తలపోత

లవ్ యూ రా టింకూ

10-మే-2013

మనిషికీ కుక్కకూ మధ్య బంధం ఎప్పటి నుంచీ ఏర్పడిందో తెలీదు కానీ.. అవి మనిషికి మంచి మిత్రులవ్వ గలవు. ఇది మనలో ప్రతి ఒక్కరికీ యేదో ఒక స్థాయిలో ఎదురయ్యే నిజం. చిన్నప్పటి రోజులు తరువాతి జీవితపు ఘటనలు కూడా నాకు ఇంట్లోని పెంపుడు కుక్కల ఆశ్చర్య కరమైన అద్భుత ఆత్మీయతకు సాక్షులుగా నిలిచిన జ్ఞాపకాల పేజీలనిచ్చాయి.

టింకూ.. ఇప్పటి తాజ్ కృష్ణ కట్టే సమయంలో.. నాన్నగారికి అనుకోకుండా ఆ సైట్ దగ్గర పరిచయమయ్యింది. తెల్లని బొచ్చు మీద నల్లని మచ్చలు, చురుకైన కళ్ళూ, వయ్యఆరంగా కదిలే నడుమూ, కాంఫిడెంట్గా వూపే తోక.. నాన్నగారికి ఇట్టే నచ్చేసింది. నాన్నగారు సైట్ ఇన్ చార్జి గా పటాన్ చెరులో నొవపాన్ కంపెనీ లోని క్వార్టర్స్ నుంచీ రోజూ బంజారాహిల్స్ లోని ఈ కన్స్ట్రక్షన్ సైట్ కి రోజూ ప్రయాణం.

తన బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్ తో పాటు, టింకు వంతు ఇంకొ బాక్స్ పెట్టించుకుని వెళ్ళే వారు. స్పెషల్ గా omlet కూడా. అలా ఒక నెల మచ్చికయిన తర్వాత, టింకూ గృహ ప్రవేశం చేసింది. అలా ఇంట్లో అందరికీ అదొక స్పెషల్ అట్రాక్షన్. నాన్న గారికి — వాకింగ్ కి అయినా, రాత్రి పూట ఫాక్టరీ రౌండ్స్ కి వెళ్ళీనా (అక్కడ ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తను) టింకూనే తోడు, ఇక ఇంట్లో.. నాన్నగారికి ఎదురుగానే దాని తిండీ, పడక.

ఒక సారి అదే కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఒక బక్కచిక్కిన పిల్లి పిల్లని తీసుకొచ్చారు. అది ఎంత చిన్నదంటె, ప్లేట్ లో పాలు పోసి ఎదురుగా పెట్టినా తాగలని కూడా తెలియనంత చిన్నది. పెరుగు ముక్కలు చేసి, మాష్ చెసి పెడితే తినేది. ఇక్కడ సమస్య యేమిటంటే, కుక్కలకూ పిల్లులకూ జాతి వైరం. రెండూ ఒకటే చోట వుండవు. కానీ తప్పదు. అప్పటికే టింకూకి తంకొక కాంపిటీటర్ వచ్చిందని అర్థం అయ్యింది. కుక్కలూ, పిల్లులూ ఒకటే చోట వుండవండీ అని అమ్మ అన్నా, టింకూ యేం చేస్తుంది దాని మొఖం అనేసి ఫాక్టరీకి వెళ్ళిపోయారు నాన్నగారు.

పిల్లి మెడకొక దారం కట్టి బెడ్రూం లో మంచానికి కట్టి యేం చేయాలో అని ఆలోచిస్తున్నాం. టింకూ గుర్రు మంటోంది. పిల్లి పిల్ల బిక్కచచ్చిపోతోంది. ఫైనల్ గా టింకూని గట్టిగా పట్టుకుని, మరోచేత్తో పిల్లిపిల్లని పట్టుకుని, టింకూ, ఇది చిన్న పిల్లరా, దాన్ని యేం చేయ్యకు, అది నీతోటి ఆడుకుంటుంది, ఇది నీకు ఫ్రెండ్ అని నాకు తోచినట్టు చెప్తూనే వున్నా. పిల్లి పిల్లతలని దాని ముక్కు దగ్గర పెట్టాను. పిల్లి పిల్లేమో ఇక నా చావు ఖాయం అనంట్టు, కళ్ళూ తేలేసింది. టింకూ నా వంక అనుమానం గా చూసినా, పిల్లి తలని ఒక సారి గట్టిగా వాసన చూసింది — సరే ఇంట్లో కి అది రావడానికి ఒప్పుకుంటున్నా అన్నట్టు

ఇక పిల్లి పిల్ల తేరు కోవడానికి ఒక వారం రోజులు పట్టింది. తర్వాత నుండీ చూడాలి — ఆ రెండిటి ఆటలూ, గెంతులూ, సరదా పోట్లాటలు. చూడ ముచ్చటగా వుండేది. ఒక సారి టింకూ, ఫాక్టరీ గేట్ దాటి బైటకు వెళ్ళి తప్పి పోయింది. మూడు రోజుల తర్వాత ఎవరో తెలియని వాళ్ళూ దాన్ని మళ్ళీ వాపస్ తెచ్చారు. ఆ మూడు రోజులూ అక్కడ పచ్చి నీళ్ళైనా ముట్టలేదట. ఇక దాని చుట్టూ తిరిగి, గెంతులేస్తూ పిల్లి పిల్ల ఆనందం చూడాలి. ఆ తర్వాత ఆరునెల్లకి పెద్దదైన పిల్లి పిల్ల ఎటో వెళ్ళి పోయింది. కొన్నాళ్ళు టింకూ దిగులుగా అటూ ఇటూ చూసేది కానీ, మెల్ల గా దాన్ని మరిచి పోయింది.

టింకూకీ నాన్నగారికీ మధ్య వున్న అనుబంధానికి హైలైట్ అనే సంఘటన నాన్న గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం నెల రోజుల పాటు నింస్ లో వున్నప్పుడు జరిగింది. నాన్నగారు హాస్పటల్ కి వెళ్ళిన దగ్గర నుండీ దాని నివాసం బాత్రూం లో. కాళ్ళు ముందుకు చాపి, తల కాళ్ళకు ఆంచుకుని దీర్ఘాలోచనలో వున్నట్టుండేది. నాన్న గారి మంచం కేసి చూస్తూ కూర్చునేది. ప్రతి రోజూ సాయంత్రం కారేజీ తీసుకెళ్ళడానికి హాస్పిటల్ నుంచి సెక్యూరిటీ గార్డ్ వచ్చే వాడు. యే రోజు కారోజు హాస్పిటల్ లో డాక్టర్లు యేమన్నదీ చెప్పి, క్యారేజి తీసుకెళ్ళే వాడు. అతను వచ్చినపుడు బాత్రూం లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, మాతో పటూ వింటున్నట్టు చెవులు రిక్కించుకుని విని, అతను వెళ్ళి పోగానే, మళ్ళీ బాత్రూం లోకి వెళ్ళీ పోయేది.

నాన్నగారికి ఉదయం సర్జరీ చేస్తారని డిసైడయ్యింది. ఆరోజు, ఎవరో చెప్పినట్టు, కళ్ళెమ్మట నీళ్ళూ పెట్టుకుని మా వంక దీనం గా చూస్తూ కూర్చుంది. నాన్నగారికి సర్జరీ పూర్తయ్యింది, ఐసీయూ కి షిఫ్ట్ చేశాఋఅని సాయంత్రం గార్డ్ వచ్చి చెప్పినది విన్నాక, పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడు అన్నం తిన్నది. గటగటా మంచి నీళ్ళూ తాగింది.

ఒక పెంపుడు కుక్కలా కాదు, ఒక మనిషిలా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ప్రవర్తించేంత తెలివి అసలా జంతువుకి ఎలా వచ్చిందన్నదీ ఎంత ఆలోచించినా తర్కానికైతే నాకెప్పుడూ అందలేదు. అది నాన్నగారి ప్రియ నేస్తం. ఎలకల్తో చెలగాట మాడి, వాటిని చంపి బైట భద్రంగా పారేసి వచ్చే మా హోంలీ గార్డ్. యేనాడూ పొరపాటున కూడా యే గిన్నెలోనూ మూతి పెట్టి ఎంగిలి చెయ్యని మర్యాదస్తుడు. టింకూ ఒక సజీవ జ్ఞాపకం నాకు. పధ్నాలుగేళ్ళు పూర్తి చేసుకుని హాప్పీ గా వెళ్ళీ పోయాడు. లవ్ యూ రా టింకూ. ఎక్కడో పొరపాటున మనిషిగా పుట్టేవేమో మరి..