కవిత్వం

బాణాలన్నీ నావేపే…

ఫిబ్రవరి 2016

లోలోని కలవరింతల గానాలు
కొన్ని క్షణాలఆదమరపులో
ఊహకందని వ్యూహాలై
తమలో తాముగా కలహ కోలాహలం

కానరాని సైన్యాల కవాతులు
కొన్ని ఆయుధాల స్పర్శలు
జ్ఞాపకాల్ని పురికొల్పి
వెన్నెల రుధిరాన్ని వర్షిస్తున్నా
కమ్ముకున్న దారులన్నీ
స్నేహించే వైరివర్గమే.

అటు కాదు ఇటని గుసగుసలతో
బాణాలన్నీ నావేపే.

వేగంగా పరుగు
దూరంగా పరుగు
దగ్గర దగ్గరగా నీడల్లే
కమ్ముకునే కోటి కోర్కెల పరుగు

ఎన్నో నమ్మకాల కవచాలు చిద్రాలైనా
నలుదిక్కులుగా చీలిన ఆకాశంలా
రూపం మార్చుకునే నీటిలా
దారులన్నీ తిరిగి హరితమై మొలకెత్తుతాయి

శ్వాస మునిపంట బిగపట్టి
ఒక్కో అడుగూ ముందుకే.

శత్రువుతో స్నేహించడం నేర్పడమే
జీవితపు మొదటి సంజీవిని

నీదీ నాదనే మోహాల్ని కరిగించే ఒక తావీజ్
ప్రపంచపు శాంతిదూతల నమాజ్

రాళ్ళ పగుళ్ళలో చిక్కుకున్న చర్మపు తునకలు
గాయాల్ని స్నేహించే ఓషధీ శిరస్సులు

హృదయాన్ని నిరంతరంగా స్నానిస్తున్న రక్తమంతా
జీవితపు వెలుగు జ్వాలయ్యేవరకూ
సంధి విరమణలేని శ్వాసలా
ఈ యుద్ధభూమి సజీవం

ఎన్ని బాధామయ ఘడియలు అధిరోహించాక
ఆ తావీజ్ మహిమనౌతానో…