[అక్టోబర్ నెల సంచిక తరువాయి]
మేమిక బయల్దేరాలని నిర్ణయించుకున్న గంట లోపలే అయిదు డోలీ లు సిద్ధమయాయి. వాటిని మోసుకుపోయేందుకు పదిమంది మనుషులు, కాసేపు బుజాలు మార్చుకుందుకు ఇంకొందరు. మా సామాను మోసేందుకూ కాపలా కాసేందుకూ యాభై మంది అమహగ్గర్ మనుషులు. మాతోబాటు బిలాలీ కూడా ఒక డోలీ లో వస్తాడని తెలిసి నాకు ధైర్యంగా అనిపించింది. మిగిలిన అయిదో డోలీ లో ఎక్కేదెవరు ? ఉస్తేన్ ?? అదే అడిగాను
బిలాలీ ని.
” ఆమెకి ఇష్టమైతే వస్తుంది బిడ్డా. మా భూమి లో స్త్రీ తానేది కోరుకుంటే అది చేయవచ్చు. ఆమెను పూజిస్తాము మేము – ఆమే లేకపోతే సృష్టి కొనసాగదు కదా ? ”
” ఓ ” – అన్నాను. ఆ విషయాన్ని ఆ దృష్టి తో చూసిఉండలేదు ఎప్పుడూ.
” మేము పూజిస్తాం వారిని ” – కొనసాగించాడు అతను , ” వాళ్ళు మరీ దుర్భరంగా తయారయేవరకూ ..అలా జరుగుతుంటుంది అప్పుడప్పుడూ, అంటే రెండు తరాలకొకసారి ”
” అప్పుడేం చేయబోతారు మీరు ? ”
” అప్పుడు…” – పల్చగా నవ్వాడతను – ” ఏం లేదు, చంపేస్తాం – వయసు మీరిన వాళ్ళని , అది చూసి పడుచువాళ్ళు బుద్ధిగా ఉంటారు. పురుషుల బలాన్ని ఆ రకంగా గుర్తు చేస్తుంటాం. నా భార్య – మూడేళ్ళ కిందట అలాగే చచ్చిపోయింది…కాని ఉన్నమాట చెబుతున్నాను, ఆ తర్వాత జీవితం శాంతం గా ఉందిలే. నన్నిక పడుచుపిల్లలు ఇబ్బంది పెట్టబోయేదీ లేదు గదా ”
” ఓహో . మీరు ఎక్కువ స్వేచ్ఛా తక్కువ బాధ్యతా ఉండే స్థితిని సాధించుకున్నారన్నమాట ” – ఈ అమహగ్గర్ ల గోల ఎరగని ఒక బ్రిటిష్ పెద్దమనిషి పలుకులను వల్లించాను.
బిలాలీ కి పాపం మొదట అర్థం కాలేదుగానీ మెల్లిగా వెలిగింది.
” అవునవును ” – తల ఊపాడు – ” ఇంచుమించు అన్ని ‘ బాధ్యతలూ ‘ వదిలాయిలే మాకు . అన్నీ కాదనుకో, ఇంకా కొందరు ముసలమ్మలు బతికే ఉన్నారుగా. ఇంతకూ ఆ గతి వాళ్ళు తెచ్చిపెట్టుకున్నదే ..ఈ పిల్ల సంగతి – ఆమె మంచి సాహసం గలది. తన ప్రాణం ఒడ్డి ‘ యువసింహం ‘ ప్రాణాలు కాపాడింది కదా – మా ఆచారం ప్రకారం వాళ్ళిద్దరికీ పెళ్ళయిపోయినట్లే…అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళగల హక్కు ఉంటుంది , రాణి కి ఇష్టం లేకపోతే తప్ప .. రాణి మాటకు ఎదురుండదు ”
” రాణి ఆమెని వెళ్ళిపొమ్మన్నప్పుడు ఈమె దాన్ని పాటించకపోతేనో ?? ”
అతను బుజాలెగరేశాడు – ” తుఫానుకి చెట్టు వంగాలి , వంగనంటే ఏమవుతుంది ?? ”
ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి తన డోలీలో ఎక్కి కూర్చున్నాడు. పదినిమిషాల్లో మా ప్రయాణం ఊపందుకుంది.
అగ్నిపర్వతపు లావా కప్పిన మైదానం దాటేందుకు మాకొక గంట పట్టింది. ఆ కొండవాలు ఎక్కి అవతలి పక్కకి చేరేందుకు ఇంకొక అరగంట . అక్కడ, చూపు సాగినంత మేరనా అందమైన గడ్డి మేటలు- మధ్య మధ్యన ముళ్ళ చెట్లతో , అవీ ఆకుపచ్చగానే కనబడుతున్నాయి. బాగా దూరంగా- ఆ దూరం ఒక పది మైళ్ళుంటుందేమో – చిత్తడి నేలలు. వాటి మీదినుంచి లేచే విషవాయువులు దట్టమైన పొగమబ్బుల్లాగా ఆవరించుకుని ఉన్నాయి. మధ్యాహ్నమయేసరికి ఆ చిత్తడి నేల అంచులకి చేరి – అక్కడ ఆగి మా మధ్యాహ్నభోజనాలు కానిచ్చాము. ఇహ బయల్దేరి , మెలికల మెలికల దారివెంట పడి పోయాము – కాస్త ఇవతలినుంచి చూసినా అక్కడొక దారి ఉన్న ఆనవాళ్ళే తెలిసేవి కావు – మా బోయీలకి ఎలా దారి తెలిసేదో నాకు అర్థం కాలేదు. ఇద్దరు మనుషులు పొడుగాటి వాసాలు పట్టుకుని ముందు నడిచారు – అప్పుడప్పుడూ వాటిని నేలలోకి గుచ్చి పరిశీలిస్తూ. అక్కడి భూమి స్వభావం అతి తరచుగా మారిపోతూ ఉంటుందట – ఇవాళ సురక్షితమైన చోటు వచ్చే నెలకి ఊబి కింద మారిపోవచ్చట. తెంపు లేకుండా మైళ్ళ తరబడి పరుచుకున్న ఆ బురద నేలల్ని చూస్తుంటే దిగులు పుట్టింది. మధ్యలో ఎక్కడో తప్పించి గట్టి భూమి లేనేలేదు. ఆ మురికి నీళ్ళ లోంచి కర్ణ కఠోరంగా కప్పల బెకబెకలు. విషవాయువులు మరీ చిక్కనైపోయి ఏమీ కనిపించనప్పుడు తప్ప మేము ఆగింది లేదు. బాతులూ కొంగలూ వంటి నీటి పక్షులూ వాటిని తిని బతికే జంతువులూ – ఇవే అక్కడి జీవజాలం. ఆ పక్షుల్లో నేనెన్నడూ కనీ వినీ ఎరగని రకాలున్నాయి. నీళ్ళలో వింత వింత పాములూ మొసళ్ళూనూ. మామూలుగా నీటిపాములకి విషం ఉండదు – ఇవి కాటేస్తే మటుకు ప్రమాదమేనట. దోమల విషయమైతే చెప్పే పనిలేదు – ఘోరంగా బాధ పెట్టాయి మమ్మల్ని. అన్నిటికంటే దరిద్రం అక్కడి దుర్వాసన,అది పీల్చితేనే రోగాలు దాపురిస్తాయనిపించింది.
అదంతా దాటేసిన తర్వాత , సూర్యాస్తమయమవుతూండగా – కొంచెం పొడిగా ఉన్న ప్రదేశానికి చేరుకుని ఆ రాత్రికి అక్కడ విడిది చేశాము. కర్రా కంపా పోగు చేసి పెద్ద నెగడు వేశారు – చుట్టూ కూర్చుని భోజనాలు చేసి చుట్టలు ముట్టించాము. దోమలకి పొగపడదు గనక వాటి బెడద తగ్గింది. వాతావరణం ఎంత మాత్రమూ సౌకర్యంగా లేదు – వింతగా , కాసేపు చలిగాలి, ఇంకాసేపు ఉక్కపోత. కంబళ్ళు ముసుగు పెట్టి నిద్రకి ఉపక్రమించాముగాని – ఆ దుర్భరమైన వాసనకీ కప్పల అరుపులకీ నాకు అసలు నిద్రపట్టలేదు. కాస్త దూరంగా నిద్ర పోతున్న లియోని తేరిపారజూశాను. అతని మొహం కందిపోయి, కొంచెం ఉబ్బరించి ఉంది – నాకు భయమనిపించింది. అతనికి ఆ వైపున పడుకున్న ఉస్తేన్ మధ్య మధ్యన లేచి అతన్ని అక్కరగా , ఆదుర్దాగా గమనిస్తోంది.
లియోకి జ్వరం తగిలినట్లుంది – అందరమూ మలేరియా రాకుండా క్వినైన్ మోతాదు మింగాము – అతనికీ అంతకన్నా నేనిప్పుడు చేయగలిగిందేమీ లేదు. నిట్టూర్చుతూ ఆకాశం వైపు చూశాను . ఆ అనంతమైన వైశాల్యం లో వేలకివేల నక్షత్రాలు మిలమిలమంటున్నాయి – ఆ బ్రహ్మాండమైన సౌందర్యపు ప్రకాశం ముందు మనిషి ఎంత అల్పుడో మళ్ళీ కొత్తగా తెలిసివచ్చింది. ఈ అంతటికీ అధిపతి అయిన భగవంతుడి అడుగుజాడలను అనుసరించటం ఎవరి తరం ! ఆయన ఏ పనిని ఎందుకు తలపెట్టి సాగిస్తాడో ఎవరు ఊహించగలరు ! ఆ జ్ఞానం అందితే మాత్రం నా వంటి సామాన్యుడు దాన్ని భరించగలడా ! నిజాన్ని ఎల్లప్పుడూ భ్రాంతి కప్పిఉంచుతుంది – లేదంటే ఆ తీక్షణతని తట్టుకోవటం మానవ నేత్రాలకు సాధ్యం కాదు. ఇన్ని కాంతిగోళాలను వెలిగించి ఉంచినవారికి వాటిని నాశనం చేయటమూ అనాయాసమైన పనే…మరొక కాలంలో , మరొక దేశం లో ఇదంతా మరొకలాగా ఉండటమూ సాధ్యమే . విధి మనకి గాలిపడగలనూ నీటిబుడగలనూ అప్పుడప్పుడూ కటాక్షిస్తుంటుంది – అవే మన సౌఖ్యాలు, సంతోషాలు . ఏవీ నిలిచిఉండగలవి కావు, చిట్లిపోవలసినవే.
ఇలాగ – అర్థం ఉన్నవీ లేదనిపించేవీ ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టి వేధించాయి. అవును, అది వేధింపే, వేదనే – ఆలోచిస్తూ పోతున్నప్పుడు దాని పరిధి ఎంత సంకుచితమో , దాని శక్తి ఎంత పరిమితమో అర్థమవుతుంటుంది కదా ! కాని ఈ నిరామయ శూన్యం లో మన ఏడుపు వినబడేదెవరికి ? ఎంత వెతికితే మాత్రం ఏం జవాబు దొరుకుతుందని ?? అయితే – దీనికంతటికీ ఒకే వెండి మెరుపు ఉంది – దాని పేరు ఆశ. దాని చేయూతతో దుఃఖాన్ని కాసేపు తప్పించుకోవచ్చు – బహుశా , శాశ్వతమైన జీవితం వైపు ప్రయాణించనూ వచ్చు.
ఆ స్ఫురణ తో నేను మా అన్వేషణ మొదలైన కారణానికి వచ్చి పడ్డాను. విన్సే చెప్పిన ఆ స్త్రీ – మృత్యువును జయించినది – నిజంగా ఉందా ? నిరంతరం బ్రతికి ఉండటమనేది ఏమంత ఆనందకరమైన విషయమని నాకు అనిపించదు , పోను పోను అది అంతం లేని విసుగునీ అలసటనీ మటుకే ప్రసాదిస్తుంది. కాని అలాగ చావును జయించినవారు ప్రపంచాన్ని పరిపాలించగలరు ..ఒక కళనో శాస్త్రాన్నో చివరంటా శోధించగలరు – మరి ఈవిడ నిజంగా చావును గెలిచినదే అయితే [అలాగని నాకే నమ్మకమూ లేదనేది వేరే సంగతి ] – ఈ అనాగరికుల మధ్యన, నరమాంసభక్షకుల మధ్యన – ఎందుకు నివసిస్తున్నట్లు ? ఇదంతా ఏదో ఆదిమకాలపు అంధవిశ్వాసమే , అనుమానం లేదు – కాని నేనైతే చావును గెలిచే ప్రయత్నం ఎన్నటికీ చేయను. నా నలభై యేళ్ళ జీవితం లో అవమానాలూ ఆవేదనలూ పుష్కలంగా ఉన్నా మొత్తం మీద నా జీవితం ఆనందంగానే గడిచింది …ఇది ఒకనాటికి అంతమవుతుందనేది కూడా ఆ ఆనందం లో భాగం కాకపోలేదు.
మా అందరి జీవితాలూ మా ఇష్టం తో ప్రమేయం లేకుండానే ‘ అంతం ‘ కాబోవచ్చుననిపించగానే నా ‘ చింతనాసూత్రం ‘ పుటుక్కున తెగింది – నేను నిద్రకి పడ్డాను.
నాకు మెలకువ వచ్చేప్పటికి తెల్లవారు జామైంది. మా ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్న అమహగ్గర్ మనుషులు ఆ మసక వెలుతురులో, విషవాయువుల పొగల మధ్యన దయ్యాల్లాగా తిరుగుతున్నారు. రాత్రి వేసిన మంట పూర్తిగా ఆరిపోయిఉంది – ఆ చలిగాలికి నా నరనరమూ కొంకర్లు తిరిగిపోతోంది. అతి ప్రయత్నం మీద ఒంటిని స్వాధీనం లోకి తెచ్చుకుంటూ లియో వైపు చూశాను. అతను అప్పుడే లేచి కూర్చుంటున్నాడు. నొప్పెడుతోందో ఏమో – తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉన్నాడు , మొహం నిన్నట్లాగే జేవురించి ఉంది.
” ఒంట్లో ఎలా ఉంది లియో ? ”
” చచ్చిపోతున్నానేమోననిపిస్తోంది ” – అతని గొంతు బొంగురుగా ఉంది – ” తల బద్దలైపోతోంది. వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది ”
అతనితో ఇంకొక మోతాదు క్వినైన్ మింగిద్దామని జాబ్ ని పిలిచాను – ఆ మందు ఎక్కడ సర్దాడోనని. చూస్తే జాబ్ పరిస్థితీ బాగోలేదు – అతనికీ ఒళ్ళంతా నొప్పులట, తలతిరుగుతోందట. నేనే వెతికి ఇద్దరి చేతా పదేసి గ్రైన్ ల క్వినైన్ మింగించి నేనూ ముందు జాగ్రత్తగా తక్కువ మోతాదు వేసుకున్నాను. అక్కడికి వచ్చిన బిలాలీ కి అంతా వివరించి ఏం చేద్దామో చెప్పమని అడిగాను.
” అవును, విషజ్వరమే. యువసింహానికి కొంచెం తీవ్రంగానే వచ్చింది – కాని యువకుడు కదా, తట్టుకుంటాడు లే. ఈ జాబ్ సంగతి – కొంచెం ఎక్కువ రోజులే పట్టుకుంటుంది అతన్ని – కాని అతనికీ పర్వాలేదనుకుంటాను, మహా అయితే ఆ ఒళ్ళు తగ్గి కాస్త సన్నబడతాడంతే ”
” మరైతే వీళ్ళు ప్రయాణం చేయగలరంటారా ? ”
” చేయలేరు – కాని ఇక్కడే ఈ నేల మీదే ఉంచేశామా, తప్పకుండా చచ్చిపోతారు. తీసుకుపోవలసిందే ఇక్కడినుంచి – ఈ నికృష్టపు నేల మీద కంటే డోలీల్లోనే వాళ్ళకి నయంగా ఉంటుంది, నాకు తెలుసు. అంతా సవ్యంగా జరిగితే రాత్రయేలోపు కొంచెం మంచిప్రదేశానికి వెళ్ళగలం- అక్కడి గాలీ వాతావరణమూ మెరుగ్గా ఉంటాయి. ఈ వేళప్పుడు ఇక్కడ ఇంకా ఆగటం మంచిదికాదు – బయల్దేరిపోదాం- భోజనాలు దారిలో కానివ్వచ్చు ”
చేసేదిలేక ఒప్పుకున్నాను. మొదటి మూడుగంటలూ మా ప్రయాణం సజావుగానే సాగింది. అప్పుడొక సంఘటనతో ఇంచుమించుగా బిలాలీ జీవితం అంతమయేవరకూ వచ్చింది. అది అత్యంతప్రమాదకరమైన ఊబి- మా డోలీలు మోస్తున్నవారు తరచుగా మోకాళ్ళవరకూ కూరుకుపోయి, అతి ప్రయత్నం మీద బయటపడుతుండేవారు. ఉన్నట్లుండి ఎవరో పెద్ద కేక పెట్టారు, అందరం ఆగిపోయాము. చూడగా బిలాలీ ఎక్కి ఉన్న డోలీ ఒక మురికినీటి గుంట పైన తేలుతూ కనిపించింది – బిలాలీ జాడ ఎక్కడా లేదు. జరిగింది ఇది – ఆ బోయీలలో ఒకరిని పాము కాటు వేసింది. బాధతో అతని పట్టు తప్పిపోయింది – డోలీ ఒక పక్కకి ఒరిగి అతనితోబాటుగా ఆ నీళ్ళలో పడిపోయింది – పాపం ! ఆ దురదృష్టవంతుడు మళ్ళీ ఎవరి కంటా పడనేలేదు…పాము విషం వల్ల స్పృహ పోయిందో, తల దేనికైనా కొట్టుకుని దెబ్బ తగిలిందో ! అంతలో డోలీకి ఆ వైపున నీళ్ళలో కదలిక కనబడింది – దాని కొమ్ము పట్టుకు వేలాడుతూ బిలాలీ ప్రాణం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మాకు అర్థమైంది.
” అరుగో ! తండ్రిగారు అక్కడే ఉన్నారు ” – మా మనుషుల్లో ఒకడు కేక పెట్టాడు. అయితే ఆ వైపుకి ఒక్క అడుగు కూడా వేయలేదు …అతనే కాదు, మా బృందంలో ఎవ్వరూ బిలాలీని రక్షించేందుకు పూనుకోలేదు – ఊరికే ఆ వైపుకి గుడ్లప్పగించి చూస్తుండిపోయారు.
” వెధవల్లారా ! కదలరేం ? ” – అని అరుస్తూ నేను నీళ్ళలోకి దూకేశాను.
ఎలా చేశానో తెలీదుగాని, దాదాపుగా మునిగిపోతూ ఉన్న అతన్ని పైకి నెట్టాను. ఇంగితజ్ఞానం ఉన్నవాడు గనుక , అతను ఆ తర్వాత నన్ను పట్టుకువేలాడలేదు – లేకపోతే ఇద్దరి పనీ అయిపోయి ఉండేదే …[సాధారణంగా బుద్ధిహీనులను రక్షించబోయినప్పుడు అలా జరుగుతుంటుంది] అతని రెక్క పుచ్చుకు లాక్కువచ్చాను – శాయశక్తులా ఈది, ఎట్టకేలకి గట్టి నేల మీదికి చేరుకోగలిగాం.
” నీచుల్లారా ! ఈయన లేకపోతే నేనేమైపోయిఉందును ! మీ సంగతి కనిపెడతానులే ” – బిలాలీ వాళ్ళ వైపుకి క్రోధం ఉట్టిపడేలా చూశాడు. అందుకు వాళ్ళకి ఎంత భయం పుట్టినా తొణక్కుండా అవే భావశూన్యపు మొహాలతో ఉండిపోయారు.
” నా ప్రాణం కాపాడావు బాబూ ! ” – నా చేయి గట్టిగా పట్టుకుని అన్నాడు – ” ఎటువంటి పరిస్థితిలోనూ నీకు స్నేహితుడుగానే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నిన్ను కాపాడే అవసరం వస్తే ఏ మాత్రమూ వెనుదీయను ”
ఆపైన మా ప్రయాణం నిరాటంకంగానే జరిగిందని అనాలి. ఆ మునిగిపోయిన మనిషి నిజంగానే అంత మంచివాడు కాడో, లేక వీళ్ళకి సహజమైన స్వార్థబుద్ధి వల్లనో , కాక – వీళ్ళు లోపల ఏమనుకుంటున్నారో పైకి తేలే అలవాటు లేకపోవటం వల్లనో గాని – ఎవరూ అతని గురించి దిగులుపడినట్లుగా నాకు తోచలేదు…బహుశా అతని పని తాము చేయవలసి వచ్చినవాళ్ళు తప్ప.
ఇంకొక గంటకి చీకటి పడుతుందనగా – ఆ చిత్తడి నేలలని దాటేయటం ఆఖరికి పూర్తయింది. అక్కడ ఆ రాత్రికి మకాం వేశాము. లియో పరిస్థితిని పరిశీలించేందుకు అప్పటికిగానీ నాకు అవకాశం దొరకలేదు. పొద్దుటి కంటే అతను క్షీణించినట్లు అనిపించింది – కొత్తగా వాంతులొకటి పట్టుకున్నాయి. తెల్లవార్లూ అతను వాటితో బాధ పడ్డాడు . ఉస్తేన్ ఎంతో శ్రద్ధగా , మృదువుగా , నిర్విరామంగా – లియోకీ జాబ్ కీ కూడా సేవ చేసింది … నేను ఆమెకి సాయం చేస్తుండిపోయాను. ఆ రాత్రంతా మా నలుగురికీ నిద్ర లేదు. అప్పుడప్పుడూ చిత్తడి నేల విషవాయువులు వీస్తున్నాగానీ, మొత్తం మీద అక్కడి గాలి గోరు వెచ్చగా , కొంత తాజాగా ఉంది – దోమలు కూడా లేవు.
తెల్లారేప్పటికి లియో కి సంధి పుట్టింది. తను ఒకడు కాదనీ ముక్కలు ముక్కలుగా ఉన్నాననీ – ఇలాంటి పిచ్చి మాటలు అనటం మొదలు పెట్టాడు. నాకు భరించలేనంత వేదన కలిగింది – ఇటువంటివి వచ్చాక ఆ తర్వాత ఆ మనిషికి ఏం జరుగుతుందో విని ఉన్నాను …ఈ లోపు బిలాలీ వచ్చి వీలైనంత త్వరగా బయల్దేరాలనీ ఇంకొక పన్నెండు గంటల్లోపున లియోని సరైన చోటికి చేర్చకపోతే అతని ఇంకొకటి రెండు రోజుల కంటే బతకడనీ చెప్పేశాడు. నేనింకేమనగలను ! ఇంకా చీకట్లు ఉండగానే బయల్దేరాం. లియో ఉన్న డోలీ పక్కనే ఉస్తేన్ నడుస్తూ వచ్చింది – అతని మీద ఈగలు వాలకుండానూ , మతి తప్పి అతను అందులోంచి దూకెయ్యకుండానూ కనిపెట్టుకుంటూ.
పొద్దు పొడిచిన అరగంటకి మేము కొంత ఎత్తైన ప్రదేశానికి చేరాం. అక్కడినుంచి కిందికి చూస్తే ఆ దృశ్యం పరమ రమణీయంగా ఉండింది – చాలా సారవంతంగా కనిపించే నేల – రకరకాల పళ్ళ చెట్లతో. ఒత్తైన పచ్చని గడ్డి మధ్యన ఎన్నెన్నో రకాల పువ్వులు విరగబూసి ఉన్నాయి . దూరంగా – బహుశా పది పన్నెండు మైళ్ళ అవతల – ఒక పర్వతం నిటారుగా , చాలా ఎత్తున పైకి లేచి ఉంది . పర్వత పాదం మీద – అంటే ఒక అయిదారు వందల అడుగుల మేరన గడ్డి కప్పి ఉన్నా – ఆ పైన పన్నెండు వందల అడుగులు ఏ మొక్కా మోడూ లేకుండా బోడిగా, నున్నగా కనిపిస్తోంది… అందుకని ఆ పర్వతం అగ్నిపర్వతపు జాతిది అయిఉండాలనుకున్నాను . కనిపిస్తున్న భాగం నుంచి మొత్తం పరిమాణాన్ని అంచనా వేయటం కష్టమే గాని , అది ఖచ్చితంగా చాలా చాలా పెద్దది.[ దాని వైశాల్యం యాభై చదరపు మైళ్ళకి మించి ఉంటుందని తర్వాతి కాలం లో తెలిసింది ] . అమితమైన ఠీవితో తల యెత్తి ఆకాశాన్ని సవాలు చేస్తున్న ఆ సహజ మహా గిరిదుర్గం తో పోల్చదగినదాన్ని నేను అంతకు మునుపూ ఆ తర్వాతా కూడా చూసి ఉండలేదు.
ఆ పరిసరాలని నేను ఆసక్తిగా తిలకిస్తుండటాన్ని బిలాలీ గమనించాడు -
” అదిగో చూస్తున్నావుగా , మా మహా రాజ్ఞి నివాసం ! అటువంటి ఉత్తుంగ నగ సింహాసనం ఎప్పుడైనా , ఏ సామ్రాజ్ఞి కైనా ఉందా ? లేదుగాక లేదు !!! ”
” అత్యద్భుతంగా ఉంది తండ్రీ ! అయితే లోపలికి ప్రవేశించటం ఎలాగ ? ఆ గోడలు అంత నిట్ట నిలువుగా ఉన్నాయే మరి ? ”
” నువే చూస్తావుగా ! ఇక్కడ, ఈ దిగువన బాట కనిపిస్తోందా నీకు ? ఏమిటది – చెప్పు, తెలివిగలవాడివి కదా నువ్వు ? ”
చూశాను – సూటిగా పర్వత పాదం వరకూ వెళుతూ …మధ్య మధ్యన తెగిపోతున్నా, పచ్చిక బాగా కప్పేసినా – అదొక రహదారి లాగా కనిపిస్తోంది – ఊహూ. అసంభవం ! ఇక్కడ రహదారి ఎలా ఉంటుంది?
” ఇదొక రహదారికి మల్లే ఉంది తండ్రీ – అవునా ? లేకపోతే ఒక కాలువ నదీముఖం లో ఒకప్పుడు ఇక్క్కడ కలుస్తుండేదా ? తెలియటం లేదు ”
నిన్నటి ఉపద్రవం బిలాలి నేమీ అంటిపెట్టుకుని ఉన్నట్లే లేదు – ఎప్పటిలా , ధీమాగా తల ఊపి అన్నాడు -
” నిజమే. ఈ రాతినేలలోంచి , మనకి పూర్వులైన మనుషులెవరో ఈ కాలువ తవ్వుకున్నారు. ఆ పర్వతం మధ్యన ఒకానొకప్పుడు పెద్ద సరస్సు ఉండిఉండాలి- అగ్నిపర్వతాల లో ఉంటాయి కదా అటువంటివి ? ఆ దిగువన పల్లపు నేలని పండించుకునేందుకు ఆ పని చేసి ఉంటారు . ఆ సరస్సు కట్టను తెగగొట్టి నీరు పారించారు. కాని, తర్వాతి కాలం లో , బహుశా పల్లానికి అవతలి భూమి ఎత్తు పెరిగిపోయి , నీరు నిలిచిపోయి ఆ చిత్తడి నేలలు ఏర్పడ్డాయేమో ! ఆ సరస్సు ఉండిన చోట కాలం గడిచే కొద్దీ పొరలు పొరలుగా గుహలు తయారైఉంటాయి , వాటిని తమకి వీలుగా మార్చుకుని ఉంటారు – అదంతా ఏనాటి సంగతో , ఆ మనుషుల నాగరికత ఏమిటో !!! ”
” మరి, అయితే – వర్షాలు కురిసినప్పుడు ఆ సరస్సు మళ్ళీ నిండాలి కదా ? ”
” దానికి ఆ వైపున మరొక ద్వారం – ఈ కాలవ మట్టానికన్నా తక్కువ ఎత్తులో, ఉంటుంది – ఆ నీరు ఈ నదిలోకి ప్రవహిస్తుంటుంది ” – అతను చూపించిన వైపున , నాలుగు మైళ్ళ దూరం లో కనిపిస్తోంది నది.
” ఆ కాలువ చేయవలసిన పని ముగిసిపోయాక దాన్ని ఎండించి రహదారిగా మార్చుకుని ఉంటారు – నువ్వు అనుకున్న రెండూ నిజమే ”
” అయితే అదొక్కటేనన్నమాట, లోపలికి వెళ్ళే దారి ” – నేను అన్నాను.
” మరొకటి ఉంటుంది – అది చాలా రహస్యం. నువ్వు ఆ చుట్టు పక్కలే ఏడాదిపాటు వెతికినా కనిపించదు. సంవత్సరానికొకసారి – ఆ చుట్టూ బీళ్ళలో గడ్డి మేసి బలిసిన పశువులని లోపలికి పంపేందుకు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు ”
” రాజ్ఞి అక్కడే, ఆ లోపలే – ఉంటుందా ? ఎప్పుడూ బయటికి రాదా ? ”
” లేదు – రాజ్ఞి – ఉన్నచోటనే ఉంటుంది- ఎప్పుడూ ! ”
అక్కడి వృక్షాలూ లతలూ చాలా విభిన్నంగా ఉన్నాయి. ఓక్ చెట్ల నుంచి తాటి చెట్ల వరకూ పక్క పక్కనే ఉన్నాయి – ఆశ్చర్యం వేసేలాగా. అటువంటి వైవిధ్యమే జంతుజాలం లోనూ ఉంది – అడవి దున్నలనుంచి ఖడ్గ మృగాల వరకూ. రకరకాల లేళ్ళూ దుప్పులూ అటూ ఇటూ పరుగుపెడుతున్నాయి. నా లోపలి వేటగాడు నిద్ర లేచాడు – చటుక్కున డోలీ దిగి , ఒక నా తుపాకీ ని ఒక దుప్పికి గురిపెట్టి పేల్చాను. ఎప్పటిలాగే నా గురి తప్పలేదు. ఆ అమహగ్గర్ జనం తుపాకీకి ఇంకా అలవాటపడలేదు – అదేదో గొప్ప మంత్రశక్తిలాగే వాళ్ళు భావిస్తున్నారు . నన్నొక మహా శక్తివంతుడిని చూసినట్లు అతి భక్తిగా చూస్తూ ఆ దుప్పిని శుభ్రం చేసేందుకు పట్టుకుపోయారు. వాళ్ళ మధ్య నా ప్రతిష్ఠ ఇనుమడించిందని నాకు అర్థమైంది. వెళ్ళి మళ్ళీ డోలీ లో కూర్చున్నాను . పక్కనే వస్తూన్న బిలాలీ ” అద్భుతం బిడ్డా , అత్యద్భుతం ! కళ్ళారా చూడకపోతే ఇటువంటిదొకటి ఉంటుందని నమ్మి ఉండేవాడిని కాదు. ఇలా వేటాడటం నాకూ నేర్పిస్తానని అన్నావు నువ్వు – నేర్పుతావు కదా తప్పకుండా ? నాకెంతో గొప్పగా ఉంటుంది అది ”
” తప్పకుండా నేర్పుతాను , అదేమీ పెద్ద విషయం కాదు తండ్రీ ”
మనసులో మాత్రం అనుకున్నాను – ఈ బిలాలీ తుపాకీ పేల్చేప్పుడు నేను నేల మీద పడుకుండిపోవాలి, లేదంటే చెట్టు చాటున దాక్కోవాలి అని.
ఆ తర్వాత చెప్పుకోదగిన సంఘటనలేమీ జరగలేదు. చీకటి పడే వేళకి మేము ఆ పర్వతప్రాంతపు సరిహద్దుల్లో ప్రవేశించాము. దగ్గరికి వెళుతూన్న కొద్దీ ఆ పర్వతపు ఏకాంత గాంభీర్యం, భయానక సౌందర్యం – నన్ను విస్మయానికి గురిచేశాయి. త్వరలోనే పర్వతం లోపలికి కదిలాయి మా డోలీలు – ఆ మోసేవాళ్ళకి ఎంత ఓర్పు ఉండిఉండాలో కదా ! లోపల ఆ బ్రహ్మాండమైన గుహలు మరి ఇంకా ఆశ్చర్యపరిచాయి – ఏ మందుగుండు సామగ్రీ లభ్యం కాని ఆ కాలం లో ఆ ‘ కోర్ ‘ జాతి వాళ్ళు ఈ పర్వతాన్ని ఎలా తొలిచిఉంటారు ? సహజసిద్ధంగా ఏర్పడినవాటినైనా సరే, ఇంత విశాలంగా మార్చేందుకు ఎంతటి మానవ ప్రయత్నం అవసరమై ఉండాలి ! పిరమిడ్ లు నిర్మించిన ఈజిప్షియన్ ల మాదిరిగా వీళ్ళూ వేలమందిని బానిసలుగా తెచ్చుకుని వాళ్ళతో ఈ చాకిరీనంతా చేయించి ఉంటారా ?
ఒక పొడవాటి సొరంగపు మార్గం గుండా ప్రయాణించి మేము ఒక పెద్ద గుహ ముఖద్వారాన్ని చేరుకున్నాము. ఆ తర్వాత దారి ఎటు వెళుతుందో మాకు తెలియకుండా ఉండేందుకని మా కళ్ళకి గంతలు కడతామని చెప్పారు. కాదనేందుకేమీ కనిపించక, నేను సరేనన్నాను. జాబ్ కి మాత్రం బెదురు పుట్టింది – ఇదివరకు లాగా వేణ్ణీళ్ళ బాన లో పడేసి ఉడకబెడతారేమోనని. బిలాలీ ఉండగా అటువంటివి జరగవని నేనెంతో సేపు నచ్చజెప్పిన మీదట చివరికి సమ్మతించాడు. లియో – ఒళ్ళెరగకుండా పడిఉన్నాడు …అది వ్యాధి నుంచి కోలుకోవటమా మరింకేదైనా ? నాకు ఆలోచించే ధైర్యం లేకపోయింది. ఏమైనా అతనికి కళ్ళ గంతలు కట్టే అవసరం రాలేదు. అమహగ్గర్ లలో కులీనులైనవాళ్ళు ధరించే పసుపు పచ్చ నూలు బట్టల ని మా కళ్ళ చుట్టూ కట్టి గడ్డం కింద ముడిపెట్టారు [ అవి వాళ్ళు నేసినవి కావనీ, ' కోర్ ' జాతి వాళ్ళ సమాధులలోంచి సంగ్రహించినవనీ అనంతరకాలం లో తెలిసింది ] . దారి తెలుసుకుని మాకు చెప్పేస్తుందనో ఏమో -ఉస్తేన్ కళ్ళకి కూడా గంతలు కట్టారు.
ఆ గంతల కార్యక్రమం ముగిశాక మళ్ళీ బయల్దేరాం. డోలీలు మోసేవారి అడుగుల చప్పుడు లయబద్ధంగా ప్రతిధ్వనిస్తోంది , జలజలా నీరు ప్రవహిస్తున్న శబ్దం తో బాటు. మేము పర్వతం లోపల్లోపలికి వెళుతున్నామని గ్రహించాను. ఎప్పుడైనా – తప్పించుకోవాలంటే పనికొస్తాయని , ఆ మెలికల దారిలో మలుపులని జ్ఞాపకం పెట్టుకునేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమయాను. కాసేపటికి గాలి చిక్కనై బరువెక్కింది – ఊపిరి అందటం కష్టమయేంతగా. ఏమో అనుకున్నాను గాని, ఇలా కళ్ళు కనిపించకుండా ఎటు పోతున్నామో తెలియకుండా వెళ్ళటం చాలా భయంగానే అనిపించింది. ఇంకాసేపటికి గాలి కొంత తాజాగా మారింది , కొంచెం నయం… ఆ తర్వాత నీళ్ళ శబ్దమూ ఆగిపోయింది. నా కళ్ళగంతల్లోంచి వెలుతురు తెలుస్తోంది , మొహానికి తగిలే గాలి హాయిగా ఉంది – ఆరుబయటికి వచ్చామని అర్థమైంది. తన గంతలు విప్పుకుని మావీ విప్పేయమని ఉస్తేన్ కి బిలాలీ చెబుతూండటం వినిపించింది – అందుకోసం ఎదురుచూడకుండా నేనే ఆత్రం గా ఆ పని చేసేశాను.
నేను ఊహించినట్లే మేము పర్వతం లోపలినుంచి ప్రయాణించి అవతలివైపుకి చేరుకున్నాం. ఇక్కడా పర్వతశిఖరం కనిపిస్తోందిగాని కాస్త తక్కువ ఎత్తులో ఉంది – మరి మేమే ఎత్తుమీదికి వెళ్ళామేమో – తెలీదు. మేకలూ పశువులూ మందలుగా మేస్తూ అక్కడక్కడా కనిపించాయి- మధ్య మధ్యన ఎత్తైన గడ్డి మేటలు కూడా. పురాతన భవనాల శిథిలాలూ ఉన్నట్లున్నాయి – నాకు సమంగా చూడటం కుదరలేదు. కొన్ని వందల మంది అమహగ్గర్ లు చుట్టుముట్టారు మమ్మల్ని. చేతుల్లో దంతపు దండాలు పుచ్చుకుని వాళ్ళని అదిలిస్తూ ఇంకొంతమంది ఉన్నారు – బహుశా వాళ్ళ పై అధికారులు కాబోలు. త్వరలోనే ఆ కలకలం తగ్గి వాళ్ళంతా సోల్పు గా బారులు తీరి నిలుచున్నారు. అందరూ పులిచర్మాలు ధరించి ఉన్నారు . రాజ్ఞి అంగరక్షకుల దళాలు అవి.
వాళ్ళందరికీ నాయకుడుగా కనిపిస్తున్నవాడు బిలాలీ నుదుటికి దంతపు దండాన్ని ఆనించి ఏదో ప్రశ్నించాడు – బిలాలీ ఏదో జవాబిచ్చాడు , నాకు రెండూ అర్థం కాలేదని వేరే చెప్పనక్కర్లేదు. ఆ దళాలు అన్నీ కవాతు చేసుకుంటూ కదిలాయి, ఆ వెనకే మా డోలీలు. అరమైలు దూరం తర్వాత ఒక అతి పెద్ద గుహ ద్వారం వచ్చింది. ఎనభై అడుగుల ఎత్తునా అరవై అడుగుల వెడల్పునా ఉంది. బిలాలీ తను ముందు దిగి , మమ్మల్నీ దిగమన్నాడు – దిగాం. లియో కి స్పృహ లేనందున అతను మటుకు డోలీ లోనే ఉన్నాడు. గుహలోపలికి కొంత మేరన సాయంత్రపు సూర్యరశ్మి పడుతోంది- దానికి అవతల లెక్కలేనన్ని దీపాలు వరసగా వెలుగుతున్నాయి – ఎంత లోతు ఉందో తెలియటం లేదు. గుహ గోడల పైనంతా ఉబ్బెత్తుగా బొమ్మలు చెక్కి ఉన్నాయి. మేము ఇదివరకు అమహగ్గర్ ల గుహలో చూసిన కూజాల మీది చెక్కడాలూ ఇవీ ఒకేలాగా ఉన్నాయి. ప్రేమ దృశ్యాలు, వేట దృశ్యాలు, శిక్షలు వేయటాలు , శత్రువులని హింసించటాలు – అన్నీ ఉన్నాయి. ద్వంద్వ యుద్ధాల వంటివి తప్పించి యుద్ధదృశ్యాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మారుమూలల్లో నివసించటం వల్లనో , చాలా బలం గల జాతి అయిఉండటం వల్లనో – బయటివారు వీళ్ళ మీదికి దండెత్తి వచ్చినది తక్కువ అని అర్థం చేసుకున్నాను. చెక్కుళ్ళ మధ్యన అక్షరాల వంటివి ఉన్నాయి. నాకు తెలిసిన ఏ లిపికీ అవి దగ్గరగా లేవు – గ్రీక్, ఈజిప్షియన్- హీబ్రూ, అసీరియన్ – దేన్నీ పోలి లేదు అది. కొంతవరకూ చైనీస్ లిపికి దగ్గరగా ఉందేమోననిపించింది.
ఆ అంగరక్షక దళాలేవీ మాతోబాటు లోపలికి రాలేదు – గుహ ముఖద్వారం చుట్టూ నిలుచుండిపోయాయి. తెల్లటి దుస్తుల్లో ఉన్న మనిషి ఒకడు మాకు ఎదురై వినయంగా మోకరిల్లాడు – ఏమీ మాట్లాడలేదు. ఆశ్చర్యమేమీ లేదు, అతను మూగా చెవిటీ అని తర్వాత తెలిసింది.
ఈ పెద్ద గుహ కి అడ్డంగా , రెండు వైపులకీ వ్యాపిస్తూ మరొక చిన్న గుహ ఉంది. ఎడమవైపున ఉన్న భాగానికి ఇద్దరు భటులు సాయుధులై కాపలా కాస్తున్నారు – బహుశా అదే రాజ్ఞి నివాసమై ఉంటుందనుకున్నాను. కుడి భాగానికి కాపలా లేదు – ఆ మూగా చెవిటీ మనిషి మమ్మల్ని ఆ లోపలికి వెళ్ళమని అతివినయంగా సూచించాడు. అక్కడొక నడవా వంటిది ఉంది – దాని ద్వారానికి గడ్డితో నేసిన తెర వేలాడుతోంది. లోపలికి వెళితే బాగా విశాలమైన చావడి – గదులు గదులుగా విడగొట్టబడి ఉంది. దాని పైకప్పునుంచి సూర్యకాంతి పడే ఏర్పాటు ఉంది . ఒక గదిలోకి వెళ్ళాము – రాతితో నిర్మించిన మంచాలూ చేతులూ కాళ్ళూ కడుక్కునేందుకు బానలలో నీరూ కంబళ్ళుగా వాడేందుకు పులి చర్మాలూ ఉన్నాయి అక్కడ.
అక్కడ లియో ని పడుకోబెట్టాము , ఉస్తేన్ అతనితోబాటు ఉండిపోయింది. ఆ మూగా చెవిటీ మనిషి ఆమెని మింగేసేలా చూశాడు, అతనికి ఆమె గురించిన సమాచారమేమీ అందిఉన్నట్లు లేదు. సర్దుకుని, అక్కడినుంచి కదిలి జాబ్ కీ నాకూ బిలాలీకీ – త లా ఒక గదిని చూపించాడు.
[ సశేషం - పై భాగం లో రాజ్ఞి ప్రవేశం ]
“దగ్గరికి వెళుతూన్న కొద్దీ ఆ పర్వతపు ఏకాంత గాంభీర్యం, భయానక సౌందర్యం”, “…ఇది ఒకనాటికి అంతమవుతుందనేది కూడా ఆ ఆనందం లో భాగం కాకపోలేదు.” – మైథిలీ మామ్ ఇది ఇలా తెలుగులో చదవడమే సౌందర్యం.. సాంత్వన !! చాలా చాలా ధన్యవాదాలు ‘రాజ్ఞి’ ని ఇంత అందంగా చేరువకు తెస్తున్న మీకూ.. ‘వాకిలి’ కీ !!
థాంక్ యూ రేఖా
మైథిలి గారూ,
హాయిని కలిగిస్తూ యెంత సాఫీగా సాగుతోంది మీ వచనం! నిజంగా సూపర్బ్ అంటే నమ్మండి.
చాలా చాలా థాంక్స్ అండీ.