కవిత్వం

సహన షహనాయి

నవంబర్ 2016

శాంతిని బహూకరించే క్షణాలెదురై
ఇక్కడే అంతం, ఇదే బంధం ఆఖరి క్షణం
ఇవే ఇవే మోసపూరిత ఘడియల ఆనవాళ్ళు అనే లోలోపలి ఘోషలు
తెరిచిన కళ్ళ గుడ్డి చూపేమో అనిపిస్తుందీ

ఎందుకింకా అలమటించడం
ఎందుకింకా సహన షహనాయి ఆలాపనలూ
నిజాల నీడల వేసారి తెంచుకోవడం తోనే సరి
ఇదే వేడికోళ్ళకూ, వీడ్కోళ్ళకూ తుది..
మనసుతో మనసుకు ఎడతెగని సంవాదాలే!

మనసుకు మించినదేదో నాలోనే వుందనిపించే ఆత్మీయత ఒకటి..
మనసంతా మబ్బులుకమ్మి కళ్ళు మోదుగ పూలు ఐన రోజున
నిర్మలత్వాన్ని స్నేహించే ఉదయంలో నిద్ర లేస్తుంది
రోజులు సంవత్సరాలైన జ్ఞాపకాలని చిలికి వెన్నముద్దల్ని
మనసంతా నింపి చల్లబరుచుకుంటుంది

గాయాన్ని కూడా స్నేహిస్తుంది
బహూకరించిన మనసుని క్షమిస్తుంది
నా శోకంలో అశోకమౌతుందీ!
మళ్ళీ మళ్ళీ నాతో నేను స్నేహించుకునే విశ్వాన్ని సృష్టిస్తుంది
నిన్నూ అందులో భాగం చేస్తుంది.. బంధం లోని కొత్తదనాన్ని చూపిస్తుందీ…

రా… నీ కోసం మరింత ప్రేమని నారు పోసాను
మరిన్ని పసితనపు పరిమళాలు వెతికి తెచ్చాను
కొన్నిటిని వదిలి, కొన్నిటిని వెతికి
మనసుకూ అంటు కట్టుకుని కొత్త కాలాన్ని చిగుర్లేయిద్దాం
మనలను మనం కొత్తగా పరిచయం చేసుకుందాం

పడుతూ లేస్తూ గాయాల్ని వూదుకుంటూ
ఏం కాలేదమ్మా ఉత్తినే పడ్డానని నవ్వుకుంటూ తుర్రుమనే
పసితనాల్ని తిరిగి అందిచ్చే సహనాంతరంగమే లేకపోతే
జీవితం లో ఇంత దుఃఖాల్నీ ఇన్ని ద్వైదీభావాల్న్నీ స్నేహించగలమా…

చలో ఇక్ బార్ ఫిర్ సే అజ్ఞబీ బన్ జాయే హుం దొనో…
మహేంద్ర కపూర్ ఆలాపనలా సాగిపోదాం…