కథ

అన్య

సెప్టెంబర్ 2016

రద నీరొచ్చి చేరడంతో కృష్ణమ్మ నురగలతో గలగలమంటూ పరవళ్ళు తొక్కుతోంది.

నాలుగు రోజుల నుండీ ఒకటే ముసురు. ఐదో రోజు సాయంత్రం కాస్త తెరిపి ఇవ్వడంతో రంగరాయపురం అమ్మలక్కలంతా బిందెలు తీసుకుని ఒక్కొక్కరే కృష్ణ ఒడ్డుకు చేరారు. జమీందారుగారి కోడలుపిల్ల కృష్ణమ్మలాగా గలగలా నవ్వుకుంటూ వచ్చి “అబ్బ! నాలుగు రోజులు కృష్ణని చూడకపోతే ఎంత దిగులేసిందో” అంది. పెద్దింటి కోడలు ఏం మాట్లాడినా అందమే అన్నట్లుగా “ఓయమ్మ నాలుగు రోజులకే దిగులేసుకున్నావా?” అంటూ ఆమెని అల్లరి పట్టించారు ఆమె స్నేహితులు.

పచ్చని పసిమితో ఎంతందంగా ఉందో ఆమె. ఆ ఊరికి కోడలుగా వచ్చినప్పటి నుండీ చూస్తున్నారుగా – ఆమె అందం ‘చెక్కుచెదర’లేదు. పెళ్ళయిన నాలుగు రోజులకే బిందె తీసుకుని నదికి రావడం మొదలు పెట్టింది. నది ఒడ్డున కూర్చోని వయ్యారాలు పోతూ, నీళ్ళని ఎగజిమ్ముతూ పాటలు పాడుతుంది. ఎప్పుడు చూసినా వరదొచ్చిన కృష్ణమ్మకి మల్లే గలగలమంటూ కబుర్లు చెప్పే ఆమె అంటే అందరికీ ఇష్టం.

1

కృష్ణకి అవతలి వొడ్డున ఉన్న అడవిలో ఉండే బంగళాలో ఉంటాడు అతను. అతన్ని అందరూ దొర అంటారు. మన్యం అంతా అతనిదే. అక్కడుండే మృగాలకీ, మనుషులకీ కూడా అతనే దొర. అతను మాట్లాడే ప్రతి మాటలోనూ ఠీవి, ధీమా.

ఒకరోజు గట్టున కూర్చుని కాళ్ళను నీళ్ళల్లో వేసి ఊపుతూ మైమరిచి పాడుకుంటున్న ఆమెని, పడవలో ఉన్న దొర చూశాడు. చిక్కబడుతున్న సంధ్యచీకట్ల లోంచి చీల్చుకు వస్తున్న ఆమె పాటకి సమ్మోహితుడై ఆమె దగ్గరకి రావడానికి ప్రయత్నించి రాలేక, నది మధ్యలో పడవని ఆపి, నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు.

ఆమెని చూసిన ఆ క్షణం ఎలాంటిదో మరి ఇక ఆమెని చూడకుండా ఉండలేకపోతున్నాడు దొర. ఆమె ఎవరో తెలుసుకున్నాడు. జమిందారుగారి కోడలని తెలియగానే కంగారు పడ్డాడు. ముఖ్యంగా ఆమె అన్య అన్న విషయం అతన్ని కలవరపెడుతోంది.

ఆమెని కనిపెట్టమని తన ‘చేపలకి’ చెప్పాడు. నదిలోని నీళ్ళకి ఆమె కాళ్ళు తగలగానే చేపలకి వాసన తెలిసేది. అవి విషయాన్ని బంగళా పక్కనే ఉన్న మామిడితోటలో మెత్తని పరుపు మీద కూర్చుని ఉన్న దొరకి చేరవేసేవి. ఆమె తన దగ్గరికి చేరినట్లు ఊహించుకునే వాడేమో, పాలేరు పడవ కట్టించేలోపు ఆమె గురించిన కబుర్లు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని వింటూ కంపించిపోయేవాడు. ఆమె వెళ్ళిపోతుందేమోనని కంగారు పడుతూ పాలేరుని తొందరపెట్టేవాడు.

ఆమె నదికి రాని రోజు అతనికి నిద్ర ఉండేది కాదు. ఆమెకి అదేమీ తెలియదు. కృష్ణని చేరగానే, బిందెలో పెట్టుకున్న చింతపండు ముద్దని తీసి బిందెకి పులిమి, మళ్ళీ గట్టుపైకి పరిగెత్తి ఒడ్డునున్న ఇటుకరాయి పొడిని తీసి రుద్దుతూ, నీళ్ళని కలదొక్కుతూ పోయి బిందెని కడుక్కునేది. ఇటుకరాయి పొడీ, ఆమె వేసే అడుగుల వల్ల నది అడుగున కదలాడిన మట్టీ నీళ్ళల్లో కలిసి నీళ్ళు కలకలయ్యేవి.

“ఏందా ఎగరడం? నీళ్ళని పాడు చేస్తున్నావు” అనే అమ్మలక్కల మాటలకి ఇంతెత్తున వాళ్ళ మీదకి దూకిపడి “నేనెక్కడ పాడు చేశానూ, అదిగో అక్కడెవరో పాడు చేస్తున్నారు”అనేది చిలిపిగా – వస్తున్న పడవని చూపుతూ. ఆమె అలా చూసిన రోజైతే దొరకి జ్వరం వచ్చి పడిపోయేవాడు.

ఆ పడవని చూడగానే లబలబలాడుతూ “నోరుమూసుకుని కాసేపు ఒడ్డున కూర్చోవే”అని లాగి ఒడ్డున కూర్చోపెట్టేవారు ఆమె స్నేహితులు. వాళ్ళ ప్రవర్తనకి విసుక్కుంటూ, ఆ పడవతో మనకేం పని అన్నట్లు ఒడ్డున కూర్చుని కమ్మని పదాలు పాడేది.

రాను రాను ఆమె గొంతులో విషాద స్వరాలు పలుకుతున్నాయి. అంతకు ముందు సంతోషంగా పాడిన పాటలతో ఈ పాటలని పోల్చుకుని ఏదో అర్థమైనట్లుగా అమ్మలక్కలు నిశ్శబ్దంగా ఉండిపోయారు. లోలోపల దాగి ఉన్న మార్దవాన్ని పదంలో ఇమిడ్చి పాడుతున్న ఆమె పాట అక్కడి పరిసరాలని మరింత మార్మికతలోనికి నెట్టేసేది.

ఈ విషాదస్వరం వల్ల తనకి ఆమె మరింత దగ్గరైనట్లు అనుభూతి పొందుతున్నాడతను. ఈ మధ్య మరీ పాట ఆపేయగానే దొర భరించలేనివాడల్లే పడవని తిప్పుకుని వెళ్ళిపోయేవాడు. వచ్చేప్పుడు ఎంత వేగంగా వచ్చేవాడో వెళ్ళేప్పుడు నిదానంగా కింద పడి సాగుతున్న సముద్రపు అలలా మెత్తగా వెళ్ళిపోయేవాడు. పడవ అవతలి రేవు చేరుకోగానే నదినీళ్ళు తేరుకుని స్వచ్ఛంగా మెరిసేవి. పడవెళ్ళిపోయినట్లుంది అనుకుంటూ ఆమె తలెత్తి ఆవలి వైపుకి చూసేది. అతని చూపు ఆమెని తాకేది కాని, ఆమె దాని గురించి అసలు పట్టించుకునేది కాదు.

2

వసంతకాలం అడవి పూలతో బరువెక్కి ఉంది. బంగారు రంగులో మెరిసిపోతూ వరిపంట కోతకొచ్చింది. మన్యం అంతా కూలీల సందడితో కళకళలాడుతోంది. మన్యం కూలీలకి పనులు పురమాయిస్తున్న అతను ఆరోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆమె నదికి వచ్చిందని కబురు తెలియగానే ఎక్కడి పనులు అక్కడ వదిలేసి నావ ఎక్కాడు.

కృష్ణ ఒడ్డున కూర్చుని ఉన్న ఆమె ముఖంలో ఏదో తెలియని వేదన కదలాడుతోంది. అంత దూరం నుండే అది గమనించిన అతనిలో అలజడి. ఎప్పుడూ నది మధ్యలో ఆగే పడవ మెల్లగా ఆమెకి దగ్గరగా వచ్చింది. ఆమె తల ఎత్తకుండా ముఖం మోకాళ్ళ మీద పెట్టుకుని ఉంది. ఆమెని చేరి హత్తుకొని అనునయించాలని అనిపించిందతనికి. నిస్సహాయత అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె బాధని చూడలేనన్నట్లు అతని కళ్ళు మూసుకున్నాడు.

పొలం పనుల్లో తలమునకలై ఉన్న అమ్మలక్కలు ఆమెని పట్టించుకోకుండా గబగబా బిందెల్లో నీళ్ళని నింపుకుని వెళ్ళిపోతున్నారు. ఆమె కూడా మౌనంగా లేచి, బిందెని తీసుకుని ఇంటికి బయల్దేరింది. గట్టు మీద నిలబడి ఉన్న సుబ్బులు ఆమెకి ఎదురొచ్చి, ఆమె చేతిలోని బిందెని తీసుకోబోయింది.

“ఏమిటిదీ? నాలుగు రోజుల్నించి నాకేమిటి ఈ గోల? నేనే తెస్తా ఇంటిదాకా” అంది ఆమె విసుక్కుంటూ.

“అమ్మో, పెద్దయ్యగారు చూస్తే నా వీపు వాతలు పడేట్లు కొడతారమ్మాయిగారూ. అది మీకిట్టమైతే అలానే కానివ్వండి” అంది సుబ్బులు ముఖం వేళ్ళాడేసి.

ఆమె ఏమీ మాట్లాడకుండా బిందె సుబ్బులుకిచ్చేసి, భారంగా ఇంటి వైపు నడిచింది. “ఈరోజు ఎలాగైనా చిన్న అయ్యగారితో మాట్లాడతాను సుబ్బులూ. ఇంత చదువుకుని ఈ ఊళ్ళో ఎందుకిలా ఉన్నాడో నాకు అర్థమే కావడం లేదు. పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగంలో చేరండి, పోనీ సొంతంగా వ్యాపారం అయినా చేయండి అని చెప్తాను”అంది.

“పెద్దమ్మ గారు ఉన్నన్నాళ్ళూ చెప్పి చెప్పి ఊరుకున్నారు. తల్లి చెప్తేనే విననివాడు పెళ్ళానివి నువ్వు చెబితే వింటాడా అమ్మాయి గారూ. పెద్దాయనకి తెలిస్తే మిమ్మల్ని మరింత కట్టడి పెడతాడు, ఊరుకోండమ్మా!” అంది సుబ్బులు.

సుబ్బులు మాటలు విన్న ఆమెకి అడుగులు మరింత భారమయ్యాయి. నడవలేనట్లు వంగి నడుస్తున్న ఆమెని పడవ మీద నుంచి చూస్తున్న దొర ఆమెకేమయిందోనని ఆందోళన పడ్డాడు. అతనికి ఎడమకన్ను అదిరినట్లయింది. ప్రమాదం కళ్ళముందు మెదిలింది. ‘ఇప్పుడు బిందెని లాక్కుంటున్నారు, ఇక ఆమెని చెరువుకే రానియ్యరేమో. ఎలాగైనా తోటకి ఆమెని రప్పించుకోవాలి. ఆమె పాట పూర్తిగా వినాలి’ తపన, దిగులు కలగలిసిపోయి అడుగులు తడబడుతుండగా పడవ దిగాడు దొర.

3

ఆమె ఆ ఏడంతస్తుల కోటలో బందీ. కిటికీలోంచి వసారాలో తన భర్త, మామగారు జరిపే పంచాయితీ తంతు చూస్తూ ఉండటం, వంటామె వడ్డిస్తే వచ్చి అతను, మామగారు, అనుచరులు తిని వెళ్ళాక తనూ ఇంత తినడం, కాలక్షేపానికి పనోళ్ళతో గవ్వలాడటం – ఇదే ఆమె దినచర్య అయింది.

అతని పేడిగదికి ఓ అలంకరణ కోసం పెట్టుకున్న పెళ్ళాం బొమ్మ ఆమె.

అత్తగారు పోయాక మరీ ఒంటరిబ్రతుకై పోయింది. నోరెత్తి పాటలు పాడుకోకూడదు, పెద్దగా నవ్వకూడదు. ఊళ్ళోవాళ్ళు పెద్దింటోళ్ళ కోడలు ఇలానా ఉండేదీ? అంటారట. ‘చెరువు నుంచి కోడలి చేత నీళ్ళు మోయిస్తున్నారా?’అని ఊళ్ళో ఎవరో అన్నారనీ, వెళ్ళొద్దనీ గొడవ. ఆమె వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా నది దగ్గరకి వెళుతూనే ఉందని నాలుగు రోజుల నించి సుబ్బుల్ని తోడు పంపిస్తున్నారు.

‘తొందర్లోనే ఆమెని రాకుండా కట్టుదిట్టం చేస్తారు’ అనుకున్నాడు వందోసారి దొర. అనుకున్నట్లే అయింది. ఆమె నదికి రావడం లేదు. రోజుకో కొత్త చేపపిల్లతో కాలక్షేపం చేసే దొర చేపపిల్లలని దగ్గరకే రానివ్వడం లేదు. పెదవులు ముడుచుకుని నల్లగా అయ్యాయి. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. చేపపిల్లలని విసుక్కుంటున్నాడు. వాటివైపైనా చూడకుండా విసిరేస్తున్నాడు. కారణం లేకుండానే వాటి మీద అరుస్తున్నాడు.

అతని దగ్గరుండే తెలివైన చేపపిల్ల రంగి అతన్ని చూస్తూ “ఏం దొరా, ఏదో బాధలో ఉన్నావే. నాకు నాలుగెకరాలు రాసిస్తానని మాటిస్తే నీకు సహాయం చేస్తా. సుబ్బులు మా పిన్నమ్మే”అంది.

“నీకు ఇప్పుడున్న పొలం చాల్లేదెట్టా? సరే, అయితే నీ ఇష్టమొచ్చినట్లే కానివ్వు. ఉపాయం చెప్పు”అన్నాడు.

రంగి ఉపాయం చెప్పింది.

4

దొర మామిడితోటలో బ్రహ్మాండమైన విందుకి ఏర్పాట్లు చేశాడు. నదికి చుట్టుప్రక్కల ఊళ్ళలోని పెద్దమనుషులకి ఆహ్వానం అందింది.

ఆ రాత్రి విందు మొదలయింది. ఈమె కోటలోని దొరలు, అనుచరులతో సహా ఊరు ఊరంతా ఆవలనున్న దొర బంగళాకి చేరింది. విదేశీ మత్తు అక్కడ పారుతోంది. రంగి ఆమె దగ్గరకి చేరి, “చంద్రుడు నదిలో జలకాలాడుతున్నాడు. ఊరు ఊరంతా తోటలో పున్నమి వేడుక చేసుకుంటుంటే మనం ఎందుకు చేసుకోకూడదు? దా! మనం నది ఒడ్డుకి వెళదాం. తోటలోని మర్రిచెట్టు ఊడలెక్కి ఉయ్యాలలూగుదాం. మంచె మీద పండగ చేసుకుందాం”అంది.

ఎప్పుడెప్పుడు నదిని చూస్తానా అని దిగులు పడుతున్న ఆమె వెన్నెల్లో నదిని చూడటానికి రమ్మంటే ఎందుకు రాదూ? – వచ్చింది. ఆవలి ఒడ్డున బంగళాలో తందనాల కోలాహలం ఈవలకి వినిపిస్తోంది. అవన్నీ ఏమీ పట్టనట్లు కీచురాళ్ళు గీపెడుతూ పాటలు పాడుతున్నాయి.

నదిలో నవ్వుతూ తుళ్ళుతూ జలకాలాడి అలసిన ఆమెని దాహం తాగమంటూ మట్టికూజా ఆమె పెదవులకి అందించింది రంగి. మత్తుపదార్థం కలిసిన నీళ్లను త్రాగి స్పృహ కోల్పోయి సొమ్మసిల్లిన ఆమెని మర్రిచెట్టుకి వేసిన మంచెమీదకి తెచ్చుకున్నాడు దొర. వెన్నెల్లో నిద్రపోతున్న రాజకుమారిలా ఉందామె. తన ఒళ్ళోకి చేరిన అంత అపురూప లావణ్యాన్ని అతను మైమరిచి చూశాడు, చూస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు.

అలాగే చూస్తూ పొద్దు పుచ్చుతున్నాడేమిటా అని వెర్రిదానిలా దొరని చూస్తోంది రంగి. అతని కళ్ళల్లో ఆమె పట్ల కనిపిస్తున్న ఆరాధనని చూస్తుంటే రంగికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. దొర లోని యీ మరో కోణం కొత్తగా, చాలా కొత్తగా ఉంది రంగికి. తెల్లవారుతుందనగా ఆమెని అలానే వదిలి లేచి నావెక్కి, ఆవల తీరానికి వెళ్ళిపోయాడు దొర.

ఇదంతా ఏమీ తెలియని ఆమె ప్రశాంతంగా నిద్రపోతూనే ఉంది పొద్దెక్కిందాకా. తెల్లవారి లేచి చూసేప్పటికి ఇంట్లో ఉంది. తన మంచం పక్కనే కూర్చుని ఉన్న రంగి పెదవులని వంచి మరీ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఆమె పట్ల ఎప్పుడూ లేని భావమేదో కదలాడుతోంది. రంగి కళ్ళల్లో కొత్తగా కనిపిస్తున్న ఆ ప్రేమకి నవ్వుకుంటూ ఆమె “ఏమిటే రంగీ, నన్నెప్పుడూ చూడనట్లు కొత్తగా చూస్తున్నావ్?” అంది.

రాత్రి జరిగిందంతా చేతులు ఊపుతూ, కళ్ళని తిప్పుకుంటూ, గొంతులో సరిగమలు పలికిస్తూ మరీ చెప్పింది రంగి. వింటున్న ఆమె నిర్ఘాంతపోయింది.

“అవునమ్మా దొర నిన్ను చూసి మురిశాడు. నీ కోసం ఏమైనా చేస్తానని, ఏదైనా వదులుకుంటానన్నవాడు నువ్వు దొరికితే ఎట్లా అట్లా రాత్రంతా నీ మొకమే చూస్తా కూర్చున్నాడో తెలియక కొట్టుకుంటన్నా” అంది.

తన పరిస్థితికి తనేం ఏం చేయాలో అర్థం కాక ఆమె విలవిలలాడింది. రోజూ అతను పడవ మీదనుండి తనని చూసే చూపులు గుర్తుకు తెచ్చుకుంది. అతను తనని ప్రేమిస్తున్నాడా? అంత ప్రేమించినవాడు, నన్ను కావాలని కోరుకున్నవాడు అవకాశం వచ్చినా ఎందుకాగాడు? అతనికా వాంఛ లేదా? నా పట్ల అతనికి ఉన్నది ప్రేమా? అనురాగమా? కోరికా? అసలు వీటన్నిటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదెందుకో? ఆ అనుభవం నాకున్నట్లైతే తెలిసేదేమో భేదం!

ఆశ్చర్యం. నా కోసం, కేవలం నా కోసం తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసీ తెగించి నన్ను తన దగ్గరకి తెప్పించుకుని ఎందుకు అలా చూస్తుండిపోయాడు? అంత ఇంద్రియనిగ్రహం అతనికెలా సాధ్యం? అసలు అదేనా నిజమైన ప్రేమ అంటే? మహోజ్వలమైన ఈ ప్రేమ భావనకి అర్థం ఎలా తెలుస్తుంది?

విచిత్రంగా అతని మీద కోపం రావడం లేదేమిటి? భాషకీ భావానికీ అందని ఈ లాలస ఏమిటి? నిరాశగా, నిస్పృహగా గడిచిపోతున్న నా జీవితానికి కొత్త ఊపిరా ఇది? నాకు తెలియని, ఎవరి ద్వారానో విన్న నా అనుభవాన్ని గురించిన ఈ ఆలోచన ఇంత ఆనందం కలిగిస్తున్నదేమిటి? అయినా ఇది నిజమైన ఆనందమేనా? ఎవరు చెప్తారు నాకు సమాధానం?

ఆమె ఆలోచిస్తూనే ఉంది. మధ్యాహ్నమయ్యేప్పటికి ఆమె నిట్టూర్పులకి ఎండ వేడిమి తోడై, ఆమె శరీరం కందిపోతోంది. ఊపిరి భారమవుతోంది.

ఎవరు నువ్వు? ఇన్నాళ్ళూ ఏమయ్యావు? దొరా, నా చిన్ని పూలతోటలోకి బలవంతంగా చేరి మరీ నా పువ్వులని ముద్దాడకుండా ఎలా వెళ్ళగలిగావు? స్వచ్ఛతా, స్పష్టతా లేని ఈ కోటని బద్దలు కొట్టి నీ దగ్గరికి నన్ను చేర్చుకునే అవకాశాన్ని ఎలా వదిలావు? అందరూ అంటున్నట్లు నిజంగా నువ్వు దుర్మార్గుడివే సుమా. వస్తున్నాను, ఈ రాత్రికే నిన్ను కలుసుకుంటాను, తేల్చుకుంటాను.

రెండవుతుండగా ఆలోచనలనుండి బలవంతంగా తనని బయట పడేసుకుని లేచింది. చిందరవందరైన కురులని ముడేసుకుంటూ సుబ్బుల్ని కేకేసింది.

“సుబ్బులూ, రంగిని నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకురా”ఆజ్ఞాపించిందామె. కాసేపట్లోనే రంగి ద్వారా దొరకి కబురు చేరింది – ఆ రాత్రి మళ్ళీ బంగళాలో ఇంకా పెద్ద విందు ఏర్పాటు చేయాలనీ, ఊరుని ఏమార్చి రాత్రిలాగే తనని కలుసుకోవాలనీ.

5

ఏదో ఆవేశంతో తనని కలుసుకోమని అతనికి కబురు చేసిందే కాని, ఏం మాట్లాడటానికి అతన్ని రమ్మందో ఎంత ఆలోచించినా ఆమెకి అర్థం కావడం లేదు. ఏదో ఆకర్షణ అతని పట్ల. అతన్ని దగ్గరగా చూడాలన్న ఆత్రం. అతనికి తన పట్ల ఉన్న ఆరాధన, అభిమానం ఎంతో కొలుచుకోవాలన్న తపన. అంతేనా? అంతకంటే ఏమీలేదు కదా. అవును అంతే, ఇంకేమీ లేదు.
ఆలోచించుకుంటూనే ఉంది. అతని దగ్గరకి వెళ్ళినప్పుడు తనని తాను ఎంత అందంగా ప్రదర్శించుకోవాలోనని మనసులో నెమరు వేసుకుంటూనే ఉంది.

సాయంకాలమయ్యేకొద్దీ ఆమె ఎద అతని ఆలోచనలతో తబ్బిబ్బు పడుతోంది. అర్ధరాత్రి వరకు కూడా ఆగలేని ఆమె మలిఝాములో బయలుదేరి వెళ్ళి, నది ఒడ్డున వున్న మర్రిచెట్టు కిందికి చేరింది. రంగి కాపలాగా దూరంగా చీకట్లో కూర్చుని అప్రమత్తంగా నలుదిక్కులా చూస్తోంది. మర్రిచెట్టు కూడా ఆమెని కప్పేస్తూ తన ఊడలని విరబోసినట్లుగా ఉంది.

దొర వచ్చాడు. ఆ చెట్టుకింద వెలుతురు నీడల మధ్య నిలబడ్డ ఆ వెన్నెలబొమ్మని చూస్తూ ఏదో అలౌకిక స్థితిలో ఉన్నట్టు అలా నిలబడిపోయాడు. ఏమీ మాట్లాడలేదు ఆమె. అసలామెకి మాటలు రాలేదు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు.

అంతే, కృష్ణమ్మ వెన్నెలని తాగుతూ మరింత నిశ్శబ్దంలోకి జారిపోయింది.

రంగికి ఆమెని ఇంటికి ఎలా చేర్చాలో తెలుసుగా. తెల్లవారేప్పటికి ఆమె ఇంట్లో ఉంది.

అయితే తర్వాతేం జరుగుతుందో అనుకుంటూ ఆమె మనస్తత్వాన్ని ఎప్పుడో అంచనా వేసిన దొర శిలగా మారాడు. చెట్టుకున్న మంచె మీద నుండి ఇక కిందికి దిగలేదు.

6

రోజులు గడుస్తున్నాయి. ఋతువులన్నీ ఒకదానివెంట ఒకటి తోసుకుని పోతూనే ఉన్నాయి. అయినా ఆమె గది దాటడం లేదు. అతను మంచె దిగడం లేదు. రెండు హృదయాలు అలా చెట్టుకిందొకటి, గదుల మధ్య ఒకటి సమాధి అయిపోయాయి.

7

‘నువ్వెందుకు ఆమెని తాకకుండా అలాగే చూస్తుండి పోయావో ఇప్పుడు నాకు తెలిసింది దొరా. తాకితే చూడలేనని గ్రహించావు కదా’ అంటూ గొణుక్కుంటూనే ఉంది పిచ్చిపట్టిన దాన్లా రంగి – చచ్చేంతవరకూ.

మంచె మరోసారి ఆ అనుభవం కోసం ఎదురు చూస్తోంది. చూస్తూనే ఉంది. అన్నీ తెలిసిన కృష్ణమ్మ మాత్రం నిశ్చలంగా, నిలకడగా నిలబడి తనలోకి కొత్త నీరు చేర్చుకుంటోంది.

**** (*) ****