ప్రత్యేకం

మెటాకవితలు మూడు

ఫిబ్రవరి 2017

విత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.

కవిత్వారాధన

పారే నీటిలో, కరిగే క్షణాలతో
ఉరికే నదిని వీక్షిస్తూ
కాలమొక నదేనని గుర్తిస్తూ
నదిలానే మనమూ పక్కదార్లు పడతామనీ
నీటిలానే మన మోములూ మాయమయేననీ!

మెలకువ కూడా మరొక కలేననీ
ఇది కల కాకూడదనే స్వప్నమైనా
మరణం తప్పదంటూ నాడులన్నీ ఇంకిన భయమైనా
ప్రతిరాత్రి మరణించే ఒక కలే కదా!

ప్రతీ రోజూ ప్రతీ వత్సరమూ
మనిషిగా గతించిపోయిన కాలమంతటికీ ప్రతీకగా
అతన్ని ఆక్రమించుకునే వయసుని
సంగీతంగా, శబ్దంగా, సంకేతంగా మారుస్తూ

మరణంలోనూ ఒక కలనీ
సాయం సంధ్యలో మెరిసే విషాదాన్నీ
దర్శించేదే కవిత్వం
వినయమై, అమృతమయమై
కవిత్వం

ఉదయాస్తమయాలుగా పునరావృతమవుతూ
ఒక్కోపరి ఏ సాయంత్రపు వేళలోనో మూర్తిమంతమై
అకాశపు అద్దపులోతుల్లోంచి మనకేసి పరికించి చూస్తుందే
ఆ అద్దమే కవిత్వం

తనకి దాసుడై,
తొలిప్రేమలోతుల్లో విలపిస్తూ
మాయలన్నీ వదులుకున్న యులిసిస్
మోము మనకి చూపించిన ఇతికా వంటిదే
కవిత్వం

మైమరపించే జీవనది
అంతులేని ప్రవాహమది
తన కదలికని తనే ప్రతిబింబిస్తూ
కుదురులేని హిరాక్లిటస్ తనకు తానై
వేరైనట్టుగా, కదిలే నదిలా
కవిత్వం

Art of Poetry, by Jorge Luis Borges
English Translation: Anthony Kerrigan
Telugu Translation: Nagaraju Pappu


హోర్హె లూయిస్ బోర్హెస్ కవిత్వం చదివిన ప్రతిసారీ, అతని ప్రతి కవితలోనూ ఏదో తెలుగుతనం ఉన్నట్టు తోస్తుంది నాకెందుకో.
అతని ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది – ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దేన్నో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా.

Pages: 1 2 3