“ఇంకా ఎంత దూరం నాయనా?” ఈ డైలాగ్ వినగానే గుండె లోతుల్లోంచి దుఃఖం ఫెటిల్లున పగిలిన శబ్దం కంటి చివరి నుంచి వరదై చెంప మీదకు జారక పోతే అది దేవదాసు సినిమానే కాదు, వాడు నాగ్గాడే కాదు. తన మరణం తనకు సమీపంలో దర్శనమిస్తున్న ఆ చివరి క్షణాల్లో దేవదా పార్వతిని ఒక్క సారి, ఒకే ఒక్క సారి చూడాలని తపించే క్షణాలు దేవదాసు తో మమేకమై పార్వతి కోసం ఏడవని ప్రేక్షకుడెవరు తెలుగు నాట?
ఒక మహా దృశ్య కావ్యం అంటే ఇదేనా? ఎప్పటికీ చెరిగి పోని ముద్రను గాఢంగా మనో ఫలకంపై చిత్రించేదేనా?
దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళు అయిన సందర్భంగా అనేక వ్యాసాలు గురించి సినిమా పత్రికల్లో వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అప్పటి ఆ సినిమా విశేషాలతో ఆసక్తి చాలా ఆసక్తి కరంగా ఉండి, మరో సారి సినిమా చూడాలన్న కోరికను రేకెత్తించాయి. నేనుఅంతటితో ఆగక అవి చదువుతూ ఉన్న నేపథ్యంలో చక్రపాణి అనువదించిన “దేవదాసు” నవల ఇంకో సారి తీసి చదివాను. ఎంతో ఇష్టంగా !
శరత్ నవలల కు నాకు చక్ర పాణి అనువాదాలు ఎంతో ఇష్టం . బి . శివ రామ కృష్ణ గారి అనువాదాల్లో నాకు భాషో భావమో మొత్తానికి ఏదో నచ్చలేదు. చక్రపాణివి సంక్షిప్త అనువాదాలైనా సూటీగా మనసుకు ఎక్కేలా ఉంటాయి. ఇటీవల మార్కెట్లో దొరుకుతోన్న వారి అనువాదాలు దొరికితే చదవమని రికమండ్ చేస్తాను. జ్ఞానద, బిందు గారబ్బాయి, పల్లీయులు, రాముని బుద్ధి మంత తనం ఇవన్నీ కూడా పాఠకుల్ని తెలుగు రైల్లో ఎక్కించి కలకత్తా తీసుకు పోతాయి. అసలు దేవదాసుని పక్కా తెలుగు వాళ్లలో కలిపేసింది చక్రపాణే.
సినిమాలో అయినా, నవల్లో అయినా అందరి మనసుల్లోనూ చివరిగా నిలిచి పోయి అభిమానాన్ని సంపాదించుకునే పాత్ర “చంద్ర ముఖి”! నవల్లో చక్రపాణి చేతిలో తెలుగు పాఠకులకు పరిచయమయ్యే చంద్ర ముఖి బయటికి చెప్పలేని మూగ బాధని పాఠకుల్లో కూడా సృష్టించి కానీ మాయమవదు. చంద్ర ముఖి దేవదాసు కోసం తాను పడే బాధను, తపనను మనలో కూడా నర నరానా నింపి కానీ వదలదు . నవల చదివాక చంద్ర ముఖికి ఫాన్ గా మారని వారెవరూ ఉండరేమో
ఆ నవలని ఆంద్ర జ్యోతి లో సీరియల్ గా ప్రచురించారట . ఈ నవలకు వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలు బంగారానికి అద్దిన తావి లాంటివి.
నవల లో దేవదాసు పారుల మధ్య చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహమే కనిపిస్తుంది. (అక్కినేని కూడా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యు లో ఇటీవల చెప్పారు ) ప్రేయసి కోసం ప్రాణాలొదిలిన అమర ప్రేమికుడి గా , ఖ్యాతికెక్కిన దేవదాసుకి నవలలో పార్వతి మీద ఆ స్థాయి ప్రేమ ఉన్నట్లు ఎక్కడా కనిపించదు సరికదా, పార్వతి పెళ్ళి అని తెల్సినా దేవదాసు పెద్దగా స్పందించడు, “ఎప్పుడట?” అని మాత్రమే అడుగుతాడు.
దేవదాసు పట్నం వెళ్లాక చదువు , ఇతర వ్యాపకాల్లో పడి పార్వతిని చాలా వరకు వదిలి వేశాడని రచయితే చెప్తాడు.
పార్వతి తన ప్రేమను ప్రకటించి “నీ పాదాల వద్ద చోటు ఇవ్వు దేవదా” అని అడిగాక కూడా దేవదాసు “నేను తప్ప నీకు గత్యంతరం లేదా పారూ” అనడుగుతాడు.
పాదాల వద్ద చోటు కోరడమంటే ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోడం కాదు, ఆత్మను స్వచ్ఛంగా సమర్పించుకోవడమే కదా! “ఇద్దరు ఒకటే” అన్న భావన వస్తే కానీ అంత మాట నోటి వెంట రాదు.
“మా అమ్మకి, నాన్నకి బొత్తిగా ఇష్టం లేదు. వాళ్ళకి ఎదురు తిరగమంటావా?” అని కూడా అడుగుతాడు.
పట్నం వెళ్ళాక పార్వతికి రాసిన ఉత్తరం లో ” మీది కులీన కుటుంబం కాదు, పిల్లల్ని అమ్ముకునే ఇంటి పిల్లవు నువ్వు. మా అమ్మ నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. అసలు ఇంకో సంగతి! నిన్ను ప్రేమిస్తున్నట్లు నాకెప్పుడూ తోచలేదు. ఇవాళ కూడా నీ కోసం నా అంతరంగం ఎక్కువ తపించడం లేదు. ప్రయత్నించి మర్చిపో” అని రాస్తాడు.
నిజానికి ప్రేమ అంతా పార్వతి దే!
“నీ భర్త వయసెంతే” అని మనోరమ అడిగితే జమీందారు తో పెళ్లి కుదిరాక కూడా “పందొమ్మిది ఉంటాయి” అని నిర్భయంగా దేవదాసు వయసు చెప్తుంది. “మీరు కాళ్లకు పసుపూ నొసట కుంకుమా వృధాగా పెట్టుకుంటున్నారు. ఎవరిని భర్త అనాలో కూడా తెలీదు. అతడు నా భర్త కాక పోతేను, నా లజ్జా సంకోచాలకు అతీతుడు కాకపోతేను నేనిలా అతని కోసం చావడానికి కూచోను. చావడానికి సిద్ధంగా ఉన్న మనిషి విషయం తియ్యగా ఉంటుందా, చేదుగా ఉంటుందా అని ఎప్పుడూ ఆలోచించడు. అతని వద్ద నాకు రవ్వంత సిగ్గు కూడా లేదు” అని చెప్తుంది .
పార్వతి వ్యక్తిత్వం నవల్లో మొదటి నుంచి బలంగా కనిపిస్తుంది. అతడు ఉత్తరం రాశాక పార్వతి కఠినమై, మనసుని పూర్తిగా రాయి చేసుకుని ప్రవర్తిస్తుంది.అతడు మళ్ళీ వచ్చి “మా అమ్మా నాన్నల్ని ఒప్పిస్తాను,” అన్నపుడు “నీకేనా తల్లి దండ్రులున్నది? నాకు లేరా? వారి ఇష్టా యిష్టాలతో పని లేదా” అని ఆత్మ గౌరవంతో ప్రశ్నిస్తుంది
“నీకు రూపమే ఉంది కానీ గుణం లేదు. నాకు రూపమూ గుణమూ రెండూ ఉన్నాయి” పొమ్మంటుంది.
పెళ్ళి అయిన తర్వాత కూడా పార్వతి జీవితం మీద ఎలాటి ఆసక్తి లేకుండానే జీవిస్తుంది.
ఆ తర్వాత పార్వతి మీద ప్రేమ ఉన్నట్లు తన మనసు తానే గ్రహించలేని మూర్ఖ శిఖామణి పడే వేదన వర్ణనాతీతం. అతని మనోభావాలేవీ రచయిత వర్ణించడు. వరసగా జరుగుతున్న సంఘటనల ద్వారా మాత్రమే పాఠకుడికి అవి అవగతమవుతాయి. ఒక సంఘటన వెనుక ఒకటి అతని బాధను, వేదన తో కునారిల్లి పోవడాన్ని, ఆరోగ్యం దిగజారి పోవడాన్ని కొద్ది కొద్దిగా చిత్రిస్తూ సాగుతాయి . ఈ వరస క్రమమే చక్కని స్క్రీన్ ప్లే గా అమరి పోతుందేమో అనిపిస్తుంది.
దేవదాసు వంటి వ్యక్తీ మీద ప్రేమ పెంచుకున్న చంద్ర ముఖి అద్భుతమైన పాత్ర ! దేవదాసు ని ఎంతగా గౌరవిస్తుందంటే , అతడిని బలవంతాన తీసుకు వెళ్లి చికిత్స చేసి కాపాడుకునే అవకాశం ఉన్నా అతడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అడ్డు చెప్పదు. అతడి కోసం వేదన పడటం , వెదుక్కోవడం మాత్రం మానదు . అందుకోసం ఆస్తులూ అమ్ముతుంది , తిరిగి వృత్తి వాతావరణం లొకీ ప్రవేశిస్తుంది .
దేవదాసు నవల ఎన్నో భాషల్లోకి అనువాదమై అన్ని భాషల్లోనూ పాఠకుల్లో చర్చ జరగడానికి అభిమానులు ఏర్పడ్డానికి వివిధ భాషల్లో వచ్చిన సినిమా కూడా కావొచ్చునేమో!
కొన్ని పుస్తకాల్లో దేవదాసు ప్రేమ గురించి ఆ పుస్తకాల్లోని పాత్రలు కూడా చర్చించాయి. రంగ నాయకమ్మ గారి “ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది” కథలో సుధ,చంద్ర శేఖర్ ల మధ్య కొంత సంభాషణ నడుస్తుంది. ఈ సంభాషణ నడుస్తూ ఉంటే మనకి కూడా అందులో పాల్గొనాలనిపించేలా ఉంటుంది సరదాగానూ, సీరియస్ గానూ!
రంగనాయకమ్మ గారి ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది! … కథ నుంచి..
ఇది ఇద్దరి మధ్య సంభాషణ
సుధ- ‘‘అసలు … దేవదాసుకీ పార్వతికీ పెళ్ళయితే , వాళ్ళ జీవితం ఎలా వుండేదంటారు?’’
చంద్రశేఖర్ తెల్లబోయాడు- ‘‘ఇప్పుడు దేవదాసు గుర్తొచ్చాడా?’’
‘‘ఎప్పుడూ గుర్తొస్తాడు… నేనడిగింది చెప్పండి!’’
‘‘దేవదాసుకీ పార్వతికీ పెళ్ళా? అసలెలా అవుతుంది?’’
‘‘ఎలాగో అయిందనుకోండీ!… దేవదాసే పెద్దవాళ్ళని ధిక్కరించాడనుకోండీ.’’
‘‘అలా అయితే ఇంకేం? చాలా బాగుంటుంది’’
‘‘బాగుంటుందా? అలాక్కాదు. సరిగ్గా ఆలోచించి చెప్పండి.’’
అతను నవ్వాడు -‘‘ఏమీ బాగుండదంటే సరిగ్గా ఆలోచించినట్టా?’’
సుధ కూడా నవ్వింది- ‘‘మీరసలు కాస్సేపు ఆలోచించి తర్వాత చెప్పండి’’ అని మొరాయించింది.
‘‘కొత్తగా ఆలోచించటాని కేముంది? పెళ్ళయితే సుఖంగానే వుండేవాళ్ళు. వాళ్ళ ప్రేమ మీద నాకేం సందేహం లేదు’’.
సుధ వెటకారంగా చూసింది- ‘‘అంత గొప్ప ప్రేమయితే మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది పార్వతి చేతిలో లేదనుకోండీ. దేవదాసు చేతిలో ఉందిగా?’’
‘‘దేవదాసు చేతిలో వుండడం నిజమే గానీ, ఆ సంగతి దేవదాసుకే తెలీదండీ! ‘పెద్దవాళ్ళు వొప్పుకోకపోతే ఇంకేం చెయ్యగలం?’ అనుకున్నాడు మొదట. అతనికి తెగింపు వచ్చేటప్పటికి , అతని చెయ్యి దాటిపోయింది. అతని చేతిలో మాత్రం ఏం వుంది? మొదట్లో అతను అమాయకంగా వున్నాడు కాబట్టి, అతని ప్రేమని శంకిస్తారా? ఆ ప్రేమ ఎంత నిజమో తర్వాత జీవితంలో రుజవైంది కదా? ఇంకో స్త్రీని కన్నెత్తి చూడలేదు.’’
‘‘……………………………..’’
‘ప్రేమకి సార్థకత కలిసి జీవించటమే అనుకోండీ. కాదనను. కానీ అది అసంభవమైతే మనసుల్లో ప్రేమ అంతా అబద్ధమేనా? దేవదాసూ పార్వతీ విడిపోయారని నాకెప్పుడూ అనిపించలేదు’’ అని ఇక దానికి తిరుగులేదు అన్నట్టు వూరుకున్నాడు.
సుధ తెగ ఆశ్చర్యపడి పోయింది- ‘‘వాళ్ళిద్దరూ విడిపోనే లేదూ? కలిసే ఉన్నారా? ఎక్కడా? అంతరాత్మల్లోనా? ఆహా! ఏం వేదాంతం మాట్లాడుతున్నారండీ ! దేవదాసూ పార్వతీ ‘ఇద్దరం కలిసే వున్నాం’ అనుకుంటూ సుఖంగా వుండలేకపోయారేం?’’
‘‘మీ లెక్చెరర్ ని వొదిలేసి ఇందులో పడ్డారేం?’’ అని నవ్వాడతను.
‘‘మీరలా తప్పించుకోకండి మరి. ఈ ప్రేమ వ్యవహారాల్లో నాకు చాలా సందేహాలున్నాయి. దేవదాసు ప్రేమ మీద నేనో వ్యాసం కూడా రాశాను.’’
‘‘ఏం రాశారు?’’ నవ్వుతూనే అడిగాడు.
‘‘మీకేవిటో హేళనగా వుంది నా రీసెర్చి మీద. మీరు నా సందేహాలన్నీ తీర్చేస్తే నా అభిప్రాయాలు మార్చుకుంటానుగా?’’ అని మళ్ళీ వాదంలోకి దిగింది. ‘‘అసలు పార్వతి అంత సాహసంగా అర్థరాత్రి వొచ్చి అడక్కపోతే దేవదాసుకి ప్రేమా గీమా ఏం లేదు. ఇంకా చదువుకునేవాడు. జమీందార్ల పిల్లని పెళ్ళి చేసుకునేవాడు. అంతే.’’
‘‘నేనలా అనుకోను. మీరు దేవదాసు మీద కోపంతో ఉన్నారు. అందుకే అలా ఆలోచిస్తున్నారు. పార్వతి వొచ్చి అడక్కపోయినా , పార్వతికి పెళ్ళయి వెళ్ళిపోయిం తర్వాత దేవదాసు చాలా బాధపడేవాడు. ఆమెతో అతనికి ఆ రకం స్నేహం వుంది, ఆత్మీయత వుంది. ఇష్టం వుంది.’’
‘‘ఎన్నివున్నా అదంతా ప్రేమ కాదు. చాలా తొందరగానే మర్చిపోయేవాడు.’’
‘‘సరే, అలాగే అనుకోండి. పోనీ పార్వతి అడిగింతర్వాతే అతనికి ప్రేమ తెలిసిందనుకోండి. పార్వతే అతని మనసులోకి ప్రేమ ఊహ తెచ్చింది. నిజమే. అతని ప్రేమ ఎప్పుడు ప్రారంభమైతేనేం? ఎలా ప్రారంభమైతేనేం? – ప్రేమని ఎవరో ఒకరే ముందు బయటపెడతారు. రెండోవారు తర్వాత దాన్ని గురించి ఆలోచిస్తారు. అడిగిన వ్యక్తికే ప్రేమ వుందనీ, రెండో వ్యక్తికి లేదనీ అనుకుంటామా? ఇద్దరూ ఒకేసారి అడుగుతారా? ఎవరో ఒకరు ముందు అడుగుతారు’’.
…….
చంద్రశేఖర్- ‘‘భూమి మీద వున్న పదార్థాలన్నీ భూమ్యాకర్షణకి అంటుకుపోయి వున్నట్టు, మనుషుల ప్రవర్తనలు సంఘ ప్రభావాలకు లోబడిపోయి వుంటాయి. ఆ గాడిలో పడి బతికే కోట్ల మంది సామాన్యుల్లో దేవదాసు ఒకడు. వాళ్ళ కుటుంబానికి డబ్బు వుంటే వుండొచ్చు. అతని మనసుకి ప్రేమ తెలిసింది గానీ, అది ఫలించేలాగ చేసుకోవడానికేం చెయ్యాలో, ఎవరికి ఎదురుతిరగాలో, అతనికి సరైన సమయంలో తెలీలేదు. దాని ఫలితం అతనే అనుభవించాడు కదా? అసలు, రచయిత అదే చెప్పదల్చుకున్నాడు. పెద్దవాళ్ళు, ఆస్తుల రంధి తోటీ, సాంప్రదాయాల రంధితోటీ, పిల్లల జీవితాల్ని ధ్వంసం చేసేస్తారని చెప్పాడు, కథలో!.. ’’
సుధ వింటూనే వుంది.
చంద్రశేఖర్ ఉత్సాహంగా సాగించాడు- ‘‘నాకర్థమైనంతవరకూ , రచయితలు రెండు రకాలుగా రాస్తారు. కొందరు – మనుషులెలా జీవించాలో చెప్తారు. కొందరు- ఎలా జీవించకూడదో చెప్తారు. శరత్ రాసిందంతా రెండో రకంలోనే. ‘దేవదాసు’ చదివి పూర్తిచేసింతర్వాత మన మనసులు చాలా భారంగా అయిపోవూ? ‘వాళ్ళిద్దరికీ పెళ్ళయితే ఎంత బాగుండేది! పోనీ, ఎక్కడికైనా పోయి సుఖంగా బతికినా బాగుండేది’ అనిపించదూ? ఒక్క క్షణం అలా అనిపించిందంటే , రచయిత మనకి చాలా నేర్పాడన్నమాట. ’’
నవల చివరి భాగం మొత్తం సినిమా లాగే వేదనా భరితంగా ఉంటుంది . చదువుతున్న కొద్దీ ఊరే బాధ … వేదన !
నవల చివర్లో రచయిత ఇలా అంటాడు ..(ఇది సినిమాలో కూడా ఉంటుంది, మొత్తం కాకపోయినా)
“ఇప్పుడు, ఇంతకాలమైనాక పార్వతి ఏమైందో ఎలా ఉందొ నాకు తెలియదు . తెలుసుకోవాలనే కోరిక కూడా లేదు . దేవదాసు గురించే నాకు చాలా దుఃఖంగా ఉంటుంది . ఈ కథ చదివితే మీకు కూడా నా మాదిరేగానే దుఖం కలగవచ్చు. అయినా దేవదాసు వంటి దౌర్భాగ్యులతో, నిగ్రహం లేని వారితో , పాపిష్టులతో ఎప్పుడైనా మీకు పరిచయం కలిగితే వాళ్ళ కోసం మీరు కొంచెం ప్రార్థించండి . కనీసం అతని వంటి చావు మాత్రం ఎవ్వరికి రాకూడదని కోరండి . మరణం వాళ్ళ నష్టమేమి లేదు కాని ఆ సమయంలో ప్రేమ పూరితమైన కర స్పర్శ లలాటానికి సోకాలి . ఆఖరికి ఒకటైనా కరుణా పూరితమైన ముఖం చూస్తూ ఈ జీవితం అంతం కావాలి . చివరికి ఒక కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలటం చూసి ప్రాణాలు వదలాలి ”
నిజానికి మరణం చేయి చేతికి అందేంత సమీపం లో ఆసన్నమై దర్శనమిచ్చినపుడు, చెంత చేరి వొడిలో చేర్చుకోబోయే టపుడు ఈ లలాట స్పర్శ లు , కరుణా పూరితమైన ముఖాలు చూడటం ఇవన్ని పోయే ప్రాణానికి తెలుస్తాయా ?
“ఒక్కరి కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలడం “చూసి” ప్రాణాలు వదలాలి” . ఈ కోరిక ఉండటం సమంజసమో కాదో మరి !!
దేవదాసు నిజానికి అదృష్ట వంతుడే ! రెండు నిర్మల మైన ప్రేమలని పొందగలిగినందుకు . ఆ ప్రేమల్లో కనీసం ఒకదాన్ని అయినా హృదయ పూర్వకంగా స్వీకరించి సొంతం చేసుకోలేని నాడు , నిలుపుకుని , జీవితాన్ని సుఖమయం చేసుకోలేని నాడు ఆ అదృష్టం ఎందుకు ? చావడానికి కాక పొతే ??
అదే చేసాడు దేవదాసు
దేవదాసు ని ఒక పక్కన అసహ్యించుకునెలా చేస్తూనే మరో పక్క అతని కోసం కన్నీరు పెట్టించ గలిగే నవల.
దేవదాసు నవల లింక్:
పార్వతి, చంద్రముఖి నా దృష్టిలో ఎలాంటివాళ్ళో మీరు అచ్చంగా అక్షరీకరించారు సుజాతగారూ. వాళ్ళే నిజమైన ప్రేమమూర్తులు, సొంత వ్యక్తిత్వమున్నవారూనూ.
దేవదాసుపై నాకెలాంటి సానుభూతి లేవండీ. ప్రేమించడానికే కాదు, అయ్యో అనడానికైనా యోగ్యతలేనివాడు.
పార్వతి ని చూసి తెలుసుకోవలసినవి చాల ఉన్నాయి . అందులో చాల వరకు మీరు చెప్పారు . కృతజ్ఞతలండి . మన తెలుగు విమర్శకులు, ప్రేక్షకులు, నిర్మాతలు దేవదాసు ని పెద్ద హీరో ని చెసారు. కానీ శరత్ ఈ నవల లో చెప్పినది ( నాకు అర్థమయినది) ఏమిటంటే పార్వతి చాల బలమైన మనస్తత్వం ఉన్న వ్యక్థి. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని, అత్తింట్లో అంతా వ్యతిరేకం గా ఉన్నా ఇల్లు చక్కదిద్దుతుంది . దేవదాసు ఒక పెద్ద కుటుంబం లో పుట్టి తనకి కావలసినదేదో తెలియక తప్పు చేసి, ఆ తర్వాత కూడా జీవితాన్ని జీవించటం మానేసి తనను తను నాశనం చేసుకున్నాడు . దేవదాసు మానసికం గా బలహీనమైన వ్యక్తి . అతన్నిన్ చూసి జాలి పడాలి . ఆరాధించకూడదు. ఆ రోజుల్లో ఇలా తాగటం చాల ఫాషన్ అయిపొయింది .
ఆ శరన్నిశీధి లోకి మీరు మళ్లీ చేసిన ప్రయాణం బావుంది.పార్వతీ దేవదాసులు ఆమె వివాహమయాక పార్వతి భర్త గురించి మాట్లాడుకుంటారు కదా.’ పార్వతి మనసుకి ఆహ్లాదం కలిగించే విషయాలలో చౌధరి గారు కూడా ఒకరు ‘ ఒట్టి వాత్సల్యభావన చౌధరి గారిది, దాన్ని పార్వతి తీసుకుని గౌరవించిన తీరు ముచ్చటగా ఉంటుంది .
‘శరన్నవలాభిషేకం’లో ఈ ‘దేవదా మార్కు మైకం’ తెలుగు ప్రజలను ఒక పట్టాన వదిలేది కాదు!
దేవదాసు పాత్రలో ఉదాత్తత తగ్గుతుందనే భయంతో తెలుగులో యథాతథంగా తెలుగులో సినిమాగా తీయలేదు. ఎందుకంటే నిర్మాత డీఎల్ మాటల్లో ‘మన ప్రేక్షకులు అంత ఎదగలేదు’. కానీ నవలను యథాతథంగా తీసిన దిలీప్ కుమార్ దేవదాసే అక్కినేనికి ఇష్టమట. ‘నవలలో ఏముందో అదే తీశారు. సినిమాటిక్ మార్పులేం చేయలేదు’ అంటూ ఈమధ్య ఆయన సితార ఇంటర్ వ్యూలో చెప్పుకొచ్చారు.
అంత ప్రత్యేకత ఉన్న ఆ నవల చక్రపాణి అనువాదాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవటం, దాని గురించి మీరు రాసిన తీరూ చాలా బాగున్నాయి. నవలను ఆన్ లైన్ లింకు ద్వారా చదువుకునే అవకాశం ఇవ్వటం మరింత సంతోషకరం!
నీ కధా/నవలా పరిచయాలు చాలా ప్రత్యేకం!!
యుగాల (ఫీల్స్ లైక్ ఇట్) తరబడి ఎరిగున్న ప్రేమకధే అయినా ఇది చదివాకా మనసెందుకో చాలా స్థబ్దంగా అయిపోయింది!
డౌన్లోడ్ కు లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా చిన్నప్పుడు నాన్నగారు శరత్ తెలుగు నవలలన్నీ సిరీస్ లా వచ్చినప్పుడు మొత్తమ్ పదమూడు భాగాలో ఎన్నో కొనేసారు. అవన్నీ శివరామ కృష్ణగారి అనువాదాలే. చక్రపాణిగారి అనువాదాల గురించి మీరు గతంలో ఓసారి చెప్పాకా వెతికితే (చక్రపాణిగారిదే)నాలుగు శరత్ నవలలున్న పుస్తకం ఒకటి దొరికింది. ఇక నవల గురించి చెప్పాలంటే దేవదాసులా జీవితాల్ని పాడుచేసుకోవద్దు అన్నది శరత్ సందేశం అయినా, ఒక బలహీనమైన పాత్రగా దేవదాసు అంటే విపరీతమైన కోపం మీరన్నట్లే పార్వతి కన్నా చంద్రముఖి ఇష్టం నాకు. ఇంకా చెప్పాలని ఉంది కానీ నా వ్యాఖ్యే వ్యాసమైపోతుందేమో..