ఏమిటి జీవితం? ఎక్కడ ఆనందం? ఏది పరమార్థం? ఏది ఆవశ్యకం? ఏది అనుసరణీయం? ప్రశాంతత ఎక్కడ? బంధాల్లోనా? వాటిని తెంచుకోడం లోనా? జ్ఞానమంటే? ఏదీ అనుభవం లోకి రాకుండా “ఇదే జ్ఞానం” ఎని ఎలా గ్రహించడం?
సిద్దార్థుడికి అన్నీ సందేహాలే! వాటికి సమాధానాలు కనుక్కోడానికి ఇల్లు వీడాడు. శ్రమణుల్లో కలిశాడు. సాక్షాత్తూ బుద్ధుడినే కలిశాడు. ఆ తర్వాత ఏమి చేస్తాడు? తీరాయా సందేహాలు? దొరికిందా శాంతి? లభించిందా జ్ఞానం?
భారతీయ వేదాంత సారం, తత్వం, విజ్ఞానం , ఆధ్యాత్మికత లను పూర్తిగా ఒంటబట్టించుకోడానికి కాదు కదా, అందులో కనీసం కొంత భాగం అయినా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే జీవిత కాలం సరిపోదేమో! అలాటిది ఒక స్విస్ రచయిత జ్ఞానం అంటే ఏమిటి? అనే అంశం మీద భారతీయ గ్రంథాలు చదివి, ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి, ఆకళింపు చేసుకుని ఆ అంశాన్ని విస్తృతంగా చర్చిస్తూ ఒక జర్మన్ నవల రాశారంటే ఒక పెద్ద వింతే! కర్మ సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ,అద్వైతం,బ్రహ్మం వంటి పదాలే కొరుకుడు పడని సామాన్యులకు భగవద్గీత, ఉపనిషత్తులు చదివి వాటిని అర్థం చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాని పని. ఈ అంశాల్ని చర్చిస్తూ సాగే నవల “సిద్ధార్థ”! ఈ జర్మన్ నవలకు నోబెల్ సాహిత్య పురస్కారం కూడా లభించింది. దీన్ని ఆ తర్వాత ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఆంగ్లానువాదం నుంచి తెలుగులోకి శ్రీ బెల్లం కొండ రాఘవరావు గారు 1957 అనువదించగా పాత ఎమెస్కో వాళ్ళు దీన్ని వేశారు.
ఇలాటి ఒక పుస్తకాన్ని అనువదించాలంటే కేవలం ఆంగ్ల భాష మీద పట్టు ఉంటే చాలదు. పుస్తకం లోని విషయాల మీద లోతైన అవగాహన ఉంటే తప్ప పాఠకుడికి సులభమైన రీతిలో క్లిష్టమైన విషయాల్ని వివరించే ప్రయత్నం సఫలం కాదు.
అటువంటి ఒక సఫలీకృత ప్రయత్నమే ఈ నవల అనువాదం!
నవల బుద్ధుడి కాలం లో నడుస్తుంది. నవలలో కథా నాయకుడు సిద్దార్థుడనే బ్రాహ్మణ యువకుడు. అతడు తన స్నేహితుడు గోవిందుడితో కల్సి తండ్రి వైదిక విద్యను అభ్యసిస్తూ అందులో సంతృప్తిని పొందలేక పోతాడు. ఏదో ఒక అశాంతి వేధిస్తూ ఉంటుంది. పూజలూ, అనుష్టానాలు అతనికి తృప్తిని ఇవ్వవు సరి కదా అంతులేని అశాంతి ఏదో అతన్ని వేధిస్తూ ఉంటుంది. అదేమిటో తెలీదు
బలవంతం మీద తండ్రిని ఒప్పించి మిత్రుడు గోవిందుడితో కల్సి శ్రమణుల్లో చేరతాడు. అక్కడా శాంతి లభించదు. అక్కడినుంచి బుద్ధుడి దగ్గరకు వెళ్తాడు. ఎంతోమంది భిక్షువులు ప్రజలు బుద్ధుడిని దర్శించి ఆయన మార్గంలో చేరి అనుసరిస్తుంటారు. గోవిందుడు కూడా బుద్ధుడి శిష్య గణంలో చేరతాడు. బుద్ధుడి ప్రవచనాలు సిద్దార్థుడికి నచ్చుతాయి. కానీ ఆయన్ని అనుసరించాలని అనిపించదు. ఆయన శిష్య గణంలో చేరాలని అసలే అనిపించదు. బుద్ధుడితో కొంత సంవాదం జరిగిన తర్వాత.. తాను ఏది అన్వేషించాలని బయలు దేరాడో అది ఎవరో చెప్తే విని కాక, తానే స్వయంగా తెలుసుకోవాలని , అక్కడ సెలవు పుచ్చుకుని బయలు దేరతాడు. “అహంత” ను జయించి, దాని నుంచి వీడి “తాను” అనే దాని అస్థిత్వం ఏమిటో తెలుసుకోవాల్ని అందుకు తగిన మార్గాన్ని తానే స్వయంగా వెదకాలని సిద్దార్థుడి అన్వేషణ.
అలా బయలు దేరిన సిద్ధార్థుడు దారిలో ఒక పడవ వాడి సహాయంతో నది దాటి మరో నగరంలోకి వెళ్తాడు. అక్కడ మహా సౌందర్య వతియైన కమల అనే వేశ్యను కలిసి తనకు కామ కళలో మెలకువలు నేర్పమని, ఆమె వద్ద శిష్యరికం చేయాలని ఉందని అడుగుతాడు. కమల మహా ప్రాక్టికల్ మనిషి. డబ్బు తీసుకువస్తేనే తన వద్ద ప్రవేశం అని చెప్తుంది. అతన్ని కామ స్వామి అనే వ్యాపారి వద్దకు పంపి పని ఇప్పిస్తుంది.
సిద్దార్థుడు కామ స్వామి వద్ద వ్యాపారానికి సహకరిస్తాడు తప్ప వ్యాపారాన్ని మనసుకు పట్టించుకోడు. కమల వద్ద కామ కళ లో మెలకువలు నేర్చుకుంటాడు తప్ప ఆమె మీద ప్రేమను పెంచుకోడు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు.
(హెర్మన్ హెస్)
అయితే క్రమంగా ఆ నీటి బొట్టు కాస్తా మద్యం, జూదం, స్త్రీలు వంటి వ్యసనాల మురికి కూపంలో కల్సి పోయి అందులోనే కొన్నాళ్ళు కూరుకు పోతాడు. అవి పూర్తిగా అతన్ని వశం చేసుకుని అధోగతికి చేరువయ్యాక ఒక రోజు మేలుకుంటాడు. ఆస్థి పాస్థులన్నీ విసర్జించి కట్టు బట్టలతో బయలు దేరి ఇదివరలో తాను దాటిన నదీ తీరానికి చేరతాడు. ఆ నాడు తనని నది దాటించిన పల్లెకారుడు వాసుదేవుడే పెద్దవాడై ఇప్పుడూ అక్కడే ఉంటాడు. అతని మాటలకు ఆకర్షితుడవుతాడు సిద్దార్థుడు. నది మనం చెప్పేవన్నీ శ్రద్ధగా వింటుందనీ, నది చెప్పేది కూడా శ్రద్ధగా వినమని వాసుదేవుడు చెప్పిన మాటలకు ముగ్ధుడై అతనితో పాటే అక్కడే నివసించడానికి నిర్ణయించుకుంటాడు. ఈ లోపు కమల తన సర్వాన్నీ బౌద్ద్జ భిక్షువులకు అర్పించి బుద్ధుడి దర్శనానికి పదేళ్ళ కొడుకు (సిద్దార్థుడి కొడుకే) బయలు దేరి వెళ్తూ దార్లో పాము కాటుకు గురై ఆ బిడ్డను సిద్దార్థుడికి అప్పగించి మరణిస్తుంది.
మళ్ళీ సిద్దార్థుడికి పుత్ర వ్యామోహం పట్టుకుంటుంది. దాంట్లోంచి ఎంత బయట పడాలని ప్రయత్నించినా పడలేక పోతాడు. ఆ బిడ్డ ఇంట్లోంచి పారిపోతే వెదుక్కుంటూ నగరానికి వెళ్ళాలనుకుంటాడు. నది దాటే ప్రయత్నంలో అతనికి నదిలో అసంఖ్యాక దృశ్యాలు కనిపిస్తాయి. అనేక వేల లక్షల స్వరాలు వినిపిస్తాయి. ఆ స్వరాల్లో కంఠాల్లో సంతోషం, దుఃఖం, వేదన, సాంత్వన ఇలా అన్నీ గోచరమవుతాయి. తన బాల్యం, వేదాంత విద్య, శ్రమణ జీవితం, కమలతో ప్రణయం, ఇవన్నీ కలగా పులగమై ఆ స్వరాలన్నీ చివరకు ఓంకారమై వినిపిస్తాయి. అతనికి ఆ క్షణాన నిర్వాణం కలుగుతుంది. అలనాడు బుద్ధుడికి బోధి వృక్షం కింద కల్గిన జ్ఞానోదయం సిద్దార్థుడికి ఆ నదీ తీరంలో గోచరమవుతుంది.
ఈ నవల్లో కొన్ని చోట్ల ఆసక్తి కరమైన చర్చలుంటాయి. సిద్ధార్థుడికి బుద్ధుడికి, సిద్ధార్థుడికి గోవిందుడికి,సిద్ధార్థుడికి వాసుదేవుడికి మధ్య జరిగే చర్చలు బోరు కొట్టించక మరింతగా చదవాలన్న ఆసక్తిని కల్గిస్తూ సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల, తత్వం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ నవల మృష్టాన్న భోజనం లాంటిదే!
ఒక బ్రాహ్మణ యువకుడికి స్వధర్మం పట్ల ఎందుకు విరక్తి కల్గింది? తండ్రి నేర్పిన మార్గాన్ని ఎందుకు వ్యతిరేకించాడు?బుద్ధుడంతటి వాడితో ఎందుకు చేరలేదు? అన్నీ త్యజించిన వాడు మళ్ళీ సంసార లంపటాల్లో ఎందుకు చిక్కుకున్నట్టు?
జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? దాన్ని పొందడానికి ఎవరినైనా ఆశ్రయించాలా? నిత్యమూ పఠనాలు, శ్రవణాలు సాధనలతో మామూలు జీవితానికి దూరంగా గంభీర ముద్రతో బతికేయాలా? ఇంతకీ జ్ఞాని ఎవరు? సంసార బంధాల్లో ఉన్నవాడు జ్ఞానాన్ని పొందటానికి అర్హుడు కాదా? అది అతని హృదయంలోనే లేదా?
ఈ నవలకు ముందు మాట రాసిన స్వామినాథన్ అంటారు “జ్ఞానం ఎక్కడుందో తెలీడానికి ఇతర ప్రాంతాలకు పోవాలి,అక్కడి వేరు రకమైన కలల్ని గూరిచి వినాలి..ఇవన్నీ అయ్యాక ఇంటికొచ్చి చూసుకుంటే ఇక్కడే (హృదయం లోనే) పూడి ఉన్న ధనం (జ్ఞానం) దొరుకుతుంది.”అని!
ఈ నవల్లో ఆకట్టుకునే విషయం “వినడం అనే కళ” గురించి నదిని ఉదాహరణగా తీసుకుని వివరించడం. వాసుదేవుడు నది నుంచి నేర్చుకోవాల్సిన కళగా శ్రద్ధతో వినడాన్ని సిద్దార్థుడికి బోధిస్తాడు. అతడి మాటల్ని సంపూర్ణ హృదయంతో అర్థం చేసుకున్న సిద్దార్థుడు నది నుంచి “నిశ్చలమైన హృదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో, మనో వికారాలు లేకుండా, అభిప్రాయాలు లేకుండా “వినడం నేర్చుకుంటాడు. కంటికెదురుగా కనిపిస్తున్న దాన్ని as it is గా అంగీకరించడం నేర్చుకుంటాడు.
విజ్ఞానాన్ని ఒకరు బోధించ వచ్చు గానీ జ్ఞానాన్ని ఎవరికి వారే గ్రహించాలి. (జిడ్డు కృష్ణ మూర్తి కూడా ఇదే చెప్తారు ) అది వేరొకరి వద్ద అభ్యసించడమో , పుస్తకాల్లో అధ్యయనం చేయడమో సాధ్యం కాదు..!కనిపించిన ఏ డంబాచార స్వామీజీ ప్రవచనాలను వినడమో ఇందుకు ఎంత మాత్రమూ సహకరించదు జ్ఞాన సాధనకు సంసారమూ ఐహిక బంధాలూ అడ్డంకులు కావు, హృదయంలో జ్ఞాన జ్యోతి వెలుగుతూ ఉండాలే గానీ! ఇదే ఈ పుస్తక సారం!
1957 లో ఎమెస్కో ఈ పుస్తకాని ముద్రించినపుడు దీని వెల రూపాయి పావలా ! అప్పుడే దీన్ని 5000 కాపీలు వేశారు.దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించ బడ్డ ఈ నవలను 1972 లోశశి కపూర్ కథా నాయకుడిగా సినిమా కూడా తీశారు. యూ ట్యూబ్ లో లేదు. కాబట్టి అది దొరికే సక్రమ మార్గాలు అన్వేషించాల్సిందే!
ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక స్విస్ రచయిత భారతీయ వేదాంతాన్ని ఈ స్థాయిలో అధ్యయనం చేసి దానికి నవలా రూపం ఇవ్వడం ఒక అద్భుతమైన విషయం గా తోస్తుంది . ఈ పుస్తకానికి నోబెల్ కూడా లభించింది.
ప్రపంచమంతటా తిరిగిన హెస్ ని భారతీయ వేదాంతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియానే కాక శ్రీలంక, బర్మా, సుమాత్రా , ఇండోనేషియా దేశాలు కూడా సందర్శించిన హెస్ తన యాత్రానుభవాలను A journey to the east అనే పేరుతో పుస్తక బద్ధం చేశాడు కూడా.
ఈ నవలను పాఠకుల సౌకర్యం కోసం ఇక్కడ ఇస్తున్నాము.
సుజాత గారూ……., ప్లస్ భాషలో చెప్పాలంటే కెవ్వ్…అనాలి.. ఒక్క రెండు రోజులు అగి ఉంటే ఈ పుస్తకం పై వ్యాసం నా బ్లాగ్లో కనబడేది. ఈ పుస్తకం పై రాస్తున్న వ్యాసం దాదాపు ఆరు నెలల నుండీ ఆగి ఉంది….! మా నాన్నగారి దగ్గర ఈ జెర్మన్ నవల ఆంగ్లానువాదం ఉండేది. అలా స్కూల్లో ఉన్నప్పుడు మొదటిసారి ఈ నవల చదివాను. ఆంగ్లంలో కూడా నాలుగురైదుగురు అనువదించారు ఈ పుస్తకాన్ని. క్రిందటేడో ఇంకా ముందరో పుస్తకప్రదర్శనలో శ్రీశార్వరి గారి తెలుగు అనువాదం దొరికింది నాకు.
ఈ నవల ఆధారంగా శశికపూర్, సిమీగర్వాల్ నటించిన ఇంగ్లీష్ మూవీ ని అప్పట్లో సెన్సార్ వాళ్ళు బేన్ చేసారు. అందువల్ల రిలీజ్ కూడా కాలేదు. చిత్రానికి హేమంత్ కుమార్ సంగీతాన్ని అందించారు.
సిధ్ధార్థ అంతర్యుధ్ధం, సత్యాన్వేషణ, అతను పయనించిన మార్గాలూ బాగుంటాయి కానీ చివరిలో కొడుకు ఎదురైయ్యాకా, సిధ్ధార్థ పడే అరాటం చూసి, అతడిలో మోహావేశాలింకా తెగిపోలేదని అర్థమై ఆశ్చర్యం కలుగుతుంది. నవల రెండు మూడు సార్లు చదివినా ఎందుకనో కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదనిపిస్తుంది. అయితే ఒక విదేశీయుడు భారతీయ ఆథ్యాత్మికతపై మక్కువ చూపుతూ ఇంతటి పరిశోధనాత్మక నవల రాయడం గొప్ప విశేషమని చెప్పాలి. ఈ నవల రాయడానికి, ఈ తాత్విక చింతన స్వయంగా అనుభూతి చెందటానికి హెర్మన్ హెస్ నవల పూర్తయ్యేదాకా పూర్తిగా ఏకాంతంలో గడిపారుట. ఆథ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం.
తృష్ణ గారూ,అయితే కొద్దిలో తప్పించుకుందన్నమాట ఈ వ్యాసం! నేను మీ బ్లాగ్ చూసి ఉండక పోయినా మీరు లింక్ ఇస్తారు కాబట్టి మరో పది మంది మీ కోణం కూడా చదివి ఉండేవారు అప్పుడు. మీరెలా రాస్తారో చదవాలని ఉంది. మీ బ్లాగ్ లో వ్యాసం కోసం చూస్తాను. తప్పక రాయండి
నవల మీద concentrate చేయాలని సినిమా గురించి ప్రస్తావించి వదిలేశాను.
ఈ తాత్విక చింతన స్వయంగా అనుభూతి చెందటానికి హెర్మన్ హెస్ నవల పూర్తయ్యేదాకా పూర్తిగా ఏకాంతంలో గడిపారుట. __________అవునట..చదివాను. కానీ అంతటి ఆసక్తి ఆయన మన వేదాంత శాస్త్రం మీద పెంచుకోవడం ఆశ్చర్యమే కదండీ!
థాంక్యూ
తృష్ణ గారూ,
శార్వరి గారి అనువాదమా? మీరు రాయబోయే వ్యాసంతో పాటు ఆ పుస్తకాన్ని కూడా మీ బ్లాగ్ లో పెట్టండి ప్లీజ్.
రాధ గారూ, మార్కెట్లో కొనుగోలు కు అందుబాటులో ఉన్న పుస్తకాలను బ్లాగ్స్ లో పెట్టడం వీలు పడదండి ! అది కాపీ రైట్ ఉల్లంఘన అవుతుంది.
నిజమే కదా! మర్చేపోయాను.
ఇప్పుడే లోగిలిలో చూశాను. శ్రీ శార్వరి గారి అనువాదం కొనుక్కోవచ్చు అట.
మంచి పరిచయం. రచయిత జర్మన్ అతనేనా? స్విట్జర్లాండ్ అతను అనుకుంటాను. చాలా యేళ్ళ క్రితం ఆంగ్లంలో చదివాను. నేను పూర్తీగా చదివిన ఏకైక ఇంగ్లీషు నవల. బుద్ధబోధలోని ఆత్మను రచయిత సరిగ్గా పట్టుకున్నారు. సిద్ధార్థుడు ఒక సందర్భంలో బుద్ధునితో విభేదిస్తాడు ఈ నవలలో. సిద్ధార్థుని వాదన విని బుద్ధుడు నవ్వుకుంటాడు, మనసులో ఆనందపడతాడు, ఎందుకంటే బుద్ధబోధ పరమార్థం కూడా అదే కాబట్టి. చివర్లో నదితో మౌనసంభాషణ అద్భుతంగా వ్రాశారు రచయిత. ఆ సమయంలో వాసుదేవుడు కూడా తనను వీడిపోతాడు. కొడుకును, భార్యను పోగొట్టుకున్నప్పుడు చలించిన సిద్ధార్థుడు ఈ సారి నిర్వికారంగా ఉండిపోతాడు. సరిగ్గా ఈ భావాన్ని చెప్పే బౌద్ధ కథలు కొన్ని ఉన్నాయి.
ఇలాంటి రచనలకు “ప్రతిభ”లు పాండిత్యాలు – వీటికన్నా ఒక అపూర్వమైన ఆధ్తాత్మిక తత్వం పట్ల మమేకమవడమన్నది కావాలి. ఆ విధంగా హెర్మన్ హెస్సే ఒక మహర్షి నా దృష్టిలో.
రవి గారూ, సిద్ధార్థుడు పాటించదగిందే బుద్ధుడి మార్గం (జ్ఞానాన్ని ప్రవచనాల ద్వారా కాక స్వయం గా అన్వేషించాలని).. బుద్ధుడు అతని వాదన విని నవ్వుకుని అప్రీషియేట్ కూడా చేస్తాడు.
రచయిత స్విస్ రచయితే! వ్యాసం లో ప్రస్తావించాను కూడా ఆ విషయం
హెర్మన్ హెస్సే ఒక మహర్షి నా దృష్టిలో._____________ మీతో ఏకీభవించడమే !!
పరిచయం బావుంది సుజాత గారూ. నోబెల్ వచ్చింది ఒక విధంగా మొత్తం కృషికి, విడిగా అయితే ‘ మెజిస్టర్ లూడీ ‘ [ గ్లాస్ బీడ్ గేం ] కి
http://www.amazon.com/Hermann-Hesse/e/B000APUYEW/ref=ntt_athr_dp_pel_pop_1
http://www.barnesandnoble.com/w/the-glass-bead-game-hermann-hesse/1001816935?ean=9781466835023
http://www.goodreads.com/book/show/16634.The_Glass_Bead_Game?from_search=true
http://www.amazon.com/Hermann-Hesse/e/B000APUYEW/ref=ntt_athr_dp_pel_pop_1
Thank you Mythili garu
మీ సమీక్ష బావుంది సుజాత గారు , పుస్తకం చదవాలి వెంటనే !!
థాంక్యూ! చదవండి కళ్యాణి గారూ! అందరికీ అందుబాటులో ఉండాలనే పుస్తకాన్ని ఇక్కడ షేర్ చేసాను.
పుస్తకాన్ని అందించినందుకు చాలా థాంక్స్. ఈ పుస్తకం కోసం చాలా రోజులు నుంచీ ఎదురు చూస్తున్నాను.
Sarath garu, you are most welcome! Enjoy reading
సుజాత గారూ .. మీ సమీక్ష బాగుంది .
రామ్ గారూ, థాంక్యూ
పరిచయం ఆసక్తికరంగా రాశారు. ఒక విదేశీ రచయిత ఇలాంటి సబ్జెక్టుతో ఒప్పించేలా రాయటం విశేషమే! పుస్తకం అందించినందుకు థాంక్యూ.
సుజాత గారూ,
నేను ఎన్నాళ్ళగానో ఈ పుస్తకం కోసం చూస్తున్నాను. ఇంగ్లీష్ లో చదివితే కంటే తెలుగులో చదివితేనే నాకు బావుంటుంది ఏ పుస్తకాన్నైనా. చాలా చాలా ధన్యవాదాలు ఇంత మంచి పుస్తకాన్ని అందించినందుకు.
ఇక “జ్ఞానాన్ని ఒకరు బోధించేది కాదు ఎవరికి వారు గ్రహించాలి” అన్న జిడ్డు కృష్ణమూర్తిగారి మాటలు కోట్ చేస్తూ ఈ పుస్తక సారాన్ని మీరు ఒక్క మాటలో విశదపరచడం బావుంది.
రాధ
రాధ గారూ,
ఈ పుస్తకం గురించి నేనూ చాలా రోజులు గా వెదికి , మిత్రుల సాయంతో జాడ కనుక్కున్నాను. ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ లో దొరికింది.
జేకే రచనలు ఎంత చదివినా తీరని ఒక దాహం. ఆలోచనలు చిక్కు ముళ్ళై విడి పోతూ, మళ్ళీ కొత్త ముడులు పడుతూ.. ఒక సంఘర్షణకు, ఒక సరి కొత్త ప్రపంచానికి దారి తీయించే కర దీపికలు
థాంక్ యు
సుజాత గారూ,
పుస్తకం మొదటి ప్రకరణం లో ఎనిమిదో పేజీ నుండి సరి సంఖ్య గల పేజీలు రావడం లేదు. తర్వాత రెండో భాగంలో బేసి సంఖ్య గల పేజీలు లేవు. ఎందుకని? నా కంప్యూటర్ లో ఏమైనా ప్రాబ్లమా?
రాధగారూ, చెక్ చేసాను. అలాటి సమస్య ఏమీ లేదే? బాగానే కనిపిస్తున్నాయి. లేదా మీకు విడిగా మెయిల్ చేస్తానుండండి ఈ నవల PDF ని
PDF అందింది. థాంక్ యు.
ఈ నవల గురించి ఓ ఆసక్తికరమైన ప్రస్తావన ‘కోతి కొమ్మచ్చి’ (మొదటి భాగం)లో ఉంది. సిద్ధార్థ నవలను అచ్చయిన 20 ఏళ్ళ వరకూ ఎవరూ పట్టించుకోలేదట. ఈ కథతో శశికపూర్ తో తీసిన సినిమా హిట్టయింది. ‘దాని వల్ల- అప్పటివరకూ- చీకటి గోడౌన్లలో పడివున్న నవల కూడా హిట్టయింది!’ అంటూ ముళ్ళపూడి వెంకట రమణ గారు రాశారు.
“విజ్ఞానాన్ని ఒకరు బోధించ వచ్చు గానీ జ్ఞానాన్ని ఎవరికి వారే గ్రహించాలి.!” — ట్రూ! అందుకే ఎంతోమంది సో కాల్డ్ విద్యాధికులలో అసలు సిసలు జ్ఞానం నేలబారున పారుతుంటుంది!
ఈ పుస్తకం గురించి ఇదే వినడం.. థాంక్స్ ఫర్ ద ఇంట్రడిక్షన్ అండ్ లింక్!
స్వామినాథన్ వ్రాసిన తొలిపలుకులో ప్రస్తావించిన జిమ్మేర్ కథ అద్భతం . బహుశా ఈకధే పాల్ కహేలో నవల ‘ ది అల్కెమిస్ట్ ‘ కి స్పూర్తి అయివుండవచ్చు . ఈ పుస్తకం గురించి ఇదే వినడం.. థాంక్స్ ఫర్ ద ఇంట్రడిక్షన్ అండ్ లింక్!
సుజాత గారు – చాల చాల ధన్యవాదాలు. నేను కాలేజీ లో వున్నప్పుడు మొదటి సారి ఈ బుక్ చదివాను. మూడు సంవత్సరాలలో ఎన్ని సార్లు చదివానో లెఖ్ఖ లేదు. ఎప్పుడు చదివినా కొత్తగానే వుంటుంది. ఇంతవరకు ఇంగ్లీష్ వెర్షన్ చదివాను కానీ, తెలుగు లో చదవలేదు. ఇక్కడ చదువుతుంటే చాలా పేజి లు ఖాళీగా వున్నాయి. నాకు pdf పంపించగలరా?