కవిత్వం

ఎదారి

మే 2016

ట్టిపోయింది తేనెతుట్టె
ఒకటో రెండో తేనెటీగలు
గుచ్చి చూడడానికే
వచ్చిపోతుంటాయి

నదిమీదకి ఒరిగిన చెట్టునీడ
ఒకనాటి జ్ఞాపకం
ఒరవడిలో నిలవలేనిది ఒకటి
నీటిబొట్లన్నీ ఆకులైతేగానీ
కదలలేనిది మరొకటి

లోకం చేతిలో విరచబడి, మలచబడి
అనేకంగా అమ్ముడుపోయింది అస్తిత్వం
ఇక శరీరమొక్కటే పగలని నిజం

వాక్యాన్ని ఆపే విరామచిహ్నం
మొండిది, ఎంత తోసినా జరగదది
మాసిపోయిన గతానికి, కాబోయే గాయాలకీ
మధ్య చక్కని చుక్కలా జీవితం

నమ్మకానికీ, సందేహానికీ మధ్య
చీలిన దారిదగ్గర, చిరిగిన డేరాలో
కుప్పకూలిన ఒంటెతో
శరణార్థిగా
నేను

*