ముషాయిరా

ఎర్రని జ్ఞాపకం

ఫిబ్రవరి 2017


“కొందరి జ్ఞాపకం ఎప్పుడూ అంతే
దేహాన్ని నీట్లో ముంచి
ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టే..
లోపల నీరంతా ఎవరో బయటకు తోడేస్తున్నట్టే…
రక్తదాన కేంద్రాల్లాగా
కన్నీటిదాన కేంద్రాలున్నాయేమో చూడాలి…”

ఈ నెల ముషాయిరాలో కవిత ‘అరుణ్ సాగర్’ స్మృతిలో, ‘ఎర్రని జ్ఞాపకం’, డా. ప్రసాదమూర్తి కవితా సంపుటి “చేనుగట్టు పియానో” నుంచి.

ఎర్రని జ్ఞాపకం

కొందరి జ్ఞాపకం ఎప్పుడూ అంతే
దేహాన్ని నీట్లో ముంచి
ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టే
లోపల నీరంతా ఎవరో బయటకు తోడేస్తున్నట్టే-
రక్తదాన కేంద్రాల్లాగా
కన్నీటి దానకేంద్రాలున్నాయేమో
చూడాలి.. తమ్ముడు ఒకటే తవ్వి పాడేస్తున్నాడు
మిత్రులారా.. !
గుండెకు గుచ్చుకుంటున్న అశ్రు శిఖరాల అగ్గి ముక్కలు
కళ్ళను తాకుతున్న మన్వంతరాల మహాస్వప్నాలు
భుజానికి రాసుకుంటున్న ఇంద్రధనుస్సుల దరహాస చిత్రధ్వనులు
జీన్ ప్యాంటూ టీషర్టూ
ఇంపోర్టెడ్ గాగుల్స్.. పాయింటెడ్ షూ వేసుకుని
ఎర్రగా రెపరెపలాడే జెండా ఊపిరి చప్పుడు
మీక్కూడా అనుభవంలోకి వస్తే
అది తప్పకుండా తమ్ముడే అయ్యుంటాడు
కాస్త కబురు చేయండి
ఊపిరితిత్తుల్ని ఒక లెక్కప్రకారం కొరుక్కుతినే ఉద్యోగం
హార్ట్ బీటింగ్‌తో ఆటలాడే రేటింగ్ రాకాసి ప్రేయసి
ఫ్రేములు ఫ్రేములుగా రక్తంలో నాట్యం చేసే
ఆధునికానంతర వివస్త్ర సంగీతాలు
ఎటు కదిలితే నీడకు ఏ బాణం గుచ్చుకుంటుందో
తెలీని అభద్ర జీవన బీభత్స సౌందర్యం
మీకూ ఎప్పుడైనా ఎముకల మీద
రాతి చినుకులై కురుస్తూనే వుంటాయి
అవన్నీ నా తమ్ముని గుర్తులే
ప్లీజ్.. నాతో షేర్ చేసుకుంటారా
ఎగిరే సరస్సులు..ఖండిత శిరస్సులు
చిట్లుతున్న కొండలు..చిటపట అడవులు
చనుమొనలకు కవిత్వం అద్దుకు తిరుగుతున్న
కొన్ని సాలభంజికలు..కొన్ని తడి స్వప్నాలు
పెఠిల్లుమంటున్న టెస్టోస్టిరాన్లు..ఆండ్రోజెన్లు
విల్లంబులు..కొమ్ముబూరాలు
గ్రామాల కళ్ళల్లో ఒరుసుకుంటున్న గోదారి గట్లూ
దోస్తులారా మీకెక్కడైనా కనిపిస్తే
అక్కడ నా అనుంగు సోదరుడు..
సాగరుడు తచ్చాడుతూ వుంటాడు
దయచేసి సమాచారం అందించండి
నిద్రపోవడానికి మందులున్నాయి కదా
మర్చిపోవడానికీ మంత్రం ఏదైనా వుంటే
కాస్త ఉపదేశించి ఎవరైనా పుణ్యం కట్టుకోండి
పడుకున్నప్పుడు రెప్పల మీద
నడుస్తున్నప్పుడు పాదాల్లోనూ
కూర్చున్నప్పుడు వెన్నుపూస లోపలా
తమ్ముడు కదులుతూనే వున్నాడు
ఫ్రెండ్స్.. మీకేదైనా అక్షరం గలగలా శబ్దమైతే
మీకేదైనా వాక్యం రెపరెపా నాదమైతే
మీకేదైనా పద్యం ధారాపాత వర్షమైతే
అది మావోడే అయ్యుంటాడు
కొంచెం కనికరించి వార్త పంపండి
పడుతూ లేస్తూ వస్తాను
బతికినప్పుడూ దొరకలేదు
దొంగ.. కనీసం ఇప్పుడైనా దొరుకుతాడేమో
తమ్ముడూ తమ్ముడూ

-ప్రసాదమూర్తి, (అరుణ్ సాగర్ కోసం)