కవిత్వం

ష్… అతడొచ్చాడు..నిశ్శబ్ద చిత్రకారుడు

జనవరి 2013

 ష్… అతడొచ్చాడు..
నిశ్శబ్దం హెచ్చరించింది..
క్లిక్ క్లిక్… తలుపు తాళం పలికింది
అడుగుల చప్పుడుతో పాటు, బరువు ఊపిరి మోసుకొచ్చిన శబ్దం
నిశ్శబ్దాన్ని కలిపేసుకుంది 

పయనమెక్కడికో తెలుసన్న పాదం
ఆశల్ని పాడే హృదయం
ఆకాశంలో వున్న కలలూ
నేలమీద నిజాలు చేయాలన్న మొండితనం
ఆస్తులుగా మోసుకొచ్చాడు. 

స్వప్నాల పచ్చిక మీద
జివితేచ్చని సృష్టిస్తూ సాగుతున్న
నిశ్శబ్ద చిత్రకారుడు

నేస్తులుగా మలుచుకున్న వాళ్ళలో తన కలల్ని తురిమాడు
అంతా శుభమస్తే అయితే సమస్యేంటి
కాలానికీ కలతలకీ కన్నీళ్ళకీ కొదవేంటీ…
అన్నిటికీ ఆ నాలుగు గోడలూ మౌన సాక్షులు

కలత రాత్రుల్లా దొరలిన పరుపూ
ఆవిరైన కన్నీళ్ళ వేదన మోసిన దిండు గలీబు
ఏం చేయగలవు…
నిరాశకి నిశ్శబ్దపు ఓదార్పవ్వడం తప్ప
బాధల అగాధాల్ని కప్పేసిన దుప్పటవ్వడం తప్ప…

రాళ్ళ వంటి మనసుల్లో తన స్వప్నాలు ముక్కలైనా
ఏరుకుని, కూర్చుకుని, కొత్త నగిషీలు దిద్ది వజ్రపు తునకలా నవ్వుతాడు
అతడొక నడిచే స్వప్నం
నిజాల నిప్పు రాజేసి తన చుట్టూ ధైర్యం వెలిగిస్తాడు
తనలో తానై తన ఊహా చిత్రం ప్రపంచం నివ్వెరపడేలా నిలబెడతాడు

(dedicated to all the ever loner dreamers)