డైరీ

అనామిక

అక్టోబర్ 2014

అనుభూతించడానికి
ఎంత ధైర్యం కావాలి?
ఎంత గాఢత కావాలి?

అనుభూతిలో మమేకమై
కరిగి మాయమవడానికి
నా అస్తిత్వాన్ని నా దేహాన్ని రెండు చేతుల్లో ఎత్తుకుని నడుస్తూ పరిగెత్తుతూ నేనే

గమిస్తూ, చలిస్తూ, శిలనై, మంచునై, గాలినై, పరమాణువునై,
నిశ్శబ్దాన్ని వింటూన్న క్షణాన్ని దర్శించడానికి
ఎంత మౌనం కావాలి?

భయం
లోపల ఒత్తిడికి ,సాంద్రతకు
కమిలి,వేడెక్కి ,రగిలి,మరిగి ,ముక్కలై మాయవడానికి
ఎంత కోరిక కావాలి?

ఉందా నాలో?

ఎక్కడో పై పొరలను తడుముతూ, దొర్లిస్తూ, అల్పసంతోషిగా దాటేస్తూ
నాలోంచి నాలోకే,దేనిలోకీ కాక,దేనికీ కాక
సుషుప్తి నుంచి సుషుప్తిలోకే మరలిపోతూ
తరచి చూడటం శ్రమ
ఆలోచించడం శ్రమ
కదలడం, బ్రతకడం, గాలి పీల్చడమూ శ్రమే!

నువ్వెలా ఉంటావో ఇంతకాలానికీ కళ్ళెత్తి పూర్తిగా చూడనూ లేదు
మనమధ్య గాలిని పక్కకు నెట్టి-
నీ ఉచ్వాసను స్పర్శిస్తూ మునివేళ్ళతో నువ్విలా ఉంటావని
ఆపాదమస్తకం తడిమి చూడలేదు అన్నాళ్ళ పరిచయంలోనూ
అంత సాన్నిహిత్యంలోనూ ఒకప్పటి నిన్ను…

ఎగసిపడే అలలముందు వాటిలో కలిసిపోకుండా నిగ్రహించుకోడం ఎంత కష్టం
కావలించుకుని చైతన్యించి ఎగసిపడి, పడి లేచి
ఇసుక,బురద,నీరు అణువుల్లో కలిసిపోయి
నేను లేకుండా నా అనుభూతి మిగిలిపోయే చివరిక్షణం దాకా
ఉందా అంత ధైర్యం,కోరిక,తపన,ప్రాకులాట ?