మన తెలుగు

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1

మార్చి 2014

తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే ఏవి భాషాపరమైన దోషాలో తెలిసి ఉండటం మంచిది.

హాస్యాన్ని చేర్చి వినోదాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని చమత్కార భరితమైన వాక్యాలను రాసాను. అవి కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ చిన్నబుచ్చటం కోసం కాదు. దయచేసి పాఠకులు సహృదయతతో అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. మరొక్క విషయం. ఒక ప్రయోగం భాషాసవ్యత దృష్ట్యా తప్పు అని చెప్పినంత మాత్రాన దాన్ని నేటి ఆధునిక యుగంలోని రచనా సందర్భంలో అసలే వాడకూడదని కాదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటువంటి ఎన్నో పదాలను ఉపయోగించటం పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే స్ట్రిక్టుగా (కచ్చితంగా) చూస్తే అది తప్పు అనే విషయం తెలిసి ఉండాలి.

ప్రాథమిక స్థాయి దోషాలను మొదట పరీక్షించి, అరుదుగా తటస్థించే తప్పులను తర్వాత పరిశీలిద్దాం.

అవసరం లేకపోయినా ఒక అక్షరాన్ని ఒత్తి పలకటం (అక్షరం అడుగు భాగాన ఒక చిన్న నిలువు గీత ఉన్నట్టు వ్యవహరించటం – దీన్ని జట అంటారు) లేక ఆ విధంగా రాయడం మనం సాధారణంగా గమనించే స్ఖాలిత్యం.

“వివిధ మతాల, జాతుల, వర్గాల మధ్య సమైఖ్యతను సాధించటం ఈనాడు మన దేశానికెంతో అవసరం” అనే వాక్యంలో సమైఖ్యత అన్న పదం తప్పు. సమైక్యత అనేది సరైన పదం. సమ + ఐక్యత = సమైక్యత (వృద్ధి సంధి). అదే విధంగా ‘మల్లిఖార్జున స్వామి దేవాలయం’ అని రాసివున్న బోర్డులు కనపడతాయి మనకు అక్కడక్కడ. మల్లికార్జునుడు అనేదే సరైన పదం. మల్లిక + అర్జునుడు = మల్లికార్జునుడు (సవర్ణ దీర్ఘ సంధి). “నేను ప్రయోగించే భాష చాలా ఖచ్చితంగా ఉంటుంది సుమండీ” అన్నాడట ఓ పండితుడు. నిజానికి కచ్చితం అనే మాటకు బదులు ఖచ్చితం అని రాయటం వలన తన భాషలో కచ్చితత్వం లోపించిందన్న విషయాన్ని ఎరుగడాయన! ఏదైనా ఒక రంగంలో గొప్పవాడైన వ్యక్తిని సూచించటానికి ఉద్దండుడు అనే పదం ఉంది. కాని ఉద్ధండుడు అని రాస్తారు లేక పలుకుతారు కొంత మంది. గొప్పవాణ్ని సూచిస్తున్నాం కనుక ఒత్తు లేకుండా రాస్తే చప్పగా (సాదాగా) ఉండి అపచారం జరిగిపోతుందని భయం కాబోలు! ఉద్దండము అంటే పొడవైనది లేక ఎక్కువైనది అని అర్థం.

విష్ణువుకు ఉన్న అనేక నామాలలో (పేర్లలో) జనార్దనుడు అనేది ఒకటి. కాని జనార్ధనుడు అని తప్పుగా రాసేవాళ్లు లేకపోలేదు. అదే విధంగా మధుసూదనుడుకు బదులు మధుసూధనుడు అని కొందరు రాయటం, పలకటం అరుదైన విషయమేం కాదు. సూదనము అంటే చంపుట. మధు అనే రాక్షసుణ్ని చంపినవాడు కనుక మధుసూదనుడు అయినాడు శ్రీహరి.

“గులాబీ పువ్వులు గుభాళించినట్టు” అని వచన కవితలో ఒక కవి రాసుకోవచ్చు గాక, అంత మాత్రాన గుభాళించు అనే పద ప్రయోగం తప్పు కాకుండా పోతుందా? గుబాళించుట అంటే వాసన కొట్టుట.

“నావి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావండీ. ఇవి ఆనంద భాష్పాలు” అన్నదట ఒక యిల్లాలు తన భర్తతో. ఆ భర్త ఒకవేళ తెలుగు భాషను అమితంగా ప్రేమించే వాడైతే ఆ పద ప్రయోగాన్ని విని ఎంతగా విచారపడి దుఃఖ బాష్పాలను రాలుస్తాడో కదా! బాష్పాలు అనేదే సరైన పదం. అట్లా దుఃఖం ముంచుకొచ్చినప్పుడు మనను మనం ‘సంభాళించుకోవాలి’ అనకండి. ఎందుకంటే సంబాళించుకొనుట అన్నదే సరైన పదం.

“ఫలానా శ్రీమంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వజ్ర వైఢూర్యాలను కానుకలుగా సమర్పించుకున్నాడు” అని అచ్చులో చదివి అది దోషరహితమైన వాక్యం అనుకోకండి పాఠకులారా! ఎందుకంటే వైఢూర్యము అనటం తప్పు. వైడూర్యము అనేదే సరైన పదం. పురాణంలో శంబూకుడు అనే ఒకాయన తటస్థిస్తాడు మనకు. శంబూకము అంటే ముత్యపు చిప్ప లేక ఆల్చిప్ప. అయితే శంభూకుడు అని ఎవరైనా వాడితే ఆ పదం తప్పు అని గ్రహించాలి.

“నీ కోసం నా ప్రాణాలను ఫణంగా పెడతాను” అని ఎవరైనా అన్నారనుకోండి. చస్తే నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఫణం వల్లనే చచ్చిపోతాము మనం! ఫణము అంటే పాము పడగ. పణము = పందెము కనుక ఇదే రైటు. ‘మాంసాహార & శాఖాహార హోటల్’ అనే బోర్డులు మనకు కనిపించటం సర్వసాధారణమైన విషయం. శాఖ అంటే చెట్టు కొమ్మ కనుక, కొమ్మలతో వండిన కూరను తెచ్చిపెడతారేమోనని భయం కలుగవచ్చు తెలుగు భాషా పండితులకు! శాఖాహారము అనేది తప్పు. శాకాహారము అనాలి. శాకము = కూర (ఆంగ్లంలో కరీ).

‘రాయబారము’కు బదులు ‘రాయభారము’ అని తప్పుగా ప్రయోగం చేస్తారు కొందరు. అట్టివారికి సవ్యముగా ‘రాయ’ భారమా?! కొన్ని కుటుంబాల వాళ్లు ‘భ’ గుణింతం ఎక్కువగా వాడుతారు రోజువారీ భాషలో. “భావగారూ, భావి దగ్గర స్నానం చేసి ధోవతి కట్టుకోండి” అంటారు. ఈ వాక్యంలో మూడు భాషాదోషాలు దొర్లినయ్. బావ, బావి, దోవతి అనేవే సరైన పదాలు. భావి అంటే భవిష్యత్తు అనే మరో అర్థం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. భ్రాహ్మ(ణు)లు అనే పదాన్ని వాడటం కూడా తప్పే. బ్రాహ్మణులు అనేదే రైటు. అదే విధంగా భీభత్సము, భీబత్సము, బీబత్సము – ఈ మూడు పదాలూ తప్పుతో కూడుకున్నవే. బీభత్సము అన్న పదమే సరైనది. “ఆర్థిక స్థోమత లేని బీదవాడు పాపం” అనే వాక్యంలో భాషాదోషం ఉంది. ఎందుకంటే స్థోమత అనే పదం తప్పు. స్తోమత అన్నది సరైన పదం. “ఎందుకలా అదేపనిగా కదుల్తావ్? స్థిమితంగా కూర్చోలేవూ?” అంటూ చిన్న పిల్లవాణ్ని పెద్దాయనెవరైనా మందలిస్తే, స్తిమితం అనే పదాన్ని స్థిమితంగా మార్చి ‘దోషం’ ఆ పెద్దాయనదే అనిపిస్తుంది కదా!

స్తంభము అనే పదాన్ని స్థంభము అని రాస్తారు కొంత మంది. స్తంభము అనేదే రైటు. స్థంభము తప్పు. ‘స్తంభించుట’ స్తంభము నుండి వచ్చిందే. ఇంకొక భాషాదోషాన్ని ప్రస్తావిస్తాను. అదేమిటంటే ప్రస్థావన అనే తప్పు పదాన్ని వాడటం. ప్రస్తావించుట అంటే చెప్పుట. ప్రస్తావము అన్నా కూడా ప్రస్తావన అనే అర్థం. ప్రస్థావన తప్పు. “ఆస్థీ, అంతస్థూ చూసుకోకుండా ఏ సంబంధాన్నీ చేసుకోవద్దు” అన్నామనుకోండి. అప్పుడు మనం సరిగ్గా చూసుకోకుండా రెండు భాషాదోషాలను దొర్లించిన వాళ్లమవుతాము. ఆస్తి, అంతస్తు అనేవే సరైన పదాలు. అదేవిధంగా అస్థిత్వము అన్న పదాన్ని వాడినామనుకోండి. అప్పుడు మనం పప్పులో కాలు వేసినట్టటే. ఎందుకంటే అస్తిత్వము అన్నదే సరైన పదం. అస్థిత్వము తప్పు.

మీరు రాంచి వెళ్లారట కదా. అక్కడి స్థూపాల్ని చూసారా? అని అడిగామనుకోండి. అప్పుడు కూడా రెండు తప్పులు చేసినవాళ్లం అవుతాము. ఒకటి భాషాపరమైనది, మరొకటి సామాన్య విజ్ఞానం (General Knowledge) కు సంబంధించినది. స్తూపము అనేదే సరైన పదం కావటం భాషకు సంబంధించినదైతే, రాంచిలో కాక సాంచిలో స్తూపం ఉండటం G.K. కు సంబంధించినది! కొందరు స్తనాలు అనటానికి బదులు స్థనాలు అంటారు. అది కూడా తప్పే. దీనికి విరుద్ధంగా ‘థ’ వత్తుకు బదులు ‘త’ వత్తు రాస్తారు కొంత మంది. ఉదా: అస్తిక, నేరస్తులు, గ్రామస్తులు. అలా రాయటం తప్పు. అస్థిక, నేరస్థులు, గ్రామస్థులు అని రాయాలి. అయితే రోగగ్రస్థులు అని రాయకూడదు. రోగగ్రస్తులు అనే రాయాలి. ఎందుకంటే గ్రస్తము అనే పదానికి తినబడినది లేక మింగబడినది అని అర్థం.

‘ట’ వత్తుకు బదులు ‘ఠ’ వత్తును రాయటం మరొక రకమైన భాషా స్ఖాలిత్యం. తెలుగు భాష ఎంతో విశిష్ఠమైనది అంటూ పొగిడామా తుస్సుమన్నట్టే! ఎందుకంటే విశిష్ఠము అనేది తప్పు పదం. విశిష్టము అని రాయాలి. అదే విధంగా ఉత్కృష్ఠము తప్పు. ఉత్కృష్టము సరైన పదం. ముష్ఠి , పుష్ఠి అని రాస్తారు చాలా మంది. కాని అవి తప్పులు. ముష్టి , పుష్టి అనేవి సరైన పదాలు. “చిత్రగుప్తుని చిఠ్ఠాలో మన పాపాలన్నీ రాయబడి ఉంటాయి” అని చదువుతాం మనం. అలాగే “ఏంటా వెకిలి చేష్ఠలూ” అంటూ చివాట్లు పెట్టడం కూడా వింటుంటాం. ఇక్కడ చిఠ్ఠాకు బదులు చిట్టా, చేష్ఠకు బదులు చేష్ట సరైన పదాలు అని తెలుసుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నవాణ్ని కోపధారి అనటం వింటుంటాం. కాని అది తప్పు. కోపిష్ఠి అనాలి (కోపిష్టి కాదు). అదేవిధంగా పాపిష్టి , పాపిష్ఠిలలో రెండవది రైటు. నిజానికి పాపిష్ఠి అని కాక పాపిష్ఠుడు అనాలట. కిరీటధారి, మకుటధారి, గిరిధారి, వస్త్రధారి అనవచ్చు కాని కోపధారి అనకూడదు.

తనకు అరవై సంవత్సరాల వయస్సు విండిన సందర్భంగా ఒకాయన అట్టహాసంగా ఉత్సవం జరుపుకోవాలనుకున్నాడు. ఆహ్వాన పత్రికల్లో షష్ఠిపూర్తి ఉత్సవం అని అచ్చయింది. అయితే మరి అతనికి ఆరేళ్ల వయసే ఉన్నట్టు భావించాలా? ఎందుకంటే ఆరవ తిథి (పంచమి తర్వాత వచ్చేది) షష్ఠి . అరవై సంవత్సరాల ఉత్సవాన్ని షష్టిపూర్తి లేక షష్ట్యబ్ద పూర్తి అనాలి. ఇలా కేవలం ఒక వత్తు వచ్చి చేరినందుకే అర్థం పూర్తిగా మారే ప్రమాదాలు తెలుగు భాషలో మరి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ప్రదానం, ప్రధానం. ప్రదాన సభ అంటే ఇచ్చివేసే సభ కాగా (బహుమతి ప్రదానం), ప్రధాన సభ అంటే ముఖ్యమైన సభ అవుతుంది. అదేవిధంగా అర్థము = భావము, అర్ధము = సగము. అర్థ సౌందర్యం అంటే Beauty of meaning. అర్ధ సౌందర్యం అంటే Half beauty. ఇక ధార అంటే వరుస, దార అంటే భార్య. ‘బాలరసాల సాల……’ అనే పద్యంలో పోతన ‘నిజదార సుతోద్ధర పోషణార్థమై’ అన్నాడు. పంచదార అంటే ద్రౌపది (ఐదుగురికి భార్య అయినది) కూడా అవుతుంది.