అనువాద కథ

కొలను – మూడవ భాగం

ఆగస్ట్ 2015

ఇంగ్లండులో ఉన్న తన దాయాదికి లాసన్ ఒక ఉత్తరం రాశాడు. అతడు అక్కడి ఒక షిప్పింగ్ కంపెనీలో భాగస్వామి. తన ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదుట పడ్డది కనుక తాను ఇంగ్లండుకు తిరిగి రావాలనుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో తెలిపాడు లాసన్. తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి యెంత చిన్న జీతమున్న ఉద్యోగమైనా సరే చూడమనీ, అది డీసైడ్ అనే ప్రదేశంలో వుంటే బాగుంటుందనీ, ఎందుకంటే అక్కడి వాతావరణం ఊపిరితిత్తుల జబ్బు వున్న తనకు ఎక్కువగా నష్టం చేయదనీ ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఆ ఉత్తరం చేరడానికి ఐదు వారాల కాలం పడుతుంది కనుక ఎతెల్ ను సిద్ధం చేయటం కోసం అది సరిపోతుందని భావించాడు. ఆ విషయం తెలియగానే ఎతెల్ చిన్నపిల్ల లాగా ఆనందపడింది. తాను ఇంగ్లండుకు పోతున్నట్టు ఎతెల్ తన స్నేహితురాళ్లతో బడాయిగా చెప్పుకోవటం చూసి లాసన్ ఎంతో సంబరపడి పోయాడు. ఆ అవకాశం తన జీవితంలో పైమెట్టు వంటిదనీ, అక్కడికి పోయితర్వాత తాను పూర్తిగా ఆంగ్లేయురాలి లాగా మారిపోతుందనీ సంతోషిస్తూ, ప్రయాణం చేసే రోజు కోసం ఆతృతతో ఎదురు చూసింది ఎతెల్. ఆఖరుకు అతనికి కింకార్డిన్ షైర్ అనే ప్రదేశంలోని బ్యాంకులో ఉద్యోగం దొరికినట్టు టెలిగ్రామ్ రాగానే ఆమె యెంతో సంతోషించింది.

సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఇంగ్లండులోని ఆ చిన్న పట్టణానికి చేరుకుని, అక్కడ స్థిరపడ్డ తర్వాత మళ్లీ తన సొంత దేశస్థుల మధ్య జీవించడం తనకు యెంత ఆనందాన్నిస్తుందో తెలుసుకున్నాడు లాసన్. గత మూడు సంవత్సరాల కాలంలో ఏపియా పట్టణంలోని తన జీవితాన్ని తల్చుకుని, ఇప్పుడు మళ్లీ ఇంగ్లండులో బతకడం సబబైన విషయంగా భావిస్తూ హాయిగా నిట్టూర్చాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ గోల్ఫ్ ఆడటం, గాలంతో చేపలు పట్టటం అతనికి ఆనందాన్నిచ్చాయి. సమోవా ద్వీపంలో చేపలు పట్టడం అతనికి ఉత్సాహాన్నివ్వలేదు. బాగా జనసమ్మర్దం వున్న అక్కడి నీళ్లలో గాలం వేయగానే ఒకటి తర్వాత ఒకటి పెద్దపెద్ద మందకొడి చేపలు పడేవి. ఇక్కడ పేపర్లో తాజా వార్తల్ని చదవటం, తన జాతీయులను కలిసి వాళ్లతో ప్రతిరోజూ మాట్లాడటం, తాజా మాంసాన్ని తినడం, తాజా పాలను తాగటం – ఇవన్నీ అతనికి బాగా ఆనందాన్నీ, సంతృప్తినీ ఇచ్చాయి. సమోవాలోని పరిస్థితికి విరుద్ధంగా యిక్కడ సొంత వనరుల మీదనే ఎక్కువగా ఆధారపడటం, ఎతెల్ పూర్తిగా తనదే కావటం అతనికి ఆహ్లాదాన్ని కలిగించాయి. రెండు సంవత్సరాలు గడిచింతర్వాత చూసుకుంటే, ఎతెల్ పట్ల లాసన్ చాలా గాఢమైన ప్రేమతో వున్నాడు. ఆమె తన కళ్లముందు లేకపోతే భరించలేకపోయాడు. ఆమెతో మరింత ప్రేమగా చనువుగా మాట్లాడాలనిపించడం మొదలైంది. కాని ఎతెల్ మాత్రం వచ్చిన మొదట్లో మాత్రమే ఉత్సాహాన్ని చూపినట్టూ, రానురాను ఆమెలో ఉత్సాహం తగ్గిపోయినట్టూ గమనించాడు లాసన్. పరిసరాలకు ఆమె అలవాటు పడలేదు. ఆమెలో కొంత మందకొడితనం ప్రవేశించింది. ఆకురాలే కాలం పోయి శీతాకాలం రాగానే తనకు బాగా చలిగా వుందని అన్నదామె. మధ్యాహ్నం దాకా ఆమె మంచంలోనే పడివుండి, పగలునుండి సాయంత్రం దాకా సోఫా మీద కూర్చుని నవలలు చదివింది. మిగతా సమయాల్లో ఏమీ చేయకుండా బద్ధకంతో వుంది. ఆమె సన్నబడిపోయి, పాలిపోయింది.

“ఫరవా లేదు డార్లింగ్. త్వరలోనే ఇక్కడి పరిసరాలకు, జీవితానికి అలవాటు పడిపోతావు నువ్వు. వేసవి కాలం రానీ. అప్పుడిక్కడ దాదాపు ఏపియాలో ఉన్నంత వేడిగా ఉంటుంది” అన్నాడు.

లాసన్ కు ఒంట్లో బలం చేకూరినట్టైంది. మునుపటికన్న బాగయ్యాడు.

సమోవాలో ఉన్నప్పుడు ఎతెల్ తన యిల్లును సరిగ్గా పెట్టుకోకపోయినా అక్కడ దాన్నెవరూ పట్టించుకోలేదు. కాని ఇక్కడ ఇంగ్లండులో అది కుదరదు. తెలిసినవాళ్లెవరైనా వచ్చినప్పుడు తమ యిల్లు అపరిశుభ్రంగా ఉండటం లాసన్ కు నచ్చలేదు. అప్పుడతడు నవ్వుతూ ఎతెల్ తో పరాచికాలాడుతూ తనే అన్నీ సర్దుతుంటే ఆమె బద్ధకంతో చూసింది. గంటల తరబడి ఆమె తన కొడుకుతో ఆడుతూ సమయాన్ని గడిపింది. తన సొంత భాషలో చిన్నపిల్ల లాగా వాడితో మాట్లాడింది. ఆమెకు ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఇరుగుపొరుగు వాళ్లతో లాసన్ స్నేహం చేశాడు. అప్పుడప్పుడు వాళ్లు చిన్నచిన్న పార్టీలకు పోయేవాళ్లు. అక్కడ ఆడవాళ్లు పాటలు పాడుతుంటే మగవాళ్లు కూర్చుని బుద్ధిమంతుల్లాగా మౌనంగా ఉండటం గమనించింది ఎతెల్. ఆమెకు బిడియం ఎక్కువ కాబట్టి వాళ్లకు దూరంగా కూర్చుంది. ఒక్కోసారి లాసన్ అకస్మాత్తుగా ఆందోళన చెంది “సంతోషంగా ఉన్నావా ఎతెల్?” అని అడిగేవాడు.

ఆమె “సంతోషంగా ఉన్నాను” అని జవాబిచ్చేది.

కాని ఆమెకళ్ల వెనుక ఏ విధమైన భావన దాగివుందో గుర్తించలేకపోయాడు లాసన్. ఆమె తనలోకి తానే కుచించుకుపోతున్నట్టు అనిపించిందతనికి. కొలనులో స్నానం చేస్తున్న ఎతెల్ ను మొదటిసారిగా చూసినప్పుడు తనకు ఆమె ఎంత తెలిసిందో ఇప్పుడు అంతకన్న ఎక్కువగా ఏమీ తెలియలేదనుకున్నాడు. ఆమె తననుండి ఏదో దాస్తున్నదని ఊహించి బాధ పడ్డాడు. ఆమెను తను ఆరాధిస్తాడు కనుక అది అతణ్ని మానసిక చిత్రవధకు గురి చేసింది.

“ఏపియాను వదిలి ఇక్కడికి వచ్చినందుకు నువ్వు పశ్చాత్తాప పడుతున్నావా?” అని అడిగాడు.

“లేదులేదు. ఇక్కడ బాగానే వున్నట్టుంది” అన్నది ఎతెల్.

ఒక అస్పష్టమైన సందేహం మనసులో మెదిలి, పరీక్షించటం కోసం సమోవా ద్వీపం గురించీ అక్కడి మనుషుల గురించీ కొంచెం తక్కువ చేస్తూ రెండుమూడు మాటలు మాట్లాడాడు. ఆమె నవ్వి ఊరుకుంది. చాలా అరుదుగా ఆమెకు సమోవానుండి ఉత్తరాల కట్ట వచ్చేది. అప్పుడు ఒకటిరెండు రోజుల పాటు ఆమె ముఖం బాగా పాలిపోయేది.

“ఏం జరిగినా తిరిగి ఆ ద్వీపానికి పోను నేను. అది తెల్లజాతి వాళ్లు ఉండతగిన ప్రదేశం కాదు” అన్నాడొకసారి.

కాని, తాను ఆఫీసుకు పోయినప్పుడు ఎతెల్ ఏడుస్తున్నదని అనుమానించాడు లాసన్. ఏపియాలో ఉన్నప్పుడు ఆమె చాలా ఉత్సాహంతో ఉల్లాసంతో గలగలా మాట్లాడేది. కాని ఇప్పుడు రానురాను ఆమె మౌనం వహిస్తోంది. లాసన్ ఎంత ప్రయత్నించినా ఆమెలోని ముభావం పోలేదు. సమోవా ద్వీపంలోని జీవితపు జ్ఞాపకాల మూలంగా ఎతెల్ తనకు దూరమౌతోందని గ్రహించిన లాసన్ కు ఆ ద్వీపం పట్ల, నలుపురంగులో వుండే ఆ స్థానిక ప్రజలపట్ల పిచ్చి అసూయ కలిగింది. ఆమె సమోవా ద్వీపం గురించి మాట్లాడినప్పుడల్లా అతడు ద్వేషంతో రగిలిపోయాడు. ఒకనాడు సాయంత్రం అతడు గోల్ఫ్ ఆడి ఇంటికి రాగానే ఆమె సోఫాలో పడుకుని కాక తలుపు దగ్గర నిలబడి వుండటం చూశాడు. ఆమె తనకోసమే వేచిచూస్తోందని తెలుసుకున్నాడు. లాసన్ లోపలికి రాగానే ఎతెల్ సమోవా భాషలో మాట్లాడటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

“ఇక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేను. ఈ జీవితమంటే నాకసహ్యం కలుగుతోంది” అన్నది ఎతెల్.

“నీకు పుణ్యముంటుంది. కొంచెం నాగరికమైన భాషలో మాట్లాడు” అన్నాడు లాసన్ చిరచిరలాడుతూ.

ఆమె అతని దగ్గరికి నడిచి తన చేతుల్ని అతని చుట్టూ వేసి వెటకారం, గేళి చేస్తున్నట్టుగా ముఖంలో భావాన్ని కనబరిచింది. ఆ చర్యలో అనాగరికత కనిపించింది. తర్వాత “మనం ఇక్కణ్నుంచి వెళ్లిపోదాం. సమోవాకు పోదాం. నన్నిక్కడే వుంచితే నేను చచ్చిపోతాను. మా యింటికి పోవాలని వుంది నాకు” అన్నది.

బాధ విపరీతంగా పెరిగి వెంటనే కన్నీళ్లు కార్చింది. తన కోపం చల్లారటంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు లాసన్. తాను ఉద్యోగం వదలటం ఎంతమాత్రం కుదిరే పని కాదనీ, ఎందుకంటే అది లేకుంటే పొట్ట గడవదనీ ఆమెకు వివరించాడు. ఏపియాలోని బ్యాంకులో తన స్థానంలో వేరొకతను చేరినట్టూ, అక్కడ తనకెటువంటి జీవనాధారం లేనట్టూ చెప్పాడు. అక్కడ యెంత అసౌకర్యంగా వుండేదీ, ఎంత అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేదీ, దాంతో తమ కొడుకు హృదయంలో ఎటువంటి ద్వేషభావం నెలకొనేదీ అంతా నెమ్మదిగా సమంజసంగా వివరించాడు.

“ఇది మన బాబు చదువు కోసం చాలా అనువైన, అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ స్కూళ్లు చవకగా, మంచి ప్రమాణాలతో వుంటాయి. తర్వాత మన కొడుకు ఇక్కడి అబర్డీన్ విశ్వవిద్యాలయంలో పెద్ద చదువులు చదవవచ్చు. వాణ్ని అసలైన ఆంగ్లేయునిగా తయారు చేస్తాను నేను” అన్నాడు.

ఆ పిల్లవాడి పేరు ఆండ్ర్యూ. లాసన్ వాణ్ని డాక్టరును చేయాలనుకున్నాడు. తర్వాత వాడు తెల్లజాతి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశించాడు.
“నేను సంకరజాతికి చెందినదాన్ని కావటం ఎంతమాత్రం సిగ్గుగా లేదు నాకు” అన్నది ఎతెల్, బాధ నిండిన గొంతుతో.

“అవును, నిజమే డార్లింగ్. అందులో సిగ్గు పడాల్సిందేమీ లేదు. నా హృదయంలో నీకు ఎంత గొప్ప స్థానం వుందో తెలియదు నీకు, అన్నాడతడు. ఆమె చెక్కిలిని తన చెక్కిలికి ఆనించుకున్న అతడిని నీరసం ఆవహించింది. ఆమె పెదవుల్ని తన పెదవుల్తో అందుకున్నాడు.

వేసవికాలం వచ్చింది. ఊరి చివర్న వున్న లోయ పచ్చదనం, పూల సుగంధంతో నిండిపోయింది. లోయ అంచున వున్న కొండలమీద పొదలు పెరిగి హాయిని కలిగిస్తున్నాయి. ఎతెల్ ఇక ఆ తర్వాత సమోవా ద్వీపం గురించి మాట్లాడలేదు. లాసన్ లో ఆందోళన పెరిగింది. ఆమె దిగులుగా ఉన్నదని ఊహించాడతడు. ఒకరోజు వీధిలో అతనికి స్థానిక డాక్టరు కలిశాడు. అతడు “మిస్టర్ లాసన్, నీ భార్య ఆ కొండలమీది కొలనులో స్నానం చేస్తోందట. అది చాలా ప్రమాదకరం. ఇక్కడి నదులు పసిఫిక్ మహా సముద్రం వంటివి కావు కదా” అన్నాడు. లాసన్ అతనితో ఉద్వేగంగా మాట్లాడుతూ, సొంత యింటి విషయాన్ని దాచాలనే స్పృహ లేకుండా “నిజమే కావచ్చు. విషయం తెలియదు నాకు” అన్నాడు.

డాక్టరు నవ్వి, “చాలా మంది అక్కడ చూశారామెను. ఆ విషయం గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ స్నానం చేయడమన్నది విచిత్రమైన సంగతి. ఆ స్థలం నిజానికి నిషేధింపబడింది. అయినా అధికారులతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుననుకో. కాని ఆమె ఆ నీళ్లను ఎట్లా తట్టుకోగలుగుతుందా అని ఆశ్చర్యం కలుగుతుంది” అన్నాడు.

డాక్టరు చెప్పిన ప్రదేశం లాసన్ కు తెలుసు. అది సమోవా ద్వీపంలో ఎతెల్ ప్రతి సాయంత్రం స్నానం చేసే కొలను లాంటిదేనని అకతనికి అకస్మాత్తుగా అనిపించింది. ఇది కూడా ఎత్తైన రాళ్ల ప్రదేశంలో పుట్టి పారిన సెలయేరు కారణంగా ఏర్పడ్డ కొలను వంటిదే. దీని గట్లమీద కూడా దట్టంగా పెరిగిన చెట్లున్నాయి. కాని అవి కొబ్బరిచెట్లు కావు, వేరే రకానికి చెందినవి. ఈ కొత్త ప్రదేశానికి ఎతెల్ ప్రతి రోజూ పోయి, గట్టుమీద తన పైపై గుడ్డల్ని విడిచి అతి చల్లని నీళ్లలోకి దిగి స్నానం చేయటం తన మనోనేత్రం ద్వారా చూసి, ఆ దృశ్యాన్ని ఊహించుకున్నాడు లాసన్. ఆ మధ్యాహ్నమే ఆ నది దగ్గరికి వెళ్లాడు. చెట్ల మధ్యనుంచి జాగ్రత్తగా నడుస్తూ గడ్డి పెరిగిన బాట మీంచి పోతుంటే అతని అడుగులు ఎంతమాత్రం చప్పుడు చేయలేదు. నది దగ్గరి ఒక ప్రదేశానికి వచ్చాడతడు. అక్కణ్నుంచి చూస్తే గట్టుమీద కూర్చుని కింది నీళ్లలోకి చూస్తున్న ఎతెల్ కనిపించిందతనికి.

ఆమె నిశ్చలంగా కూర్చుని వుంది. నీళ్ల ఆకర్షణ ఆమెను అక్కడికి రప్పించిందనుకున్నాడు. అప్పుడామె మనసులో ఎటువంటి భావం కలుగుతుందా అని ఊహించుకున్నాడు. ఆఖరుకు ఆమె లేచింది. కాని కొన్ని క్షణాలపాటు అతని దృష్టిలోంచి మాయమైంది. వెంటనే మళ్లీ కనపడింది. ఆమె తన చిన్న పాదాలతో తడిగా వున్న గట్టు మీదికి చేరింది. మెల్లగా చప్పుడు కాకుండా నీళ్లలోకి దిగింది. నీళ్లలో కదిలే ఎతెల్ ను చూస్తుంటే ఒక మానవేతర ప్రాణి ఈదుతున్నట్టనిపించింది. ఆమె గట్టుమీదికి వచ్చేదాకా వేచి వున్నాడు లాసన్. తడిగుడ్డలు శరీరానికి అతుక్కుపోయి ఆమె ఒంటి వంపులు స్పష్టంగా కనిపించాయి. తర్వాత తన చేతుల్ని మెల్లగా తన రొమ్ముల మీంచి కదిపి ఆనందంతో ఒక చిన్న నిట్టూర్పును విడిచింది. లాసన్ వెనుతిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతని హృదయంలో చిన్న నొప్పి బయల్దేరింది. ఆమె తనకింకా అపరిచితురాలైనట్టూ, ఆమెపట్ల తన అమితమైన ప్రేమను తాను పూర్తిగా అనుభవించనట్టూ ఫీలయ్యాడు.

లాసన్ ఆ సంఘటన గురించి అసలే మాట్లాడలేదు. దాన్ని పూర్తిగా మరిచిపోయాడు. కాని, ఆమె మనసులో ఎటువంటి ఊహ కదుల్తోందా అని ఆలోచిస్తూ ఆమె ముఖాన్ని చూసాడు. ఒకరోజు అతడు యింటికి వచ్చేసరికి ఎతెల్ ఇంట్లో లేకపోవడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు.
“మేడమ్ ఎక్కడుంది?” అని అడిగాడు పనమ్మాయిని.

“ఆమె బాబును తీసుకుని అబర్డీన్ కు పోయింది. ఆఖరి రైలుకు తిరిగి వస్తానన్నది” అన్నది ఆ అమ్మాయి కొంచెం ఆశ్చర్యపోతూ.

“ఓ, సరేలే” అన్నాడు.

తనకు చెప్పకుండా ఎతెల్ అట్లా చాలా దూరం చాలా సేపటికోసం వెళ్లటం లాసన్ కు చిరాకును తెప్పించింది. కాని అతనికి ఆందోళన కలుగలేదు. అబర్డీన్ లోని మంచిమంచి దుకాణాలను ఎతెల్ చూసి వస్తే ఆమెకు మనోల్లాసం కలుగుతుందని సంతోషించాడు. బహుశా ఒక సినిమా కూడా చూసి వస్తుందేమో అనుకున్నాడు. ఆఖరి ట్రెయిన్లో రావాల్సిన ఆమె కోసం స్టేషనుకు వెళ్లాడు. కాని, ఆమె అందులో రాకపోవడంతో అకస్మాత్తుగా భయానికి లోనయ్యాడు. పడకదగిలోకి పోయి చూస్తే ఎతెల్ వాడే మేకప్ సామాను అక్కడ లేదు. వార్డ్ రోబ్ ను తెరిచి చూశాడు. అది పూర్తిగా ఖాళీగా వుంది. ఆమె చెక్కేసింది!

లాసన్ కు విపరీతమైన కోపం వచ్చింది. వివిధ ప్రదేశాలకు, మనుషులకు ఫోన్ ద్వారా వాకబు చేద్దామంటే అప్పటికే మధ్యరాత్రి దాటిపోయి కొన్ని గంటలైంది. అయినాఎన్ని వాకబులు చేసినా ఎతెల్ జాడ దొరకదని అనుమానం కలిగింది. తన బ్యాంకులో ఆడిట్ టీమ్ ఇన్స్పెక్షన్ కు వచ్చే
సమయంలోనే ఎతెల్ ఇట్లా ఇల్లు వదలటం ఆమెలోని వంచనను సూచిస్తున్నదని భావించాడు. ఆ పరిస్థితిలో ఆఫీసు పనిని వదిలి ఎతెల్ కోసం గాలించటానికి అవకాశం లేకపోయింది. తన పనిచేత బంధింపబడ్డాడతడు. ఒక వార్తాపత్రికను చూస్తే మరుసటి రోజు ఉదయం ఒక పడవ ఆస్ట్రేలియాకు బయలుదేరబోతున్నదని తెలిసిందతనికి. ఇప్పుడామె లండన్ వైపు వెళ్తూ ఉండవచ్చునని భావించాడు. లోపల్నుంచి వస్తున్న ఏడుపు తాలూకు వెక్కిళ్లను ఆపుకోలేక పోయాడు.

‘తన సంతోషం కోసం ప్రపంచంలో ఉన్న ప్రయత్నమంతా చేశాను నేను. కాని ఆమె ఈవిధంగా నన్ను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఎంత క్రూరత్వం!’ అనుకున్నాడు.

రెండు రోజుల దుర్భర క్షోభ తర్వాత ఎతెల్ దగ్గరినుండి లాసన్ కు ఒక ఉత్తరం వచ్చింది.ఆ ఉత్తరాన్ని ఆమె సమోవా ద్వీపానికి చేరుకోకముందు ఇంగ్లండులోంచే రాసింది. అందులో ఎతెల్ స్కూలురోజుల నాటి దస్తూరి కనిపించింది. రాయటం ఆమెకెప్పుడూ సులభమైన పని కాదు.

ప్రియమైన బెట్టీ, పరిస్థితుల్ని, వాతావరణాన్ని తట్టుకోవటం నావల్ల కాలేదు. నేను నా యింటికి పోతున్నాను. సెలవు.
– ఎతెల్

అని వుంది ఆ ఉత్తరంలో.

పశ్చాత్తాపాన్ని సూచించే ఒక్క మాట కూడా ఉత్తరంలో రాయలేదు ఎతెల్. కనీసం లాసన్ ను రమ్మని కూడా రాయలేదు. అకస్మాత్తుగా అతనిలో బలహీనత ఆవహించింది. ఆమె తిరిగి రాదని తెలిసినా మరలి రమ్మని వేడుకుంటూ పడవ ఆగే మొట్టమొదటి స్టేషనులోని సిబ్బంది అడ్రెసు పేరిట టెలిగ్రామ్ యిచ్చాడు. దయనీయమైన ఆందోళనతో జవాబుకోసం ఎదురు చూశాడు. ఒక్క ప్రేమపూర్వకమైన మాటనైనా ఆమెనుండి అందుకోవాలని ఆశ పడ్డాడు. కాని ఆమెనుండి సమాధానమే రాలేదు. ఒక దుర్భర మానసిక వేదన నుండి మరొక అటువంటి వేదనకు చేరుకున్నాడు. ఆమె తనను వదిలి పోవటం మంచిదనుకున్నాడు. ఆమెకు డబ్బు అసలే పంపకుంటే ఆమే తిరిగి వస్తుందనుకున్నాడు ఒక సందర్భంలో. మరోసారి అతడు పూర్తి ఏకాకిగా మారి దుర్భర వేదనను అనుభవించాడు. తన కొడుకునూ భార్యనూ తిరిగి పొందాలని కోరుకున్నాడు. పరిస్థితి చేయిదాటిపోనట్టు, తాను యెంతగా నటించినా ఆఖరుకు ఆమెకోసం సమోవాకు పోవాల్సిందే అని భావించాడు. ఎతెల్ లేకుండా తను అసలే బతకలేనని అనుకున్నాడు లాసన్. భవిష్యత్తు గురించి తను కట్టుకున్న ఆశాసౌధాలన్నీ కుప్ప కూలినట్టైందతనికి. కాని ఇప్పుడు ఆ ఆశలన్నిటినీ మనసులోంచి పక్కకు నెట్టి అయినా ఎతెల్ దగ్గరికి పోవాలనుకున్నాడు. వెంటనే తన బ్యాంకుకు వెళ్లి తాను అర్జెంటుగా ఊరును వదలాల్సి వస్తున్నదని మేనేజరుకు చెప్పాడు. మేనేజరు బాగా కోప్పడ్డాడు. ఎందుకంటే అంత తక్కువ సమయమిచ్చి సెలవు అడిగితే బ్యాంకువారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాని లాసన్ వినలేదు. తర్వాతి పడవలోనే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తనకున్నదంతా అమ్ముకుని పడవ యెక్కిన తర్వాతనే అతనికి మనశ్శాంతి దొరికింది. అప్పటివరకు తనను కలిసేందుకు వచ్చిన వాళ్లందరికీ అతడు దాదాపు పిచ్చివాడిలా కనిపించాడు. లండన్ చేరుకోగానే ఏపియాలోని ఎతెల్ అడ్రెసుకు టెలిగ్రామ్ పంపాడు, తాను వస్తున్నానని తెలియజేస్తూ.

సిడ్నీనుండి అటువంటిదే మరో టెలిగ్రామ్ పంపాడు. ఆఖరుకు పడవ ఏపియా పట్టణానికి చేరుకున్న తర్వాత అక్కడ పరచుకునివున్న ఆ యిళ్లు కనపడగానే చాలా ఊరటను, మనశ్శాంతిని పొందాడు. తనకు తెలిసిన డాక్టరూ మరొకతనూ పడవపైకి వచ్చారు. వాళ్లిద్దరు అతనికి పాత పరిచయస్థులు కావటం వల్ల వాళ్లతో కలిసి ఒకటిరెండు పెగ్గుల మద్యాన్ని తాగాడు. అతడు చాలా ఆందోళనతో ఉండటం కూడా మద్యం తాగటానికి ఒక కారణం. తనను చూస్తే ఎతెల్ సంతోషపడుతుందో లేదో అనే అనుమానం వచ్చిందతనికి. బయటికి వస్తుంటే ఒక చిన్న గుంపు తమ ప్రియమైనవాళ్ల కోసం ఎదురు చూస్తూ కనిపించింది. అతడు ఉత్కంఠగా ఆ ముఖాలను పరీక్షగా చూశాడు. వారిలో ఎతెల్ లేకపోవటంతో అతని గుండె కూలినట్టైంది. కాని, నీలంరంగు దుస్తుల్లో వున్న ముసలి బ్రెవాల్డ్ కనిపించటంతో కొంచెం ధైర్యం వచ్చిదతనికి.

గట్టుమీదికి చేరుతూ “ఎతెల్ ఎక్కడుంది?” అని అడిగాడు.

“ఆమె మా బంగళాలో మాతోనే వుంది” అన్నాడు బ్రెవాల్డ్.

లాసన్ కు నిరాశ కలిగింది. కాని, మేకపోతు గాంభీర్యాన్ని నటించాడు.

“నాకోసం యేదైనా గదిని సిద్ధంగా వుంచారా? వ్యవహారాన్ని చక్కబరిచేందుకు నాకు ఒకటిరెండు వారాలు పట్టవచ్చు”

“ఓ, ఫరవా లేదు. గదిని అమర్చగలను”

కస్టమ్స్ క్లియరెన్స్ అయింతర్వాత లాసన్ తన పాత హోటలుకు పోయాడు. అతని స్నేహితులు అతనికి స్వాగతం పలికారు. వీలైనన్ని పెగ్గుల మద్యం తాగిన తర్వాత ఇద్దరూ బ్రెవాల్డ్ యింటికి చేరేసరికి వాళ్ల మనసులలో హుషారు నెలకొంది. ఎతెల్ ను తన చేతులతో పొదివి పట్టుకున్నాడు.
సంతోషంగా ఆమెను మళ్లీ చూసేసరికి అతనిలోని పాత కచ్చతనమంతా ఎగిరిపోయింది. ఎతెల్ తల్లీ, నాయనమ్మా సంతోషించారు. స్థానికప్రజలు, సంకరజాతి మనుషులు అక్కడ చేరి, చుట్టూ కూర్చున్నారు. వాళ్లు అతనివైపు ఆనందంగా చూశారు. లాసన్ తాను తెచ్చిన విస్కీ సీసాలోంచి అందరికీ ఒక్కొక్క పెగ్గును పోశాడు. తన చిన్ని కొడుకును కాళ్లమీద పెట్టుకుని కూచున్నాడు. ఆ బాబుకు అంతకు ముందు తొడిగిన ఇంగ్లీషు గుడ్డల్ని తీసేసి స్థానిక రకం దుస్తుల్ని తొడగటంతో అతడు మరీ నల్లగా కనిపించాడు. బయటి దేశానికి పోయి బాగా డబ్బు సంపాదించుకుని స్వంత ఊరికి తిరిగి వచ్చినవాడిలా ఫీలయ్యాడు లాసన్. మధ్యాహ్నం మళ్లీ హోటలుకు పోయి మద్యం తాగాడు. ఇంటికి తిరిగొచ్చేసరికి బాగా హుషారుగా వున్నాడు. పాశ్చాత్యులు తరచుగా మద్యం సేవిస్తారనీ, అది మామూలు విషయమేననీ ఎతెల్ కూ ఆమె తల్లికీ తెలుసు. అందుకే వాళ్లు సహృదయతతో నవ్వి అతణ్ని పడక మీదికి చేర్చారు.

ఒకటిరెండు రోజులు తర్వాత అతడు ఉద్యోగం కోసం వేటలో పడ్డాడు. ఇంగ్లండులో తాను వదిలిన ఉద్యోగమంత మంచి ఉద్యోగం ఇక్కడ దొరికే అవకాశం లేదని అతనికి తెలుసు. ఆఖరుకు ఒక చిన్న వ్యాపార కంపెనీలో చిన్న ఉద్యోగిగా చేరాడు. బ్యాంకులో అంతగా సంపాదించలేమనీ, వ్యాపార కంపెనీలోనే ఎక్కువగా సంపాదించ వచ్చుననీ సరి పెట్టుకున్నాడు. త్వరలోనే ఆ కంపెనీకి తాను చాలా అవసరమైన వ్యక్తిగా మారి, తర్వాత దానిలో భాగస్వామి అవ్వాలనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తనెందుకు ధనవంతుడు కాకూడదు అనుకున్నాడు.

“మనం ఈ యింట్లో వుండలేము. కొంచెం కుదురుకున్న తర్వాత ఒక చిన్న మట్టిగోడల కచ్చా ఇల్లును కొనుక్కుందాం” అన్నాడు ఎతెల్ తో.
బ్రెవాల్డ్ ఇల్లు సరిపోయేంత పెద్దగా లేదు. అక్కడ జాగా ఎక్కువగా లేకపోవటమే కాక ఏకాంతం కూడా కరువైందతనికి.

“అయినా తొందర లేదు. చిన్న యిల్లు దొరికే వరకు ఇక్కడే ఉండవచ్చు” అన్నాడు ఎతెల్ తో.

అతను కుదురుకోవడానికి ఒక వారం రోజులు పట్టింది. ఆ వ్యాపార కంపెనీ యజమాని పేరు బెయిన్. ఇల్లు మారుదాం అని లాసన్ అడిగితే తాను మళ్లీ నెల తప్పినట్టూ, ప్రసవం వరకు తండ్రి యింట్లోనే వుండదల్చుకున్నట్టూ చెప్పింది ఎతెల్. లాసన్ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.

“ఇక్కడ వుండటం నీకిష్టం లేకపోతే నువ్వు పోయి హోటల్లో వుండు” అన్నదామె హఠాత్తుగా. అతని ముఖం పాలిపోయింది.

“ఎతెల్, నువ్వట్లా ఎలా అనగలవు?”

ఆమె నిర్లక్ష్యంగా బుజాలెగరేసి “మనం ఇక్కడ వుండగలిగినప్పుడు వేరే యింట్లో వుండటమెందుకు?” అన్నది.

అప్పుడు లాసనే తగ్గాడు.

ఒకరోజు అతడు ఉద్యోగపు పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి అక్కడ స్థానిక జాతీయులు నిండిపోయారు. వాళ్లందరూ పొగ తాగుతూ, కవా అనే మత్తు పానీయాన్ని కూడా తాగుతూ అదేపనిగా గోలగోలగా మాట్లాడుతున్నారు. కొందరేమో పడుకుని వున్నారు. ఆ యిల్లంతా చాలా గలీజుగా వుంది. తన కొడుకు నేలమీద పాకుతూ, చుట్టూ మిగతా స్థానికజాతి పిల్లలతో ఉన్నాడు. వాడికి సమోవా భాష తప్ప ఒక్క ముక్క కూడా వేరే భాష వినపడే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్లందరూ సమోవా భాషలోనే మాట్లాడుతున్నారు. అటువంటి దృశ్యాలను ఎదుర్కునే ధైర్యాన్ని పొందటం కోసం లాసన్ పనినుండి యింటికి తిరిగివస్తూ హోటలు దగ్గర ఆగి కొన్ని పెగ్గుల మద్యాన్ని తాగటం అలవాటు చేసుకున్నాడు. ఎతెల్ ను తాను అన్ని వేళలా అత్యంత ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నప్పటికీ ఆమె తననుండి చేజారిపోతున్నదని గ్రహించాడు. బయట ఒక చిన్న యిల్లును ఏర్పరచుకుని అందులోకి మారుదామని లాసన్ చేసిన ప్రతిపాదనను ఎతెల్ తిరస్కరించింది. ఇంగ్లండులో వున్నప్పుడు కలిగిన బెంగ ఆమెను మళ్లీ తనవాళ్లతో కలిసేలా చేసిందనీ, ఇప్పుడు వాళ్లతో గడుపుతూ తన జాతి సంప్రదాయాలను తీవ్రమైన ఆరాటంతో పాటిస్తూ ఆనందిస్తున్నదనీ అనుకున్నాడు లాసన్. అతడు మరింత ఎక్కువగా తాగటం మొదలు పెట్టాడు. ప్రతి శనివారం నాడు ఇంగ్లిష్ క్లబ్ కు వెళ్లి, ఔటయ్యేలా విపరీతంగా తాగాడు.

లాసన్ లో ఒక అసాధారణమైన గుణం వుంది. అదేమిటంటే అతడు తాగినప్పుడల్లా తన యజమాని అయిన బెయిన్ తో పెద్ద పోట్లాట పెట్టుకుంటాడు. దాంతో బెయిన్ అతణ్ని ఉద్యోగంలోంచి తీసేశాడు. మళ్లీ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి రావటం లాసన్ వంతైంది. రెండు వారాల పాటు ఏ పనీ లేక బేకారుగా వున్నప్పుడు, మామగారి యింట్లో కూర్చోలేక హోటలుకో ఇంగ్లిష్ క్లబ్బుకో పోయి పూటుగా తాగటం ప్రారంభించాడు. లాసన్ మీద సానుభూతి కలిగి మిల్లర్ అతనికి ఉద్యోగమిచ్చాడు. లాసన్ లో ప్రతిభ వుంది. కాని మిల్లర్ చతురత వున్న వ్యాపారస్థుడు. పరిస్థితుల ప్రభావం మూలంగా లాసన్ తక్కువ జీతానికి ఆ ఉద్యోగంలో చేరక తప్పలేదు. ఎతెల్, బ్రెవాల్డ్ అతణ్ని నిందించారు. ఎందుకంటే పెడర్సన్ అనే స్థానిక జాతీయుడు అంతకంటె ఎక్కువ జీతంతో ఉద్యోగమిస్తానన్నా లాసన్ అందులో చేరలేదు. ఒక స్థానిక జాతీయుని కింద పని చేస్తూ అతని ఆజ్ఞలను పాటించడం లాసన్ కు ఇష్టం లేదు. ఈ విషయం గురించి ఎతెల్ గొణుగుతూ నస పెట్టినప్పుడల్లా లాసన్ కోపంతో చెలరేగిపోతూ స్థానికుల కింద పని చేస్తే “నా బతుకు చట్టుబండలవుతుంది” అని అరిచాడు.

“అట్లానే కావాలి నీకు” అన్నది ఎతెల్.

ఆరు నెలల్లో అతడు పూర్తి పరాభవానికి గురయ్యాడు. మద్యం పట్ల అతని ఆసక్తి పెరుగుతూ పోసాగింది. దాంతో మరింత విపరీతంగా తాగటం మొదలు పెట్టాడు. దాని ఫలితంగా అతని పనితీరు చెడిపోయింది. మిల్లర్ అతణ్ని ఒకటిరెండు సార్లు హెచ్చరించాడు. కాని లాసన్ ఆ హెచ్చరికలను సీరియస్ గా తీసుకోలేదు. ఒకసారి వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు లాసన్ ఆ ఉద్యోగాన్ని వదులుతున్నానని చెప్పి బయటికి నడిచాడు. అతని తీరు గురించి అందరికీ తెలిసిపోవటంతో ఉద్యోగమిచ్చేవాళ్లు కరువైపోయారు. కొంత కాలం అతడు ఏ పనీ చేయకుండా బేకారుగా వున్నాడు. తర్వాత డెలీరియమ్ ట్రెమెన్స్ అనే మెదడు నరాల వ్యాధికి గురయ్యాడు. దాన్నుండి తేరుకుని అవమానంతో క్రుంగిపోయి, అతడు శారీరకంగా చాలా బలహీనుడయ్యాడు. పరిస్థితికి తలవొగ్గి పెడర్సన్ దగ్గరికి వెళ్లి ఉద్యోగం అడిగాడు. తన దగ్గర ఒక తెల్ల జాతీయుడు పని చేస్తాననడం పెడర్సన్ కు సంతోషాన్ని కలిగించింది. పైగా లెక్కల్లో లాసన్ నిపుణుడు. కనుక అతనికి ఉద్యోగమిచ్చాడు పెడర్సన్.

అప్పట్నుంచి అతని పతనం వేగంగా సాగింది. తెల్ల జాతీయులు అతడిని నిరాదరణకు గురి చేశారు. లాసన్ తాగినప్పుడు అదుపు లేని కోపంతో నిస్సహాయుడవటం గమనించి వాళ్లు అతని మీద జాలి చూపి, పూర్తిగా బహిష్కరించక వదిలేశారు. పరిస్థితుల మూలంగా అతడు పూర్తిగా నిర్వీర్యుడయ్యాడు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఇతరులతో పోట్లాడటం మొదలు పెట్టాడు లాసన్.

పూర్తిగా స్థానిక జాతీయులతోనే బతకడం వల్ల, ఒక తెల్ల జాతీయునికుండే గౌరవాన్ని కోల్పోయాడు లాసన్. వాళ్లపట్ల అతడు చూపే ద్వేషాన్ని ఆ స్థానిక జాతీయులు భరించలేక పోయారు. వాళ్లకన్న తనే గొప్ప అన్నట్టుండే లాసన్ ప్రవర్తనను వాళ్లు నిరసించారు. తమలో ఒకనిగా బతుకుతూ
కూడా అతడు యెందుకు ఆధిక్య భావనను కలిగి వుండాలని మనసులోనే ప్రశ్నించుకున్నారు. అంతకు ముందు లాసన్ తో సౌమ్యంగా, కొంచెం నంగిగా ప్రవర్తించిన బ్రెవాల్డ్ ఇప్పుడు చీదరించుకోవటం మొదలు పెట్టాడు. ఎతెల్ వాళ్లిద్దరి మధ్య సయోధ్యను కుదుర్చటానికి ప్రయత్నించలేదు. ఒకటిరెండు సార్లు హేయమైన గొడవలు రావటంతో వాళ్లిద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎప్పుడైనా అట్లాంటి కొట్లాటలు వచ్చినప్పుడు ఎతెల్ తనవాళ్ల వైపు చేరటం మొదలు పెట్టింది. భర్త వైపున ఎంత మాత్రం నిలబడలేదు. లాసన్ మామూలు సమయాల్లోకన్న తాగినప్పుడే కొంచెం బాగా వుంటాడని అనుకునేవారు వాళ్లు ఎతెల్ తరఫువాళ్లు. ఎందుకంటే తాగినప్పుడు లాసన్ మంచం మీదనో, నేల మీదనో బాగా గురక పెడుతూ పడుకుంటాడు.

తర్వాత, ఏదో విషయాన్ని వాళ్లు తననుంచి దాచిపెడుతున్నారని తెలుసుకున్నాడు లాసన్. వాళ్లు పెట్టే కూడు కోసం సాయంత్రం యింటికి వచ్చినప్పుడు ఎతెల్ ఇంట్లో వుండటం లేదు. ఆమె యెక్కడికి పోయిందని బ్రెవాల్డ్ ను అడిగితే సాయంత్రాన్ని తన స్నేహితురాళ్లతో గడపటం కోసం పోయిందని చెప్పాడతడు. కాని ఎతెల్ తిరిగి వచ్చింతర్వాత ఆమెను అడిగితే తన తండ్రి తప్పుగా చెప్పాడనీ, నిజానికి తాను ఫలానా వాళ్లింటికి పోయాననీ చెప్పిందామె. కాని ఆమె అబద్ధం చెప్తున్నదని లాసన్ కు తెలిసి పోయింది. అట్లాంటి సమయాల్లో ఆమె తొడుక్కున్న దుస్తులు చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ఆమె కళ్లలో ఉత్సాహం, ఉల్లాసం తొణకిసలాడుతూ ఆమె చాలా ఆనందంగా కనిపించేది.

“నా దగ్గర తిక్క వేషాలు వేయకు ఎతెల్. వేస్తే నీ ఒక్కొక్క ఎముకను ముక్కలు చేస్తాను” అన్నాడొకసారి లాసన్.

“పోరా తాగుబోతు ముండాకొడకా” అని తిరస్కారంగా అన్నది ఎతెల్.

ఎతెల్ తల్లీ, నాయనమ్మా తనను క్రూరత్వం నిండిన భావనతోచూస్తున్నారని ఊహించాడు లాసన్. బ్రెవాల్డ్ మాత్రం ఈ మధ్య కొంచెం సహృదయతను కనబరచడం లాసన్ లో అనుమానం కలగడానికి తావిచ్చింది. తోటి తెల్ల జాతీయులు తనను అదోరకంగా విచిత్రంగా చూస్తుండటంతో లాసన్ కు ఏదో అనుమానం కలిగింది. తాను హోటల్లోని లాంజ్ లోకి పోగానే అంతకు ముందు వరకు మాట్లాడుకుంటున్న వాళ్లంతా అకస్మాత్తుగా మౌనం వహించడంతో వాళ్లు అప్పటిదాకా తన గురించే మాట్లాడుకుంటున్నారని అతనికి నిశ్చయంగా తెలిసిపోయింది. తన వెనుక ఏదో జరుగుతోందనీ, అదేమిటో తనకు తప్ప ఇతరులందరికీ తెలుసుననీ అనుకున్నాడు. విపరీతమైన అసూయతో రగిలిపోయాడు. ఎతెల్ ఎవరో తెల్ల జాతీయునితో రహస్యంగా రంకు వ్యవహారం నడుపుతోందని ఊహించి, ఒక్కొక్కరి కళ్లలోకి పరిశీలనగా చూడసాగాడు. కాని అతనికి ఎటువంటి సూచనా దొరకలేదు. అతడు పూర్తిగా నిస్సహాయుడయ్యాడు. ఎవరినీ కచ్చితంగా అనుమానించలేక, ఎవరిమీద కసిని తీర్చుకుందామా అని పిచ్చివాడి లాగా వెతకసాగాడు. ఆఖరుకు ఒక నిరపరాధి మీద దాడి చేసేట్టు చేసింది ఒక సందర్భం. ఒకసారి హోటల్లో లాసన్ చిరాకుగా వున్నప్పుడు చాప్లిన్ వచ్చి పక్కసీట్లో కూచున్నాడు. లాసన్ పట్ల సానుభూతి కలవాళ్లలో చాప్లిన్ బహుశా మొదటివాడు. వాళ్లు మద్యానికి ఆర్డరిచ్చి రాబోయే గుర్రపు పందాల గురించి కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడు చాప్లిన్ “బహుశా మనమంతా కొత్త బట్టలకోసం డబ్బును సమకూర్చుకోవాలేమో” అన్నాడు.

లాసన్ కిసుక్కున నవ్వాడు. చాప్లిన్ భార్య చేతుల్లోనే డబ్బును ఖర్చు చేసే అధికారం ఉండటం చేత, ఆమెకు ఏ వస్తువు కావాలనిపించినా భర్తను అడిగే అవసరమే లేదు.

“నీ భార్య ఎలా ఉంది?” అని అడిగాడు చాప్లిన్, స్నేహంగా వుండాలని ప్రయత్నిస్తూ.

లాసన్ తన కనుబొమల్ని ముడి వేస్తూ “ఆ విషయం నీకెందుకు?” అన్నాడు.

“మర్యాద కోసం అడిగాను” అన్నాడు చాప్లిన్.

“అటువంటి ప్రశ్నల్ని నీకోసమే దాచిపెట్టుకో”

చాప్లిన్ ఓపిక వున్న మనిషి కాదు. చాలా సంవత్సరాల పాటు ఉష్ణప్రదేశాల్లో జీవితాన్ని గడపటం, బాగా విస్కీ తాగే అలవాటు ఉండటం, ఇంట్లో భార్యతో గొడవల మూలంగా పరిస్థితి అధ్వాన్నంగా ఉండటం – ఇవన్నీ అతడిని లాసన్ కన్న ఎక్కువ తిక్క మనిషిగా మార్చాయి.

“చూడు లాసన్, నువ్వు నా హోటల్లో ఉంటున్నావు కనుక మర్యాదస్తునిలా బుద్ధిగా వుండు. లేకపోతే నడి వీధిలోకి పోవాల్సి వస్తుంది” అన్నాడు చాప్లిన్.

లాసన్ ముఖం ఎర్రబడింది. “నీకూ మిగతావాళ్లకూ ఒక విషయాన్ని అంతిమంగా చెప్తున్నాను. నా భార్య గురించి ఎవడైనా చెడ్డగా మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త” అన్నాడు కోపంతో ఒగరుస్తూ.

“నీ భార్యతో రంకు చేయాలని ఎవడికుంటుంది? అన్నాడు చాప్లిన్.

“నువ్వనుకుంటున్నంత పిచ్చివాణ్ని కాను నేను. మీ అందరితో నాకు విభేదం వస్తోందని తెలుసు నాకు. అందరికీ నేరుగా చెప్పేస్తున్నాను.
లోపాయికారీ వ్యవహారం ఎవడు నడిపినా డొక్క చీలుస్తాను”

“చూడు నువ్విక్కణ్నుంచి వెళ్లిపోయి నిషా దిగింతర్వాత మళ్లీ రా”

“సమయమొచ్చినప్పుడే పని పడతాను. అంతే తప్ప ఒక్క నిమిషం ముందు కూడా ఆ పని చేయను”

లాసన్ అనవసరంగా నోరు చేసుకున్నాడు. అటువంటి కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో చాప్లిన్ కు అనుభవపూర్వకంగా తెలుసు కనుక, లాసన్ కాలరునూ చేతుల్నీ పట్టుకుని వీధిలోకి నెట్టేశాడు. లాసన్ తూలిపోయి, బయట ఉన్న ఎర్రని ఎండలో పడిపోయాడు.

ఈ సంఘటన పర్యవసానంగానే లాసన్ తన భార్య ఐన ఎతెల్ తో ఉధృతంగా గొడవ పడ్డాడు ఒకరోజు. పరాభవం అతనికి వేదనను కలిగించింది. హోటలుకు పోవటం ఇష్టం లేక రోజుకన్న ముందుగా యింటికి పోయాడు. ఎతెల్ బయటికి పోవడం కోసం తయారవుతోంది. సాధారణంగా ఆమె తన నల్లని కురుల్లో పువ్వును పెట్టుకుంటుంది. కాని ఈ సారి అట్లా చేయలేదు. పైగా స్టాకింగులు తొడుక్కుని ఎత్తు మడమల చెప్పుల్ని వేసుకుంది. తనకున్న దుస్తుల్లో అతి కొత్తదైన గులాబీ రంగు డ్రెస్ ను తొడుక్కుంటోంది.

“బాగా సింగారించుకుంటున్నావు. ఎక్కడికి పోతున్నావేంటి?” అని అడిగాడు లాసన్.

“క్రాస్లీ దంపతుల యింటికి పోతున్నాను”

“నేను కూడా నీతో వస్తాను”

“ఎందుకు?” అని అడిగింది ఎతెల్ మెల్లగా.

“నువ్వు ఒంటరిగా అక్కడాయిక్కడా తిరగటం నాకిష్టం లేదు”

“నిన్ను రమ్మని అడగలేదు నేను”

“నువ్వు అడగకపోతే దాన్ని లెక్క చేయను నేను. నేను లేకుండా నువ్వు పోబోవటం లేదు”

“నేను పూర్తిగా తయారయ్యే దాకా నువ్వు మంచంమీద ఒరుగు”

లాసన్ తాగివున్నాడనీ, మంచం మీద ఒరగగానే నిద్రలోకి జారిపోతాడనీ ఊహించింది ఆమె. అతడు కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగటం మొదలు పెట్టాడు. పెరుగుతున్న చిరాకుతో అతణ్ని చూసింది ఆమె. ఎతెల్ పూర్తిగా తయారవగానే లాసన్ కుర్చీలోంచి లేచాడు. అనుకోకుండా అప్పుడు ఆ యింట్లో వాళ్లిద్దరు తప్ప వేరే యెవరూ లేరు. బ్రెవాల్డ్ పొలంలో పని చేస్తున్నాడు. అతని భార్యేమో ఏపియా పట్టణంలోకి వెళ్లింది. ఎతెల్ అప్పుడు లాసన్ ను ఎదుర్కుంది.

“నేను నీతో రావటం లేదు. యెందుకంటే నువ్వు తాగి ఉన్నావు” అన్నది.

“నువ్వు అబద్ధమాడుతున్నావు. నేను నీ పక్కన లేకుండా నిన్ను పోనివ్వను”

ఆమె బుజాలెగరేసి అతణ్ని దాటుకుంటూ పోవడానికి ప్రయత్నించింది. కాని లాసన్ ఆమె చేయిని పట్టుకుని ఆపాడు.

“నన్ను పోనివ్వు రాక్షసుడా” అన్నదామె సమోవా భాషలో.

“నేను లేకుండా ఒంటరిగా ఎందుకు పోవాలనుకుంటున్నావు? పిచ్చిచేష్టలు చేయవద్దని ఇంతకు ముందే హెచ్చరించాను కదా”

ఎతెల్ తన పిడికిలి బిగించి లాసన్ ముఖంమీద గుద్దింది. అతడు తూలి పడబోయాడు. అతనిలోని ప్రేమా ద్వేషమూ అన్నీ ఒక్కసారిగా విజృంభించాయి. తనను తాను నియంత్రించుకోలేక పోయాడు.

[ఇంకా ఉంది]