కవిత్వం

హృదయ వర్ణం

14-జూన్-2013

1.
ఆ సాయంకాలం
కాలం చేసిన సాయమా…
కలలజలపాతం గా మలచి
వెన్నెల క్షణాలు
చందమామగా ప్రకాశించడం…

2.
ఆ రోజులు
జ్ఞాపకాల చుక్కల్ని పోగేసాయి
చిక్కుముళ్ళ అద్దకంలా చీకటి చిక్కదనం
వెలుగుల్ని చీల్చుకుని బంధంలా అల్లకం..

3.
అవునూ కాదుల
కరచాలనపు చలనం
గుండె గది కిటికీల రెక్కల చప్పుళ్ళ సంగీతం

4.
కనిపించని దారికి
అడుగుల ముద్రలు మిగలని పయనం
ఋతువులు ఎన్నో తెలియని
విచ్చుకునే విరుల వర్ణం
కలల ఒరవడి నేర్చుకుంటూ
ప్రవహించే హృదయ కాలం

5.
రెప్ప పాటులా గడిచీ
జ్ఞాపకం లా ఒదిగీ
అసహనంలా మెరిసీ
నింగి వెన్నెల్లు చీకటి అద్దకాలూ
బంధాల మలుపులూ
పరిమళించిన వర్ణ చిత్రం !