ఆలోచనలు మేల్కొన్న వేళ
ఒక వెలితి పలకరించింది
కలలు ఖాళీ చేసిన జాగా లాగ
మాటలపై అలిగిన మౌనం లాగ!
అనుభవాల్ని కొలుస్తున్న జీవితం
భావాల్న్ని మోస్తూన్న హృదయం
ఊహల మేడలు కట్టే మనసూ
ఇదో అంతరంగ మహరాజ మందిరం!
నాతో నేను చర్చిస్తున్నా
నాతో నేను స్నేహిస్తున్నా
నాతో నేను కోపిస్తున్నా
నాతో నేను ‘నా’కై ఎదురు చూస్తున్నా!
అనుకోని అతిధిలా నీవొచ్చిన వేళ
ఆ ఒక్క క్షణం కాలంలా కరిగింది!
ఊహలన్నీ తమను తామే తుడిచేసి
నీవిచ్చిన వెన్నెల్లో ఆత్మ సమర్పణమయ్యింది!
అర్థం అయిన వేదాంతమా
ఆర్తి లోని హృదయమా
లాలించే జీవన రహస్యమా
రహస్య క్షణాల ఆనందమా???
సంశయాలన్నీ సమాప్తమైన చోటే
సౌందర్యం పరిమళిస్తుంది
గుండె చప్పుడై వినిపించే నీతోనే
ప్రతి క్షణమూ సంగీతమవుతుంది
కలవాలని వున్నా
రాతిరికి ఉదయం దూరమే
తరగని దూరాలు కొలుస్తున్నా
తారా ధూళి నింపేది ఆకాశమే
నాకు నేనే ఒక ఉదయమయ్యాను
నీ ఆకాశంలో అనంతమయ్యాను
నన్ను నేను చూసుకున్న అద్దంలా
నాలోని నీలోనూ నేనే…
వెలితి లేని వెన్నెలని చూస్తున్నా
జ్ఞాపకపు దుప్పటి కప్పుకున్న గుండె
రెప్పల డిబ్బీల్లో దాచుకున్న కలలూ
దోసిట్లో పోగేస్తున్న నవ్వుల నావలూ.. ఆ వెన్నెలవే!
గుడ్
Thank you Dr Lingareddy garu
గుది గుచ్చిన మల్లెల లాగా అందమైన
ఊహలు మదిలో పోగుపడతాయి.
కాగితంపై వొలకబోస్తే పరిమళిస్తాయి.
పదిమంది మనసుల్లో గుబాళిస్తాయి.
దాచుకుంటే పట్టు చీరలో అత్తరులా ఆవిరౌతాయి.
మీరు ఇలాగే ఎందరినో పరిమళింపజేయాలి!
కాకపోతే
“ఆ ఒక్క క్షణం కాలంలా కరిగింది” అన్నారు కదా?
క్షణమంటేనే కాలం కదా?
“ఆ ఒక్క క్షణం వెన్నలాగానో ఇంకొక పదార్ధం లా కరిగివుంటే ఆ అతిధి
రాకకి ఒక పరిమళం అద్దినట్లు ఉండేదేమో కదా?
అలా ఎందుకు అన్నారో కొంచెం చెబుతారా?
రాజశేఖర్ గారు మీ ఆత్మీయ స్పందనకు కృతజ్ఞతలు
కవిత రాస్తున్నపుడు మీరన్నట్లుగా… “ఆ ఒక్క క్షణం కాలంలా కరిగింది” అన్న స్టాంజా దగ్గర ఒక్క నిమిషం వెనక్కు తిరిగి చూశాను. మీరన్న సందేహమే నాకూ వచ్చింది.
క్షణాలెన్నో కాలంలో భాగం..
కానీ మనసుల్ని కరిగించే క్షణాలు కొన్నే వుంటాయి.
అలాంటి ఎన్నో క్షణాలు వున్నాయి
అవి కూడా కరిగిపోయాయి అన్నది స్ఫురించడానికి చేసిన ప్రయత్నమది అని నానుంచి నాకే వచ్చిన సమాధానానికి..
వెనక్కి తిరిగి చూడకుండా కవితా పదాలతో ముందుకెళ్ళిపోయాను.
ఆఖరిచరణంలో మీలో మీరు రమిస్తూ “తన”లో ఐక్యమవడానికి చూసిన ఎదురుచూపు రవీంద్రుడి గీతాంజలి సారంలా ఉంది. చిన్ని కవితల్లో వేల పేజీల సారం అప్పుడప్పుడే నింపగలం.
Sometimes some words leave me speechless.. and this is one such occasion Mahesh ji.
Thank you very much for the appreciative lines.
I read Tagore’s Geetanjali long ago during my B.A days.. And did not reach the literary depths of it as well. Life is the real teacher and now its the universality of emotions that catch-up after generations gap. Thank you very much once again for reaffirming my confidence in transmitting emotions through words.
వెన్నెలంత హాయిగా ఉంది జయశ్రీ!
వెలితి లేని వెన్నెలా
జ్ఞాపకపు దుప్పటీ
రెప్పల డిబ్బీ
దోసిట్లో పోగేస్తున్న నవ్వుల నావలూ ..
అంటూ పదాలతో అందమైన ఆట ఆడుకున్నావ్ చెల్లీ!
థాంక్యూ జ్యోతక్కా
వెన్నెలంటే వెలితి లేని ఆటలే కదా..
అక్షరాలూ వెన్నెల వంటివే -అందాన్ని మొసుకొస్తాయి
కొత్త కలల్ని నింపి వెళ్ళిపోతుంది వెన్నెల..
మళ్ళీ అమావాస్య చీకటిని తరిమేయడానికి కొత్త ఆటల్నీ కలల్నీ వెతికి ఇవ్వడానికి..
శీర్షికకు పూర్తిగా న్యాయం చేసారు.
‘‘వెలితి లేని వెన్నెల’’ అంతరంగ సంఘర్షణను అక్షరరూపంలో మలచటం లో కృతకృత్యులయ్యారు.
జ్యోతిర్మయి అక్క చెప్పినట్లు పదాలతో అందమైన ఆటాడారు..
“నాకు నేనే ఒక ఉదయమయ్యాను
నీ ఆకాశంలో అనంతమయ్యాను
నన్ను నేను చూసుకున్న అద్దంలా
నాలోని నీలోనూ నేనే…”….
‘నాలోని నీలోనూ నేనే…’ ప్రేమకి పరాకాష్ఠ ‘సబ్లిమేషన్’… అప్పుడే వెలితి లేని వెన్నెలను ఆస్వాదించ గలుగుతారు… you achieved it… ika meeku tirugu ledu mee jeevitam ika vennelamayame, mee kavitalu kooda gubhalimpumayame!!