డైరీ

యుద్ధానంతర దృశ్యం

నవంబర్ 2014

సీన్ 1

ఈ విస్ఫోటనంలో వాడిన పదార్థమేమి? శాంపిల్స్ ల్యాబ్ కి పంపండి.
శిధిలాల తొలగింపు, మరో వసంతకాలం రాక తప్పదు.

యస్! వాట్సన్, క్రిక్ యూ ఆర్ ఫెయిల్డ్. ఈ డిఎన్ఎ గుట్టు మీవల్ల కాదు. ఏమంటివేమంటివీ? అహో శశిరేఖా!

న్యూక్లియర్ ఫిజన్ బ్రెయిన్ లో
ఈల్డ్స్ రక్తాక్షరాలు
ఖామోషియా ఆవాజ్ అయినచోట
బ్రెయిన్ స్ట్రోక్ తప్పదు.
ఓహ్. వీడింకా బతికే ఉన్నాడు.
నర్స్ “ఇతనికో క్వార్టర్ వోడ్కా ఎక్కించండి”
బతుకుతాడు, క్విక్.
“యస్ డా…”

రొమానీ ఆంఖోంకీ…
“ఎవడో స్టేజ్ వెనకాల తాగి పాడుతున్నాడు. తరిమికొట్టండ్రా”
నడ్డి మీద తన్నినచో జిందగీ భర్ నహీ భూలేగీ.

ఆ తడి తడి దినమ్ములెపుడో డ్రై పెట్టుకుంటిని
తెరపడినది, ఇక లెమ్ము!
అన్ సీజన్ లో ఎక్స్ప్రెషన్ ఎందుకు?
పీ.ఎస్: అయినా మనిషి మారలేదు, ఆతనీ కాంక్ష…

సీన్2

లాట్ కెన్ హాపెన్ డియర్. ఓ సునామీ కావలించుకుంటుంది, ఓ వెన్నెల కాల్చేస్తుంది
గుల్ మొహర్ పూలదారుల్లో పాదముద్రలు.
వణికే చేతులకు లిప్ స్టిక్ మరకలు
చెప్పుకోటానికి చాలా ఉంటుంది, కిల్ మీ, హగ్ మీ, సేవ్ మీ.
వేలి చివరలకు వెచ్చటి లావా స్పర్శ,
గుండె పునాదులు తాకే తడిపెదిమలు,
చెప్పుకోటానికి చాలా ఉంటాయ్. పోనీ, రానీ గాయాల్, వ్యధల్, కన్నీటి సంద్రాల్.
నువ్వే కదా ఏదయినా, ఈజ్ బేబీ.
గతంలో బతికే శలభం ఇది. అనుకుంటాం కానీ, అంతా ఫ్రస్ట్రేషనేం కాదు. తోటకూర కట్ట కూడా కావచ్చు. నాన్సెన్స్ న్యూసెన్స్ కలిస్తే వచ్చే దురదా కావచ్చు.

కానీ, ఇప్పుడు శిధిలాల మధ్య కాలుపెట్టే సందే లేదు. వేర్ ఈజ్ ద వే? నో యూజ్. రాజ్యం లేదు, రాజూ లేడు. అంత:పురం ఒంటరితనంలో ఘనీభవిస్తోంది.
సూర్యాస్తమయమయినది, ఇక వెళ్లిరండు.

ఒకానొక రాత్రి

నాలోని శూన్యాన్ని నింపుకోటానికేనా ప్రయత్నం?
వెదకి వెదకి, పరిగెత్తి పరిగెత్తి, అలసి సొలసి ఆగెదెక్కడ ?
ఎంత శూన్యం? ఎంత చీకటి?
పరుచుకున్న ఖాళీలో బోలుతనపు ఛాయల మధ్య-

నేను మాయమై, నేను నీవై, రెండూ ఒక్కటై, చిట్లిన ఆలోచనలా, శతకోటి పదాల భావాల లావాలా, విస్ఫోటించిన నిశ్శబ్దంలా
చాలు.

ఇక చాలు, బస్ హోగయా.

డీహైడ్రేషన్, సఫొకేషన్ ఒకేసారి ముంచెత్తి నీరసంగా, నిస్సత్తువగా,
లాభంలేదు. మెదడుని నిలిపేసి, రాక్షసుణ్ని నిద్రలేపి, నన్ను చంపేసి, నీ పీక పిసికేసి. నిన్ను నాలో కలుపుకుని నీవు నేను లేని మరో సరికొత్త అనురాగ రసరాగ…
ఈ ఒక్కరాత్రి ఉండవూ, నాతో!
“ఊ! ఉండగలనా?”
అప్పుడే టైమ్ అయిపోయిందా?
“ఈ కాలం ఘనీభవిస్తే?”
పోనివ్వను, నిన్ను వదలను.

-

ఉలిక్కిపడి లేచాను. రాత్రి 2గంటలు. తొందరగా తాగితే ఇదే బాధ, అప్పుడే దిగిపోయింది. తల నొప్పిగా ఉంది. మోచేతికేదో గీసుకున్నట్టుంది. ఎక్కడో ఎప్పుడో గుండెకు కూడా!