కవిత్వం

కభీ తన్ హాయీ.. కభీ షహనాయీ

01-ఫిబ్రవరి-2013

తలుపు గడియ విడింది..

ఇప్పటికిది వందో సారేమో
కనురెప్పల తలుపు మూసి
గుండెకు గడియ వేశాలే అని అనుకుని..

అప్పుడే తెరుచుకునేది అసలు ప్రపంచం
ఆశల, అపార్థాల, అవినీతి, నీతుల నగిషీల ఖగోళం
మరపు లోకి జ్ఞాపకాన్ని మార్చేశాలే అన్న నిశ్చింతనీ తుడిచేసి
గతం గోళీకాయలా గింగిరాలు తిరుగుతుంది

రోజులన్నీ క్యాలెండర్లో తిరగేసి
నెలల్నుండి సంవత్సరాల్ని పుట్టించి
శైశవం నుంచి అవసానం వరకూ
ఎన్ని ఆలోచనల తేదీలు మారాయో గుర్తుందా…

గాయాలు గురుతులు మనసు మోస్తోంది
నవ్వుల భారమంతా పెదవికిచ్చింది
గుండె గుప్పెడంతే ఎందుకుందీ
ఆశల ఆకాశం ఇమిడిపోయింది..

ఆక్షరం నా అడుగుల్ని మోస్తోంది
పదం పాదుకగా ఆసరానిచ్చింది

కభీ తన్ హాయీ.. కభీ షహనాయీ
ఒంటరి క్షణాలు కాదవి ఏకాంత సావాసాలు

పదాల్తో పదహారు లోకాలూ
అరనిమిషం లో తిరిగిరావడమెంత హాయీ..