గెస్ట్ ఎడిటోరియల్

సైలెంట్ రీడింగ్

సెప్టెంబర్ 2015

లమునకలుగా పుస్తకంలో లీనమైపోయి, దీక్షగా కళ్ళు వాక్యాలవెంట పరుగులు తీస్తుండగా, ఏవేవో ఆలోచనలతో, ఊహలతో తమ ఉనికినే మరిచిపోయినట్లున్న పాఠకులు మనకి లైబ్రరీలలో, కాఫీషాపుల్లో, ట్రైన్లలో, బస్సుల్లో, వెయిటింగురూముల్లో, ఇంకా మరెన్నోచోట్ల కనిపిస్తూ ఉంటారు. పుస్తకంలో మునిగిపోయిన పాఠకుడికీ పుస్తకానికీ మధ్య జరిగే అద్భుతమైన మౌనసంభాషణకి ఏ సాక్ష్యమూ మిగలదు – పుస్తకంలో లీనమైపోయిన ఆ పాఠకుడి ముఖ కవళికలు తప్ప!!

మన కళ్ళకి చదవడం తెలుసు. తెలుగు వాక్యాన్ని చదవకుండా, దాన్నో బొమ్మలా చూడటం మనకి అసాధ్యం. కళ్ళకి ఇటువంటి ‘చదివే’ శక్తి ఈ మధ్యనే వచ్చిందంటాడు జూలియన్ జీన్స్. ఆయన సిద్ధాంతం ప్రకారం, కళ్ళకి వాటంతట అవే చదివే శక్తి క్రీ.పూ మూడో సహస్రాబ్దికి ముందు లేదు. అప్పట్లో శరాకారలిపిని కంటితో చూసినా, అందులోని శబ్దాన్ని చెవులతో వినేవారు, అంటే ఒక లిపిని చదివినప్పుడు దాని శబ్దాన్నే మెదడు గ్రహించేది. ఎలాగంటే, మనం ఎన్నోసార్లు విన్న పాట సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ పాట ఎక్కడో చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది కదా? దీనినే aural hallucination అంటాడు జీన్స్.

మనసులో చదవడం సాహిత్య చరిత్రలో రాతమూలకంగా వచ్చిన చాలా పెద్ద మార్పు. ఈమార్పు చారిత్రకంగా చాలా కొత్తదీ, ఈ మధ్యనే బలపడినదీనూ. ఒకప్పుడు, చదవడమంటే బిగ్గరగా పైకి చదవడమే. ప్రాచీన వాక్‌సాహిత్యమంతా పైకి చదవడానికి కల్పించబడ్డదే. వాక్‌సాహిత్యం నుంచీ లిఖిత సాహిత్యం స్పష్టంగా వేరుపడే ప్రక్రియలో రాసే పద్ధతులూ, కథనరీతులూ, సాహిత్యశైలిలో వచ్చిన మార్పులకి సమాంతరంగా, చదవడం కూడా సామూహికం నుంచీ వ్యక్తిగతమూ, ఏకాంతమూ, ఆంతరంగికమూ అవుతూ వచ్చింది.

ఈ మార్పు చాపకింద నీరులా వచ్చింది.

***

మీరొక వేదపాఠశాలకి వెళ్ళారనుకోండి, అక్కడ చెట్లకిందో, గదుల్లోనో ఒంటరిగానో, గుంపుగానో విద్యార్థులు బిగ్గరగా వేద పాఠాన్ని వల్లెవేస్తూ కనిపిస్తారు. అక్కడి గురువుగారు, కాలేజీ ప్రొఫెసర్లా పుస్తకంలో విషయాన్ని ఉపన్యాసంగా బోధపరచరు. ఆయన వేదం స్వరయుక్తంగా పఠిస్తూ ఉంటే, ఆయన వెంట విద్యార్థులుకూడా వల్లె వేస్తూ ఉంటారు. వారెవరైనా తప్పుగా చదివితే, ఆయన వారి ఉచ్చారణని సరిచేస్తాడు. మనకి సుపరిచితుడైన మౌనపాఠకుడికి అక్కడ స్థానంలేదు.

మౌఖిక సాహిత్యంలో వేదాలకి అతి ముఖ్యమైన స్థానం ఉంది. ఈనాడు పాటలు భద్రపరచడానికి టేప్ రికార్డులు, సిడిలు ఎలా వాడతామో, అలా వేదాలకి వాటిని జీర్ణించుకున్న పండితులే వాటిని భద్రపరిచిన టేప్ రికార్డులు. వాళ్ళ జ్ఞాపక శక్తే వేదాలకి హార్డ్ డిస్క్. ఈనాటికీ అవి మనుషుల ధారణశక్తి ద్వారానే పదిలంగా ఉన్నాయి, వాటికి వేరే ఏ భౌతికమైన ఉపాధీ అవసరంలేదు. అందుకే వేదం చదవడానికి నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి. ఒక శ్లోకంలో ఒక్కపదం కూడా ఉచ్చారణ మారిపోకుండా, ఒక్క పదం కూడా శ్లోకంలోంచి జారిపోకుండా వైదిక పండితులు ఎన్నో పద్ధతులు కనిపెట్టారు.

ఇస్లాం మతంలోకూడా కొరాన్ పైకి చదవడానికే ప్రాముఖ్యత ఉండేది.అల్-గ్వాజీ మాటల్లో “ ఏడేళ్ళ కుర్రాడు కూడా కొరాన్ మొత్తాన్ని పొల్లుపోకుండా కంఠోపాఠంగా అప్పచెప్పగలడు. మిగిలిన మతాలలా కాకుండా, ఇస్లాంలో, ప్రవక్త ప్రవచనాలన్నీ ఎన్నో తరాలబాటు నమ్మకంగా మౌఖికంగా భద్రపరచబడ్డాయి, రాతలో భద్రపరిచిన పుస్తకాలలో వ్రాయసకారుల మూలంగా ఎన్నో తప్పులు కాలక్రమంలో ప్రవేశిస్తాయి” అంటాడు.

అల్-ఘజలీ కొరాన్ చదవడానికి కొన్ని నియమాలని ఏర్పరిచాడు, “బిగ్గరగా, నీకు బాగా వినిపించేలా చదువు, చదవడమంటే ప్రతి శబ్దాన్నీ ప్రయత్నపూర్వకంగా అర్థం చేసుకోవడం. అలా చదివితేనే బాహ్యప్రపంచం నుంచి తప్పించుకోగలవు” అని ఆయన ఏర్పరిచిన తొమ్మిదో నియమం చెప్తుంది. ఇలాంటి నియమాలే సుమారుగా అన్ని సంస్కృతులలోనూ ఉండేవి.

మా చిన్నతనంలో, మనసులో చదువుతే తిట్టేవారు, గొంతెత్తి బిగ్గరగా చదివితేనే విషయం పూర్తిగా మెదడులోకి ఎక్కుతుందనే నమ్మకం అప్పటికింకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ, పిల్లలు ఏదైనా కంఠతా పెట్టవలసివస్తే గొంతెత్తి చదవమనే చెపుతాం. మన దేశంలోనే కాదు, అన్ని సంస్కృతులలోనూ ముందునుంచీ చదవటమంటే గొంతెత్తి పైకి బిగ్గరగా చదవడమే ఆచారం.

“Scripta volant, Verba manent” అనే నానుడి ఈనాడు రాత శాశ్వతం, మాట క్షణికం అనే అర్థాన్ని సంతరించుకున్నా, ప్రాచీనకాలంలో అది కాగితానికి అతుక్కుపోయిన రాత అవిటితనాన్ని పోగొట్టి, దానికి పక్షిలా ఎగరగలిగే స్వేచ్ఛని ఇచ్చేదే మాట అనే అర్థంలోనే వాడేవారు. పైకి చదవడం ద్వారా అక్షరానికి తనగొంతుతో ప్రాణం పొయ్యడం చదువరి బాధ్యతగా భావించేవారు. అందుకే పవిత్ర గ్రంథాలని కేవలం కళ్ళతోకాకుండా, శరీరం మొత్తం పఠనంలో పాలుపంచుకునేట్టుగా చదివేవారు. ఇప్పటికీ, భక్తిపాటలు, భజనలు పాడేటప్పుడు అందరూ పైకిపాడుతూ, చప్పట్లో తప్పట్లో కొడుతూ, లయకి అనుగుణంగా భక్తిపారవశ్యంతో ఊగిపోవడం మనం చూస్తూ ఉంటాం.

ఈనాటికీ పారాయణ పుస్తకాలని మనవాళ్ళు పైకే చదువుతారు. ప్రతిరోజూ, క్రమం తప్పకుండా పైకి శ్రావ్యంగా, స్వరసహితంగా చదవడం వల్ల కొన్నాళ్ళకి ఆ రచన పూర్తిగా కంఠోపాఠం అయిపోతుంది. రామాయణ భాగవతాలు పైకే చదవాలని, ఆ కథలు చదువుతున్నప్పుడు హనుమంతుడో, నారదుడో వచ్చి వింటారనే నమ్మకం అచ్చంగా మౌఖిక సంస్కృతి తాలూకు చిహ్నం. తులసీదాసు కాశీలో రామాయణ గానం చేసేటప్పుడు హనుమంతుడు వచ్చి వినేవాడట. ఇటువంటి కథలు మౌఖిక సంస్కృతుల్లో విడదీయరాని భాగంగా ఉంటాయి. దానికి బలమైన కారణం ఉంది. మౌఖిక సంస్కృతిలో, పదికాలాల పాటు ఒక రచనని ప్రజలు మరచిపోకుండా ఉండాలంటే, దాన్ని వారు సొంతం చేసుకునే విధంగా ఉండాలి. అందుకని, ఆ కథలలో మార్పు చేర్పులు చేసుకోవడానికి, వాటిని పాడుకోవడానికి, వాటిలో వారి ఆలోచనలు, వ్యక్తీకరణలు, ఉద్వేగాలు చేర్చుకోవడానికి అవకాశం ఈ సాహిత్యం కల్పిస్తుంది, ఎందుకంటే – ఈ కథలు మనకి మనం చదువుకునేవి కాదు, ఎవరైనా పదిమందిని పోగుచేసి జనరంజకంగా చెప్పవలసినవి.

ముఖ్యంగా పురాణాల విషయంలో, పౌరాణికుడి తోడ్పాటు లేనిదే అది సంపూర్ణం కాదు. వెల్చేరు నారాయణరావుగారు, తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలో ఇలా అంటారు “ ప్రదర్శకుల తోడ్పాటు లేనిదే నాటకం సంపూర్ణం కానట్టే, సమర్థుడైన పౌరాణికుడి ప్రవచనం లేనిదే పురాణాలు సంపూర్ణం కావు. అందుకని, పౌరాణికుడు చేసే పని కేవలం అర్థం చెప్పడం కాదు, కళాసృష్టి చెయ్యడం. ఈ కారణం వల్ల వాక్‌సాహిత్యం, రాత రూపంలో వచ్చినప్పటికీ, దానికి, లిఖిత సాహిత్యానికి ప్రధానమైన తేడా రచయిత విషయంలో వస్తుంది. వాక్‌సాహిత్యానికి కూడా ఒక “సృష్టికర్త” ఉన్నప్పటికీ, ఎవరైతే దాన్ని కథగా పదిమందికీ చెప్తారో, ఆ వ్యాఖ్యాత కూడా, కథ చెపుతున్న సమయంలో “రెండో రచయిత” అవుతాడు. కథని చెప్పినప్పుడు, అతను కొన్ని శ్లోకాలు వదిలెయ్యవచ్చు, కొన్ని ఘట్టాలు పెంచవచ్చు, అందులో తనకి తెలిసిన కథలు, వ్యాఖ్యానాలు చొప్పించవచ్చు. అందుకే, చెప్పిన ప్రతి సారీ అదో కొత్త కథనం అవుతూ ఉంటుంది. వాక్‌సాహిత్యం కథ చెప్పేవాడికి రెండో రచయితగా జాగా కల్పిస్తుంది. దానికి అనువుగానే, ఆ సాహిత్యం కల్పన ఉంటుంది.”

రామాయణం నుంచి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.అరణ్యకాండలో ఖర-దూషణాదుల వధ సుమారుగా ఎనిమిది సర్గల కథ. ఇందులో రాముడు మొత్తం పద్నాలుగు వేలమంది రాక్షసులని వధిస్తాడు, అంత యుద్ధమూ అయినాక ఆయన చెక్కుచెదరడు. కథకి సంబంధించినంతవరకూ ఆయన ఇద్దరిని చంపినా, పదిమందిని చంపినా, పదివేలమందిని చంపినా ఏం తేడా పడదు. కానీ, పదిమంది చేరిన దగ్గర కథ రక్తికట్టాలంటే, చెప్పేవాడికి కథని “కళ్లకి కట్టించి, కథలోకి మనని తీసుకుపోవడానికి” కొంత సరంజామా కావాలి. ఇటువంటి సన్నివేశాలు అటువంటి అవకాశాన్ని ఇస్తాయి. ఈ సన్నివేశం మనం “కళ్ళతో మౌనంగా చదివితే” ఓ ఐదు/పది నిమిషాలకంటే ఎక్కువ పట్టదు, అదే ఎవరైనా చెపితే – బహుశా రెండు రాత్రులు పడుతుంది, విన్నవాళ్ళు పంచవటిలో ఆ యుద్ధాన్ని అనుభవిస్తారు.

ఇలాంటి సన్నివేశాలే యుద్ధకాండ నిండా ఉంటాయి – అందులో, ఒక రాక్షసుడు పెద్ద సైన్యాన్ని వెంటపెట్టుకుని యుద్ధానికి బయలుదేరతాడు, ఇంతలో దుశ్శకునాలు కనిపిస్తాయి, అయినా బెదురుపాటు, భయమూ లేకుండా అతను యుద్ధభూమిలోకి చొరబడతాడు, కాస్సేపు భయంకరంగా యుద్ధం చేస్తాడు. ఇంతలో ఎవరో ఒక వానర యోధుడు కొండచరియతోనో, పరిఘతోనో, అతనిని కొట్టి చంపేస్తాడు. తర్వాతి సర్గలో మరో రాక్షసుడు, అచ్చం అలాగే వస్తాడు, అచ్చం అలానే చస్తాడు. ఇదే కథ పేర్లు మారుతూ ఎన్నోసార్లు వస్తుంది. పుస్తకం పట్టుకుని చదివితే చాలా విసుగు పుట్టించేదిగా ఉండే కథన పద్ధతి ఇది. అదే ఎవరైనా ఇదే కథని పదిహేను రాత్రులు చెప్పారనుకోండి, కథ చివరకి వచ్చేసరికీ, శ్రోతలు ఆ యుద్ధాన్ని తమ మనోఫలకంమీద చిత్రించుకుని, ఆ యుద్ధం తీవ్రతకి లొంగిపోయి, రావణుడు యుద్ధభూమిలోకి వచ్చే సమయానికి, ఆ యుద్ధభూమికి తనుకూడా రవాణా అయిపోతాడు. రామ-రావణుల యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసులు, వానరులు, ఆకాశంలో సిద్ధులూ, దేవతలూ అందరూ నిలుచుని చూస్తూ ఉండిపోయారు, వాళ్ళందరితో పాటూ వింటున్న పాఠకుడు కూడా ఒకడు. ఎన్నో రోజులపాటు ముక్కలు ముక్కలుగా చెప్పుకునే కథలకి ఇటువంటి కథనరీతి అవసరం. ఈరకమైన Narrative Re-inforcement వాక్‌సాహిత్యంలో ప్రధానమైన కథన సామగ్రి.

ప్రాచీన కావ్యాలని రాసిన తీరు గమనిస్తే, వాటిల్లో ఎక్కడా వాక్యాలని పదాలుగా విడగొట్టడం, వాక్యాల చివర్లో విరామ చిహ్నాలు పెట్టడం, పదాల మధ్య చదువుకోడానికి వీలుగా కామాలు పెట్టడం ఉండేది కాదు. శబ్దానికి అలవాటుపడ్డ చెవులు శబ్దాన్ని వాక్యాలుగా, పదాలుగా విడగొడుతూ ఉండేవి, చదివేవారికి ఆ పుస్తకాలని ఎలాగ చదవాలో ముందే తెలిసేది కాబట్టి, అర్థవంతంగా పదాలని విడగొడుతూ చదివేవారు. ఈనాటికీ పారాయణ పుస్తకాలు ఇలానే ఉంటాయి, ప్రతిరోజూ పారాయణ చేసిన కన్ను శ్లోకాన్ని చదువుకుంటూ పోతుంది, చెవి అర్థాన్ని గ్రహిస్తుంది.

ఇక పాశ్చాత్య సంస్కృతి విషయానికి వస్తే, వారికి మౌనపఠనం మనకంటే చాలా ముందు నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది. మౌనపఠనం గురించిన మొదటి ఆధారం మనకి సెయింట్ అగస్టీన్ రచనలలో కనిపిస్తుంది. రోములో తను చెప్పే పాఠాలు నేర్చుకునేవారే కానీ, తన కష్టానికి డబ్బులిచ్చేవారు లేరని తెలుసుకుని, క్రీ .శ. 383 నాటికి మిలన్‌కి తన నివాసం మార్చుకున్నాడు అగస్టీన్. అదే సమయంలో, అక్కడ సెయింట్ అంబ్రోస్ బిషప్‌గా ఉండేవాడు. ఒంటరితనంవల్లో, కాకపోతే తన తల్లి ప్రత్యేకంగా అంబ్రోస్ గురించి చెప్పడంవల్లో, ఆయన్ని కలవడానికి వెళ్ళాడు అగస్టీన్. ఆయన వెళ్ళేటప్పటికి అంబ్రోస్ తన గదిలో ఒంటరిగా ఏదో పుస్తకంలో మునిగిపోయున్నాడు. ఆ సన్నివేశాన్ని అగస్టీన్ ఎంతో ఆశ్చర్యంగా ఇలా వర్ణిస్తాడు: “ఆయన చదువుతున్నప్పుడు కళ్ళు పుస్తకం వెంట పరుగులు తీస్తుండేవి. ఏకాగ్రచిత్తంతో అర్థాన్ని గ్రహించడంలో హృదయం నిమగ్నమై ఉండేది. నాలుక మాత్రం నిశ్చలంగానే ఉండేది. ఆయన బయటికి చదివేవాడు కాదు.” ఈ రోజుల్లో ఇటువంటి దృశ్యం మనకి సర్వసాధారణం, కాని అగస్టీన్ రోజుల్లో, అది ప్రత్యేకంగా, ఆశ్చర్యం గొలిపించే దృశ్యం. అగస్టీన్ వర్ణనే, పాశ్చాత్య చరిత్రలోనమోదైన మౌనపఠనం యొక్క మొదటి నిదర్శనం.

అంతకు మునుపు కొన్ని వర్ణనలు ఉన్నా అవేవీ కచ్చితమైనవి కావు. క్రీ.పూ. ఐదో శతాబ్దికి చెందిన రెండు నాటకాలలోని పాత్రలు మౌనంగా పుస్తకం చదువుతున్న సన్నివేశాలు ఉన్నాయి. హిప్నోలైటిస్ అనే నాటకంలో, థెసూస్ చనిపోయిన తన భార్య చేతిలో ఉన్న ఉత్తరాన్ని నిశ్శబ్దంగా చదువుతాడు. ది నైట్స్ అన్న నాటకంలో గణాచారి పంపిన ఒక పలకపై ఉన్న సందేశాన్ని మౌనంగా చదివి, నిశ్చేష్టుడవుతాడు డెమొస్తనీస్. మౌనపఠనం గురించిన మరొక కథనం ప్లూటార్క్ రచనల్లో కనిపిస్తుంది. అలెగ్జాండర్, తల్లి పంపిన ఉత్తరాన్ని మౌనంగా చదువుకుంటుంటే, చూసిన సైనికులు, ఆశ్చర్య చకితులయారట. రెండో శతాబ్దంలో క్లాడియస్ టాలమి, ఆన్ ది క్రైటీరియన్ అనే పుస్తకంలో “కొంతమంది ఏకాగ్రతగా, మనసు పుస్తకంపై లగ్నం చెయ్యడం కోసం మౌనంగా చదువుతారు, ఎందుకంటే బయటికి వినిపించే గొంతు ఆలోచనలని కేంద్రీకృతం చెయ్యనివ్వదు” అంటాడు. ఇటువంటి కొన్ని చెదురు మదురు వర్ణనలు తప్పించి, బిగ్గరగా చదవటమే ఆనాటి కాలంలో రివాజు.

మనకి ఇప్పుడు ఎంతో అలవాటైపోయిన విరామ చిహ్నాలు, కళ్ళకి భాషని గుర్తుపట్టే ప్రక్రియలో ఉపకరణాలుగా అభివృద్ధిచెందాయి. క్రీ.పూ 200 బైజాంటియన్ కి చెందిన అరిస్టొఫనీస్ మొదటిసారిగా విరామచిహ్నాలు ప్రవేశపెట్టాడంటారు. ఏడో శతాబ్దంనాటికి బిందువులు, చిన్నగీతలు, సెమికోలను, కామాలు వచ్చాయి. విరామచిహ్నాల వాడకం పరిశీలిస్తే, “వాచకం” నుంచి “పఠనం” దిశగా చదవడం మారడాన్ని గుర్తించవచ్చు. మౌఖికత్వంనుంచీ, లిఖిత పరమైన సమాచార వ్యవస్థవైపు సమాజం మొగ్గుచూపడంకూడా ఇందులో భాగమే.

తొమ్మిదో శతాబ్దంనాటికి, ఐర్లండుకి చెందిన లేఖకులు భాషని కళ్ళతో చదువుకోడానికి అనువైన ఉపకరణాలని, నియమాలని అబివృద్ధి చేశారు. సుమారుగా ఆకాలంలోనే, క్రైస్తవ సంఘారామాల్లో పైకి చదవరాదని, మౌనంగా మనసులోనే చదువుకోవాలనే నియమం వచ్చింది. అదెంతవరకూ పోయిందంటే, లేఖనశాలలో పనిచేసే సన్యాసి కొత్తపుస్తకం కావాల్సివచ్చినా, సిరాకానీ, కలంగానీ, కాగితాలుకానీ కావాల్సి వచ్చినా అక్కడి అధికారిని మౌనంగా సంజ్ఞలతోనే అడిగేవాడు.

***

లిఖిత సంప్రదాయంలో కథనరీతి ఎలా ఉంటుందంటే, కథని ఎవరికి వారే చదువుకోవాలి. ప్రతి వాక్యమూ, ప్రతి పదమూ చదువుకుంటూ, ఆ వాక్యాలు మనల్ని పుస్తకంలోకి లాగేసుకుని, బాహ్యప్రపంచంనుంచీ మనల్ని వేరుచెయ్యగలగాలి. ఒకవేళ ఎవరైనా ఆ కథని చెప్పాలంటే, దాని లోతుపాతులని విశ్లేషించగలగాలి, సమీక్షించగలగాలి, బోధపరచగలగాలే తప్ప, కథని అనుభవించగలగడం మాత్రం ఆ కథని ఎవరంతట వారు చదివితేనే లభిస్తుంది తప్పించి ఎవరో చెబితే లభించదు. రచయితకీ, పాఠకుడికీ మధ్య అనుసంధానం పుస్తకమనే వస్తువే తప్పించి, వేరే కథకుడికి ఇందులో భాగంలేదు. ఈ రకంగా కథకుడనే రెండో రచయిత అవసరం పోయి, చదవడం ఆంతరంగికమైన, ఏకాంతమైన వ్యవహారంగా మారింది.

తెలుగు సాహిత్యంలోకూడా ఈ మార్పు – పౌరాణిక కవులనుంచీ ప్రబంధకవుల సాహిత్యంలో గమనించవచ్చు. వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్‌మాన్ మనుచరిత్ర ఆంగ్లానువాదానికి రాసిన ముందుమాటలో తెలుగు సాహిత్యం పెద్దన మనుచరిత్రతో స్పష్టంగా లిఖిత సాహిత్యంగా మారిందని అంటారు.

వారి మాటల్లోనే:
“పెద్దన కవిత్వంలో లిఖితాత్మకత (written-ness) ఉంది. ప్రతి అక్షరాన్ని, పదాన్ని, పద్యాన్ని, వచనాన్ని ఆయన ఒక శిల్పిలా సానబెడతాడు. ఒక్కో అక్షరాన్ని ఎంతో శ్రద్ధగా పద్యంలో పొదుగుతాడు. పెద్దన కావ్యం పదిమంది కలిసి చదివేది కాదు. అంతమాత్రం చేత ఆయన పద్యం కేవలం చూపులతో చదివేసి అర్థాన్ని మాత్రం గ్రహించవలసిన వచన వ్యవహారం కాదు, ఆ పద్యంలోని సంగీతాన్ని వినాలి, కాని ఆ వినడం ఇప్పుడు ఒక ఏకాంత పాఠకుడు తనకోసం చదువుకోవడంలో ఉంది. కవిత్వం పెద్దన దగ్గరనుంచీ, వ్యక్తిగతమైన, ఏకాంతమైన వ్యవహారం అయిపోయింది. ఇప్పుడిక పుస్తకాన్ని తనకోసమే చదువుతాడు పాఠకుడు. ఇక్కడ నుంచీ అందరికీ చదివి వినిపించి, కథని తన చాతుర్యంతో రక్తి కట్టించే కథకుడనే రెండో రచయిత అవసరం పోయింది. పెద్దన దగ్గరనుంచీ వచ్చిన తెలుగు కావ్యాలు, ప్రదర్శనకోసం కల్పించబడిన దృశ్య, శ్రవ్య కావ్యాలు కావు, వాటిని మనం “పాఠ్య” కావ్యాలు అనవచ్చు. ఇటువంటి సాహిత్యాన్ని అనుభవించడానికి ఎంతో తీరుబడి కావాలి”.

***

మౌఖిక సంప్రదాయంలో గాయకులు, పౌరాణికులు, ఆశుకవులు, కథకులు మొదలైన వారే ప్రధానంగా సాహిత్యాన్ని భద్రపరచి, దానిని సమాజంలోకి తీసుకుని వెళ్ళే పాత్రధారులు. అందుకనే మౌఖిక సమాజాల్లో జ్ఞాపకశక్తికి ప్రముఖమైన స్థానం ఉంది. గ్రహణ ధారణ పటుత్వ శక్తి అంటే ఒకసారి విన్నదాన్ని గ్రహించి, దాన్ని యథాతథంగా జ్ఞాపకం పెట్టుకుని, ఎంతకాలమైనా మరచిపోకుండా ఉండగలగే శక్తి. అందుకనే అవధానాలు, ఆశువుగా పద్యాలు అల్లడం, అమరకోశం వంటి నిఘంటువులని మొత్తంగా కంఠోపాఠంగా గుర్తుపెట్టుకోవడం, కొన్ని వందల, వేల శ్లోకాలని పొల్లుపోకుండా అప్పచెప్పడం – ఇవన్నీ మౌఖిక సంప్రదాయంలో పండితులు ప్రయత్నపూర్వకంగా అభ్యసించి నేర్చుకునే విద్యలో భాగం. అలాగే వేద వాఙ్మయం శబ్ధ ప్రధానమైనది, అందుకని దాన్ని ఒక శబ్ధగ్రంథంగా భద్రపరచడానికి వేదపండితులు ఎన్నో సాధనాలు కనిపెట్టారు.

వేద పండితుల, ఆశుకవుల జ్ఞాపక శక్తి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే, ఇటువంటి సంప్రదాయం అన్ని సంస్కృతులలోనూ ఉంది. గ్రీకు, లాటిన్ సంస్కృతులలో, ఆనాటి “ఆరేటర్స్”కి ఎంతటి క్లిష్టమైన, పొడుగాటి పాఠాన్నైనా పొల్లుపోకుండా జ్ఞాపకం పెట్టుకోడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. వారికి ఈ సంప్రదాయం పదిహేనో శతాబ్దందాకా ఉండేది – జియార్డానో బ్రూనో చేసిన “మెమిరీ-ఫీట్స్” గురించి అద్భుతమైన కథనాలు ఉన్నాయి. లిఖిత సంప్రదాయంలో జ్ఞాపకశక్తి కంటే మేధస్సుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

లిఖిత సంప్రదాయంలో ఏ రచననైనా ‘పుస్తకం’ అనే వస్తురూపంలోనే పదిలపరచబడుతుంది. అదొక వస్తువు కాబట్టి దానికో మార్కెట్ విలువ ఉంటుంది, దాన్ని శ్రద్ధగా, పనివాడితనంతో తయారుచెయ్యాలి, దానికి ఎంతో ఖర్చు అవుతుంది, అందులో లాభ నష్టాలు ఉంటాయి. మౌఖిక సంప్రదాయంలో అంతర్భాగమైన కథకుడి పాత్ర పోయి, రచనని ఏకాంత వ్యవహారంగా మార్చే ఈ ప్రయత్నంలో ఎడిటర్లు, టైపోగ్రాఫర్లు, బుక్-డిజైనర్లు మొదలైన కొత్త పాత్రలు వచ్చాయి. ఈ హంగులన్నిటితో, ఒకనాడు పదిమంది కలిసి పైకి చదువుకునే ఒక సాంఘిక ప్రక్రియ, కాలక్రమంలో వ్యక్తిగతమూ, మానసికమూ, ఏకాంతమూ అయ్యింది. పుస్తకానికి చదువరికి మధ్య “మూడోకంటికి” తెలియని అనుబంధం మౌనపఠనం సాహిత్య చరిత్రలో తెచ్చిన ఒక పెద్ద విప్లవం.

*** * ***

[ఐదేళ్ళ క్రితం యథాలాపంగా గూగుల్ ఛాట్లో పరుచూరి శ్రీనివాస్ గారితో ఏదో మాటల్లో కాలిగ్రఫీ గురించి చర్చ వచ్చింది, అది అక్కడనుండి పుస్తక చరిత్రని అధ్యయనం చెయ్యడంగా మారింది. ఇప్పుడు, వెల్చేరు నారాయణరావుగారు, పరుచూరి శ్రీనివాస్, నేను కలిసి భారత సంస్కృతిలో రాత మూలకంగా వచ్చిన సామాజిక, సాంస్కృతిక మార్పులని అధ్యయనం చేసి, కొన్ని వ్యాసాలు రాస్తున్నాం. అందులో భాగంగా, కొన్నాళ్ళ క్రితం సైలెంట్ రీడింగ్ మీద రాసుకున్న నోట్సులోంచి కొంతభాగమే ఈ సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని సమీక్షించిన శ్రీనివాస్ గారికి, ప్రూఫు రీడింగులో ఎంతో సాయం చేసిన త్రివిక్రమ్ గారికి నా ధన్యవాదాలు - రచయిత]