కథ

చందమామ బిస్కత్తు

డిసెంబర్ 2014

“నానా లే నానా! అమ్మ ఏడుత్తుంది నానా!…… తాతా! నాన్నకిందెందుకు పడుకున్నాడు? లేవమని చెప్పు తాతా!” నా మాటలకి అమ్మ, తాత ఇంకా ఏడ్చారు కాని జవాబు చెప్పలేదు.

“నానా చందమామ బిస్కత్తు తెత్తానంటివే లే నానా! నానా!” నాన్న లేవడం లేదని ఉక్రోషంతో పెద్దగా ఏడ్చాను.

“ఏడవొద్దు బేటీ! మీ నాన్న ‘పెద్ద నిద్ర’ పోతున్నాడు” సాయిబు నన్ను ఎత్తుకోని సముదాయించాడు. సాయిబు దగ్గర బిస్కత్తుల వాసన. నేను ఏడుపు ఆపి ఆయన భుజం మీదకి వాలి నిద్రపోయాను.

***

నాకు బిస్కత్తుల సాయిబు అంటే చాలా ఇష్టం. మా నాన్నున్నప్పుడు సాయిబు మా ఇంటికి రోజూ వచ్చేవాడు. నాన్న చచ్చిపోయాక తాతతో ఏదైనా పని ఉంటే కాని రావడం లేదు.

పొద్దున్నే ఎన్ని గంటలకి లేస్తాడో, ఎప్పుడు బిస్కెట్లు తయారు చేసుకుంటాడో కాని మేం పిల్లలం బడికి వచ్చేప్పటికి బిస్కెట్ల గంపతో గేటు దగ్గర కూర్చుని ఉంటాడు. ఆ బిస్కెట్ల గంప నుండి వచ్చే కమ్మని వాసన అల్లంత దూరం నుంచే తెలుస్తుంది సాయిబు వచ్చేశాడని.

మల్లెపువ్వులాంటి తెల్లని బట్ట బుట్టపైన కప్పి ఉంటుంది. ఎవరైనా బిస్కెట్టు కొనుక్కుంటుంటే ఆ గుడ్డను కొంచెంగా తొలగించి అడిగిన బిస్కెట్టు తీసి ఇస్తాడు. మేం పిల్లలందరం ఆ కొంచెం సందులోంచే బిస్కెట్లని చూడాలని ఉబలాటపడేవాళ్ళం. నేనైతే అందర్నీ నా మోచేతులతో తోసేసి సాయిబు పక్కకెళ్ళి చూసేదాన్ని.

గుండ్రనివి, వంకలవి, నిలువువి, చతురస్రాకారపువి, త్రిభుజాలు, నక్షత్రాలు ముఖ్యంగా చంద్రవంకలు వీటన్నింటికీ మధ్యలో పెద్ద చందమామ బిస్కెట్టూ…… తీపివి, ఉప్పువి, జీలకర్ర బిస్కెట్లు, వాము బిస్కెట్లు అన్ని రకాలూ ఉండేవి సాయిబు దగ్గర. కొన్ని బిస్కెట్ల పైన వేరుశనగ పప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు చల్లి ఉండేవి. అవి కాస్త రేటు ఎక్కువ. అన్నిటికంటే తక్కువ రేటువి ఉప్పు బిస్కెట్లు.

తీపి బిస్కెట్లు తినే భాగ్యం నాకు కలగనే లేదు. మా తాత ఇచ్చే ఐదు పైసలకి ఉప్పు బిస్కెట్లే గతి. డాక్టరుగారోళ్ళ గౌరి వచ్చేదాకా బుట్ట చుట్టూ ఎంత మంది మూగినా “బిస్కత్తులు ఆరాలుండండి” అంటాడే గాని బుట్ట మీద నుంచి గుడ్డ తీయడు. గౌరి వచ్చీ రాగానే రెండు రూపాయలు సాయిబు చేతిలో పెట్టేది. ఆ డబ్బులని బుట్టకి తాకించి తర్వాత కళ్ళకద్దుకుని బుట్టకి కట్టిన గుడ్డ విప్పేవాడు.
మేము కొనుక్కుని స్కూల్లోకెళ్ళిపోయాక ఊళ్ళోకి వెళ్ళేవాడు.

సాయిబుకి రోజూ తీసుకునే బేరాలుండేవి ఊళ్ళో. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బిస్కెట్లు ఇచ్చేసి ఎండ వేళకి ఇంటికి చేరేవాడు. అన్నం వండుకుని తిని కాస్త నడుం వాల్చేవాడు.

సరిగ్గా మేం స్కూలు నుంచి ఇళ్ళకొచ్చే సమయానికి “ఏ బిస్కత్తే, బిస్కత్తే” అని సాయిబు అరుపు వినపడేది. పిల్లలమంతా సాయిబు వెనకాలే పరిగెత్తేవాళ్ళం. ఆయన ఆగిన చోటల్లా ఆగుతూ, కొనుక్కుంటున్న వాళ్ళ వైపు చూస్తూ చిన్నగా ఇంటికి చేరేవాళ్ళం.

కాసేపట్లోనే మొత్తం బిస్కెట్లు అమ్మేవాడు సాయిబు. ఎవరిళ్ళల్లో బుజ్జిపాపలు, బాబులు ఉన్నారో వాళ్ళిళ్ళకి ముందు వెళ్ళేవాడు.

“ఈ వామ్ము బిస్కత్తు తినిపించావంటే బొజ్జనొప్పి రాదు” అనో, “జీలకర్ర అరుగుదలకి మంచిదమ్మో!” అనో అనే వాడు. సన్నటోళ్ళనీ, కొత్త కోడళ్ళనీ చూస్తే “ఏంటి బేటీ ఇంత సన్నంగా ఉన్నావు? జీడిపప్పు బిస్కత్తు రోజుకొకటి తిను…. మల్లెచెండులా అయిపోతావు” అనేవాడు.

అందరినీ పేరు పేరునా పలకరిస్తూ మాట్లాడతా మాట్లాడతానే గంప ఖాళీ చేసుకోని ఇంటికి పోయేవాడు. అయితే ఆ చందమామ బిస్కెట్టు ఎవరికి అమ్మేవాడో మరి… ఎవరూ కొనంగా నేను చూడలా….

“వామ్మో! ఆలశ్యమయింది, మా అమ్మ కొడుతుంద’ని కాసేపు తిరిగి ఇంటికి పరిగెత్తే వాళ్ళు నా స్నేహితులు. నేను మాత్రం సాయిబు ఇంటికెళ్ళేదాకా అతని వెనకనే ఉండేదాన్ని.

మా అమ్మ “ఇప్పటి దాకా ఆ బిస్కత్తుల సాయిబు వెనకే తిరుగుతున్నావా?” అనేది తప్ప నన్ను ఏమీ అనేది కాదు.

***

బడికి సెలవయితే సాయిబు పొద్దున్నా, సాయంత్రం కూడా ఊళ్ళోనే ఉండేవాడు. ఒక ఆటా పాటా లేకుండా నేను సాయిబు వెనకే ఊరంతా తిరిగేదాన్ని. ఈ తిప్పటంతా ఎందుకో మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది – ఆఁ ….. ఆ చందమామ బిస్కెట్టు కోసమే.

సాయిబు బుట్ట మధ్యలో నా దోసిలంత వెడల్పున్న బిస్కెట్టు – ఒక్కటే ఒక్కటి ఉంటుంది – చందమామలా……. ఆ బిస్కెట్టు పైన అన్ని రకాల పప్పుల ముక్కలూ ఇంత మందాన చల్లి ఉంటాయి. ఆ పప్పులు మిలమిలలాడతా నోరూరిస్తుంటాయి.

గౌరి పుట్టినరోజు నాడు వాళ్ళమ్మానాన్నా చాలా డబ్బులిచ్చారేమో! “చందమామ బిస్కత్తు ఎంత సాయిబూ” అని అడిగింది.

“ఇరవైరూపాయలు” అన్నాడు.

“అమ్మో! ఇరవై రూపాయలా?” అంది గౌరి.

“కావాలంటే తీసుకో బేటీ….. నేను అమ్మ దగ్గర డబ్బులిప్పించుకుంటాలే” అన్నాడు సాయిబు.

సాయిబు ఆ మాట అనగానే ‘అబ్బ! చందమామ బిస్కెట్టు బయటకి వస్తోంది చూద్దాం’ అనుకుని ఆత్రంగా ఇంకా ముందుకు తోసుకోని తొంగి చూశాను.

“వద్దొద్దు సాయిబూ అలా తీసుకోకూడదు. మన దగ్గర ఎంత డబ్బుంటే అంత డబ్బులకే తీసుకోవాలని చెప్పిందమ్మ” అంది.

బెలూన్లో గాలి తీసేసినట్లయింది నా పరిస్థితి. భలే నిరాశ కలిగింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

పెద్దాసుములు, అమ్మానాన్నా డాక్టర్లు – వాళ్ళ పిల్ల గౌరే అలా అంటే ఇంక మనలాంటోళ్ళం ఏం కొనగలం? మా తాత చేత ఐదు పైసలిప్పించుకోవడానికే నాకు గంట పడుతుంది. ఒక్కోరోజైతే ‘లేవు ఫో’ అని కొడతా తరుముకుంటాడు.

అమ్మకి చెప్తేనేమో ఏడుస్తుంది. “చిన్నప్పుడు మీ నాన్న నీకు ఈ సాయిబు బిస్కత్తులు తెచ్చిపెట్టి నీకీ పిచ్చి పట్టిచ్చాడు. నీ రాత మంచిదయితే మీ నాన్నే ఉండేవాడు. తాత బిస్కత్తులకెక్కడ్నించి తెచ్చిస్తాడు?” అంటుంది.

నాకు ఆ మాటలు తలకెక్కేవి కావు. ఎలాగైనా సరే తాత చేత ఐదుపైసలిప్పించుకోవాలి బిస్కెట్లు కొనుక్కోవాలి – అంతే.

అసలు నేను తప్పు చేశానులే. ఇప్పటి వరకూ తాత ఇచ్చిన ఐదుపైసళ్ళన్నీ పెట్టి ఉప్పు బిస్కెట్లు కొనుక్కోకుండా దాచి పెట్టుకున్నట్లయితే ఎప్పుడో ఇరవై రూపాయలయ్యుండేవి. నా స్నేహితులందరి ముందూ దర్జాగా చందమామ బిస్కెట్టు కొనుక్కోనున్నట్లయితే డాక్టరోళ్ళ గౌరి కంటే గొప్పదాన్నయిపోయి ఉండేదాన్ని. ప్చ్ ! ఇప్పుడనుకుని ఏం లాభం?

పోనీ మధ్యాహ్నం పూట సాయిబు నిద్రపోతున్నపుడు వాళ్ళింటికెళ్ళి గంపలోనుంచి తెచ్చేసుకుంటే!? ఛ! తప్పు! దొంగతనం చేయకూడదు.

సరే ఈరోజు నుంచి నోట్లో నీళ్ళూరినా సరే ఉప్పు బిస్కెట్లు కొనుక్కోకుండా డబ్బులు దాచి పెట్టుకుంటా ఇరవైరూపాయలయ్యేదాకా…. అనుకుని శపథం పట్టాను.

***

ఆ ఐదో తరగతి పొడవునా తాతని ఎంత విసిగించినా ఐదు రూపాయలకంటే ఎక్కువ కూడబెట్టలేకపోయాను.

హైస్కూలుకి ఒంగోల్లో చేరాము. పిల్లలందరం బ్రహ్మయ్యకుంట మీదుగా రేగటి చేలల్లో పడి అడ్డదారిన నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాల. మొదట్లో కాళ్ళు భలే నొప్పులు పుట్టేవి. సాయిబు వెనకపడి తిరగడానికి అసలు ఓపికుండేది కాదు. అయితే నాకప్పుడు చందమామ బిస్కెట్టు కంటే పెద్ద సమస్య వచ్చింది.

హైస్కూల్లో పెన్సిల్ తో రాయకూడదు. పెన్నులతోనే రాయాలి – పైగా రెండు పెన్నులు. కొచ్చిన్లకి ఎర్రింకు పేనా, జవాబులకి బులుగింకు పేనా.

ఆరులో చేరి నెలయినా తాత నాకు పెన్నులు కొనివ్వలేకపోతున్నాడు.

మా ఊళ్ళో మా సుందర్రావు పంతులైతే నాకు పెన్సిల్ లేకపోతే ఎవరి చేతైనా ఇప్పించే వాడు. ఇక్కడెవరికీ అదేం పట్టదు. పెన్ను లేదంటే చాలు అరచేయి చాచమనేది, బెత్తంతో కొట్టేది. ఒక్కో సబ్జెక్టుకీ ఒక్కో టీచరు మాకు – అంటే రోజుకి కనీసం ఆరు దెబ్బలు తినాల. ఈ దెబ్బలు తినలేక ఆ ఐదు రూపాయల్లోంచి నాలుగు రూపాయలు పెట్టి పెన్నులు కొనుక్కున్నాను.

పెన్నులు కొనుక్కున్నాక మళ్ళీ బిస్కెట్ దిగులు పట్టుకుంది. మళ్ళీ డబ్బులు దాచి పెట్టసాగాను. ఈ సారి నా నిధి అస్సలు పెరగడం లేదు.

సాగర్ కాలవల్లోకి నీళ్ళు రాక వరి పంట దిగుబడే లేదనీ, ఈసారి బియ్యం కొనుక్కోని తినాల్సొచ్చేట్టుందని తాత దిగులు పడుతున్నాడు.

“నేను పొలం పనికి వెళతా మామా! పిల్ల పెరిగొచ్చింది. బడి నుంచి వచ్చాక నాకు సాయం చేస్తుంది. ఏం ఫర్వాలేదు” అంది అమ్మ.

“ స్నేహితులు చుట్టాలు ఆపదలో ఉన్నోళ్ళు అంటూ వాడు జనాన్ని వెంటేసుకోని వస్తే ఎంతమందికో నీ చేత్తో వండి పెట్టావు. ఇవాళ నీకు కూలికెళ్ళే పరిస్థితి వస్తుందనుకోలేదు తల్లీ!” నోట్లో కండువా కుక్కుకుని తాత ఏడ్చాడు.

తాతని చూసి అమ్మ, అమ్మని చూసి నేను ఏడ్చుకున్నాము.

‘ఛీ! ఇంకెప్పుడూ బిస్కెట్ల కోసం తాతని బాధ పెట్టకూడద’నుకున్నాను.

ఆ తర్వాత రోజు నుంచీ అమ్మ పనికి వెళ్ళడంతో నేను అంట్లు తోమనూ, ఇల్లూడ్చనూ చేయసాగాను. పగలంతా పొలంలో పని చేసొచ్చిన అమ్మ ఒక్కోరోజు నీరసంగా పడుకునేది ఎండలో పని చేయడం అలవాటు లేక. అమ్మకి వంటలో కూడా సహాయం చేయాలని చిన్నగా వంట చేయడం కూడా నేర్చుకున్నా. రకరకాలుగా కూరలు చేయడం, రెండు టమాటాలుంటే చాలు చింతపండు నీళ్ళు కలిపి రుచిగా రసం పెట్టడం చేసేదాన్ని. వంట నాకు భలే ఇష్టమైన పని అయింది.

***

ఏడో తరగతిలో మాకు వారానికొకసారి క్రాఫ్ట్ క్లాస్ ఉండేది. ఆడపిల్లలకి కుట్లు, మగపిల్లలకి నేత నేయడం నేర్పేవారు. కుట్టడానికి గుడ్డని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. కొంత మంది కొత్త నేత గుడ్డ తెచ్చేవాళ్ళు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఏదో గుడ్డ ముక్క తెచ్చి పిచ్చిపిచ్చిగా కుట్టేవాళ్ళు.

మా విజయా టీచరు మా అవతారలని చూసి “ఈ క్రాఫ్ట్ క్లాస్ ఎందుకు పెట్టిందో ప్రభుత్వం – కుట్లు నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందీ? తమాషానా? రోజుకో వంటకం అన్నా నేర్పిస్తే రేపు పెళ్ళిళ్ళయ్యాక పిల్లలకి చాక్లెట్లూ బిస్కెట్లూ, రకరకాల తినుబండారాలు ఇంట్లోనే చేసి పెట్టుకునేవారు కదా!” అంది.

‘అరె! నాకిన్నాళ్ళూ అయిడియా రాలేదే! సాయిబు బిస్కెట్లు ఎట్లా చేస్తాడో? వెళ్ళి నేర్పించమని అడిగి నేర్పించుకుంటా…… అప్పుడూ….. చేస్తా చేస్తా చందమామ బిస్కెట్టు ముక్క నోట్లో వేసుకోవచ్చు. అది తల్చుకోగానే భలే సంతోషం కలిగింది.

తర్వాత ఆదివారం సాయిబుని ఊళ్ళో వెతికి పట్టుకుని ఆయన వెనకాలే పడి ఆయనింటికి వెళ్ళాను.

ఇంట్లోకెళ్ళబోతూ వెనక్కి తిరిగి నన్ను చూస్తూ “ఇన్ని రోజులూ చదువులో పడిందిలే బిడ్డ బలాదూర్ తిరగకుండా అనుకున్నా మళ్ళీ తయారయ్యావే?” అన్నాడు. నవ్వుతూ అంటున్నాడో, కోపంగా అంటున్నాడో ఆ బుంగ మీసాల చాటున కనపడలా….

“చందమామ బిస్కత్తూ….. ఎట్లా చేస్తావో చూద్దామనీ….. నేర్చుకుందామనీ…..” నసిగాను.

“నాకింకేం పాటులా…. నీకు బిస్కత్తులు నేర్పించడానికి…… ఆ తండ్రి ధర్మాత్ముడు – పోయాడు. ఆయన బిడ్డవి – బాగా చదువుకో ఫో” అని కసురుకొని లోపలకెళ్ళిపోయాడు.

నాన్నని గుర్తుకు తెచ్చేప్పటికో, సాయిబు నన్ను కసురుకున్నందుకో గాని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సాయిబు మీద బాగా కోపం వచ్చింది. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను.

ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో నిద్రలో అయితే బిస్కెట్టు కలలే. నేను సాయిబునై బిస్కెట్లు చేసుకోని తింటున్నట్లూ, గౌరిలాగా మారిపోయి ఇరవైలు నాలుగిచ్చి నాలుగు చందమామ బిస్కెట్లు తింటున్నట్లూ….

పదికి వచ్చాక అప్పుడప్పుడూ ఆ బిస్కెట్టు గురించి తల్చుకున్నానేమో గాని ఎక్కువగా నా ధ్యాసంతా చదువు మీదే ఉండేది.

పదోతరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. మంగమ్మ కాలేజీలో ఇంటర్ కి చేరాను. ఇంటర్ చదువుతానే కాలేజీకి ఎదురుగ్గా ఉన్న సెంటర్లో టైపింగ్, షార్ట్ హాండ్ నేర్చుకునేదాన్ని.

***

డిగ్రీ చదువుతుండగా పిల్లలందరినీ గ్రూపులుగా చేసి మా జువాలజీ లెక్చరర్ ఒక్కో గ్రూపుకీ ఒక్కో మాడల్ రికార్డు ఇచ్చి అందరినీ ఒకచోట కూర్చుని రాసుకురమ్మంది.

మా క్లాస్ మేట్ వజీర్ వాళ్ళ ఇల్లు మా కాలేజీ ప్రక్కనే. వాళ్ళింట్లో కూర్చుని రాసుకుంటున్నాం. వజీర్ అమ్మ, అతను ఇద్దరే ఉన్నారు ఇంట్లో. వాళ్ళ నాన్న ఊర్లో ఉంటాడని చెప్పాడు. వాళ్ళమ్మ పినాకినీ గ్రామీణ బ్యాంక్ లో అటెండరుగా పని చేస్తుందట.

ఆరోజు ఆవిడ బ్యాంక్ నుంచి వచ్చి మాకందరికీ బిస్కెట్లు పెట్టి కాఫీ ఇచ్చింది. ఆ బిస్కెట్ల రుచి కూడా అచ్చం సాయిబు దగ్గర నేను కొనుక్కునే ఉప్పు బిస్కెట్ల లాగే ఉంది.

“మా ఊరి సాయిబు చేసిన బిస్కెట్లలాగే ఉన్నాయే!” అన్నాను అప్రయత్నంగా.

కాఫీ కప్పులు టీపాయ్ మీద పెడుతూ కళ్ళెత్తి నావైపు చూసి “మీదే ఊరు?” అంది. ఆమె గొంతులో ఆసక్తి. చెప్పాను. నేనెవరమ్మాయినో కనుక్కున్నాక మీ అమ్మాతాత బావున్నారా?” అంది. తలూపాను.

“ఆయనెలా ఉన్నాడు? సాయిబు” అంది చిన్నగా గొణుక్కున్నట్లు.

“ఎవరూ సాయిబా? బాగానే ఉన్నాడు. మీకు మా ఊరోళ్ళందరూ తెలుసులాగుందే?” అన్నాను.

“ఆఁ తెలుసు” అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయింది.

మేము రికార్డులు రాసుకోవడంలో మునిగిపోయాం. చీకటి పడిందని నన్ను బస్సెక్కించడానికి వజీర్ బస్టాండ్ దాకా వచ్చాడు. బస్ ఎక్కేప్పుడు “అరుణా! మా అమ్మ అతన్ని గురించి అడిగిందని అతనికి చెప్పకు” అన్నాడు.

“సాయిబుకేనా….. చెప్తే ఏం?” అన్నాను.

“ఆయన మా నాన్న” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను కానీ వజీర్ ని ఏమీ అడగలేదు. మాట్లాడకుండా బస్ ఎక్కేశాను. ‘ఏమడుగుతాం, విడిపోయి ఉంటారు’ అనుకున్నాను.

ఇంటికి వస్తూనే ఎందుకు లేటయిందో అమ్మకి చెప్పి “ఆమె సాయిబు భార్యంటగా అమ్మా! ఎందుకు విడిగా ఉంది?” అన్నాను.

“ఎందుకులే అరుణా అవన్నీ గుర్తుకు తెచ్చుకోవడం? మీ నాన్న వల్లే వాళ్ళ కాపురం కూలిందని ఊరంతా యాగీ చేసింది ఆ బూబమ్మ. ఆమె మనింటి మీద పడి మీ నాన్నని తెగ తిట్టింది. మీ నాన్న పది రోజులు బయట ముఖం చూడకుండా కుమిలిపోయాడు” అంది ఆవేదనగా.

“ఏమయిందమ్మా? నాన్నేం చేశాడు?” ఆందోళన నా గొంతులో….

“నువ్వు చిన్నప్పుడు సాయిబు చుట్టూ ఎట్లా తిరిగేదానివో గుర్తుందా అట్లా మీ నాన్న చుట్టూ తిరిగేవాడు సాయిబు. పెద్దోళ్ళయ్యి పిల్లలు పుట్టినా బాధ్యత పట్టకుండా తిరిగే పనే ఇద్దరికీ. తాత తిట్లు పడలేక ‘పొగాకు వ్యాపారం పెట్టిస్తే చేసుకుంటాన’న్నాడు మీ నాన్న.

కొడుకు మాబాగా చేస్తాడని నమ్మి కాలవ కట్ట కింద రెండెకరాల పొలం అమ్మి వ్యాపారం పెట్టించాడు తాత. వ్యాపారం చేయడం సంగతేమో కాని పొగాకు గూడెంలో స్నేహితులని చేర్చడం, కబుర్లు చెప్పుకుంటా బజ్జీలు మాంసాలు పలావులు తెప్పించుకోని తినడం, ఎవరేది చెప్పినా నమ్మేసి సహాయాలు చేయడం. ఆదాయానికి మించిన ఖర్చు వల్ల అప్పులు.

అప్పులు తీర్చడానికి ఉన్న ఈ కాస్త పొలం కూడా అమ్మాలని చూశాడు మీ నాన్న. తాత అమ్మనివ్వలేదు. ఇద్దరూ అరుచుకున్నారు.

సరిగా్గ ఆ సమయంలో పెద్ద సాయిబు – అంటే బిస్కత్తుల సాయిబు నాన్న- వాళ్ళ బిస్కత్తులు చేసుకునే ఓవెను పాడయిందని కొడుకుని మద్రాసుకి వెళ్ళి ఓవెన్ని రిపేరు చేయించి తీసుకురమ్మన్నాడు. బిస్కత్తుల సాయిబు ఒక్కడే పోకుండా మీ నాన్నని వెంటేసుకెళ్ళాడు.

పెద్ద సాయిబుకి ఈ ఓవెన్ని గౌరి వాళ్ళ తాత కొనిచ్చాడంట ఆ రోజుల్లోనే. పెద్ద సాయిబు, గౌరి వాళ్ళ తాత అంజయ్య చౌదరి భలే స్నేహితులంట…… ఇదిగో – మీ నాన్న, బిస్కత్తుల సాయిబుల్లాగే.

ఇంట్లో జరుగుబాటుకి కష్టంగా ఉందని చౌదరితో పెద్దసాయిబు చెప్తే మద్రాసు నుంచి ఓవెన్ని తెప్పించి ఇచ్చి వ్యాపారం చేసుకోమన్నాడంట. ఓవెన్ని గౌరి వాళ్ళమ్మ ఆదిలక్ష్మి చేతులతో ప్రారంభించాడంట పెద్ద సాయిబు. ఆమె చేతి చలవ వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది అని అందరికీ చెప్పేవాడు. ప్రతిరోజూ పొద్దున్నే ఆ ఓవెన్ లో ముందు చందమామ బిస్కత్తు చేసి ఆదిలక్ష్మికి పంపేవాడంట కొడుకి చేత. సాయిబు ఇంట్లో అందరికీ ఆ పిల్లంటే చాలా అభిమానం.

భలే చదువుకునేది ఆదిలక్ష్మి. ఒంగోలు కాలేజీలో ఇంటర్ అయ్యాక ఆదిలక్ష్మిని మద్రాసులో ఎంబిబియస్ కి చేర్పించాడు చౌదరి.

చౌదరికి ఒక చెల్లెలుండేది. కమలమ్మ. చాలా అందంగా ఉండేది సినిమా యాక్టర్ లా. గూని శివయ్య తాతుళ్ళా…… అతనికిచ్చి పెళ్ళి చేశారు. ‘నేనతనితో కాపురం చేయనని లేచి పోయింది”

“ ఆఁ ….. ఎవరితో? అయినా అతనికెట్టిచ్చి చేశారు? అంత అందమైనామెనీ?” అన్నాను.

“శివయ్య తాతకి బాగా ఆస్తి ఉందిగా…. ఆస్తి కలిసొచ్చిద్దని చేశారు. పెళ్ళయ్యాక మొగుడితో కాపురం చేయకుండా మొండికేసి పుట్టింట్లోనే ఉంది. ఎట్ల పరిచయమయ్యిందో మా ఊరి అబ్బాయి ప్రసాదుతో….. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అతనితో వెళ్ళిపోయింది”

“అంటే అతన్ని మళ్ళీ పెళ్ళి చేసుకుందా?”

“ఆ ప్రసాదుది మా ఊరే. పెళ్ళయిన దాన్ని తీసుకొచ్చాడని అందరూ చెప్పుకున్నారు అప్పట్లో. అయినా వాళ్ళిద్దరూ ఇష్టపడితే ఎవరేం చేస్తారు. వెతుక్కొచ్చి మళ్ళీ పెళ్ళి చేసారు.

చౌదరి “అది చచ్చినట్లే” అన్నాడంట. గూని శివయ్య తాతైతే అసలు పట్టించుకోలేదు.

ఈ కమలమ్మ పోతే పోయింది. కొన్నాళ్ళకి పుట్టింటి మీద కేసేసింది ఆస్తిలో భాగం కావాలని. కోర్టుకెక్కారు. కేసు తేలేదాకా ఎవరూ పొలం జోలికెళ్ళకూడదని కోర్టు ఆర్డరిచ్చేప్పటికి పొలం అంతా పాడు పెట్టాల్సొచ్చింది. పాపం పదిమందికి లేదనకుండా సాయం చేసే చౌదరి, ఆరోజుల్లో చాలా దిగులేసుకుని ఉండేవాడు.

ఆరోజు…. ఓవెన్ని మద్రాసుకి రిపేరుకి తీసుకెళుతున్న రోజు సాయిబు చేతికి కాస్త డబ్బు, తినేవి ఇచ్చి ఆదిలక్ష్మికి ఇమ్మని చెప్పాడంట చౌదరి. ఆరోజు నాకు బాగా గుర్తుంది. మీ తాత తిట్టాడని నాతో కూడా చెప్పకుండా ఇంట్లోంచి మీ నాన్న వెళ్ళడం…..

ఎక్కడికెళ్ళాడోనని మేం దిగులు పడుతుంటే చూసినోళ్ళు చెప్పారు ఇద్దరూ మద్రాసు రైలెక్కారని.

ఓవెన్ని షాపులో ఇచ్చేసి ఆదిలక్ష్మి దగ్గరకి వెళ్ళారంట. వీళ్ళిద్దరినీ చూడగానే ఆదిలక్ష్మి ఏడ్చిందంట. ఫీజు కట్టలేదని ఆదిలక్ష్మిని కాలేజీలోంచి తీసేశారంట. అప్పుడామె ఆఖరి సంవత్సరం చదువుకుంటోంది.

‘మా నాన్న మనకెవ్వరికీ చెప్పడం లేదు గాని ఫీజు కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు సాయిబూ! నా స్నేహితులు, లెక్చరర్లూ చందాలేసుకుని ఫీజు కట్టాలని చూస్తున్నారు’ అందంట. సాయిబుకి భలే బాధయిపోయి అప్పటికప్పుడే షాపులో ఇచ్చిన ఓవెన్ని అమ్మి ఆదిలక్ష్మికి ఫీజు కట్టాడంట.

‘ఈ విషయం ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనీ, ముఖ్యంగా తన నాన్న ప్రాణాలుండవనీ, ఎవరికీ చెప్పొద్దనీ’ ఒట్టేపించుకుని ఆ డబ్బులు తీసుకుందంట ఆదిలక్ష్మి.

‘ప్రాణం పోయినా చెప్పం ఆదిలక్ష్మీ! నువ్వు బాగా చదువుకోవాల, మనూళ్ళో హాస్పిటల్ పెట్టాల’ అన్నారంట నాన్న, సాయిబు ఇద్దరూ.

ఓవెను లేకుండా ఇంటికొచ్చిన సాయిబుని అరిచి ఇంట్లోంచి పొమ్మన్నాడు పెద్ద సాయిబు. ‘తండ్రికి కోపం తగ్గాక రావొచ్చులే’ అనుకోని కొట్టాల వైపు పడి పోయాడు.

ఆరోజు బూబమ్మ ఒక పాటు పడింది చూడూ….. మనింటి ముందు నిలబడి ఊరంతా వినపడేట్లు మొగుణ్ణీ, మీ నాన్ననీ తిట్టింది. ఇద్దరూ కలిసి ఆ ఓవెన్ని అమ్ముకోని తాగి తందనాలు ఆడుంటారనీ, మీ నాన్న తను చేసిన అప్పులకి సాయిబు దగ్గర డబ్బు తీసుకుని కట్టి ఉంటాడనీ మాట్లాడింది. అట్లా నిందలేస్తున్నా నాన్న నోరెత్తలేదు. ఇంట్లోనుంచి బయటికి రాలేదు. సంగతి తెలిసి కొట్టాల దగ్గరే దాక్కుని ఉన్న సాయిబు వచ్చి పెళ్ళాన్ని ఏమన్నాడో మరి – తెల్లవారి పిల్లాడిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా నాన్ననే నానా రకాలుగా అన్నారు.

చదువయ్యాక ఆదిలక్ష్మి తనతో పాటే చదువుకుంటున్న అబ్బాయిని పెళ్ళి చేసుకోని మనూళ్ళో ప్రాక్టీసు పెట్టింది”

“డబ్బులూ!?” అన్నాను.

“తండ్రిని ఒప్పించి వాళ్ళత్తకి నచ్చచెప్పి కేసుని వెనక్కి తీసేయించుకుంది. కొంత పొలం అత్తకి రాసిచ్చింది. ఒంగోలు కింద రేగటి పొలం అమ్మి ఊళ్ళో తమ పొలంలోనే హాస్పిటల్ కట్టించుకుంది. హాస్పిటల్ తెరిచిన రోజే సాయిబుకి కొత్త ఓవెను కొనిచ్చి జరిగిందంతా సినిమాలో లాగా అందరికీ చెప్పి సాయిబుని పొగుడుకుంది.

కొత్త ఓవెనొచ్చాక, పెళ్ళాం పోయాక కుదురుగానే పని చేసుకుంటున్నాడు సాయిబు. మీ నాన్న కూడా బాగానే ఉన్నాడనుకునే లోపు గుండెల్లో కొవ్వు పేరుకుపోయి…..” చెపుతూ చెపుతూ అమ్మ ఏడ్చింది.

“ఊరుకోమ్మా!” అన్నాను.

“అందరూ బాగానే ఉన్నారు మనమే ఇట్లా….” వెక్కిళ్ళు పెట్టింది.

తర్వాత రోజు అమ్మ నాకు చెప్పిన విషయాలన్నీ వజీర్ తో చెప్పాను.

“నాకు తెలుసు అరుణా! అమ్మ చెప్పింది. ఇప్పడు కూడా అమ్మ బాధ పడుతూనే ఉంటుంది మీ నాన్నని తలుచుకుని. తర్వాత మా అమ్మ నాన్న దగ్గరకి వెళ్ళాలని ఎంత మంది చేత చెప్పించినా ‘నా మీద నమ్మకం లేక పోయినోళ్ళు మళ్ళీ రాకూడదు’ అన్నాడు. పైగా చెప్పడానికి వెళ్ళినోళ్ళని కసురుకుంటాడు. నాకు కావలసినవి, ఇంటికి కావలసినవి ఎవరోకరి చేత పంపుతాడు కాని అమ్మని క్షమించలేదు” అన్నాడు వజీర్. బరువుగా మారింది అతని గొంతు.

“ఔను సాయిబు భలే కసురుకుంటాడు” అన్నాను నేను వాతావరణాన్ని తేలిక చేయడానికి.

ఇద్దరం నవ్వుకున్నాం.

***

వజీర్ తో నా స్నేహం బలపడింది. మా మతాలు వేరని తెలుసు. ప్రేమించుకోకూడదనుకుంటూనే ఒకరినొకరం వదిలి ఉండలేనంతగా ప్రేమలో పడిపోయాం.

డిగ్రీ అయ్యాక పాల ఫ్యాక్టరీలో టైపిస్ట్ గా చేరాను. వజీర్ కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఊరికే ఉండటమెందుకని కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు.

తాత పొలం పని చేయలేక, కౌలుకిచ్చినా చేసేవాళ్ళు లేక ఉన్న కాస్త పొలంలో బర్రె మేత కోసం జొన్న, ఇంటికి కావలసిన కూరల కోసం కొన్ని కూరగాయలు నాటాము. నా సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది.

వజీర్ మా ఇంటికి రావడం, నన్ను తన బండిలో ఆఫీసుకి తీసుకెళ్ళడం చూసి ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

“ఇంకా ఆగడం మంచిది కాదు. వజీర్ చిన్నగానే ఉద్యోగం చూసుకుంటాడులే ముందు పెళ్ళి చేసుకోండి” అంది అమ్మ. వజీరింట్లో కూడా అదే మంచిదన్నారు. మా నాన్నకి గుర్తుగా దాచుకున్న తన మంగళసూత్రాలు అమ్మి నాకు పెళ్ళికి కావాలసినవి కొంది అమ్మ.

మా పెళ్ళయింది. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. సాయిబు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడు. అతను ఆనందంగా…. చాలా ఆనందంగా ఉన్నాడని చందమామ బిస్కెట్టు లాగా మిలమిలలాడుతున్న అతని ముఖం చూస్తూనే తెలిసింది. ఆయన్ని పలకరించి “బిస్కెట్లు చేయడం లేదంటగా ఎందుకూ?” అన్నాను.

‘మామా!’ అనడానికి సంకోచపడ్డాను ‘సాయిబు’ అనడం అలవాటయ్యి….

“చేయడం లేదు బేటీ! ట్రంకురోడ్డులో బేకరీలల్లో కొనుక్కోవడం నేర్చుకున్నారు జనం. టౌన్లో కొనుక్కొచ్చినవంటే గొప్ప అనుకునే కాలం ఇది. మండిపోయే ధరలు పెట్టినా వాళ్ళ దగ్గరే కొంటున్నారు. కొనేవాళ్ళు లేకపోతే చేయడం ఎందుకులే అని నేనూ మానుకున్నా?” అన్నాడు.

నా లోపల పొరల్లో ఎక్కడో దాక్కుని ఉన్న ఆశ – చందమామ బిస్కెట్టు తినాలన్న ఆశ ఒక్కసారిగా గుర్తొచ్చింది ఆయనతో మాట్లాడుతుంటే…. ట్రంక్ రోడ్డు వైపుకి వెళ్ళినపుడు కొనుక్కోవాలి అనుకున్నాను.

“ఇంకా ఏం చేస్తావులే నాన్నా! విశ్రాంతిగా ఉండక” అన్నాడు వజీర్.

“పెళ్ళి చేసుకున్నావు. ఇక మంచి ఉద్యోగం వచ్చిందంటే నాకు సంతోషం” అన్నాడు సాయిబు మామ.

***

ఊళ్ళో అయితే ఖర్చు తక్కువని మేము ఊళ్ళో మా ఇంట్లోనే ఉంటున్నాం. తాతకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. మందులకనీ, వజీరు అప్లికేషన్లకనీ ఖర్చులు పెరిగాయి. అప్పటికీ వజీరుకి వాళ్ళమ్మ, నాన్న డబ్బు అందిస్తూనే ఉన్నారు.

ఫ్యాక్టరీకి పోయి రావడం, ఇంట్లో పనీ …. బాగా అలిసిపోతున్నాను. అసలా టైపిస్ట్ పని అంటేనే విసుగ్గా ఉంది. వజీర్ కి ఉద్యోగం వస్తే ఇంట్లో కూర్చుని హాయిగా వంట చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ ఉండాలని ఉంది. కాని సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి ఒంగోల్లో ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? మద్రాసుకి, బొంబాయికి, హైదరాబాద్ కి అప్లికేషన్లు పెడుతున్నాడు. ఒక్క ఇంటర్వ్యూకి కూడా పిలుపు రాలేదు.

సాయిబు మామ మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. ఆయన్ని చూసినప్పుడల్లా చందమామ బిస్కెట్టు గుర్తొచ్చి కొనుక్కోలేకపోతున్నానని దిగులుగా ఉంటోంది. ‘చిన్నప్పుడు కూడా కొనుక్కోలేకపోయేదాన్ని కాని అప్పుడు ఇంత బాధ లేదు. ఇప్పుడెందుకు ఇంత బాధగా ఉంది?’ అర్థం కాలేదు. ‘నేను సంపాదిస్తున్నా నా కోరిక తీర్చుకోలేకపోతున్నాను అనా? నాకు నిజంగా వీటి పట్ల ఇంత తపనున్నప్పుడు నేనెందుకు సాధించలేకపోతున్నాను? కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

చిన్న విషయానికి ఏమిటీ ఆలోచనలసలు? నేను కొనుక్కుంటే నన్నెవరేమంటారు? రేపాదివారం వెళ్ళి కొనుక్కుంటా’ అనుకున్నాను కళ్ళు తుడుచుకుంటూ….

ఆ ఆదివారం సాయిబు మామ మా ఇంటికొచ్చాడు.

“బేటీ! రింగురోడ్డు దగ్గర బేకరీ పెట్టుకుందాం. వజీరుకి చెప్పి చూడు. సామాను్లన్నాయి. షాపొకటి అద్దెకి తీసుకుంటే సరిపోతుంది. ఇద్దరం పని చేసుకుంటాం” అన్నాడు. కొడుకుతో తనే చెప్పొచ్చు కాని ముందు కోడలేమంటుందో తెలుసుకోవాలని నన్ను అడుగుతున్నాడని అర్థం అయింది.

“అలాగే మామా!” అన్నాను ఆనందంగా. ‘మామా’ అని నేను పిలిచిన పిలుపుకో, వ్యాపారం చేయడానికి నేను ఒప్పుకున్నందుకో ఆయన ముఖంలో సంతోషం, సంతృప్తి కనిపించాయి.

వజీరుని ఒప్పించాను. పనులు చకచకా జరిగిపోయాయి. పెట్టుబడి అంతా ఆయనే పెట్టాడు.

***

ఈరోజు షాపు ఓపెనింగు. వేకువఝాము రెండు గంటలకే లేచి ఏకాగ్రతతో, ఆరాధనతో బిస్కెట్లు చేస్తున్న మా సాయిబు మామ తపస్సు చేస్తున్న రుషిలా ఉన్నాడు. బిస్కెట్లు చేయాలని ఒకప్పుడు నేననుకున్న విషయం, విజయా మేడమ్ మాటలూ గుర్తొచ్చాయి.

నాకు బిస్కెట్ల పట్ల అంత తీవ్రమైన తపన ఉండీ నేనెందుకు ఇన్నాళ్ళూ నేర్చుకోలేకపోయానో ఆయన్ని చూస్తుంటే తెలుస్తోంది.

నాకు తపనైతే ఉంది గాని ఈ పనికి నేను ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఆ పనిని నేను ఈయనలా ఆరాధించలేదు.

ప్చ్ ! నాకు బాధేసింది.

‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు నాకు ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు. సాయిబు మామ దగ్గర చక్కగా నేర్చుకోవచ్చు’ అని అనుకోగానే ఇన్నాళ్ళూ నాలో పేరుకుని ఉన్న అసంతృప్తి తీసేసినట్లు పోయింది. మనకిష్టమైన రంగంలో పని చేయడంలో ఉన్న ఆనందం అనుభవమయినట్లనిపించింది.

తెల్లవారి పది అయింది. జనం రావడంతో సహాయానికి వజీర్ నన్ను కేకేశాడు. వెనక గదిలో నుండి షాపులోకి వచ్చాను.

రోజంతా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. బిస్కెట్లు బాగా అమ్ముడుపోయాయి.

రాత్రి పది అవుతుండగా మగవాళ్ళు అన్నీ సర్దుతుంటే అలిసిపోయిన నేను ఓ కుర్చీలో కూర్చుని నిద్రలోకి జారుకున్నాను.

“బేటీ!” నా భుజాన్ని తడుతూ పిలుస్తున్న పిలుపుకి వెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాను. ఎదురుగ్గా మా మామ – చందమామ బిస్కెట్టున్న ప్లేటుని నాకు అందిస్తూ.

చిన్నప్పటి నా కోరికను గుర్తుపెట్టుకుని, తనెంతో అలిసిపోయినా కూడా చందమామ బిస్కెట్టు తయారు చేసి ఇస్తున్న మా సాయిబు మామలో నాకు నా తండ్రి కనిపించాడు.

ఉద్విగ్నత వల్ల వణుకుతున్న చేతులతో ఆ ‘చందమామ బిస్కత్తు’ ని అందుకున్నాను అపురూపంగా.

*** (*) ***

(కథాగ్రూపు, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో బహుమతి పొందిన కథ)

రాధా మండువ :
స్వగ్రామం ఒంగోలు దగ్గర మండువవారి పాలెం. ప్రస్తుతం రిషీవ్యాలీ స్కూల్లో ఉద్యోగం, రిషీవ్యాలీ క్యాంపస్ లో నివాసం. ఇప్పటి వరకూ 25 కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆటా వాళ్ళు నా కథ “చందమామోళ్ళవ్వ’కి బహుమతిచ్చి గౌరవించారు. ఇది నాకు వచ్చిన రెండవ బహుమతి. ప్రచురితమైన, ప్రచురితం కాని మరిన్ని కథలు, సమీక్షలు, మ్యూజింగ్స్ , గజ్జెనగూళ్లు, కవితలు అన్నింటినీ radhamanduva.blogspot.in లో చూడొచ్చు. కథాగ్రూపు, సాయిఅఖిలేష్ ప్రొడక్షన్స్ మరియు వాకిలి పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు.