గెస్ట్ ఎడిటోరియల్

Why is Sex Fun?

ఏప్రిల్ 2016

‘చిత్తకార్తె కుక్క’ అంటాం కానీ, నిజానికి మనల్ని చూసే కుక్కలు ఆ మాట అనుకోవాలి. ఓ జిరాఫీవో, ఓ కుక్కో, ఓ సింహమో మన సెక్సువల్ సంబంధాలపై అభిప్రాయం చెప్పాల్సి వస్తే, మనల్ని చూసి “నవ్విపోతాయి” – “వీళ్ళేంటీ, ఎవరికీ కనిపించకుండా, అంత రహస్యంగా సెక్సులో పాల్గొంటారూ, ఒక్క వ్యక్తితోనే జీవితాంతం కలిసుంటారూ, సంవత్సరమంతా, సంతానోత్పత్తితో సంబంధంలేకుండా అనవసరమైన సెక్సుపై వీళ్లకెందుకంత కుతి చెప్మా?” అనుకుంటాయేమో.

ఇదే శీర్షికతో పుస్తకం రాసిన జారడ్ డైమెండ్, మానవుల సెక్సువాలిటిలో ప్రత్యేకతలని టూకీగా ఈ విధంగా చెప్తాడు:

    1. మానవులలో, అత్యధికశాతం స్త్రీ-పురుషులు దీర్ఘకాల దాంపత్యానికి కట్టుబడతారు. ఈ ఒడంబడిక కేవలం వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాక, చుట్టూ ఉన్న సమాజం కూడా వారిద్దరి ఒప్పందాన్ని గుర్తిస్తుంది.
    2. వివాహం కేవలం సెక్సువల్ సంబంధం మాత్రమే కాకుండా, పుట్టిన పిల్లల పెంపకంలో కూడా స్త్రీ-పురుషులు ఇద్దరూ సమాన భాగస్వామ్యం స్వీకరిస్తారు.
    3. అన్నిటికంటే ముఖ్యంగా, స్త్రీ-పురుషుల మధ్య సెక్సు ఒక ప్రెవైటు వ్యవహారం – అది పబ్లిగ్గా, అందరి ముందూ జరిగే వ్యవహారం కాదు. It is a personal and private affair confined to closed door bedrooms.
    4. స్త్రీలలో అండోత్పత్తి రహస్యంగా ఉంటుంది – ఎప్పుడు స్త్రీ అండోత్పత్తికి సిద్ధంగా ఉందో బయటకి తెలియదు. (చాలా జంతువులలో, అండోత్పత్తి జరుగుతున్నప్పుడు వాటి శరీరంలో మార్పు వస్తుంది, అది కనడానికి సిద్ధంగా ఉందనే సంగతి మగ-జంతువుకి బాహాటంగా తెలుస్తుంది. వాటి మధ్య సంయోగం అప్పుడే జరుగుతుంది). అండోత్పత్తి రహస్యంగా ఉండటం వల్ల మగవాడికి ఎప్పుడు సంతానోత్పత్తి జరుగుతుందో తెలియదు. అంతే కాకుండా, స్త్రీ అన్ని రోజులలోనూ ‘రతికి’ సిద్ధంగా ఉంటుంది. అందుమూలంగా, చాలావరకూ స్త్రీ-పురుషుల సంభోగం సంతానం కోసం మాత్రమే కాకుండా, అది ఆనందాన్నిచ్చే రాసక్రీడగా మారింది. ఇది మానవుల పరిణామంలో చాలా ముఖ్యపాత్రని పోషించింది.
    5. అన్నిటికంటే చిత్రమైన విషయం – స్త్రీలకి ఒక వయస్సు దాటిన తర్వాత ఋతుస్రావం ఆగిపోతుంది – అంటే అండోత్పత్తి ఇక జరగదు.

ఈ లక్షణాలన్నీ మానవులకి మాత్రమే ప్రత్యేకమైన లైంగిక చిహ్నాలు.

అసలు ప్రశ్నఏమిటంటే – మానవుడి పరిణామంలో ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? వీటి అవసరం పరిణామవాద సిద్ధాంతం ప్రకారం ఎలా వివరించాలి? పరిణామవాదం ప్రకారంగా చూసినా, మానవుల సెక్సువాలిటి చాలా చిత్రమైనది.

Every being is driven to produce as many offspring as possible. Therefore, for a male, it is in its interest to have sex with as many females as possible and vice versa. That ensures maximum gene pool.

కాని, (అధికశాతం) మానవులెందుకు ఒకే వ్యక్తితో జీవితాంతం ఉంటారు? ఎందుకు స్త్రీలలో అండోత్పత్తి జరిగే సమయం రహస్యంగా ఉంటుంది? మానవులెందుకు సెక్సుని సంతానోత్పత్తి కోసం కాకుండా రాసక్రీడగా మలచుకున్నారు? మెనోపాస్ ఆవశ్యకత ఏమిటి?

మగా,ఆడ జీవాలు ఒక పిల్లని పెట్టాక, దాని మానాన దాన్ని వదెలేసి వెళ్ళిపోయాయనుకుందాం. పుట్టిన పిల్ల దానంతట అదే పెరిగి పెద్దదైపోగలదనుకుందాం. అటువంటప్పుడు, తల్లి తండ్రులిద్దరికీ సంతానం విషయంలో ఏ పట్టింపూ లేకుండా వదిలేసి వెళ్లిపోతాయి. కానీ, కొంతకాలమైనా తల్లి తండ్రులలో ఎవరో ఒకరు సాకందే పుట్టిన సంతానం పెరిగి పెద్దదై తన కాళ్లమీద తాను నిలబడలేదు. దీన్ని ‘weaning off period’ అంటాం. ఈ పని సాధారణంగా ఆడ జంతువే చేస్తుంది – ఎందుకంటే, దాని కడుపులోనే సంతానం పెరుగుతుంది, తర్వాత పాలిచ్చి సాకాల్సింది కూడా అదే. అందుకే, చాలా స్తన్యజీవాల్లో మగదానికి సంతానాన్ని సాకడంలో ఏ పాత్రా ఉండదు.

అందుకని, ఒకసారి పుట్టిన సంతానాన్ని బతికించుకోగలిగే వరకూ, తల్లి-తండ్రుల్లో ఎవరో ఒకరు కొత్తగా సంతానోత్పత్తికోసం ప్రయత్నించడం వదులుకోవాలి. అదే, మానవుల్లో – పుట్టిన బిడ్డ తన కాళ్ల మీద తను నిలపడగలగడానికి కనీసం పన్నెండు నుంచీ పదిహేను సంవత్సరాలైనా పడుతుంది. ఆధునిక సమాజాలలో ఇది ఇరవై ఏళ్లకన్నా పైమాటే! అంటే, పదిహేనేళ్ళలో ఏ నలుగురైదుగురో కంటే ఎక్కువమంది సంతానాన్ని కనడం వీలుపడదు.

This is a very big investment for the female. అందుకని, స్త్రీకి పిల్లలని పెంచడంలో మగవాడిని కూడా బాధ్యుడిని చెయ్యగలిగితే పిల్లలని పెంచడంలో తాను చేస్తున్న త్యాగానికి కొంత ఫలితం ఉంటుంది. కొన్ని సంవత్సరాలపాటు మగవాడిని పిల్లలపెంపకంలో బాధ్యుడిని చెయ్యాలంటే ఎలా? మగవాడిని దీర్ఘకాలిక భాగస్వామిగా చేసుకోడానికే అండోత్పత్తి రహస్యం కావడం, సెక్సు ప్రైవైటు వ్యవహారం కావడం, ముఖ్యంగా సెక్సు ఒక రాసక్రీడగా మారడం జరిగిందంటారు పరిణామ జీవశాస్త్రజ్ఞులు.

ఇక మెనోపాస్ అవసరం ఎందుకు? ఎందుకని స్త్రీ సంతానోత్పత్తి అవకాశాన్ని వదులుకుంటుంది? దీనికి మానవులలో పిల్లలు పెరిగి పెద్దవాళ్లవడానికి చాలా సమయం పట్టడమే కారణం. అదీ కాకుండా, పెద్ద వయసు వచ్చాకా – గర్భదారణ ప్రమాదకరం కాబట్టి, కొత్తగా సంతానాన్ని కని, పెంచే బదులు, మనుమలని పెంచడంలో భాగస్వామి కావడం “బెటర్-ఛాయస్” అవుతుంది.

క్లుప్తంగా, స్త్రీకి పిల్లలని పెంచడం దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి దాంట్లో మగవాడిని కూడా భాగస్వామిగా చెయ్యడానికి సెక్సు ఒక క్రీడగా మారింది.

Sex had to become ‘fun’ so as to provide the evolutionary basis for the formation of long term marital relation between male and female humans.

సంతానోత్పత్తే పకృతి పరంగా ప్రతిజీవికి పరమార్థం అయినప్పుడు, ఈ మార్పువల్ల మగజీవికి ఒక రకంగా చాలా నష్టం జరుగుతుంది. మగవాడికి, ఒక్కసారి జరిగే వీర్యస్ఖలనంలోనే సుమారుగా 20 మిలియన్ల వీర్యకణాలు విడుదల అవుతాయి, అంటే, ఒకే భాగస్వామితో ఉండటం వల్ల, ఆమె గర్భం ధరించిన తొమ్మిది నెలల్లో సుమారుగా 500 మిలియన్ వీర్యకణాలు అతనికి సంతానోత్పత్తికి పనికిరాకుండా వృధా అవుతాయి.

This is the trick that nature played on human male. Perhaps, this deep loss drives the primal need of human male to dominate and control the female.

***

కానీ, మనిషి మిగిలిన జంతువుల్లా కాక, వివేచించగలడు (Sentient Being). అందుకని, మనిషికి శారీరక, లైంగికావసరాలే కాకుండా, ప్రేమానురాగాలు, అనుబంధాలు, ఆత్మానందమూ కూడా అవసరమే. ఎన్నో లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలోంచీ వివేచించగలిగే ఆధునిక మానవుడు ఎదిగినా, ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి, బయాలజీ ఆఫ్ సెక్సుకీ, బయాలజీ ఆఫ్ లవ్ కీ మనకి ఇంకా ప్రస్ఫుటమైన తేడా తెలియదు.

మనుషుల్లో సెక్సుకి సంబంధించిన హార్మోన్లు, ప్రేమానురాగాలకి, ఆత్మానందానికి సంబంధించిన హార్మోన్లు వేరుగా ఉంటాయని ఇప్పుడు మనకి తెలుసు. టెస్టోస్టోరీన్, ఎస్ట్రోజెన్ అనేవి లస్ట్ హార్మోన్లు అయితే, డోపామైన్, ఆక్సిటోసీన్లని ‘ప్రేమానురాగాల” హార్మోన్లు అనుకోవచ్చు. ఇక, సెరిటోనిన్ హార్మోన్ “ఆత్మానందం” కలిగించే హార్మోన్ గా అనుకోవచ్చు.

ఉదాహరణకి, మీ అత్యంత సన్నిహితుడైన స్నేహితుడితోనో, స్నేహితురాలితోనో మీరు ఒక సాయంత్రం ఇష్టంగా గడిపారు అనుకోండి – ఆ అనుభూతి మీలో డోపామైన్, ఆక్సిటోసీన్ హార్మోన్లని విడుదల చేస్తుంది. భార్యాభర్తలు ఎంతోకాలం ప్రేమానురాగాలతో సంసారం చెయ్యడానికి, లస్ట్ హార్మోన్ల కంటే, ఈ సాహచర్యాన్ని పెంపొందించే హార్మోన్లే ఎక్కువ అవసరం. ఇక సెరిటోనిన్ హార్మోన్ మనల్ని సమాజంతో, అర్థవంతంగా మనగలిగేటట్టు చేస్తుంది – మనిషికి, తన అవసరం తన చుట్టుపట్లవారికి ఉందనే నమ్మకం ఎంతో భధ్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది.

అభివృద్ధి చెందిన డెమోక్రాటిక్ సమాజాల్లో, ఇప్పటికే చాలామంది వివాహానికి దూరంగా ఉంటూ, స్నేహితులతోనూ, సమాజంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా జీవితాశయాలని మలచుకోవడం మూలంగానూ, సాహచర్యాన్నే ఎక్కువ కోరుకుంటున్నారు.

***

Literature begins where biology ends!!
Memes are more powerful than genes,
Literature creates new memes.

ఇప్పుడు, స్త్రీ-పురుష సంబంధాలమీదా, ముఖ్యంగా వివాహేతర లైంగిక సంబంధాలమీదా తెలుగులో ఎన్నో కథలు, రచనలూ వస్తున్నాయి. కానీ, ఇవన్నీ చాలావరకూ పైపైన ఉన్న సమస్యలనే రకరకాలుగా వ్యక్తీకరిస్తున్నాయి గానీ, మనకి కొత్త “మీమ్స్” ని ఇవ్వలేకపోతున్నాయి.

సాహిత్యం ఎదగనంత కాలం, సంస్కృతి కూడా ఎదగదు.

ఉదాహరణకి, మనం సొంత కుటుంబ సభ్యులని కామదృక్కులతో చూడలేం. కానీ జంతువులకి ఆ నియమేమీ ఉండదు కదా? కొన్ని ప్రాచీన సమాజాలలో, ముఖ్యంగా రాజవంశాలలో, రాజు తన కూతుర్నో, లేదా సోదరినో పెళ్లి చేసుకునేవాడు. కాని, అటువంటివి ఇప్పుడు మనకి ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, అది సాహిత్యం సృష్టించిన ‘మీమ్’.

స్త్రీ-పురుషుల మధ్య శృంగారంకి మించిన అనురాగం, ప్రేమ సాధ్యమేనన్న మధ్యతరగతి ‘మీమ్స్’ ని 50-70 దశకాలలో వచ్చిన సినిమాలే మనకిచ్చాయి – రాజేష్ ఖన్నాలు, అక్కినేని నాగేశ్వరరావులు, శోభన్ బాబులు, సావిత్రులు – వారు నటించిన “సోషల్ ఫాంటసీ డ్రామాలు”, చాలా పెద్ద సాంస్కృతిక మార్పుకి దోహదం చేసాయి. అంతకుముందు మనకి సాహిత్యంలో, ధీరోదాత్తులు, ధృడచిత్తులూ అయిన హీరోలు, వెన్నెల సోకినా కందిపోయే సుకుమారత్వంతో నలిగిపోయే హీరోవీనులే ఉండేవారు.

జంతు సహజమైన సంతానోత్పత్తే జీవిత పరమార్థం అనే ప్రకృతి సూత్రాన్ని మనిషి, సామాజికంగానే కాకుండా, బయలాజికల్గా కూడా అధిగమించాడు – మానవులలో గే, లెస్బియన్ సంబంధాలు, వాటిని ప్రజాస్వామ్య సమాజాలు ఇప్పుడు గౌరవించడం అనేది మానవుడి పరిణామ క్రమంలో వచ్చిన చాలా పెద్ద మార్పు. ఈ మార్పులకి సంబంధించిన సాంస్కృతిక అవగాహన ఇంకా మనలో లేదు.

అయితే, సెక్సుకి సంబంధించి ఇప్పటికీ మారని ‘మీమ్’ ఒకటుంది మనకి. అనాదిగా, మనలో పాతుకుపోయిన ఆటవిక ప్రవృత్తి వల్ల కావొచ్చు, ఇప్పటికీ పురుషుడు ‘ఆక్రమించుకోవడం’, స్త్రీ ఇష్టంగానో, కష్టంగానో లొంగిపోవడం అనేదే primary sexual act మన సాహిత్యంలో – దీన్నే రకరకాలుగా తిప్పి, తిప్పి, తిరగేసి వడ్డిస్తూ ఉంటాం ఇప్పటికీ!

ఉదాహరణకి, వసుచరిత్ర చివర్లో వసురాజు, గిరికల శృంగార వర్ణన చూడండి – ఆమెని “నీకు సిగ్గెందుకూ” అంటూ, ఆమె అంగాంగాలనీ అదేపనిగా తడుముతాడు, మూలధనం పతి హరించగానే, ఆమె అతని చేతులలో చిక్కిపోయి ముద్దరాలుగా మిగిలిపోయిందట, ఆత్మసురక్షణానికి నియోగించిన సేవకులు ఆమెని పరాధీనం చేసారు అంటాడు కవి. ఈ వర్ణన పూర్తిగా చదివితే, ఈ మధ్య కొన్ని వందలకోట్లు పెట్టి హాలివుడ్ స్థాయిలో తీసిన తెలుగు సినిమాలో పాట ఒకటి గుర్తుకొస్తోందంటే – ఐదువందల సంవత్సరాల తర్వాత కూడా మన ‘ఇమాజినేషన్”లో మార్పేం రాలేదన్నమాటేగా?

మ. కరళాధార మతి ప్రవాళశయగుస్తంబంచు నభ్యంతర
స్మరుడుత్తంభిత కంపలోల పటసంజ్ఞం బిల్వ బాలాపయో
ధర దుర్గంబు గ్రహించె రాజకర మే తజ్జాతసంత్రాస వై
ఖరి దెల్పె జఘన స్థలీవరణ జాగ్రద్ఘంటికాఘోషముల్

ఉ. తొయ్యలి ముద్దరాలు కుచ దుర్గములాత్మశయైక వంచనన్
నెయ్యపు రేని పాల్పరిచి నీవియు గోల్పడగా దలంచె గా
కయ్యెడ నేలకోయునిచె నాత్మశయ ద్వితయంబు మున్నెలో
నయ్యె పరాగమై నృపక రార్పణకింక బెనంగ నేర్చునే!

I think it is time to knock such metaphors to rest and create some new memes based on equality and mutual consent.

***

వసంతం వచ్చిందంటే ప్రకృతి కొత్తగా మొగ్గతొడుగుతుంది, పువ్వులతో, పళ్లతో పులకరిస్తుంది, మోడువారిన శిశిరాన్ని మరచిపోయి, ప్రకృతంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తుంది.ఈ వసంతాగమనాన్ని వర్ణించే చాలా గొప్ప వర్ణనలో ఒకటిగా మన సాహిత్యంలో నిలిచిపోయింది, వసుచరిత్రలోని మధుమాస వర్ణన:

సీ. లలనా జనాపాంగ వలనావసదనంగ
తులనాభి కాభంగ దోః ప్రసంగ
మలసానిలవిలోల దళ, సాసవరసాల
ఫలసాదరశుకాలాపన విశాల
మలినీ గరుదనీకమలినీ కృతధునీ, క
మలినీ సుఖిత కోకకుల వధూక
మతికాంత సలతాంత, లతికాంత రనుతాంత
రతికాంత రణతాంత సుతనుకాంత

తే. మకృతకామోదకురవకా వికల వకుళ
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠకులకంఠ కాకలీవి
భాసురము పొల్చె మధువాస వాసరంబు!

ఈ అద్భుతమైన వసంతకాల వర్ణనతో పాఠక మిత్రులందరికీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

**** (*) ****


[1] Jared Diamond, “Why Sex is Fun?”
[2] Desmond Morris, “The Naked Ape”
[3] http://www.youramazingbrain.org/lovesex/sciencelove.htm
[4] Hacking Into Your Happy Chemicals
[5] Biological basis of love