కథ

ప్రేమ జీవనం

ఆగస్ట్ 2013

ప్రియమైన అమ్మకు -

ఆ వాక్యం రాయగానే రుక్మిణీ దేవి చేయి ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. చూపు మసకబారింది. ‘చిన్నప్పటినుండీ అతన్నే కోరుకున్నాను. మనసా వాచా అతన్నే ప్రేమించాను. అతని కోసం తపించాను. అతడు తనను విడనాడడని, తనే లోకంగా బ్రతుకుతాడనీ నమ్మాను. అందరినీ వదలి అతనితో లేచి వచ్చాను. ఈరోజు ఏమయింది? సత్యభామ మందిరంలో ఉన్నాడు’ – రుక్మిణీ దేవి మంచం మీద పడి రోదించసాగింది. నిన్నటి వరకు అతని బాహుబంధాల్లో ఇమిడిపోయి నిద్రించిన ఆమె ఒంటరితనంతో విలవిలలాడుతోంది. అతని స్పర్శ కోసం ఆమె తనువూ, మనసూ తపించసాగాయి.

‘ఆ ఆమెని కౌగిలిలోకి తీసుకుంటున్నప్పుడు అతనికి నేను గుర్తుకు వస్తానేమో! వస్తాడేమో’ అనుకుంటూ గుమ్మం వైపే చూస్తూ అర్థరాత్రి వరకూ ఎదురు చూసింది. ఇక భరించలేనట్లుగా విసురుగా లేచి బయటకు వచ్చింది. బయట అంతా నిశ్శబ్దంగా ఉంది. అలిసిన చెలికత్తెలు ఎక్కడ బడితే అక్కడ పడి గాఢంగా నిద్రిస్తున్నారు. వరండా దాటి ఉద్యానవనంలోకి వచ్చింది. వెన్నెల కూడా ఆమె లాగే కాంతి విహీనంగా ఉంది. వనానికి ఆనుకుని ఉన్న సత్య మందిరంలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రుక్మిణీ దేవికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనని అక్కడ ఆ సమయంలో ఎవరైనా చూస్తారేమోననే జంకుతో వెనక దారి తీసుకుందామని ఉత్తరం వైపుకి నడిచింది.

ఉత్తరం వైపున ఉన్న సత్య గది కిటికీ దగ్గరగా ఉన్న చెట్ల కింద కూర్చుని సత్య గదిలో నుండి వస్తున్న గుసగుసలూ, సన్నని నవ్వులూ వింటూ ఆనందంతో వెర్రెత్తిపోతున్నారు ఆమె చెలికత్తెలు. అది చూసిన రుక్మిణీ దేవి కళ్ళు ఎర్రబడ్డాయి. గుండెని ఎవరో నొక్కేసినట్లయింది. ఆమె సంస్కారం ఆమెని సత్య మందిరంలోకి వెళ్ళకుండా ఆపింది. తనని ఎవరూ చూడకముందే గిరుక్కున వెనుదిరిగి తన మందిరానికి వచ్చింది. అలికిడికి ఆమె ఆంతరంగిక చెలి మాధవి లేచింది. ఆగకుండా వస్తున్న కన్నీటిని పైట చెరుగుతో తుడుచుకుంటూ తన గదిలోకి నడిచిన రుక్మిణీ దేవి మాధవిని గమనించనే లేదు.

ఆపిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని అమ్మకి ఉత్తరం రాయసాగింది.

‘అమ్మా! నీకు వార్త అంది ఉంటుంది. ఈ ఉదయమే ఈయన సత్యభామని వివాహమాడాడని. నేను అతన్ని ఎంత ప్రేమించానో నీకు తెలుసు. తీవ్రమైన మండుటెండనీ, ఎముకలు కొరికే చలినీ లెక్కచేయకుండా శివుడి కోసం ఉగ్రతపస్సు చేసిన పార్వతి నాకు ఆదర్శం అని నీతో అనే దానిని. ఆమెకి జరిగిన అన్యాయాన్ని నీవు ఎత్తి చూపినా నాకు అలా జరగదని నీతో వాదించేదానిని. ఆఖరికి నన్ను బెదిరించాలని ప్రేమ పాపం అన్నావు. ప్రేమంటే ఏమిటో నీకు తెలియచేయడానికి, నీకు నచ్చ చెప్పడానికీ అనేక ప్రేమ కథలు నీకు వినిపించాను. నాన్నని, అన్నని ఎదిరించి ఆఖరికి నీకు కూడా చెప్పకుండా ఇతనితో లేచి వచ్చాను. ఇప్పుడు – ఈ నిమిషం – తెలుస్తుందమ్మా! ఆకాశం లోని చంద్రుడిని అద్దంలో చూసి నిజం చంద్రుడని భ్రమించిన పిల్లల్లా నేనూ ప్రేమ కథల్లోని ప్రేమ నిజమని భ్రమించానని.

అయ్యో అమ్మా! నాకేం చేయాలో అర్థం కావడం లేదు. పైత్యప్రకోపంతో కూడిన ఆలోచనలు నన్ను నిలువనీయడం లేదు. ఇన్ని రోజులూ ప్రేమ పారవశ్యంతో మునిగి ఉన్న నా మనస్సులో ఈ రోజు విషపుటాలోచనలు కలుగుతున్నాయి. అతని పట్ల ద్వేషం రగులుతుంది. నన్ను నేను శిక్షించుకోవాలనిపిస్తుంది’ ఉత్తరం మళ్ళీ పక్కన పడేసి రుక్మిణి వెక్కి వెక్కి ఏడ్చింది.
బయట నుండి ఆమె ఏడుపు వింటున్న మాధవికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. లోపలకి వెళ్ళడానికి వెనుకంజ వేస్తూ గుమ్మం దగ్గరే నిలబడింది.

రుక్మిణి కళ్ళు తుడుచుకుని ఉత్తరం రాయసాగింది. ‘అతని పట్ల ద్వేషం పెంచుకోవడం ఏం సబబు లేమ్మా – అసలు నిజానికి ఆడదానికి ఆడదే శత్రువు. పెళ్ళయిన వాడిని ఇంకో స్త్రీ ఎలా కోరుకుంటున్నదమ్మా? ఎంగిలి తినడానికి విచ్చలవిడిగా ఆడది తయారవుతుంది – అందునా సాటి ఆడదానికి అన్యాయం చేస్తున్నానన్న ఇంగిత జ్ఞానం అన్నా లేకుండా. ముందు ఒక స్త్రీతో అనుభవాన్ని పొందాడన్న అసహ్యం కూడా లేకుండా కిలకిలలాడుతూ అతని పొందుని ఎలా కోరుకుంటున్నారమ్మా? నేను ఇలా అభాగ్యురాలిగా మారడానికి మగవాడితో పాటు ఇంకో ఆడది కూడా కారణం అవుతుంటే మగవాడిని మాత్రమే ఎందుకు నిందించాలి? మగద్వేషిగా ఎందుకు మారాలిలేమ్మా? ‘ రుక్మిణీ దేవి ఉత్తరం పక్కన పడేసి మంచం మీద పడి దిండులో తలదాచుకుని ఏడవసాగింది.

ఆమె ఏడుపులోని ఉదృతాన్ని గమనించిన మాధవి ఇక ఆగలేక వాకిట్లో నుండే “దేవీ! ఎందుకీ దు:ఖం” అంది. తల తిప్పి మాధవిని చూసిన రుక్మిణికి ఏడుపు ఎక్కువయింది. లోపలకి పరిగెత్తినట్లుగా నడిచిన మాధవి రుక్మిణిని తన బాహుబంధాలలో పొదుపుకుని “ఏమయింది దేవీ? ఏమిటిది ఊరుకోండి. ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు?” అని అడిగింది. సమాధానంగా రుక్మిణి పక్కనే మంచం మీద పడేసిన ఉత్తరాన్ని తీసి మాధవికి ఇచ్చింది. మాధవి ఉత్తరం చదువుతున్నంత సేపూ రుక్మిణికి కళ్ళల్లో అవిరామంగా కన్నీళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఉత్తరం చదివిన మాధవి వ్యంగ్యంగా నవ్వుతూ రుక్మిణి వైపు చూసింది.

మాధవి నవ్వు రుక్మిణికి కోపం కంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. కన్నీరు ఆగింది.
“ఎందుకు నవ్వుతున్నావు? నా పరిస్థితి నీకు నవ్వు తెప్పిస్తున్నదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మాధవీ” అంది రుక్మిణి విచారంగా. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు వణికింది.
“క్షమించు దేవీ! నిన్ను బాధ పెట్టాలని కాదు. అదిగో రాధ. ఆమె గుర్తొచ్చింది – అంతే” అంది మాధవి కిటికీ దగ్గరకి నడిచి ఉద్యానవనంలోని పొన్న చెట్టుకి ఆనుకుని కూర్చుని ఉన్న రాధని చూపిస్తూ.

ఒక్క ఉదుటున లేచి జుట్టు ముడేసుకుని కిటికీ దగ్గరకు వచ్చింది రుక్మిణి. మలిఝాము వేళ నిశ్శబ్దం అంతటా నెలకొని ఉంది. రాత్రంతా నిశాదేవితో క్రీడించిన చంద్రుడు అలిసినట్లున్నాడు. ఛాయావిహీనంగా కురుస్తున్న వెన్నెలలో ఒంటరిగా కూర్చుని ఉన్న రాధని చూసిన రుక్మిణి దేహం అపాదమస్తకం వణికింది. ‘రాధకి బాధను, నిరాశను, విరహాన్ని, వియోగాన్ని కలగ చేసింది నేనేనన్న నిజాన్ని నేనెలా మరిచాను. నా రాతలకి అందుకే మాధవికి అంత వ్యంగ్యం’ – ఆమె గుండె బరువెక్కింది. తడబడుతున్న అడుగులతో నడుస్తూ బయటకి వెళుతున్న రుక్మిణిని మాధవి అనుసరించింది.

క్షోభతో మ్లానమైన రుక్మిణి ముఖం చూసిన రాధ ఆమె ఆందోళనను అర్థం చేసుకుంది. మౌనంగా లేచి నిలబడిన రాధని చూస్తూ “నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు ఆనాడు తెలియదా? తెలిసీ నేనెలా అతన్ని ఆరాధించాను? ఈనాడు నేను పడ్డ బాధ నా వల్ల నీకు ఏనాడో కలిగింది అని తలుచుకుంటుంటే నాకు నా పట్ల జాలి, అసహ్యం కలుగుతున్నాయి. ఈనాడు నాకు కష్టం కలిగిందని సమస్త స్త్రీ ప్రపంచాన్ని నిందిస్తున్నాను. నేనూ ఆ ప్రపంచపు మనిషినేనన్న స్పృహ నన్ను బాధిస్తుంది. ఆనాడు ధర్మాధర్మ విచక్షణ నాలో కలగకపోవడానికి కారణం?” అంది ఆవేదనగా.

“రుక్మిణీ! ధర్మాధర్మ విచక్షణ అనేది ఓ రకంగా మన మనసు ఏర్పరచుకున్న చట్రంలో జరిగే ప్రక్రియే. గతానుభవాల ఆధారంగా సుఖాన్ని వెతుక్కుంటూ దు: ఖం నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నమే. ఒక స్థాయిలో ఈ విచక్షణ అవసరం. ప్రేమ అనే అత్యున్నత ప్రవాహ వేగం మనల్ని ముంచెత్తి మన మనసుని ఆ వరదలో కొట్టుకుని పోయేలా చేసే క్షణాలు ఏ కొందరికో జీవితంలో లభిస్తాయి. అటువంటి ప్రేమ మనల్ని వశపరుచుకున్నపుడు దానిని తిరస్కరించడం అసాధ్యం. అలాంటి ప్రేమను పొందాక ఇక అది నిన్ను అంటి పెట్టుకునే ఉంటుంది. అసూయ అనే దౌర్బల్యానికి దానిని గురి చేయకు” అంది రాధ గంభీరంగా.

“అంటే మనం త్యాగం చేస్తున్నామని అనుకోవాలా? ” అంది రుక్మిణి రాధ మాటల్లోని లోతుని గ్రహించడానికి విఫల ప్రయత్నం చేస్తూ.

“ఇక్కడ త్యాగం అనే మాటకి అర్థం లేదు. నువ్వు ఆ పేరు పెట్టుకుని సంతృప్తి పడితే నాకేమీ అభ్యంతరం లేదు. ప్రేమతో సంయోగం చెందడమనేది ఏ ఒకరి సొత్తూ కాదనీ, భగవంతుడిని ప్రేమించే బైరాగికీ, ఒక స్త్రీనో పురుషుడినో ప్రేమించే ప్రేమికులకీ తేడా ఏమీ లేదనీ నువ్వు గ్రహిస్తే చాలు. నిత్యనూతనమై వెలుగుతున్న ఈ సృష్టిని గమనిస్తే ప్రేమకి అర్థం ఏమిటో తెలుస్తుంది. ఉన్నతమైన ప్రేమకి హద్దులుండవు. ఆ ప్రేమ నీదా నాదా అనే సంగతి దానికి తెలియదు. అపూర్వమైన, అనంతమైన దివ్యశక్తి అది. పరిమితమైన జ్ఞానంతో ప్రేమ రహస్యాన్ని కనుగొనలేము. ఆశ్చర్యమేమిటంటే ఆ రహస్యాన్ని కనుగొనడానికి సహాయం చేసేదీ ప్రేమే. విశ్వచైతన్యాన్ని దర్శించే జ్ఞానాన్ని కలిగించేదీ ప్రేమే. జీవితానికి సార్థకత కలిగించేదీ ప్రేమే” అంది రాధ రుక్మిణి వైపు చూస్తూ.

అర్థం కానట్లు నిస్తేజంగా చూస్తున్న రుక్మిణిని చూడగానే రాధకి జాలి కలిగింది.

“రుక్మిణీ! మీ ప్రేమానురాగాలను గుర్తుకు తెచ్చుకుంటూ వాటి పట్ల వ్యామోహంతో కుమిలిపోకు. ఇంతకన్నా ఉన్నతమైన ప్రేమ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. శాంతితో నీ ప్రేమ జీవనాన్ని సాగించు” అంది రాధ.

చిరు చీకట్లను చీలుస్తూ వస్తున్న వెలుగురేఖల వైపు నడుస్తూ వెళుతున్న రాధని చూస్తూ శిల లాగా నిలబడిపోయింది రుక్మిణి. “పదండి దేవీ! వెళదాం” అంటూ ఏమీ పలక్కుండా కన్నీరు కారుస్తూ నిలబడిపోయిన రుక్మిణిని నడిపించుకుంటూ ఆమె గదిలోకి తీసుకు వచ్చింది మాధవి. తెల్లవారు ఝాము చలిగాలి ఆమె వేడి కన్నీటిని చల్లబరుస్తోంది. రాధ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమె మనసు మెల్ల మెల్లగా ప్రశాంతతను పొందింది.

తూర్పు దిక్కులో తెలిఛాయలు తెలుస్తున్నాయి. మబ్బులు మెల్లగా సాగిపోతూ ఆకాశాన్ని తేటబరుస్తున్నాయి. ఏదో మత్తులో నుండి తనను తాను బయట పడేసుకోవడానికి చేసిన ప్రయత్న క్షోభ ఆమె కళ్ళల్లో తెలుస్తోంది. అంతులేని దు:ఖాన్నిఅనుభవించాక కలిగిన అలసట, విముక్త భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మనసు నిశ్శబ్ద గంభీరతను పొందింది.