ముషాయిరా

నా కోసం వేచిచూడు -శివసాగర్

నవంబర్ 2016

రితీయబడ్డ పాట నుండి
చెరపడ్డ జలపాతం నుండి
గాయపడ్డ కాలిబాట నుండి
ప్రాణవాయువు నుండి,
వాయులీనం నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను.
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు

మేల్కొన్న ఇసుక రేణువు నుండి
తొలకరి వాన చినుకు నుండి
నెత్తురోలికే పిల్లన గ్రోవి నుండి
అనంత ఆకాశంలోని అంతిమ నక్షత్రం నుండి
నుదిటిపై నవ్వే నాగేటిచాళ్ళ నుండి
గాలి ఈల నుండి, నీరెండ నుండి
మట్టి వాసన నుండి అట్టడుగు నుండి
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నాకోసం ఎదురుచూడు
నాకోసం వేచి చూడు
గో ధూళి వేళ
గోరింటాకు అరచేతిలో ఎరుపెక్కే వేళ
హోరెత్తే సముద్రం ఆకాశాన్ని తాకే వేళ
నక్షత్ర దీపాలు మౌన సంగీతాన్ని వినిపించేవేళ
నౌక తీరాన్ని విడిచే వేళ
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను.
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు.
పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాన్ని అలంకరించే వేళ
శిసిరంలో రాలిన ఆకులు జీవిత సత్యాన్ని విప్పిచెప్పే వేళ
తల్లి చనుబాలు నా గీతాలపై ప్రవహించే వేళ
ఎందరో నన్ను మరిచిపోయిన వేళ
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా కోసం ఎదురుచూడు
నా కోసం వేచి చూడు.
భూమి ఆకాశం కలిచే చోట
పొన్న పూలు రాలి పడిన చోట
వీధి దీపాలు ఉరి పోసుకున్న చోట
నేలమాగళి కన్నీరు కార్చిచ్చు అయినచోట
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను.
అసత్యాల అరణ్యాలను తెగంరికేచోట
గోదారి సముద్రంతో కరచాలనం చేసేచోట
చరం గీతం మరణ శాసనం రాసుకొన్నచోట
మహాసంకల్పం ఎర్రజెండాగా ఎగిరేచోట
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచిచూడు
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నేను మట్టికరిసే ననే సర్కారీ కట్టుకధను తిరస్కరించు
కౌటిల్యం నా పేరిట జరిపే సంస్మరణ దినోత్సవాలను బహిష్కరించు
వాడ వాడలా నా సంగీతాన్ని వినిపించు
నేను చనిపోను
ఏ తాడు నన్ను ఉరితీయలేదు
సగర్వమైన నీ కన్నీళ్ళ నుండి తిరిగి లేస్తాను
సూర్యనేత్రం నుండి లేచి వస్తాను.
ప్రాణ వాయువు ఊది పిల్లన గ్రోవిని పలికిస్తాను
సంధ్యారాగంలో వాయులీనం వినిపిస్తాను
హోరెత్తే సముద్రంతో కరచాలనం చేస్తాను.
భువన భవనపు బావుటానై పైకి లేస్తాను.
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచి చూడు.
తిరిగి వస్తాను
తిరిగి లేస్తాను
నా పేరు మృత్యుంజయుడు
నాకోసం ఎదురు చూడు
నాకోసం వేచిచూడు.

(జాగ్తేరహో సంకనలం నుంచి…, సాహితీ మిత్రులు ప్రచురణ, 2013)