ప్రత్యేకం

రామాయణం –పటికబెల్లం పలుకులు

సెప్టెంబర్ 2014

ఎప్పుడూ లేనంతగా “వైటింగ్ ఫర్ గోడో” స్థితిలో ఇరుక్కుపోవడం వల్ల కావొచ్చు – గత రెండేళ్లగా గాఢంగా శబరే మదిలో మెదులుతోంది.

ఏదైనా అడ్డంకి మూలంగా ముందుకెళ్ళలేకుండా ఆగిపోవడం, లేదా దేన్నో ఆశిస్తూ ఎదురుచూడడం కన్నా నరకం ఇంకోటుండదు. ఎర్రలైటుదగ్గర కారు కదలకుండా ఆగే ఉన్నా, పెట్రోలు మాత్రం ఖర్చుఅవుతూనే ఉంటుంది విషవాయువులు దాని ముక్కులోంచి ఎగుస్తూనే ఉంటాయి – వైటింగ్ స్థితి ఇట్లాంటిదే. It produces negative energy. అందుకే, మా గురువుగారు It doesn’t matter what decision you make, make a decision and move on అంటుండేవారు.

శబరి రాముడి రాక కోసం “ఎదురుచూస్తూ” ఉండిపోయిందంటారు. అయితే, శబరి స్థితి ట్రాఫిక్కులో ఆగిపోయిన కారులాటి ‘నెగెటివ్’ స్థితి కాదు.

అరణ్యకాండ చివర సర్గల్లో వస్తుంది శబరి కథ. అసలు రామాయణం అంతా ఋష్యాశ్రమాల మధ్యనుంచీ ప్రవహించే నదిలాంటిది. అరణ్యకాండ భరద్వాజాశ్రమంలో ప్రారంభం అయి, అత్రిమహర్హి, అగస్త్యాశ్రమాల నేపథ్యంలో నడుస్తుంది. కిష్కింధకాండకి నాందిప్రస్థావనగా మతంగమహాముని తపోవనం ప్రసక్తి ఆఖర్లో వస్తుంది. శాపవిమోచనుడైన కబంధుడు రాముడికి మతంగాశ్రమం గురించీ, శబరి గురించీ, సుగ్రీవుడిగురించీ చెప్తాడు.

శబరి ఉండే తపోవనంలో, చెట్లకున్న పువ్వులు ఎప్పుడూ వాడిపోవుట. ఎందుకంటే -

“మతజ్గ శిష్యా స్తత్రస సృషయస్సుసమాహితా, తేషాం భారాభి తప్తానాం వన్యమాహారతాం గురోః
యే ప్రపేతుర్మహీం తూర్ణం శరీరా త్స్వేదబిన్దవః, తాని జాతాని మాల్యాని మునీనాం తపసాతదా
స్వేదబిందు సముత్థాని నవినశ్యన్తి రాఘవ…” 

మతంగముని శిష్యులు గురువులకోసం అడివిలోంచి కందమూలాదులు మోనుకొని వస్తుండేవారు, ఆ బరువు మోయలేక వారు అలసిపోతే వారి దేహాలమీదనుంచీ చెమట బిందువులు రాలి, భూమిమీద పడేలోగా గాలికి ఎగిరి చెట్ల మీద పడుతుండేవి. మహర్షుల స్వేదబిందువులే పూలదండలైయాయి కాబట్టి అవెన్నెటికీ వాడవుట.

శబరి ఉండే వనం ఎలా ఉండేదంటే -

“తతః పుష్కరిణీం వీరౌ పమ్పా నామ గమిష్యథః అశర్కరా మవిభ్రంశాం సమతీర్థా మశైవలామ్‌
రామ సంజాతవాలూకాం కలోత్పలశాలినీమ్‌ తత్ర హంసాఃప్లవాః క్రౌంచా కురరాశ్చైవ రాఘవ”

పంపాసరస్సు దగ్గర కాళ్లకు గుచ్చుకొనే పలుగురాళ్ళు ఉండవు, అక్కడ రాళ్ల మీద కాళ్లు జారవు, అన్ని రేవులూ ఒక్కమాదిరిగా మనోహరముగా ఉంటాయి, ఏ రేవులోనూ పాచి ఉండదు.

మన బతుకులెన్నటికి ఈ స్థితిని చేరేనో కదా?

శబరిది, రాధలాగనే – “accomplished state”. (రాధ, సాధ సంసిద్ధౌః)
ఆయనెప్పుడొస్తాడోనన్న చింతలేదు, రాడేమోనన్న బెంగాలేదు.

అట్లాంటి శబరిని చూసి, రాముడడిగిన కుశల ప్రశ్న:

“కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్థతే తపః
కచ్చిత్తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే
కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనస స్సుఖమ్‌
కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చారుభాషిణి”

అమ్మా – నీ తపస్సు నిర్విఘ్నంగా సాగుతొందా? వృద్ధి చెందుతోందా? నీవు కోపాన్ని నిగ్రహించుకున్నావా? ఆహార విషయాలు, చాంద్రాయణాది నియమాలు పూర్తి చేసుకున్నావా? నీ మనస్సు సుఖంగా ఉంటోందా? నీ గురుసేవ సఫలమైంది కదా? కుశలప్రశ్న అడిగాడు.
అన్ని ప్రశ్నలకి అవునని చెపుతూ, శబరి -

“అద్యప్రాప్తా తపఃసిద్ధి స్తవ సందర్శనాన్మయా
అద్య మే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః”

నీ దర్శనభాగ్యం వల్ల నాకు తపఃసిద్ధి లభించింది, నేను చేసిన గురుసేవ సఫలమయ్యింది అంటుంది.
ఇంత చక్కటి సమాధానం ఎదురుచూపుల్లో “కసలికాలిపోతున్న” వారికి సాధ్యంకాదు.

శబరి is an epitome of patience, hers is not a state of waiting. అమ్మని చూసినప్పుడల్లా నాకీమధ్య శబరే గుర్తుకువస్తోంది – “నా టిక్కెట్టు దేవుడెక్కడో పారేసుకున్నట్టున్నాడు “అని, చిన్నగా నవ్వేస్తూ ఉంటుంది.

***

రామాయణంమీద మనవాళ్ళ సినిమాలెలా ఉన్నా, మంచి పాటలు రాసారు. ఆరుద్ర అయితే మరీనూ – కొన్ని పాటల్లో మార్మికత కూడా గాఢంగానే ఉంటుంది -

అన్నమయ్య దేవందేవం భజేలో పరశురాముడు ధనస్సు ఇవ్వడాన్ని – “రాజారి కోదండ రాజదీక్షా గురుం” అనిన్నీ, సీనియర్‌ సముద్రాల రాముని అవతారం పాటలో, శివధనస్సుని “దనుజులు కలగను సుఖగోపురమో” అంటారు. అట్లాంటివి విన్నప్పుడల్లా, “వారెవ్వా” అనుకోకుండా ఉండలేం కదా?

కృష్ణశాస్త్రిగారి “ఈ గాలికెంత దిగులో, ఈ గంగకెంత గుబులో” పాట అన్నిటిలోకి ఆణిముత్యం.

***

నిన్న లవకుశ చూసాం (మరోసారి). ఆ సినిమా చూసినప్పుడల్లా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే ఎంత బాగుండేది అనుకుంటా. ఈ సినిమాలో పాటలు పక్కనపెడితే, సీతని అడవికి పంపడం ఘట్టాన్ని చాలా బాగా తీసారు – అందులోని వైరుధ్యాలు, రాముడి వైపునుంచీకూడా ఉన్న వైరుథ్యాన్నంతా ఓ ఇరవై నిమిషాలు చాలా చక్కగా పట్టుకున్నారు.

లవకుశుల దగ్గరకి ఆయన హనుమంతుడిని వెంటేసుకొని వస్తాడు — ఆ సీన్లో రామారావు, రామావతారాన్నంతా కళ్ళకి కట్టించేసాడు. “శాంత గంభీర శృంగార వీర ధర్మం” అన్న సమాసమంతా ప్రతిబింబించేసాడు రామారావు.

సీత ఆయన్ని అన్నిటికీ క్షమించింది కానీ, “ఆయన రాజైతే నేను రాణిని కాదా, ఆ బాధ్యత నాకు మాత్రం లేదా” అంటుంది. ఏమనుకుందో కాని, ఆఖర్లో పిల్లలని అప్పచెప్పి, సింపుల్గా వెళిపోతుంది.

ఆయన పాపం ఆవిడ భూమిలోకి పోయినచోట, ఆ బీటల మీద పడి దొర్లుతూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తాడు – ఆయన గుండెలు ఎన్ని బీటలువారాయో! భూమిసుత తల్లి లక్షణాలన్నీ పుష్కలంగా పుణికి పుచ్చుకుంది – ఆయమ మనసు వెన్నే, చూపుల్లో వెన్నెలే, కరుణ అమృతమే, సంకల్పం మట్టుకు వజ్ర సదృశం.

*** * ***

(రచనాకాలం 2011 దసరా నవరాత్రులు)