ముషాయిరా

అగ్ని స్పర్శ -అజంతా

జనవరి 2017

బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్నప్పుడే
క్షణాల మధ్య అగాధంలో స్వప్న చక్షువులకు నిషా
ఖడ్గ ధారల మధ్య క్షతగాత్రుడైనా అప్పుడు ఉజ్వలంగానే ఉంటాడు
వైరుధ్యాలను వెన్నెముకగా ధరించిన నేను
ఎడారిలో వానజల్లుల రహస్యాన్ని ఏనాడో మౌనంగా స్వీకరించాను

కాలం మరెవరో కాదు నేనే

క్షణక్షణ సంహార క్రీడలో గతం, వర్తమానం, ఉదయాస్తమయాలు
ఉన్మత్త క్షేత్రాలలో రాక్షసుల ఉచ్చ్వాస నిశ్వాసాలు
జీవన కుడ్యాలలో ఆకలి ఆకర్ణాంత నేత్రాలు
కన్నీళ్ళలో ప్రేమికుల ప్రతిబింబాలు
అన్నీ ఒకే దృశ్యం వెనుక చీకటి భాస్మరాసులే!

కంటక చతురస్రాల మధ్య నిరీక్షణ అసహ్యం నాకు
నిరాశ, నిట్టూర్పులు, నిద్రారణ్యాలు నిషిద్దం
ఆధునిక మానవుడు అనల నేత్రుడు కదా
హతుడు, హంతకుడు అతడే
క్షణ క్షణ బీభత్సాలు నా అలంకారం
ఎర్ర దీపాలే జీవన సామాగ్రి
జీవన సంగ్రామంలో క్షణం ఆలస్యంగా అడుగుపెట్టిన నేను
చెట్ల ఆకులలో బీభత్సం చూశాను
మనిషి ఆలోచనలపై చీకటి అంగరక్షకుల పాషాణ హస్తాలు చూశాను
నిషిద్ధాక్షరాల మధ్య నరబలి చూశాను
ఎర్రని గాయాలపై సూర్యకిరణాల చిత్రలిపి చూశాను

భయ విభ్రమాల మధ్య విషాద వాక్యం వలెసాగే జీవితంలో
మృత్యువు ఒక్కటే నిజం
హటాత్తుగా తలుపు తెరుచుకోవడం మృత్యువు
నడుస్తున్న రోడ్డు మధ్యలో మటుమాయం కావడం మృత్యువు
శిరస్సు తెగిన దీపస్తంభం మృత్యువు
నగర ప్రాకారాల మధ్య ఫ్యాక్టరీల జిహ్వాగ్రాల నుంచి వెలువడే నరవాసన మృత్యువు

మృత్యు గృహంలో నగ్నంగా నిలబడిన క్షతగాత్రుడిని నేనే
బాధ నా ముఖచిత్రం
బాదాగ్నిలో పునీతుడైన మనిషి పాదధూళిలో
మరణానంతరం నేను పాడే స్వేచ్చా గీతాన్ని రచిస్తాను
అప్పుడే నా అక్షరాలకు నిషా
అగ్ని వృక్షం క్రింద రేపు నేను మరో మనిషిని.

-అజంతా