కవిత్వం

గజీతగాడు

జూన్ 2016

దూరమైన అనుబంధంలో అపార్థంగా గుచ్చుకుని
అక్కడే మరణించిన రహస్యాన్నీ
ఎవరి కథలోనో పాత్రగా చతికిలబడి
అర్థాంతరంగా ముగిసిపోయిన సశేషాన్నీ
కొన్ని మాయదారి సాయంకాలాలు మోసుకొస్తుంటాయి

నల్లరాతి గోడల మధ్య ఇరుక్కున్న పదబంధాలతోనూ
కవితలో ఇమడడానికి కత్తిరించబడ్డ కవిత్వ శకలాలతోనూ
చీకటి ఉచ్చులు పన్ని
నెగడుచూపుల రాత్రుళ్లు వేటాడుతుంటాయి
బండరాతిమీద గుండె పగిలిన వర్షపు చినుకులై
కళ్ళు రెండూ చిప్పిల్లుతాయి

చెమ్మగిల్లిన ఆకాశంలోకి తూటాని విసిరి
వెనక్కివాలి ఊపిరిపీల్చుకున్న తుపాకీలా తేలికపడతాను

ఉదయాలన్నీ, షరా మామూలే
మాజిక్ ఫ్లూట్ సంచిలో వేసుకుని
మోహనగీతం విరజిమ్ముతూ
పగిలిన ముక్కలన్నీ పెద్దరికంతో అంటించుకుని
గుండెతడిని బతికించుకోడం కోసం
ఉక్కిరిబిక్కిరి పనిలో ఊపిరాడకపోవడం
ఎంత సుఖం!!

ఆత్మని తడిమే ఒక్క కవితకోసం వెంపర్లాట
ఏటిగట్లన్నీ నిరాకరించిన కన్నీటిపాట