గెస్ట్ ఎడిటోరియల్

ఇసుక పరదాలు

ఫిబ్రవరి 2016

మాటలు మాటలు మాటలు
చేతివేళ్లలోంచి
జలతారుగా జారిపోయే
పసిడి పూతల ఇసుక పరదాలు

శీతాకాలం ఉదయం,
నూతిని మింగేసిన పొగమంచు పూసలు

సిగరెట్టు దమ్ములా
మెదడంతా కమ్ముకున్న బొగ్గు చారికలు.

***

Let me make a confession. I am an expert user and was also a profound victim of the Internet Chat Window.

జీ-టాక్ వచ్చిన కొత్తలో అదో మత్తు. ఎవరెవరో, ముక్కు మొహం తెలియని వాళ్ళతో, మొదటి పరిచయంలోనే ఒక్క అరగంటలో ఏదో జన్మాంతర పరిచయం ఉన్నట్టు మా పెరట్లో నందివర్ధనం మొక్క దగ్గరనుంచీ, బెంగలూరులో ‘ది బెస్టు మసలా దోసె’ ఎక్కడ దొరుకుతుందో ఉచిత సలహాల వరకూ అన్నీటికి వీలుండేది ఆ రెండించీల విండోలో. ఎంతో మేలు చేసిన స్నేహాలు, మరెంతోగానో ఉపయోగపడ్డ సంభాషణలతో పాటూ, ఆ చిన్ని చాట్ విండో వెనకాల చేసిన యుద్ధాలు, కుప్పగూలిపోయిన స్నేహాలు కూడా ఉన్నాయి. ఐదేళ్ళపాటు పదిలంగా కట్టుకున్న నమ్మకం పునాదులు ఐదు నిమిషాల తొందరపాటుతో బీటలువారడం కూడా నాకు స్వానుభవమే.

రెండు ఇంచీల వెడల్పూ, ఇంచిన్నర పొడుగు ఉన్న ఆ చతురస్రాకారపు కిటికీ ఇప్పుడు ప్రపంచాన్ని అంతే చిన్నది చేసేసింది – మనుషులూ, మానవ సంబంధాలు కూడా అంతే కురచ అయిపోయాయేమో కూడా! ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే దానికో సమయమూ, సందర్భమూ ఉండేవి, సంభాషణకి కొన్ని పద్ధతులూ, ప్రోటోకాల్స్ ఉండేవి. ఇప్పుడు, మన పేరుపక్కన ఒక చిన్న ఆకుపచ్చని చుక్క కనిపిస్తే, ఎప్పుడైనా మాట్లాడేయొచ్చు, ఏదైనా మాట్లాడేయొచ్చు.

ఈమెయిలు పంపాలంటే సంగతీ సందర్భం అవసరం. అది పాతకాలం ఉత్తరానికి, కొత్తతరం మేకప్పు. కానీ చాట్-విండో అలా కాదు – ఇందులో పలకరింపులు, మాటలు, ఊసులు, ఊహలు, పుకార్లు, ప్రేమలు, పడగ్గది ముచ్చట్లు, జీవిత కథలు, ఏదైనా సరే, ఎదుటపడితే సిగ్గువిడిచి చెప్పుకోలేనివన్నీ, నిరాటంకంగా, సునాయాసంగా చెల్లిపోతుంటాయి.

ఇప్పటికీ గుర్తే – మర్నాడు అమెరికా ప్రయాణం పెట్టుకుని, ఓ రోజు అర్థరాత్రి పనిచేసుకుంటుంటే, ఇంటర్నెట్టులో పరిచయమైన ఒక అమ్మాయే – హఠాత్తుగా “మీకో ఐదు నిమిషాల టైముందా” అని అడిగింది. ఇది చాట్ సంప్రదాయంలో నాలుగో నెంబరు తుఫాను హెచ్చరిక. మరో గంట తర్వాత “నేను పచ్చిగా మోసపోయాను” అని భళ్ళుమంది అటుపక్కనుండీ అభిజాత్యం విడిచిన మబ్బు తునకలా. ఆవిడకి నేనేదో అన్నయ్యనో, ఆత్మీయుడినో కాదు. మరి నాతో ఎందుకూ అంటే – అది చాట్ విండో ఇచ్చిన సౌకర్యం. పాత తెలుగుసినిమాల్లో హీరోయిన్ అంతరాత్మ అద్దంలో కనిపించి మాట్లాడుతూ ఉంటుంది – మనతో మనం మాట్లాడుకోడానికి సినిమా వ్యాఖ్యానం అది, చాట్ విండోలో అవతల మనిషికి తమదైన ఒక రూపు, గొంతు ఉండవు కాబట్టి, మనతో మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది, అందుకే ఏ సంకోచమూ లేకుండా ఏమైనా మాట్లాడుకోడానికి ఒక పెద్ద అవకాశం ఇచ్చింది చాట్-విండో.

2011లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఉదయం నిద్రలేవగానే పక్కమీదనుంచే ఫేస్బుక్, వాట్సాప్ మెసేజీలు, ఈమెయిలు చూస్తారట 35% మంది నెటిజెనులు, రాత్రి నిద్రపోవడానికి ముందు కూడా అంతే. సుమారుగా రెండు బిలియన్ల నెటిజెన్లు, ఐదుబిలియన్ల స్మార్ట్ ఫోను వాడుకదార్లు ఉన్నారు ప్రపంచంలో. ఎవరెస్టు పర్వతం మీద కూడా ఒక సెల్ టవరు పెట్టారట ఈ మధ్య. వీటన్నిటి మూలంగా మన డిజిటల్ అవతారమే మన జీవితాలలో ప్రధానమైన అస్తిత్వమైపోయింది అంటాడు, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లిఫోర్డ్ నాస్,

సాంఘికంగా మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి, మనకే తెలియని కొన్ని అవసరాలు ఉంటాయి. నిజజీవితంలో, మన ఇంట్లో వాళ్ళో, ఆఫీసులో మనతో పనిచేసే సహోద్యోగులో పనిగట్టుకుని మన ప్రతి చర్యని పట్టించుకుని, మనం అన్న ప్రతి చిన్న మాటని ప్రశంసించరు కదా? మన ప్రతి అభిప్రాయాన్నీ ఎవరు అంతగా పట్టించుకోరు, మనం తీసిన ప్రతి ఫొటోకి ఆహాఓహో అంటూ మెలికలు తిరిగిపోరు. గంటలు గంటలు ఏ సంకోచంలేకుండా ఎవరు మాత్రం మాట్లాడగలరు – అందులోనూ, మధ్యలో మరేదో పని చేసుకుంటూ? మనకి బాగా కావల్సినవాళ్ళు మనల్ని అంత సీరియస్గా తీసుకోరు. కానీ, అదే మనుషులు మనపట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా విస్మరించరు. కాని, నెట్ ప్రపంచంలో అంతా తల్లకిందుల వ్యవహారం.

“We are lonely but fearful of intimacy. Constant connectivity offers the illusion of companionship without the demands of friendship. We can’t get enough of each other if we can have each other at a distance and in amounts that we can control” అంటారు Sherry Turkle.

పూలు పూయని కాలంలో
మాటలతో దోసెళ్ళు నింపి
మంచుశిలవై, ఇసక అడుగువై
ఏ పిచ్చికలల్లో చెదిరిపోయావో

అన్న స్వాతికుమారి కవిత ఈ బాధ్యతారహితమైన సాహచర్యమనే భ్రమకి ఒక అద్భుతమైన నిర్వచనంగా తోస్తుంది నాకు.

ఆ కవితలోనే మరోచోట,

మళ్లీ రమ్మంటానో లేదో!,
ఈ గుప్పెడు కలల్నీ ఎక్కువ తక్కువగా పంచేసుకుందాం ఇప్పుడే!
కాసేపుండు నాతో

అన్న చరణం పగిలిన ఆకాశం ముక్కలాంటి చాట్ విండో తెచ్చిన ట్రాజెడీకి కవితాత్మకమైన తీర్పు, షెర్రీ టర్కిల్ చివరి వాక్యానికి వేదనగా ఉప్పొంగిన వ్యాఖ్యానం. అందుకే, నెట్ గ్రూపులన్నీఒక రకమైన “సామూహికమైన ఒంటరితనమే” అంటుంది టర్కిల్. అవన్నీ ఒంటరివాళ్ళ గంపులు, ఒంటరితనాన్ని పోగొట్టలేక, దేనికోసమైతే వెతుకుతున్నామో దాన్నే పణంగా పెట్టించే విషవలయాలు.

నాకు బాగా గుర్తు – విజయనగరంలో సాయంత్రం ఏ కందాళ వెంకటాచార్యులుగారి ఇంటిలోనో, ఆలమూరు రమణమూర్తిగారి మండువాలోనో, పేరిశాస్త్రిగారి ఇంటి ముందుగదిలోనో చాలా గొప్ప చర్చలు జరిగేవి. ఆ సంభాషణలలో ఎంతో లోతు ఉండేది, వాటిలో పాల్గొనేవారికి ఏంతో చాతుర్యం ఉండేది, అలా మాట్లాడటానికి ఎంతో, భాష రావాలి, చమత్కారం తెలియాలి, ఎదుటివారిపై గౌరవం ఉండాలి. ఇంట్లో మాటలుకూడా ఒక పద్ధతిగా ఉండేవి. అటుపైన కాలేజీలోను, క్లాసురూములోనూ, యూనివర్శిటి కాంటీన్లలోనూ చర్చలు కూడా లోతుగా జరిగేవి. దానికో లక్ష్యం ఉండేది. సంభాషణకి కావాల్సిన నైపుణ్యం, చర్చకి కావాల్సిన విషయసమగ్రత మొదలైనవి వేగవంతమైపోయిన డిజిటల్ మీడియంలో పెరుగుతున్న అసహనంతో పాటూ కనుమరుగైపోతున్నాయి.

సెల్ ఫోన్లకి, ఛాట్లకి అలవాటుపడిన విద్యార్ఠులు, గంటసేపుకూడా పాఠం వినలేకపోతున్నారనీ, పదే పదే ఒకే రకం ప్రశ్నలు అడుగుతుంటారనీ. రాను రానూ, ఆలోచనా శక్తి, అధ్యయనాభిలాష యూనివర్శిటి విద్యార్థులలో కూడా తగ్గిపోతున్నాయని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి.

బాహ్యప్రపంచంలో ఇద్దరి మధ్య సంబంధం ఎవరికీ తెలియకుండా మరుగుపరచడం దాదాపు అసాధ్యం, అదే నెట్లో స్నేహాలు మూడోకంటికి తెలియకుండా నడపవచ్చు (స్వర్వాంతర్యామి గూగూలమ్మకి తెలియని రహస్యం ఉండదనుకోండి). దీనిమూలంగా ఎన్నో సమస్యల పాలవుతూ ఉంటారు చాలా మంది. ఒకప్పుడు, తెలుగు నెట్ ప్రపంచంలోనే, అసలు లేని వ్యక్తులని సృష్టించి, ఉన్నట్టుగా అందర్నీ నమ్మించిన ఉదంతాలు ఉన్నాయి. మన మాటలు గాల్లో కలిసిపోతాయి, కాని చాట్లో టైపు చేసిన మాటలు ఎంచక్కగా అవతల మనిషి దాచుకొని, వాటితో ఏమైనా చెయ్యొచ్చు.

ఆన్లైనులో మనం వేసుకునే మేకప్పు, స్టేజి మీద డ్రామా ఆర్టిస్టు మేకప్పులాంటిదే. అదే నిజం కాదు. అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, విజయవంతంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ, ఆ ఆకుపచ్చ చుక్క వెనకాల చిక్కటి చీకటి చాలానే ఉంటుంది. “We are compelled to show the successful, happy side of ourselves on the net, which is a farse” అంటున్నారు ఎంతోమంది సోషియాలజిస్టులు. దీనిమూలంగా, చుట్టూ ఉన్నవారిమీద ఒకరకం ఒత్తిడి పెరుగుతుంది – అంతా ఎంతో బాగున్నారు, మనమెందుకిలా ఉన్నాం అనే ప్రశ్న తొలుస్తూ ఉంటుంది.

అందుకే, ఇంటర్నెట్ వాడకం, ఛాటింగుపై మనకి నియంత్రణ అవసరం అంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఫేస్బుక్ లో జరిగే సంభాషణలు అధ్యయనం చేసిన బృందం, మానసిక ఆరోగ్యానికి, ఫేస్బుక్ లో దొరికే “సాహచర్యానికి” కొంత సంబంధం ఉందని ప్రకటించింది:

ఏదేమైనా, నెట్ మన జీవితాలని, సామాజిక సంబంధాలని ఆక్రమించుకుంది. ప్రపంచం చిన్నదైపోవడం మూలంగా ఎన్నో కొత్త అవకాశాలు, సౌకర్యాలు ఉన్నాయి. స్లాక్, స్కైపు లాంటి సాధానాలవల్ల ప్రపంచంలొ ఎక్కడైనా ఉండి, అంతా ఒకేచోట ఉన్నట్టుగా పనిచేసుకోవచ్చు. ఉదాహరణకి, వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్ వేరు వేరు దేశాల్లో ఉన్నా కూడా, స్కైపు, ఈమైలు ద్వారానే కలిసి పనిచేస్తూ ఎన్నో పుస్తకాలు రాసారు.

అందుకే ఇంటర్నెట్టు సౌకర్యాలని తీసిపారెయ్యలేం, కానీ వీలయినంతవరకూ, రోజులో కొంతభాగం ఇంటర్నెట్టుకి, డిజిటల్ పరికరాలకి దూరంగా అసలైన ప్రపంచంతో, మనవారైన మనుషులతో గడపడం మాత్రం చాలా అవసరం.

టర్కిల్ మాటల్లోనే “We are not doing justice to the complexity of the problems we face, just as we are not doing justice to each other. We need to learn how to be on a digital diet so that we can make healthy choices about the kind of life we want to lead, the kind of life that will make us productive, and how we can be content and fulfilled individually and in relationships”.

In an uninhibited space, I could be dangerous to others అనే చట్టపరమైన హెచ్చరిక ఒకటి ఇక ప్రతి మనిషిపైన ప్రకటించాలేమో!

**** (*) ****

స్వాతికుమారి బండ్లమూడి, “అనుకోకుండా [2]”, కినిగె పత్రిక, ఏప్రెల్, 2014
Samuel Greengard, “Living in a Digital World”, CACM, October, 2011
Robert Kraut and Moira Burke, “Internet Use and Psychological Well Being – effects of Activity and Audiance”, CACM, December 2015
Sherry Turkle, Alone Together: Why We Expect More from Technology and Less from Each Other, Basic Books; First Trade Paper Edition edition
Sherry Turkle’s TED Talk: “connected but alone
Clifford Nass, “The Man Who Lied to His Laptop: What Machines Teach Us About Human Relationships” Penguin Group, 2010