కథ

గాలిపిట్టలు

అక్టోబర్ 2016

నా పేరు శీను. నా వయసు పదిహేనేళ్ళు. కాదు కాదు – ఇప్పుడు నేను ఇంకా ఆమె కడుపులోనే ఉన్నాను. పదిహేనేళ్ళు అంటే – నేను బతికున్నప్పుడు నా వయసు పదిహేనేళ్ళని.

నేనే ఆమెకి బిడ్డగా పుట్టబోతున్నానని ఆమెకి తెలిసిపోయింది. అదిగో చూడండి!… “నువ్వే కదరా శీనా నా పొట్టలో ఉందీ!? నాకు తెలుసు, నువ్వే నాకు బిడ్దగా పుట్టబోతున్నావు”అని ఎన్ని సార్లు అనుకుంటుందో…

మా నాన్న ఆమె మంచం మీద ఓ పక్కన ఒదిగి పడుకోనున్నాడు. ముందు గదిలో అమ్మమ్మ (నాకు కాబోయే అమ్మమ్మ) దగ్గుతోంది. ఆ పల్లెటూళ్ళో పెంకుటిల్లు బావుంది.

ఇంకాసేపట్లో నా తల్లి కాబోతున్న ఆమె జీవితం గురించి మీకు ఇప్పుడే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి నేను ఈ ప్రపంచంలోకొస్తే ఇక నాకేమీ గుర్తుండవని నాకు తెలుసు.

1

“ఒరేయ్ శీనా, లే వెధవా”నాన్న నా వీపు మీద నిమురుతూ నన్ను లేపుతున్నాడు. రాత్రి తాగొచ్చి ఆ వీపు మీదే నన్ను కొట్టినప్పుడంతా పొద్దున్నే అలా వీపు నిమురుతా లేపుతాడు.

బద్దకంగా కళ్ళు తెరవగానే “శీనా, ఇవాళ నాష్టాకి డబ్బులు లేవురా, ఆ మూలింటాయమ్మ దగ్గర అడిగి పెట్టించుకోని తిను”అన్నాడు.

‘ఆ అక్క చాలా మారిపోయింది నాన్నా, నేను వాళ్ళింటికి పోతే చాలు విసుక్కుంటా మాట్లాడతంది, అసలు నన్ను రానివ్వడం లేదు’అని నాన్నకి ఆరోజు ‘జరిగిన సంగతి’చెప్పాలనిపించింది. చెప్పాలనుకుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి కాని నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు.

నా ముఖం చూసి ‘ఏం జరిగింద’ని అడుగుతాడేమో చెప్పాలని ఈ వారంలో చాలా సార్లు అనుకున్నా. మొన్న పట్టుబట్టి మరీ రెండు చొక్కాలు కొనిపిచ్చుకున్నప్పుడు చెబ్దామనుకున్నా కాని నా వైపు చూడటానికి కూడా ఆయనకి టైముండదు. ఇంక నా మాటేం పట్టించుకుంటాడు?

గబగబా చొక్కా తొడుక్కుంటూ “కుక్కలు జొరబడతయ్, తలుపేసుకోని పడుకోరోయ్”అంటా నాన్న ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు.

ఆ మూలింటికొచ్చినప్పుడు ఆమెకి ఇరవై ఐదేళ్ళు ఉంటాయేమో! నాకు పద్నాలుగేళ్ళు. కాని, చూడటానికి పదహారేళ్ళోడిలా ఉండేవాడిని. ‘మూలింటికి ఎవరో నెల్లూరోళ్ళంట అద్దెకొచ్చార్రా’అని రాముగాడు చెప్తే అందరం ప్రహరీ గోడ మీదుగా తొంగి చూశాం. మాకు అప్పట్లో నెల్లూరోళ్ళు అంటే భలే డబ్బున్న రెడ్లు అనే తెలుసు. కాని ఆమెని చూశాక నెల్లూర్లో ఇంత పేదోళ్ళు కూడా ఉంటారా, పాపం! అనిపించింది.

మా పేటలో మా గుడెసెలు, చిన్నపాటి పెంకుటిళ్ళు, రేకులిళ్ళు రోడ్డుకి ఇవతల వైపు ఉంటాయి. రోడ్డుకి అవతల వైపున్న ఇళ్లూ, ఆ వెనకాల వీధుల్లోనివి అన్నీ బాగా డబ్బున్నోళ్ళ ఇళ్ళు. మా బజారుకి మూలన ఉండే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో, ముఖ్యంగా మూలింటి ముందున్న ఎక్కువ జాగాలో మా గుడెసెల పిల్లలందరం చేరి ఆడుకుంటుంటాం.

ఆ డబ్బులున్న ఇళ్ళల్లో పిల్లలు పొరపాటున కూడా ఈ వీధిలోకి రారు. వాళ్ళ ఇళ్ళు కాలనీలోని అన్ని ఇళ్ళల్లాగే పెద్దవైనా మేము ఎదురుగ్గా ఉన్నామని ఆ వరుసలోని ఇంటి ఓనర్లు ఇళ్ళు తక్కువ అద్దెకి ఇస్తారంట. వెనుక బజార్లో ఉన్న ఇళ్లకున్నట్లు ఎక్కువ అద్దె చెప్తే ఎవరూ రారంట.

మేము ఆ మూలింటికి వచ్చినోళ్ళెవరో చూద్దామని అనుకున్నాం కాని వారం రోజులు ఎవరూ మాకు కనపడలేదు. తర్వాత ఆదివారం పొద్దున ఆరు కూడా కాకుండానే మేము పెద్దపెద్దగా అరుచుకుంటూ కర్రాబిళ్ళా ఆడుకుంటున్నాం. ఆమె గోడమీదుగా చూస్తూ “అబ్బాయ్, ఒరేయ్”అని పెద్దగా అరిచింది. అందరం తలతిప్పి ఆమెవైపు చూశాం. “తెల్లారిందా? ఏందీ గోల?” అంది కోపంగా.

ఆమె సన్నంగా, పీలగా ఉన్నా చాలా అందంగా ఉంది. అయితే ఆమె వేసుకున్న బట్టలు ఆ కాలనీ ఇళ్ళల్లో వాళ్ళలా కాకుండా మా ఇళ్ళల్లో మా అక్కోళ్ళు వేసుకునేలానే పేదగా ఉన్నాయి. మాకు ఆమెని చూడగానే కొత్త అనిపించలేదు. మా గుడెసెల్లో మనిషిలాగే అనిపించింది. అందరం ప్రహరీ గోడ దగ్గరకి వెళ్ళాం. నేనైతే గోడ ఎక్కి కూర్చుని మరీ ఆమెతో మాట్లాడాను. మా పిల్లల గురించీ, ఇంకా మా పేటలో వాళ్ళ వివరాలూ అడిగి చెప్పించుకుంది. నాకు బడి అంటే పడదు, వెళ్ళను. బడికి టైమయిందని పిల్లలందరూ పరిగెత్తారు. నేను మాత్రం ఆమె దగ్గరే ఉండి ఇంకాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను.

ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఒక్కడినే పేకతో ఆడుకుంటుంటే ‘శీనా’అని పిలిచింది. ఆమె గొంతు చాలా నీరసంగా ఉంది. “ఏందక్కా, ఏమయింది? ఎందుకట్టా ఉన్నావ్?” అన్నాను.

“తలనొప్పిగా ఉందిరా, షాప్ కెళ్ళి టాబ్లెట్ తెచ్చిపెడతావా?” అంది డబ్బులు నాకిస్తూ. పరిగెత్తుకుంటూ కొట్టుకు వెళ్ళి టాబ్లెట్ తెచ్చి గోడ మీదుగా పిలిచాను. “లోపలకి రా”అని కేకేసింది ఇంట్లోనుండి.

అలా మొదటిసారిగా ఆమె ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆరోజు నుండీ రోజూ ఉదయం ఆరుగంటలకల్లా ఆమె ఇంట్లో చేరేవాడిని. కొట్టునుండి ఏమైనా తెమ్మంటే తెచ్చి పెట్టడమే కాకుండా ఇంట్లో చిన్న చిన్న పనులేమైనా చెప్తే చేసిపెడుతున్నాను. ఇద్దరం గవ్వలాట ఆడుకునేవాళ్ళం. ఆటలో ఓడిపోతే “బోణీకి బొట్టు”అని ముగ్గురాయితో గీసిన గడుల్లోని పొడిని చేతికి తీసుకుని నాకు బొట్టు పెడుతుంది. అలా బొట్టు పెట్టిచ్చుకునేప్పుడు నేను దొరక్కుండా తప్పించుకోవడం, పెద్దగా నవ్వుకోవడం భలే ఉంటుంది.

నాన్న నాష్టాకి డబ్బులు ఇవ్వని రోజు చద్దన్నమో ఇంకోటో ఏది ఉంటే అది పెట్టేది. టిఫిన్ గురించి పెద్దగా పట్టింపుగా అడిగేది కాదు కాని, మధ్యాహ్నం అన్నం మాత్రం రోజూ అక్కడే తింటున్నాను. నేను ఏ ఆటల్లోనో పడి వెళ్ళకపోతే పిలిచి మరీ అన్నం పెడుతుంది.

ఓ వారం గడిచాక ఆమె ఇంట్లో అతన్ని చూశాను. అప్పటి వరకూ అతని గురించి మా గుడెసెలోళ్ళు చెవులు కొరుక్కుని మరీ చెప్పుకుంటుంటే మంచోడు కాదేమో అనుకున్నాను. కాని చూశాక మామూలుగానే ఉన్నాడే అనుకున్నాను.

అతను రాగానే నన్ను ఇంటికి పంపేసి తలుపులు వేసుకుంది. “అతనెవరక్కా!?” అని తర్వాత రోజు అడిగాను. చెప్పాలా వద్దా అన్నట్లు నా వైపు చూసింది. నా కళ్ళల్లో ఉన్న ఆసక్తిని గమనించిందేమో చెప్పింది. చెప్తూ ఏడ్చింది.

2

“నేను కూడా నీలాగే పేదదాన్ని శీనా! నీ చిన్న వయసులో నీకు తల్లి పోయినట్లే నాకు నా తండ్రి పోయాడు. నేనప్పుడు ఆరో తరగతి చదువుతున్నాను. బాగా చదువుకోని మంచి ఉద్యోగం సంపాదించాలని చిన్నప్పటినుండే పట్టుదలగా చదివేదాన్ని. పదో తరగతి దాకా మాకున్న కొద్ది పొలం కౌలు మీదే బతికాం.

ఇంటర్ కి మా ఊరి పక్కనుండే టౌన్ లో కాలేజీలో చేరాను. అక్కడకి రోజూ వెళ్ళడానికి బస్ చార్జీలు, ఫీజు, పుస్తకాలకి, తినడానికి డబ్బు కోసం ఊళ్ళో మాకున్న కాస్త పొలాన్ని అమ్ముకోవలసి వచ్చింది.

మా పొలం అమ్ముకున్నప్పటి నుండీ అమ్మ ఊళ్ళో వాళ్ళ పొలాల్లో కూలీకి వెళ్ళింది. నాకు డిగ్రీ అయ్యేనాటికి కూలి చేస్తేనే కడుపు నిండే పరిస్థితి ఇంట్లో. ఇద్దరం బిక్కు బిక్కుమంటూ బ్రతికేవాళ్ళం… అచ్చం నీలాగే. కాకపోతే నీది గుడిసె, నాది పెంకుటిల్లు – అదే తేడా. డిగ్రీ పూర్తి చేశాను కాని ఆ డిగ్రీకి ఉద్యోగం దొరకదని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తెలిసొచ్చింది. ఎవరికీ చెప్పుకోలేక ఏడ్చేదాన్ని.

గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే చిన్నదైనా పరవాలేదని బట్టల కొట్లో సేల్స్ గర్ల్ గా పనికి చేరాను”అని ఆగి నా వైపు చూసింది. నేను కథ వింటున్నట్లు వింటూ ముందుకి వంగి “మరి ఈయనెవరూ?” అన్నాను.

“ఈయనే నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇక్కడకి తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్యాక్టరీ నుండి షాపుకు పంపిన బట్టల డబ్బులు వసూలు చేసుకోవడానికి మా షాపుకొచ్చి నా పరిస్థితిని కనిపెట్టి హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను.

వచ్చేముందే నాకు తెలుసు శీనా! నా మీద కన్నేసే నన్ను ఇక్కడకి తీసుకొచ్చాడని. తెలిసే… తెగించే వచ్చాను. ఇతడి సహాయంతో నేను కడుపునిండా తిని మా అమ్మకి ఆకలి లేకుండా చేయాలనే నేననుకుంటున్నది” చెప్తూ ఏడుస్తున్న ఆమెని ఎలా ఓదార్చాలో తెలియలేదు. అసలు ఆమె మాటల్లో సగం నాకు అర్థం కాలేదు. అతను మాత్రం ఆమె భర్త కాదని అర్థమైంది అంతే. నాకు చాలా బాధేసి ఆమెకి దగ్గరగా వెళ్ళి బుగ్గలు తుడిచాను. తుడుస్తుంటే ఇంకా పెద్దగా ఏడ్చింది.

“ఆకలి బాధ ఎవరికీ ఉండకూడదురా శీనా. నీ గురించి ఈయనతో చెప్పి వాళ్ళ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తాను. కాకపోతే నీకు పద్దెనిమిదేళ్ళు రావాలి”అంది. అప్పుడే పెద్ద ఉద్యోగస్తుడిని అయినట్లుగా ఊహించుకుని “అక్క నాకు ఉద్యోగం ఇప్పిస్తుందంట”అని గొప్పగా నా స్నేహితులకి కూడా చెప్పుకున్నాను. ఆమె నాకు తన గురించి చెప్పి ఏడ్చినప్పటినుండీ మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అయినట్లనిపించింది. ఆమెకే సహాయం కావాలన్నా నేనే చేసి పెట్టేవాడిని. బజారుకి, బ్యాంక్ కి – ఆమె ఎక్కడకి వెళ్ళినా నేను తోకలాగా ఉండాల్సిందే. కళ్ళు తిప్పుకోనంత అందంగా తయారైన ఆమెకి నేను ఒక రకంగా బాడీ గార్డ్ ని అయ్యానన్నమాట. అతను ఎక్కువగా రాత్రుళ్ళు పొద్దుపోయాకే వస్తాడు కనుక అతనితో నాకు పరిచయం తక్కువే.

ఆరోజు మేమిద్దరం గవ్వలాట ఆడుకుంటున్నాం. ఆమె ఓడిపోయింది. ఆమె పెట్టినట్లే నేను కూడా “బోణీకి బొట్టు”అంటూ ఆమె నుదుట మీద సున్నం పొడి బొట్టుగా పెట్టాలని ప్రయత్నించాను. ఆమె చేతులు అడ్డం పెట్టుకుని నన్ను పెట్టనివ్వకుండా ముఖం తిప్పుకుంటోంది. ఇద్దరం పెనుగులాడుతున్నాం.

ఆ సమయంలో అతనొచ్చాడు. వెనకనుండి నా జుట్టు పట్టుకుని ఇవతలకి లాగేశాడు. ఆమె అతని ముఖంలోని కోపాన్ని చూసి నవ్వు ఆపేసి భయంగా చూస్తోంది. “ఏందిరా? ఏందా పైన పడటం? ఫో బయటికి. ఇంకోసారి ఇంట్లోకి వచ్చావంటే కాళ్ళిరగ్గొడతా మురికి నాయాలా” అని చీదరించుకున్నట్లుగా అరిచాడు. ఆ కాలనీ వాళ్ళు మమ్మల్ని ఎన్ని సార్లు అట్లా చీదరించుకున్నారో నాకు తెలుసు. నాకు భలే కోపమొచ్చింది. కాని ఏమీ అనకుండా బయటికి వచ్చేశాను.

“సిగ్గులేదా? ఏందా ఇకఇకలు? మురికి లమ్డీకొడుకుని పైనేసుకుని”అంటున్నాడు. ఆమె ఏదో అంటోంది కాని నాకు వినపడలేదు.

తర్వాత రోజు పొద్దున ఇంటి గేటు తీస్తుంటే గబగబా వచ్చి “వెళ్ళిపో శీనా, ఇంకెప్పుడూ రాబాక”అనింది. అతనున్నాడేమో, అందుకనే అలా అంటుందనుకున్నా. కాని ఆ తర్వాత రోజునుండీ అసలు నాకు కనపడటం లేదు. గేట్ కి తాళం వేసి పెడుతున్నారు. గేట్ దగ్గరే కూర్చుంటున్నానని పనిచేసే భాగ్యమ్మ చేత ఇంట్లో ఉండి కూడా ‘లేననో, పనిలో ఉన్నాననో’చెప్పిస్తోంది.

ఆమె ఆ మూలింట్లోకి రాకముందు సాయంత్రం దాకా అన్నం లేకుండా ఆడుకుంటా ఉండేవాడిని. అలాంటిది ఆమె దాదాపు ఏడెనిమిది నెలలు నాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అలవాటు చేసి ఇప్పుడు తనింట్లోకి రానివ్వకపోతుంటే ఆకలితో అల్లాడిపోతున్నాను. పిల్లలందరూ బడికి పోయి హాయిగా మధ్యాహ్నం అన్నం తింటున్నారు కదా, నేను కూడా వెళదామని రెండు రోజులు బడి దాకా వెళ్ళాను. అదేంటో బడి గేట్ చూసి వెళ్ళబుద్ధి కాలేదు. వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఆమె ఇంటి ముందే గేటుని పట్టుకోని వేళ్ళాడుతున్నాను.

నేను శుభ్రంగా లేనని రానివ్వడం లేదేమోనని పోరు పెట్టి నాన్న చేత మంచి బట్టలు కొనిపించుకున్నాను. బాగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆమెకి చూపించాలని గేటు ఎక్కి మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. అతను లోపలే ఉన్నాడు. నన్ను, నా కొత్త బట్టలని చూసి అనుమానంగా చూస్తూ లేచి నాకెదురొచ్చి “ఎట్లొచ్చావురా లోపలకి?” అన్నాడు.

“అక్కకి కొత్తచొక్కా చూపిద్దామనీ….” చిన్నగా నసుగుతా నిలబడ్డాను. బయటకొచ్చి గేట్ వైపు చూసి “గేటు తాళం వేసి ఉంటే ఎట్లొచ్చావురా? ఆఁ… గేటు ఎక్కి వచ్చావా?” అని పెద్దగా అరుస్తున్నాడు. ఆమె “ఊరుకోండి, అరవకండి”అంటోంది. “పూలరంగడు… నీకు కొత్త చొక్కా చూపిద్దామని వచ్చాడంటా!”ఎగతాళిగా మాట్లాడుతూ నా మీదకి దూకుతున్నాడు. ఆరోజు నన్ను కొట్టేవాడే. సరిగ్గా అప్పుడే మా నాన్న ఫ్యాక్టరీ నుండి ఇంటికి వస్తున్నాడు. అతని అరుపులు విని వాళ్ళింటి గేట్ దగ్గరకి వచ్చాడు. ఆమె మా నాన్నని చూడగానే “రమణా, శీను చూడు మమ్మల్ని పిలవకుండా గేట్ ఎక్కి లోపలకి దూకాడు”అంది గబగబా గేట్ తాళం తీస్తూ.

నాన్న లోపలకి రాగానే నాన్న పక్కకెళ్ళి నిలబడి “అక్కకి కొత్త చొక్కా చూపిద్దామనీ…” అన్నాను.
నాన్న నా ముఖంలోకి చూశాడు. ఏమనుకున్నాడో మరి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా భుజం మీద చెయ్యేసి నన్ను ‘పద’అన్నట్లుగా నెట్టి వాళ్ళిద్దరినీ అసహ్యంగా చూస్తూ చప్పుడు వచ్చేలా కాండ్రించి ఉమ్మేశాడు.

అతని ముఖంలో నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయింది. ఆమె తల వంచుకుంది. అట్లా చేసినందుకు నాకు నాన్న మీద భలే కోపం వచ్చింది.

3

తర్వాత రోజు ఎట్లాగైనా లోపలకి పోవాలని, ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను. ఒక పక్క ఆకలి మరో పక్క నిన్న జరిగిన దానికి ఏమంటదో ఏమో అనీ ఏదో గుబులుగా ఉంది నాకు. గేటు దగ్గర నుండే బజారంతా వినపడేట్లు పెద్దగా “అక్కా, ఓ అక్కో”అని అరిచాను. భాగ్యం గబగబా గేటు దగ్గరకొచ్చి “ఎందుకట్టా అరుస్తున్నావ్, లోపల ఎవరో పెద్దోళ్ళున్నారు!” అని నా మీదకు వంగి గుసగుసగా ‘ఏందీ గోల? ఎవడాడు?’అని ఒకడంటే ‘మీ కులపోడని చేరదీశావా?’అని ఇంకోడు అందరూ కలిసి ఆమెని ఎగతాళిగా మాట్లాడుతున్నార్రా! నీ వలన వాళ్ళ పరువు పోతందంట. వెళ్ళిపో. రావొద్దంటన్నా గేటుని పట్టుకోని ఏలాడతావెందుకురా సిగ్గులేకుండా? మొన్న నీ సంగతి మీ నాన్నకి చెప్పా, రేపో ఎల్లుండో ఎక్కడన్నా పనిలో చేర్పిస్తాడంటలే. ఫో, ఇంటికి ఫో”అంది.

నేను ఏడుస్తూ “ఆకలవుతోంది పెద్దమ్మా! నిజం చెప్పు, ఇంట్లో ఎవరూ లేకపోయినా అక్క నీ చేత అట్లా చెప్పిస్తందిగదా?”అన్నాను.

నేనంటున్న మాట వినిపించుకోకుండా దిగాలు పడ్డట్లుగా చూస్తూ “బడికి చావొచ్చుగా? ఏముందని ఇక్కడా? నీగుండా ఆయమ్మ తిట్టించుకుంటంది. ఆకలయితే బడికెళ్ళు, వాళ్ళు పెడతారు” అంటా లోపలకి వెళ్ళిపోయింది.

నేను తక్కువ కులంలో పుడితే నాకు ఆకలి ఉండదా? అయినా నేను అడిగానా ఆమెని నాకు అన్నం పెట్టమని? ఇన్ని రోజులూ తనే పెట్టి ఇప్పుడు ఇలా తరమడం ఎందుకు? నా మనసు నిండా ఆలోచనలు. కడుపులో ఆకలి, కసి.

‘నన్ను ఇంట్లోకి రానిస్తే నీ పరువు పోతుందా? నీ కులం నా కులం ఒకటే అని అందరికీ తెలిసి పోతుందా? నీ ఇంటి ముందు రోజుకో కారుని చూసి మా గుడెసెలోళ్ళంతా చెవులు కొరుక్కుంటుంటే పోలేదా పరువు?’అని ఆమెని అడగాలన్నంత ఉద్రేకం వచ్చింది.

ఏం సాధిద్దామని అలా చేయాలనిపించిందో నేనిప్పుడు చెప్పలేను కాని, అప్పుడు ఆ కోపంలో ఆలోచించకుండా గభాల్న గేటు దూకేసి లోపలికి వెళ్ళాను. రెండు భాగాలుగా ఉండే ఆ పేద్ద హాల్లో పై భాగంలో కూర్చుని ఉన్నారు నలుగురైదుగురు. టీపాయ్ మీద మందు బాటిళ్ళు, జీడిపప్పులూ పెట్టి ఉన్నాయి. నేను గడప దాటి లోపలకి రావడం ముందుగా అతను చూశాడు. అతని పక్కనే ఉందామె.

అతను ఒక్కసారిగా లేచి నడుముకున్న బెల్ట్ ని లాగి “అడక్కతినే వెధవా, నీ వయసుకు ఏ కొట్లోనో చేరి పని చేసుకోలేవా? గేటెక్కి రావడం నేర్చుకున్నాడు! మీ అయ్య…. ఫ్యాక్టరీలో చీపుళ్ళకి గొట్టాలు తొడిగే వాడు, మమ్మల్ని చూసి ఉమ్మేసి పోతాడా? మళ్ళీ పోయి తినమని మా ఇంట్లోకే ఎట్ట పంపుతున్నాడు!?” అంటా బెల్ట్ తో నా కాళ్ళ మీద కొట్టాడు. నేనలాగే నిలబడ్దాను. నాకు అతన్ని చంపాలన్నంత కసి రేగింది. ఏం చేయాలో తెలీనట్లు అలాగే బొమ్మలా కూర్చున్న ఆమె నా ముఖం చూడగానే సోఫాలోంచి గభాల్న లేచి ఒక్క అంగలో మా దగ్గరకొచ్చి “నువ్వెళ్ళు, వెళ్ళు”అంటా నన్ను వరండాలోకి తోసేసింది. సోఫాల్లో కూర్చుని ఉన్న పెద్ద మనుషులు పెద్దగా నవ్వుతున్నారు కాని లేచి ఇవతలకి రాలేదు.

“దీన్ని అనాలి, కులం తక్కువ వెధవల్ని ఇంట్లోకి చేర్చినందుకు. ఇంటి అల్లుడికి తినడం మరిపినట్లు మరిపింది”ఇంకా ఏందేందో అంటున్నాడు అతను. ఆమె నచ్చచెప్తోంది. అతను ఆమె భుజం మీద చెయ్యేసి వెనక్కి నెట్టేస్తూ వరండాలోకి వచ్చి నన్ను బాదడం మొదలు పెట్టాడు. ఆమె “కొట్టొద్దండీ, ఒరేయ్ శీనా వెళ్ళిపోరా, వెళ్ళు, వెళ్ళిపో”అని పెద్దగా అరుస్తూ బయటకొచ్చి అతనికి అడ్డం పడింది. అప్పటికే నా కాళ్ళ మీదా, వీపు మీదా ఏడెనిమిది దెబ్బలు పడ్డాయి.

ఆమెకి అంత బలం ఎలా వచ్చిందో… అతన్ని అవతలకి నెట్టేసి నన్ను వరండా మెట్ల కిందికి ఈడ్చుకొచ్చింది. “పోరా పో వెళ్ళిపో, చెప్పినా నీకర్థం కాదేంటిరా?” తల మీద కొట్టుకుని, అతన్ని లోపలకి తోసుకుంటూ వెళ్ళిపోయి గబగబా తలుపులు వేసేసింది.

మూసిన తలుపుల వైపు అలాగే చూస్తూ నిలబడ్డాను. వీధిలో ఎవరూ లేదు. ఓ నల్లని కాకి ‘కా, కా’అని గీ పెడుతోంది. పెద్దగా ఏడ్చి అరవాలని ఉంది. కాని నా నోరు పెగలడం లేదు. మంట, ఎక్కడో మంట… దెబ్బలు పడ్డచోట్లో కాదు. లోపల, లోలోపల గుండెల్లో మంట…

నేరుగా వెళ్ళి మా పేటలో ఉన్న పెద్ద బావిలోకి దూకాను, కేవలం ఆ మంట తగ్గడానికే. దూకాక నాకు బయటకి రావాలని అనిపించలేదు. చల్లగా – అలా మునుగుతూనే ఉన్నాను… మునిగిపోతూనే ఉన్నాను… నా ప్రాణాలు నీళ్ళల్లో కలిసేవరకూ….

4

మా ఇంటి ముందు నిలబడి, ఉబ్బిపోయిన నా శరీరాన్ని చూస్తున్నాను నేను. కిందపడి ఉన్న నా శరీరాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.

ఆమె నా పక్కనే నిలబడి ఉంది కాని, నేను “అక్కా!”అని తట్టి పిలుస్తున్నా వినిపించుకోకుండా నా శరీరం వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఏడుస్తోంది. “నిన్ను అన్యాయంగా చంపుకున్నాన్రా… నేనే చంపుకున్నాన్రా. ‘ఆకలవుతోంది పెద్దమ్మా’అని భాగ్యమ్మతో చెప్పి ఏడ్చావంట కదా? మాడిపోయిన నీ డొక్కలకి తిండి పెట్టడం అలవాటు చేసి మళ్ళీ నేనే వాటిని మాడ్చాను కదరా? ఎంత దుర్మార్గురాలినయ్యాన్రా !? మా ఊరు నుండి బిక్కు బిక్కుమంటూ ఇక్కడకొచ్చినప్పుడు నువ్వే నా ఒంటరి బతుక్కి తోడయ్యావు. నా ఇంటికొచ్చేవాళ్ళు మనిద్దరి కులాన్ని ఎత్తి ఎగతాళి చేస్తుంటే ‘మీరు ఏమైనా అనుకోండి వాడు నా తమ్ముడు, నా ఇంటికి వచ్చేది వచ్చేదే’అనే మాట వాళ్ళతో అనలేకపోయాను గదరా? అనకపోతే అనకపోయాను, భాగ్యమ్మ చేతైనా నాలుగు ముద్దలు గిన్నెలో వేసి పంపించాలనైనా అనుకోలేదే!?” ఆమె మనసులో అనుకుంటున్న మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఆమె బుగ్గల మీదుగా కన్నీళ్ళు జారుతున్నాయి.

చిన్నప్పుడు ఆమె నాకు తన కథ చెప్తూ ఏడ్చినప్పుడు కళ్ళు తుడిచాను కదా అలా తుడవసాగాను. విచిత్రం ఆ కళ్ళనీళ్ళు అలాగే ఉన్నాయి. చెరిగిపోలేదు. అందరూ ఆమెని అసహ్యంగా చూస్తున్నారు.

“అయ్యో, ఆమెని ‘పాపం’అనండి. ఎవరైనా ఆమెని ఓదార్చండి”అని చెప్పాలనిపిస్తోంది కాని, నా వల్ల కావడం లేదు. అలా అభావంగా చూస్తున్నాను.

అదిగో నాన్న! వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి సముదాయించాడు. మెల్లగా లేపి అవతలకి తీసుకుపోయాడు. కాసేపటికి నా శరీరం గుంటలో పూడిపోయింది.

5

ఆమె పొట్టలోకి చేరాక తెలిసింది… నేను చనిపోయాక ఆమెలో చాలా మార్పు కలిగిందనీ, తన జీవితం పట్ల అసహ్యంతో చావలేక బ్రతుకుతున్న ఆమె ఆ దుర్మార్గుడిని విడిచిపెట్టి తన ఊరుకి చేరిందనీ, ఆమె, మా నాన్న – ఒకరికొకరు తోడుగా నిలిచారనీ!

అమ్మా, అబ్బా!…. ఆమె మూలుగుతోంది. నాన్న గభాల్న లేచి ఆమెని పట్టుకున్నాడు. అదిగో, అమ్మమ్మ లేచి గదిలోకి పరిగెత్తుతోంది.

ఆఁ… నా కళ్ళు మూసుకుపోతున్నాయి…. ఆప్యాయతల ప్రపంచంలోకి వెళుతూ…..

**** (*) ****