్ప రొమాన్స్.
‘’ Few books bolder in conception, more vigorous in treatment, or fresher in fancy, have appeared for a long time, and we are grateful to Mr. Haggard for carrying us on a pinion, swift and strong, far from the world of platitudinous dullness, on which most young writers embark, to a region limited only by his own vivid imagination, where the most inveterate reader of novels cannot guess what surprise awaits him. ‘’ [Public Opinion]
రాజ్ఞి- మొదటి భాగం
[She( who must be obeyed ) by H. Rider Haggard, చిన్న చిన్న మార్పులూ చేర్పులతో]
ఇదంతా ఇంకా నిన్ననో మొన్ననో జరిగినట్లుంది. కొన్ని సంఘటనలు అంతే…వాటి సందర్భాలూ వివరాలూ అలా జ్ఞాపకాల్లో ముద్రించుకుపోతాయి. నా పేరు లుడ్విగ్ హొరేస్ హాలీ. ఇరవైపాతిక ఏళ్ళ కిందట ఈ నెలలోనే, ఆ రాత్రిపూట కేంబ్రిడ్జ్ లో నా గదిలో – ఏదో గణితశాస్త్రపు సమస్య తో కుస్తీ పడుతూ ఉన్నాను. వారం లో ఒక ఫెలో షిప్ కి సంబంధించిన పరీక్షకు నేను కూర్చోవాలి. మా కళాశాలలో అందరూ, ముఖ్యంగా నా ట్యూటర్ … అందులో నేను గొప్పగా నెగ్గుకొస్తానని అనుకుంటు న్నారు. చదివి చదివి అలిసిపోయి పుస్తకాన్ని పక్కకి విసిరేసి పొగ గూడు మీదినుంచి పైప్ తీసి ముట్టించాను. బల్ల మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. దాని వెనకాల ఎక్కువ వెడల్పు లేని పొడుగాటి అద్దం. పైప్ వెలిగించుకుంటున్నప్పుడు అద్దం లో నా ప్రతిబింబం కనిపించింది, నన్ను నేను పరిశీలించుకుంటూ ఉండిపోయాను. అగ్గిపుల్ల చివరంటా కాలి నా వేలు చురుక్కుమంది.
పైకే అనుకున్నాను – ” నా మెదడు లోపలి పదార్థం తో ఏదైనా చేయగలనే నమ్మకం ఉంది గానీ, ఈ బయట కనబడేదాంతో మటుకు నా వల్ల కాదు ”
మీకు సరిగా అర్థం కావటం లేదో ఏమో, నా రూపం లోని లోపాల గురించే నేను మాట్లాడుతున్నది ! ఇరవై రెండేళ్ళ వయసులో చాలా మంది మగవాళ్ళకి ఉండే కొద్దిపాటి నేవళం కూడా నాకు లేదు. పొట్టిగా కుదిమట్టంగా ఉంటాను. చేతులు పొడుగ్గా, కండలు తిరిగి ఉంటాయి గానీ కనుముక్కు తీరు బాగా మొరటు. లోతైన బూడిదరంగు కళ్ళు, నుదుటి మీదికి పెరిగి కప్పేస్తున్న జుట్టు… అదేదో ఎడారి మీద దాడి చేసే అడవికి మల్లే. కాస్త మార్పు తో ఇప్పటికీ నా ఆకారం అలాగే ఉంటుంది. బైబిల్ లో కెయిన్ లాగా, ప్రకృతి నన్ను వికృతరూపం తో అచ్చు వోసింది, అదే ప్రకృతి అసాధారణమైన శరీర బలాన్నీ మేధనూ కూడా వరమిచ్చింది. నా శక్తి సామర్ధ్యాలను కళ్ళతో చూసి మెచ్చుకున్న నా తోటి విద్యార్థులు కూడా నాతో కలిసి నడిచేందుకు ఇష్టపడేవారు కాదు, అటువంటి ఆకృతి నాది. ఒక్కడైనా స్నేహితుడు లేని నేను ఒంటరిగా పుస్తకాలతో గడిపేవాడిని. చెప్పుకోదగినంత మనుష్యద్వేషం నాలో ఉండేదంటే , అందులో ఆశ్చర్యం ఏముంది ? ప్రకృతే నన్ను ఒంటరివాడిని చేసి వదిలింది, ప్రకృతి ఒడిలో తప్ప నాకు ఇంకెక్కడా ఊరట లేదు. ఆడవాళ్ళు నన్ను చూస్తేనే అసహ్యించుకునేవారు. ఒక వారం కిందటే, నాకు వినిపించటం లేదనుకుని, ఒకామె నా వెనకనుంచి ‘ ఓ భూతమా ‘ అని పిలిచింది . నన్ను చూసి ఆమె డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకోవాల్సి వస్తోందట. ఒక సారి- ఒకే ఒక్కసారి, నా పైన ఒక స్త్రీ ఆదరం చూపెట్టింది. నా లోపల దాచుకున్న ఆప్యాయత నంతటినీ ఆమె పైన కురిపించుకున్నాను. ఈ లోపు నాకు వస్తుందనుకున్న ఆస్తి ఇంకెవరికో వెళ్ళింది, ఆమె నన్ను వదిలిపెట్టేసింది. అంతకు ముందూ ఆ తర్వాతా ఇంకే బతికిఉన్న ప్రాణి నీ బతిమాలనంతగా ఆమెను బతిమాలాను. ఆ ముఖం నాకెంతో ముద్దుగా ఉండేది, ప్రేమించాను ఆమెని. అంతా విని ఆమె నన్ను అద్దం దగ్గరికి చేయిపుచ్చుకు లాక్కుపోయింది…నా పక్కనే నిలుచుని అడిగింది-
” చూడు. నేను బ్యూటీని, కదూ ? మరి నువ్వు ? ఎవరు ? ”
అప్పటికి నా వయసు కేవలం ఇరవై ఏళ్ళు.
ఈ మధ్యకాలం లోనే నాకు స్నేహితుడనగలిగినవాడొకడు లభించటం నాకిప్పటికీ నమ్మ బుద్ధి కాదు, లోపల కరడుగట్టిన ఒంటరితనం కరిగే దశలో లేదు.
అప్పుడు , నేను చెబుతున్న రాత్రి వేళ , కూడా , నన్ను నేను చూసుకుంటున్నాను. నా ఒంటరితనం లోంచి నల్లటి తృప్తినొకదాన్ని అనుభవిస్తున్నాను…నాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా తమ్ముడూ అక్కా చెల్లెలూ ఎవరూ..ఎవరూ లేరు. అంతటి ఒంటరితనమూ ఒక ఘనతేగా మరి ?
తలుపు ఎవరో కొట్టిన చప్పుడు. కొంచెం చెవులు రిక్కించి విన్నాను..అప్పుడు రాత్రి పన్నెండు గంటలైంది. కొత్తవారెవరినీ చూడాలని లేదు, నా పిచ్చిగానీ నా కోసం ఎవరొస్తారని ! బహుశా అతనే వచ్చి ఉండాలి.
బయట వేచి ఉన్న మనిషి కొద్దిగా దగ్గాడు. నాకు ఆ దగ్గు ఎవరిదో తెలుసు, తలుపు తెరిచాను.
అతనికి దాదాపు ముప్ఫై ఏళ్ళుంటాయి. పొడుగ్గా ఉంటాడు, ఒకప్పుడు చాలా అందమైనవాడనిపిస్తుంది. బరువైన ఇనప పెట్టెను మోసుకుంటూ వచ్చాడు, దాన్ని బల్ల మీద దించుతూనే దగ్గు తెరలతో ఉక్కిరి బిక్కిరయాడు. దగ్గి దగ్గి మొహం నీలంగా ఐపోయింది, చివరన రక్తం పడింది గొంతులోంచి. గ్లాస్ లో కొద్దిగా విస్కీ పోసి అందించాను, కొంచెం తిప్పుకున్నాడు . ” నన్నెందుకు చలిలో నిలబడనిచ్చావు ? చలిగాలి నన్ను చావుకి దగ్గర చేస్తుందని నీకు తెలీదూ ? ” కినుకగా అడిగాడు నన్ను.
నేనన్నాను – ” చాలా ఆలస్యంగా వచ్చావు కదా, నువ్వని అనుకోలేదు ”
” ఊ. నేను రావటం ఇదే చివరిసారి అనిపిస్తోంది ” అతను నవ్వే ప్రయత్నం చేసి విఫలమయాడు- ” నా పని ఐపోయింది హాలీ ! రేపు తెల్లవారటం చూడనేమో ”
” పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను వెళ్ళి వైద్యుడి ని తీసుకొస్తాను ”..బయల్దేరబోయాను.
అతను నన్ను ఆపేశాడు- ” నేను బాగా తెలివిలో ఉండే అంటున్నాను హాలీ ! నాకు ఏ వైద్యుడూఅక్కర్లేదు. నేనూ వైద్యం చదువు కున్నానుగా, ఇది ఏమిటో నాకు బాగా తెలుసు. ఏ వైద్యుడూనన్ను కాపాడలేడు. చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. గడిచిన ఏడాది అంతా నేను బ్రతికి ఉండటమే ఒక అద్భుతం. నేను చెప్పేది ఇప్పుడే జాగ్రత్తగా విను , మళ్ళీ వినాలన్నా వీలుపడదు. ఈ రెండేళ్ళనుంచీ మనం స్నేహితులం కదా, నా గురించి నీకేం తెలుసో చెప్పు ? ”
” నువ్వు బాగా డబ్బున్నవాడివి. అందరూ కళాశాల వదిలేసే వయసుకి నువ్వు చేరావు ఇక్కడ, కేవలం సరదాకి. నీకు పెళ్ళి అయింది, నీ భార్య చనిపోయింది. నాకున్న అత్యుత్తమ, ఏకైక మిత్రుడివి నువ్వు ” – నేను బదులిచ్చాను.
” నాకొక కొడుకు ఉన్నాడని తెలుసా నీకు ? ”
” లేదు ”
” ఉన్నాడు. వాడికి ఐదేళ్ళు. వాడి పుట్టుకలో తల్లి మరణించింది , అందుకని ఏనాడూ వాడి మొహం తేరిపారచూడలేదు నేను. హాలీ ! నువ్వు ఒప్పుకుంటే నిన్ను వాడికి సం రక్షకుడుగా ఉంచుతాను ”
నేను గభాల్న లేవబోయాను- ” నేనా ! ”
” అవును, నువ్వే. ఈ రెండేళ్ళుగా నిన్ను గమని స్తూ ఉన్నది ఊరికే కాదు. కొన్నాళ్ళ నుంచీ తెలుసు నాకు, నేనింక అట్టే కాలం ఉండనని . అప్పటినుంచీ గాలిస్తున్నాను, జాగ్రత్తగా కాపాడగలవారి కోసం- నా కొడుకునీ, ఇదిగో, దీన్నీ ” అతను ఇనప పెట్టె మీద తట్టాడు. ” నువ్వు దొరికావు. మహావృక్షమంత దృఢమైనవాడివి నువ్వు. విను- నా కొడుకు ప్రపంచం లోనే అతి పురాతనమైన కుటుంబాలలో ఒకదానికి వారసుడు. నీకు నవ్వు రావచ్చు, కాని ఎప్పటికైనా ఈ సంగతి నిర్ధారణ అవుతుంది- నాకు అరవై ఏదు, అరవై ఆరు తరాల ముందు నా పూర్వీకుడు ఈజిప్ట్ లో ఐసిస్ దేవతకి అర్చకుడు. అంతకు ముందు అతను గ్రీక్ దేశం వాడు, పేరు కాలిక్రేటెస్. ఆ పేరుకి గొప్ప సౌందర్యమూ బలమూ ఉన్నవాడని అర్థం. . అతని తాత పేరూ కాలిక్రేటెస్ నే, హెరొడోటస్ 1 చెప్పిన కాలిక్రేటెస్ అతనేనని నా నమ్మకం. క్రీస్తు పూర్వం 339 లో, ఫారోల రాజ్యం కూలిపోతున్నప్పుడు ఆ కాలిక్రేటెస్ తన బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలేసి , తనను ప్రేమించిన ఒక రాజకుమారి తో కలిసి ఈజిప్ట్ వదిలేసి పారిపోయాడు. వాళ్ళ పడవ మునిగిపోయి, ఆఫ్రికా తీరం లో, ఇప్పుడు డెలా గోవా సింధుశాఖ ఉన్నచోట – భార్యతో సహా అతను తేలాడు. తతిమా అందరూ మరణించారు. అక్కడ ఆ ఇద్దరూ చాలా కష్టాలు పడ్డారు. ఆటవికుల రాణి ఒకతె వారిని ఆదుకుంది. చా లా శక్తివంతురాలైన రాణి ఆమె, గొప్ప సౌందర్యవతి కూడా.కొన్ని విచిత్రమైన పరిస్థితులలో ఆమె కాలిక్రేటెస్ ని హత్య చేసింది. ఆ పరిస్థితులేమిటీ అన్నది నేనిప్పుడు చెప్పలేను, ఈ పెట్టె లో ఉన్న సమాచారం ద్వారా నీకు తెలియచ్చు. అతని భార్య ఎలాగో తప్పించుకుంది, ఏథెన్స్ నగరానికి చేరింది. అప్పటికి గర్భవతి గా ఉన్న ఆమెకి కొడుకు పుట్టాడు, అతనికి టిసిస్థేనెస్ అని పేరు పెట్టింది…ఆ పేరుకి పగ తీర్చగల బలశాలి అని అర్థం. ఐదు వందల ఏళ్ళ తర్వాత ఆ కుటుంబం ఏవో కారణాళవల్ల రోమ్ కి వలస వెళ్ళింది. టిసిస్థేనెస్ అన్న పేరు ఎందుకు పెట్టారో మర్చిపోకుండా ఉండేందుకు ఆ వంశం వాళ్ళు ‘ విండెక్స్ ‘ అనే బిరుదనామం ధరిస్తూ వచ్చారు. రోమ్ లో తిరిగి ఐదు వందలేళ్ళు ఉన్నారు.
అప్పుడు, క్రీస్తు శకం 770 లో , ఛార్ల్ మేన్ 2 లొంబార్డీ 3 మీద దండెత్తినప్పుడు ఆయన తోబాటు వాళ్ళు వెళ్ళి అక్కడ నివసించారు. ఆ తర్వాత చక్రవర్తి వెంబడి ఆల్ప్స్ పర్వతాలు దాటి బ్రిటానీ4 లో స్థిరపడ్డారు. ఎనిమిది తరాలు గడిచాక ఆ వంశానికి వారసుడు ఇంగ్లీష్ చానెల్ దాటి ఇంగ్లండ్ కి వచ్చాడు. అప్పటికి అక్కడ Edward The Confessor 5 రాజ్యం చేస్తున్నాడు.ఆ కుటుంబం William The Conqueror 6 కాలం లో గొప్ప అధికారాన్నీ గౌరవాన్నీ పొందింది. ఆ కాలం నుంచి నా తరం వరకూ మా వంశ వృక్షాన్ని నేను పొల్లు పోకుండా చెప్పుకు రాగలను. విండెక్స్ అన్నమాట అప భ్రంశమై విన్సే గా మారింది . ఐతే, ఆ తర్వాతి కాలం లో విన్సే లు పెద్దగా చెప్పుకోదగినవారేమీ కాదు. . వాళ్ళు సైనికులుగా, వ్యాపారులుగా జీవించారు, మొత్తం మీద మర్యాదస్తులనిపించుకున్నారు. రెండో ఛార్లెస్ కాలం నుంచి ఈ శతాబ్దం మొదలయేవరకూ వాళ్ళు వ్యాపారస్తులు. 1790 లో మా తాత వైన్ తయారీ లో బాగా సంపన్నుడయాడు. 1821 లో ఆయన పోయాక మా నాన్న ఆస్తిని చాలావరకు నాశనం చేశాడు. పదేళ్ళ క్రితం ఆయనా పోయాడు. ఇప్పుడు సంవత్సరానికి రెండు వేల పౌండ్లు మాత్రమే మా ఆదాయం. మా నాన్న పోయాక నేను ఆ అన్వేషణ మొదలెట్టాను ” – ఇనప పెట్టె చూపిస్తూ అన్నాడు ” అందులో ఓడిపోయాను . వెనక్కి వస్తూ దక్షిణ యూరోప్ కి వెళ్ళాను, ఏథెన్స్ చేరాను. అక్కడ నా ప్రియమైన భార్యను కలుసుకుని పెళ్ళాడాను. లావణ్య రాశి ఆమె, ఎంత ప్రేమించానో మాటల్లో చెప్పలేను. తను నన్ను అంతకన్న ఎక్కువగా ప్రేమించింది ఏడాది గడిచేలోగా ఈ పిల్లవాడిని కని ఆమె మరణించింది ”
అతను చెప్పటం ఆపాడు కాసేపు. ఆ చరిత్ర పాఠం వంటి ఉపన్యాసాన్ని ఏకబిగిన విన్నాక నాకు తల తిరుగుతున్నట్లైంది… విన్సే , నాకు తెలిసి ఎప్పుడూ ఈ ధోరణిలో మాట్లాడలేదు.
అలుపు తీర్చుకుని కొనసాగించాడు ” నా పెళ్ళి వల్ల నా కర్తవ్యం ఒక దాన్ని నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక నా వల్ల కాదు , సమయం లేదు నాకు. నువ్వు నేను అడుగుతున్నదానికి అంగీకరిస్తే, ఒక నాటికి, ఆ చేయవలసిన పని ఏమిటో నీకు తెలుస్తుంది. నిజానికి నా భార్య పోయాక ఆ వైపు దృష్టి పెట్టాను కూడా, కాని అందుకోసం , ముందుగా తూర్పు దేశాల భాషలు క్షుణ్ణంగా నేర్చుకోవలసి ఉండింది. వాటిని అధ్యయనం చేసేందుకే ఇక్కడికి వచ్చాను. కాని ఈ వ్యాధి మొదలై నన్ను కబళిస్తోంది , నా జీవితం ముగిసిపోతోంది ” తన మాటలని అలాగ బలపరుస్తున్నాడా అన్నట్లు అతని దగ్గు తీవ్రమైంది.
మళ్ళీ కొంచెం విస్కీ ఇచ్చాను. కొంత విశ్రాంతి తర్వాత అన్నాడు – ” నా కొడుకుని వాడు పసిబిడ్డగా ఉన్నప్పుడు తప్ప మరి చూడలేదు, చూసి భరించగలిగేవాడిని కాదు. కానీ వాడు అందమైనవాడనీ మంచి తెలివిగలవాడనీ అంటుంటారు. లియో , వాడి పేరు. ఇదిగో, ఈ కాగితాలలో ” – ” అతను జేబులోనుంచి ఒక ఉత్తరం తీసి చూపించాడు, దాని పైన నా పేరు రాసిఉంది. ” వీటిలో నా కొడుకుని ఎలా, ఏమేమి చదివించాలో రాసిపెట్టాను. ఆ ప్రణాళిక కాస్త వింతగానే ఉంటుంది. ఎవరో ఎరగని వాళ్ళకి అప్పగించేది కాదు. చెప్పు, నువ్వు బాధ్యత తీసుకుంటావా ? ”
” నేనేమి చేయాల్సి ఉందో ముందు నాకు తెలియాలి కదా ? ” నేను జవాబు చెప్పాను.
” నా కొడుకుని , వాడికి ఇరవై ఐదేళ్ళు వచ్చేవరకు, నీతో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బడికి పంపకూడదు, బాగా గుర్తు పెట్టుకో. వాడి ఇరవై ఐదో పుట్టిన రోజున నీ సం ర క్షకుడి పాత్ర పూర్తవుతుంది. అప్పుడు వాడికి ఈ తాళం చెవులు ఇవ్వాలి ” తాళాల గుత్తిని బల్ల మీద పెట్టాడు. ” వాటితో ఈ పెట్టె తెరవాలి. లోపల ఉన్నదాన్ని వాడు చూడాలి, చదవాలి. ఆ పని చేయదలచుకున్నాడో లేదో నిర్ణయించుకోవాలి, బలవంతం ఏమీ లేదు . నాకు ప్రతిఏటా వచ్చే రెండువేల రెండు వందల పౌండ్ లలో సగం నీ పేర రాశాను. వెయ్యి పౌండ్ లు నీ జీవనం గడిపేందుకు, వంద నా కొడుకు పోషణ కోసం. తక్కిన దానికి వచ్చే వడ్డీనీ అసలునీ వాడి ఇరవై ఐదో పుట్టిన రోజుదాకా కలుపుతూ పోగు చేస్తే, అప్పుడు ఆ మొత్తం, పని మొదలుపెట్టేందుకు వాడికి మూలధనంగా ఉపయోగపడుతుంది ”
” ఈ లోగా నేను చనిపోతేనో ? ” అడిగాను.
‘’ అప్పుడు వాడు న్యాయస్థానం సం రక్షణ లోకి వెళతాడు. ఈ పెట్టె ని వాడికి వయసు వచ్చాక అందేలాగా నువ్వు వీలునామా రాసిఉంచాలి . నన్ను కాదనకు హాలీ, నీకూ ఇది లాభమే. నీకు నలుగురితో కలిసి తిరగటం సరిపడదు. కొద్ది వారాలలో నీకు ఇక్కడ అధ్యాపకుడి పదవి వస్తుంది. నీకు వచ్చే జీతానికి నేను ఇచ్చే డబ్బు కలిపితే నువ్వు చాలా హాయిగా, తీరుబడిగా బ్రతకచ్చు. నీకు ఇష్టమైనట్లు కాలక్షేపం చెయ్యచ్చు ”
అతను ఆగి, నా వైపు ఆరాటంగా గా చూశాడు. నేను ఇంకా వెనకాడుతున్నాను, ఈ బాధ్యత చాలా వింతగా అనిపిస్తోంది.
” నా కోసం, హాలీ ! ” అతను ప్రాధేయపడ్డాడు. ” మనం మంచి స్నేహితులం కదా …ఇప్పటికిప్పుడు నేను వేరే ఏర్పాట్లు చేసుకోలేను”
” సరే ” అన్నాను – ” చేస్తాను. కాని ఈ కాగితాల్లో నా మనసు మార్చేదేదీ ఉండకపోతేనే ” నా పేరు రాసి ఉన్న ఉత్తరాన్ని చూపిస్తూ అన్నాను.
” చాలా సంతోషం హాలీ ! చాలా కృతజ్ఞుడిని. వాటిలో అటువంటిదేమీ లేదు. భగవంతుడి మీద ప్రమాణం చేయ్యి, నా కొడుకుని తండ్రిలాగా చూసుకుంటాననీ, ఆ ఉత్తరం లో రాసిపెట్టినట్లు చేస్తాననీ ”
” ప్రమాణం చేస్తున్నాను ”
” మంచిది. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని ఒకనాటికి నిన్ను అడగబోతాను. నేను మరణించినా, నన్ను అందరూ మర్చిపోయినా , నేను జీవించే ఉంటాను. మృత్యు వు అన్నది లేదు, మార్పు తప్ప. సమయం వచ్చినప్పుడు నీకూ తెలుస్తుంది. ఆ మార్పు ని కూడా , కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో , నిరవధికంగా వాయిదా వెయ్యచ్చు- నా నమ్మకం అది ” – తిరిగి ఆ ప్రాణాంతకమైన దగ్గు అతన్ని ముంచెత్తింది.
” ఇక వెళ్తాను. పెట్టెని నీ దగ్గరే ఉంచు. ఉత్తరం లో నా వీలునామా ఉంది, దాని ప్రకారం నా కొడుకుని నీకు స్వాధీనం చేస్తారు. నువ్వు నిజాయితీ గలవాడివే, అయినా చెబుతున్నాను, మోసం తలపెడితే నేను చనిపోయి కూడా నిన్ను వదిలిపెట్టను ”
నేనేమీ జవాబు చెప్పలేకపోయాను, హడలిపోయి.
అతను కొవ్వొత్తి పైకెత్తి తన ముఖాన్ని అద్దం లో చూసుకున్నాడు. అందమైన ముఖం అది, వ్యాధి దాన్ని నాశనం చేసింది. ” రాబోయే కాలం లో పురుగులకి ఆహారం ” పెదవి విరిచాడు ..” అనుకుంటే వింతగానే ఉంది. కొద్ది గంటల్లో చల్లగా బిగుసుకుపోతాను, ప్రయాణం పూర్తయింది, ఆట ముగిసిపోయింది. జీవితానికి ఇంత యాతనని ఆశించే అర్హత లేదు హాలీ…ఒక్క ప్రేమలో పడినప్పుడు తప్ప ! నా జీవితానికి ఆ అర్హత లేదు, బహుశా లియో జీవితానికి ఉంటుందేమో, ధైర్యమూ విశ్వాసమూ ఉంటే. సెలవు మిత్రమా ” ఉన్నట్లుండి నన్ను ఆపేక్షగా దగ్గరికి తీసుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు , వెళ్ళబోతున్నాడు.
నేను కూడదీసుకుని అన్నాను- ” విన్సే, చూడు..నీకు అంత జబ్బుగా ఉంటే నన్ను వైద్యుడిని తీసుకురానివ్వచ్చు కదా ”
” లేదు లేదు ” అతను నొక్కి చెప్పాడు ” వైద్యుడిని పిలవనని మాట ఇవ్వు నాకు. చచ్చిపోబోతున్నాను నేను. విషం తిన్న ఎలుక లాగా, ఒంటరిగా చచ్చిపోతాను ”
” నువ్వేమీ చచ్చిపోవు , నేను నమ్మను ”
అతను నవ్వాడు. ” గుర్తుంచుకో ” అని వెళ్ళిపోయాడు. నేను అక్కడే కూలబడి కళ్ళు నులుముకున్నాను. అప్పటిదాకా జరిగింది కలేమో, నేను నిద్ర పోతున్నానేమో అనుకున్నాను. కాదనిపించేసరికి విన్సే తాగేసి వచ్చి అసంబద్ధంగా మాట్లాడాడేమో అనుకున్నాను. అతనికి జబ్బు గా ఉందని నాకు తెలుసు, ఐతే తెల్లారే లోగా చచ్చిపోతానని అతనికి ఎలా తెలుస్తుంది ? ? జబ్బు ముదిరిపోయి సంధించి ఉండాలనుకుంటే , అటువంటి స్థితిలో అంత దూరం నడిచి ఎలా రాగలిగాడు, అదీ బరువైన ఇనప పెట్టె ని మోసుకుంటూ ? ఈ కథంతా ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు , ఎంత మాత్రం నిజం కాదు.
నాకు ఆ వయసుకి , తెలుసుకునే జ్ఞానం లేదు… మామూలు మనుషుల ఇంగిత జ్ఞానం ప్రకారం అసాధ్యమూ అసంభవమూ అయినవి జరుగుతాయని. ఎవరైనా కొడుకుని పుట్టినప్పటినుంచీ ఐదేళ్ళు వచ్చేదాకా చూడకుండా ఉంటారా ? రెండు సంవత్సరాల స్నేహాన్ని బట్టి ఇంత పెద్ద బాధ్యత ఎవరైనా మరొకరికి అప్పజెబుతారా ? ఎవరైనా వాళ్ళ వంశ చరిత్రని క్రీస్తుపూర్వపు కాలం వెనకనుంచీ ఏకరువు పెట్టగలరా ?
విన్సే తాగేసి మాట్లాడకపోతే అతనికి పిచ్చెత్తి ఐనా ఉండాలి. లేకపోతే ఏమిటిది ? ఇంతకూ ఆ ఇనప పెట్టె లో ఏముంది ?
నాకంతా గజిబిజిగా భయం భయంగా తోచింది. నిద్రపోగలిగితే కొంచెం తేరుకుంటానేమోననిపించింది. తాళాల గుత్తినీ ఉత్తరాన్నీ నా పెట్టె లో దాచి పెట్టేసి, ఇనప పెట్టె ని పొగగూటి మీద ఉంచేసి వెళ్ళి పడుకుని నిద్రపోయాను. ఎవరో వచ్చి లేపేలోపున కొద్ది నిమిషాలు మాత్రమే నిద్ర పోయాననుకున్నాను. చూస్తే బాగా తెల్లారిపోయింది. పొద్దున ఎనిమిది గంటలైంది.
” జాన్, ఏమైంది నీకు ? ఏదో దయ్యాన్ని చూసి దడుచుకున్నట్లున్నావేం ? ” మా నౌకరుని అడిగాను. అతను విన్సే దగ్గర కూడా పని చేస్తుంటాడు.
” అవునయ్యా, చూశాను. శవాన్ని. అది ఇంకా ఘోరం కాదా ? ఎప్పట్లాగా విన్సే గారి ఇంటికి వెళ్ళాను , ఆయన చచ్చిపోయి ఉన్నారండీ”
[ ఇంకా ఉంది ]
1. Herodotus [484-425 B C ] – గ్రీక్ చరిత్రకారుడు, విస్తృతంగా ప్రయాణించినవాడు. ‘ Histories ‘ ప్రసిద్ధమైన రచన. ప్రాచీన భారతీయ నాగరికత గురించి కూడా విశదంగా పేర్కొన్నాడు.
2. Charlemagne – [ 742-814 ] . పశ్చిమ యూరోప్ ని పాలించిన చక్రవర్తి. ఆధునిక ఫ్రాన్స్, జర్మనీ లకు పునాది వేసినవాడు.
3. Lombardy – ఇప్పటి ఇటలీ లో ఒక ప్రాంతం
4. Brittany-ఫ్రాన్స్ లో వాయవ్య ప్రాంతం
5. Edward the confessor- [1042-1066 ] లో ఇంగ్లండ్ ని ఏలిన రాజు
6. William the conqueror – [1028-1087 ] వైకింగ్ ల [డేనిష్ ] సంతతి వాడు. గా ఉంటూ వెసెక్స్ రాజ వంశం లో చివరి వాడైన రెండవ హెరాల్డ్ ని యుద్ధం లో జయించి [చంపి] 1066 లో ఇంగ్లండ్ కి రాజు అయాడు.
కి. సే. శ్రీమతి మాలతి చందూర్ గారు గుర్తి కొచ్చారు…ఆవిడగారు చాల మంచి ఆంగ్ల బుక్స్ పరిచయం చేసేవారు..వారి వారసత్వం మీరు పుచ్చు కొంటె చాల సంతోషం …మీ వర్క్ గొప్పగా ఉంది.. కీప్ ఇత్ అప్ …..
ధన్యవాదాలు మామయ్య గారూ ….చాలా సంతోషం !
చాలా బాగుంది మైథిలి గారూ! మొదటి భాగమే ఉత్కంత భరితంగా ఉంది. మీ రచన కూడా ఎంతో సాఫీగా చదవడానికి హాయిగా (ఎప్పటిలాగే) ఉంది.
ధన్యవాదాలు!
ధన్యవాదాలండి …
మైథిలి గారూ,
కథాకథనంలో మీది అందెవేసిన శైలి. కుతూహలం సడలకుండా చాలా చక్కగా ఉంది.
అభివాదములు.
ధన్యవాదాలు సర్. You are so kind !
చక్కని ప్రణాళికతో మంచి రచనలను అనువాదం చేస్తున్ననందుకు అభినందనలు. మీరెంచుకున్న ఈవిరామ కృషి వినూత్నమైనది. ఉభయ తారకమైనది.
థాంక్ యూ అండీ
చాలా బావుంది మైథిలి గారు.
రచన లో అంశం ఎంత గొప్పదైనా, ఎంత ఉత్కంత భరితమైనదైనా, దానిలో చదివించే గుణం వుండాలి.
ఆ లక్షణం మీ రచనలో పుష్కలం గా వుంటుంది. ఎప్పట్లానే, ఇందులో కూడా నిండా పొంగారి వుంది.
చక్కటి తెలుగు సీరియల్ లా సహజం గా .తోచింది.
అభినందనలతో.
ధన్యవాదాలు దమయంతి గారూ. Happy !
మంచి ప్రయత్నం మైథిలి గారు…
మొదటి నుంచీ చివరి వరకూ ఏక బిగిన చదివించారు..
నిజమ్గానే మాలతి చన్దూర్ గారిని జ్ఞాపకం తెచ్చారు… అప్పట్లొ పాతకెరటాల్లాగ…
I am honored Jayashree garu, thank you !
కధలోని మొదటి పాత్ర యొక్క అంత బాధాకరమైన నేపథ్యాన్ని కొన్ని వాక్యాలలోనే సున్నితంగా చెప్పేశారు. విన్సే – గతం , మరణం ఉత్కంఠగా అనిపించింది. ఓహ్ , తరువాతి భాగం కోసం ఎదురుచూస్తూ _/\_ ” జీవితానికి ఇంత యాతనని ఆశించే అర్హత లేదు హాలీ…ఒక్క ప్రేమలో పడినప్పుడు తప్ప ! ” ఈ వాక్యం దాచేసుకున్నాం
థాంక్ యూ రేఖా …
రాజ్ఞి మొదటి భాగం చాల బావుంది , రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాను ,
ధన్యవాదాలండి
చాలా బావుంది మైథిలి గారూ, తర్వాత భాగం కోసం చూస్తూ
ధన్యవాదాలు రాధా గారూ
Chala baaga raasaru ante mimmalni takkuva cheyadamauthundemo. Mee Bhasha pads kosam Adbhutam, mee Archana saili athyadbhutamani cheppakkarledu.
Thank you very much sir ! Feeling blessed !
చాలా బాగుంది. super like
ధన్యవాదాలు రమేష్ గారూ
రాజ్ఞి – మొదటి భాగం చాలా interesting గా ఉంది. చాలా ఉత్కంఠమ్ గా చదివించింది. రెండవ భాగానికై ఎదురు చూస్తున్నాను. Very నైస్ translation . అభినందనలు.
ధన్యవాదాలు బాలా మూర్తి గారూ. నా శాయ శక్తులా ప్రయత్నిస్తాను !
మీ ఐదు చేతివేళ్ళ కి అదనంగా వొక్కో వేలికి తిరిగి ఐదు చేతి వేళ్ళు మైథలి గారు. వొక్కో చేతిలో వొక్కో సాహిత్యధార. యెంత బాగారాస్తారో యే ప్రక్రియలోనైనా. Thank you.
ఎంత తియ్యగా ఉన్నాయి మీ మాటలు …పద్మ గారూ , బోలెడు ఆనందం.
పనస తొనలు బాగుంటాయని మళ్ళి చెప్పక్కర్లేదేమో! అద్భుతమైన సహజమైన ప్రవాహం. అభినందనలు!
చాలా సంతోషం విజయ్ కోగంటి గారూ. థాంక్ యూ
మైథిలి గారూ, మీ అనువాదం చాలా హాయిగా ఉంది. నవల ఆసక్తి కరంగానూ ఉంది.
ధన్యవాదాలు సుజాత గారూ…
very intersting story
థాంక్ యు భవాని గారూ
ఇంగ్లీష్ లో చదివినా, మళ్ళా ఇంకొకసారి తెలుగు లో చదువుతున్నాను. కథ తెలిసినదే అయినా, మీ రచనలు ఇలా మొదలెట్టాక….ఆపటం సాద్యమా?.
థాంక్ యూ.