కథ

అనుబంధం

నవంబర్ 2013

కాలేజీ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో మా అమ్మ క్రింద కూర్చుని ఉన్నదల్లా లేచి నాకు ఎదురొచ్చి నా బుగ్గలు పుణుకుతూ “అదృష్టవంతురాలివే తల్లీ. మామయ్య నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు” అంది. ‘నేనేందో ఆయనని చేసుకోవడానికి ఆరాటపడుతున్నట్లు చెప్తుందేమిటీ’ అని నాకు ఆశ్చర్యమేసింది. ఏదో చెప్పి ఉంటుంది మామయ్యకి అనుకుని మామయ్య వైపు చూశాను. తలదించుకుని కుర్చీలో కూర్చుని ఉన్న మామయ్య అమ్మ మాటలు విని, లేచి ఏదో పని ఉన్నట్లు బయటకు వెళ్ళిపోయాడు. అమ్మమ్మ కూడా మోకాళ్ళు పట్టుకుని మూలుగుతూ లేచి నుంచుని “ఎట్లయితేనేం తమ్ముడిని ఒప్పించావు. వాడి మనసు మారకముందే త్వరగా పెళ్ళి ఏర్పాట్లు చూడు” అంది అమ్మతో.

“అలాగే అమ్మా!” అంది మా అమ్మ సంతోషంగా.

మామయ్య అంటే నాకు ఎంత భయమో అంత ఇష్టం, గౌరవం కూడా. అయినా మామయ్యతో పెళ్ళి అంటే మాత్రం నాకేమీ సంతోషం కలగలేదు. అదీగాక నా దృష్టి అంతా పరీక్షల పైనే ఉంది. రేపటి నుండీ ఇంటర్ ఫైనల్ పరీక్షలు. అన్ని ప్రశ్నలకీ జవాబులు వదలకుండా రాయాలనీ, ఈ మార్కులే పై చదువుల జీవితానికి టర్నింగ్ పాయింటనీ ఈరోజు మా కాలేజీ ప్రిన్సిపాల్ చాలా సేపు చెప్పాడు. “బాబోయ్! పరీక్షలకి చదువుకోవాలమ్మా!” అంటూ లోపలకి పరిగెత్తాను అమ్మ, అమ్మమ్మల మాటలని ఏమీ పట్టించుకోకుండా.

***

నా పరీక్షలు అయ్యాయి. బాగా రాశాను. తర్వాత రోజు మా స్నేహితులందరం కలిసి సినిమాకి వెళదామని అనుకున్నాం. ఇంటికొచ్చేటప్పటికి కంసాలి వీరయ్య కొత్త మంచాన్ని బిగిస్తున్నాడు. అబ్బ! ఎంత బావుందో మంచం. తల వైపున ఉన్న చెక్కకి రెండు నెమళ్ళు చెక్కాడు. పింఛాన్ని విరబోసుకుని ఉన్న మగ నెమలి కొంచెం ఎత్తులో నిలబడి తనకు కొంచెం దిగువగా ఉన్న ఆడ నెమలికి తన ముక్కుతో తామర పువ్వు అందిస్తోంది. ఆ పువ్వుని తన ముక్కుతో అందుకుంటూ మగ నెమలి కళ్ళల్లోకి చూస్తున్నట్లుగా ఆడ నెమలి నిలబడి ఉంది. ఆడ నెమలికి ప్రక్కగా ఉన్నచెట్టు నుండి బయలుదేరిన ఒక కొమ్మ వాటి రెంటి తలల పైన వాలి ఉంది.

మంచాన్ని అలాగే చూస్తూ నిలబడ్డ నన్ను “ఏమిటే అలా చూస్తున్నావు? అది నీకోసమే చేయించాం. బాగుందా? ” అంది అమ్మమ్మ.

“భలేగుంది అమ్మమ్మా! ఆ నెమళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో!” అన్నాను ఆరాధనగా చూస్తూ.

“పోన్లేమ్మా! నీకు నచ్చింది అంతే చాలు. మీ అమ్మమ్మ ‘నా పందిరి మంచాన్ని ఏం చేస్తావో’ అని తిట్టుకుంటా ఇచ్చింది. చెక్కని నేనేదో తింటానని ఇన్నాళ్ళూ బాగు చేయించలా. ఆమె మంచం మీద ఆమెకంత మమకారం. ఇప్పుడైనా మనవరాలి పెళ్ళికి కానుక ఇవ్వాలని బయటకి తీసింది విరిగిన మంచాన్ని” అన్నాడు వీరయ్య. నేను అసలు వీరయ్య ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోకుండా నెమళ్ళని ఆప్యాయంగా తడుముకుంటున్నాను.

“నీ మనవరాలికి కూడా నీ పిచ్చే వచ్చినట్లుంది. చూడు ఏం చూసుకుంటోందో!” అన్నాడు వీరయ్య సంతోషంగా. వీరయ్య చెప్పింది నిజమే. నాకు ఆ మంచాన్ని వదలబుద్ధి కాలేదు. మర్నాడు సినిమాకి కూడా వెళ్ళలేదు. నెమళ్ళతో ఏవేవో ఊసులాడుతూ వాటి వైపే చూస్తూ పడుకున్నాను. అమ్మో, అమ్మమ్మో గదిలోకి వచ్చినపుడు మాత్రం నిద్రపోయినట్లు నటన. అమ్మ లేపబోతుంటే “పాపం పరీక్షలకి రాత్రింబవళ్ళూ చదివిందిగా! అలిసిపోయినట్లుంది పడుకోనీయ్” అంది అమ్మమ్మ.

***

పెళ్ళికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పెళ్ళి ఇంకా రెండు రోజులే ఉంది. మామయ్య తెనాలి నుండి ఇంకా రాలేదు. ఆరోజు పరీక్షలకి ముందు చూసిందే నేను మామయ్యని. చుట్టాలందరూ వచ్చారు. మామయ్యని గురించి అడుగుతున్నారు. ‘పెళ్ళి తర్వాత ఎక్కువ రోజులు సెలవు పెడతానులే. ముందే ఎందుకు రావడం – ఏర్పాట్లు చేయటానికి మీరున్నారుగా’ అన్నాడంట. అమ్మ వాళ్ళకి చెబుతుంటే విన్నాను. నాకు మాత్రం నెమళ్ళకి కబుర్లు చెప్పుకోవడం, వాటినే చూస్తూ ఉండటం లోనే సమయం గడిచిపోతుంది. అదేమిటో నాకు అవి నిజమైన నెమళ్ళలాగే అనిపిస్తున్నాయి. వాటి ప్రేమలో పడిన నాకు చుట్టాలని పలకరించాలని, పెళ్ళికి తెచ్చిన చీర అందరికీ చూపించాలనీ ఏమీ అనిపించడం లేదు.

“సిగ్గుతో గది వదలడం లేదు” అంటుంది అమ్మ వచ్చిన చుట్టాలతో నన్ను గురించి. నిజమేనా – నా మనస్సేమిటో నాకే తెలియడం లేదు. పెళ్ళంటే నాకు బాధా, సంతోషమా, భయమా – ఏమో నాకు తెలియడం లేదు. అమ్మ మాటలకి నెమళ్ళ వైపు చూసి నవ్వాను. ఈసారి నిజంగానే వాటి వైపు సిగ్గుగా చూస్తూ.

సాయంత్రానికి మామయ్యొచ్చాడు. నన్ను చూసిన ఆ చూపులో ఏ భావమూ లేదు. బహుశా మామయ్యకి కూడా పెళ్ళంటే ఏమీ అనిపించడం లేదేమో. తర్వాత రోజు పొద్దున్నే నన్ను పెళ్ళి కూతుర్ని చేశారు. పెళ్ళి చీర కట్టుకున్నాక కూడా కాసేపు ఆ మంచం మీద పడుకున్నాను. అందరూ నా చేష్టలకి నవ్వుతున్నారు. కాని వాళ్ళకేం తెలుసు!? నేను ఆ మంచం మీద, ఆ నెమళ్ళ మీద వారం రోజుల్లోనే ఎంత అనుబంధం పెంచుకున్నానో!?

పెళ్ళయింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక పరిగెత్తుకుంటూ వెళ్ళి నెమళ్ళని పలకరించి మంచం మీద ముణగదీసుకుని పడుకున్నాను. మూడు గంటలప్పుడు నన్ను లేపి బయటకు పంపించారు – మంచాన్ని అలంకరించాలంటూ. మంచానికి అలంకరణ అనేటప్పటికి నాకు భలే సంతోషం వేసింది. నా సంతోషాన్ని చూసి మా వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. మామయ్య కూడా నా సంతోషాన్ని చూసి ముఖం ఆశ్చర్యంగా పెట్టాడు.

బయటకు వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వచ్చి మంచాన్ని చూసుకుంటున్న నన్ను అందరూ తెగ అల్లరి పెట్టేశారు. రాత్రి భోజనాలయ్యాక మామయ్యనూ నన్నూ మంచం మీద కూర్చోపెట్టి ఏవేవో కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని వదిలి తలుపులు వేసి అందరూ వెళ్ళిపోయారు. మామయ్య నన్ను దగ్గరకి తీసుకున్నాడు. నేను దూరంగా జరుగుతూ “నెమళ్ళు చూస్తున్నాయి మామయ్యా” అన్నాను సిగ్గుగా. మామయ్య నవ్వి లైట్ ఆర్పేశాడు.

***

మొదటినుండీ మామయ్యకి నేనంటే చాలా అభిమానం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆప్యాయత చూపిస్తున్నాడు. మా పెళ్ళి కాక ముందు నెలకో, రెండు నెలలకో వచ్చే మామయ్య ఇప్పుడు తెనాలి నుండి నెలకు నాలుగైదు సార్లు వస్తున్నాడు. నాకు పనేమీ ఉండదు. ఇంట్లో పని అంతా అమ్మ, అమ్మమ్మ చేసేస్తారు. నాకిష్టం అని బయట ముగ్గులేస్తాను. ఉదయం, సాయంత్రం పూచే మల్లె మొగ్గలు కోసుకుని తెచ్చుకుని నెమళ్ళకి కబుర్లు చెప్తూ మాల కట్టుకుంటాను అంతే. మిగతా సమయమంతా మంచం తుడుచుకోనూ, నెమళ్ళని తడుముకోనూ, ఏవేవో సంగతులు చెప్పుకోనూ చేస్తుంటాను. శ్రావణ మాసం వస్తే తెనాలిలో మా కాపురం పెట్టించాలని అమ్మ అందరితో చెప్తుంటే విన్నాను. “నేను వెళ్తే నాతో పాటు మంచం తీసికెళతానమ్మా! ” అన్నాను అమ్మ ప్రక్కన చేరి.
“వద్దమ్మా! అది అమ్మమ్మ మంచం. చాలా బరువు. తీసికెళ్ళేటప్పుడు ఏమైనా అయితే మళ్ళీ చేయించుకోలేం. దానిని బాగు చేయించినందుకు అయిన బాకీ ఇంకా వీరయ్యకి ఇవ్వనేలా”
అంది అమ్మ దిగులుగా.

నెమళ్ళని వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. మామయ్యకి చెబ్దాములే అనుకున్నాను.

“నాకు వచ్చే జీతానికి తెనాలిలో కాపురం పెడితే తిండికి అప్పులు చేయాలి” అన్నాడు మామయ్య. మామయ్య మాటలకి నాకు చాలా సంతోషం కలిగింది. ‘హమ్మయ్య! నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదులే’ అని ఎగురుతూ చెప్పా నెమళ్ళకి.

ఆ తర్వాత శనివారం మామయ్య వచ్చింది గమనించుకోకుండా నెమళ్ళ వైపే చూస్తూ పడుకుని ఉన్నాను. “ఎప్పుడు చూసినా ఎందుకు పడుకోనుంటావ్? డిగ్రీ ప్రైవేటుగా కట్టిపిస్తాను చదువుకుందువుగాని” విసుక్కున్నాడు మామయ్య. ఏ ముహుర్తాన విసుక్కున్నాడో కాని ఆరోజు నుంచీ నాకు నెమళ్ళతో మాట్లాడటం మాట అటుంచి వాటి వైపు సరిగ్గా చూడటానికి కూడా తీరుబడి లేకుండా పోయింది. ఆ మర్నాడే అమ్మమ్మ కాలు జారి పడిపోయింది. వెన్నెముకకి దెబ్బ తగలడం వల్ల లేవలేదు. అన్నీ మంచం లోనే. అమ్మకి అమ్మమ్మ పని తోనే సరిపోతుండటం తో నా మీద ఇంటి పని పడింది.

నాకు నెల తప్పింది. మామయ్య ఈమధ్య వారానికి రెండు సార్లు వచ్చి నాకు, అమ్మమ్మకి కావలసిన మందులు, పండ్లు తెచ్చి ఇస్తున్నాడు. మనిషికి విసుగు కూడా ఎక్కువయింది. “జీతం పెరగలేదు కాని ఖర్చులెక్కువయినాయి” అని అమ్మతో చెప్పి బాధ పడుతున్నాడు.

భర్త చనిపోతే పుట్టింటికి చేరిన అమ్మకి తమ్ముడే కొడుకూ, అల్లుడూ. తమ్ముడికి కాస్త చేతి సాయంగా ఉండాలని, ఇంట్లో ఇక పాల ఖర్చు కూడా ఎక్కువవుతుంది గదా అని లోనులో రెండు ఆవులు తెచ్చింది అమ్మ. దాంతో ఇద్దరికీ పని ఎక్కువయింది. నాకు నెలలు నిండుతున్నాయి. పని చేయలేకపోతున్నాను. అన్నీ అమ్మే సంభాళించుకుంటుంది. తన నోటి మంచితనం వల్ల ఇరుగుపొరుగు వాళ్ళు ఆవులకి మేత తెచ్చి ఇవ్వడం, పాలు పిండి ఇవ్వడం చేస్తున్నారు.

నాకు అబ్బాయి పుట్టాడు. మామయ్యకి చాలా సంతోషం కలిగిందని ఆయన ముఖం చూస్తేనే అర్థమయింది. అమ్మమ్మ ముదిమనవడిని చూడటానికే బ్రతికున్నట్లు వాడు పుట్టిన వారానికే చనిపోయింది. బాబుకి ప్రశాంత్ అని పేరు పెట్టాడు మామయ్య.

***

కాల చక్రం గిర్రున తిరుగుతోంది. ఒకప్పుడు నెమళ్ళతో కబుర్లు చెప్పేదాన్ని అన్న సంగతి కూడా మర్చిపోయాను. బాబు నేను చదివిన కాలేజీ లోనే డిగ్రీ ఫైనలియర్ రాశాడు. ఎం. ఏ కి చేర్చాలని మామయ్య చాలా ఆరాటపడిపోతున్నాడు. గుంటూరులో చేర్పించడానికి అక్కడ కాలేజీ వాళ్ళతో మాట్లాడి వస్తానని వెళ్ళిన మామయ్య బస్సులోనే గుండె ఆగి చనిపోయాడు. మామయ్య శవం మీద పడి అమ్మ గుండె పగిలేట్లు ఏడ్చింది. అమ్మని ఓదార్చడానికి నేను ధైర్యం తెచ్చుకోవలసి వచ్చింది. అప్పుడు గుర్తుకు వచ్చాయి నాకు నెమళ్ళు గాఢంగా – చాలా రోజుల తర్వాత. అందరూ మామయ్య శవం దగ్గర కూర్చుంటే నేను గదిలోకి వెళ్ళి నెమళ్ళ వైపు చూస్తూ కూర్చున్నాను. నాకు చాలా ఓదార్పు లభించింది.

మామయ్య ఉద్యోగం బాబుకి ఇస్తామని ఆఫీస్ వాళ్ళు అన్నారు కాని ఉద్యోగం రావడానికి దాదాపు ఆరేడు నెలలు పట్టింది. ఆ సమయంలో ఆవులే మమల్ని ఆదుకున్నాయి. బాబుకి ఉద్యోగం వచ్చిందో రాలేదో వాడికి పిల్లనిస్తామంటూ సంబంధాలు వస్తున్నాయి. కోడలు వస్తే నేను విశ్రాంతిగా నా మంచం మీద నెమళ్ళతో మాట్లాడుకోవచ్చని నాకు కూడా ఆశ గానే ఉంది. ఈమధ్య ఎందుకో నాకంటూ ఎవరన్నా ఉండాలని, నాకంటూ ప్రత్యేక జీవితం కావాలనీ అనిపిస్తోంది. అమ్మ కూడా అండ కోసం బాబుకి త్వరగా పెళ్ళి చేసేస్తేనే మంచిదనుకుంది. ఊళ్ళో తెలిసిన వాళ్ళ పిల్లనే చూసి పెళ్ళి చేశాం. మళ్ళీ నా మంచం అలంకరించబడింది. అలంకరించిన ఆ మంచాన్ని చూసి సిగ్గు పడుతున్న నన్ను అందరూ విడ్డూరంగా చూశారు. నేనెందుకు సిగ్గు పడుతున్నానో గ్రహించిన అమ్మ మాత్రం తమ్ముడిని గుర్తుకు తెచ్చుకుని ఏడ్చింది.

కోడలు వస్తే నా మంచం మీద విశ్రాంతి తీసుకుందామనుకున్నా కాని నాకు మంచమే లేకుండా పోయింది. బాగా దిగులు పడ్డాను. నన్ను నా నెమళ్ళ నుండి ఎవరో లాగి పడేసినట్లు, వాటిని నేను పోగొట్టుకున్నట్లు బాధ. ఎప్పుడూ నిశ్శబ్దంగా పనులు చేసుకునే నేను ‘నాకు ఎవరూ లేరు. నేనంటే ఎవరికీ పట్టదు’ అని అప్పుడప్పుడూ అరుస్తున్నాను కూడా. ఏమిటేమిటో పిచ్చి ఆలోచనలు నాలో. అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు నా గదిలోకి వెళ్ళి కాసేపు నెమళ్ళని చూస్తూ కూర్చుంటున్నాను. ఎవరూ లేకపోతే వాటితో ఏవేవో మాట్లాడుకుంటాను. అప్పుడు సంతోషంగా ఉంటోంది.

ఈమధ్య హార్మోన్స్ అసమతుల్యత వల్లనేమో మనిషిని కూడా లావు అయిపోతున్నాను. నిద్రలో ఏడుస్తున్న నన్ను అమ్మ అడిగింది “ఎందుకు ఏడుస్తున్నావమ్మా హేమా” అని. “మామయ్య గుర్తొస్తున్నాడమ్మా! ” అన్నాను. ‘నా మంచం నాకు కావాలమ్మా! ‘ అని అనాలనిపించినా అనలేకపోయాను.

ఆరోజు బాబు మధ్యాహ్నానికే ఇంటికొచ్చాడు. “అమ్మమ్మా! నన్ను గుంటూరు బ్రాంచికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ నెలాఖరుకి వెళ్ళాలి” అన్నాడు అమ్మతో. “మొగుడూ పెళ్ళాలు వేరుగా ఉండాలని ఈ పని చేసి ఉంటారు” అని అమ్మ నాతో అన్నది కాని నాకు మాత్రం చాలా సంతోషం కలిగింది.

నా కొడుకూ, కోడలూ వెళ్ళాల్సిన రోజు దగ్గర పడటంతో అమ్మ వాళ్ళకి కావలసిన సామాను సర్దే పనిలో పడింది. వాళ్ళు బయలుదేరే రోజు అయితే నాకు క్షణాలు యుగాల్లాగా గడిచాయి. “వెళ్ళొస్తాం అమ్మా!” అంటున్న నా కొడుకు మాటలు కూడా నాకు వినపడలేదు. నా మనస్సూ, తనువూ నా మంచం మీద విశ్రాంతి తీసుకోవాలని తహతహలాడుతున్నాయి. వాళ్ళని గుమ్మం దాకా సాగనంపి ఆత్రంగా గదిలోకి వెళ్ళి నెమళ్ళని ఆప్యాయంగా తడుముకున్నాను. వాటి మీదే చేయి వేసి అలాగే పడి నిద్రపోయాను. చాన్నాళ్ళ తర్వాత తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకున్న అనుభూతి కలిగింది.

వారం తర్వాత నా కొడుకు దగ్గర నుండి అమ్మ పేరు మీద ఉత్తరం వచ్చింది.

‘అమ్మమ్మా! –
నువ్వనుకున్నది నిజమే. నేను కావాలనే ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాను. మేము వేరుగా ఉండాలని కాదు. అమ్మ గదినీ, అమ్మ మంచాన్నీ అమ్మకు ఇవ్వాలని ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాను. అమ్మ ప్రశాంతంగా ఉండాలి అమ్మమ్మా! ఖర్చులు ఎక్కువైనా సర్దుకుందాం. సరేనా. దిగులుపడకుండా ఉండండి. నెలాఖరుకి వస్తాను. జాగ్రత్త’ – ప్రశాంత్.

ఉత్తరం చదివిన నేను కళ్ళనిండా నీళ్ళతో అమ్మని చూశాను. అమ్మ నన్ను వాటేసుకుని గద్గదస్వరంతో “అదృష్టవంతురాలివి తల్లీ! ” అంది. నేను మామయ్య ఫొటో వైపు చూశాను.

*** * ***