మన తెలుగు

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 3

మే 2014


కొన్నిసార్లు సవర్ణ దీర్ఘ సంధికి బదులు గుణసంధి అయిన పదాలను తప్పుగా వాడటం జరుగుతుంది.
ఉదా: భానోదయము. ఇది తప్పు. భాను + ఉదయము = భానూదయము అవుతుంది. అదేవిధంగా గురు + ఉత్తముడు = గురూత్తముడు (గురోత్తముడు కాదు). కాని చాముండీశ్వరి తప్పు. చాముండేశ్వరి అనేదే సరైన పదం. పార్వతికి ఉన్న పేర్లలో చాముండ ఒకటి (చాముండి కాదు). కనుక చాముండ + ఈశ్వరి = చాముండేశ్వరి అవుతుంది. ఇది గుణసంధి. శనిదేవుణ్ని శనీశ్వరుడు అనటం సరి కాదు. శనైశ్చరుడు అనటమే సరైనది. వ్యాకరణపరంగా శని + ఈశ్వరుడు = శనీశ్వరుడు (సవర్ణదీర్ఘ సంధి) సరైనదే. కాని శనైశ్చరుడు అన్న పదాన్నే సరైనదిగా ఒప్పుకుంటారు. నిమిషమును రకరకాలుగా రాస్తారు, రాయొచ్చు కూడా. నిమిషము అనే కాక, నిమేషము అనీ, నిముసము అనీ రాయవచ్చు. మూడు పదాలూ సరైనవే. కాని నిముషము మాత్రం తప్పు. అయినా కొంత మంది అలా రాయటం మనం గమనించవచ్చు.

“ఫలానా ప్రాంతం వారు ఫలానా ప్రాంతం వారి పట్ల వివక్షతను చూపుతున్నారు” అనీ, లేక “ప్రభుత్వం ఫలానా కులాల పట్ల వివక్షత చూపిస్తున్నది” అనీ చాలా సార్లు చదువుతుంటాం మనం. ఒక్కోసారి ఈ పదం కొందరు కవుల కవితల్లో, లేక కొన్ని వ్యాసాల్లో కూడా దర్శనమివ్వటం అరుదైన విషయమేం కాదు. కాని వివక్షత తప్పు. వివక్ష అనేదే రైటు. అదేవిధంగా పరశత్వం, పరవశతలకు బదులు పారవశ్యత అన్న పదాన్ని వాడుతుంటారు కొందరు. అది కూడా తప్పే. సంగీతంలోని సప్తస్వరాలు (స,రి,గ,మ,ప,ద,ని) లో మొదటిదైన ‘స’ ను షడ్జము అనాలి. కాని కొందరు షడ్జమము అని రాస్తారు. షడ్జము అనేదే సరైన పదం. ఒక ఉద్యోగి సెలవు చీటీ రాసి బాసుకు సమర్పించాడు. అందులో సెలవు కోరటానికి కారణం ‘తన మరదలూ షడ్రకుడూ వేరే ఊరునుండి వస్తుండటమే’ అని రాసాడట. తోడల్లుణ్ని షడ్రకుడు అంటూ తప్పుగా రాసేవాళ్లు/పలికే వాళ్లు తక్కువ మందేం ఉండరు. అయితే దానికి సరైన పదమేది? అనే ప్రశ్నకు జవాబు షడ్ఢకుడు, లేక సడ్డకుడు అని గ్రహించాలి.

“ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది” అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం మనం. అదేవిధంగా ప్రాముఖ్యత అని కూడా తప్పుగా రాస్తారు. ఈ పదాలకు ప్రధానము, ప్రముఖము అన్నవి మూలపదాలు. వీటికి మొదట్లో ఒకటి, చివరలో ఒకటి ప్రత్యయాలను చేర్చగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనే పదాలు ఏర్పడుతాయి. కాని అలా ఒకే మూలపదానికి రెండు ప్రత్యయాలను చేర్చటం అనమంజసం కనుక, ఒకే ప్రత్యయాన్ని (మొదట్లో కాని, చివరన కాని) చేర్చటమే సవ్యంగా ఉంటుంది. అందుకని ప్రధానత లేక ప్రాధాన్యము, ప్రముఖత లేక ప్రాముఖ్యము అనేవే సరైన పదాలు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల క్రితం ఆచార్య చేకూరి రామారావు గారు తన ‘చేరాతలు’లో సూచించిన తర్వాత నుండే పత్రికల్లో ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనే పదాలు దర్శనమివ్వటం చాలా వరకు తగ్గిపోయింది. అదేవిధంగా ‘తో సహా’ అనేది పూర్వం అచ్చులో అత్యంత తరచుగా కనిపించేది. కాని బాగా తరచి చూస్తే ‘తో’ అంటేనే సహా అనే అర్థం వస్తుంది కదా. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకదాన్నే వాడాలి. ఉదా: ‘పిల్లలతో సహా సినిమాకు వెళ్లాడు’ అనకుండా ‘పిల్లలతో వెళ్లాడు’ అనికాని, ‘పిల్లలు సహా వెళ్లాడు’ అని కాని రాయటం సమంజసంగా, సవ్యంగా ఉంటుంది.

“మా వాడికి లెక్కల్లో వందకు తొంభై శాతం మార్కులు వచ్చాయి” అంటూ గొప్పలు చెప్పుకున్నాడట ఓ తండ్రి గారు. కాని ఈ వాక్యంలో భాషాదోషం ఉంది. అదేవిధంగా “పోలింగులో వందకు అరవై ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి” అని రాస్తారు/చెబుతారు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, శాతము అంటేనే వందకు అని అర్థం. మళ్లీ వందకు అని రాయాల్సిన అవసరమేముంది? తొంభై ఐదు శాతం మార్కులు, అరవై ఆరు శాతం వోట్లు (ఓట్లు-Oats- కావు) అనటమే సరైనది కదా. లేక వందకు తొంభై ఐదు, వందకు అరవై ఆరు అనాలి. దాదాపు అనే పదాన్ని వాక్యంలో సరైన స్థానంలో ఉంచకపోవటం కూడా మనం తరచుగా గమనించే అపసవ్యతే. “దాదాపు నేను ఆరు నెలల పాటు వ్యాధితో బాధ పడ్డాను” అనే వాక్యంలో అసంబద్ధత ఉంది. “నేను దాదాపు ఆరు నెలల పాటు వ్యాధితో బాధ పడ్డాను” అన్న వాక్యంలో పదాలు సరైన స్థానాల్లో ఉన్నాయి. ఈ వాక్యాన్ని ఇలా కూడా తిరగ రాయొచ్చు. “దాదాపు ఆరు నెలల పాటు నేను వ్యాధితో బాధ పడ్డాను.” రెండు వాక్యాలూ భాషాపరంగా, వ్యాకరణపరంగా సరైనవే. “దాదాపు ఆరు నెలల పాటు వ్యాధితో బాధ పడ్డాను నేను” అన్నది మరింత వైవిధ్యం ఉన్న వాక్యం అవుతుంది.

“మా నాన్నగారు తెలుగు పండితుడుగా పని చేసి రిటైరయ్యాడు.” “ఫలానా స్కూల్లో తెలుగు పండితుని పోస్టు ఖాళీగా ఉంది.” ఇలాంటి వాక్యాల్లో కూడా మనం అపసవ్యతను గమనించవచ్చు. “ఫలానా దేశంలోని ఫలానా నగరంలో రెండు వందల తెలుగు కుటుంబాలున్నాయి” అన్నట్టుగానే ఉన్నాయి పైన పేర్కొన్న వాక్యాలు. తెలుగు పండితుడు అంటే తెలుగువాడైన పండితుడు అనే అర్థం కూడా స్ఫురించే అవకాశం ఉంది కనుక, ఏ రకమైన గందరగోళం లేకుండా ఉండాలంటే తెలుగు భాషా పండితుడు అని రాయటం ఉత్తమం. దాన్నే సవ్యమైనదిగా ఒప్పుకుంటారు భాషజ్ఞులు. కవిత్వంలో కొత్తకొత్త ప్రయోగాలు చేసే ఒకాయన పట్ల నిరసనను తెలియచేసారట కొందరు పండితులు. దానికి ఆయన “ఈ శుద్ధ వాదులను నేను ఖాతరు చెయ్యను” అంటూ సమాధానమిచ్చాడట. ఇక్కడ శుద్ధ వాదులు అనే మాట సరైనది కాదు. శుద్ధతా వాదులు అనేదే సవ్యమైన పద ప్రయోగం.

కొన్ని పదాలు తెలుగు భాషలోకి ఎలా వచ్చి చేరుతాయో అర్థం కాదు. నిజమైన భాషావేత్తలు కాక మామూలు రచయితలు, మీడియా వాళ్లు వాటిని వ్యవపారిక భాషలో చొప్పిస్తారు బహుశా. ఉదా: ప్రాయోజకులు, ప్రాసంగికత వంటి పదాలు. ప్రయోజనము నుండి ప్రాయోజకులు వచ్చిఉంటే, అది ఒకటికన్న ఎక్కువ అంచెలలో మార్పులు (అవి కూడా అసంబద్ధమైనవి) చేసిన మాయాజాలపు ఫలితమే. ప్రాయోజకులు అంటే ప్రయోజకులు అనుకోవాలా? తెలియదు. నిజానికి ఈ పదాన్ని Sponsors అనే అర్థంలో వాడుతున్నారు. అప్పుడు మరి ప్రయోజకులు అనేది కూడా ఉద్దేశించిన అర్థాన్ని కచ్చితంగా ఇవ్వదు. ప్రాసంగికత కూడా ఇటువంటి పదమే. ప్రసంగ యోగ్యత అన్నదే సవ్యమైన పదం అనిపిస్తుంది.

మోసం చేసాడన్న ఆరోపణకు సమాధానంగా ఒకాయన కోపంతో ఊగిపోతూ “నేనంటే, మా వంశమంటే ఏమిటనుకున్నారూ? అలా మోసం చేయడం మా వంశ సాంప్రదాయంలోనే లేదు” అన్నాడట. ఇక్కడ సాంప్రదాయం అనే పదం తప్పు. సంప్రదాయం అనేదే రైటు. సినిమా హాల్లో టైటిళ్లు పడేటప్పుడు సాంకేతిక సహాయం అని కనపడుతుంది మనకు. కాని ‘సాంకేతిక’ తప్పు. సంకేతిక అనేదే రైటు. “మన దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గత రెండు సంవత్సరాలుగా బాగా పెరిగిపోయింది” అన్న వార్తను చదువుతాం మనం. కాని తెలుగు భాషలో పర్యాటన అనే పదమే లేదు కనుక, పర్యాటకులు తప్పు. పర్యటన అన్న పదమే ఉంది కాబట్టి పర్యటకులు అనేదే సరైన పదం.

ఇక వైరి సమాసాలను ఉపయోగించకుండా ఉండాలంటే పదాల మూలాలు సరిగ్గా తెలిసి ఉండాలి. ముఖ్యంగా కవిత్వం రాసేవాళ్లకు ఏవి వైరి సమాసాలో తెలియటం చాలా అవసరం. వ్యాకరణ పరమైన సవ్యత కోసమే కాక, వైరి సమాసాలను పలుకుతుంటేనే వాటిలో ధ్వనించే ఎబ్బెట్టుతనాన్ని నివారించటం కోసం ఈ వైరి సమాసాలను (లేక దుష్ట సమాసాలను) మానుకోవాలనిపిస్తుంది. భావాందం అన్న పదంతో పోల్చిచూస్తే భావ సౌందర్యం అన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుందని ఎవరైనా ఒప్పుకుంటారనుకుంటాను. ఒక సంస్కృత పదాన్ని ఒక అచ్చతెలుగు పదంతో కలుపుతూ వైరి సమాసాన్ని ఏర్పరచినప్పుడు, చాలా సార్లు అది కొత్త కోటు మీదికి జతగా పైజామా (Pajama) ను వేసుకున్నట్టుంటుంది. అయితే ఈ ఆధునిక కాలంలో వచన కవిత్వంలో వైరి సమాసాలు విరివిగా దర్శనమిస్తున్నా సమీక్షకులు, విమర్శకులు వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆ మాటకొస్తే ఛందోబద్ధమైన పద్యాల్లో సైతం వైరి సమాసాలుండటాన్ని నిరసించని విమర్శకులు ఎందరో ఉన్నారు. ఒక సమాసం వైరి సమాసమా కాదా అనే విషయం తెలియాలంటే అందులోని పదాలలో ఏది సంస్కృత (సమ) శబ్దమో, ఏది అచ్చతెలుగు పదమో కచ్చితంగా తెలియాలి. రెండు సంస్కృత (సమ) శబ్దాల మధ్య, లేక రెండు అచ్చ తెలుగు పదాల మధ్య కుదిరే సమాసం సవ్యమైనది. అలా కాక ఒకటి సంస్కృత సమం, మరొకటి అచ్చ తెలుగుది అయితే వైరి సమాసం వస్తుంది. వైరి సమాసాలు భాషాపరమైన దోషాలే. ఉదా: పాలాభిషేకము. “మహా శివరాత్రి సందర్భంగా వేములవాడలో, శ్రీకాళహస్తిలో శివలింగాలకు పాలాభిషేకం చేసారు” అని టీ.వీ. వార్తల్లో కూడా విన్నాం. అయితే ఈ సమాసంలో పాలు అచ్చతెలుగు పదం కాగా, అభిషేకము సంస్కృత సమం. కనుక, ఇది వైరి సమాసం. దీన్ని సరిదిద్దాలంటే క్షీరాభిషేకము అని మార్చాలి. ఎందుకంటే క్షీరము కూడా సంస్కృత సమ శబ్దం. లేదా పాలతో స్నానం చేయించారు అనవచ్చు. అదేవిధంగా భూతగాదా అన్నప్పుడు భూమి సంస్కృతం, తగాదా హిందుస్తానీ భాషనుండి వచ్చిన తెలుగు పదం (అన్యదేశ్యం). ఇక్కడ సరైన సమాసం ‘భూవివాదం’. ‘రసవత్తర పోరు’లో పోరు అచ్చతెలుగు కనుక రసవత్తరమైన పోరు, లేక రసవత్తర సంగ్రామం అనేవి సవ్యమైన ప్రయోగాలు. ఉగ్రనేల అన్నది మరో వైరి సమాసం. ఇక్కడ ఉగ్రమైన నేల, లేక ఉగ్రత గల నేల అనవచ్చు. లేదా ఉగ్రభూమి అనవచ్చు (భూమి సంస్కృత పదం). ఇలాంటి వైరి సమాసాలు ఆధునిక వచన కవిత్వంలో అసంఖ్యాకంగా చోటు చేసుకుంటున్నాయి. భాష బాగా తెలియని కవులకు తాము వాడుతున్నది వైరి సమాసం అన్న విషయమే తెలియదు. భాష బాగా తెలిసినవాళ్లు వైరి సమాసాలను ఇట్టే గుర్తు పట్టగలరు. వైరి సమాసాలను ప్రయోగించకుండా ఉండాలంటే ఆ దిశగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అయితే ‘గర్భగుడి’ అనే వైరిసమాసం భాషాసవ్యత పరంగా తప్పు సమాసమే ఐనా వినడానికి అది ఎంతో శ్రవణసుభగంగా, హాయిగా ఉంటుంది. ‘గర్భ దేవాలయం’ అన్న పదం భాషాసవ్యత పరంగా ఒప్పే అయినా అది వినటానికి ఇంపుగా ఉండదు.

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – మొదటి భాగం
భాషాసవ్యతకు బాటలు వేద్దాం – రెండవ భాగం