కథ

నాలుగు స్తంభాలాట

మే 2016

ఆడపావురం

“నేను అతన్ని చంపాలనుకోలేదు. నన్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేనే అతన్ని పొడిచాను. తప్పు నాది. నా బిడ్డది కాదు. నా బిడ్డనీ, నా చెల్లినీ, నా భర్తనీ వదిలేయండి. విచారించడానికి ఎన్ని చోట్ల నుండో వచ్చిన ఈ పెద్దల పంచాయితీకి ఏం జరిగిందో చెప్తాను…

అదిగో ఆ కనపడుతున్న రావిచెట్టు గూడే మా నివాసం. ఇంట్లో నేను, నా కూతురు, మా ఆయన, నా తిక్క చెల్లి ఉంటాం. తిక్క అంటే పెద్ద తిక్కదేం కాదు కాని అస్తమానం ఏవేవో తింగరి మాటలు మాట్లాడుతుంటుంది. పాపం అనాకారిదని దాన్నెవరూ పెళ్ళి చేసుకోకపోతే మా అమ్మానాన్నలు పోయాక మా ఇంట్లోనే ఉంచుకున్నాను. మా ఆయనకి పనే దైవం. మా కోసం ఎక్కడెక్కడికో ఆహార సంపాదన కోసం వెళుతుంటాడు. ఇంటికి వస్తే చాలు మా యీ తిక్కది అతని మీద పడి ఏమిటేమిటో మాట్లాడుతూ విసిగిస్తుంటుంది. దాని వల్ల మా ఇద్దరికీ తగాదాలు కాని లేకపోతే మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం.

నాకు సంగీతమంటే చాలా ఇష్టం. నేను మధురంగా పాడతానని అందరూ అంటారు. ఎప్పుడూ పాటలు పాడుకుంటూ గడుపుతాను. ముఖ్యంగా వెన్నెల్లో ఈ మైదానంలో పాడుకుంటుంటే నాకెంతో హాయిగా ఉంటుంది.

మా ఊరికి ఉత్తరాన చెరువు. చెరువు పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం. ఆ గుడి గోపురం ఎంత ఎత్తంటే చుట్టుపక్కల ఉండే ఊళ్ళవాళ్ళు ఏ పని మొదలుపెడుతున్నా వాళ్ళ ఊళ్ళనుండే గోపురాన్ని చూసి దణ్ణం పెట్టుకుని మొక్కుకుంటారు. ఎక్కడెక్కడినుండో వచ్చే పక్షులకి అది నిలయం. అదిగో అలా ఎక్కడ్నించొచ్చాడో… ఇతను ఓ గోపురం గూట్లోకి చేరుకున్నాడు. ‘అతడు అచ్చం నీలాగే పాడతాడని కొందరు, ఎన్నో సంగీత కచ్చేరీలు చేశాడంట’ అని కొందరు నాతో అన్నారు కాని నేనతని పట్ల ఆసక్తి చూపించలేదు. ఇతరుల పట్ల ఆసక్తి చూపించే స్వభావం కాదు నాది. అతనికి ఈ ఊరూ, ఊరి వారికీ అతనూ నచ్చినట్లుంది, ఇక్కడే ఉండసాగాడు. ఊరంతా అతన్ని ‘గోపురం’ అని పిలుస్తున్నారు.

ఇక నా కూతురికి కూడా సంగీతమంటే ప్రాణం. చిన్నప్పటి నుండే దానికి పాటలు నేర్పాను. నాలాగా పాడుతుంది. నాకంటే బాగా పాటలు పాడాలనే ఉత్సాహం దానికి. ప్రతి పండుగకీ తన స్నేహితురాళ్ళతో గుడికి వెళ్ళి పాటలు పాడుతుంది. పెద్ద పండుగకి గుడికి వెళ్ళినప్పుడు ఈ గోపురాన్ని చూసిందట. అతన్ని చూసి ఇంటికి వచ్చింది మొదలు అతని గురించే నాకు చెప్పసాగింది. ‘చాలా బాగా పాడుతున్నాడమ్మా, అతని దగ్గర సంగీతం నేర్చుకుంటాను’ అని పోరింది. సరేనన్నాను. వెళ్ళిన మూడు రోజులూ అతని గురించి ఏవేవో చెప్పేది. నా చెల్లెలు మా మధ్యలో దూరి అతన్ని గురించి ఆరాలు తీసేది.

ఈ పిల్ల నాలుగో నాడు సంగీతానికి వెళ్ళనంటే వెళ్ళనంది. ‘ఎందుకే, ఏమిటే’ అంటే ‘ముందు బాగానే పాడాడు కాని ఇప్పుడేం బాగా పాడటం లేదు, నాకు నచ్చలేదు’ అంది. సరేలే అని ఊరుకున్నాను.

ఈ పిల్ల మానేయడానికి కారణాలు ఏమిటేమిటో ఊహించుకుందేమో మా తిక్కది ఏమిటేమిటో మాట్లాడింది. చిన్నపిల్లలతో లేనిపోని మాటలెందుకని నాకు చాలా కోపం వచ్చి ఇక అతన్ని గురించిన ప్రస్తావన ఇంట్లో వద్దని చెప్పాను. తర్వాత ఆ గోపురం సంగతే మేం మర్చిపోయాం.

మొన్న పౌర్ణమి నాడు – మా ఆయన ఊరెళ్ళి చాలా రోజులయినా ఇంకా రాలేదెందుకో అని బాధపడి, చల్లగాలిలో తిరిగితే బావుంటుందని మైదానంలో పాడుకుంటున్నాను. ఆ సమయంలో గోపురం నా దగ్గరకి వచ్చాడు. నా గొంతులో గొంతు కలిపి పాడాడు. విలక్షణమైన గొంతు అతనిది. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అంత బాగా పాడటం కుదరదు. పాట ముగిశాక అతను నన్ను హత్తుకోబోయాడు. అతని స్వరం వింటే ఎవరైనా మత్తులో పడిపోవలసిందే. అయితే నేను గభాల్న తెప్పరిల్లి అతని పాదాలకు నమస్కరించి వేగంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఇదంతా చూసిందేమో వాకిట్లోకి నాకెదురొచ్చి ఏదో వెతుకుతున్నట్లు నావైపు చూస్తున్న నా చెల్లిని కోపంగా చూస్తూ నా లోపలి గదిలోకి వెళ్ళిపోయాను.
ఆ మర్నాడు అంటే నిన్న అతను మళ్ళీ వస్తాడేమోనన్న అనుమానంతో రావిచెట్టుకి దూరంగా అడవిదాకా వెళ్ళి ఎవరికీ వినపడకుండా సన్నని స్వరంతో పాడుకుంటున్నాను. అతను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అతను నా పక్కన నిశ్శబ్దంగా చేరి నాకంటే సున్నితమైన గొంతుతో పాడసాగాడు. అది నిజంగా అద్భుత క్షణం. గాలి కూడా రాగరంజితమైన ఆ వేళ…. ఆ వేళ, అతను నన్ను పట్టుకుని బలవంతంగా ఆక్రమించుకుంటుంటే పొడిచేశాను. ఎగజిమ్మిన రక్తం నా ఒంటి మీద కూడా పడింది. అది చూడగానే అతనేమయ్యాడో కూడా గమనించుకోలేదు నేను. భయంతో పారిపోయాను. ఇంటికి వెళితే చెల్లి చూపులకి సమాధానం చెప్పవలసి వస్తుందని నేరుగా చెరువు దగ్గరకి వెళ్ళి రక్తాన్ని శుభ్రంగా కడుక్కుని ఇంటికి వచ్చాను.

స్నేహితుల ఇంటి నుండి వస్తూ అతన్ని చూసిన నా కూతురు పెద్దగా కేకలు వేస్తే ఈ దగ్గరిళ్ళ వాళ్ళు వచ్చి అతన్ని కాపాడారు. అరిచి కేకలు పెట్టిన నా కూతురి మీద హత్యానేరం పడిందని తెలిసి నా గుండెలు బ్రద్దలయ్యాయి. నా కూతుర్నీ, నా చెల్లినీ, ఈరోజు ఉదయాన్నే ఊరినుండి వచ్చిన మా ఆయన్నీ వదిలేయండి. అతన్ని హత్య చేయబోయింది నేను, నా కూతురు కాదు… నా కూతురు కాదు. వాళ్ళని వదిలిపెట్టండి”

పిల్లపావురం

“ఏమిటీ మా అమ్మ తను ఈ హత్య చేశానని చెప్పిందా!? అది అబద్ధం. పాపం తల్లి హృదయం, తన కూతురే ఈ హత్య చేసి ఉంటుందని నమ్మి – అంటే నేను ఈ హత్య చేసి ఉంటానని అనుకుని – నింద తన మీద వేసుకుంటోంది. ఏం జరిగిందో నేను చెప్పేది వినండి…

చాలా చిన్న వయసునుండే నేను మా అమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. గోపురం పావురం మా ఊరు వచ్చేంతవరకూ నాకు మా అమ్మ పాటే అపురూపం అనుకునేదాన్ని. నా స్నేహితులు ‘మీ అమ్మకంటే కూడా బాగా పాడతాడు గోపురం’ అంటే నేను నమ్మలేదు. పోయిన సంక్రాంతి రోజు నేను నా స్నేహితులతో గుడికి వెళ్ళేప్పటికి అతను ఆ వేణుగోపాలుడిని కీర్తిస్తూ పాడుతున్నాడు. లోకంలోకెల్లా అమ్మ పాటే గొప్పదనుకుంటున్న నేను అతని పాట వినగానే అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఇంటికెళ్ళినా నా చెవుల్లో గోపురం పాడిన పాటే మార్మోగుతోంది. ఇక ఆగలేక చిరుచీకట్లు అలుముకుంటున్న వేళ ఒంటరిగా చెరువొడ్డుకు వెళ్ళాను.

పగలంతా స్వామిని కీర్తించి గూట్లోకి పోయిన గోపురం పావురం బయటకి రానే లేదు. అక్కడివాళ్ళని అడిగితే చంద్రుడు బయటకి రాగానే అతనూ బయటకి వస్తాడు అన్నారు. చూసి చూసి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. రెండు రోజులు గడిచినా అతను సాయంత్రాలు గుడిలో పాడుతున్నప్పుడు మైమరచి వినడమే కాని ఒంటరిగా అతనితో మాట్లాడటానికి నాకు కుదరనే లేదు.

మూడో రోజు ఓపిగ్గా అతని కోసం ఎదురు చూశాను. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆరుబయటకి వచ్చి పాటలు పాడటం మొదలు పెట్టాడు. పుచ్చపువ్వులా వెన్నెల కాస్తోంది. పాటలు పాడుతూ, మధ్య మధ్యలో చందమామతో కబుర్లు చెప్తూ కవితలల్లుతోన్న గోపురాన్ని చూడగానే నాకు ఆహా! అనిపించింది. అతన్ని నేను… ఊహుఁ…. అతని దగ్గరకి వెళ్ళిన నన్ను ఏదో ఓ రకంగా చూశాడు. నాకు భయం వేసి ఇంటికి వచ్చేశాను.

సంగీతానికి ఇక వెళ్ళనని ఏదో చెప్పి తప్పించుకున్నాను కాని అమ్మకి నా మీదో, గోపురం మీదో అనుమానం వచ్చిందని అనిపించింది. పిన్ని చాలా సేపు ఏవేవో ప్రశ్నలతో విసిగించింది. అమ్మ పిన్నిని కోప్పడి ‘రాత్రుళ్ళు బయటకి వెళ్ళొద్దు, వెళ్ళాలంటే నా అనుమతి తీసుకుని వెళ్ళు’ అంది నా వైపు చూస్తూ.

చాలా రోజులు నేను అతన్ని చూడలేదు. తర్వాత అప్పుడప్పుడూ గుడిలో అతన్ని చూసినా నాకేం కోపం కలగలేదు. పైగా ఆ సంఘటన తల్చుకుని నవ్వుకునేదాన్ని.

మొన్న రావిచెట్టుకి ఇవతలగా ఉన్న మైదానంలో అమ్మ పాడుకుంటోంది. నేను గూట్లో వెచ్చగా కూర్చుని కునికిపాట్లు పడుతూ అమ్మ పాడుతున్న పాటని వింటున్నాను. పిన్ని వాకిట్లో ఎక్కడో ఉంది. గోపురం అక్కడకి ఎప్పుడొచ్చాడో మరి అమ్మతో కలిసి పాడుతున్నాడు. అతని గొంతుని గుర్తుపట్టి పడుకున్నదాన్నల్లా ఉలిక్కిపడి లేచి వాళ్ళనే చూడసాగాను. కాసేపటికి పాట ముగిసింది.

అమ్మని కౌగిలించుకోమన్నట్లుగా గోపురం తన చేతులు చాపాడు. ఏం జరగబోతుందోనన్న భయాందోళనలతో ఒక్కసారిగా లేచి వాళ్ళ వైపే ఆత్రుతగా చూశాను. అమ్మ అడ్డంగా తల ఊపుతూ వంగి అతని పాదాలకు నమస్కరించి ఇంటికి వచ్చింది. నేనేమీ చూడనట్లు, నిద్రపోతున్నట్లు నా పక్క మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను.
అమ్మ నిద్రపోయాక గోపురం అక్కడే ఉన్నాడేమోనన్న అనుమానంతో బయటకి తొంగి చూశాను. గాలి విసురుగా వీస్తోంది. అంతవరకూ వెన్నెలని కురిపిస్తున్న చందమామ ఏమయ్యాడో మరి అంతటా అంధకారం అలుముకుని ఉంది. కళ్ళు చిట్లించి చూసినా నాకతను కనపడలేదు.

నిన్నటి పగలంతా నాకు ఆలోచనలతో తల భారమైంది. అతని ప్రవర్తనని గురించి సంజాయిషీ అడగాలనీ, అతన్ని నిలదీయాలనీ అనిపించింది. చీకట్లు ముసరగానే చెరువు గట్టుకి వెళ్ళాను. అతను నాకు కనపడలేదు. చాలా పొద్దుపోయే వరకూ అతని కోసం చూశాను. వాన మొదలవడంతో ఇంటికి వస్తుండగా మా ఇంటి కిటికీ లోంచి మా పిన్ని మైదానంలోకి ఆసక్తిగా చూడటం కనిపించింది. ‘ఏమిటీ ఇంత రాత్రి వేళ ఆమె చూస్తున్న దృశ్యం!?’ అనుకుంటుండగా మా నాన్న గబగబా ఇంట్లోకి వెళ్ళడం, పిన్ని నవ్వుతూ నాన్నని ఆహ్వానించడం కనిపించింది.

చాలా రోజుల తర్వాత నాన్నని చూసిన సంతోషంతో ‘నాన్నా’ అని పిలవబోతుండగా మూలుగు వినిపించింది. అది గోపురం గొంతే. నాకు స్పష్టంగా తెలిసింది. ఆశ్చర్యంతో మూలుగు వినిపిస్తున్న వైపుకి వెళ్ళాను. అతని రెక్కల క్రింద ఎవరో దారుణంగా పొడిచారు. రక్తం కారిపోతోంది. సన్నగా కురుస్తున్న వర్షంలో రక్తం నీరుగా మారి పలచనవుతోంది. అతన్ని పరీక్షిస్తున్న నన్ను అతను “ప్రియా, నువ్వేనా, నన్ను క్షమించి వచ్చావా” అన్నాడు. అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. నేను ఏదో చెప్పబోయేలోపు మళ్ళీ అతనే కళ్ళెత్తి “ప్రియ నేస్తమా! స్వేచ్ఛలో బాధ్యత ఉండాలని, ప్రేమలో కోరిక ఉండకూడదనీ గ్రహించలేకపోయాను. శిక్ష ముగిసిపోయిందిగా! ఆ లోకాల చివరనెక్కడో విరగబూసిన పరిమళ పుష్పాల తోటలో నిన్ను కలుసుకుంటాను” అంటూ నన్ను తాకాలని శరీరాన్ని కదిలించాడు. కదిలిన మరుక్షణం అతను స్పృహ కోల్పోయాడు.

అతని మాటలు అర్థం చేసుకోవడం సంగతి అటుంచి, అతనసలు ఏం మాట్లాడుతున్నాడోనన్న ఆలోచన కూడా కలగని నేను పెద్దగా అరుస్తూ కేకలు పెట్టాను. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మా ఊరిపెద్ద గాయం మీద ఏదో ఆకు పసరు పోశాడు. అందరం కలిసి అతన్ని ఇంటికి చేర్చాం. వెలుతురొచ్చేవరకూ అక్కడే ఉండి ఉదయం ఇంటికి వచ్చాను. నేను చెప్తేనే మా అమ్మకి ఈ సంగతి తెలిసింది.

హత్య ఎవరు చేశారో నేను చూడలేదు. మా అమ్మ మాత్రం కాదు… ఖచ్చితంగా చెప్పగలను, ఆమె అసలా పని చేయలేదు, చేయదు కూడా.”

తిక్కపావురం

“ఏంది చెప్పేదీ, కుటుంబాన్ని ఈదిలో ఏసుకోవడమే గదా మీకు చెప్పడమంటే… కర్మగాకపోతే. ఎవడికి తెలుసూ? ఎవరాడిని పొడిచారో!? ఆ తల్లీ కూతుళ్ళల్లో ఎవరో ఒకరు పొడిచి ఉంటారు. లేకపోతే ఇద్దరూ కలిసి పొడిచారో! ఇద్దరికీ వాడి మీద కన్నే. వాడికేమో మా అక్క మీద కన్నూ… పాడుపీడ, చావకుండా బతికాడు, ఇట్లాంటోళ్ళు అదేమిటో తొందరగా చావరు.

అబ్బబ్బా! ఏమి కులుక్కుంటా చెప్పిందో మా పిల్లది వాడి గురించీ… చెప్పేటప్పుడు ఏం వంకర్లు తిరిగిందనుకున్నారూ… తన తండ్రి కంటే ఓ ఏడెనిమిదేళ్ళు తక్కువుంటాయేమో, అంత వయసున్నోడితో ఏందా పనులు? సంగీతపు కూతలు కూయాలని మూడు రోజులు వాడింటికి పోయొచ్చి నాలుగో రోజు నేను పోనంది, అప్పటికే ముఖం మొత్తిందేమో! పోనని తల్లికి చెప్పిందనుకోండీ, ఏమయిందీ, ఎందుకు పోవూ? అని మా అక్క పిల్లని అడిగి తెలుసుకోవద్దూ!!? నేను అడుగుతుంటే పెద్ద ప్రతివ్రతలాగా నా మీద విసుక్కుంది. తర్వాత పిల్లని బయటకి పోకుండా కాపలా కాసింది. తల్లికి అనుమానం కలిగితేనేగా బయటకి పోనివ్వంది. లోపల అంతా దాచుకోని పైకి మాత్రం ఏమీ తెలియనిదాన్లా నటనలు. నాకు చేతకాదమ్మా!

వాడు… పిల్లని మరిగినోడు… పిల్లది రాకపోతే ఊరుకుంటాడా నేరుగా ఇంటికే రాడా? వస్తాడని ఎదురు చూశా…. తప్పు చేసినోడు ఎందుకొస్తాడు? సరే చాన్నాళ్ళకి గుళ్ళో కనపడితే అడిగా ‘మా పిల్లది నీ దగ్గరకి పాఠాలకి రావడం మానేస్తే మా ఇంటికొచ్చి చెప్పకూడదా’ అని. ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టాడు. నేను ఇవతలకి వచ్చాక పక్కనోళ్ళని నా గురించి విచారిస్తున్నాడు.

ఇంటికి రమ్మని పిలిచినా రానోడికి మా ఇంటి ముందేం పనీ!? మొన్న ఏం తింగరి పుట్టిందో వెధవకి మా మైదానంలోకి చేరి మా అక్క పాడుకుంటుంటే పాట కలిపాడు. పాట అయ్యాక అదేందో వీడి సొత్తులాగా చేతుల్లోకి లాక్కున్నాడు. మాది… ఇంత వయసొచ్చిందీ, పెళ్ళయినదీ… లాగిపెట్టి వాడి చెంప మీద ఒకటెయ్యొద్దూ… వగలు పోతా, నవ్వుకుంటా ఇంట్లోకి వచ్చింది.

వాడూరుకుంటాడా రెండో రోజు కూడా వచ్చాడు. మైదానంలో కాసేపు తచ్చట్లాడి అడవి వైపు పడి పోవడం చూశా. అప్పుడు ఇంట్లో అమ్మాలేదూ, కూతురూ లేదూ… ఇద్దర్లో ఎవరు ఈ పని చేశారో నేను చూళ్ళా… ఊరి నుండి మా బావొస్తే… అహ! బావొచ్చింది పొద్దున కదా!? మొన్న వీడు ఇంట్లోకి ఏడొస్తాడోనని సరిగ్గా నిద్రపోకపోతిని… నిన్న రాత్రి పెందలాడే నిద్రపోయా. పొద్దున బావని చూసి లేచి పలకరించి మళ్ళీ పడుకున్నా… ఉదయం ఊళ్ళోకి పోతే తల్లీకూతుళ్ళ గురించి గుట్టలు పడి చెప్పుకుంటున్నారు.
నాకూ, మా బావకీ ఏం సంబంధమనీ… సాయంకాలమయ్యేప్పటికి పంచాయితీకి లాగారు? మీకంటే తెలియదనుకుందాం, ఊరోళ్ళ కళ్ళూ మూసుకుపోయినయ్యా? ఏం జరిగిందో వాళ్ళకి తెలియదా!?

మగపావురం

“నాకేమీ తెలియదండీ… నాకు కాని, నా కుటుంబానికి కాని అతనితో పరిచయమే లేదు. నేనతన్ని గురించి విన్నది అతను బాగా పాటలు పాడతాడని మాత్రమే. నేను ఈరోజు ఉదయమే ఊరినుండి వచ్చాను. ఇంటికొచ్చేప్పటికి మా మరదలు నిద్రపోతున్నదల్లా లేచింది. మా ఆవిడ, మా అమ్మాయి లోపల గదిలో ఉంటారు, నిద్రపోయే వాళ్ళని లేపడం ఎందుకులే అని వరండాలో పడుకునే మా మరదల్ని పలకరించి విశ్రాంతిగా కూర్చును ఉన్నాను. కాసేపటికి మా పిల్ల ఏడుస్తూ వచ్చి చెప్తే మా ఇంట్లో అందరికీ తెలిసింది ఈ హత్య సంగతి. పిల్ల ఇంటికి రాకపోతే చూసుకోకుండా ఏం చేస్తున్నారని మా ఆవిడనీ, మరదల్నీ పొద్దుట్నిండీ అరుస్తానే ఉన్నాను.

అతను ఎక్కడనుండొచ్చాడో, అతనికెవరైనా పాత శత్రువులున్నారో లేక ఊళ్ళో ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయో విచారించి తెలుసుకోకుండా మమ్మల్ని ఇలా నిలదీయడం బాగాలేదు. మా ఇంట్లో ఎవరూ ఇలాంటి పని చేయరు”


గోపురం పావురం

“ఏం చెప్పమంటారు? నిన్నటి నా మూగ విషాదాన్ని చెప్పనా!? కలవని తీరాల నడుమ సాగుతున్న ఇప్పటి నా యీ కథని చెప్పనా!!?
అయినా అవన్నీ మీకొద్దు కదా! నన్నెవరు హత్య చేయబోయారో మీకు కావాలి… నన్నెవరూ పొడవలేదు. నన్ను నేనే పొడుచుకున్నాను. ‘కోరతగని దాన్ని కోరుకున్నందుకు’ నాకు శిక్ష పడింది. నేను శిక్షని అనుభవించినవాడిని, మృత్యువుని స్పృశించి విశ్వప్రేమ రుచిని తెలుసుకున్నవాడిని. అయితే నన్నెవరూ హత్య చేయబోలేదు అంటే మీరొప్పుకోరుగా… జరిగిందేమిటో చెప్తాను…

సంగీతంలో ప్రజ్ఞని సంపాదించాను, ఎన్నో కచ్చేరీలు చేశాను. అయినా ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో కావాలని తపన. పల్లెల్లో కొన్నాళ్ళు ఉంటే శాంతి లభిస్తుందేమోనని ఊళ్ళ వెంబడి పడి తిరుగుతున్నాను. ఈ వేణుగోపాలుడి గుడిగోపురం నన్ను ఆకర్షించింది. వచ్చాను. ఊరి వారంతా నన్ను, నా పాటని ఆదరించారు.
నాలాగా అద్భుతంగా పాటలు పాడే ‘ఆమె’ని గురించి నాతో ఎవరో అన్నారు కాని పల్లెటూళ్ళ వాళ్ళు మునగచెట్టునే మహావృక్షం అంటారుగా అని నవ్వుకున్నాను కాని ఆమెని చూడాలని ఏనాడూ అనుకోలేదు.

ఆరోజు సంక్రాంతి పండుగ. పగలంతా గుడిలో స్వామికి సంగీత కచ్చేరీ చేశాను. నన్ను విన్న ఆమె కూతురు – ఆమె కూతురని నాకప్పుడు తెలియదు – తర్వాత కొన్నాళ్ళకి ఆమె చెల్లి నన్ను గుడిలో పట్టుకుని ఏమిటోమిటో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే పక్కనున్న వాళ్ళని అడిగి ఈ రావిచెట్టు కుటుంబాన్ని గురించి తెలుసుకున్నాను – ఆ పిల్లకి పద్దెనిమిదీ పంతొమ్మిదేళ్ళుంటాయేమో ఆ రాత్రి వెన్నెల్లో కూర్చుని పాడుకుంటున్న నా వైపుకి వచ్చింది. ఏదో మైమరుపుతో నన్ను హత్తుకుంది.

మాటలేల మరి పరిచయాలేల అన్నట్లు హఠాత్తుగా నా చేతుల్లోకి చేరిన ఆ పిల్లని అప్రయత్నంగా కౌగిలించుకున్నాను. తనేదో దేవలోకంలో ఉన్నంత మత్తుతో “ఎందుకొచ్చావిక్కడకి? నా కోసమేనా” అంది. నన్ను మళ్ళీ మళ్ళీ హత్తుకుంటూ ఇదే కలవరింత.

ఒక్కసారిగా నాకు నా గుండెల్లో ఏదో ఇబ్బంది కలిగినట్లయింది. ఆమెని బంధించిన నా చేతులు బలహీనమయ్యాయి. “కాదు, నీ కోసం రాలేదు. కొత్త చోట్లకి వెళ్ళడం నాకు సరదా. నీకు తెలుసా, నీకు తెలియని ప్రదేశాల్లో నీకు పరిచయం పెరిగే కొద్దీ అది నీతో కొన్ని భావాలను పంచుకుంటుంది. నీకు కావలసిన దాన్ని దొరికేట్లు చేస్తుంది. అందుకే వెతుకుతున్నాను దాని కోసం, ఎప్పటికి దొరుకుతుందో మరి!? అయితే ఏనాటికైనా ఆ గుండె చప్పుడు వింటానన్న నమ్మకం నాకుంది” అని దిగులుగా గొణుక్కున్నాను.
నేను చెప్పింది అర్థం కాని ఆ పిల్ల నన్ను నెట్టేసి ‘అయితే ఎందుకు కౌగిలించుకున్నా’వంటూ నిందించింది. “ఎదుటి వారి ప్రేమ ఎలాంటిదో మనలో ప్రతి ఒక్కరికీ ఏదో స్థాయిలో అర్థం అవగలగాలి. నువ్వు నన్ను హత్తుకునే ముందే ఆ స్పష్టత నీకు ఉందనుకున్నాను” అన్నాను.

ఆ మాటలకి ఆ పిల్ల మరింత కోపంతో మండిపడుతూ వెళ్ళిపోయింది. ఆమె ఉక్రోషానికి నేను నవ్వుకున్నాను. తర్వాతెప్పుడో చాన్నాళ్ళకి అప్పుడప్పుడూ కనిపించేది, ఇద్దరం నవ్వుకుంటూ సాగిపోయేవాళ్ళం.

ఈ సంవత్సరం శీతాకాలం గడిచి వసంతం వచ్చాక ఎందుకో తెలియదు కాని నాలో ఏదో తపన మొదలైంది. ఇక ఊళ్ళో పనేమీ లేనట్లనిపించింది. ఊరిని వదిలిపోవాలని ఉంది కాని ఈ చోట్లో ఏదో తెలియని ఆకర్షణ నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆ ఆకర్షణేమిటో నాకు అంతు పట్టేది కాదు. మొన్న – నిస్పృహనిక భరించలేక మరో చోటుని వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించుకుని, వెళ్ళిపోయేముందు ఊరంతా తిరుగుతూ వీడ్కోలు తీసుకుంటున్నాను.

ఆ సమయంలో ఈ రావిచెట్టు దరిదాపులకి వచ్చిన నాకు గాలిలో తేలుతూ వస్తున్న పాట వినిపించింది. ఆ గొంతు నన్ను కట్టిపడేసింది, ఆ స్వరమాధుర్యం, లాలిత్యం నా హృదయాన్ని ద్రవింపచేసింది. ఎక్కడిదీ పాట అన్నట్లుగా ఆత్రుతతో ఆ వెన్నెల్లో వెతుక్కున్నాను.

ఇదిగో ఈ మైదానంలోనే ఆమె పాడుకుంటోంది. చంద్రుని వెలుగులో ఆమె అందం మిరుమిట్లు గొలుపుతోంది. ఆమె కళ్ళల్లో, పాట పాడుతున్న ఆ పెదవుల్లో ప్రకాశం, వెలుగు, స్పష్టత… ఆమెకి దగ్గరగా వెళ్ళి ఆమె గొంతులో గొంతు కలిపాను. నా ఎద ఆనందరాగాల వెల్లువై ఆమె హృదయాన్ని మీటింది. స్తబ్దమైన ఆ రాత్రిలో వర్ణనాతీతమైన ఆ సౌందర్యాన్ని చూడగానే యుగయుగాలుగా నే వెతుకుతున్నదీమె కోసమేనన్న తలంపు ఉత్తేజితమై గాఢానుభూతిని కలిగించింది.

పాట ముగియగానే ఆమె నాదేనన్నట్లుగా, ఆమెలో కలిసిపోవాలన్నట్లుగా ఆమెను కౌగిలించుకోబోయాను. ఆమె నా కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి, వంగి నా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది.

అంతులేని నిస్పృహతో, నిర్వీర్యతతో అక్కడే కూలబడిపోయాను. ‘వద్దొద్దు’ అనుకుంటూ ఆ ప్రదేశాన్ని చీకట్లతో కప్పేస్తూ నా నేస్తం చంద్రుడు మబ్బుని చాటు చేసుకున్నాడు. వెచ్చని నా నిరాశాశ్రువులు ఉబికి నేలని తడిపాయి. గాలి విసురుగా వీస్తూ చెట్లను ఊపేసింది.

తెల్లవారింది. ఎవరూ చూడకముందే అక్కడ నుండి లేచి నా గూటికి చేరాను. నిన్న పగలంతా అన్నమూ నీళ్ళూ లేకుండా రాత్రి కోసం ఎదురు చూస్తూ గడిపాను. మళ్ళీ మళ్ళీ ఆమె స్వరంలో నా స్వరాన్ని కలపాలనే కాంక్ష నన్ను నిలువనీయడం లేదు. చీకట్లు పడుతుండగా లేచి ఊరి బయటదారిలో కాసేపు గడిపి పొద్దుపోయాక మైదానంలోకి వచ్చాను. ఇక్కడున్న చెట్టూ, పుట్టా, మట్టీ, రాళ్ళూ, నీళ్ళూ – ఆమె తాకిన ప్రతిదీ నాతో ఏదో ఎప్పటినుంచో సంబంధం కలిగి ఉందన్న భావన కలుగుతోంది. అలాంటి భావన మునుపెన్నడూ నేను ఎరిగిలేను.

ఆమె మైదానంలో లేదు. దూరంగా వినవస్తోన్న పాటని ఆధారం చేసుకుని వెతుక్కుంటూ వెళ్ళాను. అవిగో ఆ కొండల చరియలలో ఆకుపచ్చని సముద్రంలా ఉన్న అడవి అంచున ఓ చెట్టు కింద వాలిపోయి పాడుతున్న ఆమె కనిపించింది. ‘ఆహా, ఎంత సౌకుమార్యం ఆమె గొంతు! ఎంతటి లాలిత్యం ఆమె రూపం!? ఆ స్త్రీత్వం వలపు అలై నన్నల్లుకుంటే చాలదూ విశ్వసంగీతమాలపించడానికి!?’ – అప్రయత్నంగా నా కన్నుల్లో చిప్పిల్లిన కన్నీళ్ళతో ఆమెనే గమనిస్తూ కాసేపలాగే చూశాను. ఆ గమకాల నడకని వింటున్న నా రెక్కల్లో ఒక్కసారిగా చైతన్యం పొంగింది. గొంతెత్తి పాడసాగాను. ఈ పచ్చని బయళ్ళల్లో ఆమె స్వరానికి నా స్వరం కలిసి దివ్య స్వరమైంది. కాలం రాగరంజితమై నా గుండె చప్పుడులోని లయలతో కలిసిపోయింది.

ఆ చల్లని రాత్రి, వెన్నెల నీడలో ఆమె ముందుకి ఆత్రంగా వెళ్ళాను. తన్మయియై నా ముందుకు వస్తున్న ఆమెని హత్తుకోవాలని చేతులు చాపాను. నా చేతులని చూడగానే ఒక్క కుదుపుతో ఆగి తెప్పరిల్లి తలని వంచి నమస్కరించి గబగబా రావిచెట్టు వైపుకి వెళ్ళిపోయింది. అంతులేని నిస్సహాయతతో నా గుండె బరువెక్కింది. తేరుకుని గభాల్న ఆమె ముందుకెళ్ళి ఆమె రెక్కని పట్టుకున్నాను. “దయచేసి ఆగు, ఒక్క నిమిషం ఆగి నాతో మాట్లాడి వెళ్ళు” అని వేడుకున్నాను.

“మాట్లాడటానికి ఏమీ లేదు. నువ్వు ప్రశ్నిస్తే మరిన్ని ప్రశ్నలతో ప్రశ్నించగలనేమో కాని” అందామె.

“నేను చేతులు చాస్తుంటే నువ్వెందుకు నమస్కరిస్తున్నావు? ప్రేమ రాగాన్ని వినాలంటే హృదయాన్ని కదా హత్తుకోవాలీ!? వెతుకుతూనే ఉన్నాను, ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాను ఏ గుండె చప్పుడులోనైనా నన్ను నేను దర్శించుకోగలనేమోనని!!”

“కావొచ్చు కాని ముందసలు ఎక్కడ వెతకాలో గ్రహించుకున్నావా?” అని ఆగి “ఇదిగో చూడూ…. మనం సంభాషించే కొద్దీ ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమౌతాయి. అయితే ప్రతి ప్రశ్నకీ ముగింపు ఉన్నదని నేను నమ్ముతాను కనుక ఆఖరి ప్రశ్న తర్వాత చెప్పే సమాధానం ఇప్పుడే చెప్తాను – హత్తుకుంటే ఏం తెలుస్తుందో ఏమో కాని ప్రేమ అంటే అర్థం ‘కౌగిలి’ కాదు అని నాకు స్పష్టంగా తెలుసు. తెలుసును కనుకనే ‘నేను’ నాకు కాపు ఉంది. ఇక నీకు నమస్కరించానంటే నీ విద్వత్తుకి నమస్కరించానని అర్థం” అంది.

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అన్నాను. ఆ మాటంటున్నప్పుడు నా గొంతు వణికింది.

“నువ్వు నా తోటి వాడివి, నిన్నూ నేను ప్రేమిస్తున్నాను” ఆమె అంటున్నది సరిగ్గా అర్థం చేసుకోలేని ఆవేశమేదో నన్ను ఆవహించినట్లయి “ప్రేమించినదానివి ఆహ్వానిస్తుంటే నాలోకి….” నా మాట పూర్తిగా వినిపించుకోకుండా వెళుతున్న ఆమెని చూస్తూ ఆక్రోశపడి ఆఖరి మాటని పెద్దగా అరిచి చెప్పాను. ఆమె వెళ్ళిపోయింది.

కాసేపటికే మబ్బులు దట్టమై చిమ్మచీకటిని పూసుకున్నాయి. చీకటిని అలుముకున్నామని తెలియగానే గభాల్న నాలుక కరుచుకుని అదంతా కరిగిపోయేట్లు కుండపోత వర్షంతో కడుక్కోవడానికి తయారయ్యాయి. అడవిలోని శేఫాలికాపువ్వులు విచ్చుకుని ఓ రకమైన వగరు వాసనని విరజిమ్ముతున్నాయి. ఆమె తిరస్కారాన్ని భరించలేక వంగిపోయి ఏడుస్తున్న నా రెక్కల కింద ఎవరో… బలంగా… చాలా బలంగా పొడిచారు. నేను చూశానా ఎవరు పొడిచారో!? ఏమో! … నాకామె వదనం తప్ప మరేమీ కనిపించని స్థితిలో ఉన్నవాడిని ఎలా చెప్పగలను? నాకు నేనే పొడుచుకున్నానేమో!!?

చినుకులు మొదలయ్యాయి. వర్షంలో తడుస్తూ నేనలాగే పడి ఉన్నాను. ఎవరో తట్టి లేపుతున్నారు. స్పృహ కోల్పోతుండగా తెలిసింది, మోహంలో నా కళ్ళు ఎంత మూసుకుపోయాయో! తట్టి లేపుతున్న వారెవరో మరి, ఎవర్నో… క్షమించమని అడుగుతున్నాను… అంతే. తర్వాతేమయిందో నాకు తెలియదు.

నన్నెవరూ హత్య చేయలేదు, నన్ను నేనే పొడుచుకున్నాను. వర్షం వెలిసినా చూడండీ ఆ రావిచెట్టు ఆకులు ముడుచుకొని ఒక్కొక్క బొట్టునే ఎలా రాలుస్తున్నాయో!? అయితే ఏంలే… ఆకులకి శక్తినవ్వడానికి…. అరె! అదిగదిగో చూడండీ!! విశాలమైన ఈ విశ్వనిలయపు వాకిట్లో ఓ వెచ్చని ఎండ తునక ఎలా కిరణమై వాలిందో!!

**** (*) ****

title artwork: Javed