ప్రత్యేకం

మన కథన సంస్కృతులకొక కొత్త వ్యాకరణం

జూలై 2016

యట ప్రపంచానికి సంబంధించినంత వరకూ, భారత సంస్కృతిలో మతం ఉంది, ఫిలాసఫీ ఉంది, ఆంత్రపాలజీ ఉంది, భాషాశాస్త్రం ఉంది, ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి – కానీ, మనకి గొప్ప సాహిత్యం లేదు. కొద్దో గొప్పో ఉన్నా అదంతా సంస్కృతంలోనే ఉంది. ముఖ్యంగా, మనకి “ఇంటలెక్చువల్” సంప్రదాయం అనేది ఏదీ చెప్పుకోదగ్గదిగా అభివృద్ధి చెందలేదు.

ఇకపోతే, తెలుగులో, ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన విమర్శలూ, అధ్యయనాలు మూడు రకాలుగా కనిపిస్తాయి. సంప్రదాయ తెలుగుపండితులు మన పాత సాహిత్యం ఎంత గొప్పదో పేజీల కొద్దీ పొగుడుతూ వ్యాసాలు రాస్తారు. ఆ సంప్రదాయం మీద మనకి అప్పటికే ఇష్టం ఉంటే ఈ వ్యాఖ్యానాలు నచ్చుతాయి. కానీ, ఈ కవిత్వ సంప్రదాయంతో ఏ సంబంధమూ లేని బయట వ్యక్తిని అవి నమ్మించి, ఒప్పించలేవు.

అకడెమిక్ రచనలూ, పరిశోధనా వ్యాసాలూ రెండో రకం. వీటిల్లో సాధారణంగా కనిపించే ప్రశ్నలు – ఫలనాకవి ఏకాలం నాటివాడు, ఫలానా కావ్యానికి కర్త ఎవరు, ఫలానా పద్యం ఏ కవిదీ, లేదా ఏ కావ్యం లోనిది, కావ్యాలలో ప్రక్షిప్తాలు ఏవి, అసలు మూల కావ్యంలో పద్యాలు ఏవి? ఇలాంటి ప్రశ్నలే ఎక్కువ కనిపిస్తాయి.

మూడోరకం వాదన ప్రకారం ఈ సాహిత్యం అంతా శుద్ధ దండగ – అందులో శృంగార వర్ణనలూ, పొడుగాటి సమాసాలు, ప్రాసలూ అలంకారలతో రకరకాలుగా చేసే పాండిత్య విన్యాసాలూ తప్పించి ఇంకేం లేదు. ఎవరో రాజుల ప్రాపకంకోసం బ్రాహ్మణ పండితులు రాసిన ఎందుకూ పనికిరాని, ఏ సాహిత్య విలువలూ లేని తాటాకు మంటలవి.

వెల్చేరు నారాయణరావుగారిని కలిసే వరకూ, నా అభిప్రాయాలు కూడా సుమారుగా ఇలానే ఉండేవి.

ఓ వేసవి మధ్యాహ్నం హైదరాబాదులో మొదటిసారి నారాయణరావుగారిని కలవడం ఇప్పటికీ గుర్తే -. పరుచూరి శ్రీనివాస్ పరిచయం చేసారు. ఆయన్ని కలిసిన మొదటి పావుగంటలోనే, తెలుగు సాహిత్యం గురించీ, సాంస్కృతిక చరిత్ర గురించీ నాకున్న అభిప్రాయాలన్నీ ఎందుకూ కొరగానివని తెలిసొచ్చింది.

***

వెయ్యేళ్ల తెలుగుసాహిత్యాన్నిఆసాంతమూ చదివి, దానిమీద అధికారం సాధించడం సామాన్యమైన విషయమేమీ కాదు. నారాయణరావుగారి విశిష్టత అక్కడతో ఆగిపోదు, తను చదివిన సాహిత్యాన్ని గురించి ఆయన గొప్పగా, ఇష్టంగా మాట్లాడగలరు, ఇంతకుముందు ఎవరూ చూడని కొత్త దారుల్లో వ్యాఖ్యానించగలరు. మనం పాతసాహిత్యాన్ని కొత్తగా ఎందుకు చదవాలి, మన సాహిత్యాన్ని ప్రపంచానికి ఎందుకు పరిచయం చెయ్యాలీ అనే విషయంలో ఆయన ఆలోచనలు విశాలమైనవీ, హృదయమున్నవీనూ.

ఆయన అడిగే ప్రశ్నలు గమ్మత్తుగా ఉంటాయి, కొత్తగా, తాజాగా ఉంటాయి, మూలాల్ని కదిల్చేవిగా ఉంటాయి, ఒక్కోసారి గాభరాపెట్టేవిగా, కలవర పెట్టేవిగా, కొంతమందికి కోపం తెప్పించేవిగానూ ఉంటాయి. నారాయణరావుగారి భాషలో ప్రశ్న అంటే అన్వేషణ. ఈ అన్వేషణ ద్వారా నన్నయ్య కాలంనుంచీ నాయకరాజుల కాలంవరకూ జరిగిన సాంస్కృతిక, సామాజిక మార్పులని అటు పాశ్చాత్య చారిత్రక అధ్యయనాలకీ, ఇటు భారతీయ అధ్యయనాలకీ భిన్నంగా ఒక కొత్త తరహాలో వ్యాఖ్యానించారు.

ఆయనా, డేవిడ్ షూల్మన్ కలిసి ఎన్నో తెలుగు కావ్యాలని ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ అనువాదాలకి, వాళ్లు పొడుగాటి ముందుమాటలు/వెనుకమాటలు రాశారు. ఆధునిక పాఠకుడు ఆ కావ్యాన్ని ఎలా చదవాలో, ఎందుకు చదవాలో వివరించే వ్యాఖ్యానాలు అవి.

మనుచరిత్ర అనువాదానికి ముందుమాట చదవకపూర్వం, నాకు మనుచరిత్ర అంటే “అటజని కాంచె భూమిసురుడు..”, “ఇంతలు కన్నులుండ..” లాంటి కొన్ని పద్యాలు, ప్రబంధ నాయికల అంగాంగ వర్ణనలూనూ. మనుచరిత్ర ఎందుకు ప్రపంచ సాహిత్యంలో గొప్పదిగా పరిగణించాల్సిన రచనో, పెద్దన ఎందుకు “ఆంధ్ర కవితా పితామహుడు” అయ్యాడో తన ముందుమాటలో నారాయణరావు, షూల్మన్లు వివరంగా చెప్తారు. శ్రీనాథుడి మీద రాసిన పుస్తకంలో శ్రీనాథుడు ఎందుకు గొప్పకవో, ఆయన తన కవిత్వంలో చేసిన కొత్త ప్రయోగాలు ఏమిటో, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూసాడో, శ్రీనాథుడు ప్రపంచ సాహిత్యంలో ఎన్నదగిన కవుల జాబితాలో ఎందుకుండాలో అంతే బలంగానూ వివరిస్తారు.

ఈ ముందుమాటలు చదివితే, తెలుగులో ఇంత గొప్ప సాహిత్యం ఉందా అని గర్వంగానూ, ఇంత గొప్ప సాహిత్య సంపద మనం పట్టించుకోకుండా వదిలేసామా అని చాలా బాధగానూ అనిపిస్తుంది.

***

నారాయణరావుగారు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడంతో ఆగిపోలేదు – మన సంస్కృతినీ, చరిత్రనీ అధ్యయనం చేసే పద్దతులలో మౌలికమైన మార్పు రావాలని వాదిస్తారు. భారతీయులకి చరిత్ర రచన లేదనే వాదనని ఆయన ఒప్పుకోరు. రినసాన్సు తర్వాతే యూరోపులోనూ, అసలు ప్రపంచం అంతా ఆధునికత ప్రారంభం అయిందని దాదాపుగా అందరూ ఒప్పుకున్న మాట.దానికి భిన్నంగా నారాయణరావు మనదైన ఒక ఆధునికత పదిహేనో శతాబ్దం నుంచే ఉండేదనీ, అది వలసపాలనలో కొట్టుకునిపోయిందనీ బలంగా వాదించారు. పాశ్చాత్య చరిత్రని అధ్యయనం చేసే పద్ధతులతో, అ ఫిల్టర్లతో మన సంస్కృతిని అధ్యయనం చెయ్యడం వల్ల ప్రయోజనం లేదనేది భారత సాంస్కృతిక చరిత్ర అధ్యయనాలలో నారాయణరావు తెచ్చిన పెద్ద మార్పు. మౌఖిక సమాజాల సాహిత్య సంస్కృతి వేరుగా ఉంటుందని ఆయన ఎన్నో వ్యాసాలలో చూపించారు.

ఈ వ్యాసాలలో కొన్ని, Text and Tradition in South India అని ఈ మధ్యనే ఒక సంకలనంగా వచ్చాయి. ఈ పుస్తకంలో మొత్తం పదిహేను వ్యాసాలున్నాయి. ఒక్కోవ్యాసం ముప్పై, నలభై పేజీలదాకా ఉంటుంది. ఈ వ్యాసాలలో – పురాణాలు, భారత సంస్కృతిలో కావ్యానికీ కవికీ ఉన్న సంబంధం, అచ్చుయంత్రం తెచ్చిన మార్పులూ, మౌఖిక సంప్రదాయంలో రచనలని చదివే పద్ధతులూ, వలసపాలనకి పూర్వం ఈ సంస్కృతిలో “నీతి” అనే భావన ఎలా ఉండేది, మొదలైన సాంస్కృతిక చరిత్రకి సంబంధించిన విశ్లేషణలూ, వ్యాఖ్యానాలూ ఎన్నో ఉన్నాయి. ఈ వ్యాసాలలో ప్రతీదీ ఒక కొత్త వ్యాఖ్యానం, ఒక మౌలికమైన ప్రతిపాదన, మన సంస్కృతిని కొత్తగా అర్థం చేసుకోవడానికి, ఇప్పటి సంఘర్షణలకి మూలాలు కొత్తగా వెతకడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.

ఈ వ్యాసాలన్నీటినీ మొత్తంగా కలిపి చూస్తే నారాయణరావుగారి ఆలోచనా పరిధి ఎంత విశాలమైనదో తెలుస్తుంది. ఇంత విస్తృతమైన వ్యాసాలన్నిటినీ ఒక్క వ్యాసంలో సమీక్షించడం అసంభవం.

ఈ పుస్తకంలో రామాయణ సంప్రదాయం మీదే ఐదు వ్యాసాలున్నాయి. రామాయణం అంటే నాకున్న ప్రత్యేకమైన ఆసక్తి కారణంగానూ, ఆ కథ అందరికీ తెలిసిందే కావడంతోనూ, నారాయణరావుగారి వ్యాఖ్యానంలోని కొత్తదనాన్ని పరిచయం చెయ్యడం సులువు అవుతందనీనూ, ఈ వ్యాసాల ఆధారంగా నా ఆలోచనలు కూడా పంచుకోడానికి కుదురుతుంది కాబట్టి, వీటినుంచీ రెండిటిని ఎన్నుకున్నాను.

“When Does Sita Cease to be a Sita – Notes towards a cultural grammar of Indian Narratives”, “The politics of Telugu Ramayanas – Colonialism, print cultures and literary movements”, అనే రెండు వ్యాసాలు ఈ సంకలనంలో రామాయణ సంస్కృతి మీద వచ్చిన ముఖ్యమైన వ్యాసాలు. ఈ వ్యాసాలలో, నారాయణరావుగారు మన సాంస్కతిక చరిత్రని అర్ఠం చేసుకోడానికి ఒక కొత్త ‘వ్యాకరణాన్ని’ సూచన ప్రాయంగా ప్రతిపాదించారు. అందుకని, ఈ రెండు వ్యాసాలని మాత్రం ఇక్కడ విపులంగా పరిచయం చేస్తాను.

***

“మానవ జాతికి ధర్మాలు, అధర్మాలు నేర్పించి నాగరకత పెంపొందించేది రామాయణం, మానవ సంఘం మళ్లీ జంతుత్వంలోకి జారిపోకుండా కాపాడేది రామాయణం” అంటూ లవకుశ సినిమాలో వాల్మీకి పాత్రధారి నాగయ్య కుశలవులతో అంటాడు.

ఒక కవిచేతే తన రచన గురించి ఇంత ఆర్భాటంగా చెప్పించడంలోని ఔచిత్యం మాట ఎలా ఉన్నా, సుమారుగా మనకి తెలుగులో రామాయణం మీద వచ్చిన రచనలూ, విమర్శలూ, చర్చలూ, ప్రవచనాలూ ఈ దిశగానే ఉంటాయి. కల్పవృక్షాలు, విషవృక్షాలూ, ఈ మధ్య టి.వి. చానెళ్లలో నిరంతరాయంగా వినవచ్చే ప్రవచానాలు మొదలైనవి రామాయణం కథని రకరకాలుగా విశ్లేషించడమో, అందులోని భక్తినీ, రక్తినీ, ఆధ్యాత్మికతనీ, ఆ కావ్యంలోని సామాజిక, సాంస్కృతిక విలువలనీ, ఇంకా ఈ మధ్య “మేనేజ్మెంట్ టెక్నిక్కు”లనీ, గోరంత కొండంతలుగా చేసి చెప్పుకొంటూ, ఆ కథని ఆకాశానికెత్తడమో లేదా పాతాళనికి తొక్కడమో చేస్తుంటాయి.

కానీ, రామాయణంతో మన సమాజానికీ సంస్కృతికీ ఉన్న సంబంధం ఎప్పుడూ ఇలానే ఉండేదా? రామాయణం అనాదిగా ఒక భక్తి కావ్యంగా, రాముడు ఒక సూపర్-హీరోగా, సీతారాములు ఆదర్శదంపతులుగా, రామరాజ్యం ఒక ఆదర్శరాజ్యానికి నమూనాగానే పరిగణించబడిందా? రామాలయాలు వీధివీధికి ఎప్పుడూ ఉండేవా? రామాయణ పారాయణలు ఇంతజోరుగానే ఎప్పుడూ జరిగేవా? రామకోటులు ఇప్పటిలాగనే ప్రజలు ఎప్పుడూ రాస్తుండేవారా? ఇంకా ముఖ్యంగా, రామాయణానికీ భారతావనిలో రాజకీయాలకీ ఎటువంటి సంబంధం ఉండేది? రాజులు రామాయణాన్నీ, రాముడిని తలకెత్తుకునేవారా, రామాయణం ఒక “పొలిటికల్-రచన”గా భావించేవారా, సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలకి ఆ కథలో సమాధానాలు వెతుక్కునేవారా?

భారత సంస్కృతి చాలా విస్తృతమైనది – ఇందులో ఎన్నో సమాజాలు ఉన్నాయి – అన్ని రకాల సామాజిక తరగతులకీ, ముఖ్యంగా స్త్రీలకీ రామాయణంతో సంబంధం ఒకేలా ఉండేదా? కాలక్రమంలో రామాయణంతో మన సంస్కృతికున్న సంబంధంలో ఏవైనా మార్పులు వచ్చాయా? కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కథని, ఈ సంస్కృతి సజీవంగా ఎలా ఉంచుకుంది? ఆ కథతో మనుకున్న అనుబంధం ఎటువంటిది?

మౌలికంగా, రామాయణం చుట్టూ ఉన్న కథన సంస్కృతుల (Narrative Cultures) తాలుకూ చరిత్ర ఏమిటి?

రామాయణ కథనాలు మనకి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఎన్నో కథనాలు మనం ఇప్పుడు వాల్మీకంగా చెప్పుకుంటున్న ఒక నమూనాలో ఏ విధంగానూ పట్టవు. కానీ, వాల్మీకంలోని నమూనా సుమారుగా ప్రసిద్ది చెందిన అన్ని రామాయణాల కథనాలకి స్థిరపడిపోయింది.

వాల్మీకి పేర వున్న రామాయణం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే కొత్త విలువల్ని, వాటికి కావలసిన సాంఘిక సంస్థల్ని, ఉత్తమ ప్రవర్తనకి కొత్త దిశానిర్దేశాన్ని చెయ్యగలిగిన ఒక చారిత్రక గాథ అని. రామాయణం పరిష్కరించ జూసే అంతర్గత సమస్య రాచరికమే! అంటే, రాచరికం, రాజ్య పాలన, అధికార వినియోగం, వంశ పారంపర్యం, ఒక కుటుంబంలో అది సంక్రమించటంలో ఉన్న సాధకబాధకాలు, వీటి స్వరూప స్వభావాలు. రామాయణం ఈ విషయంలో దిశానిర్దేశం చేస్తుంది – రాజు ఏకపత్నీవ్రతుడు కావాలి, తండ్రిమాటకి కట్టుబడాలి, పెద్దకొడుకే పట్టాభిషిక్తుడు కావాలి, పట్టాభిషిక్తుడైన రాజుని సోదరులందరూ, జ్ఞాతి భావం వదిలి, ఆయన్ని తండ్రిలా భావించాలి. ఇదీ రామాయణం రాచరిక సమస్యలకి చూపిన పరిష్కారం.

కానీ ఎందుకో మన రాజులెవరూ ఈ సూత్రీకరణని అంతగా పట్టించుకోలేదు. ఎందరో రాజులు ( ప్రవరశేనుడు, యశోవర్మ, భీమటుడు,భోజుడు ) రామాయణాన్ని నాటకాలగానో, మరో సాహిత్య రూపకంగానో రచించారు. అయితే వీరంతా కవులూ సాహిత్యపోషకులే కానీ రామాయణంతో వీరికి రాజకీయ సంబంధం ఏమీ లేదు.

సాంస్కృతికంగానూ, సాహిత్యపరంగానూ రామాయణం మన దేశ కవులని ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంది. భాసుడు, కాళిదాసు, కుమారదాసుడు,భవభూతి, భట్టి, మురారి,రాజశేఖరుడు మొదలైన ఎందరో కవులు రామాయణాన్ని ఎన్నోవిధాల తిరిగి రాసారు. సంస్కృత సాహిత్యంలోనూ, ప్రాకృతంలోనూ, ఇతర దేశభాషలలోనూ రామాయణం కేవలం ఒక కావ్యం కాదు – అదొక విశాలమైన సాహిత్య సంప్రదాయం.

అయితే, పన్నెండో శతాబ్దానికి ముందు రామాయణం సాహిత్యంగానే ఉండేది కానీ, దాన్నొక భక్తి గ్రంథంగా, రాముడిని అవతార పురుషుడిగా, రామాయణం సర్వ ధర్మాలనీ బోధించే ధార్మిక గ్రంథంగా ఆకాలం నాటి సంస్కృతి పరిగణించలేదు. అప్పటివరకూ రాముడికి భారతదేశంలో రాజకీయాలతోనూ పెద్దగా సంబంధం ఉండేదీ కాదు, రాముడికి చెప్పుకోదగ్గ ఆలయాలుకానీ, రాముడి పేరుతో శాసనాలు కానీ అప్పట్లో లేవు. ఎంతోమంది నాయకులలో ఆయన కూడా ఒకడు.

పన్నెండో శతాబ్దం నుండీ రామాయణానికీ, భారతావనిలో రాజకీయాలకి అంతకుముందెన్నడూ లేనీ సంబంధం వచ్చింది – ముఖ్యంగా, పడమర రాజాస్థాన్, గుజరాత్ లలోనూ, మధ్య ప్రాంతాలలోనూ మధ్య ప్రాచ్యదేశాలనుంచీ వచ్చిన మత, సాంస్కృతిక, రాజకీయమైన తాకిడి రామాయణానికి ఒక కొత్త రాజకీయ వ్యాకరణాన్ని తయారుచేసింది.

రామాయణ సంప్రదాయ చరిత్రలో ఇది చాలా పెద్ద మార్పు. దీనికి కారణం, ఈ కాలంలో, భారతావనిలోకి ముస్లిమ్ దండయాత్రలు ఎక్కువ అవడం, ముందు దండయాత్రలుగా ఉన్నా, అతి కొద్దికాలంలోనే ఒక కొత్త సంస్కృతి ఇక్కడ పాతుకోవడం, అది అధికారంలోకి రావడం, రామాయణానికి ఒక రాజకీయమైన అవసరాన్ని కలిగేలా చేసింది.

ఒకపక్క రామరాజ్యం లాంటి దైవికంగా శక్తివంతమైన రాజకీయ శక్తిని కల్పించడానికీ, అలా కల్పించిన కథనాన్ని ఒక చారిత్రక, ఐతిహాసిక నేపధ్యంతో జోడించి ప్రజలని ఒప్పించడానికీ, ఒక భిన్న సంస్కృతిని శత్రువుగా, రాక్షసంగా చూపించడానికీ రామాయణ కథనంలో పుష్కలమైన, శక్తివంతమైన కథనసామగ్రి ఉంది. “వాళ్లు వేరు, మన ఆడవాళ్లని ఎత్తుకుపోతారు, మన మాన ప్రాణాలని దొంగలిస్తారు, మన సంస్కృతినీ, మన ఆచారాలనీ హేళన చేస్తారు” అంటూ మనదికాని దానిని వేరుచెయ్యడానికి (Othering) రామాయణ కథనం అవకాశం కల్పిస్తుంది, అందులోంచే రాముడు, నిశాచర వినాశకరుడైన వీరపురుషుడిగా – ఒక బలమైన రాజుకి నమూనాగా మారతాడు.

రాజుకి “విష్ణ్వంశ” పోయి, రాజే విష్ణువుగా, రాజే రాముడిగా, రాజే దేవుడిగా మారడం, రామాయణం చుట్టూ ఒక భక్తి సంప్రదాయం ఏర్పడడం అనే రెండు ముఖ్యమైన పరిణామాలు ఈక్రమంలో చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగానే, రాముడికి పెద్ద దేవాలయాలు వచ్చాయి. విజయనగరంలో హజార రామ దేవాలయం, యాదవరాజు రామచంద్రుడు కట్టించిన రామ్-టెక్ ప్రాంగణంలోని రామాలయం, సుమారుగా కాకతీయుల కాలంనుంచీ ఉంటూ తాన్సేను కాలంలో ప్రాముఖ్యంలోకి వచ్చిన భద్రాద్రి రామాలయం ప్రముఖమైనవి.

రామాయణం చుట్టూ భక్తి సంప్రదాయం ఏర్పడే క్రమంలోనే, రామనవమి పండగలు జరుపుకోవడం మొదలయ్యింది. అంటే, రామాయణం సాహిత్య కథనం నుంచీ, రాజకీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుని, ఆపైన భక్తిగ్రంథంగా, దాని చుట్టూ ఆధ్యాత్మికమైన వాతావరణం ఈ కాలంలోనే వచ్చింది. రామాయణం భక్తిగ్రంథం అయాక, రామాయణ అనువాదాలు, అనుసృజనలు అన్ని భాషల్లోనూ కోకొల్లలుగా వచ్చాయి. రామాయణాన్ని ఏదో రూపంలో రాయడమే పుణ్యకార్యం అనే ధోరణి మొదలైంది. వీధి వీధికీ రామాలయాలు వెలియడం, రామకథలు ప్రవచనాలుగా చెప్పుకోవడం మొదలైన కొత్త సంప్రదాయాలు వచ్చాయి.

ఇటువంటి ప్రాముఖ్యం వల్ల, ముఖ్యంగా భక్తి సంప్రదాయం రామాయణానికి తోడవటంతో, అందులోని పాత్రలు – ముఖ్యంగా సీతారాములు – మన నాగరకతకి ప్రతీకలు అయ్యారు, రామాయణంలోని విలువలు మన సంస్కృతినంతా ప్రతిబింబించే విలువలనే నమ్మకం బాగా నాటుకుపోయింది.

ఇదంతా ఒక్కసారిగా జరగకపోయినా, వలసపాలన తర్వాత వచ్చిన ఆధునికత సామాజికంగా పెనుమార్పులకి చోటిచ్చింది. అందువల్ల, పాతని కొత్తగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆనాటి సంఘంలో సంఘర్షణలనీ, వైరుధ్యాలనీ, సమస్యలనీ పట్టుకుని వాటితో రామాయణాన్ని విశ్లేషించడమో, రామాయణాన్ని తిరిగి రాయడమో తెలుగునాట ఎక్కువగానే జరిగింది, ఇప్పటికీ ఇదే ధోరణి కొనసాగుతోంది కూడా.

ఈ నేపథ్యంలో, పంధొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాలలో తెలుగులో రామాయణం ఎన్నో సాహిత్య యుద్ధాలకి వేదికగా మారింది. ఒకవైపు భక్తిరామాయణాలూ, మరోవైపు “వ్యతిరేక రామాయణాలు” ఎన్నో వచ్చాయి.

సంప్రదాయ, భక్తి మార్గంలో వచ్చిన రామాయణ కథనాలలో – ఆంధ్ర వాల్మీకిగా పేరొందిన వావిలకొలను సుబ్బారావు, శ్రీనివాస శిరోమణి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పుల్లెల శ్రీరామచంద్రుడు చేసిన అనువాదాలు చెప్పుకోదగ్గవి. ఇదే మార్గంలో స్వతంత్ర కావ్యంగా వచ్చిన రామాయణ కథనం విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం. ఆరోజుల్లో మధ్య తరగతి విద్యావంతుల్లో సంప్రదాయ వ్యతిరేకత, తద్వారా బ్రాహ్మణ వ్యతిరేకతల మోజు ఎక్కువగా వుండేది. వేదాలు, పురాణాలు, మిగిలిన పూర్వ గ్రంధాలు దేశాన్ని అజ్ఞానంలో ఉంచాయని, కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం, ఇంకా ఇలాటి “ సంప్రదాయ స్వచ్ఛత”కు సంబంధించిన అనేక ఆచారాలు వెనకబడ్డ తనానికి చిహ్నాలని ఇంగ్లీష్‌ చదివిన ఆధునికులు ఒప్పేసుకున్నారు. ఇలాటి సందర్భంలో విశ్వనాథ సంప్రదాయ ఆచారాల్ని, విలువల్ని సమర్థిస్తూ మను ధర్మశాస్త్రం మీద నిలిచే సమాజానికి పిలుపునిచ్చాడు. ఇది అనూహ్యమైన రీతిలో సాహిత్య ప్రపంచాన్ని ఊపేసింది.

ఇకపోతే, వ్యతిరేక-రామాయణ కథనాలలో మనకి రెండు ధోరణులు కనిపిస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్టు, రామాయణంలో ఉన్న “othering” ని ఉపయోగిచుకుంటూ – రామాయణాన్ని ఏదో ఒక వర్గపోరాటానికి ప్రాతినిథ్యం వహించిన కథనంగా విశ్లేషించడం, లేదా తిరిగి రాయడం మొదటిది.


(అగ్నిప్రవేశం, మేవార్ రామాయణం, బ్రిటిష్ లైబ్రరీ)

ఆర్య-ద్రవిడ వాదాలు ఎక్కువగా ఉన్న రోజులలో, ఆర్య-ద్రావిడ సిద్ధాంతం బ్రాహ్మణ-అబ్రాహ్మణ జాతుల మధ్య సంఘర్షణలకి వేదికగా మారింది. ఆ సమయంలోనే, త్రిపురనేని రామస్వామి శంబుక వధ, రామాయణాన్ని ఆర్య-ద్రావిడుల సంఘర్షణగా చూపించింది. ఆయన దృష్టిలో శంబుక హత్యకు బ్రాహ్మణుల కుట్రే ఏకైక కారణం. ఈ కథలో ఆర్య ద్రావిడ వర్గకలహాలు చూడబోవటం బ్రాహ్మణ పాఠకులకి వెగటుగా తోచింది. కట్టుకథని ప్రచారం చేస్తున్నాడని సంప్రదాయ పండితులు రామస్వామిని ఖండించారు. ఈ అసంప్రదాయ కథనం ఒక దశాబ్దం పాటు సంప్రదాయవాదుల నుండీ ఎంతో ప్రతిఘటనని ఎదుర్కొంది. రామస్వామి ఈ ప్రతిఘటనని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు, ఆయన ఊరూరా తిరిగి తన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా విద్యాధికులైన అబ్రాహ్మణ పాఠకులు, బ్రాహ్మణ్యాన్ని ప్రశ్నిస్తున్న అధునాతనులు అందుకు అనుకూలంగా స్పందించారు.

ఇటీవల వచ్చిన వ్యతిరేక రామాయణాల్లో సంపూర్ణమైంది, వివాదాస్పదమైంది ముప్పాళ్ళ రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం. రామాయణ విషవృక్షంలో మాత్రం రామాయణానికున్న బ్రాహ్మణ, అబ్రాహ్మణ వ్యాఖ్యానాలన్నిటినీ తీవ్రంగా నిరసిస్తూ రామాయణం ఏకైక లక్ష్యం తక్కువ కులాల వాళ్ళని, స్త్రీలని, రాచరికవ్యవస్థ బంధనాల్లో ఉంచటమే అనేది ఆవిడ ప్రతిపాదన.

వ్యతిరేక రామాయణ కథనాలలో మనకి కనిపించే రెండో ధోరణి, రామాయణంలో ఉన్న సమస్యాత్మకమైన ఘటనల ఆధారంగా, సంప్రదాయాలనీ, సంస్కృతినీ ధిక్కరించిన కథనాలు. ఈ ధోరణిలో తెలుగు సాహితీకారులు సంప్రదాయ రామాయణ మార్గాన్ని ప్రశ్నిస్తూ ఎన్నో రామాయణ వృత్తాంతాల్ని తిరగరాశారు. నాటకాలు, కవితలు, వ్యాసాలు చాలానే వచ్చాయి. వీటిల్లో ప్రధానమైనవి ముద్దుకృష్ణ అశోకం, చలం సీత అగ్నిప్రవేశం, నార్ల వెంకటేశ్వరరావు జాబాలి, సీత జోస్యం నాటకాలు.

వ్యతిరేక రామాయణ కథనాలలో రెండు ముఖ్యమైన అంతర్వాహినులున్నాయి. కొందరు ఏకైక మూలరామాయణం ఉన్నదని, అది వాల్మీకి కృతమని, బ్రాహ్మణ్యాన్ని సమర్థించటం దాని లక్ష్యమని, దాన్నే ప్రాంతీయ భాషా రచయితలు అనుసరించారని భావిస్తారు. ఇంకొందరు వాల్మీకి రామాయణంలోకి బ్రాహ్మణులు వాళ్ళకు అనుకూలమైన భాగాల్ని చొప్పించారని భావిస్తారు. మార్గాలేవైనా, ఈ రెండింటిలోను రామాయణ వ్యతిరేకత అంటే బ్రాహ్మణ్య వ్యతిరేకతే!

రామాయణ కథలోని సత్యదార్శనికతని (క్లెయిమ్‌ టు ట్రూత్‌)పూర్వపక్షం చేయటానికి వీరు ఎంచుకున్న మార్గం ఏమిటంటే ఒకటి, వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా ఒప్పుకోకపోవటం, రెండోది దానిలోని బ్రాహ్మణానుకూలతని సరిదిద్దటానికి ఆ కథను తిరగరాయటం.

రామాయణ కథా మూలం వాల్మీకం అనటమే రామాయణాన్ని గురించిన అన్ని క్లిష్టతలకూ మూలం అంటారు నారాయణరావుగారు. సంప్రదాయ రామాయణ పాఠకులూ, రామాయణ వ్యతిరేక వాదులూ కూడా వాల్మీకినే రామాయణ కర్తగా చూస్తారు. ఐతే ఈ రెండు వర్గాల మధ్యా ఒక ముఖ్యమైన తేడా వున్నది. రామాయణ వ్యతిరేకులు దీన్ని నిర్ధారించిన సత్యంగా ప్రకటిస్తారు. సంప్రదాయ పాఠకులకీ, శ్రోతలకీ వాల్మీకి కర్తృత్వానికి సాక్ష్యాధారాలేవీ అక్కరలేదు. అది వారికి ప్రశ్నించనవసరంలేని సత్యం.

కానీ, వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అనుసరించే రామాయణ పాఠం మరొకటి లేదనేది మనం గుర్తించవలసిన విషయం. ఐనా కాని విశేషం ఏమంటే, వాల్మీకి చెప్పిన రామాయణాన్నే తను మళ్ళీ చెప్తున్నానని అనని రామాయణ కర్తలు చాలా అరుదు. అంటే, వాల్మీకి పేరు, ఆయన పేరిట ఉన్న కర్తృత్వమే ఆరాధ్యాలు కానీ, ఆయన అల్లిన పాఠం కాదు. మూలంలో ఉన్న కథనాన్ని, మూలం ఉద్దేశించిన ప్రయోజనాన్ని, రామాయణాన్ని తిరిగి రాసిన కవులందరూ తమ ప్రయోజనాలకి అనుగుణంగా మార్చుకున్నారు – ఈవిధంగా, వాల్మీకిని ఆరాధ్యుడిగా భావిస్తునే, ఆయన కథనాన్ని మాత్రం ఆరాధ్యంగా భావించరు. ఇది ఒక రకమైన అభాస – దీనిని రామాయణ వ్యతిరేకులెవ్వరూ గమనించలేదు. అందుకే, అన్ని రామాయణ కథనాలూ ఐతిహాస వాల్మీకాన్ని అనుసరించినవే అనే భావనే అందరిదీనూ.

మనం వాల్మీకిని, అతని పేర వున్న పాఠాన్ని విడదియ్యలేక పోవటానికి బహుశా కారణం ప్రతి రచనకు ముందు దాని కర్త ఒకరు ఉండి తీరాలని మనం విధించుకున్న ఆంక్షే. కావ్యమే కవిని తయారుచేస్తుందికానీ, కవి కావ్యాన్ని చెయ్యడు అనేది నారాయణరావు ప్రతిపాదించే ముఖ్యమైన, మౌలికమైన సిద్ధాంతం.

మన సంస్కృతిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే – కథతో మన సంబంధం మారుతూంటే, కవిని గురించి మనం చెప్పుకునే కథలు కూడా మారతాయి. ఈ రకంగా మనకి ఎందరో వాల్మీకులు ఉన్నారు. ఆదికవి వాల్మీకి ఒకడు – ఈయన మహర్షి. ఒకనాడు నారదుడు ఆయన దగ్గరకి వస్తాడు, రామాయణ కథని చెప్తాడు. ఆ తర్వాత వాల్మీకి తమసానదీ తీరానికి వెళ్తాడు, అక్కడ బోయవాడిని శపిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి ఆదేశంతో రామాయణం రాస్తాడు. ఇది ఐతిహాస రామాయాణం మనకి చెప్పిన వాల్మీకి కథ.

బందిపోటుగా వుండి రామనామ ధ్యానంతో భక్తుడైన మరో వాల్మీకి గురించి మనం విన్నాం. అతను “రామ” శబ్దాన్ని నేరుగా పొందటానికి అనర్హుడు గనుక బ్రాహ్మణులు దాన్ని “మరా”గా అతనికి ఇస్తారు. దాన్ని మంత్రంగా పదే పదే పునశ్చరణ చేసి అతను పవిత్రమైన రామ శబ్దాన్ని సాధిస్తాడు. ఋషిగా మారి తపోనిష్ఠలో ఉండగా అతని చుట్టూ వల్మీకం పెరుగుతుంది. రాముడు తన చరిత్రని పాడమని అడగటానికి అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వల్మీకం నుంచి వెలువడి వాల్మీకి అవుతాడు. భక్తి రామాయణాల్లో కనిపించే వాల్మీకి ఇతను.

ఇక స్త్రీల రామాయణాలలోని వాల్మీకి మరొకలా ఉంటాడు – స్త్రీల రామాయణాల్లో మనక్కనిపించే వాల్మీకి సీత పాత్రకు సముచిత స్థానాన్ని ఇవ్వకుండా అన్యాయం చేసే రామ పక్షపాతి. ఇంకొక వాల్మీకి తక్కువ కులాల వారి మీద ఉన్నత కులాల పురుషుల ఆధిక్యతని ప్రచారం చేసిన వాడు. చివరగా మరో వాల్మీకి అసలు కవి కూడ కాడు. రామాయణంలో కేవలం ఒక పాత్ర. ఇలా, మొత్తం మీద ఒక కర్తతో అవసరం కలిగిన ప్రతీ రామాయణమూ తన అవసరాలకు అనుగుణంగా ఒక వాల్మీకిని సృష్టించుకుంది; కర్త అవసరం లేకపోతే అతన్ని వదిలేసింది.

రామాయణ కథనాలన్నీ, ఒక మూల కథానిర్మాణాన్ని అనుసరించినా, వాటి కథనాలలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకి, భక్తిరామాయణాల్లో హనుమంతుడికి పెద్ద పాత్ర ఉంటుంది, స్త్రీల రామాయణాలలో స్త్రీల సంఘర్షణల చిత్రణలు వేరుగా ఉంటాయి. దక్షిణాది రామాయణాల్లో రావణుడి పాత్రచిత్రణ కొంత ఉదాత్తంగా ఉంటుంది. కాబట్టి, ఇవన్నీ ఐతిహాస వాల్మీకంలో ఉన్నట్టు వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్దేశించి, రాచరిక సమస్యలకి పరిష్కారాలు చూపించేవి కానక్కరలేదు.

ఇకపోతే, రామాయణం ఒక పక్క భక్తి సంప్రదాయం అవడాన్ని అచ్చుయంత్రం వచ్చాక పబ్లిషర్లు బాగా ఉపయోగించుకున్నారు. సంస్కృత రామాయణానికే పారాయణ యోగ్యత ఉందనే నమ్మకం ఉండడంతో, దీన్ని ఉపయోగించుకుని “పారాయణ ప్రతులు” వేయించారు. సంస్కృతపాఠానికే పూజార్హత ఉందనే నమ్మకంవల్ల వాల్మీకమే పవిత్రస్థానంలో నిల్చింది.

ఇవన్నీ ఆధునికయుగంలో, ముఖ్యంగా తెలుగునాట రామాయణ సంస్కృతిలో వచ్చిన మార్పులు. ఈరోజు మనకి రామాయణ సంస్కృతితో ఉన్న సంబంధం ఎప్పుడూ ఇలానే ఉండేది కాదు. ఇవాల్టి అవసరాలని బట్టీ, ఈనాటి సమాజాన్ని బట్టీ ఇది ఏర్పడ్డది. ఈ మార్పులని పట్టించుకోవలసిన అవసరం సంప్రదాయవాదులకి లేదు. ముఖ్యంగా, హిందుత్వ జాతీయవాదులు ఈ దేశంలో ఉన్నదంతా ఒకటే సంస్కృతి అనీ, అది సనాతనంగా ఎప్పుడూ ఇలానే ఉండేదనే నమ్మకాన్ని శక్తివంతంగా ప్రచారం చేస్తుంటారు. ఈ ప్రచారంలో భాగంగానే రామాయణం నేషనల్-ఎపిక్ అయింది. రాముడు సూపర్ హీరో అవుతాడు, సీత భారత-స్త్రీకి ప్రతీక అవుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి.

***

When Sita Ceases to be a Sita అనే వ్యాసంలో, నారాయణరావుగారు మరింత ముందుకి పోయి, భారత సంస్కృతిలోని సాహిత్య కథనలాని (నారేటివ్స్)ని అర్థం చేసుకోడానికి మనకి ఒక కొత్త సాంస్కృతిక వ్యాకరణం (కల్చురల్ గ్రామర్) అవసరం అంటారు.

భారతదేశ చరిత్రని తేదీలు, యుగాలు, రాజవంశాల మాదిరిగా కాకుండా, ఇక్కడ మూడు రకాల నాగరకతలు ఉన్నాయని గుర్తించి, ఆ నాగరకతల సంస్కృతిని అర్థం చేసుకుని, వాటి ఆధారంగా మన చరిత్రని నిర్మించుకోవచ్చు అంటారు ఆయన.

భూమినుంచి ఆదాయం వచ్చేవారి నాగరకత ఒకటుంది – వీళ్లని లాండెడ్ కమ్యూనిటీస్ అంటాం. రెండోది పశువుల నుంచి ఆదాయం వచ్చే వారి నాగరకత – వీరికి భూమిమీద పెత్తనం అక్కరలేదు కానీ భూమి నుండీ వేరే ఏదో ప్రయోజనం కావాలి, అంటే భూమి కేవలం మేతకి కావాలి, అది ఎవరిదనే ప్రసక్తి లేదు. వీళ్లని పాస్టోరల్ కమ్యూనిటీస్ అంటాం. మూడోది – వ్యాపారం నుంచి ఆదాయం వచ్చే వారి నాగరకత. వీరిని మెర్సెంటైల్ కమ్యూనిటీస్ అంటాం. ఈ మూడు నాగరకతల సంప్రదాయాలు, సంస్కృతులు వేరుగా ఉంటాయి, భారతదేశ సాంసృతిక చరిత్ర అంతా ఈ మూడు నాగరకతల మధ్య సంఘర్షణగా చూడొచ్చు అంటాడు నారాయణరావు. ఈనాటికీ, ఈ మూడు నాగరకతలు మనకి ఉన్నాయి.

భూమిమీద ఆధారపడే వ్యవసాయ సమాజాలలో స్త్రీని భూమితో సమానంగా చూస్తారు. భూమి నుంచి పంట వస్తుంది, స్త్రీ నుంచి సంతానం వస్తుంది. అందుకని స్త్రీకి భూమితో సమానమైన గౌరవం, స్త్రీమీద అదే హక్కు ఈ నాగరకతలో ఉంటాయి. రాజు పృధ్వీపతి. భూమితో సమానంగా స్రీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరికి స్త్రీ పాతివ్రత్యం ఎంతో ముఖ్యం . ఈ నాగరకతలో వీరుడు స్త్రీకోసం, భూమికోసం యుద్ధంలో ప్రాణత్యాగం చేస్తాడు. భూమిని పరిరక్షించుకోవడంకోసం, స్త్రీని రక్షించుకోవడం కోసం అతను అవసరమైతే చచ్చిపోవాలి. ఎందుకంటే, భూమి మడిచి జేబులో పెట్టుకుని తీసుకుపోయే వస్తువు కాదు – దానిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రామాయణంలో వీరులు అందరూ ఈ కోవలోనివారు. యుద్దంలో వెన్నిచ్చి రావడం ఇక్కడ కుదరదు. ఇందులో స్త్రీకూడా, పురుషుడిని వీరుడిగా, తనని రక్షించుకోగలిగే పరాక్రమవంతుడిగానే కోరుకుంటుంది, తన ప్రాతివ్రత్యాన్ని అవసరమైతే అందరిముందు నిరూపించుకుంటుంది. వేరెవరివైపు కన్నెత్తికూడా చూడదు. రామాయణంలో సీత భూమికి ప్రతీక – బహుశా అందుకే ఆమెని భూమిసుతగా వర్ణిస్తారు.

పాస్టోరల్ నాగరకతకి సంబధించిన కథలు కూడా మనకి చాలానే ఉన్నాయి. ఇందులో వీరుడు యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయి రావొచ్చు. కాటమరాజు కథ ఇటువంటిదే. మహాభారతం కూడా ఒకవిధంగా, పాస్టోరల్ నాగరకతకి సంబంధించిన కథే. కృష్ణుడు యాదవుడు – అవసరమైతే, సొంత భూమిని వదిలేసి, మరో చోటుకి వెళ్ళిపోగలడు. పాండవుల తల్లి కుంతి భోజుడి కూతురు, అలానే సత్యవతి కూడా ఒక బేస్తవాడి కూతురు. విరాటుడిది ప్రధానంగా గోధనం, అలాగే ద్రుపదుడిది కూడా. ఈ నాగరకతలో స్త్రీకి చాలా స్వాతంత్ర్యం ఉంటుంది. వ్యవసాయ సమాజాలలోలాగ, ఇక్కడ స్త్రీ ప్రాతివ్రత్యానికి దుర్నిరీక్ష్యమైన పవిత్రత ఉండదు. రుక్ష్మిణి, ద్రౌపది, సత్యభామ, గాంధారి, కుంతి, ఉత్తర – వీళ్లంతా చాలా స్వతంత్రులైన స్త్రీలు. రామాయణంలో స్త్రీలకి – భారతంలో స్త్రీలకీ ఉన్న తేడా ప్రధానంగా ఈ నాగరకతల మధ్య ఉన్న తేడాతో వచ్చిందే. ఈ నాగరకతలో వీరత్వం కాస్త వేరుగా ఉంటుంది – ఇందులో వీరుడు యుద్ధంలోంచి పారిపోవచ్చు, వెనుతిరగవచ్చు, అవసరమైతే ఎత్తులూ, పై ఎత్తులు వేసి ఏదో విధంగా విజయం సాధించవచ్చు.

మన సంస్కృతిలో మూడో నాగరకత కూడా ఉంది – అది వ్యాపారుల నాగరకత – అంటే ప్రధానంగా డబ్బుతో ముడిపడిన నాగరకత ఇది. ఈ నాగరకత మనకి జానపద కథల్లో కనిపిస్తుంది – కథా సరిత్సాగరం, గాథా సప్తశతి మొదలైన ఎన్నో కథలు ఈకోవలోకి వస్తాయి. ఈ కథల్లో స్త్రీ పూర్తి స్వతంత్రురాలిగా ఉంటుంది, ఈ కథల్లో స్త్రీ తనని తానే రక్షించుకుంటుంది, అవసరమైతే పురుషుడికోసం తనే యుద్ధం చేస్తుంది కూడా. వ్యాపారం చేసుకునే కుటుంబాలలో డబ్బుని స్త్రీ, పురుషుడూ ఇద్దరూ వాడొచ్చు, అందుకని ఈ కులాలలో, కుటుంబాలలో స్త్రీకి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ నాగరకతలో పురుషుడూ, స్త్రీ ఇద్దరూ వీరులే. కానీ, ఇందులో యుద్ధంలో ప్రాణాలివ్వడానికి విలువ ఉండదు. బుద్ధి బలంతో గెలవడం, గొడవలు లేకుండా జిత్తులమారి తెలివితేటలతో నెగ్గుకురావడం ప్రధానమైన “వీరత్వం”. ఇందులో, స్త్రీ తన భర్తమీద మరో ఆడదాని కన్నుపడకుండా కాపాడుకుంటూ ఉంటుంది.

ఈ మూడూ విడదీసి, మూడు నాగరకతలు ఉన్నాయి, మూడు మర్యాదలు ఉన్నాయి, మూడు రకాల వీరత్వం ఉంది, మూడు రకాల స్త్రీత్వం ఉంది అని మనం భారతదేశ చరిత్రని మూడు భాగాలుగా చేసి చూస్తే మనం మన సంస్కృతిని కొత్తమార్గంలో అన్వేషించవచ్చు.

ఏ కారణంచేతనో కానీ, వ్యవసాయ-నాగరకత మర్యాదే, ప్రధానమైన “కల్చురల్ నారేటివ్”గా మన ఆలోచనలలో నాటుకుపోయింది. సంస్కృతంలో ఇతిహాసానికి ఉన్న స్థానం కథాసరిత్సాగరానికి ఏంచేతనో కానీ లేదు. దీని పర్యవసానంగా, మనకి రామాయణం “నేషనల్ ఎపిక్” అయిపోయింది, సీత భారత సంస్కృతిలో స్త్రీ-మర్యాదలన్నిటికీ, స్త్రీ సమస్యలన్నిటీకీ ప్రతీకగా నిలిచింది. బహుశా ఈ కారణాలచేతనే, ఇప్పటికీ, మనం రామాయణాన్నే మన సంస్కృతికి ప్త్రాతినిధ్యం వహించిన కథనంగా పరిగణిస్తూ, సీత కథనే చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటాం.

కాలక్రమంలో, సీత కథే ఎన్ని రకాలుగా మారుతూ వస్తూందో చూస్తే ఈ గందరగోళం మనకి అర్థం అవుతుంది.


(అశోకవనంలో సీత”, మేవార్ రామాయణం, బ్రిటిష్ లైబ్రరీ)

వాల్మీకంలో సీత పూర్తిగా మొదటి నాగరకతకి సంబంధించిన స్త్రీ. సుందరకాండలో సీతని హనుమంతుడు తనతో వచ్చెయ్యమంటాడు. దానికి సీత ఎంతో నర్మగర్భంగా, తెలివిగా రాలేనంటుంది. రాముడే వచ్చి రావణుడిని చంపి తనని తీసుకువెళ్లాలి, అదే ధర్మం అంటుంది. ఒకవైపు నుంచీ ఈమాటలు అంటూనే, లంకలో తన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో, రాముడు హుటాహుటిన రావడం ఎంత అవసరమో, కాకిమీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు, ఇప్పుడు ఎందుకు ఉదాసీనంగా ఉండిపోయాడో అంటూ రాముడిని నిలదీస్తుంది కూడా. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి నిప్పుల్లో దూకుతుంది. ఆ నాగరకత తాలూకూ మర్యాదలన్నీ ఈ సందర్భంలో మనకి తెలుస్తాయి. భర్తే వచ్చి తనని రక్షించాలి, తనకి పారిపోయే స్వతంత్రం ఉన్నా ఆ పని తను చెయ్యలేదు. భర్త తనకోసం రావడమే కాదు, పూర్తిగా శత్రువినాశనం చెయ్యాలి, శత్రువు సబాంధవంగా చచ్చిపోవాలి.

ఉత్తరకాండలో, ఆవిడ పాతివ్రత్యం మీద ప్రజలకి అనుమానాలు వచ్చినప్పుడు, ఆవిడమీద ఎంతో ప్రేమ ఉన్న రాముడు, విధిలేక ఆమెని అడవుల్లో వదిలేస్తాడు. లక్ష్మణుడు ఆవిడకి ఎంతో ప్రియమైన మరిది, వదినగార్ని తల్లితో సమానంగా పూజిస్తాడు – ఇది కూడా వ్యవసాయ నాగరకతల మర్యాదే. అడవిలో ఆమెని వదిలివస్తూ, అన్నగారితో ఏం చెప్పమన్నావు అంటాడు. దానికి సీత ఉక్రోషంగా – “ ఆ నిరంకుశుడికి సందేశం నువ్వు అడిగావు కాబట్టి, నీ మాట తీసెయ్యలేక చెప్తున్నాను – రాజ్యాన్నీ, ధర్మాన్నీ, ప్రజలనీ, తన ఆరోగ్యాన్ని కాపాడుకోమను, నా గురించి ఆలోచించవద్దని చెప్పు” అంటుంది. ఆ మాట అంటూనే, “మరీ కటువుగా అన్నానా?” అంటుంది. మరుక్షణంలో, “స్వర్గంలో శివపార్వతులు, భూమిమీద సీతారాములు” అనే కదా అందరూ అనే మాట అంటుంది. ఈ విధంగా, ఆవిడకి తన స్థానం ఏమిటో తెలుసు, రాముడు ఎందుకు తనని వదిలిపెట్టాల్సి వచ్చిందో తెలుసు, ఆయన నిస్సాహయత ఆవిడకి తెలుసు – ఎందుకంటే, ఆ నాగరకత తాలూకూ మర్యాదలన్నీ ఆమెకి తెలుసు కాబట్టి.

చివర్లో వాల్మీకి సీతని, లవకుశులని వెంటబెట్టుకుని రాముడి దగ్గరకి వస్తాడు. సీతకి మరోసారి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవలసి వస్తుంది. అయితే, ఈసారి సీత అనూహ్యంగా, తనని లోపలకి తీసుకొమ్మని భూమిని ప్రార్థిస్తుంది -. భూమి చీల్చుకుని, ఒక బంగారు సింహాసనం మీద భూదేవి వచ్చి, సీతని తనతో తీసుకుపోతుంది.

చివరకి, ఇక తననెవ్వరూ నమ్మరని, విసిగిపోయి కోపంతో నిష్క్రమిస్తుంది.

ఈ కథనే, తర్వాతి కవులు ఎన్నోరకాలుగా చెప్పారు – సీతారాములు విడిపోవడం ఏ కవికీ మింగుడు పడలేదు.. దిఙ్నాగుడి కుందమాల, భవభూతి ఉత్తరరామ చరిత్ర వీటిల్లో ముఖ్యమైన కథనాలు. ఈ ఇద్దరు కవులకీ, ఉత్తరకాండలో సీత నిష్క్రమణం నచ్చలేదు. ఎలోగోలా, సీతారాములని తిరిగి ఏకం చెయ్యడానికే ప్రయత్నించారు. దిఙ్నాగుడి కుందమాలలో ఒక సంభాషణ ఈ నాగరకతలోని స్త్రీ పాతివ్రత్యానికి నిర్వచనం లాంటిది:

అడవిలో లక్ష్మణుడు సీతని విడిచి వెళ్లిపోతాడు.

లక్ష్మణుడు వెళ్లాక, వాల్మీకి ఆవిడని చూస్తాడు. తనకి సాయం చెయ్యమని ఆయన్ని అడుగుతుంది.

“వర్ణాశ్రమధర్మాన్ని కాపాడే రాజే నిన్ను బహిష్కరిస్తే నీకు నేనెలా సాయం చెయ్యగలను” అంటాడు.

“నాకోసం కాకపోయినా, నా కడుపులో పెరుగుతున్న రఘువంశాంకురంకోసమైనా నాకు ఆశ్రయం ఇయ్య”మంటుంది.

“నువ్వు దశరథుడి కోడలివా” అంటాడు,

“అవును”, అంటుంది సీత.

“అయితే, సీతవి నువ్వేనా?” అని అడుగుతాడు.

“కాదు, నేను సీతని కాదు, నేనొక దురదృష్టవంతురాలిని” అంటుంది. (“నహీ సీతా భగవాన్, మందభాగినీ”)

ఈ సమాధానం ఈ నాగరకతని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారం. ఎప్పుడైతే, సీత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోలేదో అప్పుడింక ఆవిడ సీత కాదు. పతివ్రత, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవలసిన బరువు ఆమే మొయ్యాలి – She is guilty until proven innocent. ఇది రామాయణ కథన వ్యాకరణంలో అతిముఖ్యమైన అంశం, వ్యవసాయ నాగరకతలకి ముఖ్యమైన అంశం ఇది.

ఎందుకంటే, భూమిని నమ్ముకుని బతికే కుటుంబాలు, ఉన్న ఊరిని వదిలేసి వెళ్లిపోలేవు, అందుకని వారికి కుటుంబ గౌరవం, పరపతి, పరువు చాలా ముఖ్యమైన ఆస్తులు, భూమి ఎంత విలువైనదో పరువు మర్యాదలు కూడా అంతే విలువైనవి. ఒకసారి, కుటుంబంలో ఎవరిమీదనైనా నింద పడితే, దాన్ని వదిలించుకోవడం అసంభవం, అంతే కాదు, ఒకసారి నిందపడిన కుటుంబం ఊరి వదిలివెళ్లిపోవలసిందే తప్పించి, అదే ఊరిలో బతకడం అసంభవం. ముఖ్యంగా స్త్రీ మీద అపవాదు వస్తే, దానిని పోగట్టుకోడానికి ఏదో అసంభవమైన కార్యం చెయ్యాలి, లేదో ఏ దైవ ఘటనో జరగాలి. అందుకనే, ఈ నాగరకతలో స్త్రీ-పాతివ్రత్యానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కట్టుబాటుకి లొంగిపోయి ఉండటం వల్ల ఆమె తన కుటుంబ మర్యాదని కాపాడే శక్తిని సంపాదిస్తుంది.

వ్యవసాయ నాగరకతలలోంచి వచ్చిన స్త్రీల రామాయణాలలో ఈ కథే కొంచెం వేరుగా ఉంటుంది. ఒక రామాయణ కథలో, లవకుశులు రామ లక్ష్మణులని యుద్ధంలో చంపేస్తారు, ఏమీ తెలియనట్టు సీతతో ఎవరో ఇద్దరు రాజులని యుద్ధంలో చంపేసామని చెప్తారు. సీత వచ్చి చూస్తుంది – చచ్చిపోయినవారు రామ లక్ష్మణులే అని గ్రహిస్తుంది. పాపం ఎంతో విలపిస్తుంది. వాల్మికి వచ్చి, తన తపశ్శక్తితో వారిని తిరిగి బతికిస్తాడు. రాముడు సీతనీ పిల్లలనీ తనతో వచ్చెయ్యమంటాడు, దానికి లవకుశులు ఒప్పుకోరు, తండ్రిని నానా మాటాలు అంటారు. సీత, వాల్మీకి, ఎంత వారించినా వాళ్లు వినరు. ఈ కథలు కూడా, వ్యవసాయ నాగరకతా మర్యాదలకి లోబడే ఉంటాయి. ఇందులో సీత తనని తాను రక్షించుకోలేదు, కానీ పిల్లలు తనకోసం తండ్రితో పోరాడుతారు.

ఈ విధంగా, వ్యవసాయ నాగరకత మర్యాదలని అనుసరించిన రామాయణ కథనాలన్నిటిలోనూ, పతివ్రత తనని తానే సృష్టించుకుంటుంది. ఆ పాతివ్రత్యంలోంచే ఆమె నాయకుడు, భర్త కూడా వస్తారు. ఈ విధంగా, సీత రాముడిని సృష్టిస్తే, ఆవిడ పాతివ్రత్యాన్ని నిరూపించుకునే అవకాశం ఆవిడకి కల్పిస్తూ, ఆమెని అమితంగా ప్రేమించినా అమె పాతివ్రత్యం సందేహంలో పడ్డప్పుడు ఆమెని త్యజించడానికి అశక్తుడవుతూ, ఆమెని రక్షించుకోడానికి సముద్రాలైనా దాటడానికి సిద్ధపడుతూ, రాముడు సీతని సృష్టిస్తాడు – ఇద్దరిదీ అవినాభావమైన, విడదీయలేని అనుబంధం.

అశోకవనంలో, రాముడిని ఎడబాసిన సీత – విశ్వాసం కోల్పోయిన శ్రద్ధలాగనూ, సందేహంలో పడ్డ స్మృతివాక్యంలాగనూ ఉందంటాడు వాల్మీకి! వారిద్దరి మధ్యా ఉన్న విడదీయలేని సంబంధాన్ని చూపించే గొప్ప కవితాత్మకమైన ఊహ అది. ఇదీ ఐతిహాస వాల్మీకంలోనూ, దానిని అనుసరించిన కావ్యాలలోనూ మనకి కనిపించే కథనం.

ఇరవయ్యో శతాబ్ధంలో, సంప్రదాయ విలువలన్నిటినీ ప్రశ్నిస్తూ, సమాజం వెనకబాటుతనాన్ని నిరసిస్తూ వచ్చిన రచనలు తెలుగులో ఎన్నో ఉన్నాయి.

ఈ కథనాలలో సీత ఒక మధ్యతరగతికి చెందిన, నగరాలలో ఉద్యోగం చేసుకునే స్త్రీ. అంటే, వ్యవసాయ నాగరకతని వదిలేసి, వ్యాపార నాగరకతలోకి వచ్చేసిన యువతి అన్నమాట. ఒక కథనంలో, ఆవిడ రావణుడిని ప్రేమిస్తుంది, రాముడి సూటిపోటి మాటలు పడలేక, పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి అగ్నిలో దూకడం బదులు, రావణుడి చితిలో దూకుతుంది, ఇంకో కథనంలో తన మంగళసూత్రాలు అగ్నిలో విసిరేస్తుంది. ఈ కథలన్నీ, వ్యవసాయ నాగరకతలోని మర్యాదని అతిక్రమించిన కథలు.

ప్రతి నాగరకతకి కొన్ని మర్యాదలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఇవి కాలక్రమంలో మారుతూ ఉన్నా ఆ మార్పులు కూడా ఆ నాగరకత మౌలికమైన పునాదికి లోబడే ఉంటాయి. ఆ మర్యాదని అతిక్రమించే కథనాలలోని సీత సీత కాదు అంటారు నారాయణరావుగారు. ఒక రకంగా, ఈ కొత్త కథనాలలో కనిపించే సీత-పాత్రకి ప్రతీకలు మనకి వేరే కథల్లో ఉన్నారు – మహాభారతంలో ఉన్నారు, బృహత్కథలోనూ, గాథాశప్తశతిలోనూ ఉన్నారు, మరెన్నో జానపద కథల్లో ఉన్నారు.

ఇటువంటి ఆధునిక కథకులకి, మనకి మూడు నాగరకతలు ఉన్నాయనీ, వాటి మర్యాదలు వేరనీ అర్థం కాలేదు. దీంతో మనకి బోలేడు సమస్యలు వచ్చాయి – ముఖ్యంగా, మనకి వ్యవసాయ నాగరకత ఒక్కటే ఉన్నట్టూ, ఈ వ్యాసం మొదట్లో లవకుశ సినిమాలో వాల్మీకి చెప్పినట్టు, రామాయణం మన సంస్కృతికీ, మన నాగరకత అంతటికీ అదే పట్టుగొమ్మ అన్న ఒక బలమైన నమ్మకం మనలో పాతుకుపోవడం వల్లనూ, రామాయణాన్నే మనం ప్రశ్నిస్తుంటాం. రామాయణాన్నే, మన సంస్కృతికంతటికీ ప్రతీకగా భావించటంతో మన సంస్కృతిలో ఉన్న మరెన్నో నాగరకతలని విస్మరించటం, వాటి తాలుకూ కథనాలని పట్టించుకోకపోవటం జరుగుతోంది.

రామాయణ సంప్రదాయంలో రచయితల కల్పనకు జాగా వుంది. కంబన్‌, తులసీదాసు వంటి గొప్ప కవుల రామాయణాలు సాహిత్యపరంగా కూడ ప్రఖ్యాతాలు. కాని పదమూడు పందొమ్మిది శతాబ్దాల మధ్య తెలుగులో వచ్చిన కొన్ని కథనాలకి అంత గుర్తింపు రాలేదు. ఇంకొన్ని రామాయణాల కర్తలెవరో తెలియదు. అయినా వాటినీ రామాయణాలుగానే అంగీకరిస్తారు. మూల రామకథ నుంచి కవులు వాళ్ళ దేశకాలాలకు అనుగుణంగా రామాయణాల్ని తయారుచేసుకున్నారని ఈ బాహుళ్యత సూచిస్తుంది. వాల్మీకంగా చెప్పబడే రామాయణానికి కర్తలూ అలాటి వారే.

The present reinterprets the past to control the future అంటారు నారయణరావు. ఇతిహాస కథలని తిరిగి రాయడం, వాటిని కొత్తగా చెప్పటం, సమకాలీన సమస్యల మూలాలని గతంలో వెతకడం, ఆ అన్వేషణలో భాగంగా కొత్త మర్యాదలని సృష్టించుకోడానికి పాతకథలనే వాడుకోవడం మన సాహిత్య సంప్రదాయంలో భాగమే. దానికి, భారతీయ కథన సంస్కృతి జాగా కల్పిస్తుంది. వెయ్యి సంవత్సరాలకి పైగా, రామాయణంతో మన సమజానికి ఉన్న రాజకీయ, సామాజిక సంబంధం ఎన్నో రకాలుగా మారుతూ ఉన్నప్పటికీ, ఒక కథగా, కావ్యంగా అది మన భావనలో లోతుగా అల్లుకుపోయింది – ఎందుకంటే, ప్రధానంగా అది చాలా గొప్ప సాహిత్యం . అందులోని పాత్రలు, వారి వ్యక్తిత్వాలలోని అమాయకమైన కవిత్వం ఆ కథని ఎవరు, ఏ విధంగా చెప్పినా రక్తి కట్టిస్తూ ఉంటాయి. నిజానికి, రామాయణం ఒక ‘కథ’ మాత్రమే కాదనీ, అది ఒక భాష లాంటిదనీ, ఆ భాషలో వ్యక్తులు ఎన్నో విషయాలు చెప్పవచ్చునని అంటారు నారయణరావు.

***

ఇటువంటి కొత్త ఆలోచనలతో, లోతైన విశ్లేషణలతో, మౌలికమైన ప్రతిపాదనలతో కూడిన వ్యాసాలు మరో పదమూడు ఉన్నాయి ఈ పుస్తకంలో. మన చరిత్రనీ, సాహిత్య సంస్కృతినీ అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న ప్రతివారూ చదవవలసిన వ్యాసాలివి.

ముఖ్యంగా, ఇప్పుడు మన సాహిత్యం అంతా రెండు, మూడు వాదాల మధ్య ఇరుక్కుపోయింది. అన్నిరకాల వాదాలకీ, ఇజాలకీ అసింటా జరిగి, విశ్లేషణాత్మకంగా, లోతైన చారిత్రక అవగాహనతో రాసిన ఈ వ్యాసాలు భారత సాంస్కృతిక చరిత్రలోని వైవిధ్యాన్ని నిజాయితీగా, నిబ్బరంగా, విశాలమైన మేధా పరిధితో మనకి కొత్తగా పరిచయం చేస్తాయి. అందుకే సమగ్రంగా వీటిని చర్చించవలసిన అవసరం ఉంది.

కానీ, ఇంత విస్తృతమైన పనిచేసిన ఈ తెలుగు మేధావిని తెలుగు దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చేసిన పనిమీద ఇప్పటివరకూ సమగ్రమైన, సున్నితమైన చర్చ జరగలేదు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలన్నీ ఎప్పుడో కిటికీలు మూసేసుకున్నాయి. తెలుగు పండితులు అష్టావధానాలకీ, టి.వి.ల్లో ప్రవచనాలకీ పరిమితమైపోయారు. ఇకపోతే, మనకి మేధావివర్గం అంటూ ఏదీ లేదు – న్యూస్ పేపర్లో వచ్చే సంఘటనలకి రాజకీయ, సామాజిక వ్యాఖ్యానాలే మనకి ఇప్పుడున్న మేధావితనం. అందుకని మూలాలని ప్రశ్నించి వ్యాఖ్యానించే ఆలోచనలు బహుశా ఎవరికీ అక్కరలేదేమో!

1980 నుంచీ 1994 వరకూ, ఇంగ్లీషులో Farside అని ఒక కామిక్ వచ్చేది. గారీ లార్సెన్ వేసేవాడు. ఆ కామిక్ అప్పట్లో చాలా కొత్తగా, సర్రియలిస్ట్ కామిక్ గా పేరు తెచ్చుకుంది. చాలామందికి అందులో కొన్ని కార్టూన్లు నచ్చేవి కాదు, అవి ఒక్కోసారి ఏహ్యం కలిగించేటట్టు ఉండేవి, ఎంతో మార్మికంగా ఉండేవి. దానిమీద ఎడిటర్లకి పాఠకులు కోపంతో రాసిన ఉత్తరాలే ఒక పుస్తకంగా వచ్చాయి కూడా.

అవన్నీ పుస్తక సంపుటంగా వచ్చినప్పుడు, ఆ సంపుటాలకి రాసుకున్న ముందుమాటలో, లార్సెన్ అద్భుతమైన ఒక మాట అంటాడు:

“ఏ కార్టూనిస్టయినా నిజంగా భయపడేది – కార్టూన్ చదివిన పాఠకుడి నుండి నిరాసక్తమైన, నిశ్శబ్దమైన ఆవలింత ఒక్కదానికే. పాఠకుడికి మనం వేసిన కార్టూన్ నచ్చకపోయినా అతన్ని కనీసం ఎక్కడో గుచ్చలేకపోతే ఆ కార్టూను కోసం ఖర్చుచేసిన సృజన శక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరే”

నారాయణరావు ప్రశ్నిస్తాడు, కొత్తగా వ్యాఖ్యానిస్తాడు, మనల్ని కలవరపెడతాడు తప్ప, బోరుకొట్టించడు. మనల్ని తనతో అంగీకరించమని శాసించడు, అన్ని ప్రశ్నలకీ పరిష్కారాలు చూపించి మనల్ని నిద్రపుచ్చడు. ముఖ్యంగా – మనల్ని బతిమాలడు.

I bet that in this book, you will meet a public intellectual, a prodigious scholar and a provocative thinker.

**** (*) ****

సుమారుగా పాతికేళ్ల వ్యవధిలో ఎక్కడెక్కడో సంకలనాలలోనూ, ఎకడెమిక్ జర్నల్సులోనూ వచ్చిన వ్యాసాలన్నీ సేకరించి, నారాయణరావుగారిని బతిమాలి, ఆయన్ని విసిగించి, చివరికి ఒప్పించి, ఈ వ్యాసాలన్నీ ఈ పుస్తకరూపంలో ఒక సంకలనంగా తేవడానికి కారణమైన పట్టువదలని విక్రమార్కుడు, మిత్రుడు పరుచూరి శ్రీనివాస్ కి ఈ సందర్భంగా నా జోహార్లు.[1] Sheldon Pollock, “Ramayana and Political Imagination in India”, The Journal of Asian Studies, Vol 52, No.2, 1993
[2] Sheldon Pollock,”Introduction”, Valmikiramayana, Book-2, Edited by Robert Goldman, Motilal Banarsi Das, 2007.
[3] Velcheru NarayanaRao – “Text and Tradition in South India”, Orient Blackswan, India, 2016.

ఈ సంకలనంలో వచ్చిన వ్యాసాలలో కొన్ని ఈమాటలో తెలుగు అనువాదాలుగా ఇప్పటికే వచ్చాయి:
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు
సీత గడియ
లక్ష్మణదేవర నవ్వు
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం