సంపాదకీయం

ఒక సామాన్యుడి అసాధారణ విజయం

మే 2013

ఆకుపచ్చని కాశ్మీరపు తివాచీ మీద మంజరి శరీరం వెల్లికిలా పడి ఉంది. పడక గదిలోకి ఉన్న కిటికీ పూర్తిగా తెరిచివుంది. టెలిఫోను కిందపడి ముక్కలయిపోయింది… అల్లంత దూరంలో పసుపుపచ్చని మందుబిళ్ళలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

మంజరి మరణానికి కారణమేమిటని కాదు నా ప్రశ్న. అసలిలాంటి అమానుషమైన ముగింపు జరగటం నాకిష్టం లేదు. తన సౌందర్య తీవ్రతతో దేశదేశాలను తపింపచేసిన మంజరి శరీరం, నిర్జీవంగా కాశ్మీరపు తివాచీ మీద పడి ఉండటంలో ఏదో అపశృతి ఉన్నదనిపించింది నాకు. ఆమె సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలు, సిరిసంపదలు ఆమె నీ కొసకు తరుముకొచ్చాయనిపించింది.

అనన్యమైన ప్రతిభా సంపదలున్న వ్యక్తి మీద జీవితం ఏదో రూపంలో కసి తీర్చుకొంటుందంటారు.

మంజరి విషయంలోనూ అదే జరిగింది!

పావు గంటకల్లా పోలీసులొచ్చారు.
కొలతలూ, ఫోటోలూ తీసుకోవడం అయ్యాక -

‘‘ఈమె స్వగ్రామమేదో , తల్లిదండ్రుల పేరేమిటో చెప్పండి!’’ అన్నాడు పోలీసాఫీసరు.

ఎవరూ కిమ్మనలేదు.

సువిశాలమైన ఆ చలువరాతి మందిరంలో శబ్దం కూడా శిలా రూపం దాల్చింది!
_________________

పాకుడు రాళ్ళు నవల పతాక సన్నివేశం ఇది. ఇది చదువుతుంటే గుండె అవిసి పోతుంది. మనసంతా చేదుగా అయిపోతుంది. పాఠకుడు కూడా శిలా రూపం దాల్చి కాసేపు మౌనంగా కూచోవాల్సిందే…

మంజరికి సంతాపంగా కాదు,

మనసు వేదనకు మాటలు లేక!

86 సంవత్సరాల వయసులో జ్ఞానపీఠం పొందిన రావూరి భరద్వాజ ప్రతిభను ఏ అవార్డులూ కొలవలేవు నిజానికి. అవార్డులు ప్రతిభకు కొలమానాలుగా చలామణీ అవుతున్నాయి కాబట్టి…., ఆ దృష్ట్యా మాత్రమే ఆయనకు అభినందనలు తెల్పాలి తప్ప “ఎప్పటికో ఒకప్పటికి అవార్డు వచ్చినందుకు” మాత్రం కాదు.

భరద్వాజ గారి పేరు వినగానే ఎవరికైనా గుర్తొచ్చేది పాకుడు రాళ్ళు నవలే. దీనికి మొదటి మాయ జలతారు అని పేరు పెట్టారట.(ఆ పేరుతో దాశరధి గారొక నవల రాశారు) .తళుకు బెళుకుల సినీ ప్రపంచపు చీకటి కోణాలని బట్ట బయలు చేసిన అత్యంత సంచలనాత్మక నవల ఇది. 1965 లో రాసిన ఈ నవల “పాల పుంత” అనే పెద్ద కథ గా మొదలై, నిడివి పెరిగి నవలగా రూపాంతరం చెందింది . ఆ తర్వాత వచ్చిన ఎన్నార్ నంది “సినీ జనారణ్యం” వంటి నవలకు, సినీ ప్రపంచం మీద వచ్చిన ఇతర రచనలకు ఇదే మార్గదర్శిగా చెప్పుకోవచ్చు.

విషాదంగా ముగిసిన ఏ కథానాయిక జీవితాన్ని తరచి చూసినా మంజరి కనిపించక మానదు.

కొంతకాలం జీవనోపాధి కోసం వృత్తి ధర్మంగా శృంగార కథలు రాసిన భరద్వాజ ఆ వొరవడిలోనే ఉండి పోక ఉత్తమ స్థాయి సాహిత్యాన్ని సృష్టించారు.

37 కథా సంపుటాలు,17 నవలలు, ఆరు పిల్లల మినీ నవలలు 5 పిల్లల కథా సంపుటాలు,3 వ్యాసాలు ఆత్మ కథా సంపుటాలు, 8 నాటికలు, 5 రేడియో కథానికలు….

ఇవన్నీ కడుపులో చల్ల కదలకుండా కూచుని రాసినవి కాదు. ఒక్కోసారి తిండికి, గుడ్డకు కూడా కరువైన పరిస్థితి లో రాసినవి.

యదార్థ గాధలని సంకలనం చేసిన రచన “జీవన సమరం”. ఇందులో చెప్పుకు కుట్టే వాడు,చిలక జోస్యం చెప్పేవాడు,కత్తులు నూరే వాడు ఇలా సామాన్యులు, కష్ట జీవులంతా మనకు పరిచయం అవుతారు.

వాటిలోని ఒక గాథలోని కొంత భాగం..

‘‘ఆమెకు పెళ్ళయింది. వెంకురెడ్డి మొజాంజాహి మార్కెట్‌ దగ్గరున్న పళ్ళ కమీషన్‌ కొట్లల్లో పనిచేసేవాడు. లారీల్లో వచ్చిన సరుకును దింపడం, లెక్క సరిగ్గా వుండేట్లు చూసుకోవడం- ఇత్యాది పనులన్నీ వెంకురెడ్డి చేస్తూ వుండేవాడు. ఏడెనిమిదేళ్ళపాటు సంసారం బాగానే జరిగింది. ఒకసారి తాగివున్న లారీ డ్రైవరు బండిని అడ్డగోలుగా తిప్పడంతో వెంకురెడ్డి లారీకింద పడి నజ్జునజ్జయిపోయాడు. సర్కారు దవాఖానకు తీసుకుపోతున్న సమయంలోనే అతను శాశ్వతంగా కళ్ళుమూశాడు.

”అప్పటికే నాకు ముగ్గురు కొడుకులున్నారయ్యా. భగవంతుడు నా తాడు తీసుకుపోయాడు. తోడబుట్టినవాళ్ళదీ అంతంత మాత్రమేనాయె. ఏం చెయ్యను బిడ్డా! సద్దామనుకొన్నా, కానీ పసిబిడ్డల్ని వొదిలి సావలేకపొయ్యా” అని భోరుమన్నది అంజమ్మ.’’ –ఇందులోని గాథలన్నీ దాదాపుగా ఇలాగే మనసుని కలచి వేసేలా ఉంటాయి.

కూటికీ గుడ్డకూ కూడా ఎన్నో కష్టాలు పడిన భరద్వాజ కష్ట జీవులని ఇంత సామీప్యం గా చూసి పాఠకులకు పరిచయం చేయడంలో ఆశ్చర్య పడవలసిందేమీ లేదు.

రావూరి ని మాక్సిం గోర్కీతో పోల్చడం చూస్తున్నాం ఈ మధ్య! అయితే రచనా శైలి విషయంలో పోలిక ఎలా ఉన్నా..జీవన విధానంలో కూడా ఇద్దరికీ పోలికలుండటం విశేషమే!

గోర్కీ 12 ఏళ్ళలోపే చెప్పులు కుట్టే షాపులో, తాపీ పని, ఓడలో వంట కుర్రాడుగా పనిచేశాడు. తర్వాత రొట్టెల దుకాణంలో, నాటక కంపెనీలో పనిచేశాడు. వీధుల్లో తిరిగి పండ్లమ్మాడు. ప్లీడరు గుమాస్తాగా, రైల్వే కర్మాగారంలో కూలీగా బతుకుపోరాటం చేశాడు.

భరద్వాజ కూడా బతుకుదెరువు కోసం గొర్రెల కాపరిగా, పేపర్ బాయ్ గా, కంపోజర్ గా, ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్ మన్ గా, జర్నలిస్టుగా, రేడియో రచయితగా వివిధ వృత్తులను చేపట్టారు.

రచనల్లో జీవనోపాధిని వెతుక్కున్నారు. తనకు గాఢంగా తెలిసిన పేద, దిగువ మధ్యతరగతి జీవితాలను సహజ రచనా ప్రతిభతో అక్షరబద్ధం చేశారు.

తన గురించి భరద్వాజ ఇలా చెప్పుకున్నారు
“నేను సామాన్యుడిని. ఇంకా చెప్పాలంటే అంతకంటే తక్కువవాణ్ణే” –నిజమే…అసాధారణ వ్యక్తులు ఇంతకంటే ఏమి చెప్పుకుంటారని మనం మాత్రం అనుకోగలం?