కథ

ఎందుకు వగచేవో…!?

మే 2015

“నీతో మాట్లాడాలి సాయంత్రం పెందరాడే వస్తావా?” అన్నాను షూస్ కి లేసులు బిగించుకుంటున్న ఆయనకి దగ్గరగా వెళ్ళి.

“అబ్బబ్బ! సునందా! ఎప్పుడు చూసినా ‘నీతో మాట్లాడాలి’ అంటూ స్టార్ట్ చేస్తావు, ఏదో సీరియస్ విషయమేమో అనుకుని వస్తానా, పిచ్చి వాగుడు మొదలు పెడతావ్ – ‘మనం ఇట్లా కాదు ఉండాల్సింది అనో, అబ్బాయి మనసులో ఏముందో అనో’ – అసలు నీకు ఇలాంటి ఆలోచనలు పుట్టడానికి కారణమేంటో!? నీ లాంటి వాళ్ళ మెదడుని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. సరేలే నాకు ఆఫీసుకి టైమయింది” గొంతులో విసుగు.

అతన్ని ఏమైనా అని బాధించాలన్నంత కోపం వచ్చింది. వద్దు వద్దు – ఎందుకు పండగ పూట గోల?

గ్యారేజీలోంచి నా కారుని బయట పెట్టి తన కారు తీసుకుని వెళ్ళిపోయాడు.

***

పొద్దెక్కిందాకా పడుకోని ఉండి, లేస్తూనే ఏదో ఒకటి గొణిగే మనిషి ఈరోజు పెందరాడే లేచాడు. నాకు చాలా సంతోషం కలిగింది. కొత్త సంవత్సరం ఉదయం కొత్తగా, అద్భుతంగా అనిపించింది. అప్పుడప్పుడు వస్తుంటాయి నాకు ఇలా సంతోషం కలిగించే రోజులు.

హుషారుగా ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు రంగులతో ముగ్గు వేశాను. నేను చెప్పకుండానే సిద్ధుకి స్నానం చేయించి ఆయన స్నానం చేసి వచ్చాడు. ఈలోపు పూజ చేసేశాను. ముగ్గురం ఉగాది పచ్చడి తిన్నాం. అగరొత్తుల, పూల సువాసనలు. ఉగాది పచ్చడి రుచి బావున్నాయి. ఈరోజు చాలా హాయిగా పనులు జరిగి ఇంట్లో ప్రశాంతత, సుఖం వెల్లివిరిసినట్లుగా అనిపించింది.

సిద్ధార్థ్ వంటిట్లోకొచ్చి పాలు తాగుతూ “మమ్! హైబర్ నేట్ చేసే జంతువులు పెందరాడే కూడా లేస్తాయా?” అన్నాడు. ఈయన పొద్దున్నే లేచాడని వాడు అలా అంటున్నాడని అర్థం అయి నా ముఖం మాడిపోయింది. అంత చిన్నవాడి మనసులో తండ్రి పట్ల ఆ ఆలోచన కలగడానికి కారణం ఎవరు? నేనేనా? ఎప్పుడో నేను అతన్ని కోపంలో ఆ మాట అని ఉంటాను. అది గుర్తు పెట్టుకుని వాడు ఇవాళ అలా అనడం!…. నా ఆనందం ఆవిరయిపోయింది.

“ష్, సిద్ధూ!” తప్పు అన్నట్లు తల ఊపాను.

ఈయన పొద్దున్నే లేవడు, నాకు ఏ విషయం లోనూ సహాయం చేయడు. పైగా తను డాలర్లు సంపాదిస్తుంటే మేమంతా తిని కూర్చుంటున్నట్లు అవమానిస్తూ మాటలు, ఎంత చేసినా ప్రతి విషయంలోనూ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఏదో ఒకటి అనడం. తట్టుకోలేక అతనితో వాదనలు. మరీ ఇక్కడకొచ్చాక ఎక్కువయ్యాయి – తల్చుకుంటుంటే అమితమైన బాధ. కాళ్ళూ చేతులూ చచ్చుబడినట్లూ, ముఖం మీద ఎవరో ఇనప అచ్చులతో వత్తినట్లూ భావన.

ఇంట్లో ఏ రకమైన వాతావరణం ఉంటే నా మనసు గాలిలో తేలినట్లుంటుందో తెలుసు. అది జరగాలని ప్రయత్నిస్తే ఆ తర్వాత ఎంత ఘర్షణ ఏర్పడుతుందో కూడా తెలుసు.

భార్యని తేలిగ్గా మాట్లాడి అవమానించకూడదనీ, ముఖ్యంగా పిల్లవాడి ముందు అట్లా మాట్లాడకూడదనీ అనుకోడా? అతనికి అర్థం కాదా?

సిద్ధు అన్న మాటలని ఆయనకి చెబ్దామని సాయంత్రం త్వరగా రమ్మని చెప్తుంటే వినకుండా అవమానించి వెళ్ళిపోయాడు.

ఎన్ని సార్లు ఇలా జరగలేదు? గాఢమైన నా అనుభూతులనో, ఆలోచనలనో చెప్పాలనుకున్నప్పుడు అతను తన మీడియోకర్ డ్రివెల్ తో చెల్లాచెదురు చెయ్యడం, నేను దారుణంగా హతాశురాలినవడం – ఇవన్నీ ఊహల్లోనే ఏడుపునీ, భయాన్నీ కలిగిస్తున్నాయి.

ఏడేళ్ళ పిల్లవాడికి అర్థమవుతున్నాయే – నేనేమనుకుంటున్నాను అని. ఇతనికి ఎందుకు అర్థం కాదు?

అతనే పని చేస్తున్నట్లు నేను ఖాళీగా ఉన్నట్లు అతను ఊహించుకుంటాడా? నేను ఉద్యోగం చేయడం లేదా? ఇంట్లో పనులూ, వాడిని స్కూల్లో దింపడం, సాయంత్రం తీసుకురావడం, మళ్ళీ వంట, ఇంటి పనులు, చాలదన్నట్లు ఇస్త్రీలు – ఇంకీ పని నాకు తప్పదనుకుంటూ, ఏమీ సహాయం చేయడేమిటి అని బాధపడుతూ ఎలా చేయగలుగుతారు ఎవరైనా? ఎన్నాళ్ళని చేయగలరు?

‘ఇంటి పనిని షేర్ చేసుకుందాం’ అని చెప్పాలని ఆలోచన. పడనివ్వడు. అతని తేలిక మాటలు, నవ్వులు ఆపడు.

నాలోని ఈ బాధకంతా వెనుక ఉన్న కారణం నా ముందున్న జీవితం ఒక పంథాలో సాగాలని నేను అనుకోవడమా? అలా అనుకోవడంలో తప్పేమీ లేదు నేను ఇంకోళ్ళని బాధపెట్టనంత వరకూ… కాని ఎదుటి వాళ్ళు – ముఖ్యంగా కలిసి జీవించాల్సిన మనుషులు అలా లేకపోతే!!?

బయటి వాళ్ళు వచ్చినపుడు అమితమైన ప్రేమని ఎలా ఒలకబోస్తాడు నా మీద? గౌరవనీయమైన రిలేషన్ షిప్ ప్రొజెక్ట్ చేస్తాడు. నేను అలా అలవాటు చేసుకోలేకపోతున్నాను. అతనితో ఒంటరిగా ఉండే కంటే అలా పదిమందిలోకి జారిపోతే మంచిదా? కాదేమో, ఎందుకు లేని దాన్ని బాగా ఉన్నట్లు చూపడం? ఆ ఎస్కేప్ వల్ల ది్వగుణం, బహుళమయ్యే బాధ కన్నా దీన్ని భరించడమే మేలు.

***

నా వాచ్ అలారం మో్రగుతుండగానే “మమ్, టైమయింది” అరిచాడు సిద్ధు.

“ఆఁ వస్తున్నా” వాడి స్నాక్ బ్యాగ్ వాడికిచ్చి నా బాక్స్ బ్యాగ్ లో పెట్టుకుని కార్లో కూర్చున్నాము.

“మమ్, ఈ హాలిడేస్ కి అమ్మమ్మా వాళ్ళ ఊరికి వెళుతున్నాం కదా?”

“వెళదాం సిద్ధూ!” అన్నాను. వాడికి బై చెప్పి ఆఫీసుకొచ్చేప్పటికి పది…

“ఇంత ఖచ్చితంగా ఎలా వస్తావు? పండగ పూట కూడా” అంది శ్రీవల్లి. నవ్వాను.

ఫోన్ మ్రోగింది – అమ్మ!

“హల్లో అమ్మా, ఏంటి ఇంత రాత్రివేళ చేశావు? ఇంకా పడుకోలేదా?”

“ఆరోగ్యం బాగా లేదు సునందా, నిన్ను చూడాలనిపిస్తుంది, ఈ సెలవల్లో తప్పకుండా వస్తావామ్మా?” అమ్మ గొంతు చాలా నీరసంగా, దిగాలుగా ఉంది.

“ఆఁ వస్తున్నాం అమ్మా! అందరం వస్తున్నాం” అన్నాను.

అమ్మ నా గొంతులో కూడా దిగులుని కనిపెట్టినట్లుంది. “సునందా, బావున్నావు కదా తల్లీ, ఈరోజు పండగ చేసుకున్నారా?”

“చేసుకున్నాం, ఇంకో పదిహేను రోజుల్లో అబ్బాయికి సెలవలు ఇస్తారు. వెంటనే బయలుదేరతాం. సరేనామ్మా?”

“సరే తల్లీ, జాగ్రత్త”

“ఏంటి సునందా? ఏమయింది ఎవరూ?” కళ్ళు తుడుచుకుంటున్న నా దగ్గరకొచ్చి అడిగింది శ్రీవల్లి.

“మా అమ్మ శ్రీ, నన్ను చూడాలని ఉంది అంటుంటే….” భోరుమన్నాను.

“ఛ! ఊరుకో, ఇంకో ఇరవై రోజుల్లో వెళుతున్నావుగా”

“అందుకు కాదు శ్రీ, ఇంట్లో ఈయనతో ఘర్షణే మరీ బాధిస్తుంది” అన్నాను

“సునందా, ఎప్పుడో మన పురాతన సమాజం, వ్యవస్థ ఏర్చరచిన రిప్రెసివ్ సంస్కృతి మనది. ఎందుకు మనమింకా మంచివి కాని, అర్థం లేని నికృష్టమైన వాటిని పట్టుకుని వ్రేళ్ళాడుతున్నాం, నచ్చకపోతే ఎందుకు విడాకులివ్వలేకపోతున్నాం? అంది కోపంగా.

కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నాయి. “సంస్కృతి విషయమెందుకు ఇప్పుడు శ్రీ, నా సంగతే తీసుకో – ఎందుకు ఇద్దరికీ పడటం లేదు? ఏ విషయంలో మీరు అసంతృప్తి ఫీలవుతున్నారు? అని అడిగితే కారణాలు ఎన్నో చెప్పగలను కాని ఇవి విడిపోవాల్సినంత పెద్ద కారణాలా అన్న ఆలోచన నాకే వస్తుంది. అదే ఇక్కడ అయితే ‘జస్ట్ ఐ డోంట్ లైక్ హిమ్’ అనేసి విడాకులు తీసుకోగలుగుతున్నారు. పోనీ అది మంచిదా అంటే ‘కాదు’ అనే వాళ్ళల్లో మనిద్దరమూ ఉంటాం” అన్నాను.

“మరి ఎక్కడుంది సమస్య, సునందా!?”

“ఏమో, మనం అనుకున్నట్లుగా మన భాగస్వామి ఉండాలని కోరుకోవడంలో ఉందేమో! అసలు కోరిక యొక్క నిజస్వరూపాన్ని నిజంగా చూస్తే మంచి సంప్రదాయం దానంతటదే ‘కుదురు’కుంటుందేమో!”

“నిజమే, కాని అంత ఆలోచించగలమా?” అంది. దానికి నా దగ్గర సమాధానం లేదు. తల పంకించాను.

***

ఊరికి చేరేప్పటికి దాదాపు రాత్రి పదయింది. స్నానం చేసి అన్నం తిని ఆయన, సిద్ధు పడుకున్నారు.

అమ్మ, నేను అన్నాలు తినడానికి కూర్చున్నాం. అన్నయ్య గురించి చెప్పి ఏడుస్తోంది అమ్మ. ఎందుకు అంతగా ఏడుస్తుందో నాకు అర్థం అయింది. ఆమెకి సానుభూతి, ప్రేమ కావాలి. అది చూపించే వాళ్ళు లేనప్పుడు దు:ఖమేగా ఇక మిగిలేది? ‘నాకూ అదే సమస్యమ్మా’ అనబోయి ఆగి ఆమెని ఏడవనిచ్చాను. ‘ఏడ్చిన తర్వాత ఇప్పుడు మనసు తేలిక పడిందా’ అని కూడా అడగలేదు.

“గుడ్డిదాన్ని చేసుకున్నాడని ఊళ్ళో అందరూ నవ్వుకుంటున్నారు సునందా, బయటికి వెళ్ళాలంటే ఎవరేం అంటారోనని బయటికి కూడా పోవడం లేదు” అంది అమ్మ.

“ఎలా అనగలుగుతున్నావమ్మా అలా? నువ్వు వదినకి తల్లివైతే అనగలవా ఈమాట? ఆమెకి జీవితాన్నిచ్చిన అన్నయ్య ఎంత మంచివాడు?”

“మీకేమే, మీరు ఎక్కడో ఉంటారు. ఊళ్ళో ఉండి లోకులు అనే మాటలు వింటుంటే తెలుస్తుంది” పెద్దగా అరిచింది. అతను లేస్తాడేమో, అతని నోట్లోంచి ఏం అవమానపు మాటలు వినాల్సొస్తుందోనన్న మొహమాటపు భయంతో “ఊరుకోమ్మా వాళ్ళు లేస్తారు” అని “సమాజం ఎప్పుడైనా అంతే కదమ్మా! అది తమ విషయంలో ఒక రకంగా ఎదుటి వాళ్ళ విషయంలో మరో రకంగా మాట్లాడుతుంటుంది. దాన్ని గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అనవసరంగా” అన్నాను.

“నా ఖర్మే నా కడుపున పుట్టిన మీ ఇద్దరూ ఇద్దరే, ఏం మాట్లాడతారో నాకు ముక్క అర్థం కాదు. ఎందుకు ఈ పిల్లని చేసుకున్నాడో అన్నయ్యని అడుగుతావని నేననుకుంటుంటే వాడినే సమర్థిస్తున్నావు” అంది – ఆమె బుగ్గల మీద కన్నీళ్ళు జారిపోతున్నాయి.

“ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళ పెళ్ళయి ఆర్నెల్లు అవుతోంది, ఏమడగమంటావు ఇప్పుడు నన్ను? మంచి అమ్మాయే అని….” ఆపేశాను మాట్లాడటం.

ఎందుకు నేను ఆమెని రొక్కిస్తున్నాను? ఆమె ధోరణిలో ఆమె ఉన్నప్పుడు మనం ఎన్ని మాట్లాడినా వృథాయే కదా, మడతలు పడిపోయిన ఆమె ముఖంలోని ఆ దిగులుని పోగొట్టే స్థితిలో నేనున్నానా?

అన్నయ్య గుడ్డి అమ్మాయిని చేసుకుంటే సున్నితమనస్కురాలైన అమ్మ సంతోషపడుతుందనుకున్న నా భావన చెదిరిపోతోంది ఆమె మాటలు వింటుంటే. మన కంఫర్ట్ జోన్ లో పదిలంగా ఉన్నంత వరకేనా ఉదారత చూపించేది? ఒక్కసారిగా అది జారిపోతే ఆర్ద్రత, సానుభూతి, సున్నితత్వం ఏమవుతాయి? ఆలోచించాల్సిన విషయమే.

జెట్ లాగ్ వల్ల అలసిపోయిన నా శరీరం ఈ ఆలోచనలను భరించే స్థితిని కోల్పోయి మత్తులోకి జారింది.

***

నిద్ర లేపుతున్నారు ఎవరో, పొడుస్తున్నారు మాటలతో, శూలాలతో. ఎన్నాళ్ళు ఈ శత్రుత్వంతో సహజీవనం? ప్రతి క్షణం భయపడుతూ, పరాయిదానిలా బ్రతకడం ఏమిటి? ఏది చేసినా ఏదో జంకు, ఏమంటాడో అని చీదర, మధ్యలో వాదనలు. అసలు ప్రేమ లేని, ప్రేమించలేని బ్రతుకెందుకు? ప్రేమ సంగతి దేవుడెరుగు – ఇలా మొయ్యలేని సంబంధాలు పెట్టుకుని బ్రతుకుని నరకం చేసుకోవడమెందుకు?

కారణం నేనేనేమో! చిన్నప్పటి నుండీ ‘భర్త ఇమేజ్’ ని పెట్టుకుని అలాగే ఉండాలని ఆశించడం, అతను దాన్ని అనుక్షణం చిద్రం చేయడం వల్ల అసంతృప్తి… ఏడుస్తున్నాను బిగ్గరగా, ఏమీ చేయలేని నిస్సహాయతతో
ఈ గుడ్డిపిల్లని చేసుకున్నాడు, నేను దాన్ని చూడాలా? నన్ను చూసేవాడెవరే, ఎందుకే మీ అన్నాచెల్లెలు ఇట్లా తయారయ్యారు..

“మమ్, మమ్!” సిద్ధు పిలుస్తున్నాడు. మెలకువ వచ్చింది.

“ఆఁ సిద్ధూ, చాలా సేపట్నించీ లేపుతున్నావా? సారీ!” అన్నాను.

అమ్మ బయట హాల్లో కంగారుగా ఏదో అంటోంది. “ఫరవాలేదులెండి, సిద్ధు వెళ్ళాడుగా, మీరు కూర్చోండి. మాకిది అలవాటే, ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించుకుంటూ ఏడుస్తుంటుంది!” అమ్మకి అతను పెద్దగా అరిచి చెప్తూ నవ్వుతున్నాడు.

ఆపుకోలేనంత అసహ్యం, కోపంతో పెద్దగా అరిచి తిట్టాలనిపించింది. మంచం ప్రక్కనే నిలబడి నా వైపే చూస్తున్న సిద్ధు ముద్దు ముఖం చూడగానే, ఒక్క క్షణంలోనే మళ్ళీ ఆ భావం మాయమయింది. నాకు సంఘంలో మంచి గృహిణిగా తల్లిగా ఒక మర్యాద, గుర్తింపు ఉండటానికి అతనే కారణం అనే ఒకే ఒక్క కారణం వల్ల నన్ను నేను అదుపులో పెట్టుకుని నాలో నేను కుమిలిపోతున్నానా?

వేగంగా తిరుగుతున్న టేబుల్ ఫాన్ గుండా గడియారాన్ని చూశాను. పరిగెడుతున్నాయవి – నిజానికీ, ఊహకీ, మాయకీ మధ్య సన్నటి గీతల్లా మారి.

నేను టైమ్ చూస్తున్నాననుకున్నాడేమో! “టైము పదయింది మమ్, లేస్తావా?” అన్నాడు సిద్ధు.

లేచి గబగబా బ్రష్ చేసుకుని స్నానం చేశాను. అమ్మ నేను లేవడం చూసి వంటింట్లోకి వచ్చింది.

టిఫిన్లు తింటుండగా అన్నయ్య వచ్చాడు వదినతో. “అమ్మాయ్! ఇదిగో గౌతమి, మీ వదిన” అన్నాడు అన్నయ్య ఆమెని పరిచయం చేస్తూ. ఇద్దరం పలకరించుకున్నాం. ఆయనకి నమస్కరించింది. ఆశ్చర్యంగా చూస్తున్న సిద్ధుని వాటేసుకుంది.

బావుంది ఆమె. కళ్ళు పైకెత్తి చూసినపుడు మాత్రం గుడ్డి కళ్ళు అని తెలుస్తున్నాయి. లేకపోతే మామూలుగా ఉంది. ఆవిడ ఆప్యాయంగా మాట్లాడుతుంటే కాసేపట్లోనే ‘దగ్గర మనిషి’ అనే భావం కలిగింది. అమ్మ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా తెలుస్తుంది.

టిఫిన్లు అయ్యాక గౌతమి లేచి “అత్తయ్యా, పోయిన వారం వచ్చినపుడు బీరువా సర్దాలన్నారుగా!” అంటూ అమ్మ బెడ్ రూమ్ లోకి నడిచింది. నేను, అమ్మ ఆమెని అనుసరించాము. అసలామెకి కళ్ళు కనిపించవంటే నమ్మలేకపోతున్నాను. మామూలుగా అన్ని పనులూ చేస్తుంది. తాకిన వస్తువు కొత్తగా అనిపిస్తే మాత్రం దాన్ని గురించి ఎవరినైనా అడుగుతుంది. సిద్ధు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆమెని.

లోపలకి వెళ్ళాక “మీరు మా పెళ్ళికి వస్తారనుకున్నాను సునందా!” అంది.

“సెలవు దొరకలేదు వదినా, మా అన్నయ్య మీకెక్కడ పరిచయం?” అన్నాను.

“మా అన్నయ్య క్లాస్ మేటేగా… శివ!?” అంది.

“ఓ సారీ, అన్నయ్య చెప్పాడు, మర్చిపోయాను” అన్నాను.

బీరువా లోంచి చీరలన్నీ తీసి మంచం మీద పెట్టింది. అమ్మ సహాయం చేస్తుంటే చీరల రంగుల గురించి అడుగుతూ ఏ రంగుకా రంగు విడదీసి అన్నీ చక్కగా సర్దింది. ఏ రంగు చీర ఎప్పుడు కట్టుకుంటే ఆహ్లాదంగా ఉంటుందో అమ్మకి చెప్తోంది.

“అడిగానని ఏమీ అనుకోకండి వదినా, మీకు కొంచెం కనిపిస్తుందా?” అన్నాను.

“ఊహుఁ” అంది.

***

పది రోజుల సమయం చాలా తొందరగా గడిచిపోయింది వాళ్ళ సమక్షంలో – ముఖ్యంగా గౌతమిని గమనిస్తుంటే. అమ్మ ఆమె పట్ల చూపుతున్న నిరాదరణని ఆమె హాయిగా స్వీకరించింది. అన్నయ్య, ఇతను – ఇద్దరూ ఒకేలాగా ఉన్నారు. అన్నయ్య ఇంకా ‘నేను కాబట్టి గుడ్డి అమ్మాయిని చేసుకున్నాను’ అనే భావాన్ని ఇంప్లిసిట్ గా వ్యక్తపరుస్తాడు. అయినా ఆమె దాన్ని పట్టించుకున్నట్లే ఉండదు. ఏ ఘర్షణా లేదామెలో అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది.

అన్నయ్య ఎక్కడంటే అక్కడ పడేసిన వస్తువులూ, బట్టలూ మామూలుగా, అతి మామూలుగా, అదేదో తన పనే అన్నట్లుగా చేసేస్తుంది. ఏదైనా పని చేయలేకపోతే ఏ మాత్రమూ బేషజమూ లేకుండా చేయడం చేతకాదనీ అన్నయ్యకి చెప్పేస్తుంది. తనకి కావలసినదేదో తనకి తెలుసన్న స్పష్టత, తనకి కావలసింది శాంతంగా అడిగి తీసుకోగలిగే మాట తీరు ఎలా సాధ్యమయ్యయో ఆమెకి?

ఆమెని చూస్తుంటే నా జీవితాన్ని తల్చుకుని దు:ఖం కలుగుతోంది.

మనసులోని మాట చెప్పడానికి ఏ భేషజాలు అవసరం లేదని నేను తెలుసుకోగలిగానా ముందసలు? తెలిసినట్లయితే అతనితో నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? అసలతని ప్రెజన్స్ వల్లనే నా మనసు చుట్టూ ఏర్పడిన పొర – స్పష్టతని కమ్మివేస్తూ… ఇక మౌనం తప్ప మరో భాష లేదు.

అసహ్యంతో నేను అతన్ని, అతను నన్నూ చూసుకుంటున్న ఆ చూపులు శరీరాన్ని కాల్చుకు తింటున్నట్లు అనిపిస్తుంటే సంభాషణలో భేషజాలు అవసరం లేదని తెలిసి ఏం ప్రయోజనం? బాధని బాధగా అనుభవిస్తేనన్నా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో!?

“సునందా! సునందా!” కిటికీలోంచి చూస్తూ కూర్చున్న నా దగ్గరకొచ్చి తట్టి అడుగుతోంది. “సునందా! ఏమిటి పిలుస్తుంటే పలకడం లేదు, ఏమాలోచిస్తున్నావు?”

“మీ గురించే వదినా” అన్నాను.

“నా గురించా?” అంది ఆశ్చర్యంగా.

“నాకు జీవితం అంటేనే అసహ్యం కలుగుతోంది వదినా? చూస్తూనే ఉన్నావుగా…. ఇప్పుడే కాదు మా పెళ్ళయినప్పటి నుండీ ఎప్పుడు చూసినా మా ఇద్దరికీ వాదనలే. వాటి వల్ల వచ్చే ఘర్షణని భరించలేకపోతున్నాను. ఇప్పుడు మా మధ్య పిల్లవాడేమవుతాడో అనే బాధ నన్ను నిస్సహాయురాలిని చేస్తోంది” అన్నాను. నా కంఠంలో దు:ఖం గమనించిన ఆమె గభాల్న నా భుజం మీద చెయ్యేసింది.

“నిన్ను తల్చుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య ప్రవర్తనని మామూలుగా ఎలా తీసుకోగలుగుతున్నావు వదినా?” అన్నాను.

“మనుషుల మధ్య ఘర్షణలు కలగడానికి పెద్ద కారణాలు అవసరం లేదు సునందా. టివిలో చూపించే ఒక్క ఐదు రూపాయల చాక్లెట్ కోసం తల్లీబిడ్దల మధ్య తగువు రావొచ్చు. ఇల్లంతా బజార్లో అమ్మే సరుకులమయం అయిపోయాక ప్రతి వస్తువూ మనుషుల మధ్య తగూ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది”

“మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. అవి లేకుండా ఉండలేం కదా”

“లేకుండా ఉండటం అనేది కాదు ‘వస్తువులు, సందర్భాలే ఘర్క్షణకి కారణమని తెలుసుకున్నప్పుడు మనుషులని తప్పు పట్టకుండా ఉంటాం’ అంటున్నాను”

ఆమె ఏం చెప్తుందో తెలుస్తోంది కాని క్లారిటీ రావడం లేదు

అడుగుదామనుకునేలోపు ఆమె “ఆఫీసులో మన పై అధికారితోనో, కొలీగ్ తోనో కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చాయనుకో ఓపిగ్గా వివరిస్తాం. అక్కడ ఏ ఘర్షణా రాదు. వాదనలు రావు. అప్పుడు అతని ప్రవర్తనని గురించి ఏమీ అనుకోం, బహుశా చాటున విసుక్కుంటామేమో. అదే ఇంట్లో భర్త అలా ప్రవర్తిస్తే వాదించి తగాదాలు పెట్టుకుని, భార్యని అర్థం చేసుకోవడం లేదనీ, అర్థం చేసుకోవడం అతని హక్కు అనీ అతని పట్ల, జీవితం పట్ల అసహ్యాన్ని పెంచుకుంటాం. కాదంటావా?” అంది.

“బయటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఒకటెలా అవుతారొదినా? నా భర్త నన్ను అర్థం చేసుకోవాలనుకోవడం తప్పా?” అన్నాను అసహనంగా.
“ఎలా అర్థం చేసుకుంటారు? మనం మన మనసులో ఏముందో వాళ్ళకి స్పష్టంగా చెప్పకపోతే!?” అంది.

‘నిజమేనా! నేనెప్పుడూ అతనికి స్పష్టంగా చెప్పలేదా?’ కళ్ళు మూసుకున్నాను.

“మళ్ళీ ఆలోచనలో పడ్డావా?” అంది.

“అరె, ఏమిటలా అన్నారు?” అన్నాను మెహమాటంగా.

“ఏం లేదులే, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావెందుకు? నీకో విషయం చెప్పాలి. అదేమిటో ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మేధావులు అనుకుంటారు ఎక్కువ మంది, ఎంత తప్పు కదా! దాని వల్ల మనం చాలా సంతోషాన్ని కోల్పోతాం సునందా, ఎందుకో చెప్పాలనిపించింది, ఏమీ అనుకోలేదు కదా?” అంది నా రెండు భుజాలను ఆప్యాయంగా నొక్కుతూ.

“లేదులే వదినా, మీరు చెప్పిన దాన్ని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆయనకి చెప్పడానికి ఎన్నో సార్లు ప్రయత్నించాననే అనుకుంటున్నాను వదినా, అతను మారడు.

“ఏదో సందర్భంలో ఒక భావన, మాట లేదా సంభాషణ జరగగానే ఒక ముద్ర వేసుకుని దాని వల్ల వచ్చే ఇష్టాన్నో, అయిష్టాన్నో, కోపాన్నో, ప్రేమనో, కామాన్నో – ఆ క్షణంలో అనుకున్న దాన్ని – వాళ్ళ వ్యక్తిత్వం ‘అదే’ అనుకుని అలాగే మనసులో ఉంచుకోవడం ఎంత పొరపాటు? ప్రతి వాడికీ ఒక స్వభావం ఉంటుందనీ, అది ‘అలాగే’ ఉంటుందనీ థియరైజ్ చేస్తుంటాం – పండితులు సిద్ధాంతం చేసినట్లు. ఎప్పుడూ మనుషులు ఒకేలా ఉండరనీ, మన ప్రవర్తనని బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారనే విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటే సమస్యే ఉండదు”

ఆమె వైపు ఏ సంకోచమూ లేకుండా చూస్తూ, వింటున్నాను. ఆమె నన్ను, నా భావాలని చూడలేదన్న భావనతో కాదు, నన్ను నేనిక ఆలోచనల ముసుగులో దాచుకోవక్కర్లేదన్న ఆలోచనతో.

“నీకు తెలుసు సునందా ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రవర్తన మారుతూనే ఉంటుంది – ‘ఒక్కో సమయంలో ఒక్కో రకంగా, ఒక్కో మనిషి దగ్గర ఒక్కో రకంగా, సందర్భాలకి అనుగుణంగా – ముఖ్యంగా మన ప్రవర్తనలని బట్టి’ అనే నిజాన్ని నీకు గుర్తు చేయాలనిపించింది – అంతే” అని వెళ్ళి మంచం మీద కూర్చుంటూ “ఈ సందర్భంగా నీకింకో విషయం కూడా చెప్పాలి, మనం చెప్పే సమస్యలు ఎదుటివారికి వేరే విధంగా వినపడతాయి. అందుకే ఇలాంటి విషయాల్లో వాళ్ళిచ్చే సలహాలు రకరకాలుగా ఉంటాయి. చెప్పేది విని నీకు కావలసినదేదో తెలుసుకోవలసినది మాత్రం నువ్వే సుమా!” అంది.

అవును నిజమే, ఇన్నాళ్ళూ ఇంత చిన్న విషయాన్ని నేనెందుకు అర్థం చేసుకోలేకపోయాను!? నా ప్రవర్తనని బట్టే అతను అలా మాట్లాడుతున్నాడనీ, ఇన్నాళ్ళ సహజీవనంలో నాకేం కావాలో నేను చెప్పలేకపోవడం వల్లే నాకీ అశాంతి అనీ నేనెలా గ్రహించకుండా ఉన్నాను? పెళ్ళయిన కొత్తల్లో అతని గురించి నేనేర్పరుచుకున్న ఇమేజ్ నే నా కళ్ళ ముందుంచుకుని బాధపడుతున్నాను తప్ప అతనితో నా భావాలని పంచుకోవాలని తెలుసుకోకుండా అసంతృప్తితో ఎలా ఎనిమిదేళ్ళు గడిపాను? ఎంత మామూలుగా, నాకే బాధా కలగకుండా సమస్యని జనరలైజ్ చేసి నాకున్న ఈగో, బలహీనతల గురించి వివరిస్తుందీమె?’

లేచి ఆమె చేతులు పట్టుకున్నాను. నేను ఆమెని స్పర్శ ద్వారా వినగలుగు తున్నాను. ఆమె నన్ను నా స్పర్శ ద్వారా చూడగలుగుతోంది.

ఆమెకి నేను నా బాధని గురించి చెప్పకపోయినట్లైతే చాలా నష్టపోయి ఉండేదాన్ననుకోగానే అభిమానంతో నా కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. ఆమె కళ్ళల్లో కూడా పల్చని తడి.

***

సెలవలు అయిపోయాయి. అమెరికాకి వచ్చేశాము.

నాకేం కావాలో వెతుక్కోవడం, నా అసంతృప్తిని అతనితో స్పష్టంగా చెప్పగలగడం, కావల్సింది అడిగి తీసుకోవడం వల్ల అతనితో గడుపుతున్న టైమ్ హాయిగా ఉంది. నా కుటుంబం, నా భర్త, నా కొడుకు, ఇంటి పద్ధతులు ఇలానే ఉండాలన్న పాటర్న్ పిచ్చితో ఒకప్పుడు నాకుండే దిగులు పూర్తిగా ఎటో వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఏదో జరగాలని ప్లాన్లు చేసే నాలోని మనిషి నా నుంచి సెలవు తీసుకుంది.

నా దృష్టి కోణం మారింది.

***

“వదినా, కృతజ్ఞతలు” లేత గులాబీ రంగు పేపర్ మీద రాసి ఉత్తరం పోస్ట్ చేశాను.

మా అన్నయ్య ఆమెకి నా ఉత్తరం చదివి వినిపించగానే “పేపరేరంగులో ఉంది?” అని తప్పకుండా అన్నయ్యని అడుగుతుందని నాకు తెలుసు.

లేత గులాబీ రంగుతో చిగురించిన ఆకులు పచ్చగా మారతాయని ఆమెకి తెలుసు.

**** (*) ****