ముఖాముఖం

విశ్వసాహిత్యంతో కరచాలనం మొదలు కాబోతోంది

మార్చి 2017

దివారం మధ్యాహ్నం.

జనాలంతా విశ్రాంతిగా టీవీ చానెల్స్ ట్యూన్ చేసే సమయం. ఎలాంటి ప్రోగ్రాంస్ ఐతే బాగా అమ్ముడౌతాయి? కొత్త సినిమాలు, సినిమా కబుర్లు, టాలీవుడ్ గాసిప్, ఫ్లాష్ న్యూస్, మసాలా పాటలు, మిర్చి డాన్సులు…

ఏ ప్రైవేట్ టీవీ చానెలైనా దాదాపు ఇలానే ఆలోచిస్తుంది. ఆ ప్రైం టైం ని టీ ఆర్ పీ లోకి మార్చుకునేందుకే ప్రయత్నిస్తుంది.

ఐతే ఈ ధోరణికి భిన్నంగా గత నాలుగేళ్ళుగా ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ఒక కార్యక్రమం పెద్ద హడావిడి లేకుండా నిరాటంకంగా ప్రసారమౌతూ వస్తోంది. అదీ సాహిత్యం గురించి. ఈ ప్రోగ్రాం లో చలం నుండి చండీదాస్ వరకు, మార్క్వైజ్ నుండి ఓరాన్ పాముక్ వరకూ ఎందరో సాహితీకారుల గురించిన కథనాలొచ్చాయి. ఏ మారుమూల ఊళ్ళలోనో ఉంటూ చక్కటి రచనలు చేసి, పెద్దగా పేరులోకి రాని విస్మృత కవుల్ని ఈ కార్యక్రమం వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పుడప్పుడే కలం పట్టి బిడియపడుతూ రాస్తున్న ప్రామిసింగ్ రైటర్స్ ని కొత్త కెరటాలుగా చూపించింది.

ఈ నెలతో రెండొందల ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఆ కార్యక్రమం పేరు “అక్షరం”. ఇది 2013 నుండి 10-టీవీ నిర్వాహణలో ప్రసారమౌతూ వస్తోంది.

రెండొందల మైలురాళ్ళు దాటిన ఈ సందర్భంగా అక్షరం ప్రొడ్యూసర్ కిరణ్ చర్లతో మాటామంతీ…

***

హాయ్! కంగ్రాచులేషన్స్.

థాంక్యూ..

“అక్షరం” ఆలోచన ఎలా వచ్చింది?

నేను 10టీవీ లాంచింగ్ కంటే మూడు నెలలు ముందు – అంటే 2012డిసెంబర్ లో – 10టీవీ ప్రోగ్రామింగ్ డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయ్యాను. నాకు తెలిసి ప్రోగ్రామ్స్ ఏం ఉండాలి అనేది అప్పటికే నిర్ణయమయింది. నేను జాయిన్ అయిన తర్వాత మా టీమ్ మీటింగ్ లో ప్రోగ్రామ్ ల గురించి చెప్తూ లిటరేచర్ కి సంబంధించి ఏదైనా చేద్దాం అని ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్న ప్రసాదమూర్తిగారు అన్నారు.. అప్పటి సీఈవో అరుణ్ సాగర్ గారు, ప్రోగ్రామింగ్ హెడ్ ప్రసాదమూర్తిగారు ఇద్దరూ ప్రముఖ కవులు, సాహిత్య ప్రేమికులు..వారి ఆలోచనలకు, 10టీవీ మేనేజ్ మెంట్ సహకారం ఉండటంతో అక్షరం మొదలయిందని చెప్పాలి.. లిటరేచర్ మీద నాకున్న ఆసక్తి అక్షరంలో నన్ను భాగం చేసింది. 2013 మార్చ్ 17న అక్షరం మొదటి ఎపిసోడ్ …ఛానల్ లాంచ్ అయిన రోజే టెలికాస్ట్ అయింది. ఇప్పుడు 200 వారాలు పూర్తి చేసుకుంది.

ఆదివారం మధ్యాహ్నం స్లాట్ లో సాహిత్యానికి సంబంధించిన ప్రోగ్రాం అంటే అభ్యంతరాలేం రాలేదా?

ఆదివారం అంటే.. ప్రతి సెకనూ ముఖ్యమే.. కానీ, 10tv లక్ష్యాలు మిగిలిన ఛానళ్ల కంటే భిన్నం.. న్యూస్ ఈజ్ పీపుల్ అంటూ ప్రత్యామ్నాయ వేదికలా వచ్చిన 10టీవీలో బకాసుర, వైడాంగిల్, అక్షరం, మానవి లాంటి భిన్నమైన కార్యక్రమాలు మొదలయ్యాయి.. కొనసాగుతున్నాయి. ప్రతిసెకనూ కమర్షియల్ స్పేస్ గా భావించే ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలాంటి ప్రోగ్రామ్ కొనసాగుతోందంటే దానికి 10టీవీ మేనేజ్ మెంట్ దృక్పథమే కారణం.

వ్యక్తిగతంగా సాహిత్యంతో మీకున్న అనుబంధం ఎలాంటిది?

చిన్నప్పటి నుంచి కథలు, నవలలు చదవటం మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే. హైస్కూల్ పూర్తయ్యేసరికి మా ఊరి లైబ్రరీలో ఉన్న అన్ని నవలల్నీ చదవడం అయిపోయింది. ఆ తర్వాత కూడా అదే ఆసక్తి కొనసాగుతోంది.

అంతకుముందు మీకు పరిచయం లేకుండా “అక్షరం” కోసం చదివిన, కలుసుకున్న రచయితలెవరు?

నిజానికి నాకు రచయితలను కలవటంపై ఎప్పుడూ పెద్ద ఆసక్తి లేదు. ఎందుకో.. రచనలు, రచయితలు ఒకటే అయి ఉండాలి, అయి ఉంటారు అని అనుకోను. వాళ్లను కలిస్తే రచయిత గురించి పాఠకుడిగా నాలో ఉండే మ్యాజిక్ పోతుందని భయం కూడా ఉంది. అందుకే రచయితలను ఎవర్నీ కలిసే ప్రయత్నం గతంలో చేయలేదు. కానీ, ఈ నాలుగేళ్లలో అక్షరంలో భాగంగా చాలా మంది రచయితలు పరిచయమయ్యారు.

అక్షరం లో కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా?

అక్షరంలో కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామనే వాదన ఉంది. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇటీవలి కాలంలో నవలలు పెద్దగా రావటం లేదనే సంగతి తెలిసిందే. కథ, నవల కంటే కవిత్వం ఎక్కువగా వస్తోంది. అలా కవిత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించవచ్చు. కానీ సందర్భం, అవకాశం వచ్చినప్పుడల్లా కథ, నవల, పాట అన్నిటికీ ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాం.

ఈ నాలుగేళ్ల ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, తగిలిన ఎదురుదెబ్బలు, సంతోషకరమైన సందర్భాలు?

ఎదురు దెబ్బలంటూ ఏమీ లేవు. పాఠాలు, సంతోషకరమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాహిత్యం అంటే ఇష్టం ఉన్నప్పుడు, దాని చుట్టూ పరిభ్రమించే కార్యక్రమంలో భాగం కావటం సంతోషమే కదా. అదే క్రమంలో ఈ నాలుగేళ్ల కాలంలో తెలుగు సాహిత్యంలో శిఖర సమానులు పరిచయం కావటం, వివిధ సందర్భాల్లో వారితో మాట్లాడటం ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అక్షరం ద్వారా జరుగుతున్నదేమంటే, సాహిత్యంలో ప్రముఖుల ప్రొఫైల్స్ వీడియోగా రికార్డవుతున్నాయి. ఉదాహరణకు పైడి తెరేష్ బాబు పాడిన రెండు అపురూపమైన గజల్స్ వీడియోగా రికార్డ్ చేశాం. అదే సమయంలో ఆర్. ఎ. వాసు అనే ప్రజానాట్యమండలి కళాకారుడు ఈ మధ్యే మరణించారు. ఆయన వీడియో అంటూ ఏదైనా ఉందీ అంటే అక్షరం కొరకు చేసిన స్టోరీ మాత్రమే. ఇలా తెలుగు సాహిత్యంలో ప్రముఖుల వీడియో గుర్తులు అక్షరం ద్వారా మిగలటం సంతోషమే కదా.

కొత్త కెరటాల్ని పరిచయం చెయ్యడం వల్ల ఆ రచయితలకి ఒక మానసిక స్థైర్యాన్ని కల్పించినట్టు ఎప్పుడైనా అనిపించిందా?

నిజమే కదా. కొత్తగా రాస్తున్న వాళ్లకి ప్రోత్సాహం కావాలి. వాళ్లు రాస్తున్న కథ అయినా, కవిత్వం అయినా దాని గురించి మాట్లాడటానికి , అభిప్రాయాలు పంచుకోటానికి ఓ వేదిక కావాలి. అక్షరం కార్యక్రమంలో మోహన్ రుషి, నంద కిశోర్, కాశిరాజు, మెర్సీ మార్గరెట్, మానస ఎండ్లూరి, బాల సుధాకర మౌళి లాంటి చాలా యువ కలాలను పరిచయం చేశాం. ఇది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే అనుకుంటాను.

అక్షరంలో చెయ్యాలనుకుని చెయ్యలేని పనులేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుచేత?

అలాంటివేమీ లేవనే చెప్పాలి. కాస్తముందూ వెనక అయినా, అనుకున్న కథనాలు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాం.

మీ టీం గురించి, ఈ ప్రోగ్రాం లో వాళ్ల పాత్ర గురించి కాస్త…

ఎలక్ట్రానిక్ మీడియాలో ఫ్రంట్ ఎండ్ లో ఒక్కరు కనిపించవచ్చు. కానీ, నిజానికి అందులో టీమ్ వర్క్ ఉంటుంది. కవి విమర్శకులు బిక్కి కృష్ణ మా టీమ్ లో స్క్రిప్ట్ రైటర్, వాసు వీడియో ఎడిటర్, వేణు కొసరి గ్రాఫిక్స్ చేస్తాడు. నేను ప్లానింగ్ అండ్ ఫైనల్ అవుట్ పుట్ లో మార్పులు చేర్పులు చూస్తాను.

రెగ్యులర్ గా సామాజిక సమస్యలని చూపించే “వైడ్ యాంగిల్” ప్రోగ్రాం చేస్తుంటారు కదా. ఈ రెంటికీ మధ్య పనితీరులో ఏం తేడాలున్నాయి?

వైడాంగిల్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30కి వస్తుంది. ఇది పూర్తిగా కరెంట్ ఎఫైర్స్ బేస్డ్ ప్రోగ్రామ్. దీనికి అక్షరానికి పొంతన లేదనే చెప్పాలి. వైడాంగిల్ లో ఏ రోజు టాపిక్ ఆ రోజే నిర్ణయమౌతుంది. అదే రోజు టెలికాస్ట్ అవుతుంది. అక్షరం ముందే ప్రణాళిక ప్రకారం చేస్తాం. వైడాంగిల్ విషయానికి వస్తే నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ని అదే సమయంలో స్క్రిప్ట్ కూడా నేనే రాస్తాను.

పైన ప్రస్తావించినవి కాకుండా అక్షరం లో ఎలాంటి శీర్షికలొచ్చాయి? (పుస్తక పరిచయాలు, ప్రసంగాలు గట్రా). ఏదైనా శీర్షికను కొన్నాళ్ళు నడిపి ఆపేయాల్సొచ్చిందా?

అక్షరంలో కొత్త కెరటాలు, విస్మృత కలాలు, జనం పాట, ధిక్కార స్వరాలతో పాటు, పుస్తక పరిచయం, అక్షరం అంతరంగం లాంటి శీర్షికలు ఉన్నాయి. వీటిలో అన్ని శీర్షికలు వీలుని బట్టి కొంత గ్యాప్ తో వస్తూ ఉంటాయి. త్వరలో “ విభాత సంధ్యలు” ద్వారా విశ్వసాహిత్యంతో కరచాలనం మొదలు కాబోతోంది.

టీవీ మాధ్యమంలో ఇలాంటి ప్రోగ్రాంస్ ఇంకేమైనా వస్తున్నట్టు మీకు తెలుసా?

గతంలో టీవీ9, హెచ్ ఎమ్ టీవీ ఛానళ్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేశాయి. కానీ, అవి ఎక్కువ కాలం నడవలేదు.

ఈ ప్రోగ్రాం కి ఆడియెన్స్ ఎవరు? దీన్నుండి మీరాశించిన ప్రయోజనమేంటి? ఎటువంటి భావజాలమున్న సాహిత్యాన్ని మీరెక్కువగా కవర్ చేస్తారు?

అక్షరం కార్యక్రమానికి టార్గెట్ ఆడియన్స్ ముఖ్యంగా సాహిత్య ప్రేమికులు. కవులు, కళాకారులు, రచయితలు, సీరియస్ గా సాహిత్యాన్ని అనుసరించే పాఠకులు. అక్షరం అభ్యుదయ సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది దళిత, బహుజన వాద సాహిత్యానికి వేదికగా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రయోజనకర సాహిత్యానికి, సమాజంలోని అనేక వాదాలను ప్రతిబింబించే అక్షర స్పందనలకు ప్రాధాన్యం ఇస్తుంది.

ముందుముందు ఏమైనా మార్పులు చెయ్యాలనుకుంటున్నారా?

ఎలక్ట్రానిక్ మీడియా అంటేనే నిరంతరం మార్పులు అవసరమయ్యే మాధ్యమం. కొత్త సెగ్మెంట్లు కొన్ని మొదలు పెట్టడంతో పాటు, ప్రజెంటేషన్ లో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నాం.

ఆల్ ద బెస్ట్.

థాంక్యూ,

**** (*) ****