కవిత్వం

బ్రతుకు పచ్చిక

22-మార్చి-2013

మేఘాల కొమ్మల్లో
ఆలోచనల లేత పరిగల్ని
పోగేస్తూ..

ముక్కున మూటకడుతూ…
అల్లుకున్న గూడు ఉనికీ ఆలోచనే…

కురవని మేఘంలా
చినుకుల్లా దాగిన ఆవిర్లు..

నిజాల్ని నిప్పుల్నీ
నాణానికి రెండు పార్శ్వాల్నీ..
ఏక కాలం లో భరించాలి..

అరచేత జీవితాన్ని మోస్తూ..
గుండెతో జీవిస్తూ
అట్లాస్ లా ష్రగ్ చేయాలనిపిస్తోందీ..

పాతేసుకున్న పాతలూ..
చొచ్చుకొస్తున్న కొత్తలూ
పగుళ్ళవుతున్న పురాతనాలూ

ఇక్కడో గడ్దిపరక మొలిచింది చూడు
కొత్తగా.. పచ్చగా.. పదిలంగా
గాలీ వెలుతుర్ల సంగమ శ్వాసగా..

తెరిచి వుంచు గుండెని
తొలి శ్వాసలా పీల్చు ప్రతి శ్వాసనీ

తలపు తొలకరి చినుకు గా
చిరు పచ్చికల ఆశలవ్వొచ్చు

బ్రతుకు పచ్చిక పానుపైనా చాలు
అలిసినపుడు నీకు నీవై సేదతీరేందుకు!