అనువాద కథ

కొలను – మొదటి భాగం

జూన్ 2015

పియా పట్టణంలోని మెట్రోపోల్ హోటలుకు యజమాని అయిన చాప్లిన్ నన్ను లాసన్ కు పరిచయం చేసినప్పుడు, లాసన్ పట్ల ప్రత్యేకమైన ధ్యాసను పెట్టలేదు నేను. అప్పుడు మేము హోటల్ లాంజ్ లో కూచుని కాక్టెయిల్ తాగుతున్నాము. ఆ ద్వీపానికి సంబంధించిన విషయాలమీద లోకాభిరామాయణం కొనసాగుతుంటే, వినోదం నిండిన ఉల్లాసంతో దాన్ని వినసాగాను.

చాప్లిన్ తన సంభాషణ ద్వారా నాకు ఉత్సాహాన్నీ ఆనందాన్నీ కలిగించాడు. అతడొక మైనింగ్ ఇంజినీరు. తను సాధించిన వృత్తిపరమైన విజయాలకు అంతగా విలువ లేని ప్రాంతంలో స్థిరపడటాన్ని అతని ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చునేమో. ఆయన చాలా తెలివిగల మైనింగ్ ఇంజినీర్ అని చెప్పుకుంటారు అక్కడి వాళ్లందరూ. అతడు చిన్నగా వుంటాడు. శరీరం లావుగా కాకుండా సన్నగా కాకుండా మధ్యరకంగా వుంటుంది. వెంట్రుకలు నల్లగానే వుంటాయి. కాని, తలమీద మాత్రం అక్కడక్కడ జుట్టు నెరిసిపోయి కొంత పలుచగా వుంటుంది. మీసాలు చిన్నగా, కొంచెం కొక్కిరిబిక్కిరిగా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎండ తగలడం చేతా, మద్యం తాగడం చేతా అతని ముఖం బాగా ఎరుపు రంగును కలిగి వుంటుంది. ఆ హోటలు పేరులో అట్టహాసం ఉన్నా దాని భవనం కేవలం రెండంతస్తులదే. దాన్ని అతని నలభై ఐదేళ్ల భార్య చక్కని అజమాయిషీతో పర్యవేక్షిస్తుంటుంది. సన్నగా పొడవుగా ఉండే ఆమె, ఆస్ట్రేలియా దేశస్థురాలు. చాప్లిన్ తరచుగా ఉద్రేకంతో, నిషాలో, భార్యపట్ల భయంతో ఉంటాడు. ఆ ద్వీపానికి కొత్తగా వచ్చినవారు కొద్ది రోజులు కాగానే చాప్లిన్ కూ అతని భార్యకూ మధ్య జరిగే కుటుంబ కలహాల గురించి వింటారు. భర్తను ఎప్పుడూ తన స్వాధీనంలో ఉంచుకోవటం కోసం ఆమె తన పిడికిలినీ పాదాన్నీ ఉపయోగిస్తుంది. అప్పుడప్పుడు భర్త బాగా తాగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే, ఆమె అతణ్ని ఇరవై నాలుగు గంటలపాటు గదిలో బంధించడం, మరునాడు అతడు వరండాలో దీనాతిదీనంగా భార్యతో వేడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్లకు అది వినపడటం మామూలే.

చాప్లిన్ ఒక వింతైన, ఆసక్తికరమైన మనిషి. తన జీవితంలో చాలా ఎత్తుపల్లాలతో కూడిన వైవిధ్యం ఉందని చెప్తుంటాడతడు. అది నిజమో అబద్ధమో తెలియదు కాని, అతడు చెప్పేది వినాలనిపిస్తుంది. ఒకసారి అట్లా చెప్తున్నప్పుడు మధ్యలో లాసన్ రావటం నాకు అంతరాయం అనిపించి లోలోపలే విసుక్కున్నాను. చాప్లిన్ అప్పటికే బాగా తాగి వున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. నాకు ఇష్టం లేకున్నా అతని బలవంతం మీద మరో పెగ్గును తాగటానికి ఒప్పుకున్నాను నేను. చాప్లిన్ మెదడులో అప్పటికే మందకొడితనం ఆవహించిందని గ్రహించాను. మర్యాద ప్రకారం, ఆనవాయితీ ప్రకారం తరువాతి రౌండులో మద్యానికి నేనే ఆర్డరివ్వాలి, నాకిష్టం ఉన్నా లేకపోయినా. అప్పుడు చాప్లిన్ లో వదరుబోతుతనం ప్రవేశిస్తుంది. తర్వాత అతని భార్య చూపులు కోపంతో నిండిపోవటం ఖాయం.

చాప్లిన్ ఆకారంలో లాగే లాసన్ ఆకారంలో కూడా ఎటువంటి ఆకర్షణా లేదు. అతడు కూడా సన్నగా చిన్నగా వుంటాడు. ముఖం కోలగా, చుబుకం చిన్నగా, ముక్కు పెద్దగా, కనుబొమల వెంట్రుకలు నల్లగా దట్టంగా వుంటాయి. ఈ ఆకార విశేషాలన్నీ అతని రూపానికి ఒక రకమైన వింత తరహాను ఆపాదించాయి. అతని కళ్లు చాలా నల్లగా పెద్దగా ఉంటాయి. ఆయన ఉల్లాసంగా కనిపిస్తాడు కాని, అది నిజమైన ఉల్లాసం కాదనిపిస్తుంది నాకు. అది ప్రపంచాన్ని మోసగించటం కోసం పైపైన అతడు ధరించే ముసుగు. అది అతనిలోని అల్పత్వాన్ని దాస్తున్నదనిపించింది. అతడు ఆహ్లాదంగా కనిపించినప్పటికీ, ఎందుకో కాని ఆ మనిషిలో కపటత్వం ఉందనుకునేవాణ్ని. తన బొంగురు కంఠంతో చాలా మాట్లాడేవాడు. చాప్లిన్, లాసన్ ఇద్దరూ తమ మందుపార్టీల గురించి చెప్పుకోవడంలో ఒకరినొకరు మించిపోతారు. ఇంగ్లిష్ క్లబ్ లో బాగా తాగిన రాత్రుల గురించీ, విపరీతంగా విస్కీ తాగుతూ వేటాడటం గురించీ, సిడ్నీకి వెళ్లినప్పుడు ఆ నగరంలో కాలు మోపిన దగ్గర్నుంచి తిరిగివచ్చే దాకా పూర్తిగా నిషాలో ఉండటం గురించీ వాళ్లు చెప్పుకునే ముచ్చట్లు అందరి నోళ్లలో గాథలుగా మారిపోయి ఇద్దర్నీ తాగుబోతులుగా మిగిల్చాయి. నాలుగు పెగ్గులు తాగింతర్వాత ఇద్దరికీ నిషా ఎక్కింది. కాని, ఇద్దరి తీరుల మధ్య చాలా భేదం వుంది. చాప్లిన్లో మొరటుతనం, నీచత్వం కనిపించగా, లాసన్ లో నిషా ఉన్నా సభ్యత కనిపించింది.

ఆఖరుకు లాసన్ కొంచెం తూలుతూ కుర్చీలోంచి లేచి, “నేను ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం మళ్లీ కలుస్తాను” అన్నాడు.
“మీ ఇంటావిడ బాగుందా?” అని అడిగాడు చాప్లిన్.

“ఆఁ”, అని వెళ్లిపోయాడు లాసన్. ఆ ఏకాక్షర సమాధానం కొంచెం వింతగా అనిపించడంతో నేను తలెత్తి చూశాను.

“మంచివాడు. నిజానికి చాలా మంచివాళ్లలో ఒకడు. కాని, పాపం బాగా తాగుతాడు. అతని మీద జాలి కలుగుతుంది” అన్నాడు చాప్లిన్, ఎటువంటి ఉద్వేగాన్నీ కనబరచకుండా.

చాప్లిన్ చేసిన ఈ వ్యాఖ్యలో కొంత హాస్యం లేకపోలేదు. తర్వాత మళ్లీ, “తాగిన మత్తులో వున్నప్పుడు లాసన్ ఎదుటివాడితో పోట్లాడాలనుకుంటాడు” అన్నాడు చాప్లిన్.

“అతడు తరచుగా నిషాలో వుంటాడా?” అని అడిగాను.

“విపరీతంగా. వారంలో మూడునాలుగు రోజులు చిత్తుగా తాగుతాడు. అతడట్లా మారటానికి ఈ ద్వీపమే కాక ఎతెల్ కూడా కారణం”

“ఎతెల్ ఎవరు?”

“ఆమె అతని భార్య. రెండు జాతుల మిశ్రమంగా పుట్టింది. ముసలి బ్రెవాల్డ్ కూతురు. భర్త ఆమెను తీసుకు పోయాడు కాని, అక్కడి పరిస్థితిని ఆమె తట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ భార్యాభర్తలిద్దరూ కలిసి వుంటున్నారు. ఏదో వొకరోజు తాగుడు మూలంగా కాకపోయినా మరే ఇతర కారణం చేత ఐనా ఉరేసుకుని చస్తాడు లాసన్. అతడు మంచివాడే కాని, తాగినప్పుడు మాత్రం భరించలేనంత అరాచకత్వం నిండుతుంది అతన్లో” అని చప్పుడు వచ్చేలా త్రేన్పు తీశాడు చాప్లిన్.

తర్వాత, “నేను పైకి వెళ్లి షవర్ కింద స్నానం చేస్తాను. ఆ చివరి పెగ్గును నేను తాగకుండా వుండాల్సింది. ఎప్పుడూ ఆ ఆఖరి పెగ్గే మనను బోల్తా కొట్టిస్తుంది” అన్నాడు. పైన వున్న స్నానాల గదిలోకి పోవాలని నిశ్చయించుకున్న అతడు కొంచెం సంశయిస్తూ మెట్లవైపు చూశాడు. తర్వాత అసహజమైన గాంభీర్యంతో లేచి నిలబడ్డాడు. మళ్లీ, “లాసన్ తో స్నేహం చేస్తే లాభమే. అతడు చాలా పుస్తకాల్ని చదివాడు. నిషాలో లేనప్పుడు ఎంత నెమ్మదిగా వుంటాడో! తల్చుకుంటే అది ఆశ్చర్యంగా వుంటుంది. చాలా తెలివైనవాడు కూడా. అట్లాంటి వాళ్లతో మాట్లాడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది” అన్నాడు.

ఈ విధంగా లాసన్ గురించిన దాదాపు మొత్తం కథను కొన్ని వాక్యాల్లో నాకు చెప్పాడు చాప్లిన్.

సాయంత్రం నేను సముద్రతీరం వెంట వాహ్యాళికి పోయి హోటలుకు తిరిగివచ్చి చూస్తే, అక్కడ లాసన్ కనిపించాడు. ఏ ఉద్వేగమూ లేని కళ్లతో లాంజ్ లోని పేముకుర్చీలో బాగా లోపలికి కూరుకుపోయినట్టుగా కూర్చుని వున్నాడు. మధ్యాహ్నం నుండి మద్యం తాగుతూనే వున్నట్టు అనిపించింది అతని వాలకం చూస్తే. అతనిలో మందకొడితనం కనిపించింది. చూపుల్లో వ్యాకులతా, ప్రతీకారభావంతో కూడిన కోపమూ ఉన్నాయని గ్రహించాను. ఒక్క క్షణం నా మీద దృష్టిని నిలిపాడతడు. కాని, నన్నతను గుర్తు పట్టినట్టు లేదు. అక్కడ పక్కనే డోమినో అనే పాచికల ఆట ఆడుతున్న ఇద్దరుముగ్గురు పురుషులు అతణ్ని చూడనట్టుగా తమ పనిలో మునిగిపోయారు. అతని వాలకంలోని ఆ సాదాసీదాతనమే అందుకు కారణం. నేను కూడా వాళ్లతో కలిసి ఆ ఆట ఆడటం మొదలు పెట్టాను.

“మీరు చాలా కలుపుగోలు మనిషి” అన్నాడు నా పక్కన వచ్చి కూచున్న లాసన్ అకస్మాత్తుగా.

అతడు కుర్చీలోంచి లేచి, వంగిన మోకాళ్లతో కొంచెం కుంటుతున్నట్టుగా తలుపువైపు నడిచాడు. మా ఆటా, ఆ వాతావరణం అతనికి హాస్యాస్పదంగా కనించాయా అనిపించింది. లాసన్ అక్కణ్నుంచి కదలగానే, ఆటాడుతున్నవారిలో ఒకడు కిసుక్కున నవ్వి “ఇవ్వాళ్ల బాగా తాగి వున్నాడు ఆయన” అన్నాడు.

మరొకడు, “తాగి కూడా అతనిలాగా నింపాదిగా ఉండలేకపోతే అసలు తాగకపోవడమే మంచిదనిపిస్తుంది” అన్నాడు.

ఆ నిర్భాగ్యుడు నిజానికి ఒకరకంగా ప్రేమ నిండిన వాడిలాగానే ఉన్నాడనీ, కాని విషాదాన్ని తలపింపజేయడానికి అవసరమైన దీనత్వమూ భయమూ అతని జీవితంలో ఉన్నాయనీ ఎవరూహిస్తారు?

తర్వాత రెండుమూడు రోజుల వరకు లాసన్ కనపడలేదు.

ఒకరోజు సాయంత్రం వేళ నేను హోటల్ మొదటి అంతస్తులోని వరండాలో కూచుని వున్నాను. అక్కణ్నుంచి హోటల్ ముందరి వీధి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు లాసన్ వచ్చి నా పక్కన వున్న కుర్చీలో కూర్చున్నాడు. అతనిలో నిషా వంటిది ఎంతమాత్రం లేదు, చాలా నెమ్మదితనం వుంది. యధాలాపంగా నాతో యేదో అన్నాడతడు. నేను కొంచెం ఉపేక్షతో జవాబిచ్చేసరికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా నవ్వుతూ “మొన్న నేను విపరీతంగా తాగి నిషాలో వున్నాను” అన్నాడు.

నేను జవాబివ్వలేదు. నిజానికి అనటానికి ఏమీ లేదు కూడా. చుట్ట తాగుతున్న నేను దోమల్ని తరమటం కోసం పొగను నోటితో చుట్టూ ఊదాను. అక్కడి స్థానిక కూలీలు పని ముగించుకుని హోటలు ముందరి రోడ్డు మీదుగా తమ యిళ్లకు తిరిగి వెళ్తుండటం చూశాను. వాళ్లు పెద్దపెద్ద అంగలతో మెల్లగా, జాగ్రత్తగా, హుందాగా నడుస్తున్నారు. చెప్పులు లేని పాదాలతో వాళ్లు నడుస్తుంటే వింతైన శబ్దం వస్తోంది. వాళ్ల వెంట్రుకలు సాధారణంగా మెలితిరిగి కాని, వంపు లేకుండా కాని నల్లగా ఉంటాయి. అప్పుడు మాత్రం వాళ్ల వెంట్రుకలు తెల్లని పొడితో నిండి ఒక అసాధారణమైన ప్రత్యేకతను కనబరుస్తున్నాయి. వాళ్లు దృఢమైన శరీరాలతో పొడవుగా ఉన్నారు. వాళ్ల తర్వాత సాల్మన్ ద్వీపానికి చెందిన కాంట్రాక్టు కూలీల గుంపొకటి పాటలు పాడుకుంటూ వెళ్లింది. వాళ్లు బొగ్గులాంటి కారు నలుపుతో, ఎర్రరంగు వేసుకున్న వెంట్రుకల్తో, పెద్దపెద్ద తలలు కలిగిన సమోవా ద్వీపవాసులకన్న పొట్టిగా, చిన్నగా ఉన్నారు. మధ్యమధ్య తెల్ల జాతీయులు తమ గుర్రపు బగ్గీల్లో రోడ్డు మీదుగా పోవటమో లేక హోటలు ప్రాంగణంలోకి రావటమో చేస్తున్నారు. ఎదురుగా వున్న ప్రశాంతమైన సముద్రపు నీళ్లలో నిలిచి వున్న రెండుమూడు ఓడలు తమ సొగసును కనబరుస్తున్నాయి.

“ఇట్లాంటి ప్రదేశంలో ఫుల్లుగా తాగటం తప్ప చేయటానికి పనేమి ఉంటుందో తెలియదు నాకు” అన్నాడు ఆఖరుకు లాసన్.
ఏదో అనాలి కదా అనుకుని “సమోవా ద్వీపం మీకు నచ్చలేదా?” అన్నాను.

“ఈ ద్వీపం అందంగానే వుంటుంది” అన్నాడతడు.

ఆ వాక్యం సమోవా ద్వీపపు అద్భుతమైన అందాన్ని వర్ణించడానికి ఎంతమాత్రం సరిపోలేదనిపించింది. నేను నవ్వి అతనివైపు తిరిగాను. అతని కళ్లలో భరించలేనంత ఆవేదన కనిపించింది. వాటిలో అనంతమైన విషాదపు లోతులున్నాయి. అటువంటి భావోద్వేగాన్ని అతడు చూపగలడని నేను అసలే ఊహించలేదు. కాని, అతని ముఖంలోని ఆ భావం వెంటనే మాయమై అతడు నవ్వాడు. ఆ నవ్వు సాదాసీదాగా, కొంచెం అమాయకంగా వుంది. దాన్తో అతని ముఖకవళిక మారింది. దాని మూలంగా నాలో అతని పట్ల మొదటిసారిగా కొంత విముఖత ఏర్పడింది.

“నేనిక్కడికి వచ్చిన కొత్తలో ఊరంతా తిరిగేవాణ్ని” అని ఒక్క క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు లాసన్. తర్వాత మళ్లీ, “మూడు సంవత్సరాల పాటు ఈ ద్వీపాన్ని వదిలి దూరంగా ఉన్నాను. కాని, తర్వాత తిరిగివచ్చాను” అన్నాడు. ఆ పైన కొంచెం తటపటాయించి “మళ్లీ ఇక్కడికే రావాలని నా భార్య పట్టుబట్టింది. ఆమె ఇక్కడే పుట్టిందని మీకు తెలుసు కదా” అన్నాడు.

“ఔను, తెలుసు” అన్నాను.

అతడు మళ్లీ మౌనం వహించాడు. తర్వాత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ గురించి ఏదో వ్యాఖ్య చేశాడు. “మీరు వైలిమాకు వెళ్లారా?” అని అడిగాడు. ఏదోవిధంగా నాతో కలుపుగోలుగా వుండాలని ప్రత్నం చేస్తున్నాడతడు. స్టీవెన్సన్ పుస్తకాల గురించి మాట్లాడాడు. తర్వాత సంభాషణ లండన్ నగరం మీదికి మళ్లింది.

“అక్కడి కావెంట్ గార్డెన్స్ ఇంకా అట్లానే ఉత్తేజకరంగా ఉన్నాయనుకుంటాను. ఆ సంగీత నాటకాలను నేనిక్కడ యెంతగానో మిస్సవుతున్నాను. ట్రిస్టాన్ అండ్ ఐలోడ్ అనే నాటకాన్ని చూశారా మీరు?” అని అడిగాడు.

ఆ ప్రశ్నకు జవాబు తనకెంతో ముఖ్యమైనది అన్నట్టుగా అడిగాడు. “చూశాను” అని నేను ముక్తసరిగా చెప్పగానే సంతోషాన్ని కనబరిచాడు. వాగ్నర్ సంగీతం గురించి మాట్లాడాడు. ఒక సంగీతపరుడిలా కాక, మామూలు మనిషిలా మాట్లాడాడు. వాగ్నర్ సంగీతం ద్వారా ఒక రకమైన మానసిక తృప్తిని పొందాననీ, కాని దాన్ని వివరించలేననీ అన్నాడు.

“నాకు అంతగా డబ్బూ అదృష్టమూ లేవు కాని, బేర్సూత్ నిజంగా చూడాల్సిన ప్రదేశం. కాని, అది కావెంట్ గార్డెన్సంత బాగా ఉండదనుకోండి. ఆ సంగీత నాటకశాలలో అద్భుతమైన తళతళల వెలుతురూ, మెడకింది దాకా దుస్తుల్ని ధరించిన స్త్రీలూ, ఇంకా ఆ శ్రావ్యమైన సంగీతమూ ఎంతో బాగుంటాయి. వాక్యూర్స్ నాటకంలోని మొదటి అంకం చాలా బాగుంటుంది కదా. ఇక ట్రిస్టాన్ నాటకంలోని చివరి ఘట్టమైతే అద్భుతం. ఆహా, ఎంత దివ్యంగా ఉంటుందో!” అన్నాడు.

ఈ మాటలు చెప్తుంటే అతని కళ్లలో మెరుపు కనిపించింది. ముఖం దీప్తితో వెలిగిపోయి, అతడు అంతకుముందు కనిపించిన మనిషి కాదనిపించింది. తెల్లని చెక్కిళ్లు ఎరుపు రంగును పులుముకున్నాయి. అంతకు ముందు అతని గొంతు బొంగురుగా, కొంచెం వికృతంగా ఉండిన సంగతి మరచిపోయాను. కొంత ఆకర్షణీయంగా కూడా కనపడ్డాడతడు.

“దేవుని తోడు, ఈ రాత్రి లండన్లో ఉండాలనిపిస్తోంది నాకు. అక్కడి పాల్ మాల్ రెస్టారెంట్ మీకు తెలుసు కదా. అందులోకి నేను చాలా సార్లు పోయేవాణ్ని. ఇక పికాడిలీ సర్కస్ దగ్గర దుకాణాలన్నీ వెలుగుతో నిండిపోయి, అక్కడ జనంతాలూకు రద్దీతో యెంతో కోలాహలంగా వుంటుంది. అక్కడ నిల్చుని ఒక్క క్షణం కూడా తెరిపి లేకుండా వచ్చే పోయే బస్సులనూ టాక్సీలనూ చూస్తుంటే ఆనందంతో దిమ్మ తిరిగిపోతుంది. భగవంతుని గురించీ, చేరింగ్ క్రాస్ గురించీ రాయబడిన ఆ పంక్తులు గుర్తున్నాయా మీకు?” అని అడిగాడు లాసన్. నాకు చెప్పరానంత ఆశ్చర్యం కలిగింది.

“థామ్సన్ రాసిన పంక్తులా?” అని అడిగాను. తర్వాత ఆ పంక్తుల్ని చదివాను ఇలా -

‘అంతులేని విషాదం నిన్ను ఆవరించినప్పుడు
అప్పుడు -
స్వర్గానికీ చేరింగ్ క్రాస్ కూ మధ్య వున్న జనాల జేకబ్ నిచ్చెన
ఆ ప్రజాసమూహం వెల్తురుతో తళతళా మెరుస్తుంది’

లాసన్ చిన్నగా నిట్టూర్చాడు.

“దహౌండ్ ఆఫ్ హెవెన్ చదివాను నేను. అది బాగుంది” అన్నాడు.

“సాధారణంగా అందరూ అట్లానే అంటారు” అని గొణిగాను.

“ఇక్కడ పుస్తకాలు చదివేవాళ్లెవరూ కనపడరు. చదవటం అనేది అట్టహాసం అనుకుంటారు వీళ్లు”

అతని ముఖంలో బెంగ నిండిన చూపు కనపడింది. నా దగ్గరికి రావాలని అతడెందుకనుకున్నాడో ఊహించాను. తాను కోల్పోయిన ప్రపంచాన్ని, మళ్లీ అనుభవించలేని జీవితాన్ని నాకూ తనకూ మధ్య వున్న లంకెగా భావించాడు. ఎందుకంటే అప్పటికి కొంత కాలం క్రితమే నేను లండన్లో ఉండి వచ్చాను. అందుకు గాను నాపట్ల సంభ్రమం నిండిన ఆశ్చర్యం, అసూయా కలిగాయి అతనికి. ఐదు నిమిషాల వరకు అతడు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఉద్రేకం నిండిన తీవ్రతతో “నేనిక్కడ విసిగిపోయాను, బాగా విసిగిపోయాను” అన్నాడు. ఆ మాటలకు నేను చలించిపోయాను.

“అయితే మరి నువ్వెందుకు ఇక్కణ్నుంచి వెళ్లిపోవు?” అని అడిగాను.

“నా ఊపిరితిత్తులకు చిన్న వ్యాధి వచ్చింది. ఇంగ్లండులోని చలికాలాన్ని నేనిప్పుడు తట్టుకోలేను”

ఆ సమయంలో మరొక వ్యక్తి ఆ వరండాలోకి రావడంతో లాసన్ మళ్లీ మౌనంలోకి కూరుకుపోయాడు.

“ఇది మందు తాగాల్సిన సమయం. ఎవరు నాతో కలిసి కొంచెం విస్కీ తాగుతారు? నువ్వేమంటావు లాసన్?” అన్నాడు అప్పుడే వచ్చిన వ్యక్తి.

లాసన్ వేరే లోకంలోంచి బయటికి వచ్చినట్టనిపించాడు. అతడు కుర్చీలోంచి లేచి, “కింద వున్న బార్లోకి పోదాం పద” అన్నాడు. వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.

లాసన్ పట్ల నాకు సానుభూతి భావం కలిగింది. అతడంటే ఆసక్తి, కలవరం ఏర్పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత నేనతని భార్యను కలిశాను. వాళ్ల పెళ్లి జరిగి ఐదారేళ్లు కావస్తుందని తెలిసింది. కాని, ఆమె యింకా చాలా చిన్న వయసున్న స్త్రీలాగా కనిపించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. లాసన్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు పదహారేళ్లకన్న యెక్కువ లేదు.
అప్పుడామె అద్భుతమైన అందంతో వెలిగిపోయేది. చామనచాయతో, చిన్నచిన్న చేతులతో, పాదాలతో, తీగలాంటి అతి సన్నని శరీరంతో చాలా ముద్దొచ్చేది. మిశ్రమ జాతికి చెందిన స్త్రీలు సాధారణంగా లావుగా, మోటుగా వుంటారు. కాని, లాసన్ భార్యలోని కోమలత్వం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సౌకుమార్యాన్ని చూస్తుంటే ఊపిరి తీసుకోవడం మానేసి నోరు తెరుస్తాము. చాలా నాగరికంగా కనిపించే ఆమె అటువంటి ప్రాంతంలో ఉండటం ఆశ్చర్యకరమే. మూడవ నెపోలియన్ దర్బారులోని అందాల రాశులు గుర్తుకొస్తారు ఆమెను చూస్తే. ఫ్రాకు, హ్యాటు ధరించే ఆమెలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తుంది. లాసన్ ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు ఆమెలో కళ్లు మిరుమిట్లు గొలిపే అందం, మనోహరత్వం ఉండివుంటాయి.

లాసన్ ఈ మధ్యనే సమోవా ద్వీపంలోని ఒక బ్యాంకులో మేనేజరుగా పని చేయడానికి ఇంగ్లండు నుండి వచ్చాడు. అది వేసవి కాలపు ప్రారంభం. అతడు హోటల్లో ఒక గదిలో ఉంటున్నాడు. వచ్చిన కొత్తలో వెంటనే అక్కడి మనుషులందరితో పరిచయం చేసుకున్నాడు. ఆ ద్వీపపు వాతావరణం హాయిగా వుంటుంది. అక్కడి జీవితంలో నెమ్మదితనం ఉండటం ఒక విశేషం. ఆ హోటల్లోని లాంజ్ లో తీరికగా, బద్ధకంగా సాగే పిచ్చాపాటీ అన్నా, సాయంత్రాల్లో కొందరు వ్యక్తులు ఇంగ్లిష్ క్లబ్ లో ఆడే బిలియర్డ్స్ ఆటను చూడటమన్నా అతనికి యెంతో ఇష్టం. సముద్రతీరం వెంబడి పొడవుగా వ్యాపించి వున్న ఏపియా పట్టణాన్నీ, అక్కడి బంగళాలనూ, పక్కనే వున్న గ్రామ వాతావరణాన్నీ అతడు ఇష్టపడతాడు. వారాంతపు రోజుల్లో ఊరిబయట కొండల మీద రైతుల ఫామ్ హౌజులకు పోయి, ఒకటిరెండు రాత్రులు అక్కడ గడిపి వస్తాడు లాసన్. ఇంగ్లండులో వున్నప్పుడు తీరిక, స్వేచ్ఛ అన్నవి తెలియవు అతనికి. సమోవా ద్వీపంలో పుష్కలంగా సోకే సూర్యరశ్మి అతణ్ని ముగ్ధుణ్ని చేసింది. ఊరిబయటి పొదల మధ్యలోంచి పోతున్నప్పుడు చుట్టుపక్కల వున్న ప్రకృతి అందాన్ని చూసి అతని తల ఆనంద పారవశ్యంతో ఊగుతుంది. ఆ ద్వీపంలోని భూమి వర్ణించలేనంత సారవంతమైనది. ఒకదానితో మరొకటి పెనవేసుకున్న రకరకాల వింతవింత చెట్లతో, నేల నిండా దట్టంగా పరచుకున్న చిన్నచిన్న మొక్కలతో తీగలతో అడవి స్వచ్ఛంగా, మనోహరంగా ఉంటుంది. అవన్నీ అగోచరత్వంతో కూడి, హృదయాన్ని కదిలించి ఇబ్బంది పెట్టే దృశ్యాలు.

ఇంకా ఉంది…

ఆంగ్ల మూలం: The Pool - సోమర్సెట్ మామ్
అనువాదం: ఎలనాగ

**** (*) ****