అనువాద కథ

కొలను – చివరి భాగం

సెప్టెంబర్ 2015

“నీకు మంచి గుణపాఠం చెప్తాను చూడు” అని, దగ్గరే వున్న కొరడాను చేతిలోకి తీసుకుని, దానితో ఆమెను కొట్టాడు. ఆమె అరిచింది. ఆ అరుపు అతడిని పిచ్చివాణ్ని చేసింది. దాంతో ఆమెను కొరడాతో మళ్లీమళ్లీ బాదటం మొదలు పెట్టాడు. ఇల్లంతా ప్రతిధ్వనించేలా ఎతెల్ అరుస్తుంటే ఆమెను తిడుతూ కొరడాతో కొట్టాడు. ఆమెను యెత్తి మంచంమీద పడేశాడు. ఎతెల్ నొప్పితో భయంతో వెక్కివెక్కి ఏడ్చింది. తర్వాత కొరడాను పారేసి బయటికి వెళ్లిపోయాడు. అతడు పోవటం చూసిన ఎతెల్ తన ఏడుపును ఆపింది. జాగ్రత్తగా చుట్టూ చూసి, మంచంమీంచి లేచింది. ఒళ్లంతా పుండులా ఉంది. కాని గాయం కాలేదు. తన డ్రెస్సు పాడయిందా అని పరీక్షగా చూసుకుంది. అక్కడి స్థానిక స్త్రీలు అట్లా దెబ్బలు తినటం మామూలు విషయమే. అతడు కొట్టటం ఆమె హృదయాన్ని గాయపరచ లేదు. అద్దంలో చూసుకుని తలవెంట్రుకల్ని సరి చేసుకుంది ఆమె. కళ్లు మరీ ఆనందంతో వెలిగాయి. ఆ కళ్లలో ఒక విచిత్రమైన తీరు కనిపించింది. బహుశా అప్పుడామెకు అతనిపట్ల ప్రేమభావం కలిగిందేమో.

కాని, లాసన్ చెట్లమధ్య లోంచి వడివడిగా నడుస్తూ అకస్మాత్తుగా అలసిపోయి, బలహీనుడైన చిన్నపిల్లవాడి లాగా ఒక చెట్టు మొదలు దగ్గర విసురుగా పడిపోయాడు. అతనికి భరించరానంత నిస్పృహ, అవమానం కలిగాయి. ఎతెల్ గురించి ఆలోచిస్తుంటే అతని ప్రేమలోని మృదుత్వం కారణంగా తన ఎముకలన్నీ మెత్తబడ్డట్టనిపించాయి. గతం గురించీ, జీవితం మీద తను పెట్టుకున్న ఆశల గురించీ ఆలోచించాడు. తాను యేం చేశాడో తల్చుకుని నిర్ఘాంతపోయాడు. ఎతెల్ ను ఎప్పటికన్న యెక్కువగా కోరుకున్నాడు. ఆమెను తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమెదగ్గరికి పోవాలనుకుని లేచాడు. అప్పుడతడు యెంతగా బలహీన పడిపోయాడంటే, నడుస్తుంటే తూలి పడబోయాడు. అతడు యిల్లు చేరుకునే సరికి ఎతెల్ తమ పడకగదిలో అద్దం ముందు కూచుని వుంది.

“ఎతెల్, నన్ను క్షమించు. నేను సిగ్గుతో చితికిపోతున్నాను. కోపంలో ఏం చేస్తున్నదీ నాకు తెలియలేదు” అని ఆమె ముందర మోకాళ్ల దగ్గర కూర్చుని, భయంభయంగా ఆమె ఫ్రాకును చేయితో తాకాడు. తర్వాత మళ్లీ “నేనేం చేశానో తల్చుకుంటే భరించలేక పోతున్నాను. అది భయంకరంగా తోస్తోంది నాకు. నేను పిచ్చివాడిలా ప్రవర్తించాననుకుంటా. నేను నిన్ను ప్రేమించినంతగా ప్రపంచంలో మరెవ్వరినీ ప్రేమించలేదు. తర్వత ఏర్పడబోయే బాధనూ అవమానాన్నీ ఆపటం కోసమే నిన్ను కొట్టటాల్సి వచ్చింది. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నువ్వైనా నన్ను క్షమించు” అన్నాడు.

అంతకు ముందు ఆమె అరిచిన అరుపులు అతని చెవుల్లో ఇంకా గింగురుమంటూనే వున్నాయి. ఆ దృశ్యాన్ని అతడు భరించలేక పోతున్నాడు. ఎతెల్ మాత్రం అతడిని నిశ్శబ్దంగా చూస్తోంది. ఆమెచేతుల్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అతని కళ్లలోంచి కన్నీళ్లు కారాయి. పెరిగిన మానసిక క్షోభతో, అవమానంతో అతడు తన ముఖాన్ని ఎతెల్ ఒడిలో పెట్టి వెక్కివెక్కి ఏడుస్తుంటే నిస్సత్తువ నిండిన అతని దేహం వణికింది. ఎతెల్ ముఖం విపరీతమైన ద్వేషంతో నిండిపోయింది. మగాడు ఒక స్త్రీ ముందు మోకరిల్లితే స్థానికజాతి యువతులు ఎట్లా అసహ్యించుకుంటారో అట్లా అసహ్యించుకుంది ఆమె తన మనసులో. అతడు మానసికంగా దుర్బలుడు అనుకుంది. తన ప్రవర్తనలో ఏదో చెప్పరాని విషయం ఉన్నట్టనిపించింది లాసన్ కు. లాసన్ ఒక కుక్కలాగా ఆమె ముందు తన మోకాళ్ల మీద వంగాడు. ఆమె తిరస్కారంగా అతడిని చిన్నగా తన్నింది.

“ఇక్కడినుండి వెళ్లిపో. నువ్వంటే నాకసహ్యం” అన్నది.

ఎతెల్ ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు లాసన్. కాని ఆమె అతణ్ని పక్కకు తోసింది. నిలబడి తన దుస్తుల్ని విడవసాగింది. చెప్పుల్ని దూరంగా తన్నిపారేసి స్టాకింగ్స్ ను తీసేసింది. తర్వాత నైటీలోకి మారింది.

“ఎక్కడికి పోతున్నావు?” అని అడిగాడు లాసన్.

“నీకెందుకు? స్నానం చేయటం కోసం కొలనుకు పోతున్నాను”

“నన్ను కూడా నీతో రానీ” ఒక చిన్న పిల్లవాడి లాగా అడిగాడు.

“నన్ను కనీసం ఒంటరిగా స్నానమైనా చేయనివ్వవా?”

ముఖాన్ని అరచేతుల్లో పెట్టుకుని ఘోరంగా ఏడ్చాడు లాసన్. కర్కశత్వం, ఉదాసీనత నిండిన కళ్లతో ఎతెల్ అతడిని దాటుకుంటూ బయటికి వెళ్లిపోయింది.

అప్పట్నుంచి ఆమె లాసన్ ను చాలా అసహ్యించుకుంటూ వచ్చింది. ఆ చిన్న బంగళాలో లాసన్, ఎతెల్, వాళ్ల ఇద్దరు పిల్లలు, బ్రెవాల్డ్, అతని భార్య, తల్లి, ఎప్పుడూ ఆ యింట్లో తచ్చాడే దూరపు బంధువులు – అందరూ ఒక గుంపులాగా పైకి సఖ్యతతో బతుకుతున్నప్పటికీ, లాసన్ ఏ ప్రాధాన్యమూ లేని జీవితాన్ని సాగించాడు. అతణ్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అతడు పొద్దున టిఫిన్ తిన్న తర్వాత యింట్లోంచి బయటికి పోయి, మళ్లీ రాత్రి భోజనానికే తిరిగి రాసాగాడు. అతడు తన పోరాటాన్ని వదులుకున్నాడు. డబ్బులు లేకపోవటం కారణంగా ఇంగ్లిష్ క్లబ్ కు పోలేకపోయిన ప్రతిసారీ యింట్లోనే బ్రెవాల్డ్ తో, స్థానిక జాతీయులతో పేకాట ఆడాడు. తాగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో నిస్సత్తువతో, ఒక రకమైన బెరుకుతో వున్నాడు. ఎతెల్ అతణ్ని ఒక కుక్కలాగా చూసింది. లాసన్ అప్పుడప్పుడు కనబరిచే ఉన్మాదం లాంటి ఉద్వేగాన్ని భరించింది. అటువంటి సందర్భాల్లో వాళ్లిద్దరి మధ్య చెలరేగే ద్వేషం ఆమెను భయపెట్టింది. కాని తర్వాత అతడు కన్నీళ్లు కారుస్తూ నంగినంగిగా మాట్లాడుతుంటే అతని ముఖం మీద ఉమ్మి వేయాలన్నంత అసహ్యం కలిగిందామెకు. ఒక్కోసారి లాసన్ కోపంతో విజృంభించేవాడు. ఆమె దానికి సిద్ధమై వుండేది. లాసన్ ఆమెమీద చేయి చేసుకున్నప్పుడు ఆమె అతడిని కాళ్లతో తన్నడం, గోళ్లతో రక్కడం, పళ్లతో కొరకడం చేసేది. ఆ విధంగా వాళ్లిద్దరి మధ్య భయంకరమైన కొట్లాటలు జరిగేవి. లాసన్ కొన్ని సార్లు వాటిలో గెలవలేక పోయేవాడు. వాళ్లిద్దరి మధ్య పోట్లాటలు జరుగుతున్నాయనే విషయం కొద్ది కాలంలోనే ఏపియా పట్టణ ప్రజలందరికీ తెలిసిపోయింది. లాసన్ పట్ల వాళ్లు కొంచెం సానుభూతిని చూపేవారు. ముసలి బ్రెవాల్డ్ యెందుకు లాసన్ ను తన యింట్లోంచి బయటికి గెంటివేయటం లేదా అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు హోటల్లో వుండే మనుషులు.

“బ్రెవాల్డ్ నికృష్టుడు. అతడు ఏదో వొకరోజున లాసన్ కు తన తడాఖా చూపిస్తాడు” అన్నాడు హోటల్లోని ఒకడు.

నిస్తబ్ధమైన ఆ కొలనులో స్నానం చేయడం కోసం ఎతెల్ యింకా అట్లానే వెళ్లసాగింది. మానవులు అనుభవించే ఆకర్షణకు భిన్నమైన ఆకర్షణను కొలను పట్ల ఆమె కలిగి వుందా అనిపించేట్టుగా వుంది ఆమె విధానం. అది ఒక జలకన్య ఎవరి హృదయాన్నైనా గెల్చుకున్నప్పుడు సముద్రంలోని చల్లని అలల పట్ల కలిగే ఆకర్షణ వంటిది. కొన్నిసార్లు లాసన్ కూడా ఆమెతో వెళ్లేవాడు.

అటువంటి సమయాల్లో లాసన్ ను ఆమె యెంతగానో చీదరించుకునేది. అయినా అతడు ఎతెల్ తో యెందుకు కొలనుకు పోవాలనుకునేవాడో అర్థం కాదు. బహుశా ఆ కొలను దగ్గరే తాను ఆమెను మొదటిసారిగా కలుసుకున్నాడు కనుక అక్కడే పారవశ్యాన్ని అనుభవించాలనుకున్నాడో ఏమో. లేదా బహుశా తమను ప్రేమంచనివాళ్ల పట్ల ప్రేమను చూపే మనుషులకుండే పిచ్చితనం వల్లనేమో. తన మొండి పట్టుదలతో ప్రేమను కనబరచాలనే ఉద్దేశంతో కూడా కావచ్చును. ఒక రోజు తన హృదయంలో అరుదైన భావన కదలాడుతుంటే లాసన్ ఆ కొలను దగ్గరికి నడిచాడు. అతని హృదయంలో అకస్మాత్తుగా ప్రశాంతత చోటు చేసుకుంది. సాయంత్రం ముగుస్తుంటే సూర్యాస్తమయం ఒక చిన్న మబ్బులాగా కొబ్బరిచెట్ల ఆకులకు అంటుకుని ఉన్న స్ఫురణ కలిగిందతనికి. ఒక చిన్న పిల్లతెమ్మెర వాళ్లిద్దరి హృదయాలను నిశ్శబ్దంగా కదిలించింది. చంద్రవంక ఆ చెట్లమీద అలవోకగా కూచున్నట్టుంది ఆ దృశ్యం. లాసన్ గట్టు మీదికి నడిచాడు. ఎతెల్ నీళ్లలో వెల్లకిలా యీదుతోంది.

పొడవాటి వెంట్రుకలు నీళ్లమీద తేలుతుంటే ఒక చేయిలో పెద్ద మందార పువ్వును పట్టుకుంది ఆమె. ఒక్క క్షణం ఆగి, ఆ అందాన్ని ఆరాధించాడు లాసన్. ఎతెల్ ఒక దేవతలాగా కనిపించిందతనికి.

“హలో ఎతెల్” అని ఆనందంగా అరిచాడు లాసన్.

ఆమె అకస్మాత్తుగా అటు తిరిగి చేతిలోంచి పువ్వును జారవిడిచింది. అది నీళ్లమీద తేలుతూ కదలాడింది. ఆమె కొంత దూరం యీది, కింద వున్న నేల కాళ్లకు తగలగానే నిలబడింది.
“వెళ్లిపో. యిక్కణ్నుంచి వెళ్లిపో” అన్నదామె.

లాసన్ నవ్వి, “అంత స్వార్థం పనికి రాదు నీకు. మనమిద్దరం కలిసి యీదటానికి ఎంతో జాగా వుంది” అన్నాడు ఉల్లాసంతో.

“ఆ వంతెన దగ్గరికి పో. నువ్విక్కడ ఉండటం నాకిష్టం లేదు”

“నువ్వట్లా అనడం విచారకరం” అన్నాడు ఇంకా నవ్వుతూనే. అతనిలో ఎంత మాత్రం కోపం లేదు. ఆమెలో ప్రేమ అన్నది అతనికి మచ్చుకైనా కనిపించలేదు. అయినా తన కోటును విడవసాగాడు.

“వెళ్లిపో ఇక్కణ్నుంచి. నువ్విక్కడ ఉండొద్దు. కనీసం ఇక్కడైనా నన్ను ఒంటరిగా ఉండనివ్వవా? వెంటనే వెళ్లిపో” అన్నది ఎతెల్.

“అంత అవివేకం వద్దు నా ప్రియమైన ఎతెల్” అన్నాడు లాసన్.

ఆమె వంగి ఒక పదునైన రాయిని తీసుకుని, లాసన్ మీదికి దాన్ని విసిరింది. దాన్నుండి తప్పించుకోవటానికి లాసన్ కు సమయం లేకపోయింది. అది వచ్చి అతని కణతలో తగిలింది. బాధతో అరుస్తూ అతడు తన చేయిని కణతమీద వుంచాడు. తర్వాత చేయిని చూసుకుంటే అది రక్తంతో తడిసిపోయి వుంది. ఎతెల్ కోపంతో ఒగరుస్తూ ఇంకా నిలబడే వుంది. లాసన్ బాగా పాలిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కోటును తీసుకుని వెళ్లిపోయాడు. ఎతెల్ మళ్లీ నీళ్లమీద వెల్లకిలా యీదుతూ కొంచెం దూరాన వున్న చిన్న వంతెన దాకా పోయింది.

ఆ రాయి చిన్న రంధ్రం గల గాయాన్ని ఏర్పరచింది. లాసన్ దానిమీద ఒక బ్యాండేజీని వేయించుకుని కొన్ని దినాలపాటు దాంతోనే తిరిగాడు. క్లబ్బు దగ్గర మిత్రులెవరైనా దాని గురించి అడిగితే చెప్పటం కోసం ఒక కట్టుకథను సిద్ధంగా వుంచుకున్నాడు. కాని ఎవరికీ దాన్ని చెప్పాల్సిన అవసరం రాలేదు. దెబ్బ ఎలా తగిలిందని ఎవ్వరూ అడగలేదు. వాళ్లు అనుమానం నిండిన చూపులతో మాత్రమే చూస్తూ ఒక్క ప్రశ్నను కూడా అడగటం లేదని గ్రహించాడు లాసన్. వాళ్ల మౌనం అతడిని ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే వాళ్లకు అసలు విషయం తెలిసిపోయినందువల్లనే ఏమీ అడగటం లేదనుకున్నాడు. ఎతెల్ కు ఒక ప్రేమికుడున్నాడనీ, అతడెవరో వాళ్లందరికీ తెలుసుననీ కచ్చితమైన నిర్ధారణకు వచ్చాడు లాసన్. కాని, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదతనికి. ఎతెల్ పక్కన ఎప్పుడూ ఏ వ్యక్తినీ చూడలేదతడు. ఎవ్వరూ ఆమెతో ఎక్కడికైనా వెళ్లేందుకు ఆసక్తిని చూపలేదు. అటువంటి అనుమానాన్ని కలిగించే విధంగా ఎవరి ప్రవర్తనా వింతగా కనిపించలేదు. అతని మనసులో విపరీతమైన విద్వేషం చెలరేగింది. తన బాధను చెప్పటం కోసం యెవ్వరూ లేకపోవటంతో అతడు మరింత ఎక్కువగా మద్యం తాగటం మొదలు పెట్టాడు. నేను మరికొన్ని రోజుల తర్వాత ఆ ద్వీపానికి వస్తాననగా లాసన్ కు మద్యపాన ప్రభావం తాలూకు డెలీరియమ్ ట్రెమెన్స్ అనే వ్యాధి వచ్చిందట.

ఏపియా పట్టణానికి మూడు మైళ్ల దూరంలో వుండే ఒక ఊర్లోని కాస్టర్ అనే ఆంగ్లేయుని ఇంట్లో ఎతెల్ ను కలిశాను నేను. కాస్టర్ ఆ ద్వీపానికి చెందిన ఒక స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడూ నేనూ ఒకసారి టెన్నిస్ ఆడుతూ అలసిపోయినప్పుడు, టీ తాగుదామన్నాడు కాస్టర్. ఇంట్లోని ఒక గదిలోపలికి పోయాము. ఆ గది అపరిశుభ్రంగా వుంది. అందులో కాస్టర్ భార్యతో ఎతెల్ మాట్లాడుతూ ఉండటం కనిపించింది.

“హలో ఎతెల్, నువ్వొచ్చినట్టు నాకు తెలియదు” అన్నాడు కాస్టర్.

ఆమెను ఆసక్తిగా చూడకుండా ఉండలేక పోయాను. లాసన్ లో అంత పిచ్చి మోహాన్ని కలిగించే విషయం ఎతెల్ లో ఏముందా అని పరిశీలించడానికి ప్రయత్నించాను. కాని ఇటువంటి విషయాలను ఎవరు స్పష్టంగా వివరించగలరు? ఆమె ఆకర్షణీయంగా ఉన్నదనటంలో అనుమానం లేదు. ఆ ద్వీపంలో చాలాచోట్ల కనపడే ఎర్ర మందారం లాగా సొగసుగా ఉన్నదామె. కాని, ఆమెను గురించిన వృత్తాంతం అప్పటికే నాకు కొంచెం తెలిసివున్న నేపథ్యంలో నన్ను బాగా ఆశ్చర్యపరచిన విషయమేమంటే ఆమెలోని తాజాదనం, సాదాసీదాతనం ఎంతో ముద్దు గొలిపేలా ఉన్నాయి. ఆమె మౌనంగా ఉండటమే కాక కొంచెం బిడియాన్ని ప్రదర్శించింది. ఆమెలో యెటువంటి మోటుతనం, అనవసరపు మాటకారితనం లేవు. మిశ్రమజాతి మనుషుల్లో సాధారణంగా కనిపించే అతిశయం, ఉత్సాహం ఆమెలో కనిపించలేదు. తన భర్తతో ఎతెల్ ఘోరంగా పోట్లాడుతుందని నేను విని ఉన్నప్పటికీ ప్రవర్తనలో దాష్టీకం ఉన్న ఆడదానిలా ఆమె యెంతమాత్రం అగుపించలేదు.

ఎత్తు మడమల చెప్పుల్ని వేసుకుని అందమైన గులాబిరంగు ఫ్రాకును తొడుక్కున్న ఎతెల్ అచ్చం ఒక యూరోపియన్ స్త్రీలాగా వుంది.

సమోవా ద్వీపానికి కొత్తగా వచ్చినవాళ్లతో అక్కడివాళ్లు ఏం మాట్లాడుతారో అదే నాతో మాట్లాడింది ఎతెల్. ప్రయాణం ఎలా సాగిందనీ, పాపాసియా అనే బండరాళ్ల దగ్గరి ప్రవాహపు నీళ్లలో మునిగారా అనీ, పట్టణంలో కాక పల్లెటూరులో వుంటారా అనీ ప్రశ్నలు వేసింది. స్కాట్లండు గురించి అడిగింది. తాను స్కాట్లండులో ఉండి వచ్చిన విషయాన్నీ, అక్కడి తన యింటి పరిసరాల్నీ వివరించాలనే ఉద్దేశంతో ఆమె అలా అడిగిందా అని అనుమానం వచ్చింది నాకు. స్కాట్లండులో తనకు తెలిసిన కొందరు ఆంగ్లేయ స్త్రీల పేర్లను చెప్పి, వాళ్లు మీకు తెలుసా అని అమాయకంగా అడిగింది.

అంతలోనే జర్మనీ, అమెరికా వారసత్వాలను కలిగిన లావుపాటి మిల్లర్ అక్కడికి వచ్చాడు. సహృదయతను కనబరుస్తూ అందరి వైపూ చేయి ఊపి కూర్చుంటూ తనకు విస్కీ సోడా కావాలని ఉల్లాసంగా, బిగ్గరగా అడిగాడు. అతడు యెంతో లావుగా ఉండటం చేత బాగా చెమటలు కక్కుతున్నాడు. గోల్డ్ రిమ్ ఉన్న తన కళ్లద్దాలను తీసి వాటిని జేబురుమాలుతో తుడిచాడు. ఆ పెద్ద కళ్లద్దాల వెనుక కరుణరసాన్ని ఒలికించే అతని చిన్న కళ్లు కనిపించాయి. కాని వాటిలో చలాకీతనం, కపటత్వం ఉన్నట్టు తెలిసిపోతుంది చూసేవాళ్లకు. అతడు రాకముందరి దాకా అక్కడ కొంత మందకొడితనం చోటు చేసుకుంది. కాని మిల్లర్ ఉత్సాహం ఉన్న వ్యక్తే కాక, మంచిమంచి విషయాలను చెప్తాడు. కొంత సమయం గడవగానే మిల్లర్ చెప్పిన హాస్యపూరిత విషయాలను విని ఎతెల్, కాస్టర్ భార్యా హాయిగా నవ్వారు. మిల్లర్ కు ఆ ద్వీపంలో ఆడవాళ్లను మాటల ద్వారా రంజింపజేసే మనిషి అని పేరు వుంది. లావుగా అసహ్యంగా ఉండే అటువంటి వ్యక్తి పట్ల కూడా ఆకర్షణ కలిగే అవకాశముందని తెలుస్తుంది అతని మాటల్ని వింటే. అతని హాస్యం తన చుట్టూ వున్న మనుషుల అవగాహనా స్థాయిని బట్టి మారుతుంటుంది. అందులో ఒక రకమైన శక్తీ, నిబ్బరమూ కనిపిస్తాయి. పాశ్చాత్య దేశాల భాష తాలూకు ఉచ్చారణ అతడు చెప్పే విషయానికి ఒక విచిత్రమైన గాంభీర్యాన్ని సమకూరుస్తుంది. ఆఖరుకు మిల్లర్ నావైపు తిరిగి, “రాత్రి భోజనం కోసం మనం ఏపియా పట్టణానికి తిరిగి వెళ్లి పోవాలనుకుంటే నా కారులో నేను మిమ్మల్ని తీసుకుపోతాను, ఒక వేళ అందుకు మీరు ఇష్టపడితే” అన్నాడు.

నేను కృతజ్ఞతలు చెప్పి లేచాను. అతడు మిగతావాళ్లతో చేతులు కలిపి గది బయటికి నడిచాడు. తర్వాత కారులో కూర్చున్నాడు.

“లాసన్ భార్య చిన్నగా యెంతో ముద్దొస్తూ వుంది కదా” అన్నాను మేం కారులో పోతుంటే.

“లాసన్ ఆమెతో ఘోరంగా ప్రవర్తిస్తాడు. బాగా కొడతాడట. మగాడు స్త్రీని కొడతాడనే విషయాన్ని వింటే కోపంతో నా రోమాలు నిక్కబొడుస్తాయి” అన్నాడు మిల్లర్.

ఆ విషయం గురించి మేము కొంచెం మాట్లాడుకున్నాము. “ఆమెను పెళ్లి చేసుకోవటం అన్నది అతని మూర్ఖత్వం” అన్నాడు మిల్లర్.

అవి ఆ సంవత్సరపు ఆఖరి రోజులు. నేను సమోవా ద్వీపాన్ని వదిలి పోవాల్సిన సమయం ఆసన్నమైంది. జనవరి నాలుగవ తేదీన నా పడవ సిడ్నీకి ప్రయాణం కావలసి వుంది. హోటల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కాని, అవి కొత్త సంవత్సర ఉత్సవానికి నాంది లాగా జరిగాయే తప్ప వాటిలో విశేషం ఏమీ లేదు. హోటల్ లాంజ్ లో గుమిగూడే అలవాటున్న వ్యక్తులు క్రిస్మస్ ఈవ్ ను రాత్రంతా ఉల్లాసంగా గడపాలని నిశ్చయించుకున్నారు. ఆ రాత్రివేళ సందడీ, ఆర్భాటం నిండిన విందు తర్వాత అందరూ మెల్లగా నడుచుకుంటూ ఇంగ్లిష్ క్లబ్ వైపు వెళ్లారు. అక్కడ బిలియర్డ్స్ ఆడాలని అనుకున్నారు. ఆ క్లబ్ లో ఎన్నో మాటలు, నవ్వులు, బెట్టింగులు మొదలైన విషయాలతో వాతావరణం కోలాహలంతో నిండిపోయింది. అంతే తప్ప బిలియర్డ్స్ ఆట యెక్కువగా సాగలేదు. మిల్లర్ మాత్రం ఎక్కువగానే ఆడాడు. అక్కడ ఉన్న అందరూ అతనికన్న చిన్నవాళ్లే అయినా అతడు వాళ్లతో సమానంగా తాగాడు. పైగా తాగివున్నా కూడా తన కన్నునూ చేయినీ చక్కగా ఉపయోగిస్తూ ఆటను సాగించాడు. హాస్యాన్నీ మర్యాదనూ కనబరుస్తూ, ఆ యువకుల డబ్బును గెలిచి తన జేబులో వేసుకున్నాడు. ఒక గంట సమయంగడిచింతర్వాత నాకు విసుగొచ్చి బయటికి నడిచాను. రోడ్డును దాటి బీచి మీదికి చేరుకున్నాను. అక్కడ మూడు కొబ్బరిచెట్లు తమ ప్రియులకోసం వేచిచూస్తున్న నెలవంకల లాగా పెరిగి వున్నాయి. వాటిలోని ఒక కొబ్బరిచెట్టు మొదలు దగ్గర కూర్చుని, ఎదురుగా ఉన్న సముద్రపు నీటినీ, పైన ఆకాశంలో వున్న నక్షత్రాలనూ చూడటం మొదలు పెట్టాను.

సాయంత్రం పూట లాసన్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. కాని, రాత్రి పది పదకొండు గంటల మధ్య అతడు క్లబ్బుకు వచ్చాడు. మట్టికొట్టుకుపోయిన తోవ మీదుగా కాళ్లీడ్చుకుంటూ అనాసక్తతతో, విసుగుతో క్లబ్ కు చేరుకుని మద్యం తాగటం కోసం బార్ లోకి వెళ్లాడు. అక్కడ వున్న తెల్లవాళ్లలో కలిసిపోవాలంటే అతనికి సిగ్గనిపించింది. దాన్ని పోగొట్టుకోవడం కోసం మంచి విస్కీని తాగలనుకున్నాడు. చేతిలో విస్కీ గ్లాసును పట్టుకుని నిల్చున్న లాసన్ దగ్గరికి మిల్లర్ వచ్చాడు. అతడు టీ షర్ట్ తొడుక్కుని వున్నాడు. చేతిలో బిలియర్డ్స్ ఆట తాలూకు పొడుగాటి కర్ర వుంది. ఒక వెయిటర్ వైపు చూపును విసిరి, “నువ్విక్కణ్నుంచి వెళ్లిపో” అన్నాడతనితో.

తెల్ల షర్టు తొడుక్కుని వున్న ఆ వెయిటర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్లిపోయాడు.

“చూడు లాసన్. నీతో కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను” అన్నాడు మిల్లర్.

“ఈ ద్వీపంలో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా చేయగలిగిన పని అదొక్కటే” అన్నాడు లాసన్.

మిల్లర్ తన కళ్లద్దాలను ముక్కుమీద నొక్కిపెట్టి, లాసన్ మీద తదేక దృష్టిని నిలిపాడు. ఆ చూపులో ఎంత మాత్రం సహృదయత లేదు.

“చూడు బాబూ, నువ్వు ఎతెల్ ను ఇంకా కొడుతున్నావట. దాన్ని నేను భరించలేను. అటువంటి పనిని నువ్వు తక్షణమే మానుకోకపోతే నీ ఎముకల్ని ముక్కలు చేస్తాను”

చాలా రోజులుగా తన మనసులో మెదులుతున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టైంది లాసన్ కు. ఎవరా అని తను పశ్నించుకుంటున్న వ్యక్తి మిల్లరే అన్న మాట అనుకున్నాడు. బట్టతలతో బాగా లావుగా ఉండి, బంగారు అంచు కళ్లద్దాలను పెట్టుకునే మిల్లరునూ, సన్నని తీగలా ఉండే కన్య వంటి ఎతెల్ నూ తల్చుకోగానే అతని మనసులో అకస్మాత్తుగా ఉద్వేగం, కోపం చోటు చేసుకున్నాయి. లాసన్ పిరికివాడు కాడు. అతడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిల్లర్ ను బలంగా కొట్టాడు. మిల్లర్ తాను కర్రను పట్టుకున్న ఎడమ చేత్తో ఆ దెబ్బను తట్టుకుని, బలమైన కుడి చేత్తో పిడికిలి బిగించి, అతి వేగం గా లాసన్ చెవి మీద పిడిగుద్దును వేశాడు. మిల్లర్ కన్న లాసన్ నాలుగంగుళాలు పొట్టిగా వుంటాడు. అతని శరీరం కూడా చిన్నదే. అది జబ్బు మూలంగానే కాక తాగుడు కారణంగా బలహీనమై వుంది. అతడు కర్రదుంగ లాగా కింద పడిపోయాడు. బార్ ద్వారం దగ్గర సగం స్పృహ తప్పి నేలమీద పడివున్నాడు. మిల్లర్ తన కళ్లద్దాలను జేబురుమాలుతో తుడుచుకుంటూ “నీకు తెలుసనుకుంటాను. నిన్ను ముందే హెచ్చరించాను. దాన్ని నువ్వు పాటించటం మంచిది” అన్నాడు.

అతడు ఆ పొడుగాటి కర్రను తీసుకుని బిలియర్డ్స్ గదిలోకి పోయాడు. అప్పుడక్కడ చాలా గంగరగోళం నెలకొనడంతో, అసలేం జరిగిందో ఎవ్వరికీ వెంటనే తెలియలేదు. లాసన్ లేచి నిలబడ్డాడు. నొప్పితో మండుతున్న చెవి మీద చేయిని పెట్టుకుని, క్లబ్ లోంచి బయటికి వెళ్లిపోయాడు. ఇదంతా చాలా సేపటి క్రితం జరిగింది. ఇప్పుడొక వ్యక్తి చీకట్లో రోడ్డును దాటుతూ నావైపు వస్తున్నాడు. కాని అతడు లాసనే అని తెలియలేదు. అతడు బీచి దగ్గరికి వచ్చి, చెట్టు మొదట్లో కూచున్న నన్ను దాటుకుంటూ పోయాడు. అప్పుడు లాసన్ ను గుర్తు పట్టాను. కాని అతడు తాగివున్నాడనటంలో ఎలాంటి అనుమానం లేదు. కనుక నేనతనితో మాట్లాడలేదు. అతడు అనిశ్చయంగా రెండుమూడడుగులు ముందుకు వేసి, వెనుతిరిగాడు. నా దగ్గరికి వచ్చి వంగి, నా ముఖంలోకి చూశాడు.

“లాసన్, వచ్చింది నువ్వే అని తెలుసు నాకు” అన్నాను. లాసన్ కింద కూచుని, పొగాకు నిండిన పైపును బయటికి తీశాడు.

“క్లబ్బులో చాలా గోలగా, వేడిగా ఉండింది” అంటూ మాట కలిపాను.

“ఇక్కడెందుకు కూచున్నావు?” అని అడిగాడు లాసన్.

“చర్చిలో అర్ధరాత్రి జరిగే ప్రార్థనలను వినడానికి పోవాలనుకుంటున్నాను”

“నీకిష్టమైతే నేను కూడా నీతో వస్తాను”

లాసన్ నిషాలో లేడు. మేమిద్దరం కొంతసేపు చీకట్లో నిశ్శబ్దంగా కూచుని పొగ తాగాము. ఎదురుగా వున్న సముద్రపు నీళ్లలో అప్పుడొకటీ ఇప్పడొకటీ పెద్దచేప వేగంగా కదలటంతో శబ్దం వినపడుతోంది. ఇంకొంచెం దూరంలో సముద్రపుటొడ్డున వున్న ఓడలోంచి వెల్తురు బయటికి వస్తూ కనపడుతోంది.

“వచ్చే వారం మీరు పడవలో వెళ్లిపోతున్నారు కదా” అని అడిగాడు లాసన్.

“ఔను” అన్నాను.

“మన సొంత యింటికి పోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. కాని ఈ చలికాలాన్ని నేను తట్టుకోలేను”

“ఇంగ్లండులో మనుషులిప్పుడు వణుకుతూ చలిమంట చుట్టు చేరుతారని ఊహించడం విడ్డూరమే” అన్నాను.

ఒక్క గాలికెరటం కూడా వీచడం లేదు. వెచ్చని, ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ఆ రాత్రి మంత్రముగ్ధకరంగా వుంది. నేను సన్నని చొక్కా, మందమైన నిక్కరూ తప్ప మరేమీ వేసుకోలేదు. బద్ధకాన్ని అనుభవంలోకి తెస్తున్న ఆ రాత్రిని నేను ఆనందించాను. కాళ్లనూ, చేతులనూ బార్లా చాపుకున్నాను.

“భవిష్యత్తు కోసం చక్కని నిర్ణయాలు తీసుకునేట్టు చేసేలాగా లేదు ఈ క్రిస్మస్ ఈవ్” అని నవ్వాను.

లాసన్ సమాధానమివ్వలేదు. సరదా కోసం నేను అన్న వాక్యం అతని మనసులో ఎటువంటి ఊహలను రేపిందో కాని, అతడు మాట్లాడసాగాడు. మంద్రమైన స్వరంలో, ఎటువంటి ఉద్వేగాన్నీ కనబరచకుండా మాట్లాడాడు. కాని అసలైన విద్యావంతుని మాటల్లాగా ఉన్నాయి అతని వాక్యాలు. అసభ్యతను నింపుకున్న సొంపు లేని ఉచ్చారణలను వినీ వినీ విసిగిపోయిన నా చెవులకు ఒక పెద్ద ఉపశమనం దొరికినట్టైంది.

“నేను నా జీవితాన్ని చెడగొట్టుకున్నాననేది స్పష్టం. అవునా? ఒక లోతైన గుంత అడుగు భాగాన ఉన్నాను నేను. దాంట్లోంచి బయటికి రావడమంటూ ఉండదనుకుంటా. ఒక ధ్రువం నుండి మరొక ధ్రువం దాకా విస్తరించిన నల్లని చీకటి గుంత అది” అన్నాడు. ఆ కొటేషన్ ను చెప్తూ లాసన్ నవ్వటం నేను గమనించాను. తర్వాత “ఇక్కడ చిత్రమైన విషయమేమిటంటే, నేనెక్కడ తప్పటడుగు వేశానో తెలియటం లేదు” అన్నాడు.

నేను ఊపిరి బిగపట్టాను. ఎందుకంటే ఒక వ్యక్తి నగ్నమైన తన ఆత్మను మరొకరి ముందుంచటం కన్న యెక్కువ అద్భుతమైన విషయం నాకు వేరొకటి ఉండదు. సానుభూతిని రగిలిపజేసే వెలుగురవ్వ ఉంటుంది అటువంటి మనసులో.

“తప్పంతా నాదేనని గుర్తిస్తే నా జీవితం ఇంత చండాలంగా ఉండకపోయేది. నేను తాగుబోతుగా మారానన్నది నిజమే. కాని పరిస్థితులు వేరే విధంగా ఉంటే నేను తాగుడుకు బానిస అయ్యేవాణ్ని కాదు. నిజానికి మద్యం పట్ల నాకు అంతగా ఇష్టం వుండదు. నేను ఎతెల్ ను పెళ్లి చేసుకోవాల్సింది కాదనుకుంటాను. ఆమెను ఉంపుడుకత్తెగా ఉంచుకుంటే అంతా సవ్యంగా ఉండేది. కాని నేనామెను అంత గాఢంగా ప్రేమించాను” అన్నాడు లాసన్. అతని గొంతు తడబడింది. మళ్లీ ఇట్లా అన్నాడు. “నిజానికి ఎతెల్ అంత చెడ్డదేం కాదు. మొత్తం నా దురదృష్టం వల్లనే జరిగింది, అంతే. మేము దొరల్లాగా హాయిగా ఉండేవాళ్లమే. ఇంగ్లండులోని మా యింట్లోంచి ఎతెల్ పారిపోయినప్పుడు నేను ఊరుకోవాల్సిందేమో. కాని ఊరుకోలేకపోయాను. ఆమెను వదులుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పటికే మాకు ఒక బాబు కూడా ఉన్నాడాయె”

“ఆ బాబుపట్ల నీకు బాగా ప్రేమ వుందా?” అని అడిగాను.

“ఉండింది. తర్వాత ఒకరు పోయి ఇద్దరు పిల్లలయ్యారు. కాని ఇప్పుడు వాళ్లపట్ల నాకు అంతగా ప్రేమ లేదు. వాళ్లు ఎంత స్థానికుల్లాగా తయారయ్యారంటే, సమోవా భాషలోనే మాట్లాడాలి వాళ్లతో”

“జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించడానికి నీకు ఆలస్యమైందంటావా? ఈ జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని నెలకొల్పుకోలేవా?”

“అంత ఆత్మబలం లేదు నాలో. నా బతుకు చట్టుబండలైంది”

“నీ భార్య పట్ల ఇంకా ప్రేమ వుందా నీకు?”

“ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు” గొంతులో ఒక రకమైన భయం ధ్వనిస్తుంటే ఆ పదాలను రెట్టించాడతడు. తర్వాత, “నేను పూర్తిగా ముక్కలయ్యాను” అన్నాడు.

చర్చిలో గంటలు మోగాయి.

“నువ్వు కూడా నాతో చర్చికి రావాలనుకుంటే రావచ్చు” అన్నాను.

“సరే, పదండి” అన్నాడు లాసన్.

మేము లేచి రోడ్డు వెంట నడిచాము. తెల్లగా, గంభీరంగా, ఆకర్షణీయంగా ఉన్న ఆ చర్చి సముద్రానికి ఎదురుగా వుంది. దానికెదురుగా వున్న చిన్నచిన్న గుడులవంటి భవనాలు సమావేశ మందిరాల్లాగా కనపడుతున్నాయి. రోడ్డు మీద రెండుమూడు కార్లు, ఎన్నో బగ్గీలు ఉన్నాయి. చర్చిగోడ పక్కన మరెన్నో బగ్గీలు నిలబడి వున్నాయి. ఆ ప్రార్థన కోసం ద్వీపంలోని అన్ని చోట్లనుండి ప్రజలు వచ్చారు. ప్రధాన ద్వారంలోంచి చూస్తే లోపల చాలా మంది క్రిక్కిరిసి వున్న దృశ్యం కనిపించింది. ఎత్తైన వేదిక మీద కాంతి సమృద్ధిగా కురుస్తోంది. అక్కడ కొందరు తెల్లజాతీయులు, మరికొందరు మిశ్రమజాతి వాళ్లు ఉన్నారు. కాని, స్థానిక జాతులవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందరూ ప్యాంట్లు తొడుక్కున్నారు. వెనకాల ఉన్న కుర్చీల మీద కూర్చున్నాం మేము. లాసన్ దృష్టి సారిస్తున్న వైపు చూసి, అక్కడ ఎతెల్ తన జాతివాళ్ల గుంపులో వుండటం గమనించాను. వాళ్లందరూ అట్టహాసంగా కనిపించే దుస్తులు తొడుక్కున్నారు. బిరుసైన, పెద్దపెద్ద కాలర్లతో వుండే షర్టులు తొడుక్కుని, తళతళ మెరిసే నల్లని బూట్లను వేసుకున్నారు. ఆడవాళ్లేమో పెద్దపెద్ద హ్యాట్లను తలమీద పెట్టుకున్నారు. ఎతెల్ ముందుకు నడుస్తూ తన స్నేహితురాళ్లను చూసి నవ్వింది. ముందర ఉన్న వేదిక దగ్గరికి ఆమె నడిచి వెళ్లింది. ప్రార్థన మొదలైంది.

ప్రార్థన ముగిసింతర్వాత జనం బయటికి వస్తుంటే నేనూ లాసనూ పక్కకు జరిగి నిలబడ్డాము. పోతూపోతూ లాసన్ తన చేయిని పైకెత్తి ఊపుతూ “గుడ్ నైట్. మీ ప్రయాణం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను” అన్నాడు.

“ఓ, సరే. కాని, వెళ్లేముందు మళ్లీ కలుస్తాను కదా” అన్నాను.

అతడు నవ్వి, “కాని, అప్పుడు నేను తాగిన మైకంలో వుంటానా లేక నిషా లేకుండా వుంటానా అన్నదే ప్రశ్న” అన్నాడు.

అతడు వెనుతిరిగి వెళ్లిపోయాడు. దట్టంగా పెరిగిన కనుబొమల కింద నల్లగా మెరిసే అతని పెద్ద కళ్లు నా మనసులో మెదిలాయి. కొంచెం తటపటాయించి ఆగాను. నాకు ఇంకా నిద్ర రావటం లేదు కనుక క్లబ్బులో ఒక గంటసేపు గడిపి హోటలుకు పోవాలనుకున్నాను. క్లబ్బును చేరుకోగానే బిలియర్డ్స్ గది ఖాళీగా కనిపించింది. కాని ఐదారుగురు మనుషులు ఒక టేబులు చుట్టూ కూచుని పోకర్ అనే పేకాట ఆడుకుంటున్నారు. నేను లోపలికి వెళ్లగానే మిల్లర్ నన్ను చూసి, “కూర్చుని ఒక గేమ్ పోకర్ ఆడండి” అన్నాడు.

“సరే” అని కూచున్నాను.

కొన్ని చిప్స్ కొనుక్కుని పోకర్ ఆడటం మొదలు పెట్టాను. అది అత్యంత ఆహ్లాదాన్నిచ్చే ఆట కనుక ఒక గంటకు బదులు మరో గంట, ఆ తర్వాత మరో గంట సేపు ఆడాను. బారులో పనిచేసే స్థానికుడైన వెయిటర్ ఒకడు బాగా రాత్రైపోయినా ఆ విషయాన్ని లెక్క చేయక మా పక్కనే వుండి మాకు కావలసిన మద్యాన్నీ, తినుబండారాలనూ సప్లై చేశాడు. ఆ విధంగా బ్రెడ్డూ, మటన్ కరీ దొరికాయి మాకు. మేము ఆడుతూ పోయాము. ఆడేవాళ్లలో చాలా మంది మరీ ఎక్కువగా తాగటంతో ఆట గందరగోళంగా సాగింది. నేను ఓ మోస్తరుగా ఆడాను. తప్పక గెలవాలనే పట్టుదల కానీ, ఓడిపోతానేమోననే భయం కానీ కలుగలేదు నాకు. కాని ఒక ప్రత్యేకమైన ఆసక్తితో మిల్లర్ ను గమనించాను. తక్కినవాళ్లు ఎంత తాగితే మిల్లర్ వాళ్లతో సమానంగా తాగాడు. అయినా అతడు నిషా తలకెక్కి ఔటవలేదు. అతని ముందర చిప్స్ గుట్టగా పేరుకునిపోయాయి. ఎవరికి ఎంతెంత డబ్బు అరువిచ్చిందీ ఒక చిన్న తెల్లని కాగితం మీద రాసుకున్నాడు. ఎవరి డబ్బునైతే తాను గెల్చుకుంటున్నాడో ఆ యువకుల వైపు సౌహార్దం నిండిన చూపును విసురుతున్నాడు. ఎడతెరిపి లేకుండా చిన్నచిన్న పిట్టకథలనూ, నవ్వు తెప్పించే వృత్తాంతాలనూ చెప్తున్నా ఒక్క గేములో కూడా ఓడిపోలేదతడు. ఆఖరుకు కిటికీల్లోంచి సూర్యకిరణాలు హెచ్చరించే బిడియంతో లోపలికి దూరి ‘ఇక తెల్లారిపోయింది కనుక ఆటను ఆపేయండి’ అన్నాయి.

“పోయిన సంవత్సరాన్ని చాలా బాగా గడిపాము మనం. ఇప్పుడు చివరగా ఒక ఆటను వేసుకుని దాంతర్వాత ఆపేద్దాం. నేను దోమతెరను వేసుకుని పడుకోవాలి. నా వయసు యాభై అనే విషయాన్ని మీరు మరిచిపోవద్దు. రాత్రంతా మేలుకుని వుంటే మరునాడు పొద్దున చాలా సేపు పడుకోకుండా ఉండలేను నేను” అన్నాడు మిల్లర్.

అందంగా, తాజాగా వున్న ఆ ఉదయాన మేము వరండాలో నిల్చుని చూస్తే ఎదురుగా వున్న సముద్రపు నీటి తలం ఒక రంగురంగుల గాజుదిమ్మ లాగా కనిపించింది. పడుకోబోయే ముందు ఆ నీళ్లలో స్నానం చేసి వద్దామని ఎవరో అన్నారు. కాని, పాదాలను జారేట్టు చేసే ఆ ఉప్పునీళ్లలో స్నానం చేయడం పట్ల యెవ్వరూ ఆసక్తిని చూపలేదు. ద్వారం దగ్గర వున్న తన కారులో మమ్మల్ని కొలనుదాకా తీసుకుపోతానన్నాడు మిల్లర్. మేమందులోకి దూరి, నిర్మానుష్యంగా వున్న రోడ్డు మీదుగా ప్రయాణించాము. కొలను దగ్గరికి చేరుకుని చూస్తే అక్కడ ఇంకా సూర్యోదయమైనట్టు లేదు. ఎక్కువ లోతు లేని నీళ్లలో చెట్లు మొలిచి వున్నాయి. రాత్రి తాలూకు చీకటి ఇంకా కొంచెం మిగిలిపోయి దాక్కుని వున్నట్టనిపించింది. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. టవళ్లు తెచ్చుకోలేదు కనుక స్నానం చేసింతర్వాత శరీరాన్ని ఎట్లా తుడుచుకోవాలి అని ఆలోచించాను నేను. అందరం పొట్టిపొట్టి దుస్తుల్ని వేసుకున్నాం కనుక వాటిని విప్పటానికి మాకు ఆలస్యం కాలేదు. ఓడమీద పని చేసే నెల్సన్ మొదటగా బట్టల్ని విడిచాడు.

“నేను నీటి అడుగు భాగాన్ని తాకబోతున్నాను” అన్నాడతడు. అతడూ, అతని వెనుక మరొడూ నీళ్లలోకి దూకారు. కాని లోతు యెక్కువగా లేకపోవటంతో నెల్సన్ వెంటనే నీటి ఉపరితలం మీదీకి వచ్చాడు. ఇంకా పైకి పక్కకు ఒరిగిపోతున్నాడు.

“నన్ను బయటికి లాగండి” అన్నాడు నెల్సన్.

“ఏమైంది?”

ఏదో విచిత్రమైన సంగతి వున్నట్టనిపించింది. అతని ముఖంలో భయం కనిపించింది. ఇద్దరు మనుషులు తమ చేతుల్ని అందిచ్చి నెల్సన్ ను బయటికి లాగారు.

“నీళ్ల అడుగున ఒక వ్యక్తి ఉన్నాడు” అన్నాడు నెల్సన్

“పిచ్చివానిలా మాట్లాడకు. నీకు నిషా ఎక్కువైంది”

“నేనన్నది తప్పు అయితే నిజంగానేను పిచ్చివాణ్నే అనుకోండి. కాని నేను చెప్తున్నది వాస్తవం. విపరీతమైన భయం కలిగింది నాకు” అన్నాడతడు.

మిల్లర్ వచ్చి నెల్సన్ ను చూశాడు. నెల్సన్ ముఖం పూర్తిగా పాలిపోయి వుంది. అతడు భయంతో వణుకుతున్నాడు.

“కాస్టర్, ఇటు రా. మనమిద్దరం నీళ్లలోకి పోయి సంగతేమిటో చూద్దాం” అన్నాడు మిల్లర్.

“అతడు నిలబడి వున్నాడు. డ్రెస్సు తొడుక్కునే వున్నాడు. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు కూడా” అన్నాడు నెల్సన్.

“నీ గోల ఆపు. కాస్టర్, నువ్వు సిద్ధమేనా?” అని అడిగాడు మిల్లర్.

వాళ్లిద్దరు నీళ్లలోకి దిగారు. మేము ఒడ్డున నిలబడి వేచి చూశాం. ఏ మనిషి ఐనా శ్వాసను ఆ ఎంత సేపు ఆపివుంచగలరో అంతకన్న ఎక్కు సేపే వాళ్లిద్దరు నీటిలోపల ఉన్నట్టనిపించింది మాకు. మొదట కాస్టర్ బయటికి వచ్చాడు. వెనువెంటనే మూర్ఛిల్లబోతున్నాడా అనిపించే ఎర్రని ముఖంతో మిల్లర్ వచ్చాడు. వాళ్లిద్దరూ నీళ్లలోంచి దేన్నో లాగుతున్నారు. మాలోంచి మరొకడు వెళ్లి వాళ్లకు సాయం చేశాడు. ముగ్గురూ కలిసి భారంగా లాగారు. అది లాసన్ శవమని అప్పుడు తెలిసింది మాకు. రెండు కాళ్లనూ తాడుతో కట్టుకోవడమే కాక, కోటును కూడా తాడుతో ఒక పెద్ద బండకు కట్టుకున్నాడు లాసన్.

“ఈ పని చేయాలని లాసన్ గట్టిగా నిర్ణయించుకున్నాడు” అన్నాడు మిల్లర్, తన కళ్లమీది నీళ్లను తుడుచుకుంటూ.

[అయిపొయింది]

**** (*) ****