కడిమిచెట్టు

కల్లోలానికి ఆవల – అరవింద గారి ‘అవతలి గట్టు’

జనవరి 2014

సాహిత్యం కొన్ని ప్రశ్నలకి సమాధానం, ఇంకొన్ని ప్రశ్నలకి జన్మస్థానం. ఆ పుట్టినవాటికి జవాబులు ఆ పుస్తకంలోనే దొరకక పోవచ్చు, ఎక్కడ, ఎలాగ దొరుకుతాయో ఆ వెతుకులాటని మొదలుపెట్టించటమూ సాహిత్యపు ఒక సల్లక్షణం.

ఈ కథని రెండు విధాలుగా అర్థం, అపార్థం చేసుకోవచ్చు. ఒకటి స్త్రీవాదపరంగా, మరొకటి నైతికనిబంధనల పరంగా. ఈ రెండింటినీ కలిపినా సరిపోదు , అది మనిషితనం తోనే సాధ్యం. వ్యక్తి వ్యక్తికీ మారే స్వభావమూ అది మారటం కష్టమని తెలుసుకోవటమూ , అపరాధాలు జరగటమూ వాటిని అర్థం చేసుకోగలగటమూ ఇదంతా నేర్పుతుంది ఈ నవల. యుద్ధంలో సర్వతోభద్రవ్యూహం ఏదీ ఉండదు, కాని ఎడాపెడా తగలగల దెబ్బలని కళ్లు తెరిచి కాచుకోవటం ఒక మెలకువ. తగిలితే ఓర్చుకోవటం ఒక సత్తువ. అన్నిటినీ అవతల ఆపే కంచెకివతల విడిది చేయటం సాధన. ఇది ఎవరికి వారు చేసుకోవలసిన మేలు, ఈ పుస్తకం దానికి సహాయం చేస్తుంది.

ఈ నవలాకాలం అరవైల చివరలు, డెబ్భయిల మొదళ్లు. చదువుకుని ప్రేమించి ఇల్లాలయిన ఒక స్త్రీ, ఆమె భగ్నత, బండబారినతనం, దాని పర్యవసానం. ఈ పక్కనుంచి ఇంకొకరు,ఆమె దాటిన వైఫల్యాలు. వీరి చుట్టూరా యువతీయువకులు, వారి వలపులూ వాదనలు ,అప్పటి మధురమైన హిందీ పాటలు, చెదురుతున్న ఆదర్శాలూ, నక్సల్బరీ నీడలు …ఈ నాగరికవాతావరణాన్నంతా రికార్డ్ చేశారు రచయిత్రి. నాయికలలో ఒకరైన శారద తనకి తగిలిన అఘాతాన్ని మరచిపోదు, తప్పు చేసిన భర్తని క్షమించదు. ఇంకొక నాయిక లీల వివాహాన్ని పండితుడైన ఆమె తండ్రి అస్తవ్యస్తం చేస్తాడు. అతను సాధించలేని సెలిబసీ ని ఆమెకి ఆదర్శంగా నిలుపుతాడు. ఆమె నలుగుతుంది, నాశనమవదు. చివర అనదగిన ఒక స్థిమితంలో చాలామందికి కావలసినదవుతుంది.

స్త్రీ ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప విజ్ఞానం కుటుంబాన్ని నియంత్రించుకోగలగటం. అది సార్వత్రికం అయ్యీ కాని రోజుల అయోమయం ఒకవైపున ఈ కథలో. ఇంకొక విషయం స్త్రీపురుషుల మధ్య ఉన్న దేహధర్మపు తేడాలు. బ్రహ్మచర్యం, నిగ్రహం స్వతహాగా మగవాడికి ఎక్కువ కష్టం అని లోగొంతులో చెబుతారు రచయిత్రి. ఈ దేశం ఏకపత్నీవ్రతం ఒక ఘనత అయే స్థితిలోనే అనాదిగా ఉంది. తన చేతిలో లేని గర్భధారణవలన స్త్రీకి తన భర్తతో ఎడం లేకుండా ఉండగలిగే పరిస్థితి లేదు . వివాహేతర సంబంధాలు, అందుకోసం కేటాయించబడిన కొందరు స్త్రీలు…ఇవి గడిచిన కాలపు చీకటిమూలలు. స్త్రీ తన భర్తని తప్పు పట్టగలగటమూ అప్పుడు ఊహాతీతం. కథాకాలం నాటికి విద్యావంతులూ కొంత సంపన్నులూ అయినవారిలో కొత్త నీతిసూత్రాలు ప్రవేశించాయి. 1955 లో వచ్చిన హిందూ వివాహ చట్టం సంఘం లో స్థిరపడింది. ఇప్పుడు స్త్రీ భర్తని తప్పు పట్టగలదు, అతను తలవంచుకోవలసిందే. అయితే ఈ తప్పు ఎందుకు జరిగింది?

శారద మనసు ఇద్దరు పిల్లలు కలిగాక మరొక గర్భస్రావం జరగటంతో అలజడికి లోనవుతుంది. ‘ ఏమిటిదంతా? ‘ అనే వైరాగ్యం మొదలయి భర్తకి దైహికంగా దూరమవుతుంది. తాను వదిలేసిన చదువుని మళ్లీ మొదలుపెట్టి సంతృప్తిని వెతుక్కుంటుంది. సమాజానికి ఉపయోగపడాలని ప్రయత్నిస్తుంది . భర్త, పిల్లలు, సంసారం…ఇవి ఒక్కసారిగా చాలవనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడ పెద్దవారి కౌన్సిలింగ్ కాపాడి ఉండవచ్చు. కాని ఈ చదువుకున్న స్త్రీ , తన మేధోస్థాయి తన తల్లికంటె వేరయిన స్త్రీ కామన్ సెన్స్ ని మర్చిపోతుంది. యథాలాపంగా తల్లినుంచి పిల్లకి అందుతూ వస్తున్న జ్ఞానం ఈ అంతరువు ని దాటలేకపోతుంది అరవింద గారు ఇంకా కొన్ని రచనలలోనూ ఈ అస్తిత్వపు ఊగిసలాటని రాస్తారు.

ఆ సంక్షోభాన్ని భర్త, ప్రభు గుర్తు పట్టలేకపోతాడు. అతని పెంపకం లో అది లేదు, భర్త అనే మూసలోనూ ఉండదు, అతని స్వభావం , పరిణతి తెలుసుకునేటంతటివి కావు. . కాని అనిపిస్తుంది చదువుతుంటే, అతనికి తెలిసేలాగ శారద చెప్పిఉంటే బాగుండేదని. ఏ బంధం లో అయినా ఎక్కువ వివేకం ఉన్న భాగస్వామికే బాధ్యత ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఏమయినా ఆ మాత్రం దూరాన్ని తట్టుకోగలిగే శక్తి తమ అనుబంధానికి ఉందనే అనుకుంటుంది ఆమె. కా ని అతను దుర్బలుడు, భార్యకి చెల్లెలి వరస అయిన అమ్మాయితో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఆలోచించి పరిష్కారం వెతికే వ్యవధి ఇవ్వకుండా ఆ చెల్లెలు ఆత్మహత్య చేసుకోవటం శారదని శాశ్వతంగా పగలగొడుతుంది.

శారదకి తెలిసిపోయాక ప్రభు అంటాడు ‘’అప్పుడు నువ్వు తలనొప్పిగా ఉందన్నావు ” అని. ఆమె కంపించిపోతుంది ” ఆ మాట అనకు, రాణి అంటే నాకు ప్రేమ, తను లేకుండా బతకలేను అని చెప్పు ” అంటుంది. ఈ ఒక్క సన్నివేశం తో వారిద్దరి స్వభావాల మధ్య ఉన్న తేడా ని స్పష్టం చేస్తారు రచయిత్రి. ఇలా భిన్నమైన మానసిక, నైతిక పరిధు లలో ఉన్న మనుషుల మధ్య అనుబంధం బతికి బట్ట కట్టాలంటే ఆ స్థాయీభేదాన్ని త్వరగా గుర్తు పట్టటం అవసరం.
లీల కి వేదాంతం, నిగ్రహం బోధిస్తూ ఉంటాడు తండ్రి . అతి సాధారణుడైన ఆమె భర్త మరొక పెళ్లి చేసుకుంటాడు. ఇటువైపున రాకూడని వయసులో వచ్చిన గర్భం వల్ల తల్లి మరణిస్తుంది.అంత భయంకరమైన వైరుధ్యాన్ని మింగటానికి చేసిన ప్రయత్నం లో లీల ఎదుగుతూ వస్తుంది. ఒక బదిలీ తో శారద , ప్రభు ల ఇంటిలో ప్రవేశిస్తుంది. ఆమె పుస్తకాలలో శారద చూసినవి గీత, హెరాల్డ్ రాబిన్స్, అమృతం కురిసిన రాత్రి. విలక్షణమైన మేళవింపు.

తాను కాలేని దేన్నో శారద ఆమెలో గుర్తు పడుతుంది. లీల నిబ్బరించుకోగలదు, క్షమించగలదు, ప్రేమించటం మానేయకుండా ఉండగలదు

ఈ నవలలో శారదకి కాన్సర్ రావటం ఒకటే నాటకీయం అనిపిస్తుంది. అంతకాలం గడిచాక తన కాలం తీరిపోబోతుంటే, శారద భర్తని మన్నించి దగ్గరికి తీసుకుంటుంది.ఆమె మరణించాక ప్రభు విదేశం వెళ్లిపోతాడు, తన పిల్లలనీ, ఇంటినీ లీలకి అప్పజెప్పి.

లీల భర్త కి మరొక పెళ్లివల్ల కలిగిన పాపనీ తెచ్చుకుంటుంది , ఆ పాప తల్లీ పోయాక. తనపిల్లలు కాని ముగ్గురిని పెంచుతూ నిలిచిపోతుంది. అందులో ప్రత్యేకమయిన త్యాగాన్ని దేన్నీ రచయిత్రి స్ఫురింపజేయరు, అది ఆమెకి సహజం. ఆ ముగ్గురు పిల్లలూ ఆడుకుంటూ ఉండటాన్ని కిటికీ లోంచి లీల చూస్తూ ఉండటం తో నవల మొదలయి వెనక్కి వెళ్లివచ్చి తిరిగి అక్కడ ఆగుతుంది.

ఆ కాలాని కంటె ఎన్నో వెసులుబాటులున్న ఇప్పటి రోజులలోనూ స్త్రీపురుష సంబంధాలు చాలా సందర్భాలలో గందరగోళంగా ఎందుకు ఉంటున్నాయి? సహజీవనం కోసం ఎవరి వంతు ఎంత? స్త్రీకి కుటుంబానికి అవతలి జీవితం ఉండితీరాలా? నియమించుకోగలిగినవాటికి నిర్లక్ష్యపు స్వేఛ్చ ఇస్తే ? ప్రేమ కోసం ఏవో వదిలేసుకున్నాక , ఎంత వ్యాకులత లోనయినా ” ఇన్ని చేశాను ” అనుకోవచ్చునా? ఒకరికే కట్టుబడి ఉండటం సంక్లిష్టతలని తగ్గిస్తుందా? ఇన్ని ప్రశ్నలకీ ఇంకా చాలావాటికీ జవాబులు ఈ నవలలో, దానినుంచి చేసిన ప్రయాణం లో నాకు దొరికాయి . గడిచిన ముప్ఫయియేళ్లుగా వేర్వేరు స్థితులలో చదివాను, ప్రతిసారీ ఒక్కొక్క ఆవిష్కారం నావరకు.

[విజయవాడ ఎమెస్కో వారు మళ్లీ వేసిన నవల ఇప్పుడు దొరుకుతోంది.]