చదువు

ఒక సిద్దార్థుడి జ్ఞానాన్వేషణ – హెర్మన్ హెస్ నవల “సిద్దార్థ”

అక్టోబర్ 2013

ఏమిటి జీవితం? ఎక్కడ ఆనందం? ఏది పరమార్థం? ఏది ఆవశ్యకం? ఏది అనుసరణీయం? ప్రశాంతత ఎక్కడ? బంధాల్లోనా? వాటిని తెంచుకోడం లోనా? జ్ఞానమంటే? ఏదీ అనుభవం లోకి రాకుండా “ఇదే జ్ఞానం” ఎని ఎలా గ్రహించడం?

సిద్దార్థుడికి అన్నీ సందేహాలే! వాటికి సమాధానాలు కనుక్కోడానికి ఇల్లు వీడాడు. శ్రమణుల్లో కలిశాడు. సాక్షాత్తూ బుద్ధుడినే కలిశాడు. ఆ తర్వాత ఏమి చేస్తాడు? తీరాయా సందేహాలు? దొరికిందా శాంతి? లభించిందా జ్ఞానం?

భారతీయ వేదాంత సారం, తత్వం, విజ్ఞానం , ఆధ్యాత్మికత లను పూర్తిగా ఒంటబట్టించుకోడానికి కాదు కదా, అందులో కనీసం కొంత భాగం అయినా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే జీవిత కాలం సరిపోదేమో! అలాటిది ఒక స్విస్ రచయిత జ్ఞానం అంటే ఏమిటి? అనే అంశం మీద భారతీయ గ్రంథాలు చదివి, ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి, ఆకళింపు చేసుకుని ఆ అంశాన్ని విస్తృతంగా చర్చిస్తూ ఒక జర్మన్ నవల రాశారంటే ఒక పెద్ద వింతే! కర్మ సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ,అద్వైతం,బ్రహ్మం వంటి పదాలే కొరుకుడు పడని సామాన్యులకు భగవద్గీత, ఉపనిషత్తులు చదివి వాటిని అర్థం చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాని పని. ఈ అంశాల్ని చర్చిస్తూ సాగే నవల “సిద్ధార్థ”! ఈ జర్మన్ నవలకు నోబెల్ సాహిత్య పురస్కారం కూడా లభించింది. దీన్ని ఆ తర్వాత ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఆంగ్లానువాదం నుంచి తెలుగులోకి శ్రీ బెల్లం కొండ రాఘవరావు గారు 1957 అనువదించగా పాత ఎమెస్కో వాళ్ళు దీన్ని వేశారు.

ఇలాటి ఒక పుస్తకాన్ని అనువదించాలంటే కేవలం ఆంగ్ల భాష మీద పట్టు ఉంటే చాలదు. పుస్తకం లోని విషయాల మీద లోతైన అవగాహన ఉంటే తప్ప పాఠకుడికి సులభమైన రీతిలో క్లిష్టమైన విషయాల్ని వివరించే ప్రయత్నం సఫలం కాదు.

అటువంటి ఒక సఫలీకృత ప్రయత్నమే ఈ నవల అనువాదం!

నవల బుద్ధుడి కాలం లో నడుస్తుంది. నవలలో కథా నాయకుడు సిద్దార్థుడనే బ్రాహ్మణ యువకుడు. అతడు తన స్నేహితుడు గోవిందుడితో కల్సి తండ్రి వైదిక విద్యను అభ్యసిస్తూ అందులో సంతృప్తిని పొందలేక పోతాడు. ఏదో ఒక అశాంతి వేధిస్తూ ఉంటుంది. పూజలూ, అనుష్టానాలు అతనికి తృప్తిని ఇవ్వవు సరి కదా అంతులేని అశాంతి ఏదో అతన్ని వేధిస్తూ ఉంటుంది. అదేమిటో తెలీదు

బలవంతం మీద తండ్రిని ఒప్పించి మిత్రుడు గోవిందుడితో కల్సి శ్రమణుల్లో చేరతాడు. అక్కడా శాంతి లభించదు. అక్కడినుంచి బుద్ధుడి దగ్గరకు వెళ్తాడు. ఎంతోమంది భిక్షువులు ప్రజలు బుద్ధుడిని దర్శించి ఆయన మార్గంలో చేరి అనుసరిస్తుంటారు. గోవిందుడు కూడా బుద్ధుడి శిష్య గణంలో చేరతాడు. బుద్ధుడి ప్రవచనాలు సిద్దార్థుడికి నచ్చుతాయి. కానీ ఆయన్ని అనుసరించాలని అనిపించదు. ఆయన శిష్య గణంలో చేరాలని అసలే అనిపించదు. బుద్ధుడితో కొంత సంవాదం జరిగిన తర్వాత.. తాను ఏది అన్వేషించాలని బయలు దేరాడో అది ఎవరో చెప్తే విని కాక, తానే స్వయంగా తెలుసుకోవాలని , అక్కడ సెలవు పుచ్చుకుని బయలు దేరతాడు. “అహంత” ను జయించి, దాని నుంచి వీడి “తాను” అనే దాని అస్థిత్వం ఏమిటో తెలుసుకోవాల్ని అందుకు తగిన మార్గాన్ని తానే స్వయంగా వెదకాలని సిద్దార్థుడి అన్వేషణ.

అలా బయలు దేరిన సిద్ధార్థుడు దారిలో ఒక పడవ వాడి సహాయంతో నది దాటి మరో నగరంలోకి వెళ్తాడు. అక్కడ మహా సౌందర్య వతియైన కమల అనే వేశ్యను కలిసి తనకు కామ కళలో మెలకువలు నేర్పమని, ఆమె వద్ద శిష్యరికం చేయాలని ఉందని అడుగుతాడు. కమల మహా ప్రాక్టికల్ మనిషి. డబ్బు తీసుకువస్తేనే తన వద్ద ప్రవేశం అని చెప్తుంది. అతన్ని కామ స్వామి అనే వ్యాపారి వద్దకు పంపి పని ఇప్పిస్తుంది.

సిద్దార్థుడు కామ స్వామి వద్ద వ్యాపారానికి సహకరిస్తాడు తప్ప వ్యాపారాన్ని మనసుకు పట్టించుకోడు. కమల వద్ద కామ కళ లో మెలకువలు నేర్చుకుంటాడు తప్ప ఆమె మీద ప్రేమను పెంచుకోడు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు.

(హెర్మన్ హెస్)

అయితే క్రమంగా ఆ నీటి బొట్టు కాస్తా మద్యం, జూదం, స్త్రీలు వంటి వ్యసనాల మురికి కూపంలో కల్సి పోయి అందులోనే కొన్నాళ్ళు కూరుకు పోతాడు. అవి పూర్తిగా అతన్ని వశం చేసుకుని అధోగతికి చేరువయ్యాక ఒక రోజు మేలుకుంటాడు. ఆస్థి పాస్థులన్నీ విసర్జించి కట్టు బట్టలతో బయలు దేరి ఇదివరలో తాను దాటిన నదీ తీరానికి చేరతాడు. ఆ నాడు తనని నది దాటించిన పల్లెకారుడు వాసుదేవుడే పెద్దవాడై ఇప్పుడూ అక్కడే ఉంటాడు. అతని మాటలకు ఆకర్షితుడవుతాడు సిద్దార్థుడు. నది మనం చెప్పేవన్నీ శ్రద్ధగా వింటుందనీ, నది చెప్పేది కూడా శ్రద్ధగా వినమని వాసుదేవుడు చెప్పిన మాటలకు ముగ్ధుడై అతనితో పాటే అక్కడే నివసించడానికి నిర్ణయించుకుంటాడు. ఈ లోపు కమల తన సర్వాన్నీ బౌద్ద్జ భిక్షువులకు అర్పించి బుద్ధుడి దర్శనానికి పదేళ్ళ కొడుకు (సిద్దార్థుడి కొడుకే) బయలు దేరి వెళ్తూ దార్లో పాము కాటుకు గురై ఆ బిడ్డను సిద్దార్థుడికి అప్పగించి మరణిస్తుంది.

మళ్ళీ సిద్దార్థుడికి పుత్ర వ్యామోహం పట్టుకుంటుంది. దాంట్లోంచి ఎంత బయట పడాలని ప్రయత్నించినా పడలేక పోతాడు. ఆ బిడ్డ ఇంట్లోంచి పారిపోతే వెదుక్కుంటూ నగరానికి వెళ్ళాలనుకుంటాడు. నది దాటే ప్రయత్నంలో అతనికి నదిలో అసంఖ్యాక దృశ్యాలు కనిపిస్తాయి. అనేక వేల లక్షల స్వరాలు వినిపిస్తాయి. ఆ స్వరాల్లో కంఠాల్లో సంతోషం, దుఃఖం, వేదన, సాంత్వన ఇలా అన్నీ గోచరమవుతాయి. తన బాల్యం, వేదాంత విద్య, శ్రమణ జీవితం, కమలతో ప్రణయం, ఇవన్నీ కలగా పులగమై ఆ స్వరాలన్నీ చివరకు ఓంకారమై వినిపిస్తాయి. అతనికి ఆ క్షణాన నిర్వాణం కలుగుతుంది. అలనాడు బుద్ధుడికి బోధి వృక్షం కింద కల్గిన జ్ఞానోదయం సిద్దార్థుడికి ఆ నదీ తీరంలో గోచరమవుతుంది.

ఈ నవల్లో కొన్ని చోట్ల ఆసక్తి కరమైన చర్చలుంటాయి. సిద్ధార్థుడికి బుద్ధుడికి, సిద్ధార్థుడికి గోవిందుడికి,సిద్ధార్థుడికి వాసుదేవుడికి మధ్య జరిగే చర్చలు బోరు కొట్టించక మరింతగా చదవాలన్న ఆసక్తిని కల్గిస్తూ సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల, తత్వం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ నవల మృష్టాన్న భోజనం లాంటిదే!

ఒక బ్రాహ్మణ యువకుడికి స్వధర్మం పట్ల ఎందుకు విరక్తి కల్గింది? తండ్రి నేర్పిన మార్గాన్ని ఎందుకు వ్యతిరేకించాడు?బుద్ధుడంతటి వాడితో ఎందుకు చేరలేదు? అన్నీ త్యజించిన వాడు మళ్ళీ సంసార లంపటాల్లో ఎందుకు చిక్కుకున్నట్టు?

జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? దాన్ని పొందడానికి ఎవరినైనా ఆశ్రయించాలా? నిత్యమూ పఠనాలు, శ్రవణాలు సాధనలతో మామూలు జీవితానికి దూరంగా గంభీర ముద్రతో బతికేయాలా? ఇంతకీ జ్ఞాని ఎవరు? సంసార బంధాల్లో ఉన్నవాడు జ్ఞానాన్ని పొందటానికి అర్హుడు కాదా? అది అతని హృదయంలోనే లేదా?

ఈ నవలకు ముందు మాట రాసిన స్వామినాథన్ అంటారు “జ్ఞానం ఎక్కడుందో తెలీడానికి ఇతర ప్రాంతాలకు పోవాలి,అక్కడి వేరు రకమైన కలల్ని గూరిచి వినాలి..ఇవన్నీ అయ్యాక ఇంటికొచ్చి చూసుకుంటే ఇక్కడే (హృదయం లోనే) పూడి ఉన్న ధనం (జ్ఞానం) దొరుకుతుంది.”అని!

ఈ నవల్లో ఆకట్టుకునే విషయం “వినడం అనే కళ” గురించి నదిని ఉదాహరణగా తీసుకుని వివరించడం. వాసుదేవుడు నది నుంచి నేర్చుకోవాల్సిన కళగా శ్రద్ధతో వినడాన్ని సిద్దార్థుడికి బోధిస్తాడు. అతడి మాటల్ని సంపూర్ణ హృదయంతో అర్థం చేసుకున్న సిద్దార్థుడు నది నుంచి “నిశ్చలమైన హృదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో, మనో వికారాలు లేకుండా, అభిప్రాయాలు లేకుండా “వినడం నేర్చుకుంటాడు. కంటికెదురుగా కనిపిస్తున్న దాన్ని as it is గా అంగీకరించడం నేర్చుకుంటాడు.

విజ్ఞానాన్ని ఒకరు బోధించ వచ్చు గానీ జ్ఞానాన్ని ఎవరికి వారే గ్రహించాలి. (జిడ్డు కృష్ణ మూర్తి కూడా ఇదే చెప్తారు ) అది వేరొకరి వద్ద అభ్యసించడమో , పుస్తకాల్లో అధ్యయనం చేయడమో సాధ్యం కాదు..!కనిపించిన ఏ డంబాచార స్వామీజీ ప్రవచనాలను వినడమో ఇందుకు ఎంత మాత్రమూ సహకరించదు జ్ఞాన సాధనకు సంసారమూ ఐహిక బంధాలూ అడ్డంకులు కావు, హృదయంలో జ్ఞాన జ్యోతి వెలుగుతూ ఉండాలే గానీ! ఇదే ఈ పుస్తక సారం!

1957 లో ఎమెస్కో ఈ పుస్తకాని ముద్రించినపుడు దీని వెల రూపాయి పావలా ! అప్పుడే దీన్ని 5000 కాపీలు వేశారు.దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించ బడ్డ ఈ నవలను 1972 లోశశి కపూర్ కథా నాయకుడిగా సినిమా కూడా తీశారు. యూ ట్యూబ్ లో లేదు. కాబట్టి అది దొరికే సక్రమ మార్గాలు అన్వేషించాల్సిందే!

ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక స్విస్ రచయిత భారతీయ వేదాంతాన్ని ఈ స్థాయిలో అధ్యయనం చేసి దానికి నవలా రూపం ఇవ్వడం ఒక అద్భుతమైన విషయం గా తోస్తుంది . ఈ పుస్తకానికి నోబెల్ కూడా లభించింది.
ప్రపంచమంతటా తిరిగిన హెస్ ని భారతీయ వేదాంతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియానే కాక శ్రీలంక, బర్మా, సుమాత్రా , ఇండోనేషియా దేశాలు కూడా సందర్శించిన హెస్ తన యాత్రానుభవాలను A journey to the east అనే పేరుతో పుస్తక బద్ధం చేశాడు కూడా.

ఈ నవలను పాఠకుల సౌకర్యం కోసం ఇక్కడ ఇస్తున్నాము.