“సౌమ్యా, అశోక్ అంకుల్ ఇంట్లో పార్టీకి నువ్వు రాగలవుటే?” అంది అమ్మ.
“ఊఁ వస్తానమ్మా, ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకుంటే పార్టీలో కూర్చోగలనులే” అన్నాను. నాకిప్పుడు తొమ్మిదో నెల. ఇంకో వారంలో డెలివరీ డేట్ ఇచ్చారు. నాకు నిజానికి ఓపిక లేదు కాని అక్కడ దామిని గారిని చూడొచ్చుకదా అనుకోవడంతో ఉత్సాహం వచ్చేసింది.
దామిని – నాకు ఇష్టమైన రచయితల్లో ఒకరు. అశోక్ అంకుల్ డాక్టర్. బిజినెస్ మాగ్నెట్ కూడా. భార్య పోయాక దామిని గారితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు.
సాయంత్రం అమ్మ, నాన్న, నేను బయల్దేరి వెళ్ళేప్పటికే అతిథులు చాలా మంది వచ్చేసి ఉన్నారు. దామిని గారిని నేను గుర్తుపట్టగలనా? ఆమె చాలా అందంగా ఉంటుంది. పేపర్లో ఆమె కథల కి్రంద ఆమె ఫోటో చూడటమే. మనిషిని ఎప్పుడూ చూడలేదు.
లోపలకి వెళ్ళగానే అంకుల్ వచ్చి పలకరించారు. అవ్వ – అంకుల్ వాళ్ళమ్మ “దా, సౌమ్యా, డేట్ ఎప్పుడు ఇచ్చారు?” అంటూ నన్ను ఆప్యాయంగా పట్టుకుని నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టింది. నాకు అమ్మ ఒక ప్రక్క, అవ్వ ఒక ప్రక్క కూర్చున్నారు. అందరూ వచ్చి నన్ను, అమ్మని పలకరిస్తున్నారు. నాన్న ఫ్రెండ్స్ దూరం నుండే “హాయ్” చెప్తున్నారు. నా కళ్ళు మాత్రం ఆవిడ కోసం చూస్తున్నాయి. అరగంటయినా ఆమె కనపడలేదు. పార్టీలకి రావడం ఆమెకిష్టం లేదా? లేక ఆవిడని పరిచయం చేయాల్సొస్తుందని అంకుల్ ఆమెని లోపల గదుల్లోనే ఉంచాడా? అంకుల్ ఆవిడ కలిసి ఉంటున్నారని అందరికీ తెలిసిన విషయమే కదా!?
“సౌమ్యా, ఏంటి చూస్తున్నావ్? రెస్ట్ రూమ్ కి వెళ్ళాలా?” అంది అమ్మ.
“ఊ!” అన్నాను. అవ్వ లేచి నన్ను లోపలకి తీసుకెళ్ళింది. గెస్ట్ రూమ్ కి వెనకనున్న వరండాలో ఫేమ్ కుర్చీలో కూర్చోనుంది ఆమె. మమ్మల్ని చూసి లేచి వచ్చింది. ఆమెలో ఏమీ మార్పు లేదు. ఫోటోలో కంటే కూడా చాలా అందంగా ఉంది. “దామూ! ఈమె అశోక్ పార్టనర్ శ్రీనివాస్ కూతురు సౌమ్య, ఢిల్లీలో ఉంటుంది, డెలీవరీకి వచ్చింది” అంది అవ్వ నన్ను ఆమెకి పరిచయం చేస్తూ.
“హలో!” అంది ఆవిడ.
“నా అభిమాన రచయిత్రి అండీ మీరు” అన్నాను గబగబా… ఏదో తెలియని ఉద్యేగంతో మాటలు తోసుకొచ్చాయి.
“సౌమ్యకి రెస్ట్ రూమ్ చూపించు దామూ” అని అవ్వ వెళ్ళిపోయింది. ఆమె నన్ను గదిలోకి తీసుకెళ్ళింది. రెస్ట్ రూమ్ కెళ్ళి వచ్చేప్పటికి ఆవిడ గది మధ్యలో నిలబడి ఉంది.
నన్ను పరీక్షగా చూస్తూ “కాసేపు పడుకుంటారా ఇక్కడే” అంది.
“పడుకోనక్కర్లేదండీ కాసేపు ఇక్కడే కూర్చోవచ్చా? మీకేమీ డిస్టర్బెన్స్ లేకపోతేనే” అన్నాను.
“ఏం ఫరవాలేదు, రండి వరండాలో కూర్చుందాం” అంది.
“డేట్ ఎప్పుడిచ్చారు?” అంది. ఆమెకి సమాధానం చెప్పి “నన్ను సౌమ్యా అనండి చాలు” అని ఆమె “సరే” అని నవ్వాక మీరు ఇప్పుడేమీ రాయడం లేదు కదా!” అన్నాను.
“ఊఁ ఏమీ రాయాలని లేదు” అంది.
“ఎందుకనండీ?” అన్నాను కాస్త దిగులుగా.
ఆమె దానికేమీ సమాధానం చెప్పలేదు. కాసేపు మౌనం తర్వాత “జీవితం నది వంటిదైతే బావుంటుంది కాని సముద్రం అయితే అన్నీ అలలే…. ఎప్పుడో ఒక పెద్ద కెరటం విరగబాటుతో పైకి లేచి క్రింద పడ్డాక ఇక ఏమీ మిగలదు చేయడానికి” అంది – తనలో తనే అనుకున్నట్లుగా నెమ్మదిగా, స్వగతంగా – దూరంగా బ్యాక్ యార్డ్ లో వెలుగుతున్న లైట్ ని చూస్తూ.
నాకర్థం కాలేదసలు ఆమె ఎందుకలా అందో… అడగాలని ఉంది కాని ఏమైనా అనుకుంటుందేమోనని మొహమాటపడ్డాను.
నా ముఖంలోని భావాల్ని గమనించినట్లుగా ఆమె తనను తాను సర్దుకుని నా సంగతులు అడగడం మొదలు పెట్టింది. మేము మాట్లాడుకుంటుండగానే అవ్వ, అమ్మ వచ్చి భోజనానికి పిలిచారు. ఆమెకి అమ్మని పరిచయం చేసి “మీరు భోజనానికి రారా?” అన్నాను.
“నేను రాత్రుళ్ళు ఏమీ తినను. పార్టీకి కూడా రావాలనిపించకే బయటికి రాలేదు. మీరెళ్ళి భోంచేయండి ప్లీజ్” అంది.
ఆమె దగ్గర సెలవు తీసుకుని హాల్లోకి వచ్చేశాము.
భోంచేశాక ఆమెకి చెప్పి వెళదామని అమ్మతో అన్నాను. “పడుకోని ఉంటుంది, నేను చెప్తాలే” అంది అవ్వ. ‘ఏంటీ ఆవిడకి చెప్పేదీ?’ అన్నట్లుగా ముఖం పెట్టిన అవ్వని చూసి నేను మళ్ళీ అడగలేకపోయాను.
కారెక్కగానే “అమ్మా, దామిని గారంటే అవ్వకి ఇష్టం లేదా?” అన్నాను.
“ష్, నాన్న వస్తున్నారు…. తర్వాత మాట్లాడదాం” అంది అమ్మ.
నాన్న అందరికీ చెప్పేసి వచ్చారు. నాకు ఆవిడ విషాద వదనమే గర్తొస్తోంది. కారెక్కితే ఏవేవో కబుర్లు చెప్పే నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో నాన్న నన్ను చూస్తూ “వద్దంటే వినకుండా వచ్చావ్, చూడు ఎలా అలిసిపోయావో సౌమ్యా” అన్నాడు. నేను మెల్లగా నవ్వి ఊరుకున్నాను. ఇంటికొచ్చేప్పటికి దాదాపు పన్నెండవుతోంది. బట్టలు మార్చుకుని పడుకున్నాక అమ్మ పాలు తెచ్చి టీపాయ్ మీద పెడుతూ “ఇంకా ఆమె గురించే ఆలోచిస్తున్నావా?” అంది. అవునన్నట్లుగా తల ఊపాను.
“అవ్వ గురించి మనకి తెలిసిందేగామ్మా. అవ్వేకాదు అశోక్ అంకుల్ కూడా అంతే. ఒంటరి స్త్రీని ఉద్ధరించినట్లుగా ఫోజులు పెట్టే సమాజమే గాని నిజమైన స్వతంత్ర్యం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో! పాలు తాగి పడుకో ఆమె సంగతి ఆమె చూసుకోగల సమర్థురాలే గాని” అంది అమ్మ – మనకెందుకులే అన్న భావం ఆమె గొంతులో.
తర్వాత వారంలోనే నాకు డెలివరీ అయింది. పాప పుట్టింది. నా భర్త రాజీవ్, అత్తమామలు, బంధువులు అందరూ వచ్చి పాపని చూసి వెళ్ళారు. దామిని గారు కూడా అశోక్ అంకుల్ తో వచ్చింది. పాపని ఎత్తుకుని నుదుటన ముద్దు పెట్టుకుంది. అంకుల్ ఆమె చేతికి రింగ్ బాక్స్ ఇచ్చి రింగ్ ని పాపకి తొడగమని చెప్పాడు. ఆ రింగ్ పాప వేలికి లూజ్ గా ఉండటంతో “అయ్యో, లూజ్ అయిందండీ, ఇటివ్వండి దాచి పెట్టి కొంచెం పెద్దయ్యాక పెడతాను” అంది అమ్మ.
“పోన్లెండి, లూజ్ గా ఉంటేనే మంచిది. బిగించినట్లు పెడితే ఊపిరాడనట్లు ఉంటుంది కదా!?” అంది అశోక్ అంకుల్ ని అభావంగా చూస్తూ.
ఆ మాటలకి అంకుల్ ముఖం చిరాగ్గా పెట్టడం నేను గమనించాను. అమ్మ, నాన్న ఆమె మాటలకి సన్నగా నవ్వారు.
తర్వాత ఓ నెల నేను అమ్మ దగ్గరే ఉన్నాను కాని దామినిగారిని చూడలేదు. నేను ఢిల్లీకి వచ్చే ముందు పాప నామకరణోత్సవానికి పిలిచాం కాని అవ్వ మాత్రమే వచ్చింది. ఆవిడ గురించి అడిగితే “ఈమధ్య ఇంట్లో ఉండకుండా తిరుగుతోంది, ‘వద్దురా!’ అంటే వినకుండా ‘పాపం ఆమెకెవరూ లేరమ్మా’ అని నాకు నచ్చచెప్పి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. కృతజ్ఞత అన్నా ఉందా? వాడి మాట కూడా వినకుండా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళడమే. నలుగురిలో పరువు తీస్తోంది” అంది అవ్వ చిరాగ్గా. “ఊరుకోండి అత్తయ్యగారూ, రచయిత్రి అయ్యాక ఏవో పంక్షన్ లనీ, సమావేశాలనీ ఉంటాయి కదా!?” అంది అమ్మ.
“ఎందుకా పంక్షన్ లు? వద్దంటున్నా వినకుండా వెళుతుంది. తిరగడం నేర్చినమ్మ కాలు ఇంట్లో ఉంటుందా? మొదట్లో మౌనంగానే ఉన్నా ఇప్పుడు బంధువులంతా ముఖం మీదే ఓ రకంగా నవ్వుతూ అడుగుతున్నారు. ‘మీ దామిని అక్కడ కనపడిందే, వాళ్ళతో కనపడిందే’ అంటూ. ఎట్లుంటుందో నువ్వే చెప్పు అనితా మా వాడికి?” అంది అవ్వ నొచ్చుకుంటూ. అమ్మ ఏమీ మాట్లాడలేదు.
అమ్మ అంకుల్ గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్త్రీ స్వాతంత్ర్యం పట్ల ఉదాత్తంగా వ్యవహరించే అంకుల్ కూడా శుష్కనీతి డాంబికాలు పలుకుతున్నాడా? నిజమే అయి ఉంటుంది. అందుకే ఆమె మాటల్లో అంత నిరాసక్తత అనుకున్నాను దిగులుగా.
2
ఆరోజు రాత్రి ఏడు గంటలయి ఉంటుంది. పాప నిద్రపోతోంది. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన రాజీవ్ స్నానం చేస్తున్నాడు. అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అమ్మ గొంతు చాలా దిగులుగా ఉంది. “ఏంటమ్మా గొంతేంటి అలా ఉంది?” అన్నాను.
“నీతో ఓ విషయం చెప్పాలి, పక్కన రాజీవ్ ఉన్నాడా?” అంది.
నాతో ఏదైనా సీక్రెట్ చెప్పాలనుకుంటే అమ్మ అలా అడుగుతుంది. “లేడు, ఏమైంది, చెప్పు” అన్నాను.
“మీ నాన్నా…. దామినీ…” అంది.
“వ్వాట్?” అన్నాను అరిచినట్లుగా.
“అవును, ఏమిటో ఈయన బాధ నాకు అర్థం కావడం లేదు. ఆమెతో గంటలు గంటలు ఫేస్ బుక్ చాటింగ్, ఫోన్లూ. అన్ని కబుర్లు ఎక్కడ నుండి ఊడిపడుతుంటాయో ఇద్దరికీ… మరీ నేనున్నానని కూడా లేకుండా! పూర్తిగా మారిపోయాడు. నేను చెవిలో పోరు పెట్టి మందు మానేసెయ్ అన్నా మానని వాడు ఇప్పుడు డ్రింక్ చేయడం మానేశాడు. ఏమిటి సంగతీ అని అడిగితే ‘దామిని ఒప్పుకోవడం లేదు’ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ”
అమ్మ గొంతులో ముందున్న విషాదం కాస్తా కోపంగా మారింది. అమ్మ మాటలకి నవ్వొచ్చింది కాని ఆపుకుని “అశోక్ అంకుల్?” అన్నాను.
“ఓ, నీకు తెలియదు కదూ, ఆయనతో తెగతెంపులు చేసుకుని ఇప్పుడు ఒక్కత్తే ఉంటోంది” అంది.
“సరిగ్గా చెప్పమ్మా” అన్నాను. చెప్పింది. ఆమె మాటల్లో బాధ, కోపం, అన్నిటికంటే ముందు తన జీవితాన్ని ఎవరో నాశనం చేస్తున్నట్లు అనుమానం అన్నీ ఉన్నాయి.
“మీకు ఆవిడ ఎలాంటి స్నేహితురాలు?’ అని మీ నాన్నని అడగాలని ఉంది కాని అడగలేకపోతున్నాను. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది సౌమ్యా వాళ్ళిద్దరూ ఇంత క్లోజ్ అయ్యాక ‘మీ స్నేహం ఎలాంటిది?’ అని అడగడంలో అర్థం ఉందా? చెప్పు?” అంది. అమ్మ కంఠంలో దుఃఖపు జీర కదలాడుతోంది.
“నీకు బాధ కలగదా? కలిగినప్పుడు చెప్పాల్సిందే వాళ్ళిద్దరికీ” అన్నాను.
“నువ్వు ఇక్కడకి రారా సౌమ్యా, ఆమెతో మాట్లాడుదువుగాని” అంది అమ్మ.
“ఊఁ వస్తాను త్వరలోనే, టిక్కెట్ బుక్ చేయమంటాను రాజీవ్ ని. నువ్వు నేనొచ్చేవరకూ మౌనంగా ఉండు, ఏమీ రొష్టున పడొద్దు” అని “ఎన్నాళ్ళనుండీ?” అన్నాను.
రాజీవ్ వచ్చి నా భుజం మీద చెయ్యేసి “ఎవరూ!? అన్నట్లు సైగ చేశాడు.
“అమ్మ” అన్నాను.
రాజీవ్ ‘ఓకే’ అన్నట్లుగా బొటనవేలెత్తి చూపి హాల్లోకి వెళ్ళిపోయాడు.
“ఏమోనే, బహుశా పాప పుట్టినప్పుడు మనింటికొచ్చింది కదా, అప్పుడు మనింట్లో ఉన్న పుస్తకాలను చూస్తూ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పటినుంచే అని నా అనుమానం” అంది అమ్మ. ఆమె గొంతులో దుఃఖం స్పష్టంగా వినిపిస్తోంది.
అదెందుకో నాకు తెలుసు. సాహిత్యం గురించి అసలేమీ తెలియదని నాన్న అమ్మని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటాడు.
“ఊఁ రాజీవ్ స్నానం చేసి వచ్చాడు, తర్వాత మాట్లాడనా?” అన్నాను.
“ఇదంతా ఏమీ చెప్పకు రాజీవ్ కి. ‘మమ్మల్ని చూడాలని ఉంది’ అని చెప్పి రా” అంది అమ్మ.
“సరే” అని ఫోన్ పెట్టేశాను.
రాజీవ్ కంప్యూటర్ లో ఏదో రాసుకుంటున్నాడు. నిద్రపోతున్న పాప పక్కన పడుకున్నాను. అమ్మతో నిదానంగా మాట్లాడాను కాని ఆ విషయం కాసేపట్లోనే నా మెదడు నంతా ఉద్వేగంతో నింపేసింది. ఏదో తెలియని దిగులుతో కళ్ళు మూసుకున్నాను.
మనిషికీ మనిషికీ మధ్య స్నేహం – జీవితపు క్వాలిటీ ని పెంచగలిగే ఔన్నత్యం ఉన్నదయితే ఇక దాని గురించి దిగులెందుకు? ఆమె వల్ల నాన్నలో మంచి మార్పు అని ఓ వైపు చెప్తూనే అమ్మ బాధపడుతోంది. మనుషులు మంచిగా మారితే ఆనందపడకుండా ఉండేది ఇలాంటి పరిస్థితుల్లోనేనేమో!
“సౌమ్యా భోంచేద్దామా?” రాజీవ్ పిలవడంతో లేచి పాపకి కప్పి ఉన్న దుప్పటి సరిచేసి మంచం మీదినుండి కిందికి దొర్లకుండా దిండ్లు అడ్డం పెట్టి వంటింట్లోకి నడిచాను.
3
వారం రోజులు గడిచాయి. రాజీవ్ కి టిక్కెట్ బుక్ చేయమని ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాను. అమ్మనీ, నాన్ననీ చూడాలని ఉంది అని చెప్తే ‘వద్దు’ అంటాడని తెలుసు. సంగతి చెప్పాలి తప్పదు. చెప్పే వెళ్ళాలి అనుకుంటుండగా అమ్మ ఫోన్ చేసింది. నాన్నే రెండు రోజుల్లో ఓ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వస్తున్నాడని.
ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోంచి బయటపడిన ఫీలింగ్ నాలో. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏ విషయాన్నైనా రాజీవ్ తో ఓపెన్ గా మాట్లాడే నేను ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాను. సమాజం అంగీకరించని ఇలాంటి సంబంధాలు అంతే మరి – ఇబ్బందిని కలిగిస్తాయి అనుకున్నాను.
నాన్నతో నేను మాట్లాడే ప్రతిమాటా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతకంటే ముందు అసలు దామిని గారి గురించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. అశోక్ అంకుల్ కి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తగానే “నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావో నాకు తెలుసు” అని గుంభనంగా, వ్యగ్యంగా నవ్వాడు. నేను అతని నవ్వు పట్టించుకోకుండా సీరియస్ గా అడగడంతో ఆమె గురించిన వివరాలన్నీ చెప్పాడు.
ఆరోజు రాత్రే నాన్నతో అతని ప్రయాణం గురించి మాట్లాడాను. ఢిల్లీకి వచ్చిన వెంటనే ఫోన్ చేస్తానని చెప్పాడు.
తర్వాత రోజు ఉదయం నాన్న ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎనిమిది అవుతున్నా ఫోన్ చేయలేదు. రెండు సార్లు చేసినా స్విచ్డ్ ఆఫ్ అనే మెసేజ్ వస్తోంది. తొమ్మిది దాకా చూసి కాన్ఫరెన్స్ కి వెళితే ఇక దొరకడని మళ్ళీ నేనే చేశాను. ఈసారి రింగవుతోంది కాని ఎత్తలేదు. దాదాపు పది అవుతుండగా తనే చేశాడు.
“నాన్నా, కాన్ఫరెన్స్ అయ్యేప్పటికి లేట్ అవుతుందా? ఎన్ని గంటలకొస్తావు ఇంటికి కనుక్కుందామని చేశా” అన్నాను.
“లేదురా, మీటింగ్ అయ్యేప్పటికి ఏ ఆరో ఏడో అవ్వొచ్చు. మీ దగ్గరకి రావడం లేదు. ఈసారి వచ్చినప్పుడు వస్తాను, సరేనా? పాప బావుంది కదా!?” అన్నాడు.
“ఊఁ బావుంది. పోనీ రేపు రావొచ్చుగా? ఇంత దూరం వచ్చీ….” అన్నాను. అలా అంటాడని ఊహించని నాకు కళ్ళనీళ్ళు తిరిగాయి.
“రేపంతా ఓ ఫ్రెండ్ తో గడుపుతున్నాను సౌమ్యా, త్వరలోనే మరో మీటింగ్ ఉంది ఇక్కడే. అప్పుడొస్తాను. రాజీవ్ ని అడిగానని చెప్పు. బై తల్లీ” అని నేనేదో మాట్లాడబోయేంతలోనే ఫోన్ కట్ చేసేశాడు.
ఏమిటిదీ? ఎందుకంత హడావుడిగా మాట్లాడుతున్నాడూ!?… అనుకుంటుండగానే నాకు తెలిసిపోయింది – బహుశా నాన్న తనతో దామిని గారిని తీసుకొచ్చి ఉంటాడని. అవును ఖచ్చితంగా అంతే, అందుకే ఎప్పుడూ లేనిది గొంతులో ఆ కంగారు.
నేనేం చేయాలో నాకర్థమైంది. ఫోన్ తీస్తాడా లేదా అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేశాను. తీశాడు. “నాన్నా, మీరు ఏ హోటల్లో దిగారు? ఇక్కడకి దగ్గర కాదా?” అన్నాను.
హోటల్ పేరు చెప్పి “ఇక్కడ నుండి చాలా దూరం కదా సౌమ్యా, అందుకే కుదరదంటున్నాను” అన్నాడు.
“మరి అమ్మ, నువ్వు వస్తావని చెప్పిందీ?”
“నేను అమ్మకి ఫోన్ చేస్తాను డోంట్ వర్రీ, ఓకే, బై” అన్నాడు.
“పోనీ నేను రానా?” అన్నాను కావాలనే.
“వద్దొద్దు మీటింగ్ నుండి ఎప్పుడొస్తానో నాకే తెలియదు, త్వరలోనే మళ్ళీ వస్తానని చెప్తున్నాగా తల్లీ” అన్నాడు.
“సర్లే అయితే, బై” అంటూ ఫోన్ పెట్టేశాను. గబగబా రెడీ అయి పాపని ఎదురింటి ఫ్రెండ్ దగ్గరుంచి బయలుదేరాను. డ్రైవ్ చేస్తున్నంత సేపూ ఆమె కనుక హోటల్లో ఉంటే ఎలా మాట్లాడాలా అనే ఆలోచనలు నా తల నిండా.
ఆవిడకి అమ్మ బాధ అర్థమయ్యేట్లు చెప్పాలి. గొప్ప రచయిత్రి కాబట్టి చెప్పడం అంత కష్టం కాదేమో!
నా ఆలోచనల్లో ‘ఆమెతో ఇలా మాట్లాడాలి’ అన్న ఓ అవగాహనకి రాకుండానే హోటల్ వచ్చేసింది. కార్ పార్క్ చేసి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాను. నాన్న పేరు చెప్పగానే, నా పేరు అడిగి “ప్లీజ్ వెయిట్ మేడమ్” అంది రిసెప్షనిస్ట్ దూరంగా ఉన్న సోఫా చూపిస్తూ. పాపం ఆవిడ తన ముఖం నిండా నవ్వు పులుముకుని అంటోంది కాని ఆ నవ్వులో జీవం లేదు. టెన్షన్ గా ఉన్న నా ముఖంలోని నవ్వూ అలానే ఉందేమో అనుకుని ‘రిలాక్స్ రిలాక్స్’ అనుకుంటూ సోఫాలోకి వాలి కళ్ళు మూసుకున్నాను దీర్ఘంగా గాలి పీలుస్తూ.
4
దూరంగా హోటల్ క్యారిడార్ లోంచి నాన్న హడావుడిగా నడుస్తూ వస్తున్నాడు. నాన్న మీటింగ్ కి వెళ్ళి ఉంటాడనీ, ఒకవేళ ఆమె నాన్నతో వచ్చి ఉంటే ఆవిడతో మాట్లాడి వద్దామని వచ్చిన నేను నాన్నని చూడగానే తొటు్రపడ్డాను. నన్ను చూసిన ఆయన ముఖంలో కూడా కనపడనీయకుండా దాచుకుంటున్న ఆందోళన.
ఆయన నా దగ్గరకు వచ్చిందాకా ఆగి లేచి నిలబడి “నిన్న అమ్మ ఫోన్ చేసింది నాన్నా, మీతో దామిని గారి గురించి మాట్లాడమనీ…” అన్నాను. ‘ఆవిడ మీతో వచ్చిందా?’ అనే మాటని నేను అనలేదు. ‘తను నాతో వచ్చింది’ అని నాన్నా నాతో అనలేదు.
“ఊఁ అర్థమైంది, దా!” అంటూ రూమ్ వైపుకి నడిచాడు. నేను నాన్నని అనుసరించాను.
ఆవిడ మమ్మల్ని చూడగానే లేచి ఎదురొచ్చింది. “బావున్నావా సౌమ్యా? పాప బావుందా?” అంది నన్ను వాటేసుకుంటూ.
ఆమెలో ఏమీ కంగారు లేదు. ఉండదని నాకు తెలుసు. రాగానుబంధాల ఛాయలకి ఆమె దొరకదని నేనెప్పుడో ఊహించాను. నేను కూడా ఆమెని హత్తుకుంటూ సమాధానం చెప్పాను. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం.
నాన్న గదిలో ఇబ్బందిగా అటూ ఇటూ కదులుతున్నాడు. అప్పుడే ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేసినట్లుంది టీపాయ్ మీద ప్లేట్స్ ఉన్నాయి. నా చూపు వాటి మీద పడగానే నాన్న “టిఫిన్ తిన్నావా తల్లీ?” అని అడిగాడు. “లేదు నాన్నా తెప్పించండి” అన్నాను.
నాన్న ఇంటర్ కామ్ వైపు నడుస్తుంటే ఆవిడ “శ్రీనూ, కిందికి వెళ్ళి రిసెప్షన్ లో ఆర్డర్ ఇచ్చేసి బజార్ కి వెళ్ళండి” అంది. నాన్న ఆమె వైపు ‘ఏమంటున్నావో అర్థం కావడం లేదు’ అన్నట్లు చూశాడు. “బుద్ధుడి బొమ్మ కొంటానన్నారు కదా, వెళ్ళి కొనేసెయ్యకూడదూ?” అంది.
నాతో ఆమె మాట్లాడటానికే నాన్నను పంపిస్తోందని నేను, నాన్న ఇద్దరం గ్రహించాం. నాన్న మౌనంగా తలాడిస్తూ డ్రస్ మార్చుకుని వెళ్ళిపోయాడు.
ఆమె లేచి ఫ్రిజ్ తెరిచి మ్యాంగో జ్యూస్ రెండు గ్లాసుల్లో పోసి తెచ్చింది. నాకొకటి ఇచ్చి తనొకటి తీసుకుని నా ఎదురుగ్గా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. ఆమెతో మాట ఎలా కలపాలో నాకు తెలియడం లేదు. జ్యూస్ తాగుతూ ఆమె వైపు చూశాను. ఆమె సౌందర్యం కంటే కూడా ఆమె ప్రశాంతవదనం చాలా ఆకర్షణీయంగా ఉంది. గంభీరత్వం, గాఢత కలిగిన ఆమె వ్యక్తిత్వం, ఆమెలోని పరిపక్వత ముందు నేను చాలా చిన్నపిల్లనైనట్లుగా అనుభూతి నాలో.
కాసేపయ్యాక నా మౌనాన్ని భరించలేని దానల్లే “సౌమ్యా, నువ్వు నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఈ పరిస్థితి అందరినీ – ముఖ్యంగా మీ నాన్నని చాలా బాధపెట్టింది” అంది.
“సారీ” అన్నాను అప్రయత్నంగా.
“నో, నో సారీ ఎందుకూ?” సిప్ చేస్తున్న మ్యాంగో జ్యూస్ ని టీపాయ్ మీద పెట్టి రెండు కాళ్ళూ ఎత్తి పైన పెట్టుకుని ముడుచుకుని కూర్చుంది.
“నేను నీకు చాలా చెప్పాలి సౌమ్యా, నన్ను సమర్థించుకోవడానికి కాదు. మా తరం వాళ్ళకి, మాకంటే ఇంకా ముందు వాళ్ళకి నా భావాలు నచ్చవు. కనీసం మీ తరం వాళ్ళైనా అర్థం చేసుకుంటారో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నీకు చెప్పాలనుకుంటున్నాను” అంది.
నాకు నవ్వొచ్చింది, సమర్థింపు కాదంటూనే సమర్థించుకుంటుంటే… “తరాలు మారినా విలువలు మారవు కదండీ” అన్నాను. అన్నాక ‘అయ్యో, అలా గభాల్న అనకుండా ఉండాల్సిందేమో!’ అనుకున్నాను.
ఆమె నవ్వేస్తూ “నిజమే వాటి గురించి కాదు నా జీవితాన్ని గురించి నా తప్పొప్పుల గురించీ మాత్రమే నీకు చెప్పాలనుకున్నది” నేనేమైనా అంటానేమోనని కాస్త ఆగింది. నేను అభావంగా చూశాను.
“నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది. నాది ఈ దేశంలోని చాలా మంది ఆడవాళ్ళ కథే, కొత్తదనం ఏమీ లేదు. నేనే ఈ ప్రపంచానికి అందగత్తెనన్న అహంకారం నాదైతే. దాన్ని లోపలే దాచి ఉంచాలన్నదీ నా భర్త మనస్తత్వం. ఏది మాట్లాడినా ఎవరితో మాట్లాడినా సందేహం”
ఇక తన కథని ఉదాహరణలోతో కూడా చేర్చి చెప్తుందేమోనని “అశోక్ అంకుల్ చెప్పారు మీ గురించి” అన్నాను కట్ చేసినట్లుగా. నా వైపు ఆశ్చర్యంగా చూసింది.
అర్థమైందన్నట్లుగా తలూపి. “నాకు ఆ సందేహాల జీవితం అవసరం లేదనిపించింది. నా భర్తకి విడాకులిచ్చి బయటికి వచ్చేశాను. మా నాన్న నాకిచ్చి వెళ్ళిన సంపద, స్వేచ్ఛగా ఉండటంలోని ఆనందం నాకు సంతృప్తినిచ్చింది. ఒంటరిగా ఉండటంలో నాకే కష్టమూ లేదు కాని స్వేచ్ఛ పట్ల నిజమైన గౌరవం కలిగి, నాకు ఆనందాన్ని ఇవ్వగలిగే తోడు కోసం నా మనసు వెతుకుతూనే ఉంది” సర్వర్ తలుపు కొట్టడంతో ఆమె మాట్లాడటం ఆపింది. అతను లోపలకొచ్చి టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ పెట్టి వెళ్ళాడు.
“తిను సౌమ్యా” అంది లేవబోతూ.
“వద్దు, తర్వాత తింటాను చెప్పండి” అన్నాను ‘చెప్పడం ఆపకండి’ అన్నట్లుగా చూస్తూ…
“అలా నాకు బాగా దగ్గరగా వచ్చిన వ్యక్తి అశోక్. అప్పటికే నాకు రచయిత్రిగా మంచి పేరు వచ్చింది. నన్ను కలుసుకోవాలని, నాతో మాట్లాడాలని ఎంతో మంది ఆరాటపడుతున్న సమయం అది. అది అర్థం చేసుకోకుండా అశోక్ నన్ను నాలుగు గోడల మధ్య బంధించాలనుకున్నాడు. నాకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడ్డాక ఆ కట్టడి చీదర పుట్టింది. పైగా ఇంట్లో వాళ్ళ అమ్మ సణుగుడు నన్ను ఓ రకమైన న్యూనతలోకి నెట్టేసింది. ఏ స్వేచ్ఛ కోసమైతే – నాకంటూ ఏ పేరు ప్రతిష్టలు లేకముందే – నా భర్తను వదిలేసుకుని వచ్చానో అది లేనప్పుడు ఇతనితో ఎలా ఉండగలననుకున్నాడో అశోక్. తెలిసీ నన్ను మళ్ళీ అదే స్థితిలోకి నెట్టడాన్ని క్షమించలేకపోయాను. ఈ సంఘర్షణ వల్ల నాలోని రచయిత్రే చనిపోతున్నదని గమనించిన నేను ఎవరికీ చెప్పుకోలేక పంజరపు పక్షిలా విలవిలలాడాను.
ఆ సమయంలో మీ పాప పుట్టినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నతో….. అంతకు ముందు శ్రీనుని అశోక్ పరిచయం చేశాడు కాని అంతగా పరిచయం లేదు. ఆరోజే మేమిద్దరం సమయం తెలియనంతగా కబుర్లు చెప్పుకున్నాం. మాకిద్దరికీ పుస్తకాల పట్ల ఉన్న అభిరుచే మొదట్లో మా ఇద్దరి మధ్యా బాంధవ్యం. నా కథలను నాకంటే బాగా విశ్లేషిస్తూ, రచనలు చేస్తూ తమ క్వాలిటీని నిలబెట్టుకున్న ఇతర రచయితల గురించి చెప్పేవాడు శ్రీను. వాళ్ళతో నన్ను పోలుస్తూనే ఆయన నన్ను దేవతలా నిలబెట్టి చూసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగింది. అతని ఆరాధనా పరిమళం నాలోని నిజమైన రచయిత్రిని, అహాన్ని పోగొట్టుకుని నిలిచిన రచయిత్రిని మిగిల్చింది.
అతనిప్పుడు నాకు ‘ప్రియమైన స్నేహితుడు’.
సంతోషంగా జీవించాలనుకోవడమే జీవితోద్దేశం అయినప్పుడు ఇతరలతో నాకేం సంబంధం అని అనుకుంటూ బ్రతికాను చిన్నప్పటి నుండీ… ఓ అరగంట ముందు వరకూ కూడా. కానీ నువ్వు రిసెప్షన్ నుండి ఫోన్ చేసినప్పుడు మీ నాన్న ముఖంలోని ఆందోళన, గుండెను మెలిపెట్టినట్లు అతను పడిన బాధని చూశాక నాకర్థమైంది. నేనే కాదు నాతో పాటు జీవిస్తున్న వాళ్ళు కూడా సంతోషంగా జీవించడంలో నేను బాధ్యురాలినవ్వాలని.
నా భర్తనో, అశోక్ నో వదిలేసినంత ఈజీ కాదు నేను శ్రీనుని వదిలేయడం. కానీ ఫరవాలేదు అదృష్టమూ దురదృష్టమూ వెంటవెంటనే ఒరుసుకుంటూ సాగుతున్న నా జీవన ప్రవాహంలో నేను తట్టుకుని నిలబడగలనన్న నమ్మకం నాకుంది” ఆగింది.
ఆమె గొంతులో ప్రకంపనలు స్పష్టంగా వినపడుతున్నాయి. ఇక ఏడ్చేస్తుందనీ, ఆమెని ఓదార్చలేని స్థితి నాదనీ నాకు తెలుసు కనుక నేను ఏమీ మాట్లాడకుండా తలవంచుకున్నాను.
నిశ్శబ్దం మా ఇద్దరి మధ్యా… గదిలోని ఏసి శబ్దం సన్నగా చెవుల్లో చేరి హోరులా మారి దిగులు కలిగిస్తోంది. కాసేపయ్యాక బొంగురుపోయిన గొంతుతో “అయితే సౌమ్యా నువ్వు నాకో మాట ఇవ్వాలి” అంది. మెల్లగా తల ఎత్తి ఏమిటన్నట్లుగా చూశాను. ఆమె కన్నీళ్ళు అమె బుగ్గలని తడితడిగా చేశాయి. కళ్ళల్లో ఇంకా పల్చని కన్నీళ్ళు.
“మీ నాన్నని నువ్వు ఏమీ ప్రశ్నించొద్దు. ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపో” అంది. సరేనన్నట్లుగా తలూపాను. మంచం మీద పడేసిన నా బ్యాగ్, కారు తాళాలు తీసుకుని “నాన్నకి చెప్పండి నేను వెళ్ళానని” అన్నాను.
“టిఫిన్” అంది.
నేను ఆ మాటని వినిపించుకోలేదు. ఆమెకి దగ్గరగా వెళ్ళి కూర్చుని ఉన్న ఆమె మీదికి వంగి భుజాల చుట్టూ చేతులేసి ఆమె తలని నా గుండెలకి హత్తుకున్నాను. ఆమె మనసులో ఎగిసిపడుతున్న జ్వాల వెచ్చని తడిగా ఆమె కళ్ళల్లోకి చేరుతుందని నాకు తెలుస్తోంది. ఆ మంట ఇక కాసేపట్లో వెక్కిళ్ళ రూపంగా మారుతుంది. అది నేను చూడలేను, చూడతగదు కూడా అనుకుంటూ ఎవరో తరుముతున్నట్లు గబగబా బయటికి వచ్చేశాను.
5
వారం రోజులు టెన్షన్ గా గడిచాయి. అమ్మ దగ్గరనుండి ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాను. నేనే చేయడానికి నాకు మనసు రావడం లేదు. ఇంకో మూడు రోజుల్లో నా బర్త్ డే, తప్పకుండా చేస్తార్లే అని సమాధానపడ్డాను.
తర్వాత రోజు పోస్ట్ లో నాన్న పంపిన గ్రీటింగ్ కార్డ్ వచ్చింది. కార్డు మధ్యలో లేత పసుపు రంగు పేపర్ మడత పెట్టి ఉంది. కార్డ్ ని సరిగ్గా కూడా చూడకుండా గభాల్న ఆ పేపర్ ని విప్పాను. అంత పెద్ద పేపర్ మధ్యలో రెండే రెండు వాక్యాలు -
సౌమ్యా! “ప్రియమైన స్నేహితులని పోగొట్టుకోకూడదు ఎన్నటికీ”
బైదివే – నేను అమ్మని కన్విన్స్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. ఎంజాయ్ యువర్ బర్త్ డే!
- నాన్న.
6
కాగితాన్ని మడతపెడుతున్న నా కళ్ళ ముందు – ‘అమ్మ కన్విన్స్ అవుతుందా?” – ఓ ప్రశ్న, మిలియన్ డాలర్ల ప్రశ్న అని అనకూడదు కాని ఒక ఎథికల్ ప్రశ్న కదిలింది. కాని మరుక్షణంలోనే నాకు అర్థం అయింది. అది అమ్మకి సంబంధించిన ప్రశ్న, నాకు సంబంధించిన ప్రశ్న కాదని.
చేతిలోని కాగితాన్ని ముక్కలుగా చింపి డస్ట్ బిన్ లో వేశాను కాని నా చిన్నపిల్ల మనస్తత్వానికి ఆ మాత్రానికే తృప్తి కలగలేదు.
నా కంప్యూటర్ ఓపెన్ చేసి “నువ్వే అమ్మ స్థానంలో ఉంటే కన్విన్స్ అవగలవా?” అని ఇమెయిల్ పంపాను.
**** (*) ****
వివాహేతర సంబంధాలలో భాగస్వామ్యికి కలిగే బాధ ఎవరూ తీర్చలేనిది. స్నేహమైనా,సాంత్వనయినా తనతో ముడిపడిన వారికి బాధ కల్గిస్తే … ఆ స్నేహాన్ని వదులుకోవడమే అత్యుత్తమ పరిష్కారం. దామిని పాత్రపై సానుభూతి కల్గినా … శ్రీను పాత్ర గౌరవంగా ఏమీ లేదు. ముఖ్యంగా కూతురిని మధ్యవర్తిత్వం చేయమనడం అసలు నచ్చలేదు. ముగింపు బావుంది రాధ గారు .
Thank you వనజ గారు, మీ అభిప్రాయం బావుంది. అయితే కూతురిని మధ్య వర్తిత్వం చేయమని అతను అనలేదు. ఆ వాక్యం నేను ఇంకా క్లారిటీ గా రాసి ఉండవలసింది. చేయగల ‘న’ న్న అనే పదం చేయగల ‘వ’ న్న లా చదివే ఛాన్స్ ఉంది. రవి గారికి రాస్తాను – దానికి ముందు “నేను” అనే పదం చేర్చమని
Bagundi Rachana…kani..guppedu..manasulo.. kondala vunnandi,aa baruvunu moitam sadaranga Addanki kashtam.sarele anukodu..
Bavundi Rachana…no compliments.. contradictory..for ever..
hmmm…achchu జలంధర గారి వియద్గంగ కథ లాగే ఉంది